కొత్త ధాన్యం సేకరణ విధానంపై రైస్‌మిల్లర్ల అనాసక్తి
67 కిలోల ‘ఔటర్న్’, బ్యాంకు గ్యారంటీ షరతులతో ముందుకు రాని మిల్లర్లు
కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్టు అక్టోబర్ 1నే ప్రకటించిన సర్కారు
నెల రోజులు అవుతున్నా నామమాత్రంగానే సేకరణ
ఖరీఫ్ ధాన్యం కొనుగోలు లక్ష్యం 80 లక్షల టన్నులు.. ఇప్పటివరకు సేకరించినది కేవలం 20 వేల టన్నులే..
రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోయిన ధాన్యం.. అకాల వర్షాలతో తడిసి నష్టపోతున్న వైనం
దిక్కుతోచక తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకుంటున్న రైతులు
ఇప్పటివరకు మార్కెట్లకు రాని సన్న ధాన్యం.. బోనస్ ప్రశ్నార్థకం!
రేపు హైదరాబాద్ శివార్లలోని ఘట్‌కేసర్‌లో మిల్లర్ల సమావేశం
సమస్యలు, డిమాండ్లపై చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు రైస్‌మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29న ప్రకటించిన ఖరీఫ్ ధాన్యం సేకరణ పాలసీ తమను నష్టాల పాలు చేస్తుందని వారు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దీనితో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం పడింది. కొనుగోలు కేంద్రాల్లోనే భారీగా ధాన్యం పోగుపడుతోంది. అకాల వర్షాలతో ఆ ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఏం చేయాలో పాలుపోక ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు.
మిల్లర్ల విజ్ఞప్తులను తోసిపుచ్చడంతో..
రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎంఆర్ పాలసీ విషయంలో మిల్లర్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదనే విమర్శలున్నాయి. సన్న ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయడానికి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ‘ఔటర్న్’ను సవరించాలని మిల్లర్లు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనితోపాటు మిల్లులు తమకు కేటాయించే ధాన్యానికి బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ముడి బియ్యం మిల్లర్లు పోరుబాట పట్టారు.
నిజానికి ధాన్యం సేకరణ పాలసీ ప్రకటించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల మొదటి వారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. పరిశీలన జరిపిన ఉప సంఘం గత నెలాఖరులో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో ధాన్యం సేకరణ, రైతులకు బోనస్, అధికారుల బాధ్యతలను పేర్కొన్న సర్కారు.. మిల్లర్ల డిమాండ్లను పట్టించుకోలేదు.
‘ఔటర్న్’ తగ్గించాలనే డిమాండ్..
ఒక క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు వచ్చే బియ్యం, నూకల లెక్కను ‘ఔటర్న్’ అని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఔటర్న్ ప్రకారం.. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) విధానం కింద మిల్లర్లకు చేరే ప్రతి 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, ఇతర అంశాల నేపథ్యంలో.. బియ్యం తక్కువగా వస్తుందని, నూకలు ఎక్కువగా వస్తాయని మిల్లర్లు చెప్తున్నారు.
చాలా జిల్లాల్లో ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేస్తే.. 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు కలిపి 67 కిలోలు వస్తాయని వారు ప్రభుత్వంతో చర్చల సందర్భంగా వివరించారు. తమకు నష్టం కలిగించే ఈ ఔటర్న్ లెక్కను సరిదిద్దాలని కోరారు. మధ్యేమార్గంగా 62 కిలోల ఔటర్న్ నిర్ణయిస్తే.. నూకలను విక్రయించి, బియ్యన్నే అదనంగా ఎఫ్‌సీఐకి ఇస్తామని చెప్పారు. కానీ మిల్లర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది.
బ్యాంకు గ్యారంటీలపై విముఖత
గతంలో ప్రభుత్వం మిల్లులకు నేరుగా ధాన్యాన్ని కేటాయించి, వారి నుంచి బియ్యాన్ని తీసుకునేది. ధాన్యం ఇచ్చినందుకు ఎలాంటి గ్యారంటీ అడిగేది కాదు. అయితే 2022–23 రబీలో మిల్లర్లు ధాన్యం మిల్లింగ్ చేయలేదంటూ సీఎంఆర్ బియ్యాన్ని పూర్తిగా అప్పగించలేదు. సుమారు రూ.7 వేల కోట్ల విలువైన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రికవరీ చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలుగు సంస్థలకు టెండర్లు ఇచ్చింది.
అయినా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లేదా ఆ మేర విలువను మాత్రమే రికవరీ చేయగలిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ధాన్యం కేటాయింపుకోసం మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం తప్పనిసరి అని కొత్త పాలసీలో పొందుపరిచింది. ఇందులో కూడా నాలుగు కేటగిరీలను నిర్ణయించింది. గడువులోగా సీఎంఆర్ అప్పగిస్తూ, ఇప్పటివరకు డీఫాల్ట్ కాని మిల్లర్లకు కేటాయించే ధాన్యం విలువలో 10 శాతం బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటారు.
అలాంటి మిల్లులు అతి తక్కువని సమాచారం. ఇక డీఫాల్ట్ అయి పెనాల్టీతో సహా సీఎంఆర్ అప్పగించిన మిల్లర్ల నుంచి 20శాతం, పెనాల్టీ పెండింగ్‌లో ఉన్న మిల్లర్ల నుంచి 25శాతం బ్యాంక్ గ్యారంటీలు, సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకుంటారు. మిల్లుల్లో ధాన్యం లేని, సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లను నాలుగో కేటగిరీగా నిర్ణయించి.. ధాన్యం కేటాయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నాలుగో కేటగిరీలో సుమారు 300 మంది మిల్లర్లు ఉన్నట్టు తెలిసింది.
అయితే ఈ బ్యాంకు గ్యారంటీ షరతులకు ముడి బియ్యం మిల్లర్లు అంగీకరించడం లేదు. దీనితో అధికారులు ఇప్పటికిప్పుడు కాకపోయినా 15 రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని మిల్లర్ల నుంచి ‘అండర్ టేకింగ్’ తీసుకుంటూ ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. అండర్ టేకింగ్ ఇచ్చిన మిల్లర్లు తర్వాత తప్పనిసరిగా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనికి మిల్లర్లు ముందుకురావడం లేదని తెలిసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాల్లో అధికారులు రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని గోదాములకు పంపిస్తున్నారు.
మిల్లింగ్ చార్జీల పెంపుపైనా అసంతృప్తి..
దేశంలోని చాలా రాష్ట్రాల్లో కస్టమ్ మిల్లింగ్ చార్జీలు క్వింటాల్‌కు రూ.110 నుంచి రూ.200 వరకు ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దొడ్డురకాలకు రూ.40, సన్నరకాలకు రూ.50కి మాత్రమే చార్జీలు పెంచిందని మిల్లర్లు అంటున్నారు. ఈ చార్జీలను కూడా సకాలంలో ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇచ్చిన బియ్యానికి మాత్రమే లెక్కకట్టి ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. ఇచ్చే అరకొర చార్జీలకు కూడా కోతలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
రూ.500 బోనస్, రేషన్‌షాపులకు సన్న బియ్యం ఎలా?
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రైతులు రాష్ట్రంలో భారీ ఎత్తున సన్నరకాల వరి సాగు చేశారని వ్యవసాయ శాఖ ప్రకటించింది. రైతుల సొంత అవసరాలు, బహిరంగ మార్కెట్‌లో విక్రయించే ధాన్యం పోగా.. కొనుగోలు కేంద్రాలకు ఏకంగా 50 లక్షల టన్నుల సన్నధాన్యం, 30 లక్షల టన్నుల వరకు దొడ్డు ధాన్యం వస్తుందని పౌర సరఫరాల సంస్థ అంచనా వేసింది.
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్నధాన్యాన్ని మిల్లింగ్ చేయించి, ఆ సన్న బియ్యాన్ని జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. అలా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్న ధాన్యానికి సంబంధించి క్వింటాల్‌కు రూ.500 చొప్పున రైతులకు నేరుగా జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కూడా. అయితే కొనుగోలు కేంద్రాలకు సన్నధాన్యం రాకపోవడం, మిల్లర్ల లొల్లి నేపథ్యంలో.. రైతులకు బోనస్ అందడం, రేషన్‌షాపుల్లో సన్న బియ్యం సరఫరా పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారాయి.
రేపు రైస్ మిల్లర్ల భేటీ
ఖరీఫ్ ధాన్యం మిల్లింగ్ సమస్యల విషయంలో చర్చించేందుకు రైస్ మిల్లర్లు మంగళవారం రోజున సమావేశం కానున్నారు. యాదాద్రి జిల్లా ఘట్కేసర్‌లో నిర్వహించే ఈ భేటీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రా, బాయిల్డ్ రైస్‌మిల్లుల నిర్వాహకులు హాజరుకావాలని రా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని తెలిపారు.
నామమాత్రంగానే కొనుగోళ్లు
రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నప్పటికీ.. ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్లు బాగా తక్కువగా ఉండటం గమనార్హం. ఈ సీజన్‌లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు కేవలం 20వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. అంతేకాదు ఇది కూడా దొడ్డురకం ధాన్యమేనని అధికారవర్గాలు చెప్తున్నాయి.
సన్నరకాల ధాన్యం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. కొనుగోళ్లు సరిగా లేక రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతున్నాయి. నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు తమ వంతు ఎప్పుడు వస్తుందో తెలియక పడిగాపులు పడుతున్నారు. ఇటీవలి అకాల వర్షానికి పెద్దపల్లి జిల్లాలో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment