TANTEX
-
టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' 209 వ సాహిత్య సదస్సు
డాలస్‌లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగు వెన్నెల' 209వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. సదస్సు ప్రారంభ సూచికగా మోహన రాగంలో త్యాగరాయ కృతి 'రామా నన్ను బ్రోవరా' కీర్తనను చిరంజీవి సమన్విత మాడా తన మధుర కంఠంతో పాడి సాహితీ ప్రియులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. ముందుగా దివంగతులైన టాంటెక్స్ పూర్వ అధ్యక్షులు లావు రామకృష్ణ గారికి సభ్యులందరూ ఒక నిముషము మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.స్వాగతోపన్యాసం చేసిన పాలక మండలి సభ్యులు, సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ సాహిత్య వేదికను ప్రతి నెల 3వ ఆదివారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి డి పి అనురాధ గారి జీవిత విశేషాలను,అ ఖండ తెలుగుజాతి పూర్వాపరాలను తెలుసుకోవడానికి వారు చేస్తున్నఎనలేని కృషిని చక్కగా వివరించారు. ఇక సీనియర్ పాత్రికేయులు డి పి అనురాధ మాట్లాడుతూజజ తెలుగు జాతి చరిత్రను పాఠ్య పుస్తకాలలో చదివిన తాను తన గురువు తల్లాప్రగడ సత్యనారాయణ గారి మార్గదర్శకత్వంలోనూ తన అత్తమామల ప్రోత్సాహంతోనూ దాదాపు రెండువేల సంవత్సరాల నుంచి నేటివరకూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడుతున్న తెలుగు జాతి వారి మూలాలను అన్వేషిస్తూ పరిశోధక దృష్టితో అనేక దేశాలు పర్యటించినట్లు తెలియచేశారు. ఆగ్నేయాసియా దేశాల్లో స్థిరపడిన తెలుగుజాతివారిని కలుసుకొని వారి పుట్టుపూర్వోత్తరాలు వారి భాషాభిమానం అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. అంతేగాదు ఆదిమ తెలుగు జాతి ప్రాచీన ప్రాభవం ఈ రోజుకి ఎలా గుబాళిస్తోందో తనదైన శైలిలో చక్కగా వివరించారు. శ్రీలంక, మయన్మార్, వియత్నాం, థాయ్‌లాండ్, కంబోడియా,ఇండోనేషియాల్లో ముఖ్యమైన పట్టణాలు, మారుమూల పల్లెలు తిరిగిన తాను ఆయా ప్రదేశాల్లో తెలుగు వారి అడుగుజాడలను పరిశీలంచిన వైనాన్ని చక్కగా విశదీకరించారు. ఆయాదేశాల చారిత్రక స్థలాలలోనున్న స్థూపాలు, శాసనాలు పరిశీలించి, వాంగ్మయంలోను, వలస వెళ్ళిన వారి భాషలోను, వారి జ్ఞాపక కథనాలలోను, విడి విడిగా ఉన్న సమాచారాన్ని తనదైన పద్ధతిలో క్రోడీకరించి అన్వయించి చెప్పారు. అలాగే వారి పూర్వీకులు మన ఆంధ్ర ప్రాంతం నుంచి బతుకుతెరువు కోసం తప్పనిసరై ఇతర దేశాలకు వెళ్లడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో వారి పూర్వీకులు కట్టిన గుడి గోపురాలు కట్టిన విధానం, వారి వ్యవసాయ పద్ధతులు, వ్యాపార ధృక్పథం తాను పరిశీలించడం జరిగిందన్నారు. వారి ఆచార వ్యవహారాల్లోనూ జీవన వైవిధ్యం, కళాకారుల ఉత్తమ కృషి, వారి పనితనం మనం స్పష్టంగా చూడ వచ్చునన్నారు. ‘మన్’జాతిలో మనవాళ్ళను, థాయ్‌లాండ్ ‘చిమ్మయి’ పిల్లను,, ద్వారావతి, హరిపుంజాయి వంటి థాయ్ ప్రాంతాల్లో మన పూర్వీకుల విశేషాలను, తెలుగు చీర చుట్టిన ‘చామదేవి’ చంపాలో ‘భద్రేశ్వరుని’, అక్కడ బంగారు తాపడాలు చేసిన ఘననిర్మాణాలు, శిల్పాలు చెక్కిన తెలుగు సంతతి వారి పూర్వీకుల తపనల స్వరూప విశేషాలను అనూరాధ గారు వివరించారు. శ్రీలంకకు మన శ్రీకాకుళానికి గల సత్సంబంధాన్ని చక్కగా వివరిస్తూ కొన్ని చోట్ల తాను ''మీరెవరు'' అని పలకరించిన వెంటనే ప్రతివారు తమ సమాధానంగా ''అక్కా ''అంటూ ప్రతిస్పందించడం తననెంతో ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఆయాప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న తెలుగు వారు తమ భాషా సంస్కృతిని కాపాడుకొంటూ రాబోయే కాలంలో ఏదో ఒకరోజు ఆంధ్రా ప్రాంతమునుంచి ''తలైవా '' అంటే ''తెలుగు మాట్లాడే గౌరవప్రదమైన నాయకుడు'' తప్పకుండా వస్తారనీ వారు తమ ఉనికిని గుర్తిస్తారనే ఆశతో బ్రతుకుతునారని వారి జీవన సరళిని కళ్ళకు కట్టినట్లు విశదీకరించారు. తమిళ జాతి వారితో కలిసి మన తెలుగు వారు నివసిస్తున్న చోట్ల సింహ పురి, దంతపురి పేర్లతో పిలువ బడే నగరాలుండేవని పేర్కొన్నారు. అలాగే ,''విమల''''విజయ''అనే పేరుతో పిలువబడేవారు.. చాలా చోట్ల కనిపించారని, కొన్ని చోట్ల మన తెలుగువారు తమ వారిని ఇంటిలో తెలుగు పేరుతోనూ బయట పని చేసేచోట తమిళ పేరుతోనూ పిలుచుకుంటున్నట్లు చెప్పారు. ఈ విధానాన్ని పాటిస్తున్న వైనం తన దృష్టికి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఆగ్నేయాసియాలో తెలుగు వెలుగుని దేదీప్యమానం చేసే అఖండ తెలుగుజాతి విశేషాలను తాను శోధించిన పలు అంశాలను అనూరాధ గారు సోదాహరణంగా వివరించి సాహితీప్రియుల నుండి విశేష అభినందనలు అందుకొన్నారు.గత 79 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక ''మన తెలుగు సిరి సంపదలు''శీర్షికన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం రసవత్తరంగా సాగింది. తర్వాత ప్రముఖ సాహితీ విమర్శకులు లెనిన్ వేముల పలనాడు జిల్లా మాచర్ల కేంద్రంగా జన చైతన్య సాహిత్య విస్తృతికి విశేషంగా పాటుపడి, పౌరహక్కుల ఉద్యమాలకు 70వ దశకం నుండి 30 యేళ్ళ సుదీర్ఘ కాలంగా వెన్నంటి నిలిచి, చివరి వరకూ నమ్మిన విలువలకు కట్టుబడి జీవించి నాయకత్వ కుశలతతో ఎందరినో ఉత్తమ ఆశయాల వైపు ఆకర్షింపజేసి గతవారం కన్నుమూసిన కామ్రేడ్ రామినేని సాంబశివరావు కోసం అలనాటి విప్లవ గేయాలనెన్నో ఆలపించి అంజలి ఘటించారు.తరువాత సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా 2024 సంవత్సరంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ మున్నెన్నడూ లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలుగు సాహిత్య సదస్సుల విశేషాలనూ ప్రధాన వక్తలైన ముఖ్య అతిథుల ప్రజ్ఞా పాటవాలను ''సింహావలోకనం''లో ఒక్కొక్క నెల వారీగా చక్కగా వివరించారుసంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, చిన్న సత్యం వీర్నాపు , ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, లెనిన్ బండ, మూలింటి రాజ శేఖర్ , మాధవి సుంకిరెడ్డి , భాను, కొల్లారపు ప్రకాశరావు శర్మ, గోవర్ధనరావు నిడిగంటి వంటి సాహితీ ప్రియులు డి పి అనురాధ గారి ప్రసంగంపై తమ తమ ప్రతిస్పందనలు తెలియచేశారు. తర్వాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు సంస్థ పాలక మండలి సభ్యులు, సమన్వయ కర్త దయాకర్ మాడ ముఖ్య అతిథి డి పి అనురాధ గారికి సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి ఘనంగా సన్మానించడం జరిగింది. ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈ సన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని పేర్కొంటూ డి పి అనురాధ తన ప్రతిస్పందనలో కృతజ్ఞతను వెలిబుచ్చారు.చివరగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సమన్వయ కర్త దయాకర్ మాడ వందన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సతీష్ బండారు తమ అధ్యక్షోపన్యాసంలో సంస్థ పూర్వాధ్యక్షులకూ సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు, సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి అధికార కార్యవర్గ బృందం సభ్యులకు అభినందనలు తెలిపారు. (చదవండి: ఫిలడెల్ఫియాలో నాట్స్ బాలల సంబరాలకు అద్భుత స్పందన) -
టాంటెక్స్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
-
తెలుగుభాషకు పట్టం కట్టిన డల్లాస్ సాహితీ సదస్సు
-
డాలస్‌లో యజ్ఞేశ్వర శతక పద్యగాన మహోత్సవం
డాలస్ (టెక్సాస్): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) లు సంయుక్తంగా యజ్ఞేశ్వర శతకము పద్యగాన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాయి. డాలస్ మెట్రో ఏరియాలో ఫ్రిస్కో నగరంలో నెలకొనిఉన్న కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో వేడుకలు వైభవంగా జరిగాయి. డాలాస్-ఫోర్ట్ వర్త్ తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన సాహితీ ప్రియులందరికీ సాదర స్వాగతం పలికి, తానా మరియు టాంటెక్స్ సంస్థలు కలసి పనిచేస్తూ మున్ముందు కూడా అనేక మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. అలాగే తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు సారధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక సాహిత్య, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం అని, అందరూ తానా కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సభాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. జొన్నవిత్తుల మంచి ప్రజాదరణ పొందిన సినిమా పాటలు ఎన్నో రాశారని, సాధారణంగా సినీగీత రచయితలు సినీ రంగానికే పరిమితం అవుతారని కాని కవి జొన్నవిత్తుల అనేక సామాజిక స్పృహకలిగిన పేరడీలు, దండకాలు, దాదాపు 30 శతకాలను రాశారన్నారు. తెలుగువేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఈరోజు సకల దేవతా మూర్తులు కొలువైనటువంటి పవిత్ర కార్య సిద్ది హనుమాన్ దేవాలయంలో తనకు దైవదర్శనం ఒక దివ్యమైన అనుభూతినిచ్చింది అని, ప్రకాశరావు గారు హిందూ మతం, ధర్మం కోసం చేస్తున్న కృషి, తపన చాలా గొప్పవని అభినందించారు. జొన్నవిత్తులని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) కార్యవర్గ బృందం శాలువా, జ్ణాపిక అందించారు. అదే విధంగా 21వ శతాబ్దపు శతక సార్వభౌమ అనే బిరుదుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ తోటకూర, డాక్టర్ పుదూర్ జగదీశ్వరన్, శ్రీకాంత్ పోలవరపు, సతీష్ కొమ్మన, చినసత్యం వీర్నపు, సతీష్ బండారు, భానుమతి ఇవటూరి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, వెంకట్ ములుకుట్ల, లోకేష్ నాయుడు కొణిదల, ఊరిమిండి నరసింహా రెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, ప్రకాశరావు వెలగపూడి, లెనిన్ వీర, విజయ్ కొల్లపనేని, కృష్ణమోహన్ రెడ్డి, వెంకట్, డా. రతీరెడ్డి, సాగర్ అండవోలు, చంద్రహాస్ మద్దుకూరి, పాలేటి లక్ష్మి, కళ్యాణి తాడిమేటి తో సహా ఎంతో మంది భాషాభీమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారికి, సభ విజయవంతం కావడానికి సహకరించిన వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు. చదవండి: డాలస్‌లో వైభవంగా శ్రీనివాస కల్యాణం -
మహాత్ముడికి టాంటెక్స్ నివాళులు
టెక్సాస్: జనవరి 30న జాతిపిత గాంధీజీ వర్ధంతి. సత్యం, అహింస మార్గాలే తన ఆయుధాలని చెప్పిన మహోన్నతుడాయన. 20వ శతాబ్దంలో భారత దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్య పాలన నుంచి విముక్తి చేసేందుకు ముందుండి పోరాడారు. చేతిలో కర్ర పట్టుకుని, నూలు వడికి, మురికి వాడలు శుభ్రం చేసి, అన్ని మతాలు, కులాలు ఒక్కటే అని చాటి చెప్పారు, సత్యం, అహింస అనేవి తన ఆయుధాలని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. బ్రిటిష్ పాలకుల చేతుల్లోంచి భారతమాతకు విముక్తి కలిగించిన మహోన్నతుడు గాంధీ. గాంధీ వర్ధంతి సందర్భంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సభ్యులందరి తరపున టాంటెక్స్ అద్యక్షురాలు లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి, సహాయ కార్యదర్శిగా శ్రీకాంత్ రెడ్డి జొన్నల స్థానికంగా జాఫర్ సన్ పార్క్, అర్వింగ్‌లోని మహాత్ముడి విగ్రహానికి పుష్పగుచ్చం సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల సేవలను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. (చదవండి: సాగువీరుడా ! సాహిత్యాభివందనం) -
డల్లాస్‌లో 160వ తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
డల్లాస్: ప్రతి ఏటా జరిగే ఈ మాసపు వెన్నెల (నవంబరు) ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 160వ నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు డాలస్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డాలస్ నగర పరిధిలోని తెలుగు వారే కాకుండా ఆస్టిన్, టెక్సాస్ నగరాలకు చెందిన తెలుగు వారు సైతం హజరయ్యారు. సోమవారం జరిగిన ఈ సాహిత్య మాసపు సదస్సు ఎప్పటిలాగే చిన్నారులు సాహితి వేముల, సిందూర వేముల ‘తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ’ అనే రామదాసు కీర్తన ఆలాపనతో ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ద్రవిడ విశ్వ విద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మనుచరిత్ర-తాత్విక ప్రతీకాత్మకత అన్న అంశంపై ప్రసంగించారు. దీనిపై ఆయన పరిపూర్ణాభ్యాసం, విస్తారమైన సాహిత్య విశ్లేషణ నేపథ్యంలో ఆచార్యులు మనుచరిత్ర రచనపై లోతైన చర్చ చేశారు. అల్లసాని వారి కావ్యంలోని రహస్యాలనెన్నో విప్పి చెప్పి సాహిత్య విజ్ఞానాన్ని సభలో పంచుకున్నారు. భాషాశాస్త్రం, పదాల ఉత్పత్తి, భారతీయ ఇతర భాషా సాహిత్యాలు, తెలుగు సాహిత్య చరిత్ర లాంటి అంశాలపై వారికున్న లోతైన పరిచయాన్ని మనుచరిత్ర కావ్య విశ్లేషణకు సాధనాలుగా ఉపకరించాయి. అల్లసాని వారు కథానాయకుడి పేరును ప్రవరుడుగా నామకరణం చేసిన నేపథ్యాన్ని ఆచార్యులు అద్భుతంగా సభలో అందరికి వివరించారు. చివరిలో ఆయన సత్‌చిత్ ఆనంద్ అనే పదాలు భారతీయ ఆధ్యాత్మిక చింతనాసరళికి ఏవిధంగా స్పష్టతను చేకూర్చాయో విశదీకరించారు. ప్రధాన వక్త ప్రసంగానికి ముందు ప్రతీ మాసం ఎంతో ఆదరణ పొందుతున్న “మనతెలుగు సిరి సంపదలు” ధారావాహికలో భాగంగా ఉరుమిండి నరసింహా రెడ్డి జాతీయాలు, పొడుపు కథల పరంపరను కొనసాగించారు. తెలుగు సాహిత్య ప్రపంచంలోని ప్రసిద్ద కవితాపంక్తులను, ప్రశ్నలు జవాబుల రూపంలో సంధిస్తూ సభకు హాజరైన వారిని చర్చలో భాగస్వామలు చేశారు. ఇక ఉపద్రష్ట సత్యం ‘పద్య సౌగంధం’శీర్షికన సాహితీ సమరాంగణ సార్వభౌముడు విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలోని పద్యాలను విశ్లేషించారు. పక్షి రాజు గరుత్మంతుడి శక్తిని విశ్వరూపదర్శనంగా చూపిన రాయల వారి కావ్యరచనలోని అర్థాలను, అలంకారాలను ఆయన చక్కగా వివరించారు. అదే విధంగా జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ‘మాసానికో మహనీయుడు’ అనే శీర్షిక కొనసాగింపుగా, నవంబరు మాసంలో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులను ప్రజెంటేషన్ ద్వారా సభలో గుర్తుకు తెచ్చారు. అనంతరం డాక్టర్ బల్లూరి ఉమాదేవి కార్తీక మాసవైశిష్ట్యాన్ని గుర్తు చేస్తూ.. వారు రాసిన స్వీయ పద్యకవితను పఠించారు. మరొక అంశంలో లెనిన్ బాబు వేముల కాళిదాస మహాకవి ఇప్పుడున్న భారతంలోని ఏ ప్రాంతపు వాడయి ఉంటాడో అన్న అంశంపై చర్చ జరిపారు. ఈ సదస్సు చివరిలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు మాట్లాడుతూ.. సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న ద్రవిడ విశ్వ విద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి, ప్రార్థనా గీతం పాడిన సాహితి,సింధూరలతో పాటు మిగిలిన వక్తలకు, సభకు హజరైన సాహిత్య అభిమానులందరికి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో తెలుగువెన్నెల సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 158వ ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు డల్లాస్‌లో చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్ విచ్చేసి “ఆధునికతకు అడుగుజాడ-గురజాడ” అన్న అంశం మీద మాట్లాడటం జరిగింది. ఈ మాసపు నెలనెలా తెలుగు వెన్నెల నవయుగ కవి, వైతాళికుడు గురజాడ అప్పారావు స్మరణతో ఆసాంతం నిండుగా సాగింది. గురజాడ వారి జయంతి ఈ మాసంలోనే ఉండడం వక్తలకు ఆ మహాకవి ఆశయాల పునఃచర్చపై ఉత్సాహాన్ని కలిగించింది. ప్రారంభంలో చిన్నారులు సాహితి , సిందూర “శివుడు తాండవము సేయునమ్మా” అంటూ పరమేశుడి పై భక్తి గీతం పాడడం జరిగింది. ఎప్పూడూ చివరి అంశంగా ఉండే ప్రధాన వక్త ప్రసంగం ఈ మారు మొదటి అంశంగా ఉండడం ఒక విశేషమైతే అద్భుతమైన పాండిత్యంతో కూడిన ప్రసంగాన్నందిన ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్ ధాటి ఎన్నదగిన మరొక విశేషం. “ఆధునికతకు అడుగుజాడ-గురజాడ” అన్న అంశం పై చర్చ చేస్తూ రవికుమార్ గురజాడ కేవలం వైతాళికుడే కాక, ముందు చూపు గలిగిన గొప్ప తాత్వికుడు అని గుర్తుచేయడం జరిగింది. సమకాలీన సమాజంలో పీడనకు గురైన స్త్రీ జాతిని మొదటగా జాగృతం చేసిన ఒక యోధుడుగా గురజాడ వారిని తలచుకోవడం జరిగింది. ఎప్పటివలెనే “మనతెలుగు సిరి సంపదలు” శీర్షికన జాతీయాలు, పొడుపు కథల పరంపరను ఉరుమిండి నరసింహా రెడ్డి కొనసాగించారు. వాటికి తోడుగా తెలుగు సాహితీ జగత్తులోని ప్రసిద్ద కవితా పంక్తులను, కొన్ని ప్రహేళికలను ప్రశ్నలు జవాబుల రూపంలో సదస్యులందరినీ చర్చలో భాగస్వాములును చేయడం జరిగింది. ఉపద్రష్ట సత్యం పద్య సౌగంధం శీర్షికన మల్లిఖార్జున భట్టు విరచిత భాస్కరరామాయణంలోని చక్కని శార్దూల పద్యాన్ని అర్థతాత్పర్య సహిత విశేషాలతో వివరించడం జరిగింది. సీతను చెరబట్టడం అతడి నాశనానికే అని హనుమంతుల వారు రావణుడికి చేసిన హెచ్చరికయే పద్యంలోని సారాంశంగా ఉపద్రష్ట వారు వివరించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం “మాసానికో మహనీయుడు” అనే శీర్షక కొనసాగింపుగా, సెప్టెంబరు మాసంలో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులను ప్రజెంటేషన్ ద్వారా సభకు గుర్తు చేసి స్మరణకు తెచ్చారు. గురజాడ, జాషువా లాంటి ఎందరో మహనీయులు జన్మించిన మాసమిదని సుబ్రహ్మణ్యం సభకు గుర్తు చేశారు. చివరి రెండు అంశాలుగా లెనిన్ బాబు వేముల, మద్దుకూరి చంద్రహాస్ గురజాడ వారిని, ప్రారంభ దశలో వారు రాసిన రచనలనూ, ఆంగ్ల సాహిత్యం పై వారి ప్రవేశాన్ని గురించి సహృదయంతో గుర్తు తెచ్చి నివాళులర్పించారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ కృష్ణా రెడ్డి కోడూరు ముఖ్య అతిధి శ్రీ ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్కి, ప్రార్థనా గీతం పాడిన సాహితి,సింధూరలకి, మిగిలిన వక్తలకి,విచ్చేసిన సాహిత్య అభిమానులకి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక సాహిత్య ప్రియులు మాధవి రాణి, శశికళ పట్టిసీమ, విష్ణు ప్రియ, మాధవి ముగ్ధ ,శ్రీనివాస్ బసాబత్తిన, ప్రసాద్ తోటకూర, సురేష్ కాజా, చంద్రహాస్, ఆచార్యులు జగదీశ్వరన్ పూదూరు, ఉత్తరాధ్యక్షురాలు లక్ష్మి పాలేటి, పూర్వాధ్యక్షుడు చిన సత్యం వీర్నపు,తెలుగు, సునిల్ కుమార్,తవ్వా వెంకటయ్య ,సుబ్బ రాయుడు ,బసవ రాజప్ప తదితర్లు హాజరయ్యారు. -
'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సు
డల్లాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో 13వ సాహిత్య సదస్సు వార్షికోత్సవం ఘనంగా జరిగింది. 156వ "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సును వారాంతంలో డల్లాస్‌లో నిర్వహించారు. జూమ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డా.కె.గీతా మాధురి, శారదా కాసీవజ్జల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వేములపల్లి శ్రీకృష్ణ రచించిన "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా" అనే ప్రార్థనా గీతంతో సాహితి, సింధూ ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. అనంతరం డా.ఊర్మిండి నరసింహా రెడ్డి మన తెలుగు సిరిసంపదలు అనే జాతీయాలను, పొడుపు కథలను వివరించారు. డాక్టర్ ఉపద్రష్ట సత్యం శ్రీకృష్ణదేవరాయల “ఆముక్త మాల్యద” ప్రబంధం నుండి – “పూచినమావులం దవిలి.. పరుమేలు తీరినన్” అన్నవసంతఋతు వర్ణన పద్యాన్ని భావయుక్తం గా చదివి అందులోని విశేషాలను వివరించారు. ఆ పద్యంలో రాయలవారు “శ్రీచణుడు” అన్న అద్భుతమైన పదప్రయోగంతో ఆదిశంకరులవారి సౌందర్యలహరిలోని “ధనుః పౌష్పం... మనంగో విజయతే” అన్న ఒక శోభాయమానమైన శ్లోకాన్ని ధ్వనింపజేశారని చెబుతూ ఆ శ్లోక భావాన్ని రసవత్తరంగా విశదీకరించారు. ఆ తర్వాత రాయలవారి ‘భువన విజయ’ సన్నివేశంలో నుంచి ఆణిముత్యం లాంటి తెనాలి రామకృష్ణుల “కలనన్ తావక ఖడ్గ ఖండిత... కృష్ణరాయాధిపా!" అన్న పద్యాన్ని రాగ, భావయుక్తంగా ఆలపించి, సందర్భసహిత వ్యాఖ్యానం చేసి సభికులను రంజింపజేశారు. ఇలాటి పద్యాలను మనం అప్పుడప్పుడు చదువుతుంటే వాటిల్లోని రసజ్ఞత పఠితలకు, శ్రోతలకు కూడా అద్భుతమైన జీవశక్తినందిస్తుందని ఉద్ఘాటించారు. కర్నాటక సంగీత సంప్రదాయంలో త్రిముూర్తులుగా కొలవబడే ముగ్గురు వాగ్గేయకారులలో అగ్రజుడు శ్రీ శ్యామశాస్త్రి. రాశిలో తక్కువైనా వాసిలో మాత్రం గొప్పవిగా ఉండే కృతులను శ్యామశాస్త్రి వెలువరించారు. కంచి కామాక్షి అమ్మవారిపై వారు సృజించిన భైరవి రాగ స్వరజతి విశేషాన్ని ఈ వేదికపై లెనిన్ బాబు వేముల భావ సహితంగా స్తుతించారు. ఆ తర్వాత శారద కాసీవఝ్ఝల గారు మాతృ భాష మనుగడకు మనవంతు బాధ్యత అనే అంశం మీద మాట్లాడుతూ వ్యక్తులుగా, సమూహాలుగా, సంస్థలుగా, ప్రభుత్వాలు చేయవల్సిని బాధ్యతలని వివరించారు . 156 వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సందర్భంగా “దేవులపల్లి కృష్ణశాస్త్రి లలితగీతాలు” అనే అంశంపై ప్రధాన ప్రసంగం చేసిన కె.గీత మాట్లాడుతూ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వం అంటే అత్యంత తియ్యదనం, అనంతమైన అనుభూతి, అవధుల్లేని ప్రేమ, విహ్వల బాధ, అలవికాని వేదన మిళితమైన కరుణ రస మాధుర్యామృతం అని పేర్కొన్నారు. కృష్ణశాస్ర్తిగారు రాసిన ఏ పాట విన్నా రాసినప్పటి భావోద్వేగం అదే మోతాదులో శ్రోతల హృదయాల్లో కలగడం గమనార్హమని, పదాల్లోని కన్నీటి చెలమలు గుండె చాటు చెమ్మని అడుగడుగునా గుర్తుచేస్తాయని అన్నారు. ఆయన రాసిన అమృతవీణ వంటి సుమధుర గీతాల్ని, “కృష్ణపక్షము”, “మంగళ కాహళి” నుంచి భావ, అభ్యుదయ కవితల్ని సభకు పరిచయం చేశారు. కృష్ణశాస్త్రి గారి లలిత గీతాల్లోని విలక్షణ పదజాలాన్ని, లాలిత్యాన్ని , సాహిత్య, సంగీత విశిష్టతల్ని పేర్కొనడమే కాకుండా, రసవత్తరంగా ఆలపిస్తూ చేసిన గీతగారి ప్రసంగం అందరినీ విశేషంగా అలరించింది. తనకు సంగీతం, సాహిత్యం రెండుకళ్లుగా ఉగ్గుపాలతో అబ్బిన విద్యలుగా పేర్కొంటూ, అందుకు దోహదం చేసిన వారి మాతృమూర్తి, గురువు, ప్రముఖ కథారచయిత్రి శ్రీమతి కె.వరలక్ష్మిగారికి సభాపూర్వకంగా నమోవాకాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది సాహిత్య ప్రియులు హాజరై సాహిత్య సదస్సును విజయవంతం చేశారు. స్థానిక సాహిత్య ప్రియులకు, విచ్చేసిన ముఖ్య అతిథులు డా.కె.గీత, శారద కాసీవఝ్ఝలకు, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం పోషక దాతలకు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు ధన్యవాదాలు తెలిపారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో తెలుగువెన్నెల సాహిత్య సదస్సు
డాలస్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల153 వ సాహిత్య సదస్సు ఏప్రిల్ మూడవ ఆదివారం ఆన్ లైన్లో డాలస్‌లో ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 153 నెలల పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ యొక్క విశేషం. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో 153వ సాహిత్య సదస్సుని ఆన్లైన్లో ఘనంగా నిర్వహించిన ఘనత ఉత్తర టెక్సస్ తెలుగు సంఘానికే దక్కుతుంది. ముందుగా సాహిత్య సమన్వయకర్త మల్లిక్ కొండా ఆధ్వర్యంలో చిన్నారుల ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యం, డాక్టర్ ఉర్మిండి నర్సింహారెడ్డి, భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి, డాక్టర్ బల్లూరి ఉమాదేవి, అయినంపూడి శ్రీలక్ష్మి, అనంత్ మల్లవరపు తదితరులు పాల్గొని తమ కార్యక్రమాలతో వీక్షకులను ఆనందింపజేశారు. కార్యక్రమం చివర్లో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన పాలగుమ్మి రాజగోపాల్‌కు, ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొన్న సాహితీ ప్రియులందరికి కృతజ్ఞతలు తెలిపి ముగించారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
డల్లాస్ : తెలుగు సంఘం సాహిత్య వేదిక (టాంటెక్స్) ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు ఆదివారం ఫిబ్రవరి 23న డల్లాస్‌లోని శుభం ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సాహిత్య వేదిక సమన్వయకర్త మల్లిక్ రెడ్డి కొండా, కృష్ణ రెడ్డి కోడూరు అధ్యక్షతన జరిగింది. కాగా ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విజయా సారధి జీడిగుంట విచ్చేశారు. వీరు ముందు గా ప్రార్ధన గీతం తో సభను ప్రారంభించారు . ఈ సదస్సుకు సాహితీ వేత్తలు భాషాభిమానులు విచ్చేసారు. కార్యక్రమం ఆసాంతం వాల్మీకీ రామాయణం, అన్నమాచార్య కీర్తనలు, అనంతరం విజయ సారధి జీడిగుంట 'నన్నయ కవితా రీతులు-పామరుని విశ్లేషణ' అంశం పై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మల్లిక్ రెడ్డి కొండా, కృష్ణ రెడ్డి, విజయ్ సారధి, ఎన్ఆర్యూ,లెనిన్,సుబ్బు,చినసత్యం,ప్రసాద్తోటకూర,సుధా కల్వకుంట,రాజారెడ్డి, ఉమాదేవి,శరత్, వెంకట్,అశ్వని వెలివేటి,రవి పట్టిసం,శశి పట్టిసం,వేణు భీమవరపు,విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
డల్లాస్: సూర్యుడు మకరరాశిలో చేరగానే వచ్చే పెద్ద పండగ సంక్రాంతి. ఈ పండగ తెలుగువాళ్లకు ఎంతో ఇష్టం అన్న విషయం తెలిసిందే. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను ప్రజలు ఎంతో ఘనంగా జరుగుపుకుంటారు. అమెరికాలోని తెలుగువారి కోసం.. అతిపెద్ద తెలుగు సంస్థలలో ఒకటైన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించింది. స్థానిక నిమిట్స్ హైస్కూల్లో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమంలో అచ్చమైన తెలుగు వాతావరణాన్ని ప్రతిబింబించేలా పాటలు, సంగీత, సాంస్కృతిక, నృత్య కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ సంక్రాంతి సంబరాలను ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ఆధ్వర్యంలో కార్యవర్గ, పాలకమండలితో పాటు సమన్వయ కర్తలు తోపుదుర్తి ప్రబంద్, జొన్నలగడ్డ శ్రీకాంత్, సాంస్కృతిక సమన్వయ కర్త స్రవంతి యర్రమనేని నిర్వహించారు. ఈ కార్యక్రమం చిన్నారులు ఆలపించిన అమెరికా జాతీయ గీతంతో ప్రారంభమైంది. ఈ వేడుకలల్లో ముద్దుగారే యశోద, వందే మీనాక్షి, కృష్ణాష్టకం, మాస్ ఈజ్ గ్రేట్, చరణములే నమ్మితి అనే స్థానిక కళాకారుల నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమనికి ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరించిన సమీర ఇల్లెందుల ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయించారు. గాయని, గాయకులు దామిని భట్ల, ధనుంజయ్ పాడిన పాటలు అరించాయి. టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యక్షులు చినసత్యం వీర్నపు మాట్లాడుతూ.. గత ఏడాది నిర్వహించిన కార్యక్రమాల గురించి వివరించారు. సంస్థకి సేవ చేయడం తన అదృష్టమని ఆయన అన్నారు. అనంతరం 2020వ సంవత్సరానికి టాంటెక్స్ అధ్యక్షులుగా ఉన్న కృష్ణారెడ్డి కోడూరు మాట్లాడుతూ.. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సంస్థని సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండాదన్నారు. తమ కార్యవర్గం, పాలకమండలి, సంస్థ సభ్యులని కలుపుకొని ఈ సంస్థను సేవారంగంలో కూడా ముందుంచి ఘన చరిత్రని కాపాడడానికి నిరంతరం శ్రామికుడిగా కష్టపడతానని తెలిపారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్)ను తనకున్న అనుభవంతో, సమాజంలో ఉన్న పరిచయాలతో మరింత సేవాతత్పరత కలిగిన సంస్థగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. తర్వాత 2020 కార్యవర్గం, పాలక మండలి బృందాన్ని ఆయన సభకు పరిచయం చేశారు. సంక్రాంతి సంబరాలకి పసందైన పండుగ భోజనాన్ని వడ్డించిన బావార్చి అర్వింగ్ వారికి ఉత్తర టెక్సాస్ కార్యవర్గం, పాలక మండలి తరుఫున ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. టాంటెక్స్ వారి సంక్రాంతి సంబరాలకి విచ్చేసి ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకి, అతిధులకి, పోషకదాతలకి అధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమ నిర్వహణకు స్పాన్సర్లుగా వ్యవహరించిన నిజెల్ భవన నిర్మాణ సంస్థ, శరత్ యర్రం, రాం మజ్జి, టాంటెక్స్ సంస్థ డైమండ్ పోషకదాతలైన తిరుమల్ రెడ్డి కుంభం, ప్లాటినం పోషక దాతలైన బావార్చి అర్వింగ్ ఇండియన్ రెస్టారెంట్, క్వాంట్ సిస్టమ్స్, ప్రతాప్ భీమి రెడ్డి, విక్రం జంగం, డా. పవన్ పామదుర్తి, శ్రీకాంత్ పోలవరపు, అనిల్ యర్రం, ఆనంద్ దాసరి, డీఎంఆర్ డెవలపర్స్ , గోల్డ్ పోషకదాతలైన పసంద్ విందు, మై ట్యాక్స్ ఫైలర్, రాం కొనారా, స్వదేశి రమేష్ రెడ్డి , బసేరా హరి, కిషోర్ చుక్కాల ,టెక్ లీడర్స్ దేవేంద్ర రెడ్డి, సిల్వర్ పోషకదాతలైన మురళి వెన్నం, డా.భాస్కర్ రెడ్డి సానికొమ్ము, పెంటా బిల్డర్స్, ఒమేగా ట్రావెలర్స్, అవాంట్ టాక్స్, విశ్వభారత్ రెడ్డి కంది, శ్రీకాంత్ గాలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంకక్రాంతి వేడుకులకు సహకరించిన మీడియా పార్ట్నర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గాయని, గాయకులు దామిని భట్ల, ధనుంజయ్‌లతో పాటుగా వ్యాఖ్యాత సమీర ఇల్లందుని సన్మానించారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా తెరవెనుక నుంచి సేవలందించిన కార్యకర్తలందరికీ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భారతీయ జాతీయగీతం ఆలాపనతో అత్యంత శోభాయమానంగా సాగిన సంక్రాంతి సంబరాలు ముగిశాయి. -
టాంటెక్స్ 2020 నూతన కార్యవర్గం
టెక్సాస్: తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకు ఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్)-2020 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 5న డాలస్‌లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడుగా కృష్ణారెడ్డి కోడూరు పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాంటెక్స్ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఉత్తర అమెరికాలోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాంటెక్స్ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినందుకు టాంటెక్స్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా ఈ సంవత్సరం నూతన కార్యక్రమాలను చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొత్త పాలక మండలి, కార్యవర్గ బృందాల సూచనలు, సహాయ సహకారాలతో, సరికొత్త ఆలోచనలతో ఈ ఏడాదిలో అందరిని అలరించే కార్యక్రమాలు చేయనున్నామన్నారు. దీనికి స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ తప్పక ఉంటాయని ఆశిస్తున్నానని సంస్థ నూతన అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు తెలిపారు. గతేడాది టాంటెక్స్ అధ్యక్షులుగా పనిచేసి పదవీ విరమణ చేస్తున్న చినసత్యం వీర్నపు మాట్లాడుతూ.. కృష్ణా రెడ్డి కోడూరు నేతృత్వంలో ఏర్పడిన 2020 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు నా సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రసార మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. టాంటెక్స్ నూతన అధికారిక కార్యనిర్వాహక బృందం అధ్యక్షుడు: కృష్ణా రెడ్డి కోడూరు ఉత్తరాధ్యక్షురాలు: లక్ష్మి పాలేటి ఉపాధ్యక్షులు: ఉమా మహేష్ పార్నపల్లి కార్యదర్శి: సతీష్ బండారు కోశాధికారి: శరత్ ఎర్రం సంయుక్త కార్యదర్శి: మల్లిక్ కొండా సంయుక్త కోశాధికారి: కల్యాణి తాడిమేటి తక్షణ పూర్వాధ్యక్షులు: చిన సత్యం వీర్నపు మిగతా సభ్యులు: శ్రీకాంత్ రెడ్డి జొన్నల, చంద్ర పొట్టిపాటి, రఘునాధ రెడ్డి కుమ్మెత్త, స్రవంతి ఎర్రమనేని, సరిత కొండా, ప్రభాకర్ రెడ్డి మెట్టా, చంద్రారెడ్డి పోలీస్, వెంకట్ బొమ్మా, జనార్దన్ యెనికపాటి, లోకెష్ నాయుడు కొణిదల, నాగరాజ్ చల్లా, ఉదయ్ నిడగంటి, భాను ప్రకాష్ వెనిగల్ల. నూతన పాలక మండలి బృందం అధిపతి: పవన్ రాజ్ నెల్లుట్ల ఉపాధిపతి: డా. పవన్ పామదుర్తి మిగతా సభ్యులు: శ్రీకాంత్ పోలవరపు, వెంకట్ ములుకుట్ల, ఇందు రెడ్డి మందాడి, శ్రీలక్ష్మి మండిగ, ఎన్ఎంఎస్ రెడ్డి. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో 'తెలుగు సాహిత్య సదస్సు'
డల్లాస్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సు డిసెంబర్ 15న వీర్నపు చినసత్యం అధ్యక్షతన డల్లాస్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రవాసంలో నిరాటంకంగా 149 నెలల పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం గొప్ప విశేషం. ఈ కార్యక్రమానికి భాషాభిమానులు, సాహిత్య ప్రియులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని జయప్రదం చేశారు. కార్యక్రమంలో ముందుగా ప్రముఖ సాహితీవేత్త, ప్రముఖ రంగస్థల నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి డా. గొల్లపూడి మారుతీరావు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఘనమైన నివాళులు అర్పించారు. గొల్లపూడి ఆకస్మిక మృతి మా అందరిని విషాదానికి గురి చేసిందని ప్రముఖ రంగస్థల నటుడు రామచంద్రనాయుడు పేర్కొన్నారు. కాగా, టాంటెక్స్ మొట్టమొదటి సాహిత్య వేదికను గొల్లపూడి ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఆ తర్వాత వేముల సాహితీ, వేముల సింధూర ' శ్రీరామదాసు ' కీర్తనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన తెలుగు సిరి సంపదలు, నానుడి, జాతీయాలు, పొడుపు కథలు అడిగి డా. ఉరిమిండి నరసింహరెడ్డి సభికులను ఆసక్తి రేకెత్తించారు. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం సంహావలోకనం శీర్షికన గత 11 నెలలుగా నిర్వహించిన సాహిత్య సదస్సులకు విచ్చేసిన ముఖ్య అతిథులు, వారు మాట్లాడిన అంశాలను టూకీగా వివరించారు. ఈ సంవత్సరం మీ అందరి సహకారంతో ఎంతోమంది అతిథులను మన వేదికపైకి తీసుకొచ్చామని తెలిపారు. అలాగే జాతీయ సంస్థలు తానా, నాట్స్‌తో కలిసి టాంటెక్స్ సంయుక్తంగా ఎన్నో సాహిత్య సదస్సులు నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందివాడ భీమారావు గారిని వీర్నపు చినసత్యం సభకు పరిచయం చేశారు. ఆ తర్వాత నందివాడ భీమారావు రచించిన ' ది ఆర్ట్ ఆఫ్ ది ఇంపాసిబుల్' పుస్తకావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి చంద్రశేఖర్, తోటకూర ప్రసాద్, జొన్నలగడ్డ సుబ్రమణ్యం, ఉరిమిండి నరసింహరెడ్డి, ఆనందమూర్తి, లలితామూర్తి కూచిబొట్ల, సతీష్ బండారు తదితరులు పాల్గొన్నారు. -
డల్లాస్‌లో ఘనంగా ప్రాథమిక యోగా శిక్షణా సదస్సు
టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డల్లాస్‌లో ప్రాథమిక యోగా శిక్షణా సదస్సు నిర్వహించింది. జెన్స్టార్ మాంటెస్టరీ అకాడమీలో సభ్యుల ఆరోగ్య అవగాహన కోసం డిసెంబరు 14న ఏర్పాటు చేసిన ప్రాథమిక యోగా శిక్షణా సదస్సు అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో ఘనంగా జరిగింది. ప్రస్తుత టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు, కళ్యాణి తాడిమేటి (సుఖీభవ కమిటీ సమన్వయ కర్త), సాంబ దొడ్డ(తానా SW region RVP) అందరికి స్వాగతం పలికారు. టాంటెక్స్, తానా నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించి సభకు టాంటెక్స్, తానా కార్యవర్గ సభ్యులను పరిచయం చేసి, వారి సహాయ సహకారాలతోనే ఇటువంటి మంచి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాం అని చెప్పారు. తదుపరి దత్త యోగా క్రియ టీచర్స్ ప్రశాంత దుల్లూర్, శివరాజు జయన్నలను సభకు పరిచయం చేసి కార్యక్రమం ప్రారంభించారు. యోగా టీచర్స్ ప్రశాంత్ దుల్లూర్, శివరాజు జయన్న ముందుగా టాంటెక్స్, తానా వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం యోగా ప్రక్రియ గురించి యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నాడి సుద్ధి వ్యాయమాన్ని అందరికీ ఎలా చేయాలో చూయించి అందరూ ఆ వ్యాయామాన్ని ఎవరికి వారు చేయగలిగేలా నేర్పించారు. అలాగే ఆసనాలు, సూర్య నమస్కారాలు వాటివల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. సూర్యనమస్కారాల వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని శరీరంలో నాడులన్నీ చక్కగా పనిచేస్తాయని మలబద్ధకం లాంటి రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందని తెలియజేశారు. యోగా మనకి పూర్వీకులు అందించిన మంచి ప్రక్రియ అని దాన్ని మనం సక్రమంగా వాడుకోగలిగితే మంచి ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయని తెలియజేశారు. చివరిగా ప్రాణాయమ ప్రక్రియను నేర్పి మన శరీరంలో ప్రతి అవయవం మన శ్వాసతో కలిసి పనిచేస్తుందని సరైన శ్వాసతో నాడులు పనితీరును యోగా ప్రక్రియ ద్వారా మెరుగుపర్చుకోవచ్చని తెలియజేశారు. అక్కడకు వచ్చిన సభ్యులు అందరూ ఎంతో ఓపికగా యోగాలో మెళకువలను నేర్పిన యోగా టీచర్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్య అతిథులుగా వచ్చిన యోగా టీచర్స్ ప్రశాంత్ దుల్లూర్, శివరాజు జయన్నలను టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, సాంబ దొడ్డ (తానా sw region rvp), శ్రీకాంత్ పోలవరపు(తానా ఫౌండేషన్ డైరెక్టర్), కళ్యాణి తాడిమేటి(సుఖీభవ కమిటీ సమన్వయకర్త) శాలువా, జ్ఞాపిక ఇచ్చి సత్కరించారు. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ యోగా టీచర్స్ ప్రశాంత్ దుల్లూర్, శివరాజు జయన్న సేవలను కొనియాడారు. టాంటెక్స్, తానా తరపున యోగా కార్యక్రమం చేయడానికి సహకరించినందుకు చాలా ఆనందంగా ఉందని, ఇటువంటి కార్య్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించినవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంబ దొడ్డ, శ్రీకాంత్ పోలవరపు, మురళి వెన్నం, కళ్యాణం తాడవిమేటి తదితరులు పాల్గొన్నారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్, తానా కార్యవర్గ సభ్యులకు వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
వికలాంగుల కష్టాలు తీర్చే వైకుంఠం ‘విర్డ్’ ఆసుపత్రి
డాలస్: ఒక లక్షా 20వేలకు పైగా అంగవికలురకు విజయవంతంగా ఎముకల శస్త్రచికిత్సలు నిర్వహించిన ప్రముఖ వైద్యుడు డా.గుడారు జగదీష్ నేతృత్వంలో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర అంగవైకల్య శస్త్రచికిత్స పరిశోధనా పునరావాస ఆసుపత్రికి(Venkateswara Institute For Rehabilitation & Research of the Disabled-VIRRD) డాలస్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ప్రవాసులు రూ.60లక్షలను విరాళంగా ప్రకటించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్)లు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. కార్యక్రమాన్ని తానా ప్రాంతీయ ప్రతినిధి దొడ్డా సాంబ ప్రారంభించారు. తానా డైరక్టర్ల బోర్డు కార్యదర్శి వెన్నం మురళీ మాట్లాడుతూ నిస్వార్థంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న డా.గుడారు జగదీష్ వంటి వారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్న ఆసుపత్రికి డాలస్ ప్రవాసులు తోడ్పడం ఆనందంగా ఉందన్నారు. తానా మాజీ అధ్యక్షుడు డా.తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ 2013లో డాలస్‌లో జరిగిన తానా సభల్లో డా.గుడారుకి పురస్కారాన్ని అందించి గౌరవించుకున్నామని, 2017లో ఏలూరులో జరిగిన అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరో పురస్కారంతో ఆయన్ను రెండుసార్లు గౌరవించుకునే అవకాశం దక్కిందని అన్నారు. అకుంఠిత దీక్షతో, క్రమశిక్షణ, సాంత్వన కలిగిన మాటతీరుతో అంగవైకల్యం బాధపడే లక్షల మంది జీవితాల్లో ఆనందాన్ని నింపి వారి సొంత కాళ్లపై వారు నిలబడేలా చేసిన దేవుడు డా.గుడారు అని ఆయన కొనియాడారు. అనంతరం డా.జగదీష్‌ను తోటకూర సభకు పరిచయం చేశారు. డా.గుడారు జగదీష్ తన ప్రసంగాన్ని ప్రదర్శన రూపంలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ 1987లో ఎన్టీఆర్ తిరుపతిలో స్థాపించిన విర్డ్(BIRRD) ఆసుపత్రిలో నేను 1996 నుండి 1,20,000 మంది అంగవికలాంగులకు 95శాతం విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించాను. 2008లో వేగేశ్న ఫౌండేషన్, ద్వారకా తిరుమల ఆలయం సహకారంతో విర్డ్ను ఏర్పాటు చేసి ఇక్కడ కూడా ఎంతోమందికి ఎముకలకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలో 23వేల మంది అంగవికలాంగులకు శస్త్రచికిత్సలు, కృత్రిమ అవయవాల అవసరం ఉంది. దీనితో పాటు విర్డ్ ఆసుపత్రిలో అధునాతన శస్త్రచికిత్స గది, రోగులకు మంచాలు, గ్రంథాలయం, ఫిజియోథెరపీ ఉపకరణాలు వంటి వాటిని ఆధునీకరించాల్సిన ఆవశ్యకత ఉంది. జనవరి నుండి తొలివిడతలో ఏపీలో, తదనంతరం తెలంగాణా రాష్ట్రాల్లో వీఐఆర్ఆర్డీ ఉచిత నిర్ధారణ శిబిరాలను నిర్వహించి అర్హులైన వారికి స్థానిక వైద్యుల సహకారంతో స్థానికంగానే చికిత్స చేస్తాం లేదా విర్డ్కు తరలించి అక్కడే అవసరమైన మేర చికిత్స చేస్తాం. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా తమ ప్రాంతంలో ఈ శిబిరాలను నిర్వహించాలంటే విర్డ్ను సంప్రదించండి. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ పూర్తి ఉచితంగా ఎలాంటి శస్త్రచికిత్సను అయినా విర్డ్‌లో అందిస్తున్నాం. రోగి విర్డ్లోనే రెండు నుండి ఆరు వారాల పాటు ఉచితంగా భోజన సదుపాయంతో కూడిన నివాసంలో ఉండవచ్చు. తోడుగా ఒక కుటుంబ సభ్యుడు ఉండవచ్చు. రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల రోగులు సైతం మా విర్డ్కు వస్తున్నారు. ఏడాదికి 50వేల మంది రోగులకు మేము వైద్య సదుపాయాలను కల్పిస్తున్నాం. ఇంతమంది రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న విర్డ్ను మరింత మెరుగుపరిచేందుకు నిధులను సేకరిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రవాసులు తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని డా.జగదీష్ పేర్కొన్నారు. తానా మాజీ అధ్యక్షుడ్ కోమటి జయరాం రూ.35లక్షలు, మురళీ వెన్నం సమన్వయంలో డాలస్ మిత్రులు రూ.15లక్షలు, తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ రూ.10లక్షలు విర్డ్కు అందించేందుకు హామీ ఇచ్చారు. వీరందరికీ డా.గుడారు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టాంటెక్స్ అధ్యక్షుడు చినసత్యం వీర్నపు, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు సుబ్బరాయ చౌదరి, చిత్తూరు ప్రవాసుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల విజయమోహన్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో తానా క్రీడా విభాగ సమన్వయకర్త లోకేష్ నాయుడు, పోలవరపు శ్రీకాంత్, జొన్నలగడ్డ సుబ్రమణ్యం, మల్లవరపు అనంత్, డా.పుదూర్ జగదీశ్వరన్, యు.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు సాహిత్య సదస్సు
డల్లాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 146వ తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు, 43 వ టెక్సాస్ సాహిత్య సదస్సు అర్వింగ్ పట్టణంలోని కూచిపూడి ఇండియన్ రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. తెలుగు సాహిత్య వేదిక సమన్వయ కర్త కృష్ణారెడ్డి కోడూరు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి టెక్సస్‌లోని డల్లాస్, హ్యూస్టన్, ఆస్టిన్, సానాంటోనియో, టెంపుల్ నగరాల నుంచి వందల మంది సాహితీ ప్రియులు హాజరై స్వీయకవితలు, వ్యాసాలు, పద్యాలు, తెలుగు సిరిసంపదలు విని ఆనందించారు. సత్యం మందపాటి 'పేరులో ఏముంది', నందివాడ భీమరావు 'సాహిత్యంలో ధిక్కారం' అనే అంశాల మీద మాట్లాడారు. 'పరీక్ష సమీక్ష' అనే అంశం మీద డాక్టర్ చింతపల్లి గిరిజా శంకర్ మాట్లాడగా, తెలుగు సిరిసంపదల గురించి డాక్టర్ నరసింహారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా సురేష్ కాజా, చంద్రహాస్ మద్దుకూరి గుర్రం జాషువా, జాలాది వంటి ఆధునిక కవుల గురించి పేర్కొన్నారు. చివరగా సాహితీ సింధూర చిన్నారుల పాటతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిన సత్యం, కార్యదర్శి ఉమా మహేష్ పార్నపల్లి, కోశాధికారి శరత్ యర్రం, కార్యవర్గ సభ్యుడు సతీష్, పూర్వాధ్యక్షులు డా ఊర్మిండి నరసింహా రెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కృష్ణా రెడ్డి ఉప్పలపాటి, ప్రసాద్ తోటకూర, మాజీ అధినేత చంద్ర కన్నెగంటి, డా.శ్రీనివాసుల రెడ్డి ఆళ్ళ, పాలకమండలి మాజీ అధినేత రామకృష్ణా రెడ్డి దంపతులు, అనంత్ మల్లవరపు, రమణ జువ్వాడి, శ్రీకుమార్ గోమటం, శిరీష గోమటం, సుమ పోకల, సి యస్ రావు, ఆర్ కె పండిటి, నందివాడ ఉదయ భాస్కర్, కిరణ్మయి వేముల, పాలకమండలి సభ్యులు, తదితరులు హాజరయ్యారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో ఫణినారాయణ వీణా మహా స్రవంతి
డాల్లస్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో ఫణి నారాయణ వీణా వడలి ‘‘ శ్రీ ఫణి నారాయణ వీణా మహతీ స్రవంతి’’ కార్యక్రమం అత్యంత ఆహ్లాదకరంగా జరిగింది. సెయింట్ మలంకాకారా ఆర్థోడాక్స్ చర్చీలో సెప్టెంబర్ 14న ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధులు ఫణి నారాయణ, విద్వాన్ శంకర్ రాజ గోపాలన్, సతీష్ నటరాజన్, శ్రీనివాసన్ ఇయ్యున్ని, చినసత్యం వీర్నపు తదితర టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వాతి కృష్ణమూర్తి శిష్య బృందం ఆలపించిన కృష్ణాష్టకం ప్రారంభ గీతం అందరినీ ఆకట్టుకుంది. గాయిని సాయితన్మయ అద్భుతమైన ప్రతిభతో మరికొన్ని శాస్త్రీయ గీతాలు పాడి అందరి మన్ననలు పొందారు. అనంతరం ఫణినారాయణ వీణా ప్రస్థానం వీనుల విందుగా సాగింది. ఆయన వీణపై వాయించిన ‘‘ వటపత్ర సాయికి వరహాల లాలి’’ ‘‘కథగా కల్పనగా కనిపించెను నాకొక యువరాణి’’ ‘‘పరువం వానగా’’ ‘‘సుభలేఖ రాసుకున్న’’ ‘‘తకిట తకిట తందాన’’ ‘‘ సామజ వరగమన’’ ‘‘ ఈగాలి ఈనేల’’ వంటి పాటలు అందరినీ తన్మయత్వానికి గురిచేశాయి. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, ఉత్తరాధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు, కార్యదర్శి ఉమామహేశ్ పార్నపల్లి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ రెడ్డి తోపుదుర్తి, సతీష్ బండారు, వెంకట్ బొమ్మ, శరత్ యర్రం, కళ్యాణి తాడిమేటిలు ముఖ్య అతిధులు ఫణినారాయణ వీణా వడలి, విధ్వాన్ శంకర్ రాజ గోపాలన్, సతీష్ నటరాజన్, శ్రీనివాసన్ ఇయ్యున్నిలను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ.. ఫణినారాయణ టాంటెక్స్ కార్యక్రమానికి రావటం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి సహకరించిన రఘురాం బుర్ర, బాల గునపవరపు, జయ కళ్యాణి, పూజిత కడిమిశెట్టిలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, మన టీవీ, టీఎన్ఐ, ఫన్ ఏషియా, దేసీప్లాజ, తెలుగు టైమ్స్, ఐఏసియాలకు, సెయింట్. మలంకాకారా ఆర్థోడాక్స్ చర్చీవారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పూర్వాధ్యక్షులు సుబ్రమణ్యం జొన్నల గడ్డ, డా. తోటకూరి ప్రసాద్, శ్రీకాంత్ పోలవరపు, అనంత్ మల్లవరపు, డా. రమణ జువ్వాడి, చంద్రహాస్ మద్దుకూరితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
డల్లాస్‌లో ఘనంగా అష్టావధాన కార్యక్రమం
డల్లాస్(టెక్సస్) : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) , ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆద్వర్యంలో ఆగస్టు18 న డల్లాస్‌లోని ఫ్రిస్కో కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో అష్టావధానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 200 మందికి పైగా సాహితి ప్రియులు హాజరై సభను జయప్రదం చేశారు. టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు సభను ప్రారంభించి అష్టావదానం నిర్వహించడానికి వచ్చిన డా. మేడసాని మోహన్‌గారికి సాదర స్వాగతం పలికారు. ఈ అష్టావదానం కార్యక్రమం తానా, టాంటెక్స్‌లు కలిసి నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ముందుగా తాన్వి పొప్పూరి ఆలపిచిన అన్నమయ్య కీర్తనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దిగవంతాలకు వ్యాపించేలా తెలుగు భాషలలో అత్యంత క్లిష్టమైన అవధాన ప్రక్రియను డాక్టర్ మేడపాని మోహన్ తనదైన శైలిలో రక్తి కట్టించి అమెరికా నలుమూలల నుంచి విచ్చేసిన అవధాన ప్రియులను ఆకట్టుకున్నారు. అవధానం అంటే అవధులు లేని ఆనందం అనిపించేంతగా కార్యక్రమం సాగింది. ఈ అవధాన ప్రక్రియలో 8 మంది పృచ్ఛకులు పాల్గొన్నారు. ఈ పృచ్ఛకులు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం మీద అవధాని గారిని పరీక్షించారు. మేడసాని మోహన్ ఎక్కడా కాగితం, కలం వాడకుండా వారు అడిగిన చందస్సులను చమత్కారంగా, ఛలోక్తులతో కూడిన సమాధానాలు ఇవ్వడం ద్వారా కార్యక్రమానికి విచ్చేసిన వీక్షకులను ఆనందింపజేశారు. అవధాన అంశాలలో శ్రీ ఊరిమిండి నరసింహరెడ్డి దత్తపది, శ్రీ తోటకూర ప్రసాద్ న్యస్తాక్షరి, శ్రీ ఉపద్రష్ట సత్యం మహాకవి ప్రసంగం, కుమారి మద్దుకూరి మధుమాహిత సమస్య, శ్రీ వేముల లెనిన్ వర్ణన, శ్రీమతి కలవగుంట సుధ, ఆశువు, శ్రీ కాజ సురేష్ నిషిద్దాక్షరి అంశాలతో, శ్రీ మాడ దయాకర్ తన అప్రస్తుత ప్రసంగం, జలసూత్రం చంద్రశేఖర్ లేఖకుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొని అవధానం నిర్వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు శ్రీ జయశేఖర్ తాళ్ళూరి, టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, సాంబ దొడ్డ బృందం డా. మేడసాని మోహన్ గారిరీ శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తానా కార్యవర్గ బృందం డా. అడుస్తమిల్లి రాజేష్, చలపతి కొండ్రకుంట, శ్రీకాంత్ పోలవరపు, దినేష్ త్రిపురనేని, సతీష్ కొమ్మన, రాజ నల్లూరి, రవి అల్లూరి, శ్రీనివాస్ కొమ్మినేని, పరమేష్ దేవినేని, శేషారావు బొడ్డు, శివ రావూరి, లోకేష్ నాయుడు కొణిదాల, సుబ్బారావు కారసాల, శ్రీని మండువ, అనిల్ ఆరేపల్లి, డా. సి.ఆర్.రావు, డా. విశ్వనాధం పులిగండ్ల, సుగన్ చాగర్లమూడి, కె.సి.చేకూరి , ప్రకాశ్‌రావు వెలగపూడి, ,ఎం.వి.యల్. ప్రసాద్, టాంటెక్స్ ఉపాధ్యాక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, విజయ్ కాకర్ల, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, ఉపాధ్యాక్షులు పాలేటి లక్ష్మి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ తోపుదుర్తి, శ్రీకాంత్ జొన్నల, శరత్ ఎర్రం సహా మరికొంత మంది ప్రముఖులు పాల్గొన్నారు. -
డల్లాస్‌లో కనువిందుగా ఆహా! ఈహీ! ఓహో!
డల్లాస్ (టెక్సస్) : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 'ఆహా! ఈహీ! ఒహో!' అనే తెలుగు సాహితీ వైభవ కార్యక్రమాన్ని జూలై 21న డల్లాస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు దాదాపు 200 మందికి పైగా సాహితీ ప్రియులు హాజరయ్యారు. నాలుగు గంటల పాటు సభను ఉత్సాహంగా నిర్వహించి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ గేయ రచయిత, తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి తానాబోర్డు కార్యదర్శి మురళి వెన్నం సాదర స్వాగతం పలికారు. కొత్తగా ఎన్నికైన తానా సభ్యులను సభకు పరిచయం చేస్తూ, భావసారుప్యం ఉన్నజాతీయ, స్థానిక సంస్థలతో కలసి తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకై మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగాటాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు మట్లాడుతూ శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగాఉందని, తానాకి కొత్తగా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులందరకి అభినందనలు తెలియజేశారు. 'సాహితీ వేముల', 'సింధూర వేములలు','మా తెలుగు తల్లికి మల్లె పూదండ', 'ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట' అనే గీతాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తానా మరియు టాంటెక్స్ సంస్థల పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారినిసభకు పరిచేయం చేస్తూ.. శ్రీ శ్రీ, దాశరథి, వేటూరి, పురాణం సుభ్రమణ్యం శర్మ, డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి లబ్ధ ప్రతిష్టులతో ఎంతో ఆత్మీయంగా మెలిగిన శ్రీ జొన్నవిత్తులగారు ఇక్కడికి రావడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. తానాకార్యవర్గ సభ్యుడు లోకేష్ నాయుడు జొన్నవిత్తుల గారిని పుష్పగుచ్చంతో వేదికపైకి ఆహ్వానం పలికినప్పుడు కరతాళధ్వనులు మిన్నంటాయి. నాలుగు భాగాలుగా చతుర్ముక పారాయణం మహాత్మా మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. శ్రీ జొన్నవిత్తుల గారితో వినూత్నంగా మొదటిసారి చమత్కార చతుర్ముఖ పారాయణం అనేనాలుగు ప్రక్రియలున్న సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ చతుర్ముఖ పారాయణంలో సినీ సాహిత్యం, తెలుగు భాషా వైభవం,పురాణాల ప్రాశస్త్యం, పేరడీ పాటలు అనే నాలుగు విభాగాలుగా విభజించి ఒక కొత్త తరహ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జొన్నవిత్తుల మాట్లాడుతూ.. డా. ప్రసాద్ తోటకూర గారితో తనకున్న ఎన్నో సంవత్సరాలు అనుబంధాన్ని గుర్తు చేశారు. తెలుగు భాషా ప్రియత్వం, నాయకత్వ లక్షణాలపై ప్రసాద్‌గారి ప్రేమను కొనియాగారు. ఇది తన 17వ అమెరికా పర్యటన అని తానా, టాంటెక్స్ లాంటి అనేక తెలుగు సంస్థలు తనకిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదన్నారు. జొన్నవిత్తుల గారితో ప్రసాద్ తోటకూర ముఖాముఖి నిర్వహించారు. ఈ నేపథ్యంలో కవి జొన్నవిత్తుల తాను రాసిన పాటలు అనేక సినిమాలలో వినూత్న ప్రయోగాలుగా ఉండి అత్యంత ప్రజాదరణ పొందాయని పేర్కొన్నారు. ఒక డిస్కో పాటని పూర్తిగా సంస్కృతంలో రాయడం, కేవలం 'సరిగమపదని' అనే సప్త అక్షరాలతో పాట రాయడం, 'చినుకు చినుకు అందెలతో', 'జగదానంద కారకా', 'ఓ వాలు జడా, పూలజడా' వంటి పాటల నేపధ్యం గురించి అడిగినప్పుడు, అదంతా దర్శక, నిర్మాతలు తనికిచ్చిన అవకాశం అని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జొన్నవిత్తుల గారు డా. మంగళంపల్లి బాలమురళి, బాపు, రమణ, వేటూరి గార్లతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని, అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అలాంటి గొప్ప పండితులతో, మేధావులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం రావడం తన పూర్వజన్మసుకృతం అని తెలిపారు. తర్వాత కనక దుర్గమ్మవారి రూపంలోని అక్షరమాలను, అక్షరమాలలో ఉన్న సకల సంగీత వాయిద్య పరికరాలను దర్శిస్తూ తెలుగు భాషా వైభవాన్ని జొన్నవిత్తుల పాడి వినిపించడంతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. కోనసీమ శతకం, బతుకమ్మ శతకం, సింగరేణి శతకం, రామలింగేశ్వర శతకాల్లో నుoచి ఎన్నో పద్యాలను పాడి సభికులను ఆనందపరవశంలో ముంచెత్తారు. అదే విధంగా ప్రస్తుత సమకాలీన పరిస్థితుల్లో రాజకీయ పార్టీల గందరగోళం, యధేచ్చగా పార్టీలు మారడం, ఎన్నికల వాగ్ధానాలు, మద్యపానం, అవినీతి, స్కీములు, స్కాములు లాంటి అంశాలను కథా వస్తువుల ఆధారంగా శ్రీ జొన్నవిత్తుల పేరడీలు సృష్టించడంతో సభలో మొత్తం కేరింతలు, ఈలలతో నిండిపోయింది. ఈ సందర్భంగా శ్రీ జొన్నవిత్తుల గారిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) కార్యవర్గ బృందం శాలువా, జ్ణాపికను బహుకరించి "అభినవ చమత్కార కవిసార్వభౌమ" అనే బిరుదుతో సత్కరించారు. సభకు విచ్చేసిన జ్యోతిష్య శాస్త్ర ప్రముఖులు డా. జంధ్యాల భాస్కర శాస్త్రి గారు శ్రీ జొన్నవిత్తులగారిని, వారి కవితా చాతుర్యాన్ని కొనియాడారు. డా. జంధ్యాల భాస్కర శాస్త్రి గారిని సభ నిర్వాహకులు గౌరవపూర్వకంగా శాలువాతో సత్కరించారు.కార్యక్రమం చివర్లో తానా పూర్వాధ్యక్షులైన డా. నవనీత కృష్ణ గొర్రెపాటి, డా. రాఘవేంద్ర ప్రసాద్ సూదనగుంట, డా. ప్రసాద్ తోటకూరలను తానా కార్యవర్గం ఘనంగా సన్మానించింది. తానా జాతీయస్థాయిలో తెలుగు వారందరికి మాతృ సంస్థ అని, గతంలో తానా, టాంటెక్స్ కలసి ఇక ముందు కూడా కలిసి పని చేస్తూ, పరస్పర సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలియజేశారు. గాంధీ స్మారక ప్రాంతాన్ని సందర్శించిన జొన్నవిత్తుల ఈ సాహితీ సమావేశం తర్వాత డా. ప్రసాద్ తోటకూరతో కలసి జొన్నవిత్తుల అమెరికాలోనే అతి పెద్దదైన 18 ఎకరాల పార్క్ లో నెలకొల్పిన మహాత్మాగాంధీ స్మారక ప్రాంతాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఒక మధురానుభూతి అని, ఈ స్మారక నిర్మాణం వెనుక డా. తోటకూర ప్రసాద్ గారి కృషి, పట్టుదల, అకుంటిత దీక్షను కొనియాడదగినదని జొన్నవిత్తుల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తానా కార్యవర్గ బృందం డా. అడుసుమిల్లి రాజేష్, చలపతి కొండ్రకుంట, శ్రీకాంత్ పోలవరపు, దినేష్ త్రిపురనేని, సతీష్ కొమ్మన, రాజ నల్లూరి, రవి అల్లూరి, శ్రీనివాస్ కొమ్మినేని, పరమేష్ దేవినేని, శేషారావు బొడ్డు, శివ రావూరి, లోకేష్ నాయుడు కొణిదాల, సుబ్బరావు కారసాల, శ్రీని మండువ, అనిల్ ఆరేపల్లి, రావు కల్వల, డా. సి.ఆర్.రావు, డా. విశ్వనాధం పులిగండ్ల, ఎం.వి.యల్.ప్రసాద్, టాంటెక్స్ పూర్వధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, విజయ్ కాకర్ల, రాజా రెడ్డి, గీతా దమ్మన్న, ఆర్.కె పండిటి, ఉత్తరాధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు, ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ తోపుదుర్తి, శ్రీకాంత్ జొన్నల, టాటా అధ్యక్షులు విక్రం జంగం, నాటా ఉత్తరాధ్యక్షులు డా. శ్రీధర్ రెడ్డి కొర్శపాటి, ఆటా బోర్డు అఫ్ డైరెక్టర్ సతీష్ రెడ్డి తో సహా ఎంతో మంది పుర ప్రముఖులు పాల్గొన్నారు. -
ఘనంగా నెల నెలా తెలుగు వెన్నెల 12వ వార్షికోత్సవం
డాలస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల 144వ సాహిత్య సదస్సు,12వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆదివారం జూలై 14న డాలస్‌లో సాహిత్య వేదిక సమన్వయ కర్త, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ఆధ్వర్యంలో సదస్సు కన్నుల పండుగగా జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 144 నెలలుగా సాహితీ వేత్తల నడుమ ఈ సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డాలస్‌లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వఛ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు. ముందుగా ఉత్తర టెక్సాస్ కార్యవర్గ, పాలక మండలి సభ్యులు, అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత సాహిత్య వేదిక సమన్వయ కర్త కృష్ణా రెడ్డి కోడూరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం స్వాతి కృష్ణమూర్తి విద్యార్థులు దీప్తి గాలి, హాసిని దారా, సాహితి శంక, మనోగ్య బొమ్మదేవర, శ్రీనిధి తాటవర్తి, ఉదయ్ ఓమరవెల్లిల ప్రార్థనా గీతంతో మొదలైంది. ఆ తర్వాత త్యాగరాజ, అన్నమాచార్యుల సంకీర్తనలను వీణా నాద మంజరి పేరుతో ఉమా ప్రభల, అమృత వర్షిణి అకాడమీ వారి సంగీత విద్యార్థులు శ్రావ్య కస్తూరి, ప్రనికా కస్తూరి చాలా చక్కగా వినిపించారు. తర్వాత డాక్టర్ వాణీ కుమారి ఆధునిక చారిత్రిక కావ్యాలు అనే విషయం మీద మాట్లాడి సాహిత్య ప్రియులకి గురువు ప్రాధాన్యతని వివరించారు. మహా భారతంలో అర్జునుడికి గురువుగా శ్రీ కృష్ణుడి ఉపదేశం, ఛత్రపతి శివాజీ గురువుగా సమర్థ రామదాసు, శ్రీ కృష్ణ దేవరాయలు గురువు తిమ్మరుసు ప్రాధాన్యతలని వివరించారు. అనంతరం డా. కేయన్ మల్లేశ్వరి రచనా నేపద్యపు ఎంపిక - స్వీయానుభవాలు అనే అంశంపైన మాట్లాడుతూ రచయిత లేదా రచయిత్రులు రచనా విషయాన్ని ఎలా ఎంచుకొంటారో వివరించారు. శ్రీ చేగొండి సత్యనారాయణ మూర్తి.. నిజ సంస్కృతి వైభవం-పద్య గాన విశ్లేషణ అనే అంశం మీద పద్యాలతో పాడుతూ మన భాషలో ఎన్ని యాసలున్నా ఎన్ని ప్రాంతాలకి చెందినవారమైన మనమంతా తెలుగువారము, మన మంతా భరతమాత ముద్దు బిడ్డలమంటూ దేశ సమగ్రత -జాతీయతని చాలా చక్కగా వివరించారు. డా. ప్రసాద్ తోటకూర యుగ పురుషుడు వీరేశలింగం శత వర్ధంతి అనే అంశంపైన మాట్లాడుతూ.. వీరేశలింగం సమాజంలో తీసుకువచ్చిన సంఘ సంస్కరణల గురుంచి వివరించారు. తర్వాత డా. నందిని సిద్దా రెడ్డి సాహిత్యం -మానవ సంబంధాలు అనే అంశం మీద మాట్లాడారు. డా. సుధా కల్వగుంట్ల లాస్య సుధా డ్యాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో వారి బృందం హనుమాన్ చాలీసాని నాట్యంతో ప్రదర్శించి చూపారు. ఈ కార్యక్రమానికి కుమారి కీర్తన కల్వగుంట్ల కొరియో గ్రాఫర్ గాను , కుమారి నర్తన కల్వగుంట్ల కో ఆర్డినేటర్ గాను వ్యవహరించారు. ఆ తర్వాత నంది అవార్డ్ గ్రహీత శ్రీ బగాది రామచంద్ర నాయుడు బృందం సత్యహరిచంద్ర నాటకంలోని కాటిసీనును ప్రదర్శించి సాహిత్య ప్రియులను మెప్పించినారు. ఈ నాటకంలో చంద్రమతిగా స్థానికులైన కిరణ్మయి వేముల చక్కగా నటించారు. అటు పిమ్మట నాట్యాంజలి డ్యాన్స్ అకాడమీ, శ్రీ లతా సూరి బృందం అన్నమయ్య పద లాస్య మాలిక అనే నాట్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సాహిత్య వేదిక పూర్వ సభ్యులని, పోషక దాతలని, విచ్చేసిన అతిథులందరినీ గుర్తించి జ్ఞాపిక, శాలువాతో గౌరవించడం జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి కోడూరు సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ 5, మన టి.వి, టీవీ 9, టి.ఎన్.ఐ, ఏక్ నజర్, దేసిప్లాజా, వెంకట్ మీడియా మిత్రులకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు. ఈ కార్యక్రమం అధ్యక్షుడు చినసత్యం ప్రసంగంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి సాహిత్య వేదిక సదస్సు సమన్వయ కర్త కృష్ణా రెడ్డి కోడూరు, అధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఉపాధ్యక్షురాలు లక్ష్మి పాలేటి, కోశాధికారి శరత్ యర్రం, సహ కార్యదర్శి ప్రబంద్ తోపుదుర్తి, పాలకమండలి అధిపతి ఎన్‌ఎమ్‌ఎస్ రెడ్డి, సాహిత్య వేదిక కమిటీ సభ్యురాలు స్వర్ణ అట్లూరి, కార్యవర్గ సభ్యులు, సతీష్ బండారు, లోకేష్ నాయుడు, హరీష్, పూర్వాధ్యక్షులు డా. ఊర్మిండి నరసింహా రెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, పాలకమండలి పూర్వాధిపతి రామ కృష్ణా రెడ్డి, చంద్ర కన్నెగంటి, భాస్కర్, సాంబ దొడ్డ, మురళీ వెన్నం, సీఆర్ రావు, రాఘవేంద్ర, రమేష్ సీరా, చంద్రహాస్, అనంత్ మల్లవరపు, లెనిన్ వేముల, కిరణ్మయి వేముల, జ్యోతి వనం, వాణి గజ్జెల, అమర్ నాధ రెడ్డి తరిమెల, మంజుల కన్నెగంటి, కళ్యాణ్, భాను ఇవటూరి, సురేష్ మండువ, రావు కలువల, సేనియర్ జర్నలిస్ట్ శ్రీశైలం సిల్వేరి, అనురాధ సిరిగిన, శ్రీనివాస్ సిరిగిన, డాక్టర్ ఇస్మాయిల్, పరిమళ మార్పాకతో పాటు అనేక మంది సాహిత్య ప్రియులు పాల్గొని, సభికుల హర్షద్వానాల మధ్య సాహిత్య వేదిక 12వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేసారు . -
సైకియాట్రిస్ట్ ఝాన్సీ రాజ్ ఆత్మహత్య
టెక్సాస్ : అమెరికాలో సైకియాట్రిస్ట్‌గా పేరొందిన ప్రవాస తెలుగు మహిళ డాక్టర్ ఝాన్సీ రాజ్ ఆత్మహత్య చేసుకున్నారు. టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో నివసించే ఝాన్సీ తన కారును స్వయంగా డ్రైవ్ చేస్తూ సరస్సులోకి దింపి బలవన్మరణానికి పాల్పడ్డారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఝాన్సీ నిత్యం చురుకుగా, ధైర్యంగా ఉండేవారు. ఆమె ఎందుకు ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నారనేది వెల్లడి కాలేదు. ఝాన్సీ ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో 1976లో వైద్య విద్యను అభ్యసించారు. అమెరికాలో ఆమె 43 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ ప్రముఖ సైకియాట్రిస్ట్‌గా గుర్తింపు పొందారు. -
డల్లాస్‌లో వందేమాతరం శ్రీనివాస్‌కు సత్కారం
డల్లాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో జూన్ 11న దేశీప్లాజాలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించారు. ఆయనను.. టాంటెక్స్ కార్యదర్శి మహేష్ పార్నపల్లి, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, శ్రీకాంత్ రెడ్డిజొన్నల పుష్పగుచ్చంతో వేదిక మీదకు ఆహ్వానించారు. ఆయనతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, కార్యదర్శి మహేష్ పార్నపల్లి, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, శ్రీకాంత్ రెడ్డిజొన్నల, పాలకమండలి అధిపతి ఎన్‌ఎమ్‌ఎస్ రెడ్డి, పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, డా. ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి శాలువా కప్పి, జ్ఞాపికను అందించారు. అనంతరం వీర్నపు సత్యనారాయణ మాట్లాడుతూ.. వందేమాతరం శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందని, ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పూర్వధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, విశ్వనాద్ పులిగండ్ల, రావు కలవల, డా. పూదుర్ జగదీశ్వరన్, సి.ఆర్.రావు, లెనిన్ వేముల, డా. రమణ జువ్వాడి, చంద్రహాస్ మద్దుకూరి తదితరులు పాల్గొన్నారు. -
డాలస్‌లో 141వ నెల నెలా తెలుగువెన్నెల సాహిత్య సదస్సు
డాలస్, టెక్సస్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ ఆధ్వర్యంలో "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 141 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థయొక్క విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి హాజరై జయప్రదం చేశారు. ఈ కార్యక్రమాన్ని చిన్నారి మాడ సమన్విత ప్రార్థనా గీతాన్ని ఆలపించి ప్రారంభించింది. తెలిదేవర మంజు శిష్యులు వెంపటి సీత, శ్రీలత మల్లాడి, చిరంజీవి గెడ్డశ్రీయ హృద్యంగా వీణా వాద్యంతో ముందుకు సాగిన ఉగాది కవి సమ్మేళనంలో డా. ఊరిమిండి నరసింహారెడ్డి రవీంద్రుని గీతాంజలి, మాడ మాడ్దయాకర్ కవితా గానం, మద్దుకూరి చంద్రహాస్ సోషల్ మీడియా పోస్ట్‌లపై రాసినస్వీయ కవిత, మల్లవరపు అనంత్ స్వీయ రచన "కొంటెతామర", కన్నెగంటి చంద్ర స్వీయ కవిత "మళ్ళీ ఇంకో వసంతం", పుదూర్ జగదీశ్వరన్ స్వీయ రచనతో సాగి వేముల లెనిన్ జాషువా లఘు ఖండిక "గిజిగాడు" సమీక్షతోముగిసింది. చిన్నారులు వేముల సాహితీప్రియ, వేములసింధూర, మాడ సమన్విత కందుకూరి రచన "ఎంత చక్కనిదోయి ఈ తెలుగు" అంటూచక్కగా పాడి ప్రశంసలు అందుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత్రి డా.రాజ్యశ్రీకేతవరపు రచించిన వంద ప్రశ్నలు-వేలభావాలు పుస్తకావిష్కరణ జరిగింది. ప్రముఖ విశ్లేషకులు నియోగి రచయిత్రి కవిత్వంపై రాసిన సాహిత్య విశ్లేషణ, తనకుసంధించిన 100 ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు పొందుపరిచి ఈ పుస్తకం ప్రచురించినట్లు తెలిపారు. పుస్తకంపై జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, అధ్యక్షులు వీర్నపుచినసత్యం స్పందించారు. ముఖ్య అతిథిగా విచ్చేసినప్రముఖ రచయిత్రి డా.రాజ్యశ్రీ కేతవరపు "షడ్రుచులసమ్మేళనం-కవిత్వం" అనే అంశంపై ప్రసంగించారు. ప్రతిరుచికి చక్కని ఉదాహరణలతో అనర్గళంగా సాగినప్రసంగంతో అందరి ప్రశంసలు అందుకున్నారు. గీతామృతంలో భగవద్గీతలో శ్లోకాలను సామాన్యమానవుడికి అర్థమయ్యేరీతిలో రాయడంలో తనఅనుభవాలను వివరించారు. ముఖ్యఅతిథి భట్రాజు రాణిని పుష్పగుచ్ఛముతో సత్కరించి సమన్వయకర్తగా వ్యవహరించి అట్లూరి స్వర్ణ సభకు పరిచయం చేశారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు వీర్నపు చినసత్యం, పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డసుబ్రహ్మణ్యం, పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి దుశ్శలువా, సాహిత్యవేదిక బృందసభ్యులు జ్ఞాపికతో సత్కరించారు. ఉపాధ్యక్షులు పాలేటిలక్ష్మి, పాలకమండలి సభ్యులు కన్నెగంటి చంద్ర, కార్యవర్గసభ్యులు మండిగ శ్రీలక్ష్మి సాహిత్య వేదిక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీర్నపు చినసత్యం ముఖ్య అతిథి ప్రసంగంపై స్పందిస్తూగత ఐదు సంవత్సారాలుగా పలుమార్లు తెలుగు వెలుగుపత్రికకు కథలు కవితలు అందిస్తున్న రచయిత్రిని ఈవిధంగా కలవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. -
టెక్సాస్‌లో ఉగాది ఉత్సవాలు
టెక్సాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఉగాదిని ఘనంగా జరుపుకున్నారు. వికారినామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ.. సంబరాల్లో మునిగితేలారు. యూలెస్లోని ట్రినిటి హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొన్నారు. 150కి పైగా పిల్లలు, పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ అలరించారు. టాంటెక్స్ 2019 ‘ఉగాది పురస్కారాల’ను ఈ సంవత్సరం సాహిత్యం, సంగీతం, నాట్యం, సమాజ సేవ, సాంకేతిక, వైద్య రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు ప్రకటించారు. తెలుగు సాహిత్య రంగంలో కిరణ్ ప్రభ , సంగీతం రంగంలో శ్రీనివాస్ ప్రభల, నాట్యం రంగంలో శ్రీమతి శ్రీలత సూరి, సమాజ సేవ రంగంలో శ్రీకాంత్ పోలవరపు . సాంకేతిక రంగంలో డా. సాంబారెడ్డి, వైద్యరంగంలో డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి , డా. కోసూరి రాజు మొదలైన వారికి ఈ పురస్కారాలను అందజేశారు. వివిధ కార్యక్రమాలలో తమదైన శైలిలో సేవలను అందిస్తున్న, అవినాష్ వెల్లంపాటి, కిరణ్మయి వేములలకు ‘ఉత్తమ స్వచ్ఛంద సేవకుడు (బెస్ట్ వాలంటీర్) ’ పురస్కారంతో సత్కరించి వారి సేవా ధృక్పదాన్ని పలువురికి చాటారు. జీవన సాఫల్య పురస్కారం డా. ప్రేమ్‌రెడ్డికి ఇచ్చారు. ప్రత్యేక అతిధిగా విచ్చేసిన ట్రినిటీ హైస్కూల్ సూపరింటెండెంట్ డా. స్టీవ్ చాప్మన్ మాట్లాడుతూ తెలుగు వారి విశిష్టత మరియు సేవా కార్యక్రమాలను కొనియాడారు. తరువాత డా. స్టీవ్ చాప్‌మన్‌ను ఘనంగా సత్కరించారు. సంస్థ అధ్యక్షులు చినసత్యం వీర్నపు.. ట్రినిటీ హైస్కూల్ ఆడిటోరియంను ఉచితంగా ఇప్పించిన డా. తోటకూర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కళాకారుల సన్మాన కార్యక్రమంలో భాగంగా గాయకులు సుమంగళి, నరేంద్ర, మిమిక్రి ఆర్టిస్ట్ కళారత్నమల్లం రమేష్, వ్యాఖ్యాత రఘు వేముల లకు జ్ఞాపికలతో టాంటెక్స్ సంస్థ కార్యవర్గబృందం సభ్యులు సత్కరించారు. -
‘నెల నెలా తెలుగు వెన్నెల’ 140వ సాహిత్య సదస్సు
డల్లాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 140వ సాహిత్య సదస్సు డల్లాస్‌లో ఘనంగా నిర్వహించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆదివారం (మార్చి 17న) ఈ కార్యక్రమం జరిగింది. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డల్లాస్‌లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వఛ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు. ప్రవాసంలో నిరాటంకంగా 140 నెలలుగా ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సదస్సు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. ఈ కార్యక్రమాన్ని సాహిత్య ,సింధూ దేశభక్తి గేయంతో మొదలు పెట్టారు. అనంతరం కవులు, రచయితలు అనేక అంశాలపై మాట్లాడి చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డాక్టర్ వేమూరి వెంకటేశ్వర రావు తెలుగుతో నా పోరాటం కథ అనే అంశం మీద మాట్లాడారు. సైన్స్‌ని తెలుగులో, తెలుగును ఆధునిక అవసరాలకి సరిపోయే విధంగా తేలిక పరిస్తే బాగుంటుందని ఆయన భావించారు. సైన్స్‌లో తనకి కావాల్సిన పదజాలాన్ని ఎలా సేకరించారో వివరించడమే కాకుండా ఆ పదజాలంతో వేమూరి నిఘంటుకు ఎలా రూపకల్పన చేశారో తెలిపారు. అనంతరం సాహిత్య వేదిక కమిటీ సభ్యులు, ఉత్తర టెక్సాస్ తెలుగు సంభం కార్యవర్గ సభ్యులు, పాలక మండలి సభ్యులు డాక్టర్ వేమూరి వెంకటేశ్వర్ రావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ అధ్యక్షుడు చినసత్యం వీర్నపు, ఉత్తరాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి, సతీష్ బండారు, శ్రీకాంత్ జొన్నల, పాలక మండలి సభ్యులు చంద్ర కన్నెగంటి, పవన్ నెల్లుట్ల, సాహిత్య వేదిక కమిటీ సభ్యులు స్వర్ణ అట్లూరి, బసాబత్తిన, డాక్టర్ ఇస్మాయిల్, ఇతర కార్యవర్గ సభ్యులు, భాషాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.