టాంటెక్స్ 134వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు | TANTEX cunducts nela nela telugu vennela summit in Dallas | Sakshi
Sakshi News home page

టాంటెక్స్ 134వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు

Published Mon, Sep 17 2018 11:02 AM | Last Updated on Mon, Sep 17 2018 1:30 PM

TANTEX cunducts nela nela telugu vennela summit in Dallas - Sakshi

డల్లాస్, టెక్సాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సు జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రవాసంలో నిరాటంకంగా 134 నెలలు పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం టాంటెక్స్ విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేశారు.

ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారులు వేముల సాహితి, వేముల సింధూర “కట్టెదురా వైకుంటము”, “అన్నమయ్య క్రుతి” కీర్తనలతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. దీపావళి గురించి రాసిన స్వీయ కవిత చదివి వినిపించారు. డా. ఊరిమిండి నరసింహ రెడ్డి - మన తెలుగు సిరి సంపదలు శీర్షికన, నానుడి, జాతీయాలు, పొడువు కథలు గురించి  ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు.  డా. ఉమాదేవి బల్లూరి చదివి వాటి అర్ధం ప్రశ్నలు సమాధానాలు అడుగుతూ సభ్యులను తమ చమత్కారమైన సమధాలనాలతో ఆనందభరితులను చేశారు. దయాకర్ మాడ 'చాటువుల' గురించి మాట్లాడుతూ రక రకాల ఇతివృత్తాలను సోదాహరణంగా వివరించారు. చివరగా బావపై బావమరిది రాసిన పద్యం చదివి దాని భావాన్ని వివరించి నవ్వించారు. డా. పుదూర్ జగదీశ్వరన్ ఆముక్తమాల్యదలోని ఒక పద్యాన్ని చదివి దాని అర్ధం వివరించారు.
లెనిన్ వేముల తెలుగు శాసనాల చరిత్రని, పరిణామక్రమాన్ని వివరించారు.

సాహిత్య వేదిక బృంద సభ్యుడు దయాకర్ మాడ ముఖ్య అతిథి వి.ఆర్.విధ్యార్ధిని సభకు పరిచయం చేశారు. నెలనెలా తెలుగు వెన్నెల సాహితీ సమావేశానికి వి.ఆర్.విధ్యార్ధి తమ ఉపన్యాసంలో ప్రపంచ సాహిత్య పునాదులు, ఆధునిక తెలుగు సాహిత్యంపై పాశ్చాత్య ఆధునిక సాహిత్య ప్రభావాలు, ఆధునిక తెలుగు సాహిత్యానికి మార్గదర్శకులైన వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు మొదలగు వారి ప్రస్తావన తెస్తూ ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక్కో మార్గంలో ప్రముఖులైన కాళోజీ, శేషేంద్ర, అంపశయ్య నవీన్, పోట్లపల్లి రామారావు, కొందరు ఈతరం కవులు, రచయితల సాహిత్యం గురించి చర్చించారు. ఇంకా అమెరికాలో జరుగుతున్న తెలుగు సాహిత్య కృషిని కొనియాడారు. ముఖ్యంగా అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని మొదటి తరం సాహితీ వేత్తలు ముందు తరాల కందించే విధానానికి ముగ్దుడై అమెరికాలోని సాహితీ వేత్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

వి.ఆర్.విధ్యార్ధిని  టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షురాలు శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. వి.ఆర్.విధ్యార్ధి తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిధ్యం అందించిన  టాంటెక్స్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు.  టాంటెక్స్ అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం మాట్లాడుతూ వి.ఆర్.విధ్యార్ధి సేవలను కొనియాడారు. సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement