ఘనంగా టాంటెక్స్ 112వ సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెలనెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు నవంబర్ 20న దేశీప్లాజా టీవీ స్టూడియోలో సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. డాలస్లోని భాషాభిమానులు, సాహితీప్రియులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి సభను జయప్రదం చేశారు.
112వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు బిళ్ళా ప్రవీణ్ స్వాగతం పలికారు. స్వాతి అన్నమయ్య కీర్తన గానంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంజాబ్కు చెందిన శ్రీ కుల్దీప్ సింగ్, డాలస్కి చెందిన కాజా సురేష్ తమ అనుభవాలను పంచుకున్నారు. గతంలో ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన పిస్కా సత్యనారాయణ మహాకవి శ్రీనాధుని శ్లేష చమత్కారం గురించి ప్రసంగించారు. టాంటెక్స్ పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి తెలుగు భాషలోని జాతీయాలు, సామెతలను సభికులకు గుర్తు చేశారు. ప్రతి నెల అట్లూరి స్వర్ణ నిర్వహించే ప్రశ్నావళి కార్యక్రమం సందడిగా జరిగింది. ఆర్జే శ్రీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సదస్సుని తెలుగు వన్ రేడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేముల లెనిన్ బాబుని మద్దుకూరి చంద్రహాస్ వేదిక మీదకు ఆహ్వానించగా, ప్రొఫెసర్ దంతు రాం ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. తొంభై నిముషాల పాటూ అనర్గళంగా దాశరథి గారి పాటలనే కాకుండా మహాకవి శ్రీశ్రీ పద్యాలను లెనిన్ ఆలపించారు. లెనిన్ను టాంటెక్స్ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి శాలువాతో, బిళ్ళా ప్రవీణ్, సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, కాకర్ల విజయ్, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, కార్యవర్గ సభ్యులు పావులూరి వేణు, తోట పద్మశ్రీ , పాలేటి లక్ష్మి పాల్గొన్నారు. సదస్సుకు విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు, మీడియాకు బిళ్ళా ప్రసాద్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.