డాలస్/ఫోర్టువర్త్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన 'నెలనెలా తెలుగు వెన్నెల' 105వ సాహిత్య సదస్సు ఆద్యంతం భాషామృతాన్ని కుమ్మరించింది. దేశీప్లాజా టీవీ స్టుడియోలో నిర్వహించిన ఈ సదస్సులో ఉగాది కవి సమ్మేళనంతోపాటు నిర్వహించిన తెలుగు ప్రక్రియలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాహిత్యవేదిక సమన్వయకర్త బిళ్లా ప్రవీణ్ సభకు అధ్యక్షత వహించారు. ప్రారంభోపన్యాసం అనంతరం 'శ్రీ గణనాథం' గీతాలాపనతో దుర్ముఖినామ సంవత్సర కవి సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్ధండులతోపాటు ఔత్సాహికులు కవితలు, పద్యాలు, ప్రసంగాలు చేశారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'నవల- కథన శిల్పం' అంశంపై డాక్టర్ సి. మృణాళిని ప్రసంగించారు. ప్రముఖ కవి జొన్నవిత్తుల రాసిన 'తెలుగు పద్యముల ప్రసాదం' పద్యాన్ని చిన్నారి పాలూరి ఇతిహాస శ్రావ్యంగా పఠించింది. డాక్టర్ దొడ్ల రమణ తాను రచించిన 'బంధాలు చిరకాలం ఉండవు' పద్యమాలికను చదివి వినిపించారు. వేముల లెనిన్ శ్రీశ్రీ వర్షధారను పాడారు. మద్దుకూరి చంద్రహాసన్ 'ఉగాది కవిత.. మమత' చచనను ఆహుతులతో పంచుకున్నారు. కాజా సురేశ్ సీస పద్యాన్ని, జువ్వాడి రమణ హాస్య పద్యాన్ని వినిపించారు. మాడ దయాకర్ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సేవలను కొనియాడారు. నందివాడ ఉదయ భాస్కర్ తన ఉగాది కవితలో రాజకీయాంశాలను ప్రస్తావించారు. పుదూర్ జగదీశ్వర్ పద్యాలు, పెనుగొండ ఇస్మాయిల్.. నటి మధుబాలపై రాసిన కవితను పఠించారు. ఇలా అందరికి అందరూ తమదైన విభిన్న శైలిలో తెలుగు వ్యాకరణ ప్రక్రియలో నచ్చిన అంశాన్ని ప్రదర్శించారు.
సాహితీ వేదిక నిర్వహకులు ఆహూతులకు ఉప్పు- కారంతో పచ్చి మామిడి ముక్కలు, దోర జామపడ్లను అందించడంతోపాటు అచ్చతెలుగు భోజనాన్ని ఏర్పాటుచేశారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, సమన్వయకర్త బిళ్లా ప్రవీణ్, సాహిత్య వేదిక బృందం, టెంటెక్స్ కార్యవర్గం అంతా కలిసి ముఖ్యఅతిథి డాక్టర్ సి. మృణాళినిని ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా బిళ్లా ప్రవీణ్ మాట్లాడుతూ దుర్ముఖి నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని కవిసమ్మేళనం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆచార్య మృణాళినికి, ఆహూతులుగా విచ్చేసిన భాషాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పాలక మండలి అధిపతి గుర్రం శ్రీనివాసరెడ్డి, సభ్యులు రొడ్డ రామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు శీలం కృష్ణవేణి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, తక్షణపూర్వాధ్యక్షుడు డాక్టర్ ఊరిమిండి నరసింహారెడ్డి, సభ్యులు పావులూరి వేణుమాధవ్, వనం జ్యోతి, మండిగ శ్రీలక్ష్మి, పాలేటి లక్ష్మి, సాహిత్య వేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ, బసాబత్తిన శ్రీనివాసులు, జలసూత్రం చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా టాంటెక్స్ 105 వ సాహిత్య సదస్సు
Published Fri, Apr 29 2016 2:49 PM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM
Advertisement