డల్లాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సును సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్రవాసంలో నిరాటంకంగా 136 నెలలు పాటు ఉత్తమ సాహితీవేత్తల మధ్య సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి, ఉత్సాహంగా పాల్గొని సభని జయప్రదం చేశారు.
కార్యక్రమంలో ముందుగా మంజుల తెలిదేవర శిష్య బృందం వృంద, సంజన, హమ్సిక, అంటోనియో ప్రార్ధనా గీతంతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. తరువాత సింధూర, సాహితి వేముల అన్నమాచార్య కృతి ఆలపించారు. డా. ఊరిమిండి నరసింహారెడ్డి మన తెలుగు సిరి సంపదలు శీర్షికన, నానుడి, జాతీయాలు, పొడువు కథలు గురించి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు. చంద్రహాస్ మద్దుకూరి ‘రగిలింది విప్లవాగ్ని ఈ రోజు’ పాట పూర్వాపరాలు వివరించారు. అలాగే దానిలో ఉపయోగించిన చరిత్ర, అల్లూరికి కలిగించిన ప్రేరణ వివరించారు. లెనిన్ వేముల తెలుగు శాసనాల చరిత్రని, పరిణామక్రమాన్ని వివరించారు. డా. పుదూర్ జగదీశ్వరన్ ఆముక్తమాల్యదలోని కొన్ని పద్యాలను రాగ యుక్తంగా చదివి వాటి అర్ధం వివరించారు. డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి రాగ యుక్తంగా ఎంకి పాటలు పాడి అలరించారు.
ముఖ్య అతిధి మల్లవరపు అనంత్‌ని మద్దుకూరి చంద్రహాస్ సభకు పరిచయం చేయగా, టాంటెక్స్ పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రమణ్యం పుష్పగుచ్చంతో సత్కరించారు. మల్లవరపు అనంత్ మాట్లాడుతూ.. శ్రీ శ్రీ ప్రముఖంగా అభ్యుదయ కవి, విప్లవ కవి అని, అలాంటి శ్రీ శ్రీ రచనలలోనుండి హాస్యం వెతకడం సాహసమే అవుతుందన్నారు. శ్రీ శ్రీ వ్రాసిన సిప్రాలి (సిరి సిరి మువ్వలు, ప్రాసక్రీడలు, లిమఋక్కులు ) పుస్తకాన్ని కూలంకషంగా పరిశీలించి దానిలోని హాస్యాన్ని సభికులకు పంచి సభలో నవ్వులు పూయించారు. కేవలం నవ్వు పుట్టించడం కోసమే కాకుండా చైతన్యం, విమర్శ, సామాజిక ప్రయోజనం లక్ష్యంగా శ్రీ శ్రీ రచనలలో హాస్యం తొణికిసలాడిందని పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని మొదటి తరం సాహితీ వేత్తలు ముందు తరాల కందించే విధానానికి అమెరికాలోని సాహితీ వేత్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
అనంత్ మల్లవరపుని టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షురాలు శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు, కోశాధికారి పాలేటి లక్ష్మి పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంత్ మల్లవరపు తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిథ్యం అందించిన టాంటెక్స్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. టాంటెక్స్ అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం మాట్లాడుతూ అనంత్ మల్లవరపు సాహిత్య సేవలను కొనియాడారు. సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment