డల్లాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 140వ సాహిత్య సదస్సు డల్లాస్‌లో ఘనంగా నిర్వహించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆదివారం (మార్చి 17న) ఈ కార్యక్రమం జరిగింది. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డల్లాస్‌లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వఛ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు. ప్రవాసంలో నిరాటంకంగా 140 నెలలుగా ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సదస్సు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత.
ఈ కార్యక్రమాన్ని సాహిత్య ,సింధూ దేశభక్తి గేయంతో మొదలు పెట్టారు. అనంతరం కవులు, రచయితలు అనేక అంశాలపై మాట్లాడి చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డాక్టర్ వేమూరి వెంకటేశ్వర రావు తెలుగుతో నా పోరాటం కథ అనే అంశం మీద మాట్లాడారు. సైన్స్‌ని తెలుగులో, తెలుగును ఆధునిక అవసరాలకి సరిపోయే విధంగా తేలిక పరిస్తే బాగుంటుందని ఆయన భావించారు. సైన్స్‌లో తనకి కావాల్సిన పదజాలాన్ని ఎలా సేకరించారో వివరించడమే కాకుండా ఆ పదజాలంతో వేమూరి నిఘంటుకు ఎలా రూపకల్పన చేశారో తెలిపారు.
అనంతరం సాహిత్య వేదిక కమిటీ సభ్యులు, ఉత్తర టెక్సాస్ తెలుగు సంభం కార్యవర్గ సభ్యులు, పాలక మండలి సభ్యులు డాక్టర్ వేమూరి వెంకటేశ్వర్ రావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ అధ్యక్షుడు చినసత్యం వీర్నపు, ఉత్తరాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి, సతీష్ బండారు, శ్రీకాంత్ జొన్నల, పాలక మండలి సభ్యులు చంద్ర కన్నెగంటి, పవన్ నెల్లుట్ల, సాహిత్య వేదిక కమిటీ సభ్యులు స్వర్ణ అట్లూరి, బసాబత్తిన, డాక్టర్ ఇస్మాయిల్, ఇతర కార్యవర్గ సభ్యులు, భాషాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment