ఘనంగా నెల నెలా తెలుగు వెన్నెల 12వ వార్షికోత్సవం | TANTEX Nela Nela Telugu Vennela 12th Anniversary In Dallas | Sakshi
Sakshi News home page

ఘనంగా నెల నెలా తెలుగు వెన్నెల 12వ వార్షికోత్సవం

Published Thu, Jul 18 2019 9:41 PM | Last Updated on Thu, Jul 18 2019 9:43 PM

TANTEX Nela Nela Telugu Vennela 12th Anniversary In Dallas - Sakshi

డాలస్‌ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల 144వ సాహిత్య సదస్సు,12వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆదివారం జూలై 14న డాలస్‌లో సాహిత్య వేదిక సమన్వయ కర్త, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ఆధ్వర్యంలో సదస్సు కన్నుల పండుగగా జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 144 నెలలుగా సాహితీ వేత్తల నడుమ ఈ సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డాలస్‌లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వఛ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు. ముందుగా ఉత్తర టెక్సాస్ కార్యవర్గ, పాలక మండలి సభ్యులు, అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత సాహిత్య వేదిక సమన్వయ కర్త కృష్ణా రెడ్డి కోడూరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం స్వాతి కృష్ణమూర్తి విద్యార్థులు దీప్తి గాలి, హాసిని దారా, సాహితి శంక, మనోగ్య బొమ్మదేవర, శ్రీనిధి తాటవర్తి, ఉదయ్ ఓమరవెల్లిల ప్రార్థనా గీతంతో మొదలైంది. ఆ తర్వాత త్యాగరాజ, అన్నమాచార్యుల సంకీర్తనలను వీణా నాద మంజరి పేరుతో ఉమా ప్రభల, అమృత వర్షిణి అకాడమీ వారి సంగీత విద్యార్థులు శ్రావ్య కస్తూరి, ప్రనికా కస్తూరి చాలా చక్కగా వినిపించారు. తర్వాత డాక్టర్ వాణీ కుమారి ఆధునిక చారిత్రిక కావ్యాలు అనే విషయం మీద మాట్లాడి సాహిత్య ప్రియులకి గురువు ప్రాధాన్యతని వివరించారు.

మహా భారతంలో అర్జునుడికి గురువుగా శ్రీ కృష్ణుడి ఉపదేశం, ఛత్రపతి శివాజీ గురువుగా సమర్థ రామదాసు, శ్రీ కృష్ణ దేవరాయలు గురువు తిమ్మరుసు ప్రాధాన్యతలని వివరించారు. అనంతరం డా. కేయన్‌ మల్లేశ్వరి రచనా నేపద్యపు ఎంపిక - స్వీయానుభవాలు అనే అంశంపైన మాట్లాడుతూ రచయిత లేదా రచయిత్రులు రచనా విషయాన్ని ఎలా ఎంచుకొంటారో వివరించారు. శ్రీ చేగొండి సత్యనారాయణ మూర్తి.. నిజ సంస్కృతి వైభవం-పద్య గాన విశ్లేషణ అనే అంశం మీద పద్యాలతో పాడుతూ మన భాషలో ఎన్ని యాసలున్నా ఎన్ని ప్రాంతాలకి చెందినవారమైన మనమంతా తెలుగువారము, మన మంతా భరతమాత ముద్దు బిడ్డలమంటూ దేశ సమగ్రత -జాతీయతని చాలా చక్కగా వివరించారు. డా. ప్రసాద్ తోటకూర యుగ పురుషుడు వీరేశలింగం శత వర్ధంతి అనే అంశంపైన మాట్లాడుతూ.. వీరేశలింగం సమాజంలో తీసుకువచ్చిన సంఘ సంస్కరణల గురుంచి వివరించారు.  

తర్వాత డా. నందిని సిద్దా రెడ్డి సాహిత్యం -మానవ సంబంధాలు అనే అంశం మీద మాట్లాడారు. డా. సుధా కల్వగుంట్ల లాస్య సుధా డ్యాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో వారి బృందం హనుమాన్ చాలీసాని నాట్యంతో ప్రదర్శించి చూపారు. ఈ కార్యక్రమానికి కుమారి కీర్తన కల్వగుంట్ల కొరియో గ్రాఫర్ గాను , కుమారి నర్తన కల్వగుంట్ల కో ఆర్డినేటర్ గాను వ్యవహరించారు. ఆ తర్వాత నంది అవార్డ్ గ్రహీత శ్రీ బగాది రామచంద్ర నాయుడు బృందం సత్యహరిచంద్ర నాటకంలోని కాటిసీనును ప్రదర్శించి సాహిత్య ప్రియులను మెప్పించినారు. ఈ నాటకంలో చంద్రమతిగా స్థానికులైన కిరణ్మయి వేముల చక్కగా నటించారు. అటు పిమ్మట నాట్యాంజలి డ్యాన్స్ అకాడమీ, శ్రీ లతా సూరి బృందం అన్నమయ్య పద లాస్య మాలిక అనే నాట్యాన్ని ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో సాహిత్య వేదిక పూర్వ సభ్యులని, పోషక దాతలని, విచ్చేసిన అతిథులందరినీ  గుర్తించి జ్ఞాపిక, శాలువాతో గౌరవించడం జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త  కృష్ణారెడ్డి కోడూరు సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.  ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన   టీవీ 5, మన టి.వి, టీవీ 9, టి.ఎన్.ఐ, ఏక్ నజర్, దేసిప్లాజా, వెంకట్  మీడియా మిత్రులకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు. ఈ కార్యక్రమం అధ్యక్షుడు చినసత్యం ప్రసంగంతో ముగిసింది.

ఈ కార్యక్రమానికి  సాహిత్య వేదిక సదస్సు సమన్వయ కర్త కృష్ణా రెడ్డి కోడూరు, అధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఉపాధ్యక్షురాలు లక్ష్మి పాలేటి, కోశాధికారి శరత్ యర్రం, సహ కార్యదర్శి ప్రబంద్ తోపుదుర్తి, పాలకమండలి అధిపతి ఎన్‌ఎమ్‌ఎస్‌ రెడ్డి, సాహిత్య వేదిక కమిటీ సభ్యురాలు స్వర్ణ అట్లూరి, కార్యవర్గ సభ్యులు, సతీష్ బండారు, లోకేష్ నాయుడు, హరీష్, పూర్వాధ్యక్షులు డా. ఊర్మిండి నరసింహా రెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, పాలకమండలి పూర్వాధిపతి రామ కృష్ణా రెడ్డి, చంద్ర కన్నెగంటి, భాస్కర్, సాంబ దొడ్డ, మురళీ వెన్నం, సీఆర్ రావు, రాఘవేంద్ర, రమేష్ సీరా, చంద్రహాస్, అనంత్ మల్లవరపు, లెనిన్ వేముల, కిరణ్మయి వేముల, జ్యోతి వనం, వాణి గజ్జెల, అమర్ నాధ రెడ్డి తరిమెల, మంజుల కన్నెగంటి, కళ్యాణ్, భాను ఇవటూరి, సురేష్ మండువ, రావు కలువల, సేనియర్ జర్నలిస్ట్ శ్రీశైలం సిల్వేరి, అనురాధ సిరిగిన, శ్రీనివాస్ సిరిగిన, డాక్టర్ ఇస్మాయిల్, పరిమళ మార్పాకతో పాటు అనేక మంది సాహిత్య ప్రియులు పాల్గొని, సభికుల హర్షద్వానాల మధ్య  సాహిత్య వేదిక 12వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేసారు .


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement