yakshagaanam
-
ఆడపిల్లను ఊరూరూ తిప్పడమేంటి అనడంతో...
మనకు మహానటి సావిత్రి తెలుసు. ఈమె కర్ణాటక రంగస్థలంలో రాణిస్తున్న మంచినటి. చిన్నప్పుడు సాధ్యం కాని తన అభీష్టాన్ని అరవై దాటిన తరవాత నెరవేర్చుకుంది. పదేళ్ల వయసులో ఇంటినే యుద్ధరంగం చేసేది. కర్ర పుల్లనే కరవాలంగా చూసుకునేది. భీకర యుద్ధం చేస్తున్నట్లు నోటితో శబ్దాలు చేస్తూ యుద్ధఘట్టాన్ని రంజింపచేసేది. ముగియగానే ఓ పాట అందుకునేది. పాటకు తగ్గట్టు అభినయించేది. ఆ సన్నివేశాలన్నీ సావిత్రి అనే అమ్మాయి యక్షగానం మీద పెంచుకున్న ప్రేమకు చిహ్నాలు. ఆమె ఇష్టానికి తగ్గట్టు పెద్దవాళ్లు ఆమెకు యక్షగానంలో శిక్షణ ఇప్పించారు. పన్నెండు– పదమూడేళ్లు వచ్చేసరికి చిన్న చిన్న పాత్రలతో రంగస్థలం మీద అడుగుపెట్టడానికి సిద్ధమైన సావిత్రిని ‘పెద్దయిన ఆడపిల్లను యక్షగాన ప్రదర్శన కోసం ఊరూరూ తిప్పడమేంటి?’ అని ఆపేశారు. అలా తెరపడిన ఆమె నటకౌశలానికి అరవై ఆరేళ్ల వయసులో తనకు తానే తెర తీసుకుందామె. ఇప్పుడామె వయసు 77. ఈ పదకొండేళ్లలో వందకు పైగా నాటకాలు ప్రదర్శించింది రంగస్థల, యక్షగాన కళాకారిణి సావిత్రి. అరవై... అయితేనేం? ఈ సావిత్రిది కర్ణాటకలోని మంగుళూరు. తనకు ఇష్టమైన యక్షగాన ప్రదర్శనకు చిన్నప్పుడే అడ్డుకట్ట పడడంతో ఆమె ఆ తర్వాత చదువు మీదనే దృష్టి కేంద్రీకరించింది. స్కూల్ టీచర్ ఉద్యోగం వచ్చింది. టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ కళారంగానికి దూరం కాలేదు. భర్త శ్రీనివాసరావు నడిపిస్తున్న ‘మక్కల్ సాహిత్య సంగమ’కు సహకారం అందించేది. తన విద్యార్థులకు చిన్న నాటకాలు సాధన చేయించి పాఠశాల వార్షికోత్సవాల్లో ప్రదర్శిస్తుండేవారు. ఆ రకంగా తెర వెనుకే ఉంటూ తన కళాభిరుచిని నెరవేర్చుకునేది. రిటైర్ అయిన తర్వాత ఆమెకు ఆ వ్యాపకం కూడా లేకుండా పోయింది. అప్పుడు తీసుకుందామె ఓ నిర్ణయం. మంగుళూరులోని యక్షారాధన కళాకేంద్ర నిర్వహకులు సుమంగళ రత్నాకర్‌ను సంప్రదించి నాలుగైదు గంటల నిడివితో సాగే నాటకాలను కూడా అవలీలగా సాధన చే సింది. పదేళ్లు గడిచేప్పటికి ఆమె వందవ నాటకాన్ని ప్రదర్శించారు. వాల్మీకి, దుర్యోధన, సుగ్రీవ, భీష్మ, ధర్మరాయ వంటి పౌరాణిక పాత్రల్లో చక్కగా ఇమిడిపోతారామె. ‘కరోనా కారణంగా నాటక ప్రదర్శనలు తగ్గాయి. లేకపోతే ఇప్పటికి మరో పాతిక ప్రదర్శనలిచ్చేదాన్ని. లాక్డౌన్ పోయి, అన్‌లాక్ మొదలైన తర్వాత కొద్దిపాటి నిడివితో ప్రదర్శనలు ఇస్తూ వాటిని డిజిటల్లో ప్రదర్శనలు ప్రసారం చేస్తున్నాం’ అన్నారు. అలాగే ‘‘మనం మహిళలం కాబట్టి అలా చేయడం బాగుండదని... ఇలా చేస్తే ఎవరైనా నవ్వుతారేమోనని, మన వయసు ఇంత అని గుర్తు తెచ్చుకుంటూ పరిధులు గీసుకుంటూ పోతే మన కల ఎప్పటికీ నెరవేరదు. మన కలను మనమే సాకారం చేసుకోవాలి’’ అంటూ మహిళలకు మంచి సందేశమిచ్చారు. -
సంప్రదాయ కళలకు జీవం పోస్తున్న కళాకారులు
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ పల్లెలు ఓనాడు కళలకు నిలయాలు. ఆనాటి పాటలు, ఆటలు, బాలనాగమ్మ, భక్తసిరియాల, హరిచంద్ర, అల్లిరాణి నాటకాలు ప్రజలను ఎంతగానో ఆకర్షించేవి. ఆ కళాప్రదర్శనలు చూసేందుకు ఊరంతా ఒకచోటుకే చేరేవారు. పల్లెల్లో వాటికి ఆదరణ ఉండడంతో భాగవతాలు, యక్షగాణాలు, చిరుతల రామయాణాలు వంటి నాటికలు, భాగవత ప్రదర్శనలు జోరుగా ఉండేవి. ఎప్పుడైతే సినిమాలు, టీవీలు అందుబాటులోకి వచ్చాయో ఆనాటి పల్లెకళలు, నాటకాలు, భాగవతాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. నాటి కళలను ఈనాటి వారికి పుస్తకాల ద్వారానో, టీవీల ద్వారా చూపించే ఈ రోజుల్లో పల్లెకళలు ఇంకా బతికే ఉన్నాయిని చెబుతున్నారు దండేపల్లి మండలానికి చెందిన పలువురు కళాకారులు. మండలంలోని పలు గ్రామాల నుంచి.. దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి, వెల్గనూర్, కొర్విచెల్మ, కొండాపూర్, కాసిపేట, నంబాల, నర్సాపూర్ గ్రామాల్లో చాలా మంది కళాకారులు ఉన్నారు. వీరంతా భజన బృందాలుగా ఏర్పడి, ఇప్పటికీ పలు పండుగలు, పబ్బాలు, శ్రావణం, కార్తీక మాసాల్లో, మహశివరాత్రి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి పండుగల రోజుల్లో ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీటితో పాటు గ్రామాల్లో పూజలు జరుపుకునే వారి ఇళ్లలో కూడా రాత్రి వరకు భజనలు చేస్తుంటారు. అంతేకాకుండా కృష్ణాష్టమి, దీపావళీ, శ్రీరామనవమి, శివరాత్రి పండుగలతో పాటు ఇతర పండుగల్లో సందర్భాన్ని బట్టి నాటికలు, భాగవతాలు, యక్షగాణాలు, చిరుతల రామాయణం వంటి కళాప్రదర్శనలు నేటికీ ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అప్పుడప్పుడు నిర్వహిస్తుంటారు. వీటిని వీక్షించేందుకు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్లి ఆనాటి కళప్రదర్శనలు ప్రజలు ఆసక్తిగా తిలకిస్తూ మురిసి పోతున్నారు. పుణ్య క్షేత్రాల్లో భజనలకు.. గ్రామాల్లో గల భజన బృందాలు సాకాకుండా, తిరుమల, తిరుపతి, దేవస్థానాలు, భద్రాచలం, బాసర, కొండగట్టు, గూడెం, ఆలయల్లో నిర్వహించే భజన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా రవీంద్రభారతిలో నిర్వహించే సంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ తమ కళా ప్రదర్శనలు ప్రదర్శిస్తుంటారు. అప్పుడప్పుడు ప్రదర్శిస్తున్నం నేను నేర్చుకున్న నాటికలు, బాగవతాలను ఇప్పటికీ మా గ్రామంలో పలు పండుగ సమయాల్లో ప్రదర్శిస్తుంటాం. దీంతో ఇప్పటి వారికి ఆనాటి కళలను గుర్తు చేసిన వాళ్లం కావడంతో పాటు, పల్లె కళలు ఇంకా బతికే ఉన్నాయని తెలియజేస్తున్నం. మా గ్రామంలో చాలా మంది కళాకారులు ఉన్నారు. కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి. – ముత్యం శంకరయ్య, రెబ్బనపల్లి -
శ్రీశ్రీ అలభ్య అనువాద రచన (యక్షగానం) భాగ్యలక్ష్మి
మహాకవి శ్రీశ్రీ నూట ఎనిమిదో జయంతి సందర్భంగా, ఒక అదనపు కారణానికి కూడా ఈ పండుగ వేడుక హెచ్చింది. విరసం వారూ, తరువాత మనసు ఫౌండేషన్ వారూ వేసిన శ్రీశ్రీ సమగ్ర రచనలు లేదా సంపూర్ణ లభ్య రచనల సంకలనాల శ్రద్ధాపూర్వక కృషి తరువాత కూడా మరొక శ్రీశ్రీ రచన, లభ్యం అయ్యింది. అది రాసిన శ్రీశ్రీకి 34 ఏళ్ళు. ఒక ఏడాది ముందరే జరిగిన ఈ రచన, తన ప్రపంచ సాహిత్య అధ్యయన స్వభావానికి దీటుగానే ఉన్నది. ఈ రచన అచ్చు అయింది 26 మార్చ్ 1944 ఆనందవాణి పత్రికలో, భాగ్యలక్ష్మి (యక్షగానం) పేరిట. ఇది అనువాద కవిత కావడం మరొక విశేషం. ఇరవై మూడేళ్ళ రడ్యార్డ్ కిప్లింగ్ (1865 – 1936) రచన ‘ద మాస్క్ ఆఫ్ ప్లెంటీ’కి యేడాది క్రితం నేను చేసిన యధాశక్తి తర్జుమా) అని శ్రీశ్రీ పాదసూచి పెట్టారు. ఇంతకుముందు శ్రీశ్రీ అనువాదాలు ఎక్కువగా వచ్చిన ఖడ్గసృష్టిలో కానీ, శ్రీశ్రీ కవితా ప్రస్థానం పేరిట మనసు ఫౌండేషన్ వారి బృహత్ ప్రచురణలో కానీ ఈ రచన లేదు. శ్రీశ్రీ అనువాదాలను అధ్యయనం చేసే వారికి, వారి సాహిత్య ప్రియులకు, తెలుగు సాహిత్య చరిత్రకు ఇదొక కొత్తగా లభ్యమైన వనరు. శ్రీశ్రీ రచనల సేకరణలో అనితర సాధ్యమైన కృషి చేసిన చలసాని ప్రసాద్ గారిని స్మరించడం కూడా ఈ సందర్భానికి శోభను ఇస్తుంది. శ్రీశ్రీ సంపూర్ణ లభ్య రచనల కృషిలో రెండు మూడు తరాల సాహిత్యాసక్తులు, సాహిత్య వేత్తలు, సేకర్తలు కలిసి పని చేసి సాధించిన ఫలితంలో ఇదొక అదనపు అక్షర అక్షయ నిధి. సాహిత్య, సామాజిక, సాంస్కృతిక అధ్యయనానికి పుష్కలమైన అవకాశం.కిప్లింగ్ ఆంగ్ల కవిత లాహోర్ నుంచి నడిచే పత్రిక ‘ది పయనీర్’లో 26 అక్టోబర్ 1888 నాడు ప్రచురణ. బ్రిటిష్ రాణి పాలనలో భారత జన జీవనంపై ఇదొక విలువైన రచన. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నియమించిన గవర్నమెంట్ విచారణ కమిషన్ తీరు తెన్నులపై, కిప్లింగ్ అంటే ఫ్రెంచ్ భాషలో ఒక పల్లీయ వినోద ప్రదర్శన గానూ, అలాగే అసలు విషయం దాచిపెట్టే కుహనా నివేదికల ప్రహసనంపై ఆంగ్ల భాషలో ఝ్చటజు అన్న అర్థంతోనూ ఈ రచన, పాలకుల ధోరణిపై విమర్శగా చేశాడు. అలా చూస్తే, బ్రిటిష్ ఇండియా సాహిత్యంలో ఒక ప్రధాన రచన అయిన దీన్ని శ్రీశ్రీ 75 ఏళ్ల ముందర తెలుగులోకి తెచ్చారు. యధాశక్తి తర్జుమా అన్నారు కనుక 1888 మూలం, 1943 తెలుగు అనువాదం, నిశిత పరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది. రైతు జీవితాలు 1888 నాటికి ఎలా ఉన్నాయో, కిప్లింగ్ చెప్పగా, అంతకన్నా మరింత గడ్డుగా స్వాతంత్య్రానంతర భారతంలో ‘మార్చాము’ కనుక – దాదాపు శతాబ్దపున్నర కిందటి ఈ భారతీయ సమాజ రచన ఆనాడే అక్కడే ఉండిపోకుండా, 75 ఏళ్ల కిందట వెలుగులోకి తెలుగులోకి తెచ్చిన మహాకవి శ్రీశ్రీ సృజన దర్శనానికి వందనాలు. సేకరణ, లఘువ్యాఖ్య: రామతీర్థ (అవతారిక:– భారతీయ ప్రభుత్వం వారు దేశంలో యోగక్షేమాల భోగట్టా తియ్యడానికొక ప్రత్యేక సంఘాన్ని నియోగించారు. నిక్షేపం లాగ దేశం భాగ్యభోగాలతో తులతూగుతోందని ప్రభుత్వం వారు పసికట్టారు). రంగం:– భూలోకస్వర్గం – అనగా సిమ్లా శిఖరం. భారతీయ ప్రభుత్వం భాగ్యలక్ష్మి వేషంలో పాడుకుంటూ ప్రవేశం. టకోరా; సన్నాయి మేళాల నేప«థ్య గానం. రైతు బ్రతుకే మధురం! ఆహా రైతు బ్రతుకే మధురం పగలూ, రాత్రీ, పాడీ పంటా రాజ్యమేలే రాజులకన్నా రైతు బ్రదుకే సులభం! ఆహా రైతు బ్రదుకే సుభగం (తొహరా) సాక్షాత్తూ మనదేశం స్వర్గమే అని మా ఉద్దేశం పుణ్యభూమి కాదటండీ వేరే భూకైలాసం ఉన్నాదటండీ! జరూరుగా తమరొక నివేదిక తయారుచేసి పారేస్తే చాలిక! శతసహస్ర భారత నరనారీమణులు శక్రచాప శబలిత తేజోఘృణులు చిత్రచిత్ర వర్ణాలతో వీరి పరిస్థితి చిత్రించండి సముజ్వల సుందరాకృతి (హిమాలయ పర్వతాలు దిగి సమర్థులైన పరిశీలన సంఘంవారు దయచేస్తారు.) తురుష్క వేత్ర హస్తుడు – యోగక్షేమాల భోగట్టా తీశారా? దేశం నాడిపరీక్ష చేశారా? చక్కని భాషలో నివేదిక రాశారా? సమాచారమేదో మా నెత్తిని కొట్టండి. ఆవులూ గేదెలూ దూడలూ దున్నలూ అమాం బాపతు లెక్కలు కట్టండి ఫస్టు క్లాసులో యమ్మే ప్యాసయిన బాబూజీనొకడ్ని పట్టండి కట్టలు కట్టలుగా కాగితాల కుప్పలతో గెజెటీర్లకి గెజెటీర్లే నిండుతాయి: విష్కంభం అనంతాకాశం నించి అశరీరవాణి (జంత్ర వాద్యాల సంగీతంతో) బక్కచిక్కిన దుక్కిటెద్దుల ప్రాణములు కనుగొనల దాగెను ఆకసము రక్తాగ్ని కుండము భూమి నల్లని బొగ్గుకుంపటి మండుగాడుపు టెండవేడికి మరిగి కాలం భగీల్మన్నది యముని కారెనుబోతు మెడలో ఇనుపగంటలు నవ్వినట్లుగ దిగుడుబావి దిగాలుమన్నది పైరు పంటలు బావు రన్నవి ఇంకిపోయిన ఏటి కడుపున ఇసుక దిబ్బలు గొల్లుమన్నవి పరమపద సోపాన పథమున పాము నోట్లో పడ్డ రైతూ! ఎవరికై చేయెత్తి ప్రార్థన? ఎవరి కర్మల కెవరు కర్తలు చూడు పడమట సూది బెజ్జపు మేర కూడా మేఘ మంటదు ఇంత వర్షపు చినుకు కోసం చూచి కన్నులు సున్న మైనవి ఏడుపెందుకు వెర్రి బిడ్డా ఎవరు నీ మొర లాలకింతురు చచ్చిపోయిన గొడ్డు నడుముకు చచ్చినట్టే నిద్రపోవోయ్! (విజయ గర్వంతో విర్రవీగుతూ సిమ్లా నగరానికి పరిశోధక సంఘంవారి పునరాగమనం. సింహ శాబకాన్ని వెంటబెట్టుకొని వస్తూన్న భరతపుత్రుని వేషంతో. అస్వస్థతగా వున్న భారతదేశం చికిత్స పొందుతున్న సూచనగా నుదుటికి పలాస్త్రీ, మోకాళ్లకి పట్టీలు) సంఘసభ్యుల సంగీతం:– తిరిగాము తిరిగాము గోవిందారామ దేశమంతా మేము గోవిందా రాజుల్ని చూశాము గోవిందారామ రైతుల్ని చూశాము గోవిందా చూశాము చూశాము గోవిందారామ దేశసౌభాగ్యాన్ని గోవిందా మాయ రోగాలేవి గోవిందారామ మచ్చుకైనా లేవు గోవిందా చావనే మాటైన గోవిందారామ స్మరియించగా రాదు గోవిందా శిస్తుగా ప్రజలెల్ల గోవిందారామ మస్తుగా బలిశారు గోవిందా సకల సంపదలతో గోవిందారామ తులతూగుతున్నారు గోవిందా. (నాట్యం) కాపులూ కరణాలు రాజులూ రెడ్లు బ్రాహ్మణులు వైశ్యులూ మాల మాదిగలు పిండార్లు థగ్గులూ జైనులూ జాట్లు సర్కారు దయవల్ల గోవిందారామ చల్లగా వున్నారు గోవిందా తిని తిరిగి హాయిగా గోవిందారామ తెగ బలిసి పోయారు గోవిందా గో‘ఓ’వింద! (ఇండియా ప్రభుత్వం తెల్ల శాటిన్ రెక్కలతో ఎగిరివచ్చి అమెరికన్ రోడ్డు తంబురా మీటుతూ స్వస్తి వాచకం–) ప్రజ లేకగ్రీవమ్ముగ పంచభక్ష్య రసాన్నములు పర్వత శిఖరాగ్రమ్ముల ప్రశాంతముగ పవ్వళించి ఆరగించు దృశ్యమ్మును ఆక్షి పేయమగునట్లుగ చూచుచుంటకంటె వేరె సుఖమున్నదె శుభమున్నదె? పరిశోధక సంఘసభ్య పావనమూర్తులకు జయము ఫలియించెను మీరు పడిన పరిశ్రమము ధన్యులొహో కిరాయి మేళం – బాకాలూదుతూ:– గొప్ప గొప్ప కామందులపై వారి బంధుమిత్రాదులపై భగవంతుని కరుణారసామృతం ప్రవహించక తప్పదు మరి వానలూ వరదలూ వచ్చినా కరువూ కాటకం కలరా వచ్చినా పేదవాళ్ల సొమ్మేం బోయింది ఆదమరిచి నిద్రపోతే సరి పేదవాళ్లు సుఖంగానే వున్నారని భాగ్యవంతులు నిర్ణయించేశారు గొప్ప గొప్ప వారందరికీ జయం వారి చుట్టూ తిరిగే వారందరికీ జయం పేదవాళ్ల కెందుకూ భయం? ప్రాణమున్నన్నాళ్లు బతుకుతారు నయం! Rudyard Kipling రాసిన The Masque of Plenty కి ఏడాది క్రితం నేను చేసిన యథాశక్తి తర్జుమా. –శ్రీశ్రీ -
“అక్షయంగా వెలుగొందిన యక్షగానం”
డల్లాస్/ఫోర్టువర్త్, టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ప్రతినెలా నిర్వహించే “నెల నెలా తెలుగు వెన్నెల” 102 వ సదస్సు జనవరి 24న డల్లాస్ నగరంలోని దేశీప్లాజా స్టూడియోలో 2015 సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన ప్రారంభించారు. 2016కి గానూ తెలుగు సాహిత్య వేదిక నూతన సమన్వయకర్తగా బిళ్ళ ప్రవీణ్ బాధ్యతలు చేపట్టారు. భాషా సాహిత్యాలకు పెద్ద పీట వేస్తున్న సాహిత్య వేదిక ఆశయాలను, సాహిత్య ప్రేమికులను అభినందిస్తూ సహాయ సహకారాలు కోరుతూ ఆసక్తి వున్న వారిని బిళ్ళ ప్రవీణ్ ఆహ్వానించారు. ఘంటసాల లలిత గీతాలను వీనుల విందుగా ఆలపించి, వడ్లమన్నాటి నాగేష్ మరియు కుందేటి చక్రపాణి అలనాటి మధుర గాయకుడిని మరోసారి గుర్తు చేశారు. పోతన భాగవతం నుండి పద్యాలను కుమారి దొడ్ల నిర్జర, దొడ్ల రమణ కమ్మగా పాడి వినిపించారు. బసాబత్తిన శ్రీనివాసులు వేలుపిళ్ళై కథలను పరిచయం చేస్తూ, కథా రచయిత సి. రామచంద్రరావు రాసిన 9 కథల గురించి ప్రస్తావించారు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే "చేరడం" అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుంది, ఇది ఎంతో పవిత్రమైన కాలం, దీనినే మకర సంక్రాంతి అంటారు అని జలసూత్రం చంద్రశేఖర్ వివరించారు. తెలుగు కవులు పేరడీలలో ఎంతో ప్రసిద్ధులు అని.. శ్రీశ్రీ కవిత్వాన్ని పేరడీ చెయ్యనివాడు పేరడీ కవే కాడు అని మాడ దయాకర్ వ్యాఖ్యానించారు. ప్రముఖ రచయిత శ్రీ రమణ గారు, "పిచ్చి ప్రేమ" అనే సినిమాపై సమీక్ష రాయమంటే విశ్వనాథ సత్యనారాయణ గారు హాస్య భరితంగా ఎలా రాస్తారో అనే ఊహాత్మక రచన చేశారు, దానిని మాడ దయాకర్ గారు చదివి నవ్వుల పువ్వులు పూయించారు. వేముల లెనిన్ "తల్లీ నినుదలంచి" అంటూ మాడుగుల నాగ ఫణిశర్మ గారు రచించిన గీతాన్ని పాడి వినిపించారు. డా.జువ్వాడి రమణ తెలుగు పద్యాలు చక్కగా పాడి వినిపించారు. డా.పుదూర్ జగదీశ్వరన్ ఇటీవల హ్యూస్టన్ నగరంలో ఆవిష్కరించిన తెలుగు అంతర్జాల పత్రిక "మధురవాణి" ని www.madhuravani.com ద్వారా చదువుకోవచ్చు అని తెలియచేశారు. తెలుగులో రెండు డాక్టరేట్ పట్టాలు సాధించి, నాట్యంలో జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకొన్న డా. కలవగుంట సుధ గారు "అక్షయంగా వెలుగొందిన యక్షగానం" అనే అంశం మీద మాట్లాడారు. పురాణాల గురించి, వాల్మీకి రామాయణంలో యక్షత్వం అంటే అమరత్వం, అదొక దివ్య ప్రసాదం అని తెలిపారు. మొట్ట మొదటి యక్ష గ్రంధం ప్రోలుగంటి చెన్నశౌరి రచించిన "సౌభరి చరితం", ఇది ప్రస్తుతానికి అలభ్యం, కవి కాలాదులు తెలిసినంతవరకు కందుకూరి రుద్రకవి వ్రాసిన "సుగ్రీవ విజయం" మొట్టమొదటిది అని తెలిపారు. 12వ శతాబ్దంలో పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరితము లో, మహాకవి శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో, 16వ శతాబ్దంలో అల్లసాని పెద్దన మనుచరిత్రలో ప్రవరాక్షుడు హిమవత పర్వత ప్రాంతంలో "గంధర్వ యక్ష ఘార్ణితమగు..." అనే పద్యంలో యక్షుల గురించి ప్రస్తావించారు. సుధ గారు తెలుగు నేలకు గర్వకారణం అయిన కూచిపూడి గ్రామాన్ని సందర్శించి కూచిపూడి నాట్య పండితులను కలిసి వారి అనుభవాలు సేకరించి పదిలపరిచారు. డా. కలవగుంటసుధ గారిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు పాలక మండలి అధిపతి గుర్రం శ్రీనివాస్ రెడ్డి శాలువతోమరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపికతో సత్కరించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ఈ సభకు అధ్యక్షత వహించారు. టాంటెక్స్ కళలకు, కళాకారులకు, సాహితీవేత్తలకు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుందని సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, సంయుక్త కోశాధికారి సింగిరెడ్డి శారద, కార్యవర్గసభ్యులు పాలేటి లక్ష్మి, మండిగ శ్రీ లక్ష్మి, గోవాడ అజయ్, తోటపద్మశ్రీ, కొణిదల లోకేష్ నాయుడు, సాహిత్య వేదిక బృంద సభ్యులు అట్లూరి స్వర్ణ, మర్తినేని మమత, దిండుకుర్తి నగేష్ పాల్గొన్నారు.