ప్రకృతి పాటలతో పులకించిన 'తెలుగు వెన్నెల'
టెక్సస్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' సదస్సు ఆదివారం దేశీ ప్లాజా టీవీ స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ల ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రముఖ జానపద గాయని శ్రీమతి తేలు విజయ పల్లె పాటలతో ప్రారంభమైంది.
డా.జువ్వాడి రమణ మాట్లాడుతూ... దాశరథి రచించిన నా తెలంగాణ కోటి రతనాల వీణ పాటను గానం చేశారు. ఈ సందర్భంగా దాశరథి రాసిన ఆ పాటను ఆయన కూలంకుషంగా వివరించారు. డాలస్ వాస్తవ్యులు వేముల లెనిన్ పితృ దినోత్సవం, మాతృ దినోత్సవం సందర్భంగా రచించిన పద్యాలను చదివి వినిపించారు.
పునేకు చెందిన స్పీచ్ థెరఫిస్టు అజిత్ హరిసింఘాని ఆంగ్ల రచనను కొల్లూరు సోమశంకర్ తెలుగులో 'ప్రయాణానికే జీవితం' అనే పేరుతో అనువదించారు. ఈ పుస్తకాన్ని సాహిత్య వేదిక సభ్యులు బసాబత్తిన శ్రీనివాసులు సభకు పరిచయం చేశారు. ఆ పుస్తకంలోని పలు అంశాలను ఆయన ఈ సందర్భంగా సవివరంగా విశదీకరించారు.
ఈ 107వ సాహిత్య సదస్సుకి లోక కవి డా.అందెశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకృతి - కవితాకృతి అనే అంశంపై ఆయన ప్రసంగించారు. 2010లో మిసిసిప్పీ నది నుంచి ప్రపంచయాత్ర మొదటిపెట్టి మళ్లీ 2016లో మిసిసిప్పీలోనే పూర్తి చేసిన విశేషాలను ఆయన హృద్యంగా పంచుకున్నారు.
అందెశ్రీ ప్రకృతి మీద తీయని పాటలు పాడుతూ దాదాపు రెండున్నర గంటలు ఆహుతులను మంత్రముగ్థులను చేశారు. ఆ తర్వాత ఆహుతులతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం చాలా సరదాగా సాగింది. అందె శ్రీ ప్రసంగాన్ని తొలిసారిగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న టాంటెక్స్ తరంగిణి రేడియో కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
అనంతరం అందెశ్రీని టాంటెక్స్ అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షుడు ఉప్పలపాటి కృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు. సాహిత్య వేదిక బృందం సభ్యులు జ్ఞాపిక అందజేశారు. వేసవి నేపథ్యంలో డాలస్లో చిన్నారులకు సంగీత శిక్షణ ఇవ్వడానికి వచ్చిన రామాచారి కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. భావితరాలకు తెలుగు భాషని పంచవలసిన అవశ్యకతను రామాచారి ఈ సందర్భంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో తక్షణ పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, కార్యవర్గ సభ్యులు మండిగ శ్రీలక్ష్మి, కోడూరు కృష్ణారెడ్డి మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు డా.కలవగుంట సుధ, అట్లూరి స్వర్ణ, మార్తినేని మమత, మాడ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ల ప్రవీణ్ ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషీ, టీవీ 5, టీఎన్ఐలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రవాసంలో నిరాటంకంగా 107 నెలల పాటు సాహితీవేత్తల నడుమ ఈ సంస్థ సాహిత్య సదస్సులు నిర్వహించడం విశేషం. డాలస్లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేశారు.