billa praveen
-
ఘనంగా టాంటెక్స్ 105 వ సాహిత్య సదస్సు
-
ఘనంగా టాంటెక్స్ 105 వ సాహిత్య సదస్సు
డాలస్/ఫోర్టువర్త్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన 'నెలనెలా తెలుగు వెన్నెల' 105వ సాహిత్య సదస్సు ఆద్యంతం భాషామృతాన్ని కుమ్మరించింది. దేశీప్లాజా టీవీ స్టుడియోలో నిర్వహించిన ఈ సదస్సులో ఉగాది కవి సమ్మేళనంతోపాటు నిర్వహించిన తెలుగు ప్రక్రియలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాహిత్యవేదిక సమన్వయకర్త బిళ్లా ప్రవీణ్ సభకు అధ్యక్షత వహించారు. ప్రారంభోపన్యాసం అనంతరం 'శ్రీ గణనాథం' గీతాలాపనతో దుర్ముఖినామ సంవత్సర కవి సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్ధండులతోపాటు ఔత్సాహికులు కవితలు, పద్యాలు, ప్రసంగాలు చేశారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 'నవల- కథన శిల్పం' అంశంపై డాక్టర్ సి. మృణాళిని ప్రసంగించారు. ప్రముఖ కవి జొన్నవిత్తుల రాసిన 'తెలుగు పద్యముల ప్రసాదం' పద్యాన్ని చిన్నారి పాలూరి ఇతిహాస శ్రావ్యంగా పఠించింది. డాక్టర్ దొడ్ల రమణ తాను రచించిన 'బంధాలు చిరకాలం ఉండవు' పద్యమాలికను చదివి వినిపించారు. వేముల లెనిన్ శ్రీశ్రీ వర్షధారను పాడారు. మద్దుకూరి చంద్రహాసన్ 'ఉగాది కవిత.. మమత' చచనను ఆహుతులతో పంచుకున్నారు. కాజా సురేశ్ సీస పద్యాన్ని, జువ్వాడి రమణ హాస్య పద్యాన్ని వినిపించారు. మాడ దయాకర్ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సేవలను కొనియాడారు. నందివాడ ఉదయ భాస్కర్ తన ఉగాది కవితలో రాజకీయాంశాలను ప్రస్తావించారు. పుదూర్ జగదీశ్వర్ పద్యాలు, పెనుగొండ ఇస్మాయిల్.. నటి మధుబాలపై రాసిన కవితను పఠించారు. ఇలా అందరికి అందరూ తమదైన విభిన్న శైలిలో తెలుగు వ్యాకరణ ప్రక్రియలో నచ్చిన అంశాన్ని ప్రదర్శించారు. సాహితీ వేదిక నిర్వహకులు ఆహూతులకు ఉప్పు- కారంతో పచ్చి మామిడి ముక్కలు, దోర జామపడ్లను అందించడంతోపాటు అచ్చతెలుగు భోజనాన్ని ఏర్పాటుచేశారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, సమన్వయకర్త బిళ్లా ప్రవీణ్, సాహిత్య వేదిక బృందం, టెంటెక్స్ కార్యవర్గం అంతా కలిసి ముఖ్యఅతిథి డాక్టర్ సి. మృణాళినిని ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా బిళ్లా ప్రవీణ్ మాట్లాడుతూ దుర్ముఖి నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని కవిసమ్మేళనం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆచార్య మృణాళినికి, ఆహూతులుగా విచ్చేసిన భాషాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పాలక మండలి అధిపతి గుర్రం శ్రీనివాసరెడ్డి, సభ్యులు రొడ్డ రామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు శీలం కృష్ణవేణి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, తక్షణపూర్వాధ్యక్షుడు డాక్టర్ ఊరిమిండి నరసింహారెడ్డి, సభ్యులు పావులూరి వేణుమాధవ్, వనం జ్యోతి, మండిగ శ్రీలక్ష్మి, పాలేటి లక్ష్మి, సాహిత్య వేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ, బసాబత్తిన శ్రీనివాసులు, జలసూత్రం చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
డల్లాస్ లో వైభవంగా సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఫిబ్రవరి 21న దేశీప్లాజా స్టూడియోలో వైభవంగా జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రవాసంలో నిరాటంకంగా 103 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. కాగా.. డాక్టర్ చుక్కా రామయ్య ‘ప్రతిభ సమత్వం’ అనే పుస్తకాన్ని మార్తినేని మమత సభకు పరిచయం చేసారు. ‘టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు’ ఏప్రిల్ 16న ఇర్వింగ్ హైస్కూల్ లో నిర్వహించనున్నారు. కార్యక్రమంలో దొడ్ల రమణ, వరిగొండ శ్యాం, య్యుని శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. -
“అక్షయంగా వెలుగొందిన యక్షగానం”
డల్లాస్/ఫోర్టువర్త్, టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ప్రతినెలా నిర్వహించే “నెల నెలా తెలుగు వెన్నెల” 102 వ సదస్సు జనవరి 24న డల్లాస్ నగరంలోని దేశీప్లాజా స్టూడియోలో 2015 సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన ప్రారంభించారు. 2016కి గానూ తెలుగు సాహిత్య వేదిక నూతన సమన్వయకర్తగా బిళ్ళ ప్రవీణ్ బాధ్యతలు చేపట్టారు. భాషా సాహిత్యాలకు పెద్ద పీట వేస్తున్న సాహిత్య వేదిక ఆశయాలను, సాహిత్య ప్రేమికులను అభినందిస్తూ సహాయ సహకారాలు కోరుతూ ఆసక్తి వున్న వారిని బిళ్ళ ప్రవీణ్ ఆహ్వానించారు. ఘంటసాల లలిత గీతాలను వీనుల విందుగా ఆలపించి, వడ్లమన్నాటి నాగేష్ మరియు కుందేటి చక్రపాణి అలనాటి మధుర గాయకుడిని మరోసారి గుర్తు చేశారు. పోతన భాగవతం నుండి పద్యాలను కుమారి దొడ్ల నిర్జర, దొడ్ల రమణ కమ్మగా పాడి వినిపించారు. బసాబత్తిన శ్రీనివాసులు వేలుపిళ్ళై కథలను పరిచయం చేస్తూ, కథా రచయిత సి. రామచంద్రరావు రాసిన 9 కథల గురించి ప్రస్తావించారు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే "చేరడం" అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుంది, ఇది ఎంతో పవిత్రమైన కాలం, దీనినే మకర సంక్రాంతి అంటారు అని జలసూత్రం చంద్రశేఖర్ వివరించారు. తెలుగు కవులు పేరడీలలో ఎంతో ప్రసిద్ధులు అని.. శ్రీశ్రీ కవిత్వాన్ని పేరడీ చెయ్యనివాడు పేరడీ కవే కాడు అని మాడ దయాకర్ వ్యాఖ్యానించారు. ప్రముఖ రచయిత శ్రీ రమణ గారు, "పిచ్చి ప్రేమ" అనే సినిమాపై సమీక్ష రాయమంటే విశ్వనాథ సత్యనారాయణ గారు హాస్య భరితంగా ఎలా రాస్తారో అనే ఊహాత్మక రచన చేశారు, దానిని మాడ దయాకర్ గారు చదివి నవ్వుల పువ్వులు పూయించారు. వేముల లెనిన్ "తల్లీ నినుదలంచి" అంటూ మాడుగుల నాగ ఫణిశర్మ గారు రచించిన గీతాన్ని పాడి వినిపించారు. డా.జువ్వాడి రమణ తెలుగు పద్యాలు చక్కగా పాడి వినిపించారు. డా.పుదూర్ జగదీశ్వరన్ ఇటీవల హ్యూస్టన్ నగరంలో ఆవిష్కరించిన తెలుగు అంతర్జాల పత్రిక "మధురవాణి" ని www.madhuravani.com ద్వారా చదువుకోవచ్చు అని తెలియచేశారు. తెలుగులో రెండు డాక్టరేట్ పట్టాలు సాధించి, నాట్యంలో జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకొన్న డా. కలవగుంట సుధ గారు "అక్షయంగా వెలుగొందిన యక్షగానం" అనే అంశం మీద మాట్లాడారు. పురాణాల గురించి, వాల్మీకి రామాయణంలో యక్షత్వం అంటే అమరత్వం, అదొక దివ్య ప్రసాదం అని తెలిపారు. మొట్ట మొదటి యక్ష గ్రంధం ప్రోలుగంటి చెన్నశౌరి రచించిన "సౌభరి చరితం", ఇది ప్రస్తుతానికి అలభ్యం, కవి కాలాదులు తెలిసినంతవరకు కందుకూరి రుద్రకవి వ్రాసిన "సుగ్రీవ విజయం" మొట్టమొదటిది అని తెలిపారు. 12వ శతాబ్దంలో పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరితము లో, మహాకవి శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో, 16వ శతాబ్దంలో అల్లసాని పెద్దన మనుచరిత్రలో ప్రవరాక్షుడు హిమవత పర్వత ప్రాంతంలో "గంధర్వ యక్ష ఘార్ణితమగు..." అనే పద్యంలో యక్షుల గురించి ప్రస్తావించారు. సుధ గారు తెలుగు నేలకు గర్వకారణం అయిన కూచిపూడి గ్రామాన్ని సందర్శించి కూచిపూడి నాట్య పండితులను కలిసి వారి అనుభవాలు సేకరించి పదిలపరిచారు. డా. కలవగుంటసుధ గారిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు పాలక మండలి అధిపతి గుర్రం శ్రీనివాస్ రెడ్డి శాలువతోమరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపికతో సత్కరించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ఈ సభకు అధ్యక్షత వహించారు. టాంటెక్స్ కళలకు, కళాకారులకు, సాహితీవేత్తలకు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుందని సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, సంయుక్త కోశాధికారి సింగిరెడ్డి శారద, కార్యవర్గసభ్యులు పాలేటి లక్ష్మి, మండిగ శ్రీ లక్ష్మి, గోవాడ అజయ్, తోటపద్మశ్రీ, కొణిదల లోకేష్ నాయుడు, సాహిత్య వేదిక బృంద సభ్యులు అట్లూరి స్వర్ణ, మర్తినేని మమత, దిండుకుర్తి నగేష్ పాల్గొన్నారు.