ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెలనెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు జనవరి 15న దేశీప్లాజా టీవీ స్టూడియోలో సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. డాలస్లోని భాషాభిమానులు, సాహితీప్రియులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి సభను జయప్రదం చేశారు. ప్రవాసంలో నిరాటంకంగా 114 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం.
ఈ సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ స్వాగతం పలికారు. 2017 ఏడాదికిగానూ సమన్వయకర్తగా శారద సింగిరెడ్డిని సభకు పరిచయం చేస్తూ వేదికమీదికి ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డా.ఆళ్ల శ్రీనివాసరెడ్డిని పరిచయం చేస్తూ ఎం.వి.ఎల్.ప్రసాద్ వేదిక మీదకు ఆహ్వానించగా డా.సి.ఆర్.రావు, కలవలరావులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో ముందుగా చిరంజీవి కమ్మంకర్ శ్రీతన్ ప్రార్థనా గీతాన్ని ఆలపించాడు. భగవద్గీత నేర్చుకుంటున్న శ్రీతన్ మొదటి, ఎనిమిదో అధ్యాయాలలో ఏ పద్యం అడిగినా పద్యం చెప్పి, అర్ధం వివరించి అందరి మెప్పు పొందాడు.
గతంలో ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన పిస్కా సత్యనారాయణ.. ద్వాపరయుగంలోని శ్రీకృష్ణుడిని, కలియుగంలోని శ్రీకృష్ణదేవరాయలని అనుసంధానిస్తూ కొన్ని పద్యాలను ఉదహరించారు. సాహిత్యవేదిక సభ్యులు డా.కలవగుంట సుధ క్షేత్రయ్య పదసాహిత్యంతో సాహితీ ప్రేక్షకులను అలరించారు. మద్దుకూరి చంద్రహాస్ 'నేనొక ప్రేమ పిపాసిని' అనే పాటలో రెండు చరణాలు పాడి, మూడో చరణంలో అందమైన సాహిత్యం దాగిఉందో వివరించారు. జువ్వాడి రమణ శాతవాహనులకి ఆ పేరు ఎలా వచ్చిందో ఈ సందర్భంగా తెలిపారు. వేముల లెనిన్ కొన్ని నన్నయ పద్యాలను పాడి వినిపించారు.
డా.ఆళ్ల శ్రీనివాసరెడ్డి 'జానపదం మరియు భావకవిత్వం'పై దాదాపు తొంభై నిమిషాలపాటు ప్రసంగించారు. జానపదంలో వేర్వేరు ప్రాంతాల యాసలను, ఆయా పాటల లక్షణాలను చెబుతూ, కవులు, రచయితల కలాల నుంచి ఎలా వెలువడ్డాయో వివరించారు. 2016ఏడాదికి సంస్థ అధ్యక్షుడిగా వ్యవహరించిన జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. నెలనెలా తెలుగువెన్నెల సదస్సును విజయవంతంగా నిర్వహిస్తున్న బృంద సభ్యులను, సమన్వయకర్తలను అభినందించారు. మూడు దశాబ్దాల చరిత్రగల సంస్థలో బాధ్యతలు చేపట్టం అదృష్టమని అధ్యక్షుడు ఉప్పలపాటి కృష్ణారెడ్డి అన్నారు.
ముఖ్య అతిథిని టాంటెక్స్ అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, పాలకమండలి అధిపతి రొడ్డ రామకృష్ణలు శాలువాతో, కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృందసభ్యులు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు శీలం కృష్ణవేణి, ఉపాధ్యక్షులు వీర్నపు చినసత్వం, కోశాధికారి గోవాడ అజయ్, సంయుక్త కోశాధికారి మండిగ శ్రీలక్ష్మి, పాలకమండలి సభ్యులు కన్నెగంటి చంద్ర, కార్యవర్గసభ్యులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, దండ వెంకట్, సింగిరెడ్డి శారద, పార్నపల్లి ఉమామహేష్, తోపుదుర్తి ప్రభంధ్, లంకా భాను, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సదస్సుకు విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు, మీడియాకు బిళ్ళా ప్రసాద్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.