
సైదాపూర్ (హుజూరాబాద్): యూరియా తదితర ఎరువుల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు రైతులు ఉదయమే చేరుకున్నారు. ప్రస్తుతం యాసంగి నేపథ్యంలో ఉదయం 7 నుంచి 8 గంటల సమయంలో ఎరువులు తీసుకెళ్తుంటారు. కానీ ఆ సమయంలో గేటు తీయకపోవడంతో.. గోడపై నుంచి లోపలికి దూకి చెప్పులను క్యూలో పెట్టారు. గోడపై ఉదయం 10 గంటల వరకు కూర్చుని నిరీక్షించారు. అధికారులు ఎరువుల కొరత తీర్చాలని అన్నదాతలు కోరుతున్నారు.
పంటలు తడారి.. పొలాలు ఎడారి
రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయి. వరినాట్లు వేసిన రైతులు పంట పొలాలకు నీరు సరిపోకపోవడంతో ఎండుతున్న పొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పంట పొలాల్లో గొర్రెలను మేపుతున్నారు.

మండల కేంద్రానికి చెందిన కాకల్ల ఎల్లయ్య, గొల్లపల్లి శ్రీనులు తమకున్న భూమిలో ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు వరి సాగు చేశారు. వర్షాలు సరిగ్గా లేకపోవడం.. వారం రోజులుగా ఎండలు తీవ్రం కావడంతో భూగర్భ జలాలు అడుగంటి పొలాలకు నీరు అందడం లేదు. దీంతో ఎండిపోయిన వరి పొలంలో మూగజీవాలను తోలి మేపుతున్నారు.
వర్ణాల పొద్దు
ఉదయాస్తమయాలు ఎప్పుడూ మనోహరమే. ప్రకృతి ప్రేమికులకు పరవశమే. పగలంతా వెలుగులు నింపే భానుడు.. సాయం సంధ్య వేళ కాషాయరంగులో నిష్క్రమించడం అద్భుతమే. పెద్దపల్లి శివారులో సూర్యాస్తమయమిది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

స్కానర్ కొట్టు.. కల్లు పట్టు
మారుతున్న కాలానికి అనుగుణంగా మారితేనే మనుగడ సాధ్యం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లికి చెందిన గీత కార్మికుడు గంగపురపు వెంకన్న ఇందుకు నిదర్శనం. వెంకన్న వద్దకు కల్లు తాగడానికి వచ్చే వారిలో ఎక్కువ మందికి స్మార్ట్ ఫోన్ ఉంది. వెంకన్న వద్ద స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో చెల్లింపులకు ఇబ్బంది ఏర్పడి.. గిరాకీ దెబ్బ తింది. దీంతో చేసేదిలేక వెంకన్న ఇటీవల తన బ్యాంక్ ఖాతాపై క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు కల్లు ప్రియులంతా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి.. డబ్బు చెల్లించి కల్లు తాగుతున్నారు.
– కేసముద్రం

యక్షగాన కళాకారుల భిక్షాటన
టీవీలు, స్మార్ట్ ఫోన్ల రాకతో వీధి నాటకాలు అంతరించి పోయాయి. నేటి తరానికి యక్షగానం అంటే తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆదరణ లేక యక్షగాన కళాకారులు.. బతుకు కోసం భువనగిరిలో భిక్షాటన చేస్తూ కనిపించారు.
– భువనగిరి టౌన్
చదవండి: ఆ రోజు ఇల్లు కదలరు.. ముద్ద ముట్టరు

గుమ్మి.. జ్ఞాపకాలు విరజిమ్మి
గ్యాస్ పొయ్యిలు వచ్చాక కట్టెల పొయ్యిల్ని మరిచిపోయారు. కానీ ఒకప్పుడు కట్టెల పొయ్యి వెలిగించి వంట చేయాలంటే.. కంకిబెండ్లు, పిడకలు, కట్టెలు.. సేకరించి.. ఇలా గుమ్మిలో దాచుకోవలసిందే. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనుకుల గ్రామ శివారులోని ఓ ఇంట్లోని గుమ్మిలో దాచిన కంకిబెండ్లు పాత జ్ఞాపకాలను ఇలా గుర్తు చేశాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
Comments
Please login to add a commentAdd a comment