Nela Nela Telugu Vennela Summit
-
టాంటెక్స్‌లో ఘనంగా ''నెలనెల తెలుగువెన్నెల'' 208వ సాహిత్య సదస్సు
డాలస్‌లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగు వెన్నెల' 208 వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. ''తెలుగు భాషా సాహిత్యాలు- సమకాలీన సందిగ్ధ సమస్యలు'' అనే అంశంపై సదస్సు రసవత్తరంగా జరిగింది. ముందుగా ఈ వేదిక లెనిన్ వేముల "హిమగిరి తనయే హేమలతే" ప్రార్ధనా గీతంతో ప్రారంభమయ్యింది. పాలక మండలి సభ్యులు సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగతోపన్యాసం చేసి,' మాసానికో మహనీయుడు' శీర్షికలో గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయ శర్మ గారి పాండిత్య ప్రతిభావిశేషాలను సభకు పరిచయం చేశారు. 'మన తెలుగు సిరి సంపదలు' శీర్షికన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం రసవత్తరంగా సాగింది. లెనిన్ వేముల గారు గుర్రం జాషువా ''గబ్బిలం'' పద్య గానం సాహితీ ప్రియులను ఆకట్టుకుంది. తరువాత ప్రముఖ రచయిత సత్యం మందపాటి గారు శ్రీ మధురాంతకం రాజారాం గారి తోనూ,శ్రీ నరేంద్ర గారితోనూ తన జ్ఞాపకాలను పంచుకొన్నారు.. మధురాంతకం రాజారాం గారి మేనల్లుడు శ్రీ భాస్కర్ పులికల్ గారు మధురాంతకం రాజారామ్ గారితో తన అనుబంధాన్ని తెలియజేయడంతో పాటు తన బావ మధురాంతకం నరేంద్ర గారితో తన రచనల ప్రయాణాన్ని విశదీకరించడం జరిగింది . ఈ వేదికకు విచ్చేసిన ముఖ్య అతిథి ఆచార్య మధురాంతకం నరేంద్ర మాట్లాడుతూ.. తన తండ్రి శ్రీ మధురాంతకం రాజారాం తెలుగు, ఆంగ్లభాషలలో రచయిత, కథకులు కావడంతో తెలుగు భాషా సాహిత్యం పై మక్కువ పెంచుకొని తాను విద్యార్థి దశలోనే కథలు రాయడం మొదలు పెట్టినట్లు తెలిపారు. కథ చదివే ప్రతి వ్యక్తిలో తద్వారా మన సమాజంలో ఒక సకారాత్మకమైన మార్పు తీసుకురావాలనేది తన ఆకాంక్షగా పేర్కొన్నారు.తన తండ్రి పేరు మీదుగా ''కథాకోకిల'' అనే పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏడాది కొందరు మంచి రచయితలను సత్కరించడాన్ని అలవాటుగా చేసుకున్నానని తెలిపారు. భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించబడడంతో భాషకి జరుగుతున్న నష్టాలను సోదాహరణంగా వివరిస్తూ తొండనాడు చరిత్ర ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో సగం చిత్తూరు జిల్లా, స్వర్ణముఖి నదికి దక్షిణంగా ఉండే నెల్లూరు జిల్లా, తమిళనాడులోని చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాడు, దక్షిణ ఆర్కాడు జిల్లాలు, చెన్నయ్, పాండిచ్చేరి నగరాలు కలిగిన ప్రాంతం తొండనాడుఅనీ రెండు వేల ఏళ్లనాటి తమిళ సంగ సాహిత్యంలో తొండనాడు ప్రస్తావన ఉందనీ తొండనాడు ప్రాంతంలోని తమిళ, తెలుగు రచయితల రచనలను పరిశీలించినపుడు తెలుగు తమిళ భాషలు పెనవేసుకొని ఉండడాన్ని గమనించవచ్చు అని చెప్పారు. మన నుంచి విడిపోయినప్పటికీ ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి,నాగర్ కోయిలు, తూత్తుకుడి,శ్రీ విల్లి పుత్తూరు, మదురై, తంజావూరు, తిరువాయూరు, కోసూరు, ప్రాంతాల్లో ఇప్పటికీ తెలుగు మాట్లాడే వారి సంఖ్య అధికముగా ఉందన్నారు. తెలుగు తమిళ భాషలు రెండూ వారి దైనందిన జీవితంలో భాగం కావడం గమనించదగిన విషయమన్నారు. అదేవిధంగా మాండలిక భాష రచనలను ప్రస్తావిస్తూ అందరికీ అర్థమయ్యే భాషలో రాయడమే ఉత్తమ విధానమని అన్నారు. తరువాత మధురాంతకం రాజారామ్ గారితో అమెరికాలో అనుభవాలను డాక్టర్ బోయారెడ్డి గారు సాహితీ ప్రియులతో పంచుకొన్నారు. సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర ,ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, చంద్రహాస్ మద్దుకూరి,డాక్టర్ కోట సునీల్, గోవర్ధనరావు నిడిగంటి నరేంద్ర గారి ప్రసంగంపై తమ తమ ప్రతిస్పందనలు తెలియచేశారు. తర్వాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు, తదుపరి అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, పాలకమండలి ఉపాధిపతి శ్రీ హరి సింఘం మరియు సంస్థ సమన్వయ కర్త శ్రీ దయాకర్ మాడ నేటి ముఖ్య అతిథి మధురాంతకం నరేంద్ర గారికి టాంటెక్స్ సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి సన్మానించడం జరిగింది. ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈ సన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందన్నారు ఆచార్య మధురాంతకం నరేంద్ర . సభలో ప్రత్యక్షంగా, అంతర్జాలంలో అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొనడంతో సదస్సు విజయవంతమైంది. చివరిగా దయాకర్ మాడ వందన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సతీష్ బండారు, తమ అధ్యక్షోపన్యాసంలో, సంస్థ పూర్వాధ్యక్షులకూ, సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ,ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు, సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి, అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనలు తెలిపారు అధ్యక్షులు సతీష్ బండారు. (చదవండి: తానా ఆధ్వర్యంలో వైభవంగా 'మన భాష–మన యాస’ 'మాండలిక భాషా అస్తిత్వం') -
ఘనంగా నెల నెలా తెలుగు వెన్నెల 12వ వార్షికోత్సవం
డాలస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల 144వ సాహిత్య సదస్సు,12వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆదివారం జూలై 14న డాలస్‌లో సాహిత్య వేదిక సమన్వయ కర్త, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ఆధ్వర్యంలో సదస్సు కన్నుల పండుగగా జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 144 నెలలుగా సాహితీ వేత్తల నడుమ ఈ సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డాలస్‌లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వఛ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు. ముందుగా ఉత్తర టెక్సాస్ కార్యవర్గ, పాలక మండలి సభ్యులు, అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత సాహిత్య వేదిక సమన్వయ కర్త కృష్ణా రెడ్డి కోడూరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం స్వాతి కృష్ణమూర్తి విద్యార్థులు దీప్తి గాలి, హాసిని దారా, సాహితి శంక, మనోగ్య బొమ్మదేవర, శ్రీనిధి తాటవర్తి, ఉదయ్ ఓమరవెల్లిల ప్రార్థనా గీతంతో మొదలైంది. ఆ తర్వాత త్యాగరాజ, అన్నమాచార్యుల సంకీర్తనలను వీణా నాద మంజరి పేరుతో ఉమా ప్రభల, అమృత వర్షిణి అకాడమీ వారి సంగీత విద్యార్థులు శ్రావ్య కస్తూరి, ప్రనికా కస్తూరి చాలా చక్కగా వినిపించారు. తర్వాత డాక్టర్ వాణీ కుమారి ఆధునిక చారిత్రిక కావ్యాలు అనే విషయం మీద మాట్లాడి సాహిత్య ప్రియులకి గురువు ప్రాధాన్యతని వివరించారు. మహా భారతంలో అర్జునుడికి గురువుగా శ్రీ కృష్ణుడి ఉపదేశం, ఛత్రపతి శివాజీ గురువుగా సమర్థ రామదాసు, శ్రీ కృష్ణ దేవరాయలు గురువు తిమ్మరుసు ప్రాధాన్యతలని వివరించారు. అనంతరం డా. కేయన్ మల్లేశ్వరి రచనా నేపద్యపు ఎంపిక - స్వీయానుభవాలు అనే అంశంపైన మాట్లాడుతూ రచయిత లేదా రచయిత్రులు రచనా విషయాన్ని ఎలా ఎంచుకొంటారో వివరించారు. శ్రీ చేగొండి సత్యనారాయణ మూర్తి.. నిజ సంస్కృతి వైభవం-పద్య గాన విశ్లేషణ అనే అంశం మీద పద్యాలతో పాడుతూ మన భాషలో ఎన్ని యాసలున్నా ఎన్ని ప్రాంతాలకి చెందినవారమైన మనమంతా తెలుగువారము, మన మంతా భరతమాత ముద్దు బిడ్డలమంటూ దేశ సమగ్రత -జాతీయతని చాలా చక్కగా వివరించారు. డా. ప్రసాద్ తోటకూర యుగ పురుషుడు వీరేశలింగం శత వర్ధంతి అనే అంశంపైన మాట్లాడుతూ.. వీరేశలింగం సమాజంలో తీసుకువచ్చిన సంఘ సంస్కరణల గురుంచి వివరించారు. తర్వాత డా. నందిని సిద్దా రెడ్డి సాహిత్యం -మానవ సంబంధాలు అనే అంశం మీద మాట్లాడారు. డా. సుధా కల్వగుంట్ల లాస్య సుధా డ్యాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో వారి బృందం హనుమాన్ చాలీసాని నాట్యంతో ప్రదర్శించి చూపారు. ఈ కార్యక్రమానికి కుమారి కీర్తన కల్వగుంట్ల కొరియో గ్రాఫర్ గాను , కుమారి నర్తన కల్వగుంట్ల కో ఆర్డినేటర్ గాను వ్యవహరించారు. ఆ తర్వాత నంది అవార్డ్ గ్రహీత శ్రీ బగాది రామచంద్ర నాయుడు బృందం సత్యహరిచంద్ర నాటకంలోని కాటిసీనును ప్రదర్శించి సాహిత్య ప్రియులను మెప్పించినారు. ఈ నాటకంలో చంద్రమతిగా స్థానికులైన కిరణ్మయి వేముల చక్కగా నటించారు. అటు పిమ్మట నాట్యాంజలి డ్యాన్స్ అకాడమీ, శ్రీ లతా సూరి బృందం అన్నమయ్య పద లాస్య మాలిక అనే నాట్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సాహిత్య వేదిక పూర్వ సభ్యులని, పోషక దాతలని, విచ్చేసిన అతిథులందరినీ గుర్తించి జ్ఞాపిక, శాలువాతో గౌరవించడం జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి కోడూరు సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ 5, మన టి.వి, టీవీ 9, టి.ఎన్.ఐ, ఏక్ నజర్, దేసిప్లాజా, వెంకట్ మీడియా మిత్రులకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు. ఈ కార్యక్రమం అధ్యక్షుడు చినసత్యం ప్రసంగంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి సాహిత్య వేదిక సదస్సు సమన్వయ కర్త కృష్ణా రెడ్డి కోడూరు, అధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఉపాధ్యక్షురాలు లక్ష్మి పాలేటి, కోశాధికారి శరత్ యర్రం, సహ కార్యదర్శి ప్రబంద్ తోపుదుర్తి, పాలకమండలి అధిపతి ఎన్‌ఎమ్‌ఎస్ రెడ్డి, సాహిత్య వేదిక కమిటీ సభ్యురాలు స్వర్ణ అట్లూరి, కార్యవర్గ సభ్యులు, సతీష్ బండారు, లోకేష్ నాయుడు, హరీష్, పూర్వాధ్యక్షులు డా. ఊర్మిండి నరసింహా రెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, పాలకమండలి పూర్వాధిపతి రామ కృష్ణా రెడ్డి, చంద్ర కన్నెగంటి, భాస్కర్, సాంబ దొడ్డ, మురళీ వెన్నం, సీఆర్ రావు, రాఘవేంద్ర, రమేష్ సీరా, చంద్రహాస్, అనంత్ మల్లవరపు, లెనిన్ వేముల, కిరణ్మయి వేముల, జ్యోతి వనం, వాణి గజ్జెల, అమర్ నాధ రెడ్డి తరిమెల, మంజుల కన్నెగంటి, కళ్యాణ్, భాను ఇవటూరి, సురేష్ మండువ, రావు కలువల, సేనియర్ జర్నలిస్ట్ శ్రీశైలం సిల్వేరి, అనురాధ సిరిగిన, శ్రీనివాస్ సిరిగిన, డాక్టర్ ఇస్మాయిల్, పరిమళ మార్పాకతో పాటు అనేక మంది సాహిత్య ప్రియులు పాల్గొని, సభికుల హర్షద్వానాల మధ్య సాహిత్య వేదిక 12వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేసారు . -
టాంటెక్స్ 134వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
డల్లాస్, టెక్సాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సు జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రవాసంలో నిరాటంకంగా 134 నెలలు పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం టాంటెక్స్ విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారులు వేముల సాహితి, వేముల సింధూర “కట్టెదురా వైకుంటము”, “అన్నమయ్య క్రుతి” కీర్తనలతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. దీపావళి గురించి రాసిన స్వీయ కవిత చదివి వినిపించారు. డా. ఊరిమిండి నరసింహ రెడ్డి - మన తెలుగు సిరి సంపదలు శీర్షికన, నానుడి, జాతీయాలు, పొడువు కథలు గురించి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు. డా. ఉమాదేవి బల్లూరి చదివి వాటి అర్ధం ప్రశ్నలు సమాధానాలు అడుగుతూ సభ్యులను తమ చమత్కారమైన సమధాలనాలతో ఆనందభరితులను చేశారు. దయాకర్ మాడ 'చాటువుల' గురించి మాట్లాడుతూ రక రకాల ఇతివృత్తాలను సోదాహరణంగా వివరించారు. చివరగా బావపై బావమరిది రాసిన పద్యం చదివి దాని భావాన్ని వివరించి నవ్వించారు. డా. పుదూర్ జగదీశ్వరన్ ఆముక్తమాల్యదలోని ఒక పద్యాన్ని చదివి దాని అర్ధం వివరించారు. లెనిన్ వేముల తెలుగు శాసనాల చరిత్రని, పరిణామక్రమాన్ని వివరించారు. సాహిత్య వేదిక బృంద సభ్యుడు దయాకర్ మాడ ముఖ్య అతిథి వి.ఆర్.విధ్యార్ధిని సభకు పరిచయం చేశారు. నెలనెలా తెలుగు వెన్నెల సాహితీ సమావేశానికి వి.ఆర్.విధ్యార్ధి తమ ఉపన్యాసంలో ప్రపంచ సాహిత్య పునాదులు, ఆధునిక తెలుగు సాహిత్యంపై పాశ్చాత్య ఆధునిక సాహిత్య ప్రభావాలు, ఆధునిక తెలుగు సాహిత్యానికి మార్గదర్శకులైన వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు మొదలగు వారి ప్రస్తావన తెస్తూ ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక్కో మార్గంలో ప్రముఖులైన కాళోజీ, శేషేంద్ర, అంపశయ్య నవీన్, పోట్లపల్లి రామారావు, కొందరు ఈతరం కవులు, రచయితల సాహిత్యం గురించి చర్చించారు. ఇంకా అమెరికాలో జరుగుతున్న తెలుగు సాహిత్య కృషిని కొనియాడారు. ముఖ్యంగా అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని మొదటి తరం సాహితీ వేత్తలు ముందు తరాల కందించే విధానానికి ముగ్దుడై అమెరికాలోని సాహితీ వేత్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. వి.ఆర్.విధ్యార్ధిని టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షురాలు శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. వి.ఆర్.విధ్యార్ధి తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిధ్యం అందించిన టాంటెక్స్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. టాంటెక్స్ అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం మాట్లాడుతూ వి.ఆర్.విధ్యార్ధి సేవలను కొనియాడారు. సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రకృతి పాటలతో పులకించిన 'తెలుగు వెన్నెల'
టెక్సస్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' సదస్సు ఆదివారం దేశీ ప్లాజా టీవీ స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ల ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రముఖ జానపద గాయని శ్రీమతి తేలు విజయ పల్లె పాటలతో ప్రారంభమైంది. డా.జువ్వాడి రమణ మాట్లాడుతూ... దాశరథి రచించిన నా తెలంగాణ కోటి రతనాల వీణ పాటను గానం చేశారు. ఈ సందర్భంగా దాశరథి రాసిన ఆ పాటను ఆయన కూలంకుషంగా వివరించారు. డాలస్ వాస్తవ్యులు వేముల లెనిన్ పితృ దినోత్సవం, మాతృ దినోత్సవం సందర్భంగా రచించిన పద్యాలను చదివి వినిపించారు. పునేకు చెందిన స్పీచ్ థెరఫిస్టు అజిత్ హరిసింఘాని ఆంగ్ల రచనను కొల్లూరు సోమశంకర్ తెలుగులో 'ప్రయాణానికే జీవితం' అనే పేరుతో అనువదించారు. ఈ పుస్తకాన్ని సాహిత్య వేదిక సభ్యులు బసాబత్తిన శ్రీనివాసులు సభకు పరిచయం చేశారు. ఆ పుస్తకంలోని పలు అంశాలను ఆయన ఈ సందర్భంగా సవివరంగా విశదీకరించారు. ఈ 107వ సాహిత్య సదస్సుకి లోక కవి డా.అందెశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకృతి - కవితాకృతి అనే అంశంపై ఆయన ప్రసంగించారు. 2010లో మిసిసిప్పీ నది నుంచి ప్రపంచయాత్ర మొదటిపెట్టి మళ్లీ 2016లో మిసిసిప్పీలోనే పూర్తి చేసిన విశేషాలను ఆయన హృద్యంగా పంచుకున్నారు. అందెశ్రీ ప్రకృతి మీద తీయని పాటలు పాడుతూ దాదాపు రెండున్నర గంటలు ఆహుతులను మంత్రముగ్థులను చేశారు. ఆ తర్వాత ఆహుతులతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం చాలా సరదాగా సాగింది. అందె శ్రీ ప్రసంగాన్ని తొలిసారిగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న టాంటెక్స్ తరంగిణి రేడియో కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అనంతరం అందెశ్రీని టాంటెక్స్ అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షుడు ఉప్పలపాటి కృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు. సాహిత్య వేదిక బృందం సభ్యులు జ్ఞాపిక అందజేశారు. వేసవి నేపథ్యంలో డాలస్‌లో చిన్నారులకు సంగీత శిక్షణ ఇవ్వడానికి వచ్చిన రామాచారి కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. భావితరాలకు తెలుగు భాషని పంచవలసిన అవశ్యకతను రామాచారి ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో తక్షణ పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, కార్యవర్గ సభ్యులు మండిగ శ్రీలక్ష్మి, కోడూరు కృష్ణారెడ్డి మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు డా.కలవగుంట సుధ, అట్లూరి స్వర్ణ, మార్తినేని మమత, మాడ దయాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ల ప్రవీణ్ ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషీ, టీవీ 5, టీఎన్ఐలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రవాసంలో నిరాటంకంగా 107 నెలల పాటు సాహితీవేత్తల నడుమ ఈ సంస్థ సాహిత్య సదస్సులు నిర్వహించడం విశేషం. డాలస్‌లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేశారు.