టాంటెక్స్‌లో ఘనంగా ''నెలనెల తెలుగువెన్నెల'' 208వ సాహిత్య సదస్సు | TANTEX Conduct 208th Nela Neal Telugu Vennela Sahithi Summit | Sakshi
Sakshi News home page

టాంటెక్స్‌లో ఘనంగా ''నెలనెల తెలుగువెన్నెల'' 208వ సాహిత్య సదస్సు

Published Wed, Nov 27 2024 4:30 PM | Last Updated on Wed, Nov 27 2024 4:31 PM

TANTEX Conduct 208th Nela Neal Telugu Vennela Sahithi Summit

డాలస్‌లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగు వెన్నెల' 208 వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది.  ''తెలుగు భాషా సాహిత్యాలు- సమకాలీన సందిగ్ధ సమస్యలు'' అనే అంశంపై సదస్సు రసవత్తరంగా జరిగింది. ముందుగా ఈ వేదిక లెనిన్ వేముల  "హిమగిరి తనయే హేమలతే" ప్రార్ధనా గీతంతో ప్రారంభమయ్యింది. పాలక మండలి సభ్యులు సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగతోపన్యాసం చేసి,' మాసానికో మహనీయుడు' శీర్షికలో గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయ శర్మ గారి పాండిత్య ప్రతిభావిశేషాలను సభకు పరిచయం చేశారు.                                                                                               
'మన తెలుగు సిరి సంపదలు' శీర్షికన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం రసవత్తరంగా సాగింది. లెనిన్ వేముల గారు గుర్రం జాషువా  ''గబ్బిలం'' పద్య గానం సాహితీ ప్రియులను ఆకట్టుకుంది. తరువాత ప్రముఖ రచయిత సత్యం మందపాటి గారు శ్రీ మధురాంతకం రాజారాం గారి తోనూ,శ్రీ  నరేంద్ర గారితోనూ తన జ్ఞాపకాలను పంచుకొన్నారు..
 
మధురాంతకం రాజారాం గారి మేనల్లుడు శ్రీ భాస్కర్ పులికల్ గారు  మధురాంతకం రాజారామ్ గారితో తన అనుబంధాన్ని  తెలియజేయడంతో పాటు  తన బావ మధురాంతకం నరేంద్ర గారితో తన రచనల ప్రయాణాన్ని విశదీకరించడం  జరిగింది . ఈ వేదికకు విచ్చేసిన ముఖ్య అతిథి ఆచార్య  మధురాంతకం నరేంద్ర మాట్లాడుతూ.. తన తండ్రి శ్రీ మధురాంతకం రాజారాం  తెలుగు, ఆంగ్లభాషలలో  రచయిత, కథకులు కావడంతో తెలుగు భాషా సాహిత్యం పై మక్కువ పెంచుకొని  తాను విద్యార్థి దశలోనే  కథలు రాయడం మొదలు పెట్టినట్లు తెలిపారు.
 
కథ చదివే ప్రతి వ్యక్తిలో తద్వారా మన సమాజంలో ఒక సకారాత్మకమైన మార్పు తీసుకురావాలనేది తన ఆకాంక్షగా పేర్కొన్నారు.తన  తండ్రి పేరు మీదుగా ''కథాకోకిల'' అనే పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏడాది కొందరు మంచి రచయితలను సత్కరించడాన్ని అలవాటుగా చేసుకున్నానని తెలిపారు. భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించబడడంతో భాషకి జరుగుతున్న నష్టాలను సోదాహరణంగా వివరిస్తూ తొండనాడు చరిత్ర ప్రస్తావించారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో సగం చిత్తూరు జిల్లా, స్వర్ణముఖి నదికి దక్షిణంగా ఉండే నెల్లూరు జిల్లా, తమిళనాడులోని చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాడు, దక్షిణ ఆర్కాడు జిల్లాలు, చెన్నయ్, పాండిచ్చేరి నగరాలు కలిగిన ప్రాంతం తొండనాడుఅనీ  రెండు వేల ఏళ్లనాటి తమిళ సంగ సాహిత్యంలో తొండనాడు ప్రస్తావన ఉందనీ  తొండనాడు ప్రాంతంలోని తమిళ, తెలుగు రచయితల రచనలను పరిశీలించినపుడు తెలుగు తమిళ భాషలు పెనవేసుకొని ఉండడాన్ని గమనించవచ్చు అని చెప్పారు. 
 
మన నుంచి విడిపోయినప్పటికీ ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి,నాగర్ కోయిలు, తూత్తుకుడి,శ్రీ విల్లి పుత్తూరు, మదురై, తంజావూరు, తిరువాయూరు, కోసూరు, ప్రాంతాల్లో ఇప్పటికీ తెలుగు మాట్లాడే వారి సంఖ్య అధికముగా ఉందన్నారు. తెలుగు తమిళ భాషలు  రెండూ వారి  దైనందిన జీవితంలో భాగం కావడం గమనించదగిన విషయమన్నారు. అదేవిధంగా మాండలిక భాష రచనలను ప్రస్తావిస్తూ అందరికీ అర్థమయ్యే భాషలో రాయడమే ఉత్తమ విధానమని అన్నారు.
 
తరువాత మధురాంతకం రాజారామ్ గారితో అమెరికాలో అనుభవాలను డాక్టర్ బోయారెడ్డి గారు సాహితీ ప్రియులతో  పంచుకొన్నారు. సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్  ప్రసాద్ తోటకూర ,ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, చంద్రహాస్ మద్దుకూరి,డాక్టర్ కోట సునీల్, గోవర్ధనరావు నిడిగంటి నరేంద్ర గారి ప్రసంగంపై తమ తమ ప్రతిస్పందనలు తెలియచేశారు. తర్వాత ఉత్తర  టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్  ప్రస్తుత అధ్యక్షులు సతీష్  బండారు, తదుపరి అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, పాలకమండలి ఉపాధిపతి శ్రీ హరి సింఘం మరియు సంస్థ సమన్వయ కర్త శ్రీ దయాకర్ మాడ నేటి ముఖ్య అతిథి మధురాంతకం నరేంద్ర గారికి   టాంటెక్స్  సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి సన్మానించడం జరిగింది.   
 
ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈ సన్మానం  అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందన్నారు ఆచార్య  మధురాంతకం నరేంద్ర . సభలో ప్రత్యక్షంగా, అంతర్జాలంలో అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొనడంతో సదస్సు విజయవంతమైంది. చివరిగా దయాకర్  మాడ  వందన సమర్పణ గావించారు. ఈ  సందర్భంగా అధ్యక్షులు సతీష్ బండారు, తమ అధ్యక్షోపన్యాసంలో, సంస్థ పూర్వాధ్యక్షులకూ,  సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ,ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన  ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు, సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక  మండలి, అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనలు తెలిపారు అధ్యక్షులు సతీష్‌ బండారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement