“అక్షయంగా వెలుగొందిన యక్షగానం” | nela nale vennela program in dallas | Sakshi
Sakshi News home page

“అక్షయంగా వెలుగొందిన యక్షగానం”

Published Wed, Jan 27 2016 10:56 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

“అక్షయంగా వెలుగొందిన యక్షగానం”

“అక్షయంగా వెలుగొందిన యక్షగానం”

డల్లాస్/ఫోర్టువర్త్, టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ప్రతినెలా నిర్వహించే “నెల నెలా తెలుగు వెన్నెల” 102 వ సదస్సు జనవరి 24న డల్లాస్ నగరంలోని దేశీప్లాజా స్టూడియోలో 2015 సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన ప్రారంభించారు. 2016కి గానూ తెలుగు సాహిత్య వేదిక నూతన సమన్వయకర్తగా బిళ్ళ ప్రవీణ్ బాధ్యతలు చేపట్టారు. భాషా సాహిత్యాలకు పెద్ద పీట వేస్తున్న సాహిత్య వేదిక ఆశయాలను, సాహిత్య ప్రేమికులను అభినందిస్తూ సహాయ సహకారాలు కోరుతూ ఆసక్తి వున్న వారిని బిళ్ళ ప్రవీణ్ ఆహ్వానించారు.
 
ఘంటసాల లలిత గీతాలను వీనుల విందుగా ఆలపించి, వడ్లమన్నాటి నాగేష్ మరియు కుందేటి చక్రపాణి అలనాటి మధుర గాయకుడిని మరోసారి గుర్తు చేశారు. పోతన భాగవతం నుండి పద్యాలను కుమారి  దొడ్ల నిర్జర,  దొడ్ల రమణ కమ్మగా పాడి వినిపించారు. బసాబత్తిన శ్రీనివాసులు వేలుపిళ్ళై కథలను పరిచయం చేస్తూ, కథా రచయిత  సి. రామచంద్రరావు రాసిన 9 కథల గురించి ప్రస్తావించారు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే "చేరడం" అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుంది, ఇది ఎంతో పవిత్రమైన కాలం, దీనినే మకర సంక్రాంతి అంటారు అని జలసూత్రం చంద్రశేఖర్ వివరించారు. తెలుగు కవులు పేరడీలలో ఎంతో ప్రసిద్ధులు అని.. శ్రీశ్రీ కవిత్వాన్ని పేరడీ చెయ్యనివాడు పేరడీ కవే కాడు అని మాడ దయాకర్  వ్యాఖ్యానించారు. ప్రముఖ రచయిత శ్రీ రమణ గారు, "పిచ్చి ప్రేమ" అనే సినిమాపై సమీక్ష రాయమంటే  విశ్వనాథ సత్యనారాయణ గారు హాస్య భరితంగా ఎలా రాస్తారో అనే ఊహాత్మక రచన చేశారు, దానిని మాడ దయాకర్ గారు చదివి నవ్వుల పువ్వులు పూయించారు. వేముల లెనిన్ "తల్లీ నినుదలంచి" అంటూ మాడుగుల నాగ ఫణిశర్మ గారు రచించిన గీతాన్ని పాడి వినిపించారు.  డా.జువ్వాడి రమణ తెలుగు పద్యాలు చక్కగా పాడి వినిపించారు. డా.పుదూర్ జగదీశ్వరన్ ఇటీవల హ్యూస్టన్ నగరంలో ఆవిష్కరించిన తెలుగు అంతర్జాల పత్రిక "మధురవాణి" ని www.madhuravani.com ద్వారా చదువుకోవచ్చు అని తెలియచేశారు.  

తెలుగులో రెండు డాక్టరేట్ పట్టాలు సాధించి, నాట్యంలో జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకొన్న డా. కలవగుంట సుధ గారు "అక్షయంగా వెలుగొందిన యక్షగానం" అనే అంశం మీద మాట్లాడారు. పురాణాల గురించి, వాల్మీకి రామాయణంలో యక్షత్వం అంటే అమరత్వం, అదొక దివ్య ప్రసాదం అని తెలిపారు. మొట్ట మొదటి యక్ష గ్రంధం ప్రోలుగంటి చెన్నశౌరి రచించిన "సౌభరి చరితం", ఇది ప్రస్తుతానికి అలభ్యం, కవి కాలాదులు తెలిసినంతవరకు కందుకూరి రుద్రకవి వ్రాసిన "సుగ్రీవ విజయం" మొట్టమొదటిది అని తెలిపారు. 12వ శతాబ్దంలో పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరితము లో, మహాకవి శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో, 16వ శతాబ్దంలో అల్లసాని పెద్దన మనుచరిత్రలో ప్రవరాక్షుడు హిమవత పర్వత ప్రాంతంలో "గంధర్వ యక్ష ఘార్ణితమగు..." అనే పద్యంలో యక్షుల గురించి ప్రస్తావించారు. సుధ గారు తెలుగు నేలకు గర్వకారణం అయిన కూచిపూడి గ్రామాన్ని సందర్శించి కూచిపూడి నాట్య పండితులను కలిసి వారి అనుభవాలు సేకరించి పదిలపరిచారు.
 
డా. కలవగుంటసుధ గారిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్)  అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు పాలక మండలి అధిపతి గుర్రం శ్రీనివాస్ రెడ్డి శాలువతోమరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపికతో సత్కరించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ఈ సభకు అధ్యక్షత వహించారు. టాంటెక్స్ కళలకు, కళాకారులకు, సాహితీవేత్తలకు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుందని సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్  పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, సంయుక్త కోశాధికారి సింగిరెడ్డి శారద, కార్యవర్గసభ్యులు పాలేటి లక్ష్మి, మండిగ శ్రీ లక్ష్మి, గోవాడ అజయ్, తోటపద్మశ్రీ, కొణిదల లోకేష్ నాయుడు, సాహిత్య వేదిక బృంద సభ్యులు అట్లూరి స్వర్ణ, మర్తినేని మమత, దిండుకుర్తి నగేష్ పాల్గొన్నారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement