డల్లాస్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సు డిసెంబర్ 15న వీర్నపు చినసత్యం అధ్యక్షతన డల్లాస్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రవాసంలో నిరాటంకంగా 149 నెలల పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం గొప్ప విశేషం. ఈ కార్యక్రమానికి భాషాభిమానులు, సాహిత్య ప్రియులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని జయప్రదం చేశారు. కార్యక్రమంలో ముందుగా ప్రముఖ సాహితీవేత్త, ప్రముఖ రంగస్థల నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి డా. గొల్లపూడి మారుతీరావు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఘనమైన నివాళులు అర్పించారు.
గొల్లపూడి ఆకస్మిక మృతి మా అందరిని విషాదానికి గురి చేసిందని ప్రముఖ రంగస్థల నటుడు రామచంద్రనాయుడు పేర్కొన్నారు. కాగా, టాంటెక్స్ మొట్టమొదటి సాహిత్య వేదికను గొల్లపూడి ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఆ తర్వాత వేముల సాహితీ, వేముల సింధూర ' శ్రీరామదాసు ' కీర్తనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన తెలుగు సిరి సంపదలు, నానుడి, జాతీయాలు, పొడుపు కథలు అడిగి డా. ఉరిమిండి నరసింహరెడ్డి సభికులను ఆసక్తి రేకెత్తించారు.
టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం సంహావలోకనం శీర్షికన గత 11 నెలలుగా నిర్వహించిన సాహిత్య సదస్సులకు విచ్చేసిన ముఖ్య అతిథులు, వారు మాట్లాడిన అంశాలను టూకీగా వివరించారు. ఈ సంవత్సరం మీ అందరి సహకారంతో ఎంతోమంది అతిథులను మన వేదికపైకి తీసుకొచ్చామని తెలిపారు. అలాగే జాతీయ సంస్థలు తానా, నాట్స్‌తో కలిసి టాంటెక్స్ సంయుక్తంగా ఎన్నో సాహిత్య సదస్సులు నిర్వహించామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందివాడ భీమారావు గారిని వీర్నపు చినసత్యం సభకు పరిచయం చేశారు. ఆ తర్వాత నందివాడ భీమారావు రచించిన ' ది ఆర్ట్ ఆఫ్ ది ఇంపాసిబుల్' పుస్తకావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి చంద్రశేఖర్, తోటకూర ప్రసాద్, జొన్నలగడ్డ సుబ్రమణ్యం, ఉరిమిండి నరసింహరెడ్డి, ఆనందమూర్తి, లలితామూర్తి కూచిబొట్ల, సతీష్ బండారు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment