టెక్సాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 139వ సాహిత్య సదస్సు డల్లాస్‌లో ఘనంగా నిర్వహించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆదివారం (ఫిబ్రవరి 17) ఈ కార్యక్రమం జరిగింది. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డల్లాస్‌లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వఛ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు. ప్రవాసంలో నిరాటంకంగా 139 నెలలుగా ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సదస్సు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత.
కార్యక్రమంలో ముందుగా పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ పుదూర్ జగదీశ్వరన్ తన 'ఆముక్త మాల్యద' పరిచయపు ధారావాహికను, ఎన్‌ఆర్‌యూ తెలుగు సామెతలు, నుడికారాల పరిచయపు ప్రహేళికను కొనసాగించారు. ఇటీవలే స్వర్గస్తులైన డాక్టర్ హేమలత పుట్ల జీవనయానాన్ని, రచనలను మరొక్క సారి గుర్తు చేస్తూ డాక్టర్ ఇస్మాయిల్ పెనుగొండ నివాళులు అర్పించారు. గీతాంజలి పేరుతో రచనలు చేస్తున్న ప్రముఖ రచయిత్రి డాక్టర్ భారతి, లలితానంద్ ప్రసాద్ స్వీయ కవితా గానాన్ని చేశారు.
'సందూక' లో పొందుపరిచి..
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణ స్వామి వెంకట యోగి గారిని దయాకర్ మాడ సభకు పరిచయం చేస్తూ.. ముఫై ఏళ్ల సుదీర్ఘ సాహితీ ప్రస్థానంలో నిబద్ధతతో వ్యవహరిస్తూ.. పీడితుల పక్షాన, బాధితుల గొంతుకగా మారి, తన అనుభవాల్ని, జ్ఞాపకాల్ని 'సందూక' లో పొందుపరిచి, తాను కన్న 'కల్లోల కలల మేఘం'.. ఉరుములు మెరుపులు కురిపిస్తూ 'వానొస్తదా ?' అని ప్రశ్నించే భావుకుడిగా అభివర్ణించారు. ఖండాలు దాటినా తన కవిసంగమపు కవిత్వ కరచాలనాన్ని మర్చిపోకుండా అక్షరీకరించి 'నడిసొఛ్చిన తొవ్వ' గా పదిలపరుచుకున్నారు. 'వానొస్తదా ?' సంపుటిలోని కొన్ని కవితలను నసీం సభకు చదివి వినిపించారు.
సద్విమర్శ అవసరం..
ప్రధాన వక్త నారాయణ స్వామి వెంకట యోగి .. 'తెలుగులో వర్తమాన కవిత్వం - కవిత్వ విమర్శ ' అంశంపై ప్రసంగించారు. ప్రబంధ కాలం నుంచి నేటి దాకా సాహిత్యంలో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరించారు. స్థానికతకు నేటి కవితలలో ఉన్న ప్రాధాన్యతను, సామాజిక మాధ్యమాలలో విరివిగా వెళ్లి విరుస్తున్న నూతన గొంతుకలను, వారి వినూత్న కవితా వస్తువులను సభకు పరిచయం చేశారు. సద్విమర్శను తట్టుకోగలిగే స్థైర్యాన్ని కవులు కలిగి ఉండాలని, విమర్శకులు కూడా ముఖస్తుతికి కాకుండా వస్తు విమర్శ నిర్మొహమాటంగా చేయాలన్నారు. సరైన సద్విమర్శతో ఇటు రచయితకి అటు సాహిత్యానికి మేలు జరుగుతుందని వక్కాణించారు. 90 నిమిషాల పాటు ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది.
ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షుడు చినసత్యం వీర్నపు, ఉత్తరాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి, కార్యదర్శి ఉమామహేష్ పార్నపల్లి, కోశాధికారి శరత్ యర్రం, సతీష్ బండారు, ఇతర కార్యవర్గ సభ్యులు, పాలక మండలి సభ్యులు చంద్ర కన్నెగంటి, సాహిత్య వేదిక కమిటీ సభ్యులు ముఖ్య అతిథి నారాయణ స్వామిని జ్ఞాపిక, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment