టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' 209 వ సాహిత్య సదస్సు | TANTEX Hosts Grand 208th Literary Session Nela Nela Telugu Vennela | Sakshi
Sakshi News home page

టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' 209 వ సాహిత్య సదస్సు

Published Thu, Dec 19 2024 4:52 PM | Last Updated on Thu, Dec 19 2024 4:52 PM

TANTEX Hosts Grand 208th Literary Session Nela Nela Telugu Vennela

డాలస్‌లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగు వెన్నెల' 209వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. సదస్సు  ప్రారంభ సూచికగా మోహన రాగంలో త్యాగరాయ కృతి  'రామా నన్ను బ్రోవరా' కీర్తనను చిరంజీవి సమన్విత మాడా తన మధుర కంఠంతో పాడి సాహితీ ప్రియులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. ముందుగా దివంగతులైన టాంటెక్స్ పూర్వ అధ్యక్షులు లావు రామకృష్ణ గారికి సభ్యులందరూ  ఒక నిముషము మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

స్వాగతోపన్యాసం చేసిన  పాలక మండలి సభ్యులు, సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్  మాడా గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ సాహిత్య వేదికను ప్రతి నెల 3వ ఆదివారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి  డి పి అనురాధ గారి జీవిత విశేషాలను,అ ఖండ  తెలుగుజాతి పూర్వాపరాలను తెలుసుకోవడానికి వారు చేస్తున్నఎనలేని కృషిని చక్కగా వివరించారు.  

ఇక సీనియర్ పాత్రికేయులు డి పి అనురాధ మాట్లాడుతూజజ  తెలుగు జాతి  చరిత్రను పాఠ్య పుస్తకాలలో చదివిన తాను తన గురువు తల్లాప్రగడ సత్యనారాయణ గారి మార్గదర్శకత్వంలోనూ తన అత్తమామల ప్రోత్సాహంతోనూ దాదాపు రెండువేల సంవత్సరాల నుంచి  నేటివరకూ  ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడుతున్న తెలుగు జాతి వారి  మూలాలను అన్వేషిస్తూ   పరిశోధక దృష్టితో అనేక దేశాలు  పర్యటించినట్లు తెలియచేశారు. ఆగ్నేయాసియా దేశాల్లో స్థిరపడిన  తెలుగుజాతివారిని కలుసుకొని వారి పుట్టుపూర్వోత్తరాలు  వారి  భాషాభిమానం  అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. అంతేగాదు ఆదిమ తెలుగు జాతి ప్రాచీన ప్రాభవం  ఈ రోజుకి ఎలా గుబాళిస్తోందో తనదైన శైలిలో చక్కగా వివరించారు. 

శ్రీలంక, మయన్మార్, వియత్నాం, థాయ్‌లాండ్, కంబోడియా,ఇండోనేషియాల్లో ముఖ్యమైన పట్టణాలు, మారుమూల పల్లెలు తిరిగిన తాను ఆయా ప్రదేశాల్లో తెలుగు వారి అడుగుజాడలను పరిశీలంచిన వైనాన్ని చక్కగా విశదీకరించారు. ఆయాదేశాల చారిత్రక స్థలాలలోనున్న స్థూపాలు,  శాసనాలు  పరిశీలించి, వాంగ్మయంలోను, వలస వెళ్ళిన వారి భాషలోను, వారి జ్ఞాపక కథనాలలోను,  విడి విడిగా ఉన్న సమాచారాన్ని తనదైన పద్ధతిలో క్రోడీకరించి  అన్వయించి చెప్పారు. అలాగే వారి పూర్వీకులు మన ఆంధ్ర ప్రాంతం నుంచి బతుకుతెరువు కోసం తప్పనిసరై ఇతర దేశాలకు వెళ్లడం  జరిగిందన్నారు. 

ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో వారి పూర్వీకులు కట్టిన గుడి గోపురాలు కట్టిన విధానం, వారి వ్యవసాయ పద్ధతులు, వ్యాపార ధృక్పథం తాను పరిశీలించడం జరిగిందన్నారు.  వారి ఆచార వ్యవహారాల్లోనూ    జీవన    వైవిధ్యం, కళాకారుల ఉత్తమ కృషి, వారి పనితనం మనం   స్పష్టంగా చూడ వచ్చునన్నారు. ‘మన్’జాతిలో మనవాళ్ళను, థాయ్‌లాండ్ ‘చిమ్మయి’  పిల్లను,, ద్వారావతి, హరిపుంజాయి వంటి థాయ్ ప్రాంతాల్లో మన పూర్వీకుల విశేషాలను, తెలుగు చీర చుట్టిన ‘చామదేవి’  చంపాలో ‘భద్రేశ్వరుని’, అక్కడ బంగారు తాపడాలు చేసిన ఘననిర్మాణాలు, శిల్పాలు చెక్కిన తెలుగు సంతతి వారి పూర్వీకుల తపనల స్వరూప విశేషాలను అనూరాధ గారు వివరించారు. 

శ్రీలంకకు మన శ్రీకాకుళానికి గల సత్సంబంధాన్ని చక్కగా వివరిస్తూ కొన్ని చోట్ల  తాను ''మీరెవరు'' అని పలకరించిన వెంటనే   ప్రతివారు తమ సమాధానంగా ''అక్కా ''అంటూ ప్రతిస్పందించడం తననెంతో ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఆయాప్రాంతాల్లో  ఏళ్ల తరబడి నివసిస్తున్న తెలుగు  వారు తమ భాషా సంస్కృతిని కాపాడుకొంటూ రాబోయే కాలంలో   ఏదో ఒకరోజు ఆంధ్రా ప్రాంతమునుంచి ''తలైవా '' అంటే ''తెలుగు మాట్లాడే గౌరవప్రదమైన నాయకుడు'' తప్పకుండా వస్తారనీ వారు  తమ ఉనికిని గుర్తిస్తారనే ఆశతో బ్రతుకుతునారని వారి జీవన సరళిని కళ్ళకు కట్టినట్లు విశదీకరించారు. తమిళ జాతి వారితో కలిసి మన తెలుగు వారు  నివసిస్తున్న చోట్ల సింహ పురి, దంతపురి పేర్లతో పిలువ బడే నగరాలుండేవని పేర్కొన్నారు. అలాగే ,''విమల''''విజయ''అనే పేరుతో పిలువబడేవారు..  చాలా చోట్ల కనిపించారని,  కొన్ని చోట్ల మన తెలుగువారు తమ వారిని ఇంటిలో తెలుగు పేరుతోనూ బయట పని చేసేచోట తమిళ పేరుతోనూ పిలుచుకుంటున్నట్లు చెప్పారు. ఈ   విధానాన్ని పాటిస్తున్న వైనం తన దృష్టికి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఆగ్నేయాసియాలో తెలుగు వెలుగుని దేదీప్యమానం చేసే అఖండ తెలుగుజాతి విశేషాలను తాను శోధించిన పలు అంశాలను  అనూరాధ గారు సోదాహరణంగా వివరించి సాహితీప్రియుల నుండి విశేష అభినందనలు అందుకొన్నారు.

గత 79 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక ''మన తెలుగు సిరి సంపదలు''శీర్షికన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం రసవత్తరంగా సాగింది. తర్వాత ప్రముఖ సాహితీ విమర్శకులు లెనిన్ వేముల పలనాడు జిల్లా మాచర్ల కేంద్రంగా జన చైతన్య సాహిత్య విస్తృతికి విశేషంగా పాటుపడి, పౌరహక్కుల ఉద్యమాలకు 70వ దశకం నుండి 30 యేళ్ళ  సుదీర్ఘ కాలంగా వెన్నంటి నిలిచి,  చివరి వరకూ నమ్మిన విలువలకు కట్టుబడి జీవించి నాయకత్వ కుశలతతో ఎందరినో ఉత్తమ ఆశయాల వైపు ఆకర్షింపజేసి గతవారం కన్నుమూసిన కామ్రేడ్  రామినేని సాంబశివరావు కోసం అలనాటి విప్లవ గేయాలనెన్నో ఆలపించి అంజలి  ఘటించారు.

తరువాత  సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా  2024  సంవత్సరంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ మున్నెన్నడూ  లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలుగు సాహిత్య సదస్సుల విశేషాలనూ ప్రధాన వక్తలైన ముఖ్య అతిథుల ప్రజ్ఞా పాటవాలను ''సింహావలోకనం''లో  ఒక్కొక్క నెల వారీగా చక్కగా  వివరించారు

సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, చిన్న సత్యం వీర్నాపు , ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, లెనిన్ బండ, మూలింటి రాజ శేఖర్ , మాధవి సుంకిరెడ్డి , భాను, కొల్లారపు ప్రకాశరావు శర్మ, గోవర్ధనరావు నిడిగంటి వంటి సాహితీ ప్రియులు  డి పి అనురాధ  గారి ప్రసంగంపై తమ తమ ప్రతిస్పందనలు తెలియచేశారు.  

తర్వాత ఉత్తర  టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్  ప్రస్తుత అధ్యక్షులు సతీష్  బండారు సంస్థ పాలక మండలి సభ్యులు, సమన్వయ కర్త దయాకర్ మాడ ముఖ్య అతిథి డి పి అనురాధ  గారికి   సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి ఘనంగా సన్మానించడం జరిగింది. ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈ సన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని పేర్కొంటూ డి పి అనురాధ తన ప్రతిస్పందనలో కృతజ్ఞతను వెలిబుచ్చారు.

చివరగా ఉత్తర  టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సమన్వయ కర్త దయాకర్  మాడ వందన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సతీష్ బండారు తమ అధ్యక్షోపన్యాసంలో సంస్థ పూర్వాధ్యక్షులకూ సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన  ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు, సమన్వయ కర్త  దయాకర్ మాడా, సంస్థ పాలక  మండలి అధికార కార్యవర్గ బృందం సభ్యులకు అభినందనలు తెలిపారు.

                                                 

(చదవండి: ఫిలడెల్ఫియాలో నాట్స్ బాలల సంబరాలకు అద్భుత స్పందన)

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement