రైతు భరోసా కోసం తనిఖీలు | Cabinet sub committee to discuss acreage cap eligibility criteria for rythu bharosa | Sakshi
Sakshi News home page

రైతు భరోసా కోసం తనిఖీలు

Published Sat, Jan 4 2025 1:30 AM | Last Updated on Sat, Jan 4 2025 4:42 AM

Cabinet sub committee to discuss acreage cap eligibility criteria for rythu bharosa

రెవెన్యూ, వ్యవసాయ శాఖలు కలసి క్షేత్రస్థాయిలో చేపట్టాలి

ఏఈవోలు, ఎంఏవోలు, పంచాయతీ కార్యదర్శులు, వీఎల్‌వోలు కలిసి ఈ తనిఖీలు పూర్తి చేయాలి

సాగులో ఉన్న భూమికి మాత్రమే భరోసా.. రైతులు డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే!

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు పంట పెట్టుబడి సాయం ‘రైతు భరోసా’(Rythu Bharosa) అందించే విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఈ పథకం అమలుపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వ్యవసాయేతర భూములకు పెట్టుబడి సాయం అందించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని.. ఈ విషయంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖలు కలసి క్షేత్రస్థాయిలో సంయుక్త తనిఖీలను చేపట్టాలని సిఫారసు చేసింది. గురువారం జరిగిన కేబినెట్‌ సబ్‌ కమిటీ(Cabinet sub committee) సమావేశంలో ఈ మేరకు ఆరు సిఫారసులను ఆమోదించింది. 

‘రైతు భరోసా’పై సబ్‌ కమిటీ చేసిన సిఫారసులివే.. 
పంటలు పండించే భూములకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలి. తోటలు పెంచే భూములకు వానాకాలం లేదా యాసంగిలో ఒక్క సీజన్‌లో మాత్రమే సాయం ఇవ్వాలి. ఏ భూమికి కూడా ఏడాదికి రెండుసార్లకు మించి సాయం అందించకూడదు. 

⇒ ప్రతి సీజన్‌కు ముందు రైతులు సాగు ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ పోర్టల్‌ లేదా మొబైల్‌ యాప్‌ లేదా ప్రజాపాలన కేంద్రాల్లో రైతులు ఇచ్చే ఈ ధ్రువీకరణలను శాటిలైట్, క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా నిర్ధారించాలి. 

⇒ ఈ ఏడాది యాసంగి సీజన్‌లో పంటల సాగును శాటిలైట్‌ చిత్రాల ద్వారా నిక్షిప్తం చేయాలి. 

⇒ రాష్ట్రంలో పంటల సాగు పరిస్థితిని తెలుసుకోవడంతోపాటు డిజిటల్‌ రికార్డులను అప్‌డేట్‌ చేసేందుకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులు, మండల వ్యవసాయాధికారులు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు, పలు శాఖలకు చెందిన గ్రామస్థాయి అధికారులతో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలి.  

⇒ సాగు యోగ్యం కాని భూములను గుర్తించాలి. కొండలు, రోడ్లు, రాళ్లు ఉండే భూములు, భౌగోళికంగా సాగుకు అనర్హమైన భూములను గుర్తించాలి. ఆర్‌వోఆర్‌ డేటాలో వ్యవసాయ భూములుగా ఉండి నివాస, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భూములను వేరు చేయాలి.  

⇒ రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి భౌగోళికంగా వ్యవసాయానికి పనికిరాని భూములను, వ్యవసాయేతర అవసరాలకు జరిగిన మార్పిడిని గుర్తించాలి. ఈ భూములకు రైతు భరోసా వర్తింపజేయకూడదు. 

⇒  మాజీ, తాజా ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబాలకు, ఐటీ చెల్లింపుదారులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఈ పథకం వర్తింపచేయకూడదు. వీరిని గుర్తించేందుకు ఆహార భద్రత కార్డులు, 2024లో నిర్వహించిన కులగణనను ప్రాతిపదికగా తీసుకోవాలి. అయితే ఈ మినహాయింపును రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు వర్తింపచేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement