తరుగని..దగా!..తాలు, నల్లబడ్డ ధాన్యం పేరుతో మిల్లర్ల తరుగు | Rice Millers In Telangana Fleece Paddy Farmers As Government Backs Out | Sakshi
Sakshi News home page

తరుగని..దగా!..తాలు, నల్లబడ్డ ధాన్యం పేరుతో మిల్లర్ల తరుగు

Published Wed, Dec 8 2021 1:45 AM | Last Updated on Wed, Dec 8 2021 1:45 AM

 ప్రతికాత్మక చిత్రం - Sakshi

ఈ రైతు పేరు డప్పురి భుజంగం. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ గ్రామం. రెండెకరాల 30 గుంటల్లో వరివేయగా.. 70 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. పుల్కల్‌ కొనుగోలు కేంద్రానికి తెచ్చి తూకం వేయించాడు. బస్తాకు 40కిలోల ధాన్యానికి బదులు 42 కిలోల చొప్పున తూకం వేశారు. నిబంధనల ప్రకారం 17% తేమ ఉన్నా పర్వాలేదు. అలాంటిది అంతకన్నా తక్కువగా 15 శాతమే తేమ ఉన్నా తరుగు తీశారు. దీనితో మూడు క్వింటాళ్ల ధాన్యాన్ని నష్టపోయాడు.

..ఒక్క భుజంగమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వరి పండించిన రైతులందరిదీ ఇదే సమస్య. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెస్తే.. రోజుల తరబడి ఎదురుచూపులు. ఎలాగోలా తూకం పూర్తయి మిల్లర్లకు పంపితే.. తాలు, తరుగు పేరిట కోతలు. మిల్లర్లను ఎంత బతిమాలినా.. ఏమాత్రం కనికరం లేకుండా బస్తాకు రెండు కిలోల నుంచి నాలుగు కిలోలదాకా తరుగు తీస్తుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో వరి రైతు అరిగోస పడుతున్నాడు. నానా తంటాలు పడి ధాన్యం అమ్ముకుంటున్నా.. అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్ల దోపిడీతో నిండా మునుగుతున్నాడు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసినా.. మిల్లర్లు బస్తాకు రెండు కిలోల నుంచి నాలుగు కిలోలదాకా తరుగు తీస్తుండటంతో నష్టపోతున్నాడు. రైతులు ఇదేమిటని అడిగితే మిల్లర్లు ధాన్యాన్ని తిప్పిపంపేస్తూ ఇబ్బందులపాలు చేస్తున్నారు. రైస్‌మిల్లులు అధికంగా ఉన్న పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, జనగామ, వరంగల్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మిల్లర్లు అడ్డగోలుగా తరుగు తీస్తుండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. 

కొనుగోలు కేంద్రం నుంచే మొదలు.
కొనుగోలు కేంద్రాల్లో ఒక్కో బస్తాలో 40కిలోల ధాన్యాన్ని నింపుతారు. ధాన్యంలో తేమ 17శాతం, అంతకన్నా తక్కువ ఉంటేనే తూకం వేస్తారు. అయితే కొనుగోలు కేంద్రాల్లోని హమాలీలు, నిర్వాహకులు తరుగు, ఇతర వేస్టేజీ పేరుతో సాధారణంగానే ఒక కిలోదాకా ఎక్కువ ధాన్యం వేసి.. 41 కిలోలతో బస్తాను నింపుతున్నారు. కానీ 40 కిలోల లెక్కనే నమోదు చేస్తున్నారు. ధాన్యం మొత్తం ఎన్ని బస్తాలు, మద్దతు ధర ప్రకారం అదే సొమ్ము ఎంత అన్న వివరాలను ఒక చీటీ మీద రాసి రైతులకు ఇస్తున్నారు. నిజానికి ఇక్కడితో రైతుల బాధ్యత పూర్తయినట్టే. తర్వాత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆ ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ అధికారులు సూచించిన మిల్లులకు పంపుతారు. 

మిల్లుకు చేరగానే కొర్రీలు..
మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని తీసుకుని.. తమకు అందినట్టుగా నమోదు చేయాలి. కానీ ఇక్కడే కొర్రీలు మొదలవుతున్నాయి. ధాన్యంలో తాలు, తేమ ఎక్కువగా ఉన్నాయని, నల్లటి ధాన్యం ఉందని సాకులు చెప్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు ఫోన్‌ చేసి.. ‘‘మిల్లు వాళ్లు వడ్లు తీసుకోరట. తరుగు ఉంది. వడ్లు నల్లబడ్డాయి. ఒకవేళ తీసుకోవాలంటే.. బస్తాకు కనీసం 2 నుంచి 4 కిలోల తరుగు తీయాల్సి ఉంటుంది. మీరు సరేనంటే మిల్లు వాళ్లు తీసుకుంటారట. లేకుంటే తిప్పి పంపేస్తామంటున్నారు..’’ అని చెప్తున్నారు. రైతులు చేసేదేమీ లేక తరుగుకు ఒప్పుకుంటున్నారు. 40 కిలోల బస్తాకు 2 కిలోల నుంచి 4 కిలోల వరకు అంటే.. క్వింటాల్‌కు 5 నుంచి 10 కిలోల ధాన్యాన్ని వదులుకోవాల్సి వస్తోంది.

జాప్యం ఇందుకే..
కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యంతోపాటు మిల్లర్ల జోక్యం మితిమీరడం వల్లే వానాకాలం పంట కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు వాపోతున్నారు. రోజుకు లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి మరోలా ఉంది. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు మొదలై నెలా 15 రోజులు దాటినా.. ఇప్పటివరకు లక్ష్యంలో 33 శాతమే కొనుగోళ్లు పూర్తయ్యాయి. మొత్తంగా కోటి టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 34.26 లక్షల టన్నులే పూర్తయింది. ఈ నెలాఖరు వరకు కూడా కొనుగోళ్లు పూర్తయ్యే పరిస్థితి 
కనిపించడం లేదు. 

అంతా కుమ్మక్కై! 
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లుల యజమానులు కుమ్మ ౖక్కై రైతులను దోచుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చాలా చోట్ల మిల్లర్లు చెప్పినట్టుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని.. వారు చెప్పినట్టు ధాన్యం సేకరణ సాగుతోందని రైతులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పౌర సరఫరాల సంస్థ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలో 453 కేంద్రాలు తెరవగా కొనుగోళ్లు దాదాపుగా పూర్తయి 427 కేంద్రాలను మూసేశారు. అదే సమయంలో భూపాలపల్లి, కొత్తగూడెం, గద్వాల, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో ఇంకా కొనుగోళ్లు మొదలేకాలేదు.

బస్తాకు 2 కిలోలు కట్‌ చేశారు 
మా పొలంలో పండించిన వడ్లను ఊరిలోని ఐకేపీ సెంటర్‌లో అమ్మిన. కానీ జనగామలోని రైస్‌మిల్లు వాళ్లు వడ్లలో తాలు ఉందంటూ రెండు రోజులు లారీ నుంచి వడ్లు దించుకోలేదు. తర్వాత బక్కో బస్తాకు 2 కిలోల లెక్కన తరుగు కింద కట్‌ చేశారు. నా 600 బస్తాలకు 12 క్వింటాళ్లు తరుగు చూపించారు. అంటే రూ. 24 వేలు నష్టపొయిన. 
– కొల్ల నర్సిరెడ్డి, రైతు,బండనాగారం, జనగామ జిల్లా 

తాలు, తప్ప లేకుండా తేవాలి
వడ్లలో తాలు, రాళ్లు లేకుండా శుభ్రం చేసి ధాన్యం తేవాలి. కొందరు కొనుగోలు కేంద్రంలో ఉన్న నిర్వాహకులను మేనేజ్‌ చేసుకుని, ధాన్యం కాంటా వేయిస్తున్నారు. దానిని రైస్‌ మిల్లులకు పంపుతున్నారు. తాలు లేకుండా తెస్తే ఎలాంటి కటింగ్‌ ఉండదు. మేం కూడా రైతులమే.. –మినుపాల ప్రకాశ్‌రావు, రైస్‌ మిల్లు యాజమాని, సుల్తానాబాద్‌ 

తరుగు తీస్తే కఠిన చర్యలు 
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చేంత వరకే రైతుల బాధ్యత. కొనుగోలు కేంద్రం నుంచి రైస్‌మిల్లులకు పంపించాల్సింది కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే. ధాన్యం ఒక్కసారి రైస్‌మిల్లుకు చేరాక.. రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. రైస్‌మిల్లర్లు ధాన్యంలో కోతపెట్టడం, తాలు, తరుగు తీయడం అనేది నిబంధనలకు విరుద్ధం. మిల్లర్లు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం. – గంగుల కమలాకర్,పౌరసరఫరాల శాఖ మంత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement