అట్టహాసంగా టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు
డాలస్/ఫోర్ట్ వర్త్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) డల్లాస్ లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. సాంస్కృతిక బృంద సమన్వయకర్త లక్ష్మి పాలేటి , కార్యక్రమ సమన్వయకర్త జ్యోతి వనం ఆధ్వర్యంలో ఉప్పలపాటి కృష్ణారెడ్డి గారి అధ్యక్షతన జనవరి 28న డల్లాస్ లోని ఇర్వింగ్ హైస్కూల్లో టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ప్రధాన వ్యాఖ్యాతలుగా సమీరా ఇల్లందుల, మధుమహిత మద్దుకూరి, అభినుత మద్దుకూరిలు సంప్రదాయానికి పెద్ద పీట వేసి, ఆధునికతను మేళవించి తెలుగు వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.
2017 వ సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని టాంటెక్స్ నూతన అధ్యక్షుడు ఉప్పలపాటి కృష్ణారెడ్డిని పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం సభకు పరిచయం చేశారు. ఉప్పలపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి పర్వదినాన నూతన ఉత్సాహంతో తెలుగు భాషకు, ప్రజలకు సేవ చేయడమే పరమార్ధంగా భావిస్తానని చెప్పారు. తెలుగు జాతి మొత్తం గర్వపడేలా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని, మహా తెలుగు సభలు టాంటెక్స్ ఆధ్వరంలో నిర్వహిస్తామన్నారు.
మాజీ అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గతేడాది మీరు అందించిన సహాయ సహకారాలు ఈ సంవత్సరం కూడా కొనసాగించాలని, తెలుగు జాతి అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. జొన్నలగడ్డకి శాలువా కప్పి పుష్పగుచ్చాలతో టాంటెక్స్అధ్యక్షులు కృష్ణా రెడ్డి ఉప్పలపాటి గారు, పాలకమండలి సభ్యులు ఘనంగా సన్మానించారు. అలాగే కార్యనిర్వాహక సభ్యులుగా విశేష సేవలందించిన జ్యోతి వనం, వెంకట్ దండ, రఘుగజ్జల, సుగన్ చాగర్లమూడి, శ్రీనివాస రెడ్డి గుర్రంలను జ్ఞాపికలతో సత్కరించారు.ఇక్కడికి విచ్చేసిన టాటా సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు, డైమండ్పోషక దాత డా.ఝాన్సి రెడ్డిని కార్యవర్గం సన్మానించింది.
విశిష్ట అతిధి, బుల్లి తెర వ్యాఖ్యాత, చలన చిత్ర నటుడు జెమిని సురేష్ తన సినీ అనుభవాలను పంచుకున్నారు. స్వరమంజరి అనే కార్యక్రమం ద్వారా టాంటెక్స్ వారు నూతన కళాకారులను వెలుగులోకి తెచ్చి వారికి చక్కని అవకాశాలు కల్పిస్తారు. 2016 విజేతలయిన స్నిగ్ధ ఏలేశ్వరపు, కీర్తి చామకూర, దీపికా కాకర్ల అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను మైమరపింప చేశారు. శ్రీ లక్ష్మితోరం నేతృత్వంలో నాట్య ప్రదర్శన, గిరిజా ఆనంద్ రూపకల్పనలో ‘శివ పూజకు వేళాయరా’, శ్రీ దేవి యడ్లపాటి గారి ఆధ్వర్యంలో ‘శంభో శివ శంభో’ అనే పాటకు, జయలక్ష్మి గొర్తి ‘శ్రీమాన్నారాయణ’ శాస్త్రీయ నృత్యం, రూప బంద రూపకల్పనలో ‘ఓం మహాప్రాణ దీపం’ నృత్యం, హేమమాలిని చావలి ‘కొలువైతివా రంగ సాయి’ అంటూ చక్కని నృత్యాలు కనుల విందు చేశాయి.
నూతన కార్యనిర్వాహక సభ్యులు భాను లంక, మనోహర్ కాసగాని, ప్రబంధ రెడ్డి తోపుదుర్తి, శరత్ రెడ్డి ఎర్రం, సమీరా ఇల్లందులను, పాలక మండలి సభ్యులు చంద్ర కన్నెగంటి, రాం కొనార, వేణు పావులూరిలను కమిటీలోకి ఆహ్వానించారు. క్రాంతి కార్యక్రమం చేపట్టిన చంద్రశేఖర్ కాజ,అజయ్ గోవాడ, శ్రీలు మండిగ, జెమిని సురేశ్ లను సత్కరించారు.
ఆహూతులకు టచ్ నైన్ వారు పసందైన విందు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో చీరలు, చుడిదార్లు, గాజులతో నిండిన ఎన్నో స్టాల్ లు అతివలకోసం ఏర్పాటుచేశారు. అక్కడే టాక్స్ ఫైలింగ్ ఏర్పాట్లు, యోగ, ఆర్యోగ సంబంధిత స్టాల్ ల ద్వారా ఎన్నో విషయాలు తెలిపారు. సంక్రాంతి సంబరాలు” కార్యక్రమ సమన్వయకర్త జ్యోతి వనం , ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథులకు, రుచికరమైన విందు భోజనం వడ్డించిన టచ్ నైన్ రెస్టారెంట్ యాజమాన్యంకు, మరియు నేటి కార్యక్రమ పోషకులకు కృతఙ్ఞతలు తెలియజేశారు.