టెక్సస్ : అమెరికా తెలుగు వీధికి శాశ్వత చిరునామా అయిన డాలస్లో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' ఘనంగా నిర్వహించారు. నెల నెలా తెలుగు వెన్నెల 9వ సాహిత్య వేదిక వార్షికోత్సవంతో పాటు108వ సదస్సు ఆదివారం సెయింట్ మేరీ మలంకారా చర్చి ఆడిటోరియంలో నభూతో న భవిష్యతి అన్న రీతిలో అత్యంత శోభాయమానంగా జరిగింది.
రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ ఇలా వివిధ తెలుగు ప్రాంతాల నుండి వచ్చిన ప్రముఖులు, ఆయా ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను, వ్యావహారిక శైలిని కళ్ళకు కట్టినట్లు వివరించి, ప్రాంతాలు వేరైనా , యాసలు వేరైనా మనమంతా తెలుగు తల్లి బిడ్డలం అని ఘనంగా చాటిచెప్పారు. ఇంతకు ముందెన్నడూ జరిగని ఈ అపురూప సమాగమం, అత్యద్భుత వ్యాఖ్యాన సుందరదృశ్యకావ్యం మనసుకు హత్తుకుని మైపరిచిపోయేలా చేశాయి.
టాంటెక్స్ కమిటీ సభ్యులు , సాహిత్య వేదిక సభ్యులు జ్యోతి ప్రజ్వలనం గావించగా, ఎల్ఎంఏ మ్యూజిక్ అకాడమీ విద్యార్థులు మధురంగా గానం చేయగా 9వ వార్షిక ఉత్సవం ప్రారంభమైంది. సాహిత్య వేదిక సమన్వయకర్త ప్రవీణ్ బిళ్ళా మాట్లాడుతూ, 108 నెలల క్రితం నాటిన సాహిత్య వేదిక విత్తనం దిన దిన ప్రవర్ధమానం చెంది, ఈనాడు ఒక వట వృక్షమై ఎందరో తెలుగు అభిమానులకు మధుర ఫలాలు అందిస్తోందని, ఇది సంగీత సాహిత్యాలు ఒకటిగా పెనవేసుకున్న మణిహారమన్నారు.
టాంటెక్స్ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రమణ్యం గారు మాట్లాడుతూ , 2007 లో మొదలు పెట్టిన నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఇన్ని నెలలుగా నిరాటంకంగా కొనసాగుతూ ఉత్తర అమెరికాలో మొట్టమొదటి సుదీర్ఘ తెలుగు కార్యక్రమంగా గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన గొప్ప రచయితలు,వక్తలు ప్రసంగించారు.