Gollapudi Maruti Rao
-
గొల్లపూడి మారుతీరావు సతీమణి కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
Gollapudi Maruthi Rao Wife Passed Away In Chennai: దివంగత సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు సతీమణి శివకామసుందరి(81) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు దృవీకరించారు. 1961లో గొల్లపూడి మారుతీరావుతో ఆమెకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అప్పటి నుంచి వారు చెన్నైలోనే స్థిరపడ్డారు. కాగా 2019లో అనారోగ్యంగా గొల్లపూడి మరణించిన సంగతి తెలిసిందే. ఇక గొల్లపూడి మారుతీరావు భార్య మరణం గురించి తెలుసుకొని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో 'తెలుగు సాహిత్య సదస్సు'
డల్లాస్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సు డిసెంబర్ 15న వీర్నపు చినసత్యం అధ్యక్షతన డల్లాస్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రవాసంలో నిరాటంకంగా 149 నెలల పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం గొప్ప విశేషం. ఈ కార్యక్రమానికి భాషాభిమానులు, సాహిత్య ప్రియులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని జయప్రదం చేశారు. కార్యక్రమంలో ముందుగా ప్రముఖ సాహితీవేత్త, ప్రముఖ రంగస్థల నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి డా. గొల్లపూడి మారుతీరావు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఘనమైన నివాళులు అర్పించారు. గొల్లపూడి ఆకస్మిక మృతి మా అందరిని విషాదానికి గురి చేసిందని ప్రముఖ రంగస్థల నటుడు రామచంద్రనాయుడు పేర్కొన్నారు. కాగా, టాంటెక్స్ మొట్టమొదటి సాహిత్య వేదికను గొల్లపూడి ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఆ తర్వాత వేముల సాహితీ, వేముల సింధూర ' శ్రీరామదాసు ' కీర్తనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన తెలుగు సిరి సంపదలు, నానుడి, జాతీయాలు, పొడుపు కథలు అడిగి డా. ఉరిమిండి నరసింహరెడ్డి సభికులను ఆసక్తి రేకెత్తించారు. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం సంహావలోకనం శీర్షికన గత 11 నెలలుగా నిర్వహించిన సాహిత్య సదస్సులకు విచ్చేసిన ముఖ్య అతిథులు, వారు మాట్లాడిన అంశాలను టూకీగా వివరించారు. ఈ సంవత్సరం మీ అందరి సహకారంతో ఎంతోమంది అతిథులను మన వేదికపైకి తీసుకొచ్చామని తెలిపారు. అలాగే జాతీయ సంస్థలు తానా, నాట్స్‌తో కలిసి టాంటెక్స్ సంయుక్తంగా ఎన్నో సాహిత్య సదస్సులు నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందివాడ భీమారావు గారిని వీర్నపు చినసత్యం సభకు పరిచయం చేశారు. ఆ తర్వాత నందివాడ భీమారావు రచించిన ' ది ఆర్ట్ ఆఫ్ ది ఇంపాసిబుల్' పుస్తకావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి చంద్రశేఖర్, తోటకూర ప్రసాద్, జొన్నలగడ్డ సుబ్రమణ్యం, ఉరిమిండి నరసింహరెడ్డి, ఆనందమూర్తి, లలితామూర్తి కూచిబొట్ల, సతీష్ బండారు తదితరులు పాల్గొన్నారు. -
మా అసోషియేషన్ ఎక్కడ..?
పెరంబూరు: గొల్లపూడి మారుతీరావు భౌతికాకాయానికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంతిమయాత్రలో బంధువులతో పాటు పలువురు అభిమానులు పాల్గొన్నారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక టీ.నగర్‌లోని కన్మమ్మపేటలోని శ్మశానవాటికలో శస్త్ర బద్ధంగా గొల్లపూడికి అంత్యక్రియలు జరిగాయి. ఆయన పెద్ద కొడుకు రామకృష్ణ కర్మకాండలను నిర్వహించారు. అంతకుముందు ఇంటి వద్ద పలువురు సినీప్రముఖులు, బంధువులు గొల్లపూడి మారుతీరావు భౌతిక కాయానికి నివాళ్లులర్పించారు. లబ్ద ప్రతిష్టుడు గొల్లపూడి గొల్లపూడి మారుతీరావు లబ్దప్రతిష్టుడని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గొల్లపూడికి అంజలి ఘటించిన బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గొల్లపూడి సతీమణి తనను చూసి మీరు ఆయనకు ఆత్మబంధువు అని అన్నారన్నారు. అది తన భాగ్యంగా పేర్కొన్నారు. గొల్లపూడి తాను నిర్మించిన శుభసంకల్పం చిత్రానికి మాటలు అందించడంతో పాటు ప్రముఖ పాత్రను పోషించారని గుర్తు చేశారు. ఆ చిత్రం ద్వారా ఆయనతో తన పయనం ఆరు నెలలు అద్భుతంగా సాగిందని తెలిపారు. ఆయన భాషా సాంస్కృతికవేత్తతో పాటు మంచి విశ్లేషకుడని కీర్తించారు. అలా ఆయన నుంచి సాంస్కృతిక పరమైన విషయాలను చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఇంట్లో కంటే బయట జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పాల్గొనడాన్ని తాను ఇష్టపడేవాడినని చెప్పారు. ఆయన ఎన్నో జాతీయ, అంతర్జాతీయ విషయాలను చాలా గొప్పగా విశ్లేషించేవారని చెప్పారు. తెలుగు భాష ఏమైపోతుందోనని చాలా మంది బాధ పడుతుంటారన్నారు. నిజానికి భాష ఎక్కడికీ పోదన్నారు. గొల్లపూడి లాంటి వారు ఉన్నంత వరకూ భాషకు కలిగే ముప్పేమీ లేదన్నారు. గొల్లపూడి మహా ప్రతిభామూర్తి అని పేర్కొన్నారు. గొప్ప చేతన, శ్రేయస్సుకారుడని అన్నారు. గొప్పవారు లేని లోటు తీర్చలేనిదంటారని, అయితే నిజంగా ఒక శూన్యం ఉంటుందని, దాన్ని ఎవరూ భర్తీ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అలాంటి వారి లక్ష్యాలను మనం ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. మారుతీరావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుటూ, ఆయన కటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి నిర్మాత దగ్గుబాటి సురేశ్ గొల్లపూడితో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గొల్లపూడి చాలా మంచి వ్యక్తి అని అన్నారు. తాము ఈ పక్క వీధిలోనే ఉండేవాళ్లం అని, ప్రారంభ దశ నుంచే నాన్నతో గొల్లపూడికి మంచి అనుబంధం ఉండేదని అన్నారు. వెంకటేశ్ నటించిన పలు చిత్రాల్లో ఆయన నటించారని, లీడర్ చిత్రంలోనూ గొల్లపూడి మంచి పాత్రను పోషించారని చెప్పారు. దురదృష్టవశాత్తు ఆయన చిన్న కొడుకు మరణించడంతో ఆయన పేరుతో ఒక జాతీయ అవార్డును నెలకొల్పి నూతన ప్రతిభావంతులకు ప్రదానం చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నానన్నారు. గొల్లపూడి హీరో కూడా గొల్లపూడి మారుతీరావు హీరో అని సీనియర్ నిర్మాత, దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ పేర్కొన్నారు. గొల్లపూడితో తనకు 1974 నుంచే పరిచయం ఉందన్నారు. ఆయన నాటకాల నుంచి వచ్చిన తరువాత లక్ష్మీ ప్రొడక్షన్లో గోస్ట్ రైటర్‌గా పని చేశారని గుర్తు చేశారు. ఆ తరువాత తాను నిర్మించిన మూడు చిత్రాల్లో నటించినట్లు తెలిపారు. గొల్లపూడి మారుతీరావు నటుడు, రచయిత, సాహితీవేత్తనే కాకుండా హీరోగా నటించారన్నారు. సంసారం ఒక చదరంగం చిత్రంలో ఆయనే హీరో అని పేర్కొన్నారు. ఆయన పత్రికల్లో రాసిన శీర్షికలు ఎంతో ప్రాచుర్యం పొందినట్లు తెలిపారు. ఏ రోజు ఏ టాపిక్‌పై రాస్తారోనని ఆసక్తిగా ఎదురు చూసేవారని అన్నారు. అదే విధంగా సీనియర్ నిర్మాత ఏకాంబరేశ్వరరావు గొల్లపూడి భౌతక కాయానికి నివాళులర్పించి తను అనుభవాలను పంచుకున్నారు. గొల్లపూడిని దర్శకుడు కోడిరామకృష్ణకు పరిచయం చేసింది తానేనని చెప్పారు. తన మిత్రుడు, భాగస్వామి అయిన కే.రాఘవకి సిఫార్సు చేసి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రానికి మాటలు రాయించడంతో పాటు అందులో నటింపజేసినట్లు తెలిపారు. కాగా జేకే రెడ్డి, టీటీడీ స్థానిక సలహామండలి మాజీ అధ్యక్షుడు శ్రీకృష్ణ గొల్లపూడి భౌతిక కాయానికి నివాళులర్పించారు. కాగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు తొలి గ్రహీత ఆంగ్లోఇండియన్ లెస్లీ కార్వోలో గొల్లపూడికి నివాళులర్పించారు. కాగా ప్రఖ్యాత నటుడు, రచయితగా పేరు గాంచిన గొల్లపూడి మారుతీరావుకు నివాళులర్పించడానికి మా అసోషియేషన్ నుంచి ఏ ఒక్కరూ కూడా వచ్చి నివాళులర్పించకపోవడం ఖండించదగ్గ విషయం. -
నేడు గొల్లపూడి అంత్యక్రియలు
తమిళ సినిమా: ప్రఖ్యాత సినీ నటుడు, సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు భౌతిక కాయానికి ఆదివారం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయన భౌతిక కాయాన్ని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, భానుచందర్, నటీమణులు సుహాసిని, ప్రభ, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్తో పాటు పలువురు రాజకీయ, పారిశ్రామిక వేత్తలు సందర్శించి ఘన నివాళి అర్పించారు. ఆయన మనవళ్లు, మనవరాళ్లు విదేశాల నుంచి శనివారం చెన్నై చేరుకోగా.. ఓ ప్రైవేటు ఆస్పత్రి మార్చురీలో ఉన్న భౌతిక కాయాన్ని టి.నగర్‌లోని నివాసానికి తీసుకొచ్చి ఆప్తులు, కుటుంబీకుల సందర్శనార్థం ఉంచారు. ఆయన వద్ద శిక్షణ పొందా: చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. గొల్లపూడి తనకు మంచి మిత్రుడని, అంతకంటే గొప్ప ఆప్తుడని చెప్పారు. ఆయనతో 1989లో పరిచయం ఏర్పడిందని, తాను ఆయన వద్ద కొన్ని వారాల పాటు శిక్షణ తీసుకున్నానని వెల్లడించారు. గొల్లపూడి తాను నటించిన ఐ లవ్ యూ చిత్రానికి మాటలు రాశారని, ఆ తర్వాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంలో కలిసి నటించామని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి తమ అనుబంధం కొనసాగుతూ వచ్చిందన్నారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరన్నారు. ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ గొల్లపూడి గొప్ప నటుడు, రచయిత, వక్త అని కొనియాడారు. తనకు ఆయనతో చిరకాల అనుబంధం ఉందన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు తీర్చలేనిదని పేర్కొన్నారు. ఇదిలావుండగా.. గొల్లపూడి అంత్యక్రియలను ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో టి.నగర్‌లోని కన్నమ్మపేట శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
సముద్రం మౌనం దాల్చింది
ఒక కెరటం తీరానికి నుదురు తాకించి మరి అలాగే ఉండిపోయింది. ఒక వాక్ప్రవాహం తన ధారను నెమ్మదింపజేసి విరామం ప్రకటించింది. ఒక చేయి రాసి రాసి కాగితాల బొత్తిని ఆఖరుసారి అటక మీద విసిరేసింది. ఒక ముఖం తాను పూసుకునే రంగును అక్కర్లేనట్టుగా నేలన ఒంపేసింది. ఒక పదేపదే వచ్చే ప్రస్తావన ఇక రాలేనన్నట్టుగా పక్కకు తప్పుకుంది. ఒక అనంత జ్ఞాపకాల రాశి మన్నింపు కోరుతూ తనను తాను శూన్యపరుచుకుంది. ఒక సముద్రం తన ఘోషను చాలించింది. ఒక కడలి మౌనం దాల్చింది. గొల్లపూడి మారుతీరావుకు ‘సాయంకాలమైపోయింది’. ‘సంసారం ఒక చదరంగం’ సినిమాలో నెల ఖర్చుల దగ్గర తండ్రికీ కొడుక్కూ మాటామాటా పెరుగుతుంది. ఎదురుగా ఉన్నది ముసలితండ్రి. ఎదిరిస్తున్నది యవ్వనంలో ఉన్న కొడుకు. ‘నిన్ను నేను సాకాల్సిన పని లేదు’ అంటాడు కొడుకు. ‘నిన్ను కనీ పెంచి పెద్ద చేసిన ఈ తండ్రితోనే మాట్లాడుతున్నావా నువ్వు’ అంటాడు తండ్రి. ‘అవును’ అంటాడు కొడుకు. ‘నీ చదువుల కోసం ఓవర్‌టైమ్ పని చేసి ఫీజులు కట్టిన తండ్రితోనే మాట్లాడతున్నావా నువ్వు?’ అంటాడు తండ్రి. ‘అవును’ అంటాడు కొడుకు. ‘నీకు యాక్సిడెంట్ అయితే భుజాల మీద మోసుకొని వెళ్లి రక్తమిచ్చి కాపాడుకున్న తండ్రితోనే మాట్లాడుతున్నావా నువ్వు?’ అంటాడు తండ్రి. ‘అవును’ అంటాడు కొడుకు. ఇంకో తండ్రయితే ఆ క్షణంలో కుప్పకూలుతాడు. కాని ఆ తండ్రి మాత్రం, అక్కడ ఉన్న తండ్రి మాత్రం, నెరిసింది తల వెంట్రుకలే తప్ప రోషం కాదు అనుకుని తాపీగా, తీర్పుగా, పెద్దగా ‘అయితే నా ఇంట్లో నుంచి బయటకుపోరా కుక్కా’ అంటాడు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో.. ఆ క్షణంలో ఆ తండ్రి చాలామందికి గుర్తుండి పోయాడు. ఆ తండ్రిగా నిలబడ్డ గొల్లపూడి మారుతీ రావు కూడా. ఎడమ చేయి ఆడిస్తూ డైలాగ్ చెప్పి పాపులర్ అయిన తారలు ఇద్దరున్నారు తెలుగులో. ఒకరు సూర్యకాంతం. మరొకరు గొల్లపూడి మారుతీరావు. ఇద్దరూ నాటకాల నుంచి వచ్చినవాళ్లే. ‘కాని నాకు సినిమా నటన నేర్పింది మాత్రం చిరంజీవి. ఆయనే కెమెరా ముందు ఎలా నిల బడాలి, ఎలా విరమించుకోవాలి నేర్పించాడు’ అని వినమ్రంగా చెప్పుకున్నారు గొల్లపూడి. మొదటి సినిమా ‘ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య’ (1982) విడుదలయ్యి హిట్ అయ్యేంతవరకూ ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో, నాటకాల్లో, సాహితీ వ్యాసంగంలో రాణించారు గొల్లపూడి. అప్పటి వరకూ ఆయన ఏనాడూ విశ్రాంతిగా లేరు. ఆ తర్వాత కూడా లేరు. విశాఖలో బాల్యం గడపడం, విశాఖ సముద్రాన్ని చూస్తూ ఎదగడం, ఆ గాలి, ఆనాటి సాంస్కృతిక ఔన్నత్య స్పర్శ తాకుతూ ఉండటం ఆయనను ఆది నుంచి అవిశ్రాంతంగానే ఉంచింది. బి.ఎస్సీ ఆనర్స్‌లో చేరారుగాని ఏనాడూ చదువు మీద శ్రద్ధ లేదు. తెల్లవారి లేస్తే ఊరి వీధుల్లో కనిపించే పురిపండా అప్పలస్వామి, చాగంటి సోమయాజులు, రావిశాస్త్రి, అప్పుడప్పుడు శ్రీపాద వంటి గొప్పవారు ఆయనను ఊరికే ఉంచలేదు. పుస్తకాల వెంట పడేలా చేసి పదిహేనేళ్లకే కళ్లకు అద్దాలు తెచ్చుకునేలా చేశారు. చేతికి కలం ఇచ్చి రాసేందుకు పరుగులెత్తించారు. గొల్లపూడి రాయడమే కాదు ఆ రోజులలోనే పెద్ద పెద్ద ఇంగ్లిష్ నవలలని అనువాదం చేయడం మొదలెట్టారు. ఉంటున్నది విశాఖ. పక్కనే విజయనగరం. ‘కన్యాశుల్కం’ రాసిన గురజాడవారి ఊరు. చీటికిమాటికి నాటకోత్సవాలు జరిగి తారసపడే జె.వి.సోమయాజులు, జె.వి.రమణమూర్తి, కె.వెంకటేశ్వరరావు వంటి నటులు. ఆయన నాటక రచయిత అయ్యాడు. ఆంధ్ర యూనివర్సిటీలో నాటకం పేరు చెబితే గురొచ్చే విద్యార్థి రచయితగా ఎదిగాడు. నిజంగానే మనం ఎలా ఉన్నామనేది మనం ఎవరితో ఉన్నాం అన్నదాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. ‘మంగమ్మగారి మనవడు’లో.. ఢిల్లీలో ఉద్యోగవేటకు వెళ్లినప్పుడు ఆయన దోస్తీ చేసింది పురాణం సుబ్రహ్మణ్యశర్మతో. చిత్తూరులో ఆంధ్రప్రభ రిపోర్టర్‌గా చేరినప్పుడు కలిసి తిరిగింది కె.సభావంటి రచయితలతో. శంకరంబాడి సుందరాచార్యవంటి గేయకర్తలతో. జి.కృష్ణ వంటి ఉద్దండ జర్నలిస్టుల జ్ఞానానికి ఆయన దోసిట పట్టాడు. ఇక రేడియోలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, మునిమాణిక్యం నరసింహరావు, బుచ్చిబాబు, ఉషశ్రీ... కూచుంటే ఒక భావ వీచిక. మాట్లాడితే ఒక సృజనకేళిక. అదంతా ఆయన చేత ‘కళ్లు’, ‘రెండు రెళ్లు ఆరు’ వంటి శక్తిమంతమైన నాటికలు రాసేలా చేసింది. నవలలు, కథలు ఆయనకు పేరు తెచ్చి పెట్టాయి. అవే ఆయనను సినిమాలలో ప్రవేశపెట్టాయి. సాహిత్యం నుంచి, రేడియో నుంచి వెళ్లిన అందరూ సినిమాల్లో సక్సెస్ కాలేదు. కాని గొల్లపూడి అయ్యారు. నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు కోడూరి కౌసల్యాదేవి ‘చక్రభ్రమణం’ నవలను ‘డాక్టర్ చక్రవర్తి’ పేరుతో సినిమాగా మలచాలంటే ఆ కష్టతరమైన ప్లాట్‌కు ట్రీట్మెంట్ రాయగలిగే చేయి గొల్లపూడిదిగా తప్ప మరొకటిగా కనిపించలేదు. ఆ సినిమాకు దర్శకత్వశాఖలో పని చేసిన కె.విశ్వనాథ్ గొల్లపూడిని గమనించి ‘ఆత్మగౌరవం’తో మొదలు ‘చెల్లెలి కాపురం’, ‘శుభలేఖ’, ‘ఓ సీతకథ’, ‘శుభసంకల్పం’ సినిమాల వరకూ పనిచేశారు. వారిద్దరూ ఆప్తమిత్రులు. కాని గొల్లపూడి సినిమా కెరీర్లో మరో ముఖ్యవాటాదారు ఎన్.టి.ఆర్ అని చెప్పాలి. ఎన్.టి.ఆర్ తాను నటించిన రీమేక్ చిత్రాలు ‘నిప్పులాంటి మనిషి’ (జంజీర్), ‘అన్నదమ్ముల అనుబంధం’ (యాందోకి బారాత్), ‘నేరం నాది కాదు, ఆకలిది’ (రోటీ), ‘లాయర్ విశ్వనాథ్’ (విశ్వనాథ్) అన్నింటికీ సంభాషణ రచయితగా గొల్లపూడినే ఎంచుకున్నారు. గొల్లపూడి రచన చేసిన సినిమాలలో ‘ఆరాధన’, ‘అమెరికా అమ్మాయి’, ‘పాపం పసివాడు’, ‘మరుపురాని తల్లి’ చెప్పుకోవాల్సినవి. కోడి రామకృష్ణకు ‘ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య’, ‘తరంగిణి’, ‘ముక్కుపుడక’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను అందించిన రచయిత గొల్లపూడి. ‘బ్రహ్మోత్సవం’లో.. గొల్లపూడిని నటుణ్ణి చేసి కోడి రామకృష్ణ, కోడి రామకృష్ణకు రాసి గొల్లపూడి పరస్పరం లాభపడ్డారు. ‘సంసారం ఒక చదరంగం’, ‘పుణ్యస్త్రీ’, ‘మా పల్లెలో గోపాలుడు’, ‘మన్నెంలో మొనగాడు’ ఇవన్నీ గొల్లపూడి మెరిసిన చిత్రాలు. భార్య చాటు భర్తగా ‘ముద్దుల కృష్ణయ్య’, ‘ప్రేమ’ సినిమాల్లో, కుతంత్రుడిగా ‘స్వాతిముత్యం’లో, సింగిల్పూరి సుబ్బారావుగా ‘సుందరకాండ’లో, అమాయక పంతులుగారిగా ‘మంగమ్మగారి మనవడు’లో ఆయన నవ్విస్తారు. ‘లీడర్’, ‘కంచె’, ‘బ్రహ్మోత్సవం’, ‘మనమంతా’ ఆయన చివరగా కనిపించిన సినిమాలు. సినిమా నటుడిగా ఎంత కృషి చేశారో రచయితగా, టీవీ వ్యాఖ్యాతగా, కాలమిస్ట్‌గా గొల్లపూడి అంతే కృషి చేశారు. చేసిన పనంతా ఒకచోట కూర్చి చూస్తే ఇంత పని సాధ్యమా అనిపిస్తుంది. కథలు, నవలలు, నాటికలు, కాలమ్స్, యాత్రాకథనాలు... అసంఖ్యాకంగా రాస్తూనే ఉన్నారు. తన జీవితానుభవాలను, అభిప్రాయాలను ఎప్పటికప్పుడు చెప్పే ‘జీవనకాలమ్’ పాఠకులకు ఒక అనుభవాత్మకపాఠం. ‘అమ్మకడుపు చల్లగా’ ఆయన ఆత్మకథ. డెబ్బయ్యేళ్లు పైబడిన వయసులో ఎవరైనా పడక్కుర్చీకి పరిమితమవుతారు. కాని ఆయన ఆ వయసులో తెలుగు కథను గౌరవించాలని బయలుదేరి ఎంతో ప్రయాసతో నూరుమంది రచయితలను ఇంటర్వ్యూ చేసి వారి కథలను పరిచయం చేస్తూ టీవీ ప్రోగ్రామ్ చేసి అంతటితో ఆగక ‘వందేళ్ల కథకు వందనాలు’ పేరుతో విలువైన గ్రంథం ప్రచురించడం కచ్చితంగా శ్లాఘించదగిన పని. చెట్టంత కొడుకు, గొల్లపూడి శ్రీనివాస్, ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ శోకం నుంచి తట్టుకొని నిలబడటానికి చివరి శ్వాస వరకూ ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. శ్రీనివాస్ పేరు మీద ఆయన ఏర్పాటు చేసిన అవార్డు దేశంలో గౌరవప్రదమైన అవార్డు అని దానిని అందుకున్న ఆమిర్‌ఖాన్ వంటి వారిని చూస్తే అర్థమవుతుంది. ‘లీడర్’లో.. చేసింది చాలు అని ఏనాడూ అనుకోకుండా చేయాల్సింది ఎంతో ఉంది అని గొల్లపూడి నుంచి నేర్చుకోవాలి. కొందరు తమకు తెలిసిన దానిని తమతోనే ఉంచుకుంటారు. ఇవ్వడం, పంచడం ఉదార విషయాలు. ఆ ఇవ్వడం, పంచడం తెలిసిన ఉదారత గొల్లపూడిలో ఉంది. కొన్ని ఆయన అభిప్రాయలతో, తత్త్వంతో కొందరికి భేదం ఉండొచ్చు. కాని మాట్లాడే పెద్దమనిషి ఒకడు మనతో ఉన్నాడు అనే భావన అవసరం. గొల్లపూడి మారుతీరావు అనే నూరు కెరటాల సముద్రపు హోరు ఇక మీదట వినిపించకపోవచ్చు. ‘గిరీశం’ వంటి పాత్రలను పదేపదే ప్రతిష్ఠాపన చేయడానికి ఆయన కనపడకపోవచ్చు. వేదిక మీద ఒక మంచి ఉపన్యాసం ఇవ్వడానికి మైకందుకుంటూ గోచరం కాకపోవచ్చు. వారం వారం అలవాటైన ఒక పలకరింపుకు ఎప్పటికీ గుడ్‌బై చెప్పేయవచ్చు. కాని ఆయన వదిలివెళ్లిన గుర్తులు ఇప్పటికిప్పుడు చెరిగిపోవు. చెదిరిపోవు. మిగిలిన మౌనంలోని సంభాషణ కూడా. - ఖదీర్ -
గొల్లపూడి మృతికి ప్రముఖుల స్పందన
మా ఇద్దరిదీ గురుశిష్యుల బంధం ‘‘గొల్లపూడి మారుతీరావుగారిది, నాది గురుశిష్యుల బంధం. ఆయన కుమారుడి పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్ ఫంక్షన్‌కి ఇటీవల నేను వెళ్లాను. తర్వాత మళ్లీ నాకు ఆయన్ను కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. నేను 1979లో ‘ఐ లవ్ యూ’ అనే సినిమా చేశాను. ఆ చిత్రనిర్మాత భవన్నారాయణగారు నాకు గొల్లపూడి మారుతీరావుగారిని పరిచయం చేశారు. అప్పటికే గొల్లపూడి మారుతీరావుగారు చాలా పెద్ద రచయిత, పాత్రికేయుడిగానూ చేశారు. సాహిత్యపరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, విద్యాధికులు. ఆయన దగ్గర డైలాగ్స్ నేర్చుకోమని నన్ను పంపించారు. అప్పుడు మారుతీరావుగారు డైలాగులు ఎలా పలకాలో క్లాసులు తీసుకున్నారు. ఆ విధంగా ఆయన నాకు గురువనే చెప్పాలి. ఎన్నో సాహిత్యపరమైన విషయాలు చెప్పేవారు. గొప్ప గొప్ప కవులు, రచయితల గురించి చెప్తుంటే ఆసక్తిగా వింటుండేవాడిని. 1982లో కోడి రామకృష్ణగారు నాతో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ కథలో ఒక రకమైన శాడిజమ్, కామెడీగా ఉండే క్యారెక్టర్‌కి గొల్లపూడిగారు బాగుంటారనగానే నాకూ కరెక్ట్ అనిపించింది. ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించారు. ఆ విధంగా నా సహనటుడుగా ఆయన చేయడం అనేది మంచి అనుభూతి. ఆ తర్వాత నుంచి ‘ఆలయశిఖరం’, ‘అభిలాష’, ‘చాలెంజ్’... ఇలా ఎన్నో సినిమాల్లో కలిసి నటించాం. ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తు చేసుకుంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి దూరమవ్వడం అన్నది చాలా బాధాకరం. – నటుడు చిరంజీవి ‘హ్యాపీడేస్’ (2007) చిత్రానికి ముందు ఓ చిన్న సినిమా కోసం యాక్టర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా గొల్లపూడి మారుతీరావుగారితో పని చేశాను. గొల్లపూడిగారు నాకు ఇచి్చన సలహాలు, సూచనలు ఇప్పటికీ నాతో ఉన్నాయి. గొప్ప చిత్రాలతో ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి – నటుడు నిఖిల్ నన్ను హీరో అని పిలిచేవారు నేను సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన చిత్రం ‘కళ్లు’. నాకు నటుడిగా జన్మనిచ్చిన తండ్రి మారుతీ రావుగారు. ఆ సినిమా కథ ఆయనదే. ఆ సినిమా తర్వాత నటులుగా కూడా నేను, ఆయన చాలా సినిమాలు చేశాం. ఆయనకు ‘అరుణాచ లం’ అంటే ఇష్టం. విచిత్రంగా నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను. ‘కళ్లు’ సినిమా అప్పటినుంచి ఇప్పటివరకూ నన్ను ‘హీరో’ అనే పిలిచేవారు. ‘కళ్లు’ అనేది నా జీవితంలో మంచి జ్ఞాపకం. ప్రముఖ కెమెరామేన్ ఎం.వి. రఘు ఈ సినిమాతో దర్శకుడయ్యారు. గొల్లపూడిగారికి చాలా ఇష్టమైన కథ ‘కళ్లు’. ఈ సినిమాకి ‘తెల్లారింది లెగండో..’ అనే మంచి పాట రాశారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు. ఆయన పెద్ద కొడుకు పేరు రాజా. నన్నూ కొడుకులా భావించి, ‘రాజా’ అనే పిలుస్తారు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు సంగీతదర్శకుడు. ఈ సినిమాకి మూడు నంది అవార్డులు వచ్చాయి. నిజానికి ఈ సినిమాని రజనీకాంత్ హీరోగా తమిళంలో మొదలుపెట్టారు. రెండు మూడు రీళ్లు తీశాక ఆపేశారు. ఆ తర్వాత తెలుగులో నన్ను హీరోగా పెట్టి తీశారు. నంది అవార్డు మాత్రమే కాదు.. అప్పుడు ఉన్న ప్రైవేట్ అవార్డులతో కలిపి నాకు పదిహేను పదహారు అవార్డులు వచ్చాయి. అలా ‘కళ్లు’ సినిమాకి చాలా విశేషాలున్నాయి. అంతటి మంచి సినిమాకి అవకాశం ఇచ్చారు. గొల్లపూడిగారు మంచి నటుడు, రచయిత. ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ‘కళ్లు’ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐదేళ్ల క్రితం ఫంక్షన్ చేశాం. ఆ ఫంక్షన్లోనే చివరిసారి ఆయన్ను కలిశాను. ఆయన ఎక్కడ తిరుగుతుంటే అక్కడ సరస్వతి తిరుగుతున్నట్లు అనిపించేది. అంతటి మహానుభావుడిని కోల్పోయాం. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. – నటుడు శివాజీరాజా అది ఆయనకే సాధ్యం గొప్ప నటుడు, రచయిత అయిన గొల్లపూడి మారుతీరా వుగారు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక రచయితగా నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఆయన కథారచయితగా, మాటల రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా మూడు నంది అవార్డులు గెలుచుకున్నారు. అది ఎవరికీ సాధ్యం కాదు. అలాగే ఆయనకు ఒక పెక్యులియర్ స్టైల్ ఉంది. టైమింగ్ ఉంది. విచిత్రమైన మాడ్యులేషన్ ఉంది. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చాలెంజ్.. ఇలా ఆయన ఎన్నో సినిమాల్లో చేసిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అటువంటి గొప్ప రచయిత, నటుడు మన మధ్య లేకపోవడం మన దురదృష్టం. సినీ రంగానికి ఇది తీరని లోటుగా భావిస్తున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. – రచయిత, నిర్మాత కోన వెంకట్ -
మరో దేవాలయం
నిజానికి ఇది మరో దేవాలయం. ఇది దొంగ శీర్షిక. అది తెలిసే ఎందుకు పెట్టాను? ఈ దేవాలయా నికి Focus ఇదొక్కటే కనుక. మీ కాలమ్ రుచి రహస్యమేమిటని కొందరు అడుగుతూంటారు. వారికి ఇవీ సూత్రాలు. మొదటి సూత్రం– అబద్ధం. అబద్ధానికి ఓ ‘రుచి’ ఉంది సరిగ్గా వండగలిగితే. అబద్ధం ఆశ్చర్యం, తీరా ముడి విప్పాక చిన్న కితకిత, ఎక్కువ సరదా, మీకు ముందే తెలిసిన విషయానికి ముక్తాయింపు– ఇన్ని కలగాలి. చాలా ముఖ్యంగా హర్ట్ చేయకూడదు, కోపం తెప్పిం చకూడదు. చిన్న మెలికకు నవ్వాలి. అందరితో చెప్పి నవ్వుకోవాలి. సరే. ఇంకో దేవాలయం ఏదీ? తొలుత మొదటి దేవాలయం గురించి. చాలా సంవత్సరాల కిందట పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయిబాబా తమ్ముడు జానకి రామయ్యగారు నా గదికి వచ్చి నన్ను స్వామి దర్శనానికి తీసుకెళ్లారు. స్వామి మాకు ఇంటర్వూ్య ఇచ్చారు. అదొక గొప్ప జ్ఞాపకం. అటు తర్వాత జానకి రామయ్యగారు నన్ను పుట్టపర్తి దేవాలయానికి తీసుకెళ్లారు. అక్కడ మా పాదరక్షలు విడవబోతూ ఉంటే ఒకాయన పరుగున వచ్చారు. వాటిని భక్తితో అందుకున్నారు. నేను చేస్తా నంటే ఒప్పుకోలేదు. సగం వొంగి భక్తితో ప్రసా దంలాగా అందుకున్నారు. అతనక్కడ ఊడిగం చేసే పనివాడు కాదు, స్వామి సేవకి 15 రోజులు శెలవు పెట్టి వచ్చిన ఓ గెజిటెడ్ ఆఫీసర్. ఒళ్లు పులక రించింది. ఇప్పుడు ఆసుపత్రిలోకి అడుగుపెడుతూనే రికార్డు టైములో నిర్మించిన ఈ కట్టడాన్ని చూపి మాట్లాడుతూంటే జానకి రామయ్యగారికి కళ్లనీళ్లు ధారాపాతంగా వర్షించాయి. నిజానికి అది సిమెంట్, ఇసుకతో కట్టిన భవనం కాదు. ప్రేమ, డెడికేషన్ దాని మూలస్తంభాలు. అక్కడ నాకు తెలిసిన పాత ముఖాలు కని పిస్తున్నాయి. విశాఖ మునిసిపల్ కమిషనర్ ఆఫీసు సూపర్నెంటు, నా మిత్రుని భార్య, పంజాబు మిలట్రీ కల్నల్ భార్య ఎందరో ఆఫీసర్లు అక్కడ సేవకులు. వంగి నిలుచున్నారు. సేవకులు కూడా అంత ఒద్దికగా ఉండరు. అంతటా భక్తీ– ఏ ప్రతిఫలా పేక్ష లేని సేవా తత్పరత– వీటన్నిటికీ మూల ధాతువు– స్వామి! అద్భుతం. బయటికి వస్తూ నేనూ ఏడ్చాను. ఇప్పుడు మరో దేవాలయం. అపోలో ఆసు పత్రి. దీని వెనుక స్వాములు లేరు. పరమార్థం లేదు. పాపపుణ్యాల ప్రసక్తి లేదు. మరేం ఉంది? ఇక్కడ నాలుగు గోడల మధ్య వందలాది వర్కర్లున్నారు. డాక్టర్లున్నారు. పువ్వులాంటి దేవతలున్నారు (నర్సులు). ప్రపంచంలో అన్ని మూలల నుంచీ వచ్చిన అనూహ్యమైన యంత్రాలున్నాయి. వాటిని అలవోకగా నడిపే నిపుణులున్నారు. వీటన్నిటి సామూహిక దృక్పథం. ఆరోగ్యంమీద నమ్మకం, బతుకుతామన్న ధైర్యం, బతకడానికి చేయూత, వెరసి– ప్రాణ ధాతువు. లోపలికి రాగానే ఓ నర్సు నీ జాతకాన్ని ఇస్తుంది– క్షణాల్లో. నీ జ్వరం దగ్గర్నుంచి– నీ రుచుల దాకా– నీ ఊపిరి వివరాల దాకా కాగితం మీదకి వచ్చేసింది. వెంటనే రెండో విడత. సమస్య, ప్రారంభం, కష్టం, ఇక్కడికి రావడానికి కారణం. ఈలోగా రక్తనాళంలోకి సూది దిగుతూంటుంది. మరో రెండు నిమిషాల్లో మొదటి విడత చికిత్స ప్రారంభం. నువ్వు వచ్చి ఇంకా 5 నిమిషాలే అయింది. ఆ టీమ్ నీ హితుడో, నీ కోసం నియ మించిన ప్రాణ స్నేహితుడో అయి ఉండాలి. ఎందు కంటే సరిగ్గా 10 నిమిషాల్లో నువ్వు అక్కడికి వచ్చిన మొదటి ఫలితం దక్కిపోతుంది. ఇటు తర్వాత డాక్టర్లు, వర్కర్లు, నిపుణులు– కేవలం నీ కోసం పుట్టినట్టు కృషి చేస్తారు. నీ నమ్మకం దేదీప్యమానమవుతుంది, విశ్వాసం వీర విహారం చేస్తుంది. ఇది శక్తి, నైపుణ్యం, ఏ కల్మషమూ లేని ‘సేవ’ నీకిచ్చే వరం. ఒకపక్క ఈ కృషి ప్రతీ క్షణం పుస్తకంలోకి ఎక్కుతుంది. అది త్వరలో ఫైలుగా మారి రేపటికి గ్రంథమవుతుంది. ప్రజల దేవుళ్లకి నాలుగు స్థానాలు– నీ మనస్సు, గుడి, నీ తాదాత్మ్యం– అన్నింటికీ మించి నీ నమ్మకం. ఇది సీతా సాధ్వా? అవును. ఇది తాదాత్మ్యం. అబ్బే రాయి.. అంతే ఓ గొప్పillusion is dead. Faith dies when the logic starts.. ఈ తెరని ఈ దేవాలయం నీకు తెలియకుండానే చెరిపేస్తుంది. ఈ నిజాన్ని ప్రపంచంలో 120 దేశాలు నమ్ముతున్నాయి. ఒక తీర్థయాత్రగా వస్తున్నారు. నీ విశ్వాసాన్ని ఉద్భుద్ధం చేసేది తీర్థం. కేవలం అవసరానికి పిలిచి, తీర్చి, నీకు తెలియకుండానే మరొక ప్లేస్‌కి నిన్ను బదిలీ చేసే విచిత్రమైన దేవా లయం పేరు– అపోలో. నేను కొండంత అనారోగ్యంతో– క్రిటికల్ కేర్‌లో మూడు రోజులుగా ఉంటూ డాక్టర్ల అనుమతితో ఈ ‘వ్యక్తిగత’ స్పందనని మీకు పంచుతున్నాను. ఇది ప్రకటన కాదు. కితాబు కాదు. వాటికి నేను ఆమళ్ల దూరం. మొదటి దేవాలయానికి– మహాస్వామి మూల హేతువు. రెండో దేవాలయానికి ‘విశ్వాసం’ మూల ధాతువు. గొల్లపూడి మారుతీరావు -
దూడ గడ్డి
వెనకటికి వేళకాని వేళ ఒకాయన తాటిచెట్టు మీదకి ఎగబాకుతున్నాడట. పక్కనే రోడ్డుమీద నడిచి వెళ్తున్న మరొకాయన పలకరించాడట. ‘ఈ వేళప్పుడు తాటిచెట్టుమీదకి ఎందుకు ఎగబాకుతున్నావు బాబూ’ అని. వెంటనే ఆ ఆసామీ టక్కున సమాధానమిచ్చాడట– దూడగడ్డి కోసం అని. ఇది మనకి పాతబడిన సామెతే. సామెతకి పెట్టుబడి తాటిచెట్టుమీద దూడగడ్డి. బెంగాలులో ఎన్నికల కమిషన్ తరఫున నియమితులైన అజయ్ నాయక్ అనే ప్రత్యేక పర్యవేక్షకులు నిన్న ఒక మాట అన్నారు: ఇవాళ్టి బెంగాల్లో దాదాపు 15 ఏళ్ల కిందట బిహార్‌లో ఉన్న అరాచకత్వం, దౌర్జన్య తత్వం ప్రబలి ఉంది– అని. ఆయన లాకాయి లూకాయి మనిషి కాదు. ఆ రోజుల్లో బిహార్‌లో ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి. వెంటనే మమతా బెనర్జీ స్పందించింది. ఈయన ఆర్.ఎస్.ఎస్.– బీజేపీ మనిషి అనీ. ఆయన్ని వెంటనే రాష్ట్రం నుంచి బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ని డిమాండ్ చేసింది. గత ఎన్నికల తర్వాత చిత్తుగా ఓడిపోయిన సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు మాయావతిని ఎవరో అడిగారు. ‘ఏం? ఓడిపోయారేం?’ సమాధానానికి అలనాడు ఆవిడ తడువుకోలేదు. ‘నా శత్రువులందరూ ఏకమై నన్ను ఓడించారు’– అన్నారు. మరి ఎన్ని లక్షల మంది మిత్రులు ఏకమయి అంతకుముందు ఆమెని గెలిపించడంవల్ల లక్నో నిండా ఏనుగులు, ఆమె విగ్రహాలతో ఎన్ని పార్కులు వచ్చాయో మనకు తెలియదు. లోగడ– మనకు స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో ఉదాత్తమయిన నాయకులుండేవారు. అంతే ఉదాత్తమయిన ప్రతినాయకులూ ఉండేవారు. ఎన్నోసార్లు పండిట్జీ పార్లమెంటులో నిలబడి– కృపలానీ, జయప్రకాశ్ నారాయణ్ వంటివారు నిలదీయగా తన పొరపాట్లు ఒప్పుకున్న రోజులు నాకు తెలుసు. ప్రతినాయకులు వారి విచక్షణను గౌరవించి ఆ పొరపాటు సవరణకు ప్రభుత్వం తలపెట్టే చర్యను సమర్థించడమో, సలహా ఇవ్వడమో చేసేవారు. ఇది రాజకీయ పక్షాల మధ్య అమోఘమయిన సయోధ్య. మెజారిటీ జీవలక్షణం. కొన్ని కోట్లమంది ఈ ప్రభుత్వాన్ని ఎంపిక చేసి పదవిలో నిలిపారు. ఆ మెజారిటీని అందరూ గౌరవించాలి. నాయకుల తప్పటడుగునీ గమనించాలి. అర్థం చేసుకోవాలి. ప్రజాసేవలో పార్లమెంటులో కుర్చీ మారినంత మాత్రాన ఎవరూ దేవుళ్లు కాదు. కానీ ఇదేమిటి? ఈనాడు ప్రతిపక్షాలు పదవిలో ఉన్న నాయకుడిలో దేవుడిని ఆశిస్తాయి. అంతేకాదు. ఒక్క లోపాన్ని ఒప్పుకుంటే గద్దె దిగాలని డిమాండ్ చేస్తాయి. వారినక్కడ కూర్చోపెట్టింది ప్రజ. కొంతమంది సేవాతత్పరుల, మేధావుల, అనుభవజ్ఞుల సమష్టి కృషి దేశ పాలన. నిన్ను నేను తిట్టడం, నన్ను నువ్వు తిట్టడం. తీరా ఆ వ్యక్తిలో లోపం బయటపడితే– ఇక పాలనని అటకెక్కించి ఆ పార్టీని దించడానికి తైతక్కలు– ఇదీ ప్రస్తుత రాజకీయం. ఇక్కడ నిజాయితీ ఎవరికీ అందని తాయిలం. ఏ నాయకుడూ– పొరపాటున కూడా ఇంట్లో పెళ్లాంతో కూడా పంచుకోడేమో. పంచుకుంటే ఏమ వుతుంది. దాన్ని వదిలేసి, పాలనని అటకెక్కించి– ఆ నాయకుడిని గద్దెదింపే అతి భయంకరమైన ఘట్టం ప్రారంభమవుతుంది. అందుకనే ఈ దేశంలో ప్రతీ నాయకునికీ– తనదైన దూడగడ్డి ఉంటుంది. అవసరమైనప్పుడు దానిని వాడుతూంటారు. వారికి తెలుసు. పాలనలో నిజమైన నిజంకన్నా ‘రకరకాల దూడగడ్డి’ తమ కుర్చీని కాపాడుతుందని. మనలో మనమాట– బెంగాల్లో అరాచకత్వం – బిహార్‌లో లోగడ స్థాయిలో ఉందని గ్రహించడానికి ఓ ఐఏఎస్ ఆఫీసర్ నోరిప్పనవసరం లేదు. అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మమతా బెనర్జీ నోరిప్పి అవునంటే (అలాంటి బూతు మాటలు విని ఈ దేశంలో కనీసం 60 ఏళ్లు దాటింది) దూడగడ్డి అందరికీ ఆహారమవుతుంది. నిజం మాట దేవుడెరుగు, ఆమెని గద్దె దించే ఓ బృహత్తర కర్మకాండ ప్రారంభమవుతుంది. ఈ దేశంలో ‘రాజకీయ’మనే ముచ్చటకి నాంది పలుకుతుంది. మనలో మనమాట– మన దేశంలో అలనాటి సంప్రదాయం కొనసాగగలిగితే– మోదీగారు ఎన్ని సార్లు నోరిప్పాలి. ఎందుకు విప్పరు? విప్పరని రాజకీయ రంగంలో ఎవరికి తెలియదు. The function of democracy is not to create Utopia. But an attempt to strive towards it with objective realities. నిజాయితీని అటకెక్కించిన ఈనాటి నేపథ్యంలో– ఇటు పాత్రికేయులకీ, అటు నాయకులకీ కొన్ని మర్యాదలు కావాలి. ఆ ఎల్లల మధ్యే బంతి పరిగెత్తాలి. మధ్య మధ్య మమతా బెనర్జీ, మాయా వతి, అలనాటి జయలలిత, అప్పుడప్పుడు చంద్ర బాబు, ఎల్లకాలం– లాలూ ప్రసాద్ విసురుతూ ఉంటారు. మమత పళ్లు బిగించి ఐఏఎస్ ఆరెస్సెస్ మనిషి అన్నప్పుడు మనకి కితకితలు పెట్టినట్టుంటుంది. అసలు నిజమేమిటో అన్న మనిషికీ, ఎదిరించిన మనిషికీ తెలుసు, దీన్ని కాలమ్గా మలచిన నాకూ తెలుసు, నాకు తెలుసని మీకూ తెలుసు. మీకు తెలుసునని మా అందరికీ తెలుసు. గొల్లపూడి మారుతీరావు -
‘నేనూ చౌకీదార్‌నే!’
పేదరికం పెద్ద ఉపద్రవం. పెద్ద ఊబి. అభిమానధనుడి ఆత్మాశ్రయం. నిస్సహా యుడి గుండెలో అగ్నిప ర్వతం. దాటి ముందుకు సాగాలని ప్రయత్నించే చెలి యలికట్ట. దాటలేని ఒక్క కారణానికే గంభీరమైన వారధి. ఆ ఒక్క కారణానికే ముట్టుకుంటే జివ్వుమనే రాచపుండు. మొట్టమొదట– అయిదేళ్ల కిందట ఈ తేనె తుట్టని కదిపింది మణిశంకర్ అయ్యర్. మోదీ పూర్వా శ్రమంలో నిద్రాణమైన జీవన సత్యాన్ని లేపి వెక్కిరిం చిన ఘనత ఆ ప్రముఖ రాజకీయ నాయకుడిది. అంతే. మిన్ను విరిగి మీద పడింది. 2014 ఎన్నికలకు పెద్ద ఉద్యమానికి ఆ ‘వెక్కిరింత’ నాంది పలికింది. ‘ఛాయ్‌వాలాతో ముఖాముఖీ’, ‘ఛాయ్‌వాలాతో పిచ్చాపాటీ’ ఛాయ్‌వాలా పురోగతి, ఏ విధంగానూ సిగ్గుపడనక్కరలేని ఓ నాయకుని గతం విశ్వరూపం దాల్చింది. ఇది ఊహించని మలుపు. ఈ కథలో నీతి. ఎప్పుడూ నిద్రపోతున్న ‘పేద రికం’ జూలుని సవరించకు. అది సిగ్గుపడే విషయం కాదు. చేజేతులా పూనుకున్న అవినీతి కాదు. ఆ ‘నిజం’ కోట్లాదిమంది జనసందోహం మధ్య పదే పదే ప్రతిధ్వనించింది.ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నిద్రపోతున్న సింహం జూలును మరో విధంగా సవరించారు. ‘రెచ్చగొట్టారు’ అనే మాటకి నిస్సహాయమైన ప్రత్యా మ్నాయాన్ని వాడుతున్నాను. రకరకాల చర్యలను ప్రశ్నిస్తూ ‘అయ్యా చౌకీదార్ గారూ! ఇప్పటికయినా తమరు కళ్లు తెరిచారా? 9 వేల కోట్ల విజయ్ మాల్యా అవినీతి మిమ్మల్ని నిద్ర లేపిందా? హఠాత్తుగా ఇంగ్లండులో ప్రత్యక్షమయిన నీరవ్గారి కథ చౌకీదార్ని ఎలా పలకరించింది. మా ఆస్తులకు చౌకీదార్‌నని గర్వంగా చెప్పుకున్న తమరు ఇప్పుడేమంటారు?’ ఇలాంటి విసుర్లు మనం రాహుల్ గాంధీ గారి సభల్లో వింటున్నాం. ప్రతీసారి ‘మన అధోగతికి జవాబుదారీ ఈ చౌకీదార్’ అన్న స్పృహని రాహుల్ గాంధీగారు విడిచిపెట్టలేదు. అంతేకాదు. అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యాల మధ్య ముల్లె భుజానికెత్తుకు నిలిచిన మోదీ కార్టూన్ కింద రాహుల్ గాంధీ పలకరింత. ‘ఇప్పటికయినా నేరం కాస్త గుచ్చుకుం టోందా చౌకీదార్ జీ!’ అంటూ.ఇప్పుడు కాంగ్రెస్ ట్విట్టర్లో నరేంద్ర మోదీ ‘చౌకీదార్ దొంగ’. అంతే. రాత్రికి రాత్రి బీజేపీ ట్విట్టర్లు కొత్తరూపుని సంతరించుకున్నాయి. నరేంద్ర మోదీ అన్నారు: మీ దృష్టిలో చౌకీదార్ దొంగ. కానీ ఈ దేశంలో అవినీతికి తిరగబడే ప్రతీ వ్యక్తీ చౌకీదారే. ఇప్పుడు నరేంద్ర మోదీ ట్విట్టర్ పేరు ‘చౌకీదార్ నరేంద్ర మోదీ’. అలాగే చౌకీదార్ అమిత్ షా, చౌకీ దార్ నరేష్ గోయెల్– ఇలా అవతరించాయి. దేశ మంతా ‘నేనూ చౌకీదార్‌నే’ అనే ప్రతిజ్ఞ చేయాలని నరేంద్ర మోదీ తన ట్విట్టర్లో 3 నిమిషాల సందేశాన్నుంచారు. ఇది కార్చిచ్చులా దేశాన్ని ఊపి ఉర్రూతలూగించనుంది. నిన్న ఏదో చానల్లో బొంబాయి వంతెన కూలిన సంఘటనలో అవినీతిని ప్రశ్నిస్తూ– ‘ఈ దేశంలో మీరూ ఒక చౌకీదార్. నేనూ ఒక చౌకీదార్ని. ప్రధానే కానక్కర లేదు’ అని బల్లగుద్దారు. నేను నిర్ఘాంతపోయాను– ఒక నినా దం, ఒక ఆలోచన ఇంత సూటిగా, ఇంత బలంగా, మించి ఇంత త్వరగా ప్రజల్లోకి దూసుకు పోగలి గినందుకు. దానికి కారణం ఏమిటి? ఒక్కటే సమాధానం– ఆ నినాదంలో ప్రాథమికమయిన నిజాయితీ.ఎదుటి వ్యక్తి విమర్శని ఆశీర్వాదం చేసుకుని, వెక్కిరింతని ‘ఆయుధాన్ని’ చేసుకుని దేశానికి కొత్త నినాదాన్ని ఇవ్వడం భారతీయ జనతా పార్టీకి ఇది రెండోసారి.మొదటిది ‘చాయ్‌వాలా’ విమర్శ. ఏమిటి ఇందులో రహస్యం? పక్కవాడి విమర్శలో ‘దమ్ము’ చాలనప్పుడు, వెక్కిరింతలో సామంజస్యం కాక, తేలికతనం ఎక్కువగా ద్యోతకమయినప్పుడు విమర్శ ఆయుధమవుతుంది. కొండొకచో అవకాశమూ అవుతుంది.కాగా, వ్యక్తిని చేసే విమర్శ వ్యవస్థకి ఆశీ ర్వాదాన్ని చేసుకోవడం ఎప్పుడు సాధ్యం? ఆ విమర్శలో బలం చాలనప్పుడు, అందులో నిజాయితీ కంటే ‘అక్కసు’ పాలు ఎక్కువగా ఉన్నప్పుడు. ఈ మధ్య వాట్సాప్‌లో ఓ పెద్ద మనిషి అతి మర్యాదగా నన్ను మందలించబోయాడు. ఆయన సందేశం తాత్పర్యం. ‘పెద్దాయనా! మోదీ భజన చాలు. నిజానిజాలు గ్రహించండి’ అని. ప్రయత్నిస్తున్నాను. అయిదేళ్లకిందట మోదీ ఎవరో నాకు తెలీదు. కానీ ప్రతిపక్షం చేసే ఎత్తి పోతలకూ ఓ మార్గాంతరం కనిపించి, తిట్టుని దీవెన చేసుకోగల సెన్స్ ఆఫ్ హ్యూమర్ దేశమంతా ప్రతి ఫలించింది. ఇది ప్రయత్నించినా సాధించలేని కార్యాచరణ.ఈ వృత్తికి 59 ఏళ్లు పాతవాడిని. నా మాటల్లో నిజాయితీ చాలనప్పుడు– ఒక్క ‘పెద్దమనిషి’ కాదు, పెద్ద జంఝామారుతం నాలాంటి చాలా గొంతుల్ని నొక్కేస్తుంది. మహాత్ముడి గొంతు వినమని ఎవరు బతి మాలారు? అన్నా హజారే గొంతు ఎవరు విన మన్నారు? ఆనాడు కేజ్రీవాల్‌ని రెండుసార్లు నిరా ఘాటంగా ఎవరు ఎన్నుకోమన్నారు? గొల్లపూడి మారుతీరావు -
ఉభయకుశలోపరి
1937లో ఆనాటి ‘నేష నల్ హెరాల్డ్’ పత్రికలో ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసం ఆనాటి అతి ప్రముఖ కాంగ్రెసు నాయకులు జవహర్ లాల్ నెహ్రూని దుయ్య బడుతూ– ఆయన ‘అహంకారాన్ని’ విరగ దీస్తూ రాసినది. పార్టీలో, బయటా ఆ వ్యాసం పెద్ద సంచలనాన్ని లేపింది. అందరూ ఆ వ్యాసాన్ని నెహ్రూ సిద్ధాంతాలను వ్యతిరేకించే పట్టాభి సీతారామయ్య రాశారనుకున్నారు. కొంత కాలం తర్వాత నెహ్రూగారే నిజం చెప్పారు. ‘నేషనల్ హెరాల్డ్’ నెహ్రూ సొంత పత్రిక. తన పత్రికలో తననే ‘కలం పేరు’తో విమర్శించుకు న్నారు. ఆ తరంలో అంత intellectual hone- sty and moral integrity ఉన్న నాయకులు లేరు. నెహ్రూగారి గొప్ప లక్షణాలు తనని చూసి తాను నవ్వుకోవడం, తనని తాను సంస్కరించు కోవడం, తన తప్పిదాన్ని భేషరతుగా ఒప్పుకో వడం. ఇక్కడే మరొక్క మాట చెప్పాలి. ఈ దేశంలో తమని తామే సంస్కరించుకునే సమస్థితి ఉన్న నాయకులు ఎందరో ఉన్నారు. మూడే పేర్లను ఉటంకిస్తాను. నెహ్రూ, గాంధీ, పటేల్. ఈ దేశపు సామాజిక వ్యవస్థకి గొప్ప కితాబు– ఒక నాయకురాలు వేసిన తప్పటడుగుని– ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ కల్లోలాన్ని తట్టుకుని వ్యవస్థ సవరించుకుంది. ప్రస్తుతం దేశపు న్యాయ వ్యవస్థలో ఆ అపశృతి వినిపిస్తోంది. ఏనాడయినా తమ వ్యవస్థ లొసుగుల నుంచి సంస్కరణలు జరగాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రజల ముందుకు రావడం విన్నామా? ఈ వ్యవస్థ ఆ ‘అపశృతి’నీ సవరించు కుంటుంది. ఇప్పటి కథ. ఈనాడు నెహ్రూకి నాలుగో తరం కుర్రవాడు– రాహుల్ గాంధీ. ప్రతిపక్ష నాయకుడు. ప్రజాస్వామిక వ్యవస్థలో అన్ని పార్టీల ముఖ్య లక్ష్యం ప్రజా సంక్షేమం. ఇందులో నిజానికి ప్రతిపక్షానిది ముఖ్య పాత్ర– అధికారం, అవకాశం ఉన్న పాలక పక్షాన్ని ‘సంస్కరించాలి’ కనుక. తిట్టే నోరు సంస్కరించదు. ఆ వ్యవస్థని తిరగబడేటట్టు చేస్తుందే తప్ప, ఆత్మావలోకనం చేసుకునే అవకాశం ఇవ్వదు. ఇది ప్రజాస్వామ్యా నికి ‘సేవ’ మీద కాక, పదవి మీద, కుర్చీమీద వ్యామోహం పెంచిన అరిష్టం. అందుకే మన పార్ల మెంటులో ఎందరో గూండాలు, రేపిస్టులూ, అవ కాశవాదులు, దుర్వా్యపారులూ చేరారు. నరేంద్ర మోదీని ఈయన బహిరంగ సభలో ‘దొంగ’ అన్నాడు. ‘చౌకీదార్’ అన్నాడు. డోక్లా వ్యవహారంలో మోదీ ఛాతీ 56 అంగుళాల నుంచి నాలుగంగుళాలకు కుంచుకు పోయిందన్నాడు. ఆయన పిరికివాడన్నాడు. పార్లమెంటు నుంచి తప్పించుకు తిరిగే ‘పలాయనవాది’ అన్నారు. దమ్ముంటే నా ముందు 5 నిముషాలు నిలవమని చాలెంజ్ చేశారు. ఈ దేశానికి భాక్రానంగల్, నాగార్జున సాగర్, అంతరిక్ష పురోగతికీ పునా దులు వేసిన స్వాప్నికుడు– ఈ కుర్రాడి నాలుగో తరం ముత్తాత ఎక్కడ? ఈ కుర్రాడు ఎక్కడ? ఆనాటి పార్లమెంటులో జయప్రకాష్ నారాయణ, కృపలానీ, బెవాన్ వంటి నాయకులు ఒక్కసార యినా ప్రధాని మీద మాట తూలలేదు. ఇటు–నరేంద్ర మోదీ విమర్శ–రెండు సందర్భా లను ఉటంకిస్తాను. పార్లమెంటులో ఆయన మాట్లాడుతుండగా రేణుకా చౌదరి హాలు దద్దరిల్లే లాగా నవ్వింది. వెంకయ్యనాయుడు లేచి ‘అది మర్యాద కాదు’ అన్నారు. మోదీ నవ్వి ‘ఫర్వా లేదు నాయుడూజీ. చాలా కాలానికి రామాయ ణంలో వికటాట్టహాసం ఇన్నాళ్లకి విన్నాను’ అన్నారు. శూర్పణఖ పేరెత్తలేదు. కానీ అందరి మనస్సుల్లోనూ ఆ పేరు కదిలింది. ఇది మహిళ లకి అన్యాయమని రేణుక తర్వాత గింజుకున్నారు. మరోసారి– మన్మోహన్ సింగ్ పదవిలో చేత కానితనాన్ని విమర్శిస్తూ– వారి పాలనలో 2జీ, కామన్వెల్త్, బొగ్గు, గడ్డి వంటి 42 స్కాములు తోసుకురాగా మన్మోహన్ సింగ్ స్నానాల గదిలో రెయిన్ కోటు వేసుకుని నీళ్లు పోసుకున్నట్టు ప్రవ ర్తించారు– అన్నారు. తెలుగులో ఒక ముతక సామెత ఉంది. ‘దున్నపోతుమీద వర్షం కురిసి నట్టు’ అని. ఏమయినా ఆ ఆలోచనకి సున్నిత మైన ‘ఔచిత్యపు పూత పూసి’ ఒక ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక శాస్త్ర వేత్త, తనకంటే వయస్సులో పెద్ద, ఒక దేశాన్ని 10 సంవత్సరాలు పాలించిన సీనియర్ నాయ కుని మీద విమర్శ ఎంత ఉదా త్తంగా, ఔచిత్యం చెడకుండా ఉంది? విమర్శ– ఎదుటి వ్యక్తిని సంస్కరించాలి. తన ఉద్దేశానికి ‘పదును’ని ఇవ్వాలి. దురుద్దేశంతో ‘ఎదురుదెబ్బ’ తీయాలని పురికొల్పకూడదు. ఎంత కిందకి దిగి దుయ్యబట్టినా ప్రజలు ‘దొంగ’, ‘దగాకోరు’ అనే విమర్శని గుర్తుంచుకోరు. అతని desperationని గుర్తుంచుకుంటారు. మోదీ సర ళమైన, సరసమైన హాస్యం– తగలవలసిన చోట గుచ్చుకుంటూనే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కితకి తలు పెడుతూంటుంది. మన ప్రజాస్వామిక వ్యవ స్థలో– రాజకీయ రంగంలో ఔచిత్యానికి పెద్ద పీట వేసి– వ్యవస్థలో ఉదాత్తతని నేలమట్టం చేయని ఎందరో పదవిలో ఉన్న, ప్రత్యర్థులుగా ఉన్న నాయకుల ఒరవడి ఇది. -గొల్లపూడి మారుతీరావు -
రామ... రామ
సాధారణంగా నేను వివాదాల జోలికి పోను. అది నా ప్రమే యమూ, స్వభావమూ కాదు. కానీ మొన్న పొరుగు దేశంలోని ఓ దౌర్భాగ్యుడు– తినడానికి తిండి కూడా సరిగా లేని దేశంలో బోర విరు చుకు తిరుగుతున్న ఓ దౌర్జన్యకారుడు మసూద్ అజర్– అంటాడు కదా: ఇండియాలో రామ మందిరం నిర్మిస్తే దేశం మంటల్లో భగ్గుమం టుందని. అనడానికి ఎవడు వీడు? ఏమిటి వీడి గుండె ధైర్యం? ఈ మాటలకి కడుపు మండి ఈ నాలుగు మాటలూ. ఈ దేశం ముస్లిం సోదరులను శతాబ్దాలుగా అక్కున చేర్చుకుంది. రాజకీయ రంగంలో, కళారంగంలో, ఆఖరికి ఆధ్యాత్మిక రంగంలోనూ వారు మనకు ఆప్తులు. ఇటు వేంకటేశ్వరునికీ, అటు భద్రాద్రి రామునికీ ముస్లిం భక్తుల కథలు మనకు తెలుసు. మనకు ముగ్గురు రాష్ట్రపతులు ముస్లింలు. ఉపరాష్ట్రపతులు ముస్లింలు. ఈ హెచ్చరికకు రెచ్చి, ఈ దేశంలో ముస్లింలంతా ఏకమయి– ‘మీరు పక్కకు తప్పుకోండి బాబూ. మేం రామమందిరాన్ని నిర్మిస్తాం’ అని ముందుకు రారేం? షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ రామ మందిర నిర్మాణానికి మాకు అభ్యంతరం లేదన్నారు. గవర్నమెంటు పూనుకోకపోతే నాలుగు నెలల్లో రామమందిర నిర్మాణానికి పూనుకుంటా మన్నారు ఆరెస్సెస్ అధ్యక్షులు మోహన్ భగవత్‌గారు. పద్మభూషణ్ బాబా రామ్‌దేవ్– అయో ధ్యలో వివాదాస్పద స్థలానికి పక్కన ఉన్న చోట రామమందిరం నిర్మించడానికి ఏం పోయేకాలం? అని వాక్రుచ్చారు. అలనాడు కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని ఆనుకుని మసీదు వెలిసినప్పుడు, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన గది గోడని ఆనుకుని మసీదు వెలసినప్పుడు హిందువులు గొంతులు ఎత్తలేదేం? సామరస్యం కారణమా? అలనాటి పాలకుల పట్ల భయమా? తాటస్థ్యమా? నిర్వేదమా? మరి ఇలాంటివేవీ గత 77 సంవత్సరాలుగా ముస్లిం సోదరులు చూపలేదేం? వారి ఓట్లకు రాజకీయ పార్టీల కక్కుర్తి కారణమా? విజయ్‌సింగ్ ఆలేఫ్ ఈ మధ్య రాసిన "Ayodhya: City of Faith, City of dis- cord'' అనే పుస్తకాన్ని సమీక్షిస్తూ వచ్చిన వ్యాసంలో మొదటి వాక్యాలు ఉటంకిస్తాను: ‘రాజకీయ ప్రయోజనాలకు మతాన్ని దుర్విని యోగం చేస్తే, ఏ దేశానికీ ఫలితాలు సామర స్యంగా ఉండవు. వ్యవస్థల మతపరమైన వివా దాలను న్యాయసమ్మతంగా, సామరస్యంతో, సత్వరంగా పరిష్కరించలేకపోవడానికీ ఇదే కారణం’. ఇంతకీ పాకిస్తాన్లో ‘వాగిన’ దౌర్జన్యకారుడికి– ఇద్దరు సీనియర్ ముస్లిం నాయకులు స్పందించి: ‘నువ్వు నోర్మూయవయ్యా. ఇది మా దేశం సమస్య. మేం చూసుకుంటాం’ అంటే ఎంత గంభీరంగా ఉంటుంది? అంత Objective nobility మన సోదర ముస్లిం నాయకులకి ఉందా? అవకాశవాదం అటకెక్కితే సంకల్ప బలానికి ‘చేవ’ కుదురుతుంది. ఇన్ని సంవత్సరాల అయోధ్య వివాదం హిందువుల నిస్సహాయతకు మాత్రమే నిదర్శనం కాదు. తమలో ఒకరుగా, తమలో వారుగా భావించే ముస్లిం సోదరుల ‘చిన్న’ మనసుకి కూడా నిదర్శనం. దేశంలో అక్కడక్కడా మత విధ్వంసాలు ఉంటాయి. ఇలాంటి ఉన్నత లక్ష్యాలకు అవి అడ్డు పడకూడదు. పక్కవాడు ‘ఉసి’కొల్పడం అందుకు మన మౌనం మన మానసిక ‘సంకుచితతత్వాని’కి నిదర్శనమనిపిస్తుంది. పెద్దల మనస్సుల్లోనూ ఇంకా ‘చీకటి’ గదులున్నాయనిపిస్తుంది. ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీకి మతం పెట్టుబడి. అందుకని మిగతా పార్టీలు వారి ఆలోచనలకు కలసిరావు. సరే. మరి రాముడు ఈ దేశానికే ఆరాధ్య దైవం కదా? అయినా రాజకీయ రంగంలో ఆయన పరపతి చెల్లదా? దీనికి పరిష్కారం– దమ్మున్న వ్యవస్థ. గుండెబలం ఉన్న నాయకత్వం. నిజానికి ఆనాటి మెజారిటీ హిందువులను విస్మరించి – కాశీ, మధుర దేవాలయాల పొరుగున మసీదుల నిర్మాణమే ఇందుకు తార్కాణం. ఇప్పుడు కేంద్రం సుప్రీం కోర్టుని ఆశ్రయిం చింది. ‘అయ్యా– అయోధ్యలో ‘వివాదం’ లేని 67.39 ఎకరాల స్థలాన్ని మాకు అప్పగించండి’– అని. కాంగ్రెస్ భయం అప్పగిస్తుందని కాదు. తీరా అప్పగిస్తే తమ ‘పరపతి’ మాటేమిటని. ‘ఇప్పుడు ఇలా సుప్రీంకోర్టుని ఆశ్రయించడంలో మర్మమేమిట’ని కాంగ్రెస్ కత్తి దూసింది. కాంగ్రెస్ భయం తీరా సుప్రీంకోర్టు తలూపుతూ ఉందేమోనని! ఇక్కడ తగాదా ‘రాముడు’ కాదు– ఓట్లు. ఇదీ మన దరిద్రం. ఇందుకే ఈ సమస్య ఇన్నాళ్లు మురిగింది. ఇంకా మురుగుతుంది. గొల్లపూడి మారుతీరావు -
వార్షికం
ఈ వార్షికం ప్రతీ యేటా ఇచ్చే పద్మ అవార్డుల గురించి కాదు. ఇవ్వని పద్మ అవార్డుల మీద నా స్పందన గురించి. ‘వార్షికం’ అనే మాటలో వైదికంగా దుర్మార్గమయిన అర్థం. ఇంక కెలకను. చాలాసార్లు ఈ అవార్డులు పూర్తిగా చచ్చిపోయిన వారికో, లేదా సగంసగం పోతున్న వారికో ఇవ్వడం రివాజు. అయితే ఈ సంవత్సరం చాలా కారణాలకి ఆనందించదగ్గ విషయం– మిత్రులు సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ. సాహితీపరులకిచ్చే సత్సాంప్రదాయం, ఓ సినీ గేయ రచయితకి– అందునా సీతారామశాస్త్రికి ఇవ్వడం చాలా హర్షణీయం. ఈ అవార్డులు సాధారణంగా ఇంత దూరం ప్రయాణం చెయ్యవు. కానీ ఇదేమిటి! శాస్త్రిగారి పేరు పక్కన ‘తెలంగాణ’ అన్న మాట ఉంది. వారి పేరుని తెలంగాణ ప్రభుత్వం సూచించిందా? ఆశ్చర్యం లేదు. ఏపీ ప్రభుత్వానికి అంత తీరిక లేదు. అలనాడు బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పద్మ అవార్డులను తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించింది. వారి సినీ రచయిత వైరముత్తు పద్మభూషణ్. ఏమయినా తెలం గాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. శాస్త్రిగారి గొప్పతనానికి ఒకే ఒక మచ్చుతున కని ఉటంకించాలని ఉంది. 1992లో నేనూ, జేవీ సోమయాజులు, పద్మనాభం, తులసి ప్రభృతులం అమెరికా వెళ్లాం. నేను ‘మనిషి గోతిలో పడ్డాడు’ అనే నాటికని రాశాను. గోతిలో పడిన మనిషిని చూసి రక రకాల సామాజిక స్థాయిలకు చెందిన వ్యక్తులు అతని స్థితిని విశ్లేషిస్తారు. చివరికి అతనికి సహాయం చెయ్యకపోగా పెద్ద బండ రాయితో చంపుతారు. అక్కడొక పాట ఉంటే ముగింపు బాగుంటుందని మాకనిపించింది. ఎలాంటి పాట ఉండాలి? అనుకోలేదు. అప్పుడు మా శ్రీనివాస్ బతికే ఉన్నాడు. నేను పాట చేయిస్తానన్నాడు. సీతారామశాస్త్రి దగ్గరికి పరిగెత్తాడు. కథ చెప్పాడు. న్యాయంగా ఎలాంటి పాట రాయాలి? చచ్చిపోతున్న వ్యక్తి– సమాజ స్వార్థానికి బలి అయిన వ్యక్తి ఆర్తనాదం. శ్రీశ్రీ ఆవేశంగా ‘ఎముకలు కుళ్లిన వయస్సు మళ్లిన....’ అంటారేమో! వేటూరి ‘ఈ అపరభీష్ముల రాజ్యంలో ఎందరో బృహన్నలలు...’ అంటారేమో! ఆత్రేయ ‘ఈ స్వార్థపరుల ప్రపంచంలో తలపగిలిన దీనుడు...’ అంటారేమో! సీతారామశాస్త్రిని నేనెప్పుడూ కలవలేదు. చావు బతుకుల్లో ఉన్న మనిషి– గోతిలో కొన ఊపి రితో ఉన్నాడు. అతని మాట... శాస్త్రి అన్నాడు కదా... ‘నాకెంతో సంతోషంగా ఉంది నాకెంతో ఆనందంగా ఉంది చరిత్ర లోతెంతో కొలవగలిగినందుకు తలెత్తి పాతాళం చూడగలిగినందుకు...’ విశీర్ణమైన మనిషి పాతాళంలో చచ్చిపోతూ– మానవాళి నీచత్వపు లోతుల్ని చూశానని నవ్వుకున్నాడట! నిర్ఘాంతపోయాను. సిరివెన్నెల– ఓ కవితను– పది సాధారణమైన ఆలోచనల స్థాయిని చీల్చి ముందుకు వెళ్తాడు. అక్కడా అతను మొదటి పల్లవి. అతనికి పద్మశ్రీ తెలుగు కవితకి పట్టాభిషేకం. మన తెలుగువారికి మనల్ని చూసి మనం గర్వపడే సహృదయం లేదు. తమిళులకీ, బెంగాలీలకీ అది సొత్తు. ఈ దేశంలో ఓ మహానటి ఉన్నారు. కృష్ణవేణి. ఆమెకి 94 సంవత్సరాలు. మిత్రులు రావికొండలరావుగారు నాకు మెసేజ్ పంపారు. తన ఆరవ యేటనుంచే నటనా రంగంలో కాలుమోపి, మీర్జాపురం రాజావారి ఇల్లాలుగా సినీ నిర్మాత అయి ఓ మహానుభావుడు ఎన్టీఆర్‌నీ, ప్రతినాయక పాత్రలు ధరించిన పద్మవిభూషణ్ అక్కినేనిని హీరోగా ‘కీలుగుర్రం’లో పరిచయం చేసిన విదుషీమణి– నా చిన్నతనంలో ‘లక్ష్మమ్మ’ని తన్మయులమై చూసిన గుర్తు ఇంకా చెరిగిపోలేదు– కృష్ణవేణి గారిని ఇంకా తెలుగుజాతి గౌరవించుకోలేదు. చెన్నైలో నాలుగు రోడ్ల కూడలిలో ప్రముఖ రచయిత– ఆనాడు పద్మ అవార్డుకి నోచుకోని కన్నదాసన్ విగ్రహం ఉంది. మన ఆత్రేయకీ, పింగళికీ లేదు. ఎన్.ఎస్. కృష్ణన్ విగ్రహం ఉంది. మన రేలం గికీ, శివరావుకీ లేదు. పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి గౌరవానికి సెమ్మంగుడి అభిరుచి పెట్టుబడి అంటారు. మహా గాయకుడు అన్నమాచార్యను ఆకాశంలో నిలిపిన అజరామరమైన కీర్తనలు చేసి, తన జీవితాన్నే ఒక ఉద్యమం చేసుకున్న బాలకృష్ణ ప్రసాద్ వంటి శిష్యుడిని సమర్పించిన నేదునూరిని ఈ జాతి గౌరవించుకోలేదు. మన గొప్పతనాన్ని చూసి మాత్రమే కాదు, చూపి, నెత్తికెత్తుకుని గర్వపడటం జాతి సంస్కారం. ఏపీ ప్రభుత్వం అలాంటి పనిచెయ్యదేం? ఏ కూడలిలోనో ఓ రమణారెడ్డి, ఓ సముద్రాల, ఓ వేటూరి పలకరించరేం? తమిళనాడులో సంగీత కళానిధులూ, పద్మశ్రీలూ ఎటుచూసినా కనిపిస్తారు. ‘మా మహనీయుల్ని ఆకాశంలో నిలిపే ఉపకారం మీరు చేసిపెట్టండయ్యా’ అని చరిత్ర చెప్తూంటే– సిగ్గుతో తలవంచుకుని వారి మధ్యనుంచి నడుచుకుపోతూంటాను. -
పిన్నల కోసం..
జీవన కాలమ్ నేను విరివిగా సినీమాలు చేస్తున్న రోజుల్లో ఒకసారి మా ఆవిడతో ఊరు వెళ్లడానికి తెల్లవారు జామున మద్రాసు ఎయిర్‌పోర్టులో ఉన్నాను. ఎవరో నా భుజం తట్టారు. తిరిగి చూస్తే ఖాదర్ ఖాన్. మా ఇద్దరికీ మందు పరిచయం లేదు. కానీ ఆయన నా పాత్రలు చాలా చేస్తున్నారని విన్నాను. ఆయన హార్థికంగా పలకరించి ‘నేను ఖాదర్ ఖాన్. హిందీలో మీ పాత్రలు చేస్తున్నాను’ అన్నారు. నేను పులకించాను. ‘మీరు గొప్ప నటులు, నా పాత్రలు చెయ్యడం నాకు గొప్ప’ అన్నాను. అలా ఒక్కసారే నేనూ ఆయనా కలిశాం. ఆయన నాకంటే ఒక్క సంవత్సరం పెద్ద. చాలా రోజులుగా చాలా ఇబ్బందికరమైన రుగ్మతలతో బాధపడుతున్నారు. పిల్లలు కెనడాలో ఉన్నారు. అక్కడే ఏడు నెలలు ఆసుపత్రిలో ఉండి కన్నుమూశారు. మొన్న ఆయన జీవిత దృశ్యాలను చూపుతూ కెనడా ఆసుపత్రి బయట పోర్టికోలో ఒంటి మీద కేవలం ఓవర్ కోటు ఉన్న నిస్సహాయుడైన ఖాదర్‌ఖాన్‌ని కొడుకులు, సన్నిహితులూ దింపుతున్నారు. ఆయన దిగ లేక దిగలేక కాలు నేల మీదకి మోపుతున్నాడు. నాకు చర్రున కళ్లనీళ్లు తిరిగాయి. ఆయన్ని చూసికాదు. ఆయన పిల్లలు తండ్రిని అంత భద్రంగా, పువ్వులాగ చూసుకుంటున్నందుకు. నేనక్కడే ఉంటే ముందుకు ఒంగి ఆ పిల్లలకు పాదాభివందం చేసేవాడిని. ఓసారి ప్లేన్‌లో అమెరికాలో పనిచేస్తున్న తెలుగు అభిమాని నా పక్కన కూర్చున్నాడు. ‘సాయంకాలమైంది’ నవల కథ చెప్పాను. అతని తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నారు. అతను అమెరికాలో. చాలాసార్లు వచ్చి చూసి పోతూంటాడు. అమెరికా డాలర్లు వస్తూంటాయి. కానీ ఏం లాభం? విమానం దిగే సమయానికి అతని కళ్లనిండా నీళ్లు నిండాయి. చాలా సంవత్సరాల కిందటి మాట. నా ‘సాయంకాలమైంది’ నవల చదివి లక్ష్మీకాంత శర్మ అనే ఒక ఐటీ టెక్నోక్రాట్ ఫోన్ చేశారు తన్మయత్వంతో. నా ‘సాయంకాలమైంది’ నవలని తిరుపతి వెళ్లి కొని తెచ్చుకున్నాడట. వరంగల్లు దగ్గర కాళే శ్వరం అనే గ్రామంలో అతని తండ్రి అర్చకుడు. నవల చదివాక తల్లిదండ్రులతో ఉండాలని విదేశాలలో ఉద్యోగాలు వచ్చినా వదులుకుని ఇండియాలో ఉండిపోయాడు. మహాభారతంలో ఓ కథ. తపస్సు చేసి అపూర్వ శక్తులు సంపాదించిన ఓ తపస్వి గర్వపడుతూ సభ్య ప్రపంచంలోకి వచ్చాడు. భర్తకి సేవ చేస్తున్న ఓ ఇల్లాలు నవ్వి ఆ మూల దుకాణం నడుపుతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి ఈ అపూర్వ శక్తుల్ని ధిక్కరించే వైభవాన్ని చూసి రమ్మంది. అది ధర్మవ్యాధుడి మాంసం దుకాణం. జంతువుల్ని నరికి, కోసి అమ్ముకుంటున్నాడు. ఇతనికీ, ధర్మానికీ సాపత్యమేమిటి? నిర్ఘాంతపోయాడు తపస్వి. తీరా వ్యాపారం ముగిశాక ధర్మ వ్యాధుడు ఆయన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంట్లో ముదుసలి తల్లిదండ్రులు. వారికి నిష్టతో సేవ చేస్తున్నాడు. ‘ఇదే నాకు తెలిసిన ధర్మ రహస్యం’ అన్నాడు ధర్మవ్యాధుడు. మతాన్ని పాతగుడ్డల్లో చుట్టి అటక మీద పారేసిన మేథావులున్న ఈ దేశంలో మతం దేవుళ్లు, పురాణాల రూపేణా మోక్షాన్ని ‘ఎర’గా చూపిందిగానీ, పరోక్షంగా సామాజిక జీవనానికి బంగారు బాటలు వేసింది. పండరీపురంలో పాండురంగ విఠల్ ప్రాశస్త్యానికీ మూల సూత్రమదే. ఈ మాట నాకు పండరీపురంలో ఓ పేరు, భాషా తెలీని భక్తుడు చెప్పాడు. విఠల్ అంటే మహారాష్ట్ర భాషలో ‘ఇటుక’ అని అర్థం (ట). పాండురంగడు మహా దైవ భక్తుడు. తల్లిదండ్రుల్ని సేవిస్తున్న కొడుకు. తీరా దేవుడు అతని పిలుపు విని వచ్చాడు. ఆ సమయానికి పాండురంగడి ఒడిలో తల్లదండ్రుల పాదాలున్నాయి. దేవుడు ‘నేను వచ్చానయ్యా’ అన్నాడు. పాండురంగడు ఆనం దించి చుట్టూ చూశాడు. ఓ ఇటుక కనిపించింది. ఆ ఇటుకని దేవుడివేపు గిరాటేసి ‘ధన్యుణ్ణి స్వామీ, అమ్మానాన్నకి సేవ చేస్తున్నాను. కాస్సేపాగండి. ఈ ఇటుక మీద విశ్రమించండి. సేవ ముగించుకు వస్తాను’ అన్నాడుట. స్వామి ఇటుక మీద కూర్చోలేదు. భక్తుడి తల్లిదండ్రుల సేవ ముగిసే వరకూ ఆ ఇటుక మీద నిలబడే ఉన్నాడట. ఇది కథో, ఇతిహాసమో నాకు తెలీదు. కానీ ఆముష్మికాన్నీ, దేవుడినీ జీవనానికి సంధించిన అపూర్వమైన కాన్సెప్ట్. తమిళ సినీ రచయిత కన్నదాసన్ ఒక అద్భుతమైన పాట రాశారు. ‘జీవితంలో అందరికీ అన్ని విధాలా రుణం తీర్చుకోగలను. కానీ, నేను పోయాక నన్ను శ్మశానానికి మోసుకుపోయే ఆ నలుగురి ఉపకారానికీ ప్రతిక్రియ చెయ్యలేను. వారికి నా ప్రణామాలు’ అంటారు. గొప్ప రచయిత, గొప్ప నటుడి గొప్ప జీవితం ప్రపంచం చప్పట్లని ఓ జీవితకాలం సంపాదించు కుంది. కానీ వృద్ధాప్యంలో కెనడా ఆసుపత్రి ముందు దిగే ఓ నిస్సహాయుడికి ఆసరా ఇచ్చే బిడ్డల చేతులు ఓ సమాజ సంస్కారానికీ, ఓ వ్యవస్థ నివాళికీ–వెరసి అతను సంపాదించుకున్న వరం. Life is an achievement but old age is a gift. నిస్సహాయతకు చెయ్యి సాయం సంస్కారం. చెయ్యి యోగం. గొల్లపూడి మారుతీరావు -
ప్రకృతి అనే భూతం
ప్రకృతి మనల్ని అక్కున చేర్చుకుని ఆశీర్వదించే కన్నతల్లి. అందుకే ఆ శక్తిని– అర్థం చేసుకోనవసరంలేని సామాన్య ప్రజానీకం ‘దేవత’ అన్నారు. ప్రకృతి సామరస్యం దెబ్బతినకుండా నిరంతరం మన జీవనవిధానాన్ని పూర్వులు నియంత్రించారు. కూల్చిన చెట్టుకి ప్రత్యామ్నాయం ఉండాలి. ఎందుకు కూలుస్తున్నామో, దానికి మారుగా ఏంచేస్తున్నామో చెప్పాలి. దీనికి కర్మకాండ ఉంది. ఉద్దేశం– ప్రకృతిని కదిలించే ఏ పనయినా తెలిసి చేయాలి. కానీ మనం తెలివయినవాళ్లం. ప్రకృతి దేవత ఏమిటి– పిచ్చి వాగుడు కాకపోతే! ఏ ప్రకృతి శక్తినయినా యథేచ్ఛగా, నిరాటంకంగా, నిర్భయంగా వాడుకోగలిగే పద్ధతుల్నీ, ఆలోచనలనీ పెంపొందించుకున్నాం. ఫలితం? నేను మా అబ్బాయి, మనుమరాళ్లతో– 2013లో ఈ భూగ్రహం కొనవరకూ ప్రయాణం చేశాను. నార్వేలో ట్రోమ్సో అనే ఊరు. ఆ తర్వాత భూమిలేదు. అక్కడి నుంచీ దాదాపు 2,000 మైళ్ల పైచిలుకు ఆర్కిటిక్ మహా సముద్రం. ఉత్తర ధృవం. పోనుపోను గడ్డకట్టిన మహా స్వరూపం. ఈ అనూహ్యమయిన మంచు భూతం కింద ఎన్నో సమాధి అయిన– మన గ్రహం వంటి భూభాగాలు, సంస్కృతులూ ఉండి ఉండవచ్చునని శాస్త్రజ్ఞులు భావిస్తున్నట్లు మొన్న పత్రికల్లో వచ్చింది. ఇప్పుడు అసలు కథ. 2018లో మానవుడి దురాశ, దురాక్రమణ, నాగరిక వైపరీత్యాల కారణంగా రికార్డు స్థాయిలో భూమి ఉష్ణోగ్రత పెరిగిం దట. పెరిగే అతి చిన్న ఉష్ణోగ్రతకే మన ఆరోగ్యం, ఆహారం, తాగే నీటి వనరులూ దెబ్బతింటాయి. ఈ శతాబ్దపు చివరికి– ఈ లెక్కన 3.5 శాతం ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడేమవుతుంది? చాలా జంతు సంతతి నాశనమవుతుంది. వృక్ష సంపద నశిస్తుంది. సముద్రాల్ని శుభ్రపరిచే నాచు వంటి ‘పెరుగుదలలు’(రీఫ్) పోతాయి. ధృవాలలో నీటిమట్టం కరిగి –సముద్రాల నీటి మట్టం పెరిగి–విశాఖపట్నం, భువనేశ్వర్, చెన్నై, కొచ్చి, నాగపట్టణం వంటి ప్రాంతాలలో భూమట్టం బాగా తరిగిపోతుంది. చాలా స్థలాలు మునిగిపోతాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుదలవల్ల భూమి ఆర్చుకుపోతోంది. చెమ్మతో సమతలంగా ఉండే నేల ఒకప్పుడు వర్షం పడగానే– నీటిని చెరువులకూ, నదులకూ పారించేది. కానీ భూమికే నీటి చెమ్మ అవసరం ఏర్పడింది కదా? 160 దేశాలలో పరిశోధన జరిపిన ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ శాస్త్రజ్ఞులు దీనికి రంగుల అన్వయాన్ని ఇచ్చారు. భూమి మీద 100 వర్షపు చుక్కలు పడ్డాయనుకోండి. ప్రస్తుతం 36 చుక్కలే వనర్లకు చేరుతున్నాయి. దీన్ని ‘బ్లూ వాటర్’ అన్నారు. మిగతా 64 చుక్కల్ని భూమి ఆర్చుకుపోయిన తన భూభాగాన్ని నింపుకుం టోంది. దీన్ని ‘గ్రీన్ వాటర్’ అన్నారు. ఇది ఒక పార్శ్వం. గత 22 సంవత్సరాలలో సముద్రమట్టం సాలీనా 3.2 మిల్లీమీటర్లు పెరుగుతోంది. న్యాయంగా ఏ 80 సంవత్సరాలకో పెరగవలసిన మట్టమిది. ఒక్క కొచ్చీలోనే మిగతా సముద్ర తీరపు పట్టణాలలో కంటే నీటిమట్టం భయంకరంగా చాపకింద నీరులాగ పెరుగుతోందట. డచ్ దేశంలో ఒక సామెత ఉంది. ‘ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించి ఉండవచ్చు. కానీ డచ్ వారు జీలెండుని నిర్మించారు’ అని. గత వెయ్యి సంవత్సరాలలో డచ్ వారు ‘జీలాండ్’ అనే ప్రాంతాన్ని సముద్ర జలాలను తప్పించి నిర్మించారు. ఆ పని జపాన్ చేస్తోంది. వేల ఎకరాల స్థలాన్ని సముద్ర ప్రాంతాల నుంచి– నీటిని తప్పించి సాధించింది. విచిత్రం ఏమిటంటే సముద్రాన్నించి భూభాగాన్ని సంపాదించే ఆధునిక విజ్ఞానం ఒక పక్క పురోగమిస్తుం డగా– భూమిని కబళించే సముద్ర ఉష్ణోగ్రతలను పెంచే అనర్థం మరోపక్క జరుగుతోంది. ఈ భూమి మీద ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కాలగమనంలో లక్ష ద్వీపాలు, మాల్దీవ్‌లు, బంగ్లాదేశ్‌లో అధిక భాగం సముద్ర గర్భంలో ఉంటాయట. జవహర్లాల్ నెహ్రూ వర్సిటీలో ప్రకృతి విపత్తు పరిశీలనకు ఏర్పాటైన కేంద్ర ప్రొఫెసరు డాక్టర్ అమితాసింగ్ ఒకమాట అన్నారు. నేడు నానాటికీ పెరుగుతున్న జంతు సంహారానికి కబేళాలు వాతావరణంలో విష వాయువుల వ్యాప్తికి కారణమవుతున్నాయట. శాకాహారంతో కనీసం ప్రకృతిలో నాలుగో భాగాన్ని పరిరక్షించవచ్చు. అయితే ఈ ఒక్క మాట చాలు సమాజంలో పెద్ద అల్లర్లు లేవడానికి. ఇప్పుడు గోసంరక్షణ కథలు వింటున్నాం కదా? ఏమయినా మానవుడు తెలివైనవాడు. తాను దిగవలసిన గోతిని తానే తెలిసి తెలిసి తవ్వుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చే ప్రళయం నుంచి రక్షించడానికి అలనాడు వచ్చిన నోవా నావ ఉండదు. కారణం– ఇది స్వయంకృతం. మానవుడి పేరాశ, రక్తపాతంతో అతను స్వయంగా తెచ్చిపెట్టుకున్న విపత్తు. ఇది నా మాట కాదు. డాక్టర్ అమిత్ సింగ్ తీర్పు. కాలగమనాన్ని రుతువులతో పలకరిస్తూ, తరతరాలుగా మానవ కల్యాణానికి మన్నికయిన గొడుగును పట్టిన ప్రకృతి శక్తిని గుర్తించిన వారికి ఆనాడు – తల్లి. ఇప్పుడు నిశ్శబ్దంగా మీద పడి కబళించనున్న పెనుభూతం. గొల్లపూడి మారుతీరావు -
మళ్లీ ఐఏఎస్‌లు...!!
ఒకే నెలలో రెండుసార్లు ఐఏఎస్‌ల గురించి... ‘సేవ’ని అటకెక్కించిన అధికారులున్న నేపథ్యంలో తమిళనాడు తిరువణ్ణామలై కలెక్టరు కందసామి ఒక ఒయాసిస్సు. కలెక్టరుగా ఓ మామూలు కుటుంబానికి చేయూతనిచ్చి, స్వయంగా వంట చేసి, ఆర్డరు ఇచ్చి వచ్చారు. సేవకీ, పరిపాలనా దక్షతకీ ప్రతీకగా నిలిచే ఈ సర్వీసు బ్రిటిష్‌వారి పాలనలో మిగుల్చుకున్నది. అయితే ఆనాటి ఐసీఎస్‌ల ఆర్భాటం, హంగులు నెహ్రూగారికి నచ్చేవి కావని నెహ్రూ రక్షణాధికారి రుస్తుంజీ ‘ఐయాం నెహ్రూ షాడో’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. నాకు గత 65 సంవత్సరాలుగా ఈ ఆఫీసర్లు తెలుసు. నా పన్నెండో ఏట విశాఖకు జేపీగిల్ గ్విన్ గారు కలెక్టరుగా ఉండేవారు. సాయంకాలం సభకి బంగళా నుంచి రోడ్డు పక్క చేతులు వెనక్కు కట్టుకుని నడిచి రావడం నేను స్వయంగా చూశాను. నెహ్రూకీ, రాజేంద్రప్రసాద్‌కీ సెక్రటరీగా పనిచేసిన హెచ్‌వీఆర్ అయ్యంగా ర్ని చూశాను. ‘సురభి’ సంపాదకుడిగా ఆంధ్రాలో ఆఖరి ఐసీఎస్ వీకే రావుగారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన వయసిప్పుడు 104 సంవత్సరాలు. ఆయన కొడుకు, మేనల్లుడు ఐఏఎస్‌లు. వారి ఫొటో కోసం ముగ్గురు ఐఏఎస్‌లు కనీసం నాలుగేసిసార్లు నాకు ఫోన్లు చేసి సమకూర్చారు. ఇవాళ కలెక్టర్లు డవాలా బంట్రోతుల వెనుక మాయమవుతారు. వారు సాధారణంగా ఆకాశం నుంచి దిగి వస్తారు. మానవమాత్రులలో కలవరు. They lost their human facelong back. . అలనాటి చిత్తూరు కలెక్టరు బీకే రావుగారు– నాకు రచయితగా చేయూతనిస్తూనే జీవితంలో మనిషిగా పెద్ద రికాన్ని నష్టపోని ఉదాత్తతని నేర్పారు. నరేంద్ర లూథర్ మా నాటకంలో (వందేమాతరం) భాగంలాగా హైదరాబాదులో మాకు తోడుగా నిలిచారు. ఇంకా సీఎస్ శాస్త్రిగారు, జొన్నలగడ్డ రాంబాబుగారు వంటి అరుదైన అధికారులు ఆ పదవులకు వన్నె తెచ్చారు. వీపీ రామారావుగారు ఏకంగా నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. దయాచారిగారు నా నాటిక ‘కళ్లు’ ప్రదర్శించిన విషయాన్ని ఆనందంగా పంచుకున్నారు. కెవీ రమణాచారిగారు నా ‘దొంగగారొస్తున్నారు...’ నాటికలో ప్రధాన పాత్రని నటించారు. అభిరుచికి అగ్ర తాంబూలమిచ్చి, అధికారం అడ్డం పడకుండా పదవినీ, పరిచయాల్నీ నిలుపుకున్న పెద్దలు వీరు. ఈ గొడవంతా ఇప్పుడెందుకు? నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి– ముగ్గురు చీఫ్ సెక్రటరీలను (అరుణాచల్‌ప్రదేశ్, గోవా, ఆంధ్రప్రదేశ్) మూడు కారణాలకి– ఒకే రోజు నిలదీశారు. ఎందుకు? సరైన దుస్తులు వేసుకొని కోర్టుకి రానందుకు! ఒకాయన పాంటు, షర్టు దాని మీద పసుపు జాకెట్ వేసుకున్నారు. మరొకాయన పరిస్థితీ అలాంటిదే. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్గారు వారి వాంగ్మూలాన్ని వినడానికి నిరాకరించారు. కారణం– వారి దుస్తులు! ‘మీరు పిక్నిక్కి రాలేదు. మీమీ రాష్ట్రాలకు ప్రాధాన్యం వహిస్తూ వాజ్యాలను జరపడానికి వచ్చారు’ అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగారి కథ. పదవిలో ఉన్న రాష్ట్ర న్యాయమూర్తుల స్థాయిలోనే రిటైరైన న్యాయమూర్తులకు వైద్య సదుపాయాలు ఇస్తున్నారా? అన్నది వాజ్యం. ‘మేం అప్పుడే చేసేశాం సార్!’ అన్నారు చీఫ్ సెక్రటరీగారు. ‘ఏమిటి చేసేశారు?’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్న. ఈయన నీళ్లు నమిలారట. ‘మా ఆర్డర్లో రాష్ట్ర ప్రధాన అధికారి విషయాన్ని కూలంకషంగా తెలుసుకోకుండానే కోర్టుకి వచ్చారని తెలియజేస్తాం’ అన్నారు న్యాయమూర్తి. వీరు ఆయా రాష్ట్రాల ప్రతినిధులు, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో నిలిచిన ఆఫీసర్లు– కనీస మర్యాదల్ని పాటించకపోవడం, ఆ కారణంగా న్యాయమూర్తి విచారణ జరపడానికి తిరస్కరించడం ఈ తరం అధికారులు తెచ్చిపెట్టిన అపఖ్యాతి. అలనాటి ఐపీఎస్‌లను పాలనా దక్షతకి సలహాదారులుగా– మార్గదర్శకులుగా ఆనాటి నాయకులు భావించేవారట. ఐసీఎస్ సాధికారికమైన పాలనకు గీటురాయి. ఇది వీకే రావు గారు స్వయంగా చెప్పిన వైనం. నీలం సంజీవరెడ్డిగారి వంటి నాయకులు ఈ అధికారుల్ని నెత్తిన పెట్టుకునేవారట. అంతెందుకు? ఫొటో కోసం కూర్చున్న ఆ కాలపు ఐసీఎస్ వీకే రావుగారు 104 సంవత్సరాల మనిషి– బహుశా 45 సంవత్సరాల కిందట ఉద్యోగ ధర్మంగా వేసుకునే దుస్తుల్ని వేసుకుని కెమెరా ముందు కూర్చోవడం గమనార్హం. కొసమెరుపు: నాతో మాట్లాడిన ఒక ఐఏఎస్గారన్నారు: ‘మారుతీరావుగారూ! కోర్టులో వకాల్తాకి వచ్చిన అధికారులు ఫలానా దుస్తుల్లో ఉండాలన్న రూలు లేదు’ అని. అయితే ‘మర్యాద’కీ ‘రూలు’కీ చుక్కెదురు. కోర్టులో నిలవడం బాధ్యత. సాధికారికమైన దుస్తులు న్యాయస్థానం పట్ల అధికారులు చూపే మర్యాద. దీనికి రూలు పుస్తకం అనవసరం. వెరసి– నేటి ఐఏఎస్‌ల నిర్వాకమిది. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
అకాల ఆత్మహత్యలు
ఈమధ్య 14 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నట్టు పేపర్లో వార్త. ఏమిటిది? చక్కగా ఆడుతూ, పాడుతూ తిరగాల్సిన వయస్సు. ‘చావు’ అన్నమాటే దగ్గరకు రానక్కరలేని వయస్సు. ఏమయింది? ప్రముఖ సోషియాల జిస్టు ఆల్విన్ టాఫ్లర్ ఈ జబ్బుకి ఒక పేరు పెట్టాడు– ఫ్యూచర్ షాక్ అని. రేపటి పరిణామాలు ఇవాళే దూసుకు మీద పడిపోతూ– వాటి అవగాహన కుది రేలోగా కొత్త పరిణామాలు దూసుకువస్తూ– రేపు నేటిని దోచుకుంటున్న విపరీత పరిణామం పర్య వసానమిది అని. నా చిన్నతనంలో కంప్యూటర్ లేదు. మొబైల్ లేదు. చేతిలో సినిమా లేదు. ఇన్ని హోటళ్లు లేవు. ఇన్ని జబ్బులు లేవు. ఇన్ని పత్రికలు లేవు. ఇంతగా ‘అవినీతి’ వితరణ లేదు. ఇన్ని మానభంగాలు లేవు. నాయకులలో ఇంత లుచ్చాతనం లేదు. యాసిడ్ చావులు లేవు. అన్నీ ఒక్కసారి మీదపడితే? పసి మనసులకు ‘రేపు’ అంధకారంగా కనిపిస్తే? తల్లిదండ్రులు ఆఫీసుల్లో మాయమవుతున్నారు. పిల్లలు ఏం కావాలో వాళ్లు ఉగ్గుపాలలో ఉండగానే వీళ్లు నిర్ణయించేస్తున్నారు. ఆ ‘కావాల్సిన’ అర్హతలకి ధరకట్టే విద్యాసంస్థలు లేచాయి. వాళ్లకి 10 ఫస్టు క్లాసులు, 56 సెకండ్ క్లాసులే తెలుసు. సంజీవరా వు, విజయలక్ష్మి తెలియదు. తెలియదని కుర్రా డికి తెలుసు. చదువుకి అమ్ముడుపోయిన కుర్రాడు హాస్టల్ గదులకి బందీ అవుతున్నాడు. తల్లిదండ్రులు పెట్టుబ డికి తగ్గట్టు ఆశించిన, విద్యాలయాలు తమ పేపరు ప్రకటనలకి తగ్గట్టు ఎదురుచూసిన రిజల్టు రాకపోతే? నేటి కుర్రాళ్లకి ఆటలు తెలీవు. గోళీకాయలాట, గోటీ బిల్ల తెలీదు. ఆటలో కిందపడి దెబ్బలు తగిలించు కోవడం తెలీదు. తల్లిదండ్రులతో సహజీవనం తెలీదు. ఓటమి అనే అదృష్టం తెలీదు. ఫరవాలేదని ఓదార్చే ‘పెద్దరికం’ తెలీదు. తాము ఆశించిన డిగ్రీకి పెద్దల పెట్టుబడి తమ చదువని మాత్రం తెలుసు. నా చిన్నతనంలో ఆదివారాలు– చిరస్మరణీ యాలు. పొద్దుట్నించీ మా నాన్నగారిని దువ్వేవా డిని– మూడు అణాల కోసం. బులిపించి బులిపించి ఇచ్చేవారు. అక్కడినుంచి విశాఖపట్నం బీచ్‌లో మినర్వా టాకీసుకి పరుగు– నాడియా– జాన్కీవాస్ చిత్రం చూడటానికి. మా నాన్నగారికి తెలుసు– నేను అడుగుతానని. కానీ ఆ డబ్బుని నేను ‘సంపాదించు కోవాలి’. అదీ ముఖ్యం. ‘ప్రయత్నం’ ఫలితాన్ని అలంకరిస్తుంది. సినిమా ఏమిటని ఆయన ఒకనాడూ అడగలేదు. నాకు సినిమా మైకం అయింది. 57 సంవ త్సరాలు అది నాకు ఆరాధ్యమయింది. యూనివర్సిటీకి రోజూ బస్సుకి అయిదణాలు. మా నాన్నగారి జీతం ఆ రోజుల్లో 30 రూపాయలు. నా టర్మ్ జీతం 30. ఏ రోజూ ఆయన అదనపు సొమ్ము ఇవ్వలేదు. నాకు అడగటం తెలీదు. ఏ రోజూ యూనివర్సిటీ క్యాంటీన్లో కాఫీ తాగలేదు. నేను పేదవాడిని కాదు. కానీ ‘పరిమితి’కి అలవాటుపడిన గంభీరమైన జీవికకు ఒదిగినవాడిని. అవసరాల్ని కుదించుకోవడం పరోక్షంగా అలవాటు అయింది. ఓసారి మా నాన్నగారి ఆఫీసు ప్యూన్ సైకిలు తొక్కబోయి కిందపడి మోకాలు చెక్కుకుపోగా– ఇంట్లో చెప్పకుండా నిద్రపోయాను. నిద్రలో నొప్పితో మూలిగే నా కాలికి మా నాన్నగారు మందు రహ స్యంగా రాయడం లీలగా జ్ఞాపకం. సైకిలు తొక్కి నందుకు నిలదీయలేదు. ఒక ప్రయత్నంలో నన్ను ‘ఫెయిల్’ అవనిచ్చారు. అదీ మెలిక. తమ ఫెయి ల్యూర్ని పెద్దలు అంగీకరించడం ఈ కాలం కుర్ర కారుకి తెలీదు. మా నాన్నగారితో కూరల బజారుకి వెళ్లేవాడిని. ఏ రోజూ నన్ను కూరలు ఎంపిక చెయ్యనివ్వలేదు. సినీ నటుడినై– పరపతి గడించాక, డ్రైవరుతో విశాఖ బజారులో నిలిచి–అందరూ నిర్ఘాంతపోయి చూస్తుం డగా బెండకాయలు ముచికలు విరిచి ఏరడం సరదా. అది నా ఖరీదైన వినోదం. అతి సామాన్యమైన అను భవాలకు జరీ అంచు తొడిగిన సందర్భాలివి. ఈ కాలం పిల్లలకి ఓటమి తెలీదు. అవసరాల కుదింపులో ఒద్దిక తెలీదు. హితవు చెప్పే పెద్దల ఉనికి తెలీదు. మాస్టర్లని గౌరవించడం తెలీదు. కన్నెత్తి చూసే ఆదర్శ నాయకత్వం తెలీదు. కష్టంలో హితవు చెప్పే నాథుడి గురించి తెలీదు. పెద్దల ఉనికిని నష్ట పోయిన అబ్బాయీ అమ్మాయీ కలయికకి ‘ప్రేమ’ అని దొంగపేరు పెట్టుకోవడం తెలుసు. అమ్మాయి దూరమైతే పరిస్థితిని అంగీకరించడం తెలీదు. యాసిడ్ పోయడం తెలుసు. మనసారా కంటతడి పెట్టే అవకాశం లేదు. చేసిన తప్పుని రహస్యంగా నయినా అంగీకరించే ‘పెద్దరికం’ తెలీదు. అపజ యాన్ని అంగీకరింపజేసే ‘హితవు’ తెలీదు. టీచర్లకి విద్యార్థులతో సయోధ్య తెలీదు. పరిస్థితి ఎక్కడన్నా పట్టాలు తప్పితే? ఒక్కటే ఉంది. ఆత్మహత్య. ఈ మధ్య సర్వే ప్రకారం– బెంగళూరు, చెన్నై, ముంబైలలో 59 శాతం మంది ఎలా ఆత్మహత్య చేసు కోవాలో మార్గాలు వెతుకుతున్నారట. ఇంకా దారు ణం 47 శాతంమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తు న్నారట. ఒక్కడు– ఒక్కడంటే ఒక్కడు– పత్రికకి ఎక్కుతున్నాడు. అంతే. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
‘నేలబారు మనిషి’
తెల్లారిలేస్తే క్రిమినల్ కేసులతో పత్రికల్లో దర్శనమిస్తూ, రేప్‌లు, భూక బ్జాలతో పబ్బంగడుపుకునే నాయకులూ, వారి అడుగులకు మడుగులొ త్తుతూ వారితో పాటు జైళ్లకు వెళ్లే అధికారుల కథలు చదివి చదివి నిస్త్రాణతో ఈడిగిలపడుతున్న ప్రజానీకానికి ఇంకా మంచితనానికీ, మంచిపాలనకీ వేళ మించిపోలేదని గుర్తు చేసి వెన్నుతట్టే కొందరు ఐయ్యేయస్‌ల కథలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూంటాయి. సమాజగతిలో అందరూ మహాత్ములే ఉండరు. మన తరానికి ఒక్కడే మహాత్ముడు. కాని వారి దక్షత, సేవాభావం అందరూ సూర్యరశ్మిలాగ జాతిని జాగృతం చేసి– ఆరోగ్యకరమైన పరిణా మానికి ఇంకా వేళ మించిపోలేదన్న ‘ఆశ’ని బతికిస్తూ ఉంటుంది. అలాంటి ఒక కథ. తిరువణ్ణామళై జిల్లాలో ఆరణి అనే ఊరు దగ్గర 1000 మంది జనాభా ఉన్న కాణికిళుప్పాల్ అనే పల్లెటూరు. అక్కడ ఓ పేద కుటుంబం. ఇల్లాలు మధ్యాహ్న భోజన పథకంలో వంట మనిషికి సహాయకురాలిగా పనిచేస్తుంది. తండ్రి రోజు కూలీ. వాళ్లకి ముగ్గురు పిల్లలు. పెద్ద పిల్ల ఆనంది. 19 ఏళ్లు. తర్వాత కుర్రాడు. చెల్లెలు మరీ చిన్నది. ఉన్నట్టుండి ప్రసవానికి సంబంధించిన రుగ్మతతో తల్లి కన్నుమూసింది. తండ్రి మూత్రపిండాల వ్యాధితో మరణించాడు. వీరుకాక ఆ ఇంట్లో మరో ముదుసలి. ఆమే ఈ పిల్లలకి పెద్ద దిక్కు. ఇప్పుడు చదువుల సంగతి దేవుడెరుగు. బతకడానికి ఆస్కారం లేదు. ఈ పిల్ల వారం వారం ప్రజా సమస్యలు వాకబు చేసే తిరువణ్ణామళై కె.ఎస్. కందస్వామి దర్బారుకి వెళ్లింది. ప్రజా సమస్యలను కేవలం వినడమేకాక– చేతనయిన ఉపకారం చేస్తాడని ఈ అధికారికి ఆ జిల్లాలో పేరుంది. ఆయన సూటూ బూటూ వేసుకుని సభ తీర్చే ఆధికారికాదు. ‘‘బేర్ ఫుట్ బ్యురోక్రాట్ (స్తూలంగా ‘నేలబారు మనిషి’)అని పేరుంది. ఆయనకి తన గోడు చెప్పుకుంది. అక్కడికి వచ్చే ఎందరో ఆర్తులలో ఆ అమ్మాయీ ఒకరు. ఈ కలెక్టరు తమ గోడుని గుర్తుంచుకుంటారా? ఏదైనా ఉపకారం జరుగుతుందా? ఆ పిల్లకి మరో మార్గాంతరం లేదు. కలెక్టరు ఆమె చెప్పిన వివరాలు రాసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న కనీసపు వయస్సుని సడలించ మని– ఈ 19 ఏళ్ల పిల్ల గురించి ప్రభు త్వానికి రాసి సమ్మతిని తెప్పించాడు. ఉద్యోగం చేస్తూనే ఆమె దూరవిద్యా పథకం ద్వారా పై చదువు చదువుకోడానికి ఏర్పాట్లు చేశాడు. ఈలోగా ఆ ఇంటి ముసలమ్మకూడా వెళ్లిపోయింది. ఇప్పుడా ముగ్గురు పిల్లలకీ దిక్కు, లేదు. ఒక రోజు ఆనందికి కలెక్టరుగారు స్వయంగా ఫోన్ చేశారు– డవాలా బంట్రోతుల వెనుక మాయమయే కలెక్టర్లున్న నేటికాలంలో ఓ అమ్మా యికి స్వయంగా కలెక్టరు ఫోన్ చెయ్యడమే విడ్డూరం. విషయం ఏమిటి? తాను ఆ మధ్యాహ్నం వారింటికి భోజనానికి వస్తున్నట్టు. ఆనంది కంగారు పడిపోయింది. ఈవార్త తెలిసిన గ్రామీణులు ఆ యింటి దగ్గర పోగయారు. కలెక్టరుగారు తన సిబ్బందితో వచ్చారు. భోజనానికి మాత్రమే రాలేదు. తానే స్వయంగా నడుంబిగించి– వంకాయ పులుసు, బంగాళ దుంప కూర, రసం, అప్పళం సిద్ధం చేశారు. వారి పంక్తిన కూచుని భోజనం చేశారు. భోజనం అయాక చాపమీద కూర్చుని– తన అసిస్టెంటు చేతిలో కాగితం తీసుకుని ఆ పిల్లని చదవమన్నాడు. ఆ ఉత్తరం ప్రభుత్వం ఇచ్చిన తాఖీదు. ఆ వూళ్లో వాళ్ల అమ్మ నౌఖరుగా పని చేసిన మధ్యాహ్న భోజన పథకం ప్రోగ్రాంకి ఆమెని అధికారిగా నియమించారు. ఉత్తరం చదువుతూనే ఆ పిల్ల భోరుమంది. అంతేకాదు. కుర్రాడి హైస్కూలు చదువుకీ, ఆఖరి పిల్ల ఎలి మెంటరీ చదువుకీ ఏర్పాట్లు చేశారు. ఆమె నౌఖ రీకి వెళ్లడానికి ఓ సైకిలుని బహూకరించారు. ఈ చర్య వల్ల జీవితం మీదా – అంతకంటే సమా జంలో తన నిస్సహాయతకి దన్నుగా నిలిచిన పాలక వ్యవస్థ మీదా – ఓ 19 ఏళ్ల పిల్లకి ఎంత విశ్వాసం, కృతజ్ఞత నిలదొక్కుకుంటుంది! ఆ చిన్న గ్రామం, అవినీతి ఊబిలో కూరుకుపోతున్న ఈ దేశానికి ఎంత ఆశని చిగురింపజేస్తుంది! కుటుంబం కష్టాలను ఆదుకున్న ఓ అధికారి దక్షత యంత్రాంగం మీద ఎంత విశ్వాసాన్ని పెంచుతుంది? మంచితనం వైరస్. అధికారుల ఆరోగ్యకరమైన స్పందన ఈ వ్యవస్థలో సివిల్ సర్వీసుల లక్ష్యం బ్రిటిష్‌వారి పాలన ముగిశాక, వారి ఆఖరి వారసత్వంగా మనం మిగుల్చుకున్న ఒకే ఒక సర్వీసు సివిల్ సర్వీసు. ఎందుకని? ‘సేవ’ని బాధ్యతగా, వృత్తిగా, ఆదర్శంగా నిర్వహింపజేసిన వ్యవ స్థ అది. ఒకనాటి బ్రౌన్, మెకంజీ, ఆర్దర్ కాటన్ వంటి విదేశీ అధికారులు ఈ సర్వీసుని తమ కృషితో చిరస్మరణీయం చేశారు. తర్వాత తరాలవారు చాలా మంది– నాయకుల అడుగులకు మడుగులొత్తి గబ్బుపట్టించారు. ఈ కందస్వామి వంటివారు ఆనాటి తరానికి వారసులు. - గొల్లపూడి మారుతీరావు -
కార్పొరేట్ దేవుడు
జీవన కాలమ్ మొన్న వినాయక చతుర్థికి స్పెయిన్‌లో కొందరు హిందువులు వినాయకుని పూజ చేసుకున్నారు. అంతేకాదు, చిన్న ఊరే గింపు జరపాలనుకున్నారు. ఇది కొత్త సంప్రదాయం. తమ ఊరేగింపు వెళ్లే దారిలో ఒక చర్చి ఉంది. కనుక, ముందుగానే చర్చికి తమ ఉద్దేశం వివరిస్తూ ఆ దారిన వెళ్లడానికి అనుమతి కోరారు. చర్చి అధి కారులు నవ్వి, ‘‘మీ వినాయకుడు ఈ దారిన వెళ్లడమే కాదు, చర్చిలోకి వచ్చి మా ఏసు ప్రభువును కలిసి వెళ్లవచ్చు–ఇద్దరు దేవుళ్లూ మనందరినీ ఆశీర్వదిస్తారు’’ అన్నారు. మొన్న అదే వినాయక చవితినాడు తమిళనాడు షెన్కోటై్టలో మసీదు ఉన్న తమ రోడ్డులో ఊరే గింపు వెళ్లరాదని కొందరు ముస్లింలు, ముఖ్యంగా యువత హిందూ భక్తులను ఎదిరించారు. రెండు వర్గాల మధ్యా వాగ్వివాదాలు చెలరేగాయి. ఆవేశాలు పెరిగాయి. ఒకరి మీద ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఖాళీ విస్కీ సీసాలతో కొట్టుకున్నారు. మత దౌర్జన్యకారులు పది కార్లను, మూడు ఆటోలను, రెండు దుకాణాలను, ఒక ఏటీఎంనీ ధ్వంసం చేశారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. కలెక్టరు వచ్చారు. రెండు వర్గాలూ దేవుడిని అటకెక్కించి, మతాన్ని నెత్తిన పెట్టుకుని బిగుసుకున్నాయి. కర్ఫ్యూ విధించారు. ఏ దేశంలోనూ నాకు తెలిసి ఇలా దేవుడు వీధికెక్కడు. మతం వ్యక్తిగత విశ్వాసానికి ప్రతీక. ఒక వర్గం సామూహికంగా తమ దేవుడిని ఆరాధించడం ఈ దేశ సంప్రదాయం. మతం ఎల్లలను చెరిపేసిన మహానుభావులెందరో ఈ దేశంలో, ఇప్పుడు ఉన్నారు. ఇదే వినాయక చతుర్థి రోజున ఓ మిత్రుడు నాకు వాట్సాప్ సందేశాన్ని పంపాడు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అద్భుతంగా ‘వినా యక స్తుతి’ని జపించిన రికార్డింగు అది. కలియుగ ప్రత్యక్ష దైవంగా హిందువులు కొలిచే వేంకటేశ్వర స్వామి మీద అలంకరించే సాలిగ్రామ మాల, అను నిత్యం పూజలు జరిపే సువర్ణ పుష్పాలు ఇద్దరు ముస్లిం భక్తులు ఇచ్చినవని చెబుతారు. ఇంకో విచిత్రమైన ఇప్పటికీ సాగే సంప్రదాయం భద్రాచల దేవస్థానంలో ఉంది. ప్రతీ ముక్కోటి ఏకాదశికీ స్వామివారికి మొదటి అభిషేకం అక్కడి తహసీల్దారు చెయ్యాలి. ఆనాటి కంచర్ల గోపన్న తహసీల్దారు కనుక. అయితే రెండు సంవత్సరాలు ఒక ముస్లిం ఇక్కడ తహసీల్దారుగా ఉన్నాడు. ఆయనే అభిషేకం చేశాడు. ఒకసారి ఒక క్రైస్తవుడు తహసీ ల్దారుగా ఉన్నాడు. క్రైస్తవుడే అభిషేకం చేశాడు! ఇది అప్పటి తానీషా హుకుం. ఈ సంప్రదాయాలు, విశ్వాసానికి మతం లేదని నిరూపించిన అపూర్వ మైన ఘట్టాలు. ఇక సాంస్కృతిక రంగంలో తమ వైదుష్యంతో మతం ఎల్లలను చెరిపేసిన ఎందరో మహాను భావులు గుర్తుకొస్తారు. భారత రత్న బిస్మిల్లా ఖాన్, షేక్ చిన మౌలానా సాహిబ్ నుంచి నేటి జేసుదాసు వరకూ అదో వైభవం. చాలా సంవత్సరాల కిందట మద్రాసు వెంకటనారాయణ రోడ్డులోని వేంకటేశ్వర మందిరంలో జేసుదాసు స్వామిని దర్శనం చేసుకుని, కచేరీ చేస్తూ తోడి రాగంలో ‘‘అపరాధము లన్ని మరిచి’’ని ఆలపించడం అస్మదాదులకు గర్వ కారణం. నేను నా ‘ఆత్మకథ’లో రాసిన ఓ సంఘటనని ఇక్కడ ఉదహరించాలి. చిన్నతనంలో మా అమ్మ స్కూలుకి వెళ్లి రోజూ ఒక కాణీ పట్టుకుని వచ్చేదట. మా అమ్మమ్మ గమనించి కోప్పడి కూతురుతో స్కూలుకు వచ్చింది. మా అమ్మ కోసం ఎదురుచూస్తున్న గెడ్డం ముసలాయన్ని అడిగింది ‘‘ఏం తాతా! మా అమ్మాయికి రోజూ డబ్బు లిస్తున్నావు, ఎందుకు?’’ అని. ఆ ముసలాయన ఒక ముస్లిం. కంటతడి పెట్టుకుని, ‘‘ఈ వయస్సున్న నా కూతురు పోయిందమ్మా. ఆ పాపని చూస్తే నా బిడ్డ గుర్తుకు వస్తుంది’’ అన్నాడట. కడుపు తీపికి మతం లేదు. పేగు సంబంధానికి దేవుడు అడ్డం పడడు. ఇవాళ పరిస్థితులు ఎందుకిలా పరిణమించాయి. నాకు తెలుసు. మన మనస్సుల్లో నిలవాల్సిన దేవుడు వీధిన పడ్డాడు. దేవుడు పెట్టుబడిగా రాజకీయ పార్టీలు వెలిశాయి. అంతవరకూ పరవాలేదు. పదవిలో ఉన్న తమ దేవుడి భక్తుల్ని చూసి చదువులేని, సంస్కారం చాలని వర్గాలు రెచ్చిపోతు న్నాయి. మైనారిటీలకు మతం పెట్టుబడి. వీధిలో తమ మతం జెండా ఎగురవేయడం పార్టీకీ, తమ వర్గం గొప్పతనానికి నిదర్శనమని వారి ఉబలాటం. ఇది గొప్ప అనర్థం. దేవుడిని మనస్సుకీ, పూజ గదికీ పరిమితం చేయగలిగిన నాడు, పొరుగు మతానికి ఎల్లలు చెరిపివేయగల పెద్ద మనస్సుని వ్యవస్థ ప్రోది చేయ గలిగిన నాడు షెన్కోట్లై కనీసం స్పెయిన్ ఉదాత్తతని పుంజుకోగలదు. దేవుడు కార్లని తగలపెట్టమని ప్రోత్సహించడు. పరాయి దేవుడిని పలకరించడానికి ఉవ్విళ్లూరుతుంటాడు. గొల్లపూడి మారుతీ రావు వ్యాసకర్త -
ఆమెకు ఎవరు సమాధానం చెబుతారు?
బయట వర్షం పడుతోంది. ఓ 80 ఏళ్ల ముసలాయన కార్పొరేషన్ ఆఫీసుకి పన్ను చెల్లించడానికి వచ్చాడు. వరసలో వచ్చిన ఆయన దగ్గర గుమాస్తా పైకం తీసుకుని రసీదు అతని ముఖం మీద పారేశాడు. అంతవరకూ గుమాస్తా రైటే. కాని బయట వర్షం, వచ్చినాయన వృద్ధాప్యం ఎరిగి ఆ రసీదును మడతపెట్టి ఆ ముసలాయన సంచీలో పెట్టాడనుకోండి. అది బాధ్యత కాదు. పది కాలాల పాటు మిగిలే మాన వత్వం. మన దేశంలో బాధ్యత ముసుగులో డబ్బు చేసుకునే కింది తరగతి ఉద్యోగుల హవా సాగుతోంది. మొహం మీద పారేసే రసీదుకీ, మడత పెట్టిన రసీదుకీ ఓ జీవితకాలం ‘సంస్కారం’ ప్రమేయం ఉంది. 41 సంవత్సరాల క్రితం 37 ఏళ్ల గంగా దేవి ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్లో తన ఆస్తి విషయంలో కోర్టుకి వెళ్లింది. మేజిస్ట్రేటు తీర్పు సుముఖంగా తెచ్చుకుంది. ఇందుకు కోర్టు ఖర్చు 312 రూపా యలు కట్టింది. గుమాస్తా డబ్బు కట్టించుకుని రసీదు ఇవ్వడం మరిచిపోయాడు. కోర్టు కాగితాల ప్రకారం డబ్బు చెల్లించని ఆమె ఆస్తి కేసుల్లో పడింది. ఎన్నాళ్లు? 41 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు ‘డబ్బు కట్టాను బాబోయ్!’ అంటూ కోర్టుల వెంట తిరిగింది. 11 మంది న్యాయమూర్తులు ఆమె నిజాయితీని శంకిస్తూ ఆమె వినతిని తోసిపుచ్చారు. ఇప్పుడావిడకి 81 ఏళ్లు. ఈ మధ్య లవ్లీ జైస్వాల్ అనే ఓ జడ్జీగారు ఆమె మాటకి విలువనిచ్చి కాగితాలు వెదికించారు. ఆమె డబ్బు కట్టిన రుజువులు దొరికాయి. ఇప్పుడా గుమాస్తా ఏమయ్యాడు? 41 ఏళ్ల ఆమె గుంజాటనకి ఎవరు సమాధానం చెబుతారు? ఓ గుమాస్తా అలసత్వానికి మూల్యం 41 సంవత్సరాల నరకయాతన. నా జీవితంలో మరిచిపోలేని సంఘటన రేడియోకి సంబంధించి ఒకటుంది. 1931 ప్రాంతంలో అంటే నేను పుట్టక ముందు ఒకాయన ఏటుకూరి బలరామమూర్తిగారి ప్రెస్సులో పనిచేసేవాడు. ఆయన ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు మల్లంపల్లి సోమశేఖర శర్మగారి తమ్ముడు ఉమామహేశ్వర రావుగారు. రేడియోలో ఆఫీసరు ఆచంట జానకీరాం గారు ఓ రోజు బలరామయ్యగారి దగ్గరకు వెళ్లినప్పుడు ‘‘చక్కగా తెలుగు రాసే మనిషిని చూసిపెట్ట వయ్యా’’ అని అడిగారట. తన దగ్గర ఉన్న ఉమామహేశ్వరరావుగారిని చూపించారు. అయితే ఆయన్ని పంపిస్తే తన పని? అందుకని ఒక పూట తన దగ్గర , మరోపూట రేడియోలో పనిచేసే ఒప్పందాన్ని ఇద్దరూ కుదుర్చుకున్నారు. ఆ విధంగా ఉమామహేశ్వరరావుగారు రేడియోలో చేరిన దరిమిలా అనౌన్సరయ్యారు. అనౌన్సరన్న మాటేగాని మద్రాసు రేడియో చరిత్రలో ఆయన తలలో నాలిక అయ్యారు. (ఆ రోజుల్లో తమిళ కార్యక్రమాలు లేవు) నేను పుట్టి, పెరిగి, రేడియోలో ఉద్యోగాన్ని సంపాదించుకుని మద్రాసు రేడియోకి, ఆయనకి ఆఫీసరుగా వచ్చాను. అప్పటికే ఉమామహేశ్వరరావుగారికి కళ్లు మసకలు కమ్మి చూపుపోయింది. ‘చేతిలో డబ్బుల్లేక కళ్లు పోగొట్టుకున్నాను మారుతీ రావుగారూ’ అనే వారాయన. అప్పటికి ఆయన రిటైరయ్యే రోజు వచ్చింది. ఆ రోజు ఆయన బేల అయిపోయారు. దాదాపు 40 ఏళ్ల రేడియో జీవితం ముగియబోతోంది. పిచ్చివాడిలాగ ఆఫీసంతా తిరిగారు. ఆ రోజు ఆఫీసుకి వస్తూ బజారులో పంచెల చాపు కొన్నాను. నాలుగున్నరకి కాంటీన్లో ఆయనతో టీ తాగాను. ఎన్ని జ్ఞాపకాలు? ఎందరు ప్రముఖులతో ఎన్ని గొప్ప కార్యక్రమాలకు పౌరోహిత్యం? కదిపితే భోరుమనేట్టు ఉన్నారు. ఐదు గంటలకి నా స్కూటరు ఎక్కించుకుని దివాన్ బహదూర్ రామయ్యంగార్ రోడ్డు (పూనమల్లి)లోని ఆయనింటికి తీసుకొచ్చాను. అక్కడ బట్టలు చేతికిచ్చాను. అక్కడ ఆయన దుఃఖం కట్టుతెగింది. ‘నన్ను మారుతీరావుగారు ఇంటికి తెచ్చి బట్టలు పెట్టారే’ అంటూ భార్యతో భోరుమన్నారు. ‘‘ఇవాళ దాకా మీరు అనౌన్సరు. రేపట్నించి కాజువల్ ఆర్టిస్టు. మీరు ఆఫీసుకు రావాలి. కాంట్రాక్టు ఇస్తున్నాను. ఇటీజెనార్డర్’’ అని స్కూటరెక్కాను. అలా ఎన్నాళ్లు? మరో 40 ఏళ్లు జీవించి నూరేళ్ల జీవిగా నిష్క్రమించారు. నా జీవితంలో పచ్చని జ్ఞాపకాలలో ఇదొకటి. తర్వాత మిత్రులు మల్లాది సచ్చిదానందమూర్తిగారితో చెప్పి వారికి సత్కారం ఏర్పాటు చేశాను. మూర్తిగారు వదాన్యులు. అప్పటి నుంచి ఆయన పోయేదాకా నెలకి వెయ్యి రూపాయలు పంపారు. ఓ గుమాస్తా గంగాదేవికి రసీదు ఇవ్వడం మరిచిపోయిన కారణంగా ఆమె 41 సంవత్సరాలు, 11 కోర్టులు పట్టుకు తిరగడం భయంకరమైన నేరం. ఉద్యోగి బాధ్యతకు కప్పదాటు. ఉద్యోగాన్ని తు.చ. తప్పకుండా చేస్తే ‘నన్ను ముట్టుకోకు నామాల కాకి’ అని బతకొచ్చు. ఓ చిన్న Gesture ఏ రూలు బుక్కులో ఉండదు. కాని మనిషిని ఎత్తున నిలుపుతుంది. ఆస్తి రసీదు బాధ్యత. దాని మడత మాన వత్వం. - గొల్లపూడి మారుతీరావు -
అవసరం –ఆత్మగౌరవం
యాభై అరవై సంవత్స రాల కిందట– మేం రచనలు ప్రారంభించిన తొలి రోజుల్లో ‘రీడర్స్ డైజెస్ట్’ చాలా ప్రాచుర్యంలో ఉండేది. అందులో చివర ఒక సంక్షిప్త నవల ఉండేది. నిజంగా జరిగిన సంఘటన మీద ఒక నవల వచ్చింది. స్విట్జర్లాండ్‌లో ఒక విమాన ప్రమాదం జరిగింది. బాగా ఎత్తుగా ఉన్న ఆల్ఫ్స్ పర్వతశ్రేణి మధ్య ఆ విమానం కూలిపోయింది. నరమానవులు వెళ్లలేని మంచు శ్రేణులవి. అందులో 22 మంది ఉన్నారు. అందరూ వారిమీద ఆశలు వదులుకున్నారు. కానీ కొద్ది రోజులకు ఆ కూలిన ప్రదేశం నుంచి సంకేతాలు రాసాగాయి. అంతా తుళ్లిపడ్డారు. వెంటనే వారిని రక్షించడానికి పరుగులు తీశారు. తీరా 22 మందిలో 16మంది మరణించగా ఆరుగురు బతికారు. వారి మొదటి సమస్య బయటి ప్రపంచానికి తమ ఉనికిని తెలియజేయడం. మరి ఈ ఆరుగురు 16 రోజులు ఎలా జీవించారు? వారి చుట్టూ 16 శవాలు మంచులో నిక్షేపంగా ఉన్నాయి. ఆ నవల చివరి వాక్యం ఇన్నేళ్లూ నా మనస్సులో తలచుకున్నప్పుడల్లా తుపాకీలాగ పేలుతూనే ఉంది. ‘థాంక్గాడ్! వారి చుట్టూ మంచులో 16 దేహాలు ఉన్నాయి!’ ఇంతే కథ, ఆ కథ వివరాలు ఇప్పుడేమీ గుర్తులేవు. నేను రేడియోలో పనిచేసే రోజుల్లో ఒక జాతీయ రూపక కార్యక్రమంలో ఒక నాటకం ప్రసారం చేసి నట్టు బాగా గుర్తు. ఇక్కడా వివరాలు గుర్తు లేవు. కానీ ఒక బృందం కలిసి ప్రయాణం చేస్తున్నారు. అందరూ సంస్కారవంతులు. విద్యాధికులు, నగర సంస్కృతిలో జీవించేవారు. ప్రాణాంతకమైన ప్రమా దంలో ఎన్నో రోజులు ఇరుక్కున్నారు. కొందరు పోయారు. మిగిలినవారు ఎన్నో రోజులు జీవించాలి. ప్రాథమికమైన ‘బ్రతకాలనే’ ఆర్తి క్రమంగా వారి సంస్కారాన్ని అటకెక్కిస్తుంది. వారు అతి ప్రాథమి కమైన– కేవలం ‘ఉనికి’ కోసం విలువల్ని విస్మరించే స్థితికి వస్తారు. ఇది భయంకరమైన వాస్తవానికి ప్రతి బింబం. ఎన్నో నెలలపాటు కొత్త ప్రాంతాల అన్వేషణకు బయలుదేరిన అలనాటి కొలంబస్, వాస్కోడీగామా వంటి వారి బృందాలు సముద్ర మధ్యంలో ఆహార పదార్థాలు కొరవడగా– తమ నౌకల్లోని ఎలుకలను పట్టి తినడాన్ని మనం చదివాం. ఈ మూడు కథలూ– ఒక అనూహ్యమైన మలు పులో మానవునిలో సంస్కారవంతమైన విలువలు లుప్తమై కేవలం Suటఠిజీఠ్చిl∙లక్ష్యమైపోతుంది అన్న సత్యానికి నిరూపణలు. ఇప్పుడు కేరళలో ఎదురైన విపత్తు అలాంటిది. ఇక్కడ ‘ఆత్మ గౌరవం’ ఆలోచన లకు బహుదూరం. కేరళలో గత 100 సంవత్సరాలలో కనీవినీ ఎరు గని వర్షాలు పడ్డాయి. 32 డ్యామ్‌లు నీటితో ఊపిరి బిగించాయి. 10వేల కిలోమీటర్ల రోడ్లు కొట్టుకుపో యాయి. లక్షలమంది నిర్వాసితులయ్యారు. ఎందరో మరణించారు. ఇప్పుడు వీరి పునరావాసానికి గుంజాటన జరుగుతోంది. ఒక విలేకరి ఒక ఇంటిని చూపి– ఇక్కడ నీరు తగ్గాక– వర్షం తెచ్చిన మట్టి, ఇతర చెత్త నుంచి ఈ ఇంటిని పరిశుభ్రం చేయాలంటే కనీసం 2 నెలలమాట– అన్నారు. ఒక ఉదాహరణ. చెంగల్పట్టు సమీపంలో మామండూరు అనే ఊరిలో– రోడ్డుపక్క ఒక ఫ్యాక్టరీ షెడ్డు ఉంది. పక్కనే ఏరు. ఫ్యాక్టరీ మూతపడింది. ఎన్నో నెలల తర్వాత– కొత్త వ్యాపారి దానిని అద్దెకి తీసుకున్నాడు. శుభ్రం చేయడానికి మనుషుల్ని పుర మాయించాడు. లోపలికి మనుషులు వెళ్లగా రెండు పాములు కనిపించాయి. వాళ్లు బెదిరి పాములు పట్టేవారిని పిలిపించారు. తీరా ఆ షెడ్డులో కేవలం మూడు వేల పాములున్నాయట! కేరళ ఇళ్లలో శవాలే ఉన్నాయో, చెత్తే ఉందో, మరేం ఉందో ఇంకా తెలీదు. ఈలోగా విదేశాల వారు కూడా స్పందించి సహాయానికి నడుం కట్టారు. యునైటెడ్ ఆరబ్ రిపబ్లిక్ 700 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది. కానీ కేంద్రం పరాయి దేశాల సహాయం వద్దంది. ‘మా అవసరాల్ని మేమే తీర్చు కుంటాం. మీ పెద్ద మనస్సుకి జోహార్’ అంటూ విదేశాంగ శాఖ విదేశాలకు సమాధానం ఇచ్చింది. కేరళ ముఖ్యమంత్రి ‘వారినయినా ఇవ్వనివ్వండి, మీరయినా ఇవ్వండి’ అన్నారు. కష్టంలో, సుఖంలో ప్రపంచమంతా చేతులు కలపాలన్న ‘వసుధైక కుటుంబం’ ఆదర్శం పాటించే దేశం– చెయ్యి అందించే పరాయి దేశం సహాయాన్ని ఎందుకు తిరస్కరించాలి? ఆత్మగౌరవం అరుదైన విలువ. కానీ అవసరం ప్రాథమికమైన ఉప్పెన. ఆపదలో ఆదుకునే సహృదయానికి ఆత్మగౌరవం ఆటంకం కాకూడదు. కాగా, సౌజన్యానికి ఎల్లలని నిర్ణయించడం ‘ఆత్మగౌరవానికి’ దక్కవలసిన కితాబు కాదు. ఔదార్యానికి ఆంక్ష పెద్ద మనసు అనిపించుకోదు. మన పెరట్లో మూడువేల పాములున్నాయి. బూరా ఊదే మనిషిని దూరంగా ఉంచకండి. గొల్లపూడి మారుతీరావు -
ఎలా ఓడిపోయారు.. ఓడిపోయాను అంతే!!
అటల్ బిహారీ వాజ్‌పేయి కన్నుమూసిన రోజు ఒకానొక ఇంగ్లిష్ టీవీ చానల్ ‘నివాళి’ని ప్రసారం చేసింది. వివరాలు గుర్తు లేవు. అవసరం లేదు. వాజ్ పేయి 2004 సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయారు. ఆయన పాత్రికేయులతో మాట్లాడుతుండగా ఒక కార్యకర్త ఫోన్ పట్టుకుని పరుగున వచ్చాడు– ఫోన్లో పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్. అందరూ బయటికి నడిచారు. కాసేపయ్యాక ఈ పాత్రికే యుడు– వినోద్ శర్మ లోనికి వచ్చారు. ‘ఎలా ఓడి పోయారు? ఏమయింది?’ అని ముషార్రఫ్ పరామ ర్శించారట. వాజ్‌పేయి నవ్వి ‘ఓడిపోయాను. అంతే’ అన్నారట. ఇదీ సంఘటన. ఒక ఎదురుదెబ్బకి నవ్వుకునే, తలవంచి అంగీ కరించే సామర్థ్యం (సెన్సాఫ్ హ్యూమర్) వాజ్‌పేయి సొత్తు. ఇది రాజకీయ నాయకుడి ‘పదును’ కాదు. ఒక కళాకారుడి చరిత్రలో ఎన్నో రంగాలకు చెందిన ఎందరో కళాకారులు రాజకీయ ప్రవేశం చేశారు. ప్రస్తుతం మనసులో కదిలే పేరు– పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఎల్లప్పుడూ మనస్సులో కదిలే ఉదాహరణ– అన్నగారు– ఎన్టీఆర్. ఆయన నేషనల్ ఫ్రంట్ అధ్య క్షులుగా ఉన్న రోజుల్లో– నాచారం స్టూడియోలో మేనక, విశ్వామిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు వీపీ సింగ్ వంటి ఎందరో జాతీయ నాయకులు– గెడ్డంతో మీనాక్షి శేషాద్రితో నటించే తమ నాయ కుడిని నోళ్లు తెరిచి చూస్తూ కూర్చోవడం నాకు గుర్తుంది. అప్పుడు నేనక్కడ ఉన్నాను. అస్మదాదు లకు ఆ దృశ్యం కొత్త కాదు. కానీ ఈ ప్రేక్షక సము దాయానికి కొత్త.చాలా ఏళ్ల కిందట– మద్రాసు సెంట్రల్ పక్క నున్న మైదానంలో ప్రపంచ ప్రఖ్యాత వస్తాదు మహమ్మదాలీ విన్యాసాల ప్రదర్శన జరిగింది. ఆనాడు నేనక్కడ ఉన్నాను. ఆనాటి ముఖ్యమంత్రి ఎమ్జీఆర్ ముఖ్య అతిథి. ఆయన మహమ్మదాలీ ఉన్న ‘రింగు’లోకి వచ్చారు. ఒకే ఒక్కసారి రెండు పిడికిళ్లు ఆయనతో కలిపారు. అంతే, ప్రేక్షకులు విర్రవీగి పోయారు. వారిలో కొందరికి అలీ ఎవరో తెలియక పోవచ్చు. కానీ అందరికీ ఎమ్జీఆర్ తెలుసు. మరి రొనాల్డ్ రీగన్ అనే నటుడు అమెరికా అధ్యక్షుడయ్యారు. ఆర్నాల్డ్ స్వీడ్జిగర్ కాలిఫోర్నియా గవర్నరయ్యారు. మొన్ననే కన్నుమూసిన కరుణానిధి తమిళ సినీ రంగంలో చరిత్రను సృష్టించిన రచయిత. అన్నాదురై రచయిత. జయలలిత నటీమణి. మరి ఇమ్రాన్‌ఖాన్ ఆ పదవిలో ఏం చేస్తారు? అయిదు బంతులతో ప్రత్యర్థిని ఏమార్చి– ఆరో బంతితో వికెట్‌ని కైవసం చేసుకోవడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అయిదుసార్లు వికెట్‌కి దూరంగా పరిగెత్తే బంతుల్ని ప్రయోగించి ఒక్క బంతిని ఇన్స్వింగర్గానో, యార్కర్గానో ప్రయోగించే కుశా గ్రత క్రీడాకారుడి చాకచక్యం. ముందు ముందు ఎన్ని బంతులు– మనల్ని ఏమారుస్తాయో చూడాలి. వాజ్‌పేయి తన రాజకీయ జీవితమంతా కవి తని సాధనంగా, ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి పరికరంగా పార్లమెంటులోనూ, బయటా వాడుతూ వచ్చారు. ఆయన ప్రసంగాలలో ‘కవి’ ఎప్పుడూ ప్రధాన పాత్రని పోషించేవాడు. సందర్భం కాకపోయినా ఓ గొప్ప కళాకారుడైన రాజకీయ నాయకునితో అనుభవాన్ని ఉటంకించాలి. 1990 ప్రాంతాలలో అనుకుంటాను– అమెరికా వెళ్లాం. నేనూ, జేవీ సోమయాజులు మరి ఒకరిద్దరు మిత్రులూ ఐక్యరాజ్యసమితిని చూడటానికి వెళ్లాం. అప్పట్లో ప్రధాని పీవీ నరసింహారావు భారతదేశ ప్రతినిధిగా ప్రతిపక్ష నాయకులు వాజ్‌పేయిని పంపారు. భారతదేశ విభాగంలో ఆనాడు వాజ్‌పేయి ఒక్కరే కూర్చుని ఉన్నారు. వెళ్లి నమస్కరించాం. ముందురోజు తెలుగువారికి ప్రదర్శన ఇచ్చామని విన్నవించాం. వెంటనే ఆయన స్పందన ‘అలాగా! తెలిస్తే నేనూ వచ్చేవాడినే!’ ఆయన మూర్తీభవించిన సంస్కారం. భారతీయ విభాగం ముందు వారితో ఫొటోలు తీయించుకున్నాం. దురదృష్టం. నా దగ్గ రున్న వేలాది ఫొటోలలో అదొక్కటే కనిపించలేదు.రాజకీయ నాయకుడికి ‘కళ’ ఒక దన్ను. వారి విధానాలకు కొత్త దిశనీ, రుచినీ సమకూరుస్తాయి. వాజ్‌పేయి వస్తుతః కవి. దాదాపు పదమూడు సంవత్సరాల కిందటే రాజకీయ సన్యాసం చేసిన ఆ కవి అంతఃచేతన మౌనంగా ఇన్నేళ్లూ మనస్సులోనే ఎన్ని కవితలల్లిందో, వేళ్లు ఎన్ని కవితల్ని మౌనంగా మనస్సులో రచించాయో తెలియదు. ‘కళ’లో జీవలక్షణం ఉంటుంది. అందుకనే మరో పదేళ్లు ఆ నిశ్శబ్ద పథికుని మౌన చేతన– ఆయనకు ప్రాణం పోసింది. గొల్లపూడి మారుతీరావు -
గవర్నమెంటు అల్లుళ్లు
ఆ మధ్య మా అబ్బాయి ఒకానొక బ్యాంకుకి ‘అప్పు’కి దరఖాస్తు పెట్టు కున్నాడు. ఏకంగా ఆరు గురు అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి ఇంటికి వచ్చారు. ఎవరీ ఆరుగురు? బ్యాంకు మేనేజరు, అకౌం టెంట్, క్రెడిట్ మేనేజరు, రీజనల్ మేనేజర్, అసలు ఈ అప్పు తీసుకోవడానికి ఇతనికి అర్హత ఉన్నదో లేదో నిర్ణయించే ఉద్యోగి (అదేమిటి? ఈ నలుగురూ నిర్ణయించరా)– వీరంతా కాక– చర్చల్లో పాల్గొనకుండా– కాస్త దూరంగా కూర్చున్న మరొక ఉద్యోగి. ఈయనెవరు? మా అబ్బాయి చెప్తున్న సమాధానాలను బట్టి, వారి ప్రశ్నలకు మా అబ్బాయి స్పందనను బట్టి – ఇతను ‘అప్పు తీసుకోవడానికి నిజమైన యోగ్యుడా కాడా అని ‘బాడీ లాంగ్వేజ్’ని కనిపెట్టే ఓ ఉద్యోగి. చాలా ముచ్చటైన, ఏ లోపమూలేని బృందమిది. నాకు ఆ క్షణంలో రెండే రెండు పేర్లు గుర్తుకు వచ్చాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ. మాల్యా బ్యాంకుల నుంచి కేవలం 9,000 కోట్లు మాత్రమే అప్పు చేశాడు. మరి ఆయన చుట్టూ ఇలాంటి నిఘా వర్గం పనిచెయ్యదా? చెయ్యదు బాబూ చెయ్యదు. మాల్యా గారిని పలకరించే దమ్ము ఏ బ్యాంకు మేనే జర్కి ఉంటుంది? ఏ రాత్రో, పనివేళో ఢిల్లీలో పే...ద్ద వర్గాల నుంచి – బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు గారి ఫోన్ మోగుతుంది. రాత్రిళ్లు సీసాలు చప్పుడవు తాయి, కొండొకచో గాజుల చప్పుళ్లూ అవుతాయి. కోట్ల రూపాయలు అడ్రసు మార్చుకుంటాయి. తర్వాత– ఆ గొంతు ఎవరిదో ఈ ఎమ్డీ గారు చచ్చినా ఎవరిముందూ చెప్పలేరు. చెప్పరు. సరే. మాల్యాగారు ఓ మంచి రోజు ఇంగ్లండులో ప్రత్యక్షమయ్యారు. వారిని మన దేశం తీసుకు రావ డానికి కేసు అక్కడ జరుగుతోంది. కేసు ఓ దారికి వచ్చింది. ఏతావాతా, ఇంగ్లండు జడ్జిగారు మాల్యా గారు ఇండియా వెళ్లాల్సిందే అంటే? ఇప్పుడు వ్యవ హారం జపం విడిచి లొట్టల్లో పడింది. ‘తీరా వెళ్లవలసి వస్తే నేను వెళ్తాను. కానీ నన్ను అరెస్టు చేసి ఉంచే ముంబై ఆర్దర్ జైల్లో ఏ గదిలోనూ సరైన సూర్యరశ్మి రాద’ని మాల్యాగారు వాపోయారు. జడ్జిగారికీ ఈ మాట నచ్చింది. నేరస్తులు ఉండే జైలు గదుల్లో చక్కగా సూర్యరశ్మి అయినా ఉండకపోతే ఎలాగ? అక్కడ మన తరఫున వాదించే లాయరు గారిని అడిగారు. ‘అయ్యో, ఆర్దర్ జైలు నిండా బోలెడంత వెలుగు ఉన్నదండీ’ అన్నారాయన. ఆ ‘వెలుగు’ సూర్యరశ్మి కాదని పట్టుబట్టారు మాల్యాగారి లాయర్లు. అక్కడికీ గవర్నమెంటు తరఫు లాయరు గారు చాలా హామీలు ఇచ్చారు. ‘అయ్యా, మాల్యా గారికి మంచి దుప్పట్లు, పరుపులు, తలగడలు, రంగుల రంగుల గలీబులూ ఏర్పాట్లు చేస్తామండీ. వారికి ఏ లోపమూ రానివ్వం’ అని మొర పెట్టుకు న్నారు. ఇదంతా మన దేశంలో ప్రజల సొమ్ముని దోచుకున్న ఓ నేరస్తుడికిచ్చే సుఖాలు. ఇంగ్లండు కోర్టు తప్పనిసరిగా ఏర్పాటు చెయ్యాలని నిర్దేశించే ‘లొట్టలు’. ఆర్దర్ జైలు ఫొటోలు జడ్జిగారికి తృప్తినివ్వలేదు. జైలు అంతా స్టీలు బోనులాగా కనిపిస్తోందని జడ్జి గారు బాధపడ్డారు. 12 బారక్స్‌లో కేవలం ఆరుగురు పెద్ద మనుషులు (నేరస్తులు) మాత్రం ఉండే ఏర్పాటు ఉన్నదనీ, ఇక్కడ ఎక్కువ మందిని ఉంచే అవకాశం లేదని మన లాయరు గారు– నేరస్తుడి జైలు సౌకర్యాల గురించి కోర్టుకి విన్నవించుకున్నారు. అయినా జడ్జిగారికి నమ్మకం కుదరలేదు. మాల్యా గారికి ఈ జైలు నచ్చలేదు. ఈ బారక్స్‌లో ఎక్కడ కిటికీలు ఉన్నాయి? రోజులో ఏయే సమయాల్లో ఎంతెంత సూర్యరశ్మి వస్తుంది? ఆర్దర్ జైలు వీడియో తీసి మూడు వారాల్లోగా పట్టుకురండి– అని ఆదేశిం చారు జడ్జిగారు. అలాగే మాల్యాగారి అవసరాలకు సరిపోయే నీటి సౌకర్యం, మరుగుదొడ్డి సౌకర్యం ఉన్నదా? ఇవన్నీ తెలియాలి– అన్నారు. మన జైళ్లలో– నిజంగా నేరం చెయ్యనివారూ, చేశారో లేదో నిర్ధారణ కాని వారిని కూరేస్తున్నారని మనం వింటుంటాం. కానీ అలాంటి అసౌకర్యం 9 వేల కోట్లు స్వాహా చేసిన మాల్యా గారికి కానీ, నీరవ్ మోదీ గారికి కానీ ఉండదు. వారి సౌకర్యాలను– వారు పారిపోయి తలదాచుకున్న దేశాల న్యాయస్థా నాలే సాధికారికంగా ఏర్పాటయేటట్టు చూస్తాయి. ఏతావాతా, ఈ దేశంలో బ్యాంకు మర్యాదలు– నువ్వు వెయ్యి రూపాయలు అప్పు చేసి తీర్చలేక పోతే జైలుకి వెళ్తావు. 10 వేల కోట్లు అప్పు చేసి తీర్చలేకపోతే లండన్‌లో ప్రత్యక్షమవుతావు. పెళ్లికొడుకులాగా అప్పుడప్పుడూ టీవీల్లో కనిపిస్తున్నా– నిన్ను గవ ర్నమెంటు, బ్యాంకులేమీ చెయ్యలేవు. నువ్వు 9 వేల కోట్లు అప్పు చేసి పరారీ అయితే– జైలు గదిలో సూర్యరశ్మి ఉండాలా, పావురాలు ఎగ రాలా? చిలకలు పలకరించాలా? గళ్ల దుప్పట్లు, ముఖమల్ పరుపులు ఉండాలా– నువ్వే నిర్ణయి స్తావు. ఇండియా అధికారులు చచ్చినట్టు అన్నీ ఏర్పాటు చేస్తారు. ఇంతకీ 9 వేల కోట్లు? ఎవడడిగాడు? వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
పార్లమెంటులో ధనుష్కోటి
ఈ మధ్య పార్లమెంటులో జరిగిన అవిశ్వాస తీర్మాన ఘట్టం చాలా కారణాలకు మనదేశంలో చరిత్ర. ఈ రాజకీయ విశ్లేషకులు ఎంతసేపూ పక్కదారుల్లో పోతారు కానీ అసలు విషయాన్ని వదిలేస్తారు. మొదట విషయాలు మొదట చెప్పుకుందాం. రాహుల్ గాంధీ పార్లమెంటులో కన్ను కొట్టారు. నా మట్టుకు ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆ పని చేస్తున్నప్పుడు ఆయన ముఖంలో అంత తేజస్సును నేను చూడలేదు. బహుశా ఆయన కన్నుకొట్టినప్పుడు వారి ప్రత్యేకమైన సౌందర్యం బయట పడుతుందేమో విశ్లేషకులు పరిశీలించాలి. మహానుభావులు ఏ వివేకానందో, మహాత్ముని వంటివారో దేశానికి సందేశం ఇస్తున్నప్పుడు వారి ముఖాలు తేజస్సుతో వెలిగిపోవడం మనం చూస్తాం. కానీ రాహుల్ గాంధీగారిలో కుర్రతనం ఇంకా పోలేదనడానికి ఇది నిదర్శనం. తీరా అనుకున్న నాటకం ఇప్పటికి రసకందాయంలో పడింది అనడం ఈ కన్ను కొట్టాడానికి నిదర్శనమా? త్యాగరాజస్వామి ఒక కీర్తనలో ‘కోటినదులు ధనుష్కోటిలో నుండగ ఏటికి తిరిగెదవే మనసా’అని ప్రశ్నించారు. ఈ దేశంలో గంగ, యమున, కావేరి, గోదావరి – ఇలా వేర్వేరు నదులలో స్నానం అక్కరలేదు. కోటి నదుల సంగమం – ధనుష్కోటి– అన్నారు. రాహుల్ గాంధీ.. ఆ మధ్య ప్రధాని మోదీ ప్రపంచంలో అందరు నాయకుల్ని కావలించుకోవడం మీద విమర్శ చేశారు. మోదీగారి పని అనుచితంగా ఉన్నదంటూనే– తానూ అలాంటి పని చేయాలనే కోరిక వారి మనస్సులో ఉన్నదేమో. మరి పార్లమెంటులో ప్రధాని ధనుష్కోటి లాంటివారు. ఒక్కసారి వారిని కావలించుకుంటే అందరినీ కావలించుకున్నంత ఫలితం. దీనిని మర్యాద భంగంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ గారు భావించరాదని నా ఉద్దేశం. నిజానికి ఇలాగే పార్లమెంటులో చాలామంది నాయకులకు మోదీగారి విషయంలో రకరకాల తీరని కోరికలుండవచ్చు. వాటిని బయటపెట్టడం ఎలాగో తెలీక మదనపడుతూ ఉండవచ్చు. ఉదాహరణకి శరద్ యాదవ్‌కి మోదీ గెడ్డం గోకాలనిపించవచ్చు. లాలూకి మోదీ కడుపులో పొడిచి పలుకరించాలని కోరిక ఉండవచ్చు. ఢిగ్గీ రాజాకి మోదీ బుగ్గలు పుణకాలని, గురుమీత్ సింగ్ అహుజాకి వీపుమీద తట్టాలని, శివప్రసాద్‌కి వారి జుత్తు సవరించాలని ఇలా వీరికి మార్గదర్శకమైన ఘనత రాహుల్ గాంధీది. ఈ చర్యని పురస్కరించుకుని మిగతా నాయకులకి కూడా అవకాశాన్ని కల్పించాలని నాకనిపిస్తుంది. పార్లమెంటు సమావేశానికి ముందు మోదీని హాలు మధ్యలో నిలిపి ఆయా నాయకుల కోరికలు సాధికారికంగా జరిపిం చాలని స్పీకర్‌గారికి నా వినతి. మొన్న రాహుల్ గాంధీ తన ఔదార్యం చూపారు. ‘‘మీరు నన్ను పప్పు అని పిలవండి. కోపం తెచ్చుకోండి. తిట్టండి. కొట్టండి. మీమీద నాకు కోపం లేదు. రాదు’’ అంటూనే సరాసరి మోదీ సీటు దగ్గరికి చరచరా నడిచి వచ్చారు. పార్లమెంటులో ఎవరికీ ఈ చర్యకి కారణమేమిటో అర్థం కాలేదు. నా మట్టుకు ఈ మధ్యకాలంలో అంత మనస్ఫూర్తిగా కావలించుకున్న సందర్భాన్ని చూడలేదు. అయితే ఇందులో ఏ పాత్రికేయుడూ గుర్తించని ఒక సంఘటన ఉంది. తీరా ఎవరూ ఊహించని రీతిలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీని వాటేసుకున్నాక, మోదీ కూడా చూస్తున్న మనందరిలాగే ఒక్క క్షణం బిత్తరపోయినా వెంటనే తేరుకుని, వెళ్లిపోతున్న రాహుల్ గాంధీని వెనక్కి పిలిచారు. రాహుల్ వెళ్లగానే మోదీ తన భుజం తట్టారు. ఆ చిన్న వ్యవధిలో మోదీ చెప్పిన మాటలు ఏమై ఉంటాయి? ఇదీ విశ్లేషకులు పట్టుకోవలసిన అంశం. నా అనుభవాన్ని పురస్కరించుకుని నాలుగయిదు ఊహాగానాలు చేస్తున్నాను. ‘‘వెకిలి వేషాలు వద్దు పప్పూ.. దేశం చూస్తోంది.’’ ‘‘శభాష్! రాజకీయాల్లో మీ అమ్మనీ, నాన్ననీ, మామ్మనీ మరిపించావయ్యా’’ ‘‘ఈ చర్చ మాటల సభ. డ్రామా స్టేజీ కాదు బాబు’’ ‘‘పార్లమెంటుని పది జనపత్ స్థాయికి ఈడ్వకు బాబు, నేను కాంగ్రెస్ చెక్కభజనకారుడిని కాదు’’ ఇలాంటి మాటేదో అని ఉంటారని నా ఉద్దేశం. పార్లమెంటుని పక్కింటి పున్నయ్యతోనో, వెనకింటి వెంకయ్యతోనో ’రచ్చబండ పిచ్చాపాటీ’ చేయబోయిన కన్నుకొట్టే ’చంటివాడికి’ అంత తక్కువ వ్యవధిలో అనుకోకుండా భుజం తట్టి పాఠం చెప్పడం అనూహ్యమైన విషయం. అపభ్రంశానికి సమయస్ఫూర్తి సరైన ఠంకం. నాటకానికి వాస్తవం ఎప్పుడూ చుక్కెదురు. - గొల్లపూడి మారుతీరావు -
ఆ రోజుల్లో ఈ లా కమిషన్ ఉండి ఉంటే...
ఈ దేశంలో జూదాన్ని సాధికారికం చెయ్యడానికి లా కమిషన్ కావలసినన్ని సరదా అయిన సూచనలి చ్చింది. ఓ ఆంగ్ల దిన పత్రిక ఆ వ్యవహారాన్ని పతాక శీర్షికగా ప్రకటించింది. లా కమిషన్ అధ్యక్షులు– మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీఎస్ చౌహాన్, మిగతా సభ్యులు జూదాన్ని దేశంలో అందరికీ అందుబా టులో ఉండేలాగ పురాణాలు, న్యాయ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, నీతి శాస్త్రం, మౌలిక రచన అన్నిటినీ కలిపి– లకోటా కొట్టేసి–ఒక గొప్ప కషాయాన్ని సిద్ధం చేశారు. ఆ రోజుల్లో ఈ లా కమిషన్ ఉండి ఉంటే– కురుక్షేత్ర సంగ్రామానికి సరికొత్త ప్రయోజనం ఉండేది. ఈ విషయమై ఈ పత్రికే ఎడిటోరియల్ కూడా రాసింది. ధర్మరాజు అసలు తమ్ముళ్లను తాకట్టు పెట్టడమేమిటి? మహారాణిని జూదంలో ఫణంగా పెట్టడమేమిటి? దీనికి సమాధానం ఓ చదువుకున్న పాఠకుడు ఉత్తరం ద్వారా ఈ పత్రికలోనే తెలియజే శాడు. జూదానికీ డబ్బున్నవారి సరదాలకీ దగ్గర తోవ ఉన్నదని ఈ ఉత్తరం సారాంశం. చక్రవర్తులు కనుక– బాగా హోదా, ఐశ్వర్యం ఉన్నది కనుక– ఓ హద్దు దాటారు. మహారాణిని జూదంలో తాకట్టు పెట్టిన కారణంగానే వ్యాసుడు ‘మహాభారతాన్ని’ రచించి ఉంటాడు. ఆ స్థానంలో పనిచేసే గేట్ కీపర్ తన మర దలిని ఈ పని చేస్తే– ‘మహాభారతం’ మాట దేవు డెరుగు– దండనకి గురి అయ్యేవాడేమో? కనుక 2018లో ఈ కమిషన్ ఓ గొప్ప సూచన చేసింది. వారి సూచనల సారాంశం. మనకి మహారా ణుల్ని జూదంలో ఫణంగా పెట్టే సంప్రదాయం ఉన్న కథలున్నాయి. పురాణాలున్నాయి. కనుక జూదాన్ని చిన్నచూపు చూడటం మంచిది కాదు. ఏ ఎండకా గొడుగులాగ, ఏ స్థాయి వాడికి ఆ స్థాయిలో అందు బాటులో ఉన్న జూదాన్ని సాధికారికం చెయ్యాలి. ముఖ్యంగా జూదం ఆడే వ్యక్తి పాన్‌కార్డు, ఆధార్ కార్డు నంబర్లు గ్రహించండి. అది క్రికెట్ అయినా (ముఖ్యంగా క్రికెట్ కారణంగా నల్ల జేబుల్లోకి మాయమవుతున్న కోట్ల ఆదాయాన్ని ఖజానా మార్గం పట్టించాలని), గుర్రాలైనా, కోడి పందాలైనా, మరే జూదమైనా– వారి స్థాయికి తగ్గట్టు వారు ఆడు కోవచ్చును. ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ‘లాట రీ’లు నడిపిన సందర్భాలు మరిచిపోకూడదు. కొన్ని నేరాల్ని బొత్తిగా రూపుమాప లేనప్పుడు– వాటిని అదుపులో ఉంచే ప్రత్యామ్నాయం ఆలోచించాలి. మనకి యుధిష్టిరులు, ద్రౌపదులు ఉండే రోజులు పోయాయి. విజయ్ మాల్యాలు, నీరవ్ మోదీలు నిల దొక్కుకునే రోజులు వచ్చాయి. సజావైన మార్గ నిర్దేశం జరిగినప్పుడు– అవి నీతి– మన చెప్పు చేతల్లో ఉండగల ‘నీతి’గా మారు తుంది. ఇంతకూ జూదానికి మనకి మార్గదర్శకం ఎవరు? ధర్మరాజు. మహాభారతం. మహాభారతం రకరకాల కారణాలకి గొప్పదని మన పండితులు చెప్పగా మనం విన్నాం. చదువుకు న్నాం. కానీ 2018లో మహా భారతంలో ‘జూదం’ చట్టానికి కొంగు బంగారం అవుతుందని మనం ఏనాడూ ఊహించలేదు. మహాభారత కథలపై ఎన్నో సినీమాలు వచ్చాయి, నవలలు వచ్చాయి, నాటకాలు వచ్చాయి– కానీ ఆనాటి ప్రభుత్వం ‘జూదా’న్ని చట్ట పరం చేయడం కారణంగా ఓ మహత్తరమైన రచనకు మూలకారణం అయిందని మనం ఏనాడూ ఆలోచిం చలేకపోయాం. నాదొక పిచ్చి ఆలోచన. శ్రీకృష్ణుడికి ఇలాంటి జూదం పిచ్చి లేదా? ఉంటే ఆయనకి 8 మంది భార్యలు. 8 రకాలైన మహాభారతాలు వచ్చేవి. లేదా తమ రాజ్యంలో జూదం చట్టబద్ధం కాదేమో? ఎంత సేపూ– సుఖంగా పెళ్లాలతో గడుపుతూ ఓడిపోయిన వారికి చీరెలు ఇచ్చే పనితో సరిపెట్టుకున్నారు. నేను లా కమిషన్ ధోరణిలో ఆలోచిస్తున్నానని తమరు గ్రహించాలి. మహాభారతానికి కథా నాయకత్వం వహించలేని శ్రీకృష్ణుడి కథని మనం హెచ్చరికగా గ్రహించాలి. తప్పించడానికి వీలులేని జూదానికి సరసమైన ఉదాహరణగా ‘మహాభారతాన్ని’ ఉదహరించగల లా కమిషన్ని, దాని అధ్యక్షులు చౌహాన్ గారిని నేను మనసారా అభినందిస్తున్నాను. అయితే మహా భారతానికి ‘జూదా’న్ని ప్రోత్సహించే ప్రయోజనం ఉన్నదని ఇన్ని వేల సంవత్సరాలు గుర్తించని పండి తులకు శిక్ష వెయ్యాలని నేను లా కమిషన్‌ను అర్థిస్తున్నాను. ముందు పండిత సభల్ని ఏర్పాటు చేసి– జూదం మీద శతకాలు రాయించండి. ప్రబం ధాలు పలికించండి. సాహిత్యానికి సాహిత్యమే విరుగుడు. శతాబ్దాలపాటు ఈ జాతిని ప్రభావితం చేసిన మహా భారతం ఇన్నాళ్లకి జూదానికి మార్గదర్శకం కావడం మన న్యాయమూర్తులు మనకి పెట్టిన భిక్ష. గొల్లపూడి మారుతీరావు -
నూరేళ్ల జీవితం
జీవితంలో తమ గొప్పత నానికి అందమైన ముసుగు కప్పుకున్న అపూర్వమైన నటులు– తెలుగు సినీ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు కనిపిస్తారు– శ్రీమతి పి. భానుమతి, ఎస్వీ రంగా రావు. ఎందుకు ఫోకస్. తమ గొప్పతనం తమకి తెలుసు. కానీ ఆ ‘గొప్పతనా నికి’ ‘అందమైన’ ఫ్రేమ్‌ని అలంకరించడంలో ఎన్నడూ వీగిపోని నటులు వీరిద్దరూ. వ్యక్తులుగా ఇద్దరూ నాకు తెలుసు. గొప్పగా కాదు. వారి వ్యక్తిత్వా లను పారదర్శకంగా అర్థం చేసుకునే పాటి. భానుమ తిగారితో కలిసి నటించాను. నిజానికి నా జీవితంలో నేను చూసిన తొలి నటీమణి భానుమతిగారే. ఎస్వీతో అంత పరిచయం లేదు. కానీ నేను రాసిన సినీమాల్లో నటించారు. అవేం గొప్ప పాత్రలు కావు. తెలుగు సినీ చరిత్రలోనే ‘బంగారు పాప’ లాగ చిర స్మరణీయం కావలసిన సందర్భం నా కలం నుంచి వచ్చినప్పటికే వేళ మించిపోయింది ఆయనకి. దశాబ్దాల కిందట– నేను విజయవాడలో పని చేసే తొలి రోజుల్లో– ఎందుకనో ఒక్క రోజు– ఒకే ఒక్క రోజు– పూర్తిగా ఆయనతో గడిపే అవకాశం కలసి వచ్చింది. బందరులో సభ. నా ప్రసంగం. ఆ సంబంధమే ఈ మాటలు చెప్పడానికి అర్హతని ఇచ్చాయి. రంగారావుగారు చాలా పెద్ద మనిషి. కానీ దూకుడు– ఎక్కువసార్లు తెచ్చిపెట్టుకున్నది. ఇక విచిత్రం ఏమిటంటే– కాళ్లకి పసుపూ, పారాణీ రాసుకుని పూజలూ, వ్రతాలూ చేసే సంప్ర దాయపరమైన తెలుగు ఇల్లాలు భానుమతి. చక్కని స్కాచ్‌ని సేవించే మహానటుడు రంగారావు. ఏనాడూ ఘటోత్కచుడు, కీచకుడు వంటి పాత్రల పరిధుల్ని అప భ్రంశం చెయ్యకపోగా ఒక్క చెయ్యి విసురులో శతా బ్దాలు దాటి వచ్చేసే పాత్రల్ని వాటి పరిధిలోనే నిలిపి నటించి, విదేశాల్లో కూడా బహుమతులు పుచ్చుకున్న గొప్ప నటుడు రంగారావు. ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ గొప్పది. పరిధుల్ని మరిచిపోకుండా పసుపు రాసుకునే తెలుగు ఇల్లాలు వెండి తెర మీద 1956 నాటి డొరిస్ డే పాట "Que Sera Sera'ను ఇంగ్లీషులోనే నటించిన సాహసి. ఇప్పటికీ టీ.నగర్లో భానుమతిగారింట్లో– పూజగదిలో దేవుళ్ల పటాలకు ఆమె పేరు పేరునా బొట్లు పెట్టిన గదిని కొడుకు (అమెరికా నుంచి వచ్చిన డాక్టరు) అలాగే చూసుకుంటున్నాడు– భక్తిగా. ఎక్కడ ఘటోత్కచుడు? ఎక్కడ జగత్ జంత్రీలు, జగత్ కిలాడీలు పాత్రలు? మరి ఇద్దరినీ ఒకచోట దాచడమెందుకు? వారి అనుపమానమైన ‘ప్రతిభ’కి ‘పొగరు’కి అతి సముచితమైన ముసుగు కనుక. సంవత్సరాలు గడిచి– నేను మద్రాసులో ఆయ నింటికి చాలా దగ్గరలో సినీ రచయితగా జీవిస్తున్న సందర్భంలో మరొక్కసారి వారిని హబీబుల్లా రోడ్డులో వారి ఇంట్లో కలిశాను– ఒక కథ చెప్పడానికి. (కథకి సంబంధించిన ఏ వివరాలూ చెప్పను. జరగ లేదు కనుక). కథంతా సావధానంగా విన్నారు. నా రెండు చేతులూ పట్టుకుని ‘రాయండి మారుతీరావు గారు– ఇది నాకు మరొక ‘బంగారు పాప’ అవు తుంది’ అన్నారు. అప్పటికే ఆరోగ్యమూ, నటనమీద పట్టూ జారుతున్న రోజులు. ఆ రోజంతా మా నిర్మాత ‘భంగ్రా’ డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. సినీమాలో శ్రీరామాలయంలో ఓ భక్తుడి పాత్ర. షూటింగ్ బాజా భజంత్రీలతో చేశారు నిర్మాత. అంతే. కొద్ది రోజులకి ఎస్వీ కన్నుమూశారు. ఎక్కడో ఉన్న నేను వార్త విని గతుక్కుమన్నాను. నిర్మాతా, నేనూ, దర్శకుడూ– ఆ పాట రీలు తెప్పించుకుని చాలాసార్లు చూశాం. ఎన్నిసార్లు చూసినా, ఎటు చూసినా రంగారావుగారి విగ్రహాన్ని ఎవరు దాచ గలరు? అందరికీ గుండెలు జారిపోయాయి. ఆ తర్వాత జరిగింది– సినీమా కథ కాదు. సినీమా నెగిటివ్ కథ. ఎస్వీ రంగారావుగారి హఠాన్మరణం తెలుగు సినీ రంగానికీ, నటనకీ, వ్యక్తిగతంగా నాకూ– వెరసీ– నిర్మాతకీ జరిగిన నష్టం. కొందరి శరీరాలు పడి ఉంటాయి. కానీ ఆయన తల్చుకుంటే– శరీ రంలో ప్రతీ భాగం నటించేటట్టు చెయ్యగలడు. మరోసారి రాస్తున్నందుకు క్షమించాలి. ఎన్నో విలక్షణమైన పాత్రల్ని నటించిన భానుమతి అర మోడ్పు కన్నులతో కెమెరాకు నమస్కారం పెట్టినా– చక్కని విదేశీ ద్రవ్యాన్ని ఆరగించే ఘటోత్కచుడు– ఒక్కచేతి విసురుతో పాత్రని శతాబ్దాల ఇవతలకి విసి రేసినా ఏం జరుగుతుందని? కానీ అది కలలో కూడా జరగదు. కారణం వారి ద్దరూ అహంకారులు. సోమర్సెట్ మామ్ ఒక చోట అంటాడు: "Hypocrasy is a full time job' అని. వీరిద్దరూ చాలా ‘జాగ్రత్తపరులైన’ అహంకారులు. వారి స్వభావం ఏనాడైనా చెల్లేదే కానీ, చెల్లని ‘వదరు బోతుతనం’ కాదు. కనుకనే వందేళ్లలో ఒకే ఒక్క ఎస్వీ రంగారావు. ముక్కుమీద గుద్ది చెప్పాలంటే– ఒక్కరే భానుమతి. ఈ కాలమ్‌ని వారిద్దరూ పంచు కున్నా– వెండితెరమీద ఎవరి ఫ్రేమ్‌లు వారివే! రాజీ లేదు. ఇది నూరేళ్ల చరిత్ర. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
ఒక మహా యజ్ఞం
♦ జీవన కాలమ్ ఇదేమిటి! ఓ చిన్న ఆటకి ఇంత పెద్ద పేరు వాడుతున్నాడేమిటి ఈ పిచ్చి రచయిత అని చాలామంది ముక్కుమీద వేలు వేసుకోవచ్చు. చెప్పడానికి నాకు నిడివి చాలదు. కొన్నే సరదాగా చెప్తాను. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులలోనూ ఫుట్‌బాల్ మీద రాయకూడదని నాకు నేనే శపథం చేసుకున్నాను. ఎందుకంటే అది మహా కావ్యం. ఎక్కడ మొదలెట్టాలో తెలీదు. ఎందుకో తెలీదు. ఎలాగో తెలీదు. ఒక పద్ధతీ, ఒక లాజిక్, ఒక ఎమోషన్‌కి లొంగే ఆటకాదు– ఈ దుర్మార్గమైన ఆకర్షణ. చాలా సంవత్సరాల కిందట నేనూ, మా రెండో అబ్బాయి, మా ఆవిడా ఇటలీ వెళ్లాం. నేపుల్స్ చూపే డ్రైవర్ని– ఉన్నట్టుండి– మా ఆవిడ అడిగింది. ‘‘నేపుల్స్ చూశాక చచ్చిపోయినా ఫరవాలేదు అంటారు కదా? ఎందుకని?’’ అని. డ్రైవర్ నవ్వాడు. కారు ఒకే ఒక్క తిప్పు తిప్పాడు– అంతే. మా గుండెలు ఆగిపోయాయి. ఆ సముద్ర సౌందర్యం, ఆ దృశ్యం వర్ణనాతీతం. కాదు. అక్కడ ఆగలేదు. వెనక్కి తిరిగి– ఎదురుగా ఉన్న ఓ బంగళాకి విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే పెట్టినట్టు నమస్కారం చేశాడు. ఏమిటన్నాను? ఇటలీవారి గొంతులు పెద్దవి, శరీరం పెద్దది, గుండెకాయ పెద్దది. దైవభక్తి పెద్దది. అన్నిటికీ మించి సౌందర్యం ‘పెద్దది’. బంగళాని చూపుతూ ‘మారడోనా!’ అన్నాడు. అది మారడోనా నివాసమట. అంతే అర్థమయింది. వివరాలు చెప్పకుండా ఒక జోక్ చెప్తాను. మరికొన్ని సంవత్సరాలకి పోప్ కావలసిన ఒక మత గురువు జోర్గే మారియో బెర్గోగ్లి అన్నాడు : ‘‘మారడోనా, మెస్సీ, పోప్ ఒకే దేశంలో ఉండటం ఆ దేశానికి చాలా అన్యాయం’’ అని. అయితే పోప్ అదృష్టవంతుడు– అతన్ని ఆ ముగ్గులోకి లాగితే!– ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య ఆయనెక్కడ ఉంటాడో చెప్పడం కష్టం. గణపతి సచ్చిదానంద స్వామిని విరాట్ కోహ్లీ గురించి, ధోనీ మధ్యకి– అసలు ఈ మాట అనడానికి నోరొస్తుందా? వస్తే? స్వామి ఎక్కడ ఉంటారు? ఇది సరదా మాట. ఓ అభిమాని మైకం. అంతవరకే. నాకనిపిస్తుంది– ఇక్కడ చెప్పకపోతే నాకు చోటు లేదు. ‘సెర్బియా’ వంటి అతి చిన్న దేశం– కేవలం మన హైదరాబాదు జనాభా– నుంచి వచ్చి ప్రపంచాన్ని కొల్లగొట్టే 80 పౌన్ల శరీరంలో – డోకోవిచ్లో– ఎక్కడ ఆ ‘వేడి’ని భగవంతుడు అమర్చాడా అని చూస్తూ మూర్ఛపోతాను. ఈ బంతి ఆట కథలు అపూర్వం. అనితర సాధ్యం. ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ఈ ఆటలు జరిగే మాస్కోలో కనీస ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలు. ప్రస్తుతం పది. చూస్తున్న ప్రేక్షకులలో, ఆడే ఆటగాళ్లలో వాళ్ల శరీరాలు కాగే పెనాలు. ఏమి ఈ క్రీడ. ప్రపంచాన్ని ఊపి ఉర్రూతలూగించే ఈ ఆటలో పాల్గొన్న దేశాలు– కొన్ని మన టి.నగర్, బీబీ నగర్, వెలంపేట దాటవు– అనూహ్యం. ఒక్కరూ మన సినీమా ఎక్స్‌ట్రాల కాలి గోటికి పోలరు. వారిలో చాలామంది నల్లవారు. కానీ బంతి ఆట అభిమానులకి వారు గంధర్వులు, దేవతలు, కొందరికి పోప్లు (క్షమించాలి– ఇది నామాట కాదు). ఇంకా పీలేని, జిదానే, రొనాల్డో, రొనాల్డినోని తలుచుకోలేదు. అదృష్టం. ఇక దురదృష్టం ఏదంటే– నిన్ననే పోటీలో అర్జెంటీనా ఓడిపోయిందని మన దేశంలో కొట్టాయం అభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ చిన్న ఉదాహరణ చెప్పాలని మనస్సు పీకుతోంది. 1994 సెప్టెంబరు 19న రాత్రి 12 గంటలకి– బంతి ఆటలో పాల్గొనడానికి వస్తున్న చిన్న విమానం సహారా ఎడారిలో కూలిపోయింది. అందులో పోటీలో పాల్గొనవలసిన నైజీరియా పోటీ ఆటగాళ్లున్నారు. విమానంలో ఉన్న 39 మందీ చచ్చిపోయారు. ఓ శరీరం గుర్తుపట్టలేనంత కాలిపోయింది. బంతి ఆటలో పాల్గొనవలసిన 13 మంది అంతా చచ్చిపోయారు. మరో 13 మంది గాయపడ్డారు. అప్పుడేమవుతుంది? మరో దేశంలో అయితే సంతాప సభలు జరుగుతాయి. ప్రధాని, అధ్యక్షుడు సంతాప ప్రకటనలిస్తారు. ఆ ఆటగాళ్ల మీద జాతీయ జెండాలని కప్పి అంత్యక్రియలు చేస్తారు. పత్రికలు వారి ఫొటోలు ప్రకటిస్తాయి. అందులో 32 మంది టీం సభ్యులు, ఏడుగురు ఆటగాళ్లున్నారు. అయ్యా, ఆట ఆగలేదు. మరో నైజీరియా టీం పాల్గొంది. దేశం ఆనాడు ‘ఆట’ని ఓడిపోయింది. కానీ ‘ఆత్మవిశ్వాసాన్ని’ ‘పట్టుదల’ని నష్టపోలేదు. ఇంతకన్న ఈ దేశాల ఆట అంతకంటే వారు చూపే అభిమానం, అంతకంటే వారు ఆ ఆటగాళ్లకిచ్చే గౌరవాన్ని గురించి వేరే చెప్పనక్కరలేదు. ఇది బంతి ఆట మైకానికి నివాళి. అంతవరకే. ఇది నా నమూనా పాఠకులకి చిన్న రసగుళిక. గొల్లపూడి మారుతీరావు -
మనవాళ్లు ‘లుంగీ దోశె’ వెయ్యగలరు
♦ జీవన కాలమ్ అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షులు ట్రంప్, కిమ్ మధ్య సమావేశం అనుకు న్నంత గొప్పగా జరగక పోవడానికి కారణాలు నాకు తెలుసు. నిజానికి నాకే తెలుసు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే– దాదాపు అన్ని విదేశాలలో భారతీయ ఆహారం అంటే– ఉత్తర దేశపు ఆహారమనే అర్థం. నేనూ, మా పెద్ద బ్బాయి చాలా సంవత్సరాల కిందట నెదర్లాండ్స్‌లో గ్రహించాం. అక్కడ ‘ఇండియన్ రెస్టా రెంట్’ అన్న బోర్డు చూడగానే మా ఇద్దరికీ ప్రాణం లేచి వచ్చింది. రెస్టారెంటు పేరు ‘మహారాజా’. తీరా వెళ్లి చూస్తే– తందూరీ రోటీ, తందూరీ కుఫ్టా, చోళా భటూరే, భైంగన్ భర్తా, కశ్మీరీ దమ్ ఆలూ, చికెన్ టిక్కా నెడ్ (ఈ ‘నెడ్’ ఏమిటని అడిగితే, తింటున్న ఓ విదేశీ మనిషి చెప్పాడు. అది నెదర్లాండ్స్ స్పెషల్ అట). ఏమైనా మా రోగం కుదిరింది. అన్నట్టు ‘రుమాలీ రోటీ’ మరిచిపోయాను. మనవాళ్లు తలచుకుంటే ‘గావంచా దోశె’, ‘లుంగీ దోశె’, ‘గోచీ దోశె’ కూడా వెయ్యగలరని వారికి తెలీదు. కొత్తవాళ్లకి కొత్త రుచులు నేర్పాలంటే మనకి బాగా నలిగిన వంటకాలను ఎంపిక చేయాలి. వీరిద్దరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినపని ఇద్దరు తమిళ మంత్రులకు అప్పగించారు. న్యాయంగా భోజ నంలో తమిళ రుచులు వీటు దోశె, పొగైల్, అవి యల్, వెర్త కుళంబు వంటివి సమృద్ధిగా ఉండాలి. అలాంటిది– పులావు, చేపల కూర, కోడి కూర, చికెన్ కుర్మా వంటివి ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఎక్కడ దెబ్బ కొట్టిందో నాకు వెంటనే అర్థమైపోయింది. ఇలాంటి చోట ఒక తెలుగు వంటవాడిని కల పాలని నా ఉద్దేశం– పుల్లట్లు, మినపట్లు, పెసరట్లు, నాటుపెసర దోశె, బొబ్బట్టు, పొన్నగంటి పచ్చడి, బచ్చలి మజ్జిగ పులుసు, చిట్టి గారెలు, పెనం గారెలు, ఉల్లి గారెలు, పచ్చి పులుసు– ఇలాంటివి సమృద్ధిగా ఏర్పాటు చేసి ఉండాలి. కిమ్ దొర గారికి అమెరికా క్షిపణుల మీద చుర్రు మని కోపం వచ్చినప్పుడు– వారి చేతికి చిట్టి గారెలు అందించాలి. ట్రంప్ కిమ్‌ని కరుచుకు తినేసేటట్టు చూసేటప్పుడు– ఒక పుల్లట్టు రుచిని వారి ముందు ఉంచాలి. తెలుగు రుచులు తెలియని అరవ మంత్రులు కేవలం 15 దేశాల రుచులను వారి ముందుంచారు కానీ, తమ రాష్ట్రపు రుచులను కానీ, ఆ మాటకు వస్తే పొరుగు రాష్ట్రపు రుచులను కానీ ఎంపిక చేయక పోవటం చాలా ఘోరం. వీరు పెట్టిన పదార్థాలన్నీ ఈ కార్యక్రమాన్ని తమ తమ పేపర్లలో రాయడానికి వచ్చిన 3 వేల మంది పాత్రికేయులకు పెట్టారు. వారంతా సుష్టుగా భోజనం చేశారు కానీ ఎవరూ బాలకృష్ణన్తోగానీ, షణ్ముగమ్తోగానీ వారు ‘మిస్’ అవుతున్న రుచుల గురించి వివరించకపోవడం అత్యంత శోచనీయం. ఎటువంటి సమస్యనయినా కమ్మని భోజనం పరిష్కరిస్తుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే ‘ఒక గ్లాసు మజ్జిగ తాగండి’ అంటాం. అందులో ‘చలవ’ ఎక్కువ. అలాగే చర్చలకు ముందు– మన తెలుగు వంటవాడు ఉంటే– మడత కజ్జికాయలు, పాలకా యలు, బూందీ గారె, ఉల్లిపాయ పకోడీలు, శనగ పప్పు బఠాణీలు, వేపుడు వేరు శెనగపప్పు, చిన్న కారం అతికించి నానబెట్టిన అటుకుల తాళింపు, పెసర పుణుకులు– ఇలాంటివి చేసి పెట్టేవాడు. చర్చలు ప్రారంభానికి ముందే ఇద్దరు నాయకులూ– ఈ పదార్థాలు నంచుకుని– ‘చర్చలు రేపు చేద్దాం. ముందు వీటిని తిందాం’ అనుకునేవారని నా ఉద్దేశం. అయితే ఇందులో చిన్న పితలాటకం ఉంది. తమిళ వంటవారి సంగతి నాకు తెలీదు కానీ తెలుగు వంటవారు ముఖాలు చూస్తూ వారి వంటకాలు తినలేం, ఇలా అందరినీ అవమానించడం లేదని తమరు గుర్తించాలి. రత్నాలు రాళ్లలో ఉంటాయి. అవి తీసి మెరుగు పెడితేనే రత్నమని తెలుస్తుంది. నాకీ అనుభవం చాలా ఉంది. ‘దోశె చూస్తూ తింటారా? తిని చూస్తారా?’ అని ఒక మిత్రుడు పొద్దున్నే మా ఆవిడనీ, నన్నూ ఒక ఊళ్లో అడిగాడు. ఊరు పేరు చెప్పను. ఇదేం ప్రశ్న? అనుకున్నాను. ‘మంచి దోశె తింటాను’ అన్నాను. నన్ను కారులోనే కూర్చోపెట్టి వెళ్లి రెండు దోశెలు తెచ్చాడు. అపూర్వం. ఆనాడు ఇద్దరం తలో మూడు దోశెలు తిన్నాం. ఆ తర్వాత మా మిత్రుడు వద్దంటున్నా ఆ వంటవాడిని చూడా లన్నాను. నన్ను వారించడం చేతగాక పిలుచుకొచ్చాడు. ఆ కుర్రాడిని చూస్తూనే మూర్ఛబోయాను. అంత ‘అసందర్భం’గా, అసహ్యంగా ఉన్నాడు. అక్కడితో ఆగుతాను. ‘మా తెలుగు తల్లికి’ రాసి తెలుగు తల్లికి నీరాజనాలర్పించిన శంకరంబాడి.. డిలన్ థామస్ జ్ఞాపకం వచ్చారు. ప్రతిభకీ, జీవనానికీ సంబంధం లేదు. అంత గొప్ప పనివాడు. వంటని అలం కరించాడు కానీ తనని కాదు. ఏమైనా సింగపూర్‌లో పెద్ద చరిత్రను సృష్టించిన ఇద్దరు తమిళ మంత్రులు– మొన్న గొప్ప అవకాశాన్ని నష్టపోయారని మనవి చేస్తున్నాను. గొల్లపూడి మారుతీరావు -
నా సోది
మన గ్రామాల్లో ఇప్పటికీ సోది చెప్పేవారు వస్తుంటారు. వీరు సాధారణంగా గిరిజనులై ఉంటారు. సినీమాలో సోదిని సాధారణంగా మారు వేషంలో హీరో హీరోయిన్‌కీ, హీరోయిన్‌కి హీరో మనిషి సోది చెప్పి ఇద్దరూ కలిసేటట్టు చేస్తారు. ఏమైనా ఈ ‘సోది’లో చిన్న నాటకం పాలు ఎక్కు వుంది. మనం సినీమా ‘సోది’ మనిషితో సాధారణంగా ఏకీభవి స్తాం. ఒకప్పుడు ఏకీభవించకపోనూ వచ్చు. ఇప్పుడు నాకు అలాంటి సోది చెప్పాలని మనసు పుట్టింది. మన దేశంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కటై పోటీ చేస్తే బీజేపీని ‘సోది’లోకి లేకుండా ఓడించగలవు. సందే హం లేదు. కానీ సమస్య అల్లా ఎలా అన్నదే. ఈ దేశంలో ఎవరూ ఎవరితోనూ ఏకీభవించరు. దాదాపు మెజారిటీ వచ్చిన బీజేపీని అటకెక్కించిన కర్ణాటకలో పదవీ స్వీకారం చేసిన రెండు వారాలకు ఒకానొకరకమైన మంత్రిమండలి ఏర్పడింది. మళ్లీ ఎందుకైనా మంచి దని కాంగ్రెస్ తన వాటా కోటాలో నాలుగైదు మంత్రి పదవుల స్థానాలను ఖాళీగా ఉంచింది. అలాగే కుమారస్వామి కూడా కనీసం మూడు స్థానాలను ఖాళీ ఉంచారు. ఇప్పుడు ఎం.బి. పాటిల్ వంటి వారు ఎదురు తిరిగితే వారికి ఇవ్వ డానికి స్థానాలు రెడీగా ఉన్నాయి. ఇది కలిసి పనిచేసే రెండు దక్షిణాది ప్రతిపక్షాల నీతి. నేను మాయావతి పెద్దరికాన్ని అంగీకరించి అవసరమైతే– బీజేపీని ఓడించటానికి తలవొంచుతాను– అని అఖిలేష్ యాదవ్ ఇవాళ వాక్రుచ్చారు. మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌తో చెయ్యి కలపరు. అలా కలపడం ఇష్టంలేని మరో సీఎం కేసీఆర్ ముందురోజే వచ్చి కుమారస్వామిని పలకరించి వెళ్లారు. అలాంటి మరొక వ్యక్తి ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్. సరే. తమ రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా కోసం మన బాబు ఎవరితోనైనా చేతులు కలపగలరు. ఇక కమ్యూనిస్టు పార్టీకీ, కాంగ్రెస్కీ చుక్కెదురు. అయితే బీజేపీకి ‘పెద్ద’ చుక్క ఎదురు. కనుక– ప్రతిపక్షాల సమీకరణలో వారు కలుస్తారా? ఇది ప్రశ్న. కానీ ఈ పార్టీలన్నీ ఈ దిక్కుమాలిన బీజేపీని కలిసికట్టుగా ఓడించాలి. ఎలా? నాది ఒక బ్రహ్మాస్త్రం ఉంది. ఎవరికీ ఏమీ ఇబ్బంది లేకుండా ఈ దేశం అంతటిలో 380 పార్లమెంటు సభ్యులను ఎంపిక చెయ్యండి. మరి ఇంతమంది మన పార్లమెం టులో పడతారా? ఎవడు చూడొచ్చాడు? ఆయా ప్రాంతాలకు వినియోగపడేటట్టు–కనీసం–15 పద వులు వేరుగా ఉంచండి. ఎవరైనా గట్టిగా ఎదురుతిరి గితే– కార్యార్థం మంత్రి పదవి ఖాళీగా ఉంటుంది. మరి మమతాబెనర్జీ, కేరళ సీఎం పినరయి విజ యన్ మాట వింటారా? అలాగే బాబు కేసీఆర్ ఆజ్ఞని పాటిస్తారా? కనుక– ఇక్కడే నా ‘ఆసు’ ఉంది. ఈ ఏర్పాటులో ప్రతీ ప్రాంతానికీ ఒక ప్రధానమంత్రి ఉండాలి. తమరు గమనించారో లేదో– ఇప్పుడు పద వులు పొందిన కర్ణాటక మంత్రులకు ఐదేళ్ల ‘పదవి’ లేదు. అలాగే ప్రాంతీయ ప్రధానమంత్రులకు కూడా పూర్తి ఐదేళ్లు ఇవ్వనక్కరలేదని నా ఉద్దేశం. ఉదా హరణకి దక్షిణాదికి ఎడపాడి పళనిస్వామి, పన్నీరుసెల్వం ఉంటారు. రెండో భాగంలో కేసీఆర్ రావచ్చు. అలాగే– తూర్పుకి శర ద్పవార్, పశ్చిమానికి మమతా బెనర్జీ, ఉత్తరానికి–నాకు రెండు పేర్లున్నాయి. షేక్ అబ్దుల్లా, కేజ్రీవాల్. ఇంక తగాదాలు వచ్చే ప్రసక్తి లేదు. ఏ ప్రాంతపు ప్రధాని, ఆ ప్రాంతపు సమ స్యలను పరిష్కరిస్తారు. అవసరమైతే పద వులు మార్చడానికి బోలెడన్ని పదవులు న్నాయి. మాయావతి ఏనుగుల పార్కుల్ని నిర్మించి– దళితులకు సేవ చేస్తారు. బాబు నదులన్నీ ఏకం చేసే పనిమీద ఉంటారు. అందరు పార్లమెంటు మెంబ ర్లకూ రోజూ దిక్కుమాలిన పార్లమెంటుకి వెళ్లాల్సిన అవసరం లేదు. కేకలువేసి, అల్లరి చేసి, స్పీకర్ మీద చిత్తు కాగితాలు విసిరే వారికే ప్రాధాన్యం ఇస్తారు. దేశంలో ఏ గొడవా లేకుండా, బీజేపీ సోదిలోకి కనిపించకుండా– సామరస్యంగా పాలన జరుగు తుంది. వీళ్లందరూ ఎవరితోనూ ప్రమేయం పెట్టుకో కుండా– చక్కగా తమ ప్రాంతంలో ‘ప్రధాని’ పద విని నిర్వహించుకోవచ్చు. అసలు ఎందుకిలా అయింది? ఈ నాయకులు మొన్న మొన్నటిదాకా ప్రజలతో ‘మన’ అంటూ మాట్లాడి ప్రస్తుతం ‘తన’కి సెటిల్ అయ్యారని రాజకీయాలు చెప్తున్నాయి. ఈ దేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకమై– పాలక వర్గాన్ని ఓడించటంలో ‘చమత్కారం’ ఈ దేశంలో ఇద్దరికే తెలుసని నా ఉద్దేశం–మోదీ, అమిత్ షా. ఇది నా సోది. గొల్లపూడి మారుతీరావు -
కొత్త నియోజకవర్గం
ఈ ప్రభుత్వం చట్టమయితే చేసింది కానీ– ఏదీ? దమ్ముంటే ఒక్క కుర్రాడిని ఉరి తీయమనండి. రాజీవ్ గాంధీని మారణ హోమం చేసిన నేరస్థురాలికి 22 సంవత్సరాల తర్వాత కూడా విమోచన లేదు. మా నమశ్శివాయని ఈ కాలమ్ పాతికేళ్లుగా చదువుతున్నవారయితే గానీ ఎరగరు. కొంచెం ముక్కుమీద గుద్దినట్టు మాట్లాడేమనిషి. మనిషి కాస్త ఖండితంగా చెప్తాడు. ఎదుటివాడు ఏమనుకుంటాడో ఆలోచించడు. ఇప్పుడు ఇది చూడండి. ముందు మనదేశంలో రేపుల కథల నమూనాలు చూద్దాం. ఇది ఒక పత్రిక మొదటి పేజీ కథ. బీహార్ జహానాబాద్‌లో కేవలం నలుగురు యువకులు ఒకమ్మాయిపై అత్యాచారం చేశారు. ఇందులో మరో నలుగురయిదుగురు యువకులు కూడా చేయి కలిపారని ఈ వీరులు చెప్పారు. శ్రీనగర్ కథువా జిల్లాలో 8 ఏళ్ల అమ్మాయిని కొందరు అత్యాచారం చేసి చంపేశారు. ఒడిశా కేంద్రపానికా పోలీసు స్టేషన్ పరిధిలో ఒక సొంత మేనమామ నాలుగేళ్ల అమ్మాయిని అత్యాచారం చేశాడు. ఉత్తరప్రదేశ్ కనుజ్ ప్రధాన్ జిల్లాలో ఇద్దరు ప్రబుద్ధులు ఒక అమ్మాయిని రేప్ చేస్తుండగా మరో ఇద్దరు శృంగార పురుషులు వీడియో తీసి నలుగురికీ పంచారట. ఒడిశా లోని జగన్నాథపూర్‌లో కేవలం 6 ఏళ్ల ఆడపిల్ల అత్యాచారానికి గురై 8 రోజులు ప్రాణాల కోసం పోరాడి చచ్చిపోయింది. జమ్ములో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు 24 ఏళ్ల స్త్రీపై అత్యాచారం జరిపి, వీడియో తీసి, ఈ విషయాన్ని బయటపెడితే వీడియోను అందరికీ పంచుతామని హెచ్చరించారట. అన్నిటికన్నా విడ్డూరం– ఇలా రేప్ చేసిన నేరస్తుల్ని శిక్షించే చట్టాన్ని రాష్ట్రపతి అమలు జరిపే ’రోజున’ కేవలం 110 రేప్‌లు మాత్రమే జరిగాయట. ఉత్తరప్రదేశ్ ఇందులో మళ్లీ అగ్రస్థానం. మన నెల్లూరులో చెన్నూరు గ్రామంలో ఓ ఆరేళ్ల అమ్మాయిపై ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ మైనర్ కుర్రాడు అత్యాచారం చేశాడట. బీహార్‌లోని ఉన్నావ్‌లో ఓ 9 ఏళ్ల అమ్మాయిని ముజాఫర్పూర్లో అయిదుగురు అత్యాచారం చేశారు. ఒడిశాలో నయాఘర్ జిల్లాలో దేవరాజ బారిక్ అనే వ్యక్తి ఒక మహిళపై రెండు నెలలుగా అత్యాచారం సల్పుతుండగా ఆ అవమానం భరించలేక ఆమె నిన్న ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి కేసులు 11,12,628 ఉన్నాయని నిన్న సుప్రీం కోర్టు ప్రకటించింది. వీటిలో మళ్లీ అగ్రస్థానం ఉత్తరప్రదేశ్–30,883 కేసులు. తర్వాతి స్థానం చెప్పి ముగిస్తాను: మహారాష్ట్రలో 16,099 కేసులు. ఇంత చెప్పాక వీరినందరినీ ఉరి తీయడం సబబు కాదంటాడు మా నమశ్శివాయ. ఈ ప్రభుత్వం చట్టమయితే చేసింది కానీ– ఏదీ? దమ్ముంటే ఒక్క కుర్రాడిని ఉరి తీయమనండి. రాజీవ్ గాంధీని మారణ హోమం చేసిన నేరస్థురాలికి 22 సంవత్సరాల తర్వాతే విమోచన లేదు. మనకి మానవ హక్కుల చట్టాలున్నాయి. మానవతావాదులున్నారు. మతాలున్నాయి. రైళ్లు తగులబెట్టే కులాలున్నాయి. రైళ్లని ఆపే ప్రాంతాలున్నాయి. జాతులున్నాయి. వర్గాలున్నాయి. చిట్టచివరిగా పార్టీలున్నా యి. నిన్న జైలు శిక్షపడితేనేంగాక – ఆసారాం బాపూలున్నారు. వీరందరూ ఊరుకుంటారా? చచ్చిపోయిన ఆ రేళ్ల బిడ్డ మరణం కంటే చావవలసిన 15 ఏళ్ల కుర్రాడి భ విష్యత్తుని గురించి జెండాలు పట్టుకుని బయలుదేరరా? దేశం పేరు ఇప్పుడు గుర్తులేదు గానీ– ఆ దేశంలో ఒకడు బజారులో పరిగెత్తుతున్నాడు. పోలీసులు వెంట తరుముతున్నారు. ఆ కుర్రాడు కిందపడ్డాడు. కదులుతున్న అతని తలమీద తుపాకీ ఉంచి కాల్చాడు పోలీసు. కుర్రాడు చచ్చిపోయాడు. ఎందుకయినా మంచిదని మరొకసారి కాల్చాడు. బజారులో వందలాది మంది ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. మరి కనిపించని వెనుకవారి మాట? ఆ దృశ్యాన్ని ఒక క్రేన్‌కి కట్టి ఊరేగించారు. భయంకరం. అక్కడ మానవ హక్కుల సంఘం లేదా? మానవ సంఘాలు లేవా? మతప్రముఖులు లేరా? ఒక్కటి మాత్రం ఆ తర్వాత లేదు. రేప్. ఈ దేశంలో ఒక కుర్రాడిని ఉరితీయమనండి. పేపర్లు విరగబడతాయి. ఇంకా మన అభిమాన హీరో సల్మాన్ ఖాన్ నల్లజింక కేసే 20 ఏళ్లుగా నడుస్తోంది. ఇంకా దానికి దిక్కులేదు. మరి రాష్ట్రపతి గారి చట్టం ప్రకారం–ఒక అత్యాచారానికి నలుగురిని వేసుకున్నా 4 లక్షల ఓట్లు వృ«థా. కనుక వీరిని ఒక వర్గంగా గుర్తించి ’రేప్‌లS నియోజకవర్గం’ అనో ఇంకా దమ్ముంటే ’రేపటి నియోజకవర్గం’ అనో గుర్తించాలంటాడు మా నమశ్శివాయ. అందువల్ల మనకి కొందరయినా మంత్రులు మిగులుతారు, మత గురువులు మిగులుతారు. స్థానిక నాయకులు మిగులుతారు. జైళ్లు ఖాళీ అవుతాయి. దేశం ’రేపుయుతం’గా ఉంటుంది. మరి ఈ నియోజకవర్గం ఏ పార్టీని సమర్థించాలా అన్నది అప్పుడే కొందరి మనసుల్లో కదిలిన మీమాంస. అయ్యా, ముందు అత్యాచారాలు విరివిగా జరగనివ్వండి. 2019 దగ్గర పడనివ్వండి. రేపు సంగతి తర్వాత చూద్దాం. ఏమయినా మా నమశ్శివాయ గట్టి పిండం. గొల్లపూడి మారుతీరావు -
ఓ గొప్ప మజిలీ
జీవితానికి ఒకే వృద్ధాప్యం. 80వ మజిలీకి సైన్‌పోస్ట్. జీవితం ఆఖరు దశకి ముఖద్వారం. ఒకనాడు అందంగా అలంకరింపబడి అలసిపోయిన ముసలి తోరణం. ఇది ప్రయత్నించినా రిటర్న్ టికెట్టు లేని ప్రయాణం. రెండు రోజుల్లో నేను 80. చాలా కారణాలకి ఇది చాలా గొప్ప మజిలీ. ఈ దేశంలో గొప్పతనా నికి మన్నిక లేకపోవచ్చుకానీ వయస్సుకి ఉంది. అది సుఖ వంతమైన జీవితానికి పెట్టు బడి. ఈ వయస్సులో శషబి షలు చెల్లిపోతాయి. ఇచ్చకా లకు కొత్త అర్థం వస్తుంది. ఎవరినయినా, ఎప్పుడైనా నిరంతరాయంగా విమర్శించవచ్చు. నచ్చితే మెచ్చుకుం టారు. నచ్చకపోతే ‘పాపం, ఆయనకి వయస్సు మీద పడిందయ్యా’ అని పక్కకి తిరిగి నవ్వుకుంటారు. నడకలో హుందాతనం పెరుగుతుంది. కుర్చీ లోంచి చక్రవర్తిలాగా ఠీవిగా లేవవచ్చు. అవి కీళ్ల నొప్పు లని మనకి తెలుస్తాయి. హుందాతనమని చూసినవారు సరిపెట్టుకుంటారు. తెలిసి తెలిసి తప్పులు చెయ్య వచ్చు. వయస్సు కనుక అందరూ అర్థం చేసుకుం టారు. అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెప్ప వచ్చు. చాలామంది ముఖాలు గుర్తున్నా మరిచిపోయి నట్టు నటించవచ్చు. ‘నువ్వు వెంకటరావు కొడుకువి కదా?’ అని తెలిసి తెలిసి పలకరిస్తే– ‘కాదండీ. నేను చిన్నారావు మనుమడినని’ ఎదుటి వ్యక్తి నుంచి సమాధానం వస్తుంది. కుర్రకారుని ‘మీకేం తెలీద’ని అదిలించ వచ్చు. ఇదివరకులాగా ఆ మనిషి కోపం తెచ్చుకోడు. మనసులో ‘పిచ్చి ముండాకొడుకు’ అనుకున్నా బయ టికి చిరునవ్వు నవ్వుతాడు. వాడు అలా అనుకుంటు న్నాడని నీకు తెలుసు. అనుకున్నా వాడిని తిట్టగలిగినం దుకు నీకు ఆనందంగా ఉంటుంది. ఎన్నాళ్ల కోరిక అదో! ఇది పాత ‘మచ్చ’ని తడువుకునే పిచ్చి సుఖం. పచ్చి సుఖం. ముసలివాడులెమ్మని అందరూ నిన్ను అర్థం చేసుకున్నట్టు నటిస్తారు. నటిస్తున్నారని నీకర్థ మవుతూ ఉంటుంది. ఏ సమస్యమీదయినా నీ అభి ప్రాయాలను గుప్పించవచ్చు. చెల్లితే అనుభవం. చెల్లక పోతే ముసలితనం దిగజారుడు.వయస్సు మీద పడింది లెమ్మని అందరూ నిన్ను అర్థం చేసుకున్నట్టు నటిస్తారు. నటిస్తున్నారని నీకర్థమ వుతూ ఉంటుంది. నీ ఆలోచనల అవసరం లేకుండా నీ అభిప్రాయాలను విరివిగా గుప్పించవచ్చు. అవి నీ ‘అమోఘమైన’ ఆలోచనతో చెప్పే హితవులాగా అందరూ వింటారు. కానీ వాళ్లు తలలూపుతున్న గొర్రె లని నీ మనస్సు చెప్తూంటుంది. నీ మనస్సు నవ్వు కుంటుంది. వాళ్ల మనస్సూ ఆ పనే చేస్తోందని నీకు తెలుస్తూంటుంది. రెండురకాల ‘ఆత్మవంచన’ వ్యాయామానికి ఈ దశ ప్రారంభం. ఇష్టంలేని వాళ్ల ముఖంమీద చెడామడా తిట్ట వచ్చు. నీ పెద్దరికం కారణంగా కడుపులో రగులు తున్నా ‘పోండి సార్! మీరు మరీనూ!’ అని పిచ్చి నవ్వు నవ్వుతారు. ఆ పిచ్చి నీకు కిర్రెక్కిస్తుంది. వయస్సులో నువ్వు చేసిన తప్పిదాలను నీ భార్య సరిపెట్టుకుంటుంది. ఇప్పుడిక చేసేది లేదు కనుక. అది కేవలం సరిపెట్టుకోవడమేనన్న నీ ‘వంకర’ బుద్ధి నిన్ను ‘చక్కిలిగింత’ పెడుతుంది. పాత జ్ఞాపకం– గుర్తొచ్చిన ‘దురద’ లాంటిది. మరోసారి గోకినా ‘సుఖం’గానే ఉంటుంది. ‘ఈ కుర్రకారు తగలబడి పోతోందని’ తరచుగా పెదవులు విరవొచ్చు. ఆ కుర్ర కారు చస్తే మారదని నీకూ తెలుసు. ఇది పాత ‘దురద’ని లేకపోయినా గోక్కోవడం లాంటిది. రాసిన ప్రతీ విషయాన్నీ– ఇప్పుడు– ఎవరూ సీరి యస్‌గా తీసుకోరు. బాగులేని కథని చదివి ‘ముస లాడిలో సరుకయిపోయిందనుకుంటూ’ ‘ఆహాహా! మీరు కాకపోతే ఎవరు రాస్తారు సార్ ఇది!’ అని లుంగలు చుట్టుకుపోతాడు. ఇంకాస్త జుత్తుంటే ‘గండ పెండేర మంటారు. సగమయినా ఊడితే రెండు యూని వర్సిటీల ‘డాక్టరేట్లు’ంటాయి. మరీ జుత్తు పండి– ఇంకా బతికుంటే ఓ ‘పద్మా..’ అవార్డ్ మొహంమీద పారేస్తారు. ఎనభయ్యో పడిలో కదలలేకపోయినా మోసుకెళ్లి రెండు మూడు సన్మానాలు– మీ కోసం కాదు– ఆయా సంస్థల గొప్పతనం కోసం– చేస్తారు. రచనలన్నీ వెదికి వెదికి పునర్ముద్రణలు చేస్తారు. నువ్వే మరిచిపోయిన గతాన్ని తవ్వి అలనాడు బట్టలు ఎండేసే తాడుమీద వాలిన కాకి నీలో ఎలా మొదటి కవితా వైభవాన్ని మేలుకొలిపిందో ఓ కవి గానం చేస్తాడు– ఆవేశంగా కన్నీటి పర్యంతం అవుతూ. ఇంతకూ ఏం జరిగింది? ఇంక నువ్వు ఎక్కువ కాలం బతకవని వాళ్లకి నమ్మకం కుదిరింది. ‘నువ్వు పోయే కాలం వచ్చిందని వాళ్లకి ధైర్యం వచ్చింది. ఇప్పుడు నిన్ను మెచ్చుకోవడం ‘వారి’ అభిరుచిగా తర్జుమా చేసుకుంటారు. ఇది ‘సాహిత్య పరిణామ కంపు’. గతాన్ని అటకెక్కించే గౌరవ వందనం. అయ్యో! ఈ 80 ఏళ్ల వయస్సు ఏ 40 ఏళ్లకిందటో వచ్చి ఉంటే ఎంత బాగుండును అనిపిస్తుంది. కానీ జీవితానికి ఒకే వృద్ధాప్యం. 80వ మజిలీకి సైన్‌పోస్ట్. జీవితం ఆఖరు దశకి ముఖద్వారం. ఒకనాడు అందంగా అలంకరింపబడి అలసిపోయిన ముసలి తోరణం. ఇది ప్రయత్నించినా రిటర్న్ టికెట్టు లేని ప్రయాణం. ముందుకు వెళ్తున్న ప్రతీ క్షణమూ మళ్లీ తెరుచుకోని తలుపుల్ని ఒక్కొక్కటే మూసుకుంటూ ముందుకు సాగిపోయే ప్రస్థానంలో గంభీరమైన మజిలీ–80. గొల్లపూడి మారుతీరావు -
గొల్లపూడి మారుతిరావుతో మనసులో మాట
-
కీర్తి హెచ్చరిక
♦ జీవన కాలమ్ కీర్తి హెచ్చరిక. కీర్తి భయంకరమైన బాధ్యత. 24 గంటలూ కంటిమీద కునుకు లేకుండా కాపాడు కోవలసిన, దుర్మార్గమైన ఆస్తి. సజ్జనుడికి అది అలవోక. వ్యసనపరుడి మనసు ఏ మాత్రం బెసికినా– ఆమూ లాగ్రం కబళించే వికృత శక్తి. పుష్య బహుళ పంచమి. త్యాగరాజస్వామి నిర్యాణం. త్యాగరాజ ఆరాధనోత్సవాల ప్రారంభం. త్యాగరాజు ఒక అపూర్వమైన పంచరత్న కీర్త నని రచించారు–గౌళ రాగంలో –‘దుడుకుగల నన్నే దొరకొ డుకు బ్రోచురా’ అంటూ. భక్తి పారవశ్యంతో దాదాపు 200 సంవత్సరాలు ప్రాణం పోసుకు నిలిచిన అపూర్వ సంగీత రత్నాలను సృష్టించిన వాగ్గేయకారుడు తనది ‘దుడుకుగల’ జీవనం అని చెప్పుకున్నాడు. దుడుకుతనా నికి తననే ప్రధాన పాత్రని చేసుకుని– ఇవ్వాళ్టికీ కని పించే దుడుకుతనానికి ప్రాణం పోశాడు. ఇదేమిటి? ఈ ‘దొరకొడుకు’ ఎవరు? అనిపించేది కీర్తన విన్నప్పుడల్లా. కల్లూరి వీరభద్ర శాస్త్రిగారు సమాధానం చెప్పారు. కోపంతోనో, నిస్పృహతోనో మాట్లాడినప్పుడు– ‘నీ తాత కొడుకు ఎవడు తీరుస్తాడురా నీ ఇక్కట్లు’ అనడం గ్రామీణ ప్రజల నానుడి. సరే. ఈ ‘దుడుకు’ ఏమిటి? పరధన పరకాంతా చింతనతో పొద్దుపుచ్చుతూ చపలచిత్తుడై బతికాడట. ‘సతులకు కొన్నాళ్లాస్తికై సుతులకు కొన్నాళ్లు ధన తతులకై’ తిరిగాడట. తమిళంలో ఒక సామెత ఉంది: ‘ఆస్తికి ఒరుప య్యన్ అరిమికి ఒరు పొణ్ణు’ అని. ఆస్తిని కూడబెట్టి ఇవ్వ డానికి కొడుకు, ప్రేమని పంచుకోడానికి కూతురు. త్యాగ రాజు తిరువయ్యారులో రచన సాగించాడు కనుక తమిళ నానుడి వారి రచనలో తొంగి చూడటం ఆశ్చర్యం కాదు. దాదాపు 200 సంవత్సరాలు మానవ నైజంలో నిలదొక్కు కున్న జబ్బును– ఇవ్వాళ్టికి చెక్కు చెదరకుండా వర్తించే టట్టు ఆనాడే సూచించిన ద్రష్ట త్యాగబ్రహ్మం. ‘భక్తి’ ఆనాటి ఆలంబన. సృష్టిలో, సమాజ పరిణామ శీలంలో విచిత్రం ఏమిటంటే త్యాగ రాజు వెళ్లిపోయిన (1847) మరు సటి సంవత్సరమే ఒకాయన పుట్టాడు. ఆయన కందుకూరి వీరేశ లింగం. మరో 14 ఏళ్లకి పుట్టిన మరో మహానుభావుడు గురజాడ. మరుసటి సంవత్సరమే మరో వ్యక్తి జన్మించాడు– గిడుగు రామమూర్తి. వీరు ముగ్గురూ భక్తికి దూరంగా జరిగి సమాజ హితానికి చెరగని ఉద్యమాలుగా నిలిచారు. గురజాడ ‘కన్యాశుల్కం’ ఇప్పటికీ సమాజ రుగ్మతకు అద్దం పట్టే కళాఖండంగా ప్రాణం పోసు కుంది. అటు త్యాగరాజూ చిరంజీవిగా ఈనాటికీ దక్షి ణాది సంగీత ప్రపంచంలో విశ్వరూపం దాల్చాడు. వీటి జీవ లక్షణానికి పెట్టుబడి ‘సామాజికమైన రుగ్మత’ను ఎండగట్టడమే. ఒకాయన– త్యాగరాజు– ఆర్తిని కీర్తిని చేసుకున్నాడు. తర్వాతి తరంవారు మనిషి దుర్వ్యసనాలను ఎండగట్టడానికి అక్షర రూపం ఇచ్చారు. అమెరికాలో ఒకావిడ కవితలు రాసింది. రాసిన ఏ కవితనూ ప్రచురించలేదు. ఆమె వెళ్లిపోయాక ఆమె సోదరి ఆ కవితల్ని చూసి ఆశ్చర్యపడి ప్రచురించింది. ఆ కవయిత్రి అమెరికాలో cult figure అయింది– ఎమిలీ డికిన్సన్. ఆమె కవిత – Fame is a bee / It has a song / It has a sting/ Ah, it has a wing! కీర్తి తేనెటీగ లాంటిది. అలరిస్తుంది. ఆదమరిస్తే కాటేస్తుంది. కాపాడుకోలేకపోతే రెక్కలు విదిలించి ఎగిరి పోతుంది. దాదాపు 55 సంవత్సరాల కిందటి చిత్రం ‘ఎక్రాస్ ది బ్రిడ్జ్’. రాడ్ స్టీగర్ ముఖ్య పాత్ర. ఓ గొప్ప వ్యాపారి. ఓ గోడకి నిలువునా ఆయన చిత్రాన్ని పరిచయం చేశారు. ప్రజాధనాన్ని దోచుకున్నాడు. దేశం నుంచి పరారి అయ్యాడు. రైల్లో మరొకరి పాస్‌పోర్టుని దొంగి లించి, అతణ్ణి రైల్లోంచి తోసేశాడు. అతనికి ఓ కుక్క. రైలు ప్రయాణీకుడు నేరస్తుడు. ఒక దేశంలో మోసగాడు ఇప్పుడు ఈ దేశంలో నేరస్తుడ య్యాడు. కుక్కతోపాటు పుల్లి విస్తరా కుల్లో ఆహారం తిన్నాడు. కుక్కతో ఆత్మీయత పెరిగింది. ఇతన్ని పట్టుకో జూసిన తన దేశపు రక్షక భటులు– తమ దేశానికీ పొరుగు దేశానికీ మధ్య గల పొలిమేరకు కుక్కని దాటించే ప్రయత్నం చేశారు. కుక్క కోసం ఈ వ్యాపారి పరుగు తీశాడు. కుక్కతో పాటు స్వదేశపు పొలిమేర హద్దుమీద రక్షకభటుల కాల్పులకి ప్రాణం వది లాడు. డబ్బుమీద వ్యామోహం ఒక నాడు తరిమింది. కుక్కమీద వ్యామోహం ఈనాడు కట్టిపడేసింది. హద్దుమీద ‘కుక్కచావు’ చచ్చాడు. ఒకదేశంలో కీర్తికీ పొరుగు దేశంలో తనది కాని కుక్కతో పుల్లి విస్తరాకుల్లో తిండి తినడానికీ– ఇంతకంటే మానవ పతనానికీ నిదర్శనం లేదనుకుంటాను. కీర్తి హెచ్చరిక. కీర్తి భయంకరమైన బాధ్యత. 24 గంటలూ కంటిమీద కునుకు లేకుండా కాపాడు కోవలసిన, దుర్మార్గమైన ఆస్తి. సజ్జనుడికి అది అలవోక. వ్యసనపరుడి మనసు ఏ మాత్రం బెసికినా– ఆమూ లాగ్రం కబళించే వికృత శక్తి. మరి మహాత్ముల, సత్పురుషుల మాట? కీర్తి వారి సత్ప్రవర్తన పరిమళం. దుర్వ్యసన పరుడి కీర్తి కేవలం జిడ్డు. దాన్ని చిన్న తప్పటడుగు అవలీలగా చెరిపేస్తుంది. వెనక్కి తిరిగి చూసుకునేలోగా అధఃపాతాళానికి తొక్కేస్తుంది. కీర్తి వరం– సత్పురుషులకి. కీర్తి కేవలం ఆర్జన– వ్యసనపరులకి. గొల్లపూడి మారుతీరావు -
భీతి వద్దు ప్రీతి ఉండాలి
గొల్లపూడి మారుతిరావు. ఈ పేరు చెబితే సినీ జీవితంలో ఆయన పోషించిన పాత్రలు కళ్లెదుట కదలాడతాయి. సాహితీవేత్తలకు రచనలు మనసులో మెదులాడతాయి. రచయితగా 60 ఏళ్లు నటుడిగా 47 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ 78 ఏళ్ల బహుముఖ ప్రజ్ఞాశాలి నిత్య దైవారాధికుడు. దైవ పూజతోనే దైనందిన జీవనం మొదలపెట్టే గొల్లపూడి ఆలయానికి వెళ్లనిదే నిద్రపోరు. నిత్యం ఏదో ఆధ్యాత్మిక గ్రంథం చదువుతూనే ఉంటారు. ఎక్కడైనా ఎవరైనా ప్రవచనాలు చెబుతున్నారని తెలిస్తే సతీ సమేతంగా వెళ్లి ఏదో ఓ మూల కూర్చొని వింటూ లీనమైపోతారు. దైవం పట్ల భీతి ఉండటం కంటే ప్రీతి ఉండటం మేలని ‘నేను నా దైవం’ శీర్షిక కోసం గొల్లపూడి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. మీ జీవితం విశాఖ, విజయనగరంల మధ్య ఎక్కువగా గడిచినట్టుంది? అవును. మాది మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం. నేను పుట్టింది విజయనగరం. పెరిగింది విశాఖ. చిన్నప్పుడు విశాఖపట్నం నుంచి విజయనగరంకు ప్రయాణం అంటే పెద్ద విశేషంగా ఉండేది. ఇప్పుడు గంట కూడా పట్టని ప్రయాణం ఆ రోజుల్లో నాలుగు గంటలకు పైగా సాగేది. అప్పట్లో విజయనగంలో ఎడ్ల బళ్లలో తిరిగిన జ్ఞాపకం ఇంకా మర్చిపోలేదు. ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉండేది? ఒక నమ్మకమైన వాతావరణం ఉండేది. ఇప్పుడు ఆలోచిస్తే అది– దైవం అంతా చూస్తూ ఉంటాడు మనం ఎవరికీ ఏమీ చేయకపోతే ఎవరూ మనల్ని ఏమీ చేయరు.. అంతా మంచే జరుగుతుంది అనేది ఆ భావనకు మూలం అనుకుంటా. మా నాన్న గారు కంపెనీలో గుమస్తాగా జీవితాన్ని ఆరంభించి కంపెనీ ఇన్చార్జి స్థాయికి ఎదిగారు. పెద్ద కలలకు పోకుండా గౌరవ ప్రదంగా బతికే వాళ్లం. ఏ రోజూ భోజనం లేదు మంచినీళ్లు లేవు అనే పరిస్థితి మా జీవితాల్లో ఎప్పుడు ఎదుర్కో లేదు. గౌరవంగా, తృప్తిగా, డిగ్నిఫైడ్‌గా జీవించాం. భేషజాలకు పోని ఫాల్స్ ప్రెస్టేజ్ ప్రమేయం లేని ప్రశాంతమైన డిగ్నిఫైడ్ జీవితం గడపడం మా తల్లిదండ్రులు నాకు నేర్పారు. నాన్న గారు రోజూ గాయత్రి జపం చేసేవారు. అమ్మగారు భగవద్గీత చదివేవారు. సుదర్శన నామం చేసేవారు. మా తల్లిదండ్రులతో కలిసి ప్రతి ఏటా పుణ్యక్షేత్రాలకు వెళ్లేవాడని. ఆ తర్వాత ఏనాడు దైవ చింతన వదల్లేదు. ఉద్యోగంలోనే కాదు..రచయతగా..నటుడిగా ఎక్కడకు వెళ్లినా దైవారాధన వీడలేదు. మొన్ననే భద్రాచలంలో మూడురోజుల పాటు ఉన్నాను. ఆ రోజుల్లో డిగ్రీ చేయడం విశేషం అనే చెప్పుకోవాలి... మనిషి సంస్కారానికి రెండు మార్గాలుండాలి. ఒకటి దైవమార్గం రెండు విద్యామార్గం. మా నాన్న చదువు ముఖ్యం అనుకోవడం నా అదృష్టం. విశాఖలో 1956–59 మధ్య బీఎస్సీ హానర్స్ ఆంధ్రా యూనివర్సిటీలో చేశాను. అప్పట్లో మా నాన్నగారి జీతం 30 రూపాయలు ఉండేది. నా టర్మ్ ఫీజు కూడా అంతే ఉండేది. అయినా ఆయన చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని పోషించుకుంటూ నా టర్మ్ ఫీజు కట్టేవారు. బస్సుకు వెళ్లడానికి డబ్బులిచ్చేవారు. పాకెట్ మనీ లాంటివి ఇవ్వలేదు. ఒక్క రోజు కూడా నా ఖర్చుతో కాఫీ తాగలేదు. ఇప్పటికి కూడా హొటల్కు వెళ్లి కాఫీ, టిఫిన్ తీసుకోవాలంటే మనస్కరించదు. చాలా త్వరగా ఉద్యోగ జీవితాన్ని వెతుక్కున్నట్టున్నారు? మధ్యతరగతి వాళ్లకు వేణ్ణీళ్లకు ఎంత తొందరగా చల్లనీళ్లు దొరికితే అంత మంచిది. అందుకే బీఎస్సీ హానర్స్ పూర్తి కాగానే రచనా రంగంపై ఉన్న మక్కువతో 20 ఏళ్లకే జర్నలిజంలో అడుగుపెట్టాను. 1961లో వివాహమైంది. 1962 అక్టోబర్‌కు పెద్దబ్బాయి పుట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఆల్ ఇండియా రేడియోలో ఇంటర్వ్యూ వచ్చింది. 20 ఏళ్ల పని చేశాను. ఏ దేవుడంటే ఇష్టం? నాకు దేవుళ్లందరూ ఇష్టమే. ఫలానా దేవుడంటేనే ఇష్టమని లేదు. నా జీవితంలో ఆలయాలకు వెళ్లని రోజంటూ ఉండదు. ఎంత బిజీగా ఉన్నా సమీపంలోని ఏదో ఒక ఆలయానికి వెళ్లాల్సిందే. గుడికి వెళ్లకుండా నిద్రపోవడం అంటే నాకేమిటో వెలితిగా ఉంటుంది. పగటి వేళ పని ఒత్తిడిలో గుడికి వెళ్లలేకపోతే పడుకునే ముందైనా ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకున్న తర్వాతే పడుకుంటాను. ఇక విశాఖలో ఉంటే ఒక రోజు మర్రిపాలెం వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్తాను. ఒకరోజు ఈస్ట్‌పాయింట్ కాలనీ బాబా గుడికి వెళ్తాను. హైవేపై ఉన్న యోగాంజలి స్వామి గుడికి ఇంకోక రోజు ఎంవీపీ కాలనీలో ఉన్న శివాలయానికి వెళ్తాను. దేవాలయాలుæ నెగిటివ్ థింకింగ్‌ని దూరం చేసే ఒక్క చక్కటి వ్యవస్థ. అక్కడకు వెళ్తే మనసు నిర్మలంగా ఉంటుంది. దైవం పట్ల భక్తి గొప్పదా? భయం గొప్పదా? దేవుడికి భయపడటం సరి కాదు. దేవునికి ప్రేమించాలి. దేవుడిలో మమేకం కావాలి. దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడి దగ్గర చనువు ప్రదర్శించగలగాలి. దేవుడి పట్ల భయం ప్రదర్శిస్తూ దూరం ఉండేకంటే దేవుని దగ్గర నిష్కపటంగా సర్వసన్నిహితంగా ఉండటం సరిౖయెనదని నేను భావిస్తాను. దైవారాధన చేయాల్సింది భయంతో కాదు భక్తితో. రోజూ దేవుణ్ణి దర్శించడం, గుడికి వెళ్లడం, లేదా దైవ నామస్మరణ చేయడం వల్ల మనకు ఆత్మశక్తి వస్తుంది. దేవుడు ఉన్నాడన్న భరోసా వస్తుంది. దాని వల్ల జీవితంలో ఎదురైన కష్టనష్టాలు ఎదుర్కొంటాం. దైవం ఉన్నది ఆయన నుంచి శక్తి పొందడానికి. కోరికల కోసం వరాల కోసం బేరసారాలు చేయడం కంటే మన జీవితం ఆయనకు వదిలిపెట్టి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటూ వెళ్లడం సరైనదని నేను భావిస్తాను. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మికతకు ప్రత్యేకంగా నిర్వచనం అంటూ లేదు. నా దృష్టిలో తోటి వారికి అపకారం చేయకుండా చేతనైన సహాయం చేస్తూ జీవించడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక గ్రంథాలు దైవ జ్ఞానాన్ని, దైవ స్పృహను కలిగిస్తాయి. ఆ క్రమంలో మనల్ని మనం కూడా తెలుసుకుంటాం. విశ్వశక్తిని, మానవశక్తికి సమన్వయం చేసుకుంటూ మానవ కల్యాణానికి ఉపక్రమించడమే అసలైన ఆధ్యాత్మికత అని నేను అనుకుంటాను. మీ ఇంట్లోనూ ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది? నా భార్యకు దైవభక్తి ఎక్కువ. ఇప్పటికి మూడుసార్లు రామకోటి రాసింది. మూడోసారి రాసిన రామకోటిని ఇటీవలే భద్రాద్రి రాముడికి సమర్పించాం. అలాగే ఇంట్లో మా కోడళ్లు కూడా పూజలు చేస్తారు. జర్మనీలో స్థిరపడిన మా మనవరాలు కూడా నిత్యం పూజలు చేస్తుంది. నేను దైవస్మరణ చేస్తానే తప్ప నేను ప్రత్యేకంగా కూర్చొని పూజ, జపం చేయను. ప్రవచనాలు ఎక్కువగా వింటారట? ప్రవచనాలు వినడం మాకు చాలా ఇష్టం. మల్లాది చంద్రశేఖరశాస్త్రి, సామవేదం షణ్ముఖశర్మ, సుందర చైతన్యానంద, చినజియ్యర్ స్వామి, చిన్మాయానంద, పార్థసారథి, దయానంద సరస్వతి, చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఎక్కడ ఉన్నా వెళ్తాం. ప్రవచనం ఎక్కడ జరిగినా ఏదో మూల కూర్చొని ప్రశాంతంగా విని ఇంటికి వెళ్లడం ఆనందం. అంతే కాని సత్సంగలో చేరడం స్వామి వారు రాగానే పూలు జల్లడం నాకు తెలియదు. మనుషుల్లో మీరు చూసిన దైవత్యం? ఎదుటవారికి సాయం చేయాలనే గుణం ఉన్న ప్రతి ఒక్కరిలోనూ దైవత్వం ఉన్నట్టే. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిలోనూ దైవత్యం ఉన్నట్టే. జీవితంలో బాగా బాధపడిన సందర్భాలు? నా కుమారుడు శ్రీనివాస్ చనిపోయిన ఘటన నా జీవితంలో చేదు జ్ఞాపకం. ఎంతో సంతోషంగా సాగుతున్న మా జీవితంలో వాడి మరణం మాకు తీరని లోటు. అది ఎప్పటికి పూడ్చలేనిది. రచనా రంగంలో ఎప్పుడు అడుగుపెట్టారు? కళాశాల సమయంలోనే చిన్న చిన్న రనలు చేసేవాడిని. నా రచనలు చూసి నా మిత్రులు, అధ్యాపకులు ఎంతగానో ప్రోత్సహించేవారు. ఎప్పటికైనా నువ్వు గొప్ప రచయిత అవుతావని వెన్ను తట్టేవారు. నాలో నటుడు కూడా ఏయూలో చదువుతున్నప్పుడే బయటకొచ్చాడు. ఎన్నో నాటకాలు వేసే వాళ్లం. ఆల్ ఇండియా రేడియోలో చేరిన రెండేళ్లకు అనుకోకుండా సినీ రచయతగా అవకాశం వచ్చింది. కడపలో పనిచేసే రోజుల్లో సినిమాల్లోకి రచయితగా వచ్చాను. డాక్టర్ చక్రవర్తి సినిమాకు స్క్రీన్‌ప్లే రాసాను. ఆ తర్వాత ఆత్మగౌరవం సినిమాకు రాసాను. అప్పుడు నా వయస్సు 24 ఏళ్లు. నేడు 78 ఏళ్లు. అంటే 54 ఏళ్లుగా సినిమాలకు రచనలు చేస్తూనే ఉన్నా. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుణ్ణయ్యాక ఇప్పటికి 290 సినిమాల్లో నటించా. నటిస్తూనే ఉన్నా. చిన్నప్పట్నుంచీ పూజలంటే చాలా ఇష్టం. పెళ్లయిన తర్వాత కూడా వాటిని కొనసాగిస్తూ వచ్చాను. అందరి దేవుళ్లనూ పూజిస్తాను. ఫలానా దైవం అంటూ ఏమీలేదు. నా భర్తతో కలిసి అన్ని తీర్థయాత్రలు పూర్తిచేశాను. మూడుసార్లు రామకోటి రాశాను. నా జీవితాంతం రాస్తూనే ఉంటాను. – శివకామ సుందరి మీ పిల్లలకు దైవం గురించి ఎలాంటి విషయాలు చెబుతారు? ఏ దైవాన్ని కొలిచినా అభ్యంతరం చెప్పను.కాని దైవచింతనతో గడపని చెబుతాను. దేవుని పట్ల భక్తి, ఇంకొకర్ని ఇబ్బంది పెట్టని ప్రశాంతంగా జీవనం సాగించమని చెబుతా. అదే నేను నేర్చుకున్న జీవిత సత్యం. అదే నా జీవన మార్గం. – పంపన వరప్రసాదరావు -
అవినీతి అనకొండలు
జీవన కాలమ్ పత్రికలు ఇవాళ పెద్ద అక్షరాలతో వార్తలు చెప్తాయి. ఇçప్పుడు బయటపడింది బెల్లం ముక్క. ఆయన్ని పట్టుకున్నవారు కూడా ‘రుచి’ తెలిసినవారే. వారిని శంకించడం, అనుమానించడం ఉద్దేశం కాదు. ఈ మధ్య అతి తరచుగా అవినీతిపరులయిన అధికారులని పట్టుకునే సందర్భాలు కోకొల్లలుగా పత్రికల్లో కనిపిస్తున్నాయి. ఇదేమిటి? ఈ దేశం ఉన్నట్టుండి ఇంత నిజాయితీగా మారిపోయిందా అని ఆశ్చర్యమూ, అనుమానమూ కలుగుతోంది. పత్రికలు చదివేవారికి ఈపాటికే కొన్ని పేర్లు కంఠస్థమయిపోయాయి. జిల్లా రివెన్యూ అధికారి గణేశ్, విజయవాడ పబ్లిక్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీరు పాము పాండురంగారావు, నెల్లూరు జిల్లా రవాణాశాఖ ఏవో కృష్ణకిశోర్ ఇవాళ శీలం సూర్యచంద్రశేఖర అజాద్ అనే దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్. అసలు దేవాదాయ శాఖే వివాదాస్పదమైన ఏర్పాటు. చక్కగా తమ మతాన్నో, దేవుడినో నమ్ముకున్న భక్తుల డబ్బుని దోచుకోవడానికి ఈ ‘అజాద్’ల దరిద్రం ఎందుకు? పోనీ, ఈ పని అన్ని మతాలవారి విషయంలో–ముస్లింలు, క్రైస్తవులు, జైనుల విషయంలో చేస్తున్నారా? భారతదేశంలో హిందువులకే ఈ ‘అజాద్’ దరిద్రం ఎందుకు పట్టాలి? అద్భుతంగా నిర్వహించబడుతున్న ఎన్నో ఆలయాలు–దేవాదాయ శాఖ అధికారుల పాలిటబడి – ఆయన నాలుగైదు ఆలయాలకు ఒకే అధికారి అయిన పాపానికి కనీసం దీపానికి నోచుకోని సందర్భాలు నాకు తెలుసు. ఎందుకు ఈ ఆఫీసర్లు? ఒక్క ‘అజాద్’ చాలడా మన పాలక వ్యవస్థ నిస్సహాయతను, నిర్వీర్యతను చెప్పడానికి! 50 కోట్ల ఆదాయం, తన నౌకర్ల పేరిట ఒక సోలార్ ప్రాజెక్టు, లక్షల రొక్కం, కోట్ల విలువైన ఆస్తులు–ఎన్నాళ్ల బట్టి ఈ ప్రభుత్వం కళ్లు మూసుకుంటే ఈ ‘అజాద్’ దోపిడీ సాధ్యమయింది? వీరు ఈ దేశానికి నిర్భయ దోషుల కన్నా చీడపురుగులు కదా! దేవుడి ఆదాయాన్ని నంచుకుతినే ఒక ‘నీచ’పు ఉద్యోగికి ఏమిటి శిక్ష? తమ హక్కు అయిన పట్టా పాసుబుక్కుల కోసం లంచం ఇవ్వలేని చిన్న చిన్న రైతు కుటుంబాల వారు రోజుల తరబడి – చిన్న రివెన్యూ ఉద్యోగుల ‘లంచం రాయితీ’ల కోసం ఎమ్.ఆర్.ఒ. ఆఫీసుల దగ్గర చెట్ల కింద వంటలు చేసుకుంటూ బతకడం నేను స్వయంగా చూశాను. ఈ ఉద్యోగుల ఫొటోలు పత్రికల్లో వేస్తే సరిపోతుందా? వీళ్లందరినీ బట్టలు విప్పి ఊరేగించాలి కదా! ఈ దుర్మార్గుల కోసం నిర్భయ కంటే భయంకరమైన చట్టం తేవాలి కదా! నలుగురి దుశ్చర్య కారణంగా ఒక నిర్భయకి అన్యాయం జరిగింది. దేవుడి సొమ్ముని, ప్రజల విశ్వాసాన్ని ఎన్ని సంవత్సరాలుగా దోచుకుతింటున్న ఈ కమిషనర్ గారికి ఏం శిక్ష వెయ్యాలి? గణేశ్ అనే మహానుభావుడిని ఎలా సత్కరించాలి? కింది స్థాయిలో మూగగా దోపిడీకి గురవుతున్న జనానికి ఈ అవినీతిపరుల నుంచి విముక్తి లభించనంత వరకు నోట్ల రద్దు జరిగినా, పట్టిసీమ, పోలవరాలు నీళ్లు తోడినా ప్రజలు సంతోషించరు. దేశంలో సంస్కరణలకు కంకణం కట్టుకున్న మోదీగారికి వారి అనుచరులు చెప్పాలి. తమరు చేస్తున్న సంస్కరణలు– రోజూ పట్టెడు కూడుకు యాతన పడేవారికి అర్థం కావు. వారిని అనుక్షణం దోచుకుంటున్న గణేశ్‌లు, అజాద్‌లు, పాండురంగారావుల బారి నుంచి కాపాడండి. అప్పుడు వ్యవస్థ మీద విశ్వాసం పెరుగుతుంది. మా దేవుడిని ఈ అనకొండల బారి నుంచి విడుదల చేయండి. ఈ దేశంలో మీ సౌహార్దతకు నోచుకున్న ముస్లిం, క్రైస్తవ, జైన సోదరుల పాటి సంయమనాన్ని హిందువులూ పాటించగలరు. మాలో చిన్న అవినీతిపరులున్నా – ఏనాడయినా పాలకవర్గం మా మీద రుద్దిన ‘అజాద్’ స్థాయికి రారు. పత్రికలు ఇవాళ పెద్ద అక్షరాలతో వార్తలు చెప్తాయి. సామాన్య పాఠకుడు బుగ్గలు నొక్కుకుం టాడు. ఈ దేశంలో అవినీతికి తగిన శిక్ష పడుతోందని తృప్తి పడతాడు. కానీ తన ఇంటి నౌకర్ల పేరుతో సోలార్ ప్లాంటుని స్థాపించగల ఘనుడు–రోడ్డు మీద పడి అడుక్కు తినడు. తినడని మనందరికీ తెలుసు. ఇప్పుడు బయటపడింది బెల్లం ముక్క. ఆయన్ని పట్టుకున్నవారు కూడా ‘రుచి’ తెలిసినవారే. వారిని శంకించడం, అనుమానించడం ఉద్దేశం కాదు. గణేశ్లూ, పాము పాండురంగారావు గార్లు, దొడ్డపనేని వెంకయ్యనాయుడు, కృష్ణకిశోర్, దేవుడిని అడ్డం పెట్టుకుని దోచుకున్న ప్రస్తుత ‘అజాద్’ కమిషనర్‌గారు బట్టల్లేకుండా వీధుల్లో ఊరేగిన దృశ్యం కళ్ల ముందు కనిపించనప్పుడు–వారు కూరల బజారులో పది మంది దృష్టిలో నిలవలేక తల మీద గుడ్డ కప్పుకు తిరిగినప్పుడు– భక్తితో దేవుని హుండీలో రూపాయి వేసి దండం పెట్టిన మామూలు మనిషికి కనీస తృప్తి అయినా మిగులుతుంది. చాలా సంవత్సరాల కిందట మా అబ్బాయి మెర్సిడిస్ కారు కొన్నాడు. మెర్సిడిస్, ఆడి కార్లున్న వారి మీద ఆదాయ శాఖ దాడి– ఆనవాయితీట. ఒక తమిళ ఇన్‌కం ట్యాక్స్ అధికారి వచ్చాడు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ– ‘‘బాబూ! ఈ ఉద్యోగంలో మేము చేరిన రోజే రెండింటిని ఇంటి దగ్గర మరచిపోయి వస్తాం– సిగ్గు, లజ్జ’’ అన్నాడు. ఇది దాడులు చేసేవారికి సంబంధించిన రెండో పార్శ్వం. గొల్లపూడి మారుతీరావు -
తర్జుమా సమస్యలు
జీవన కాలమ్ నాయకులు తాము అడుగులకు మడుగులొత్తే పార్టీల కుషామత్తు కోసం బాహ్యస్మృతిని మరిచిపోయి, తర్జుమాల ఇరకాటంలో పడి నోటికి వచ్చింది వాగినప్పుడు– ఇలాంటి స్మృతుల చలివేంద్రాలు అవసరం అవుతూంటాయి. కాంగ్రెస్ సీనియర్ నాయ కులు మణిశంకర్ అయ్యర్ నరేంద్రమోదీని ‘నీచ వ్యక్తి’ అనీ, ‘నీచ జాతి’ వాడనీ అన్నారు. రాహుల్ గాంధీ 30 సంవత్సరాలుగా కాంగ్రెస్‌నే కాక గాంధీ కుటుంబానికి ‘విధేయుడి’గా ఉన్న అయ్య ర్ని పార్టీ ప్రాథమిక సభ్య త్వం నుంచే బర్తరఫ్ చేశారు. ఇందులో చాలా అన్యాయం ఉన్నదని నాకు అని పిస్తోంది. అలా అనడానికి అయ్యర్ కారణాలను ఉటం కిస్తూ తనకు హిందీ సరిగ్గా రాకపోవడంవల్ల ఈ అనర్థం జరిగిందని వాపోయారు. ఆయన తన మన స్సులో ‘నీచ’ శబ్దాన్ని ‘కిందిస్థాయి’ వాడనే వాడాలని అనుకున్నారు. ‘నీచ జాతి’ వాడని అనడం ఎంత మాత్రం ఆయన ఉద్దేశం కాదు. ఆయన 30 సంవత్స రాలుగా ఢిల్లీలో ఉంటున్నా, మరో ముప్పై సంవత్స రాలు ఐఏఎస్‌గా అధికారాల్లో ఉంటున్నా వారికి హిందీలో ‘నీచ జాతి’ అనడం ద్వారా నరేంద్ర మోదీ ‘ఉత్కృష్ట జాతి’ వారని చెప్పాలనే ఉద్దేశం. అయితే తన మాతృభాష కాని భాషలో మాట్లాడుతున్నప్పుడు– ఎంత 50 సంవత్సరాల అనుభవం ఉన్నా ‘గొప్ప’ పదానికి ‘నీచ’ పదం దొర్లడాన్ని కేవలం తర్జుమా సమ స్యగానే మనం అర్థం చేసుకోవాలి. తన ‘నీచ’ ప్రసంగం కార ణంగా రేపు గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్‌కి ఎట్టి హాని జరిగినా, ఎటువంటి శిక్షనయినా అనుభవిం చడానికి తాను సిద్ధంగా ఉన్నానని అయ్యర్ వక్కా ణించారు. కాగా, నిన్న దినేష్ వార్షిణీ అనే కమ్యూనిస్టు నాయకులు ఇంగ్లిష్ చానల్ చర్చలో ఈ ‘నీచ’ శబ్దం ఇప్పటిది కాదని మనుస్మృతిలో మనువే ఉపయో గించారని వాకృచ్చారు. ఏతావాతా ఈ పదానికి బ్రాహ్మణ మూలాలున్నాయని వారు తేల్చారు. చాలా మంది గుర్తుంచుకోని విషయం మనువు క్షత్రియుడు. చక్రవర్తి. అయితే ఈ దేశంలో కమ్యూనిస్టు నాయకులు కారల్‌మార్క్స్ నుంచి మనువుదాకా అందరినీ ఆపో శన పట్టినందుకు మనం గర్వపడాలి. లోగడ సోనియా గాంధీ కూడా మోదీ విష యంలో ఈ ‘నీచ’ శబ్దాన్ని వాడారట. మరి రాహుల్ గాంధీ మణిశంకర్ అయ్యర్ కంటే ముందు తమ తల్లి గారిమీద క్రమశిక్షణ చర్యని తీసుకోవాలి కదా? అని ఒక నాయకులు ప్రశ్నించారు. మోదీని కాంగ్రెస్ నాయకులు ఇదివరకే ‘గూండా’, ‘నపుంసకుడు’ వంటి ముద్దు పేర్లతో పిలు చుకుని మురిసిపోయారు. అయితే ‘నపుంసకుడు’ అనడంలో వారికి అర్ధనారీశ్వరుడనే స్మృతి ఉన్నదనీ, ‘గూండా’ని 500 బీసీ నాటి ఐతరేయ బ్రాహ్మణంలో ఇదివరకే వాడారని మనకు తెలియకపోవచ్చు. ఈ విష యాన్ని మనం కమ్యూనిస్టు నాయకులనడిగి తెలుసు కోవాలి. మణిశంకర్ అయ్యర్ తన క్షమాపణని కుంచిం చుకుపోయి, తలవంచుకుని, కన్నీటి పర్యంతం అయి చెప్పలేదు. గర్వంగా, ధైర్యంగా, స్పష్టంగా తనకు హిందీ తర్జుమా సమస్యలున్నాయని వెన్నెముక నిట్ట నిలువుగా నిలిపి చెప్పారు. ఇది తప్పనిసరిగా కాంగ్రెస్ వారసత్వం. కాంగ్రెస్ నాయకులు ఏ పని చేసినా కుంచించుకుపోరు. సిగ్గుపడరు. లోగడ 31 కుంభకో ణాల్లో ఏ కాంగ్రెస్ నాయకులూ సిగ్గుతో కుంగి పోవ డాన్ని మనం గమనించలేదు. ఇది వారి డీఎన్ఏలో ఉన్న శక్తిగా మనం అంగీకరించాలి. అన్నిటికన్నా గొప్ప బూతుని కాంగ్రెస్ నాయ కులు దిగ్విజయ్ సింగ్ తమ ట్వీటర్లో ప్రకటించారు. మోదీ ‘‘.... వారిని భక్తుల్ని చేస్తారు. భక్తుల్ని... గా మారుస్తారు’’ అన్నది వారి తాత్పర్యం. ఈ ‘....’ మాట పత్రికలో ప్రకటించడానికి వీలు లేనంత బూతు. అయితే ‘ఇది నేనన్న మాట కాదు. ఎవరో అన్న మాటని నేను ఉదహరించాను’ అన్నారు సింగ్. ఎంగిలి చేసి నంత మాత్రాన ‘బూతు’కి అర్థం మారదు. ఈ వ్యవహారం వల్ల ఒక్క విషయం మనకి అర్థమవుతోంది. కాంగ్రెస్ వారికి తర్జుమా సమస్య లున్నాయి. వారు– భాష సరిగా రాకపోవడం వల్ల ‘నీచ’ పదాన్ని– కమ్యూనిస్టు నాయకుల మాటల్లో– ‘మనుస్మృతి’లో ఉన్న పవిత్రమైన ‘బ్రాహ్మణ’ పదాన్ని దుర్వినియోగం చేశారని. ఈ సందర్భంగా నాకు ఈ రాజకీయ నాయ కులకు ఒక సలహా చెప్పాలని అనిపిస్తోంది. ఎప్పుడైనా తమరు ‘నీచ’ వంటి శబ్దాన్ని వాడాలనుకున్నప్పుడు లేదా దిగ్విజయ్ సింగ్ ప్రకటించినట్టు ‘...’ ప్రచురణకు లొంగని మాట ఏదైనా వాడినప్పుడు కమ్యూనిస్టు నాయకులను సంప్రదించి ఆయా మాటలు ‘పరాశర స్మృతి’, ‘యాజ్ఞ్యవల్క్య స్మృతి’, ‘గౌతమ స్మృతి’, ‘అప స్థంబ స్మృతి’ వంటి వాటిలో ఉన్నాయో లేదో తెలు సుకోవాలని నా మనవి. నాయకులు ఉచ్చం, నీచం మరచిపోయి, తాము అడుగులకు మడుగులొత్తే పార్టీల కుషామత్తు కోసం బాహ్యస్మృతిని మరిచిపోయి, తర్జుమాల ఇరకాటంలో పడి నోటికి వచ్చింది వాగినప్పుడు–ఇలాంటి స్మృతుల చలివేంద్రాలు అవసరం అవుతూ ఉంటాయి. ఇది ఆయా నాయకుల నీచమైన కుమ్మక్కుకి నిదర్శనం. (ఇక్కడ ‘నీచ’ శబ్దానికి తర్జుమా సమస్య లేదు– తమరు గ్రహించాలి). గొల్లపూడి మారుతీరావు -
స్టార్ట్ కెమెరా అనలేకపోయా– గొల్లపూడి మారుతీరావు
‘‘యాభై మూడేళ్ల కిందట మంచి కథ, సినిమాకి మేం ప్రాధాన్యం ఇచ్చేవాళ్లం. డబ్బులొస్తాయా? రావా అనే ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడు సినిమా సక్సెస్ అవుతుందా? డబ్బులొస్తాయా? రావా? అనే వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అన్నారు నటులు గొల్లపూడి మారుతీరావు. కార్తికేయ, సిమ్రత్ జంటగా రిషి దర్శకత్వంలో రవీందర్ ఆర్. గుమ్మకొండ నిర్మించిన ‘ప్రేమతో మీ కార్తీక్’లో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా గొల్లపూడి మాట్లాడారు. ‘‘నేను రెగ్యులర్‌గానే సినిమాలు చేస్తున్నా. కాకపోతే నా వయసుకి తగ్గట్టు ఎక్కువ సినిమాలు చేయడం లేదంతే. ప్రస్తుత సినిమాల్లో నాకు తగ్గ పాత్ర ఉంటేనే అవకాశం ఇస్తున్నారు. ‘ఈ మధ్య కాలంలో కథలు చెప్పకపోయినా ఫర్వాలేదులే’ అనేంత మంచి సినిమాలొస్తున్నాయి. అంటే విమర్శించడం లేదు. ప్రేక్షకులకు ఏం చూపిస్తే హ్యాపీగా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. ‘ప్రేమతో మీ కార్తీక్’ మూడు తరాలకు చెందిన చక్కని కుటుంబ కథా చిత్రమిది. అమెరికాలో ఎంతో సంపాదించిన హీరో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. అతనేం చేశాడన్నది ఆసక్తికరం. కొత్త దర్శకులు, నిర్మాతలు వచ్చినప్పుడు సరికొత్త ఆలోచనలు, కొత్త సినిమాలొస్తాయి. డిజిటల్ రంగాన్ని నేటి తరం బాగా వినియోగించుకుంటున్నారు. 50 ఏళ్ల క్రితం ‘బాహుబలి’ని ఊహించలేం’’ అన్నారు. నా దర్శకత్వం ఓ గొప్ప విషాదానికి గుర్తు సక్సెస్ఫుల్ రైటర్ అయిన మీరు ఎందుకు దర్శకత్వం చేయలేదు? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘నా జీవితంలో దర్శకత్వం అన్నది ఓ గొప్ప విషాదానికి గుర్తు. మా అబ్బాయి ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ప్రమాదవశాత్తు 9వ రోజే చనిపోయాడు. ఆ సమయంలో ఆ సినిమా దర్శకత్వ బాధ్యతలు నేను చేపట్టి ఫస్ట్ టైమ్ ‘స్టార్ట్ కెమెరా’ అన్నాను. ఆర్నెల్లకు షూటింగ్ పూర్తయింది. చివరిరోజు షూటింగ్లో ‘స్టార్ట్ కెమెరా’ అనలేకపోయా. కారణం కొడుకు చనిపోయాడనే బాధ. అప్పటి నుంచి దర్శకత్వం ఆలోచనే లేదు’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ అశోక్‌రెడ్డి గుమ్మడికొండ, సంగీతం: షాన్ రెహమాన్, సమర్పణ: రమణ శ్రీ గుమ్మకొండ, గీతా మన్నం. -
శాశ్వతంగా నిలిచేది అక్షరమే
హైదరాబాద్: అక్షరం ఎప్పుడూ శాశ్వతంగా నిలుస్తుందని ప్రముఖ సినీ నేపథ్య్గ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. గోకుల్చంద్ర, రాహుల్‌చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొల్లపూడి మారుతీరావు సంపాదకత్వంలో రూపుదిద్దుకున్న 116 మంది ప్రముఖ కథా రచయితల వైభవ దీపిక ‘వందేళ్ల కథకు వందనాలు’ గ్రంథావిష్కరణ సభ సోమవారం రాత్రి నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు కళామందిరంలో జరిగింది. సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం హాజరై గ్రంథాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. తొలిప్రతిని కొండూరి రామ్మూర్తికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి, విజయ్ నిర్మాణ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయితలను ఘనంగా సత్కరించారు. -
ఈ చరిత్ర ఏ సిరాతో!
♦ జీవన కాలమ్ మహానుభావులు– తమ జీవితంలో ఎల్లలు లేని ప్రాముఖ్యాన్ని సాధించిన మహానుభావులు– జీవితంలో నష్టపోయే విలువైన ఆస్తి పేరు ప్రశాంతత. ఇది వారు తమ తమ ‘జీనియస్’కి చెల్లించే మూల్యం. నేను దినపత్రికలో పనిచేసే రోజుల్లో ‘ఊమెన్’ అనే కార్టూనిస్టు విరివిగా కార్టూన్లు వేసేవాడు. వాటి విమర్శ వాడిగా, వేడిగా ఉండేది. తరుచు ఈ విమర్శకు గురయ్యే నాయకులు– ఆ రోజుల్లో స్వతంత్ర పార్టీ స్థాపకులు చక్రవర్తి రాజగోపాలాచారిగారు. ఓసారి ఎవరో పాత్రికేయుడు రాజాజీని అడిగాడు, ‘ఊమెన్ కార్టూన్ల గురించి మీ అభిప్రాయమేమి’టని. ఇది ఓ పెద్ద నాయకుడి మీద కావాలని కాలు దువ్వడం. రాజాజీ గొప్ప మేధావి. చమత్కారం ఆయన సొత్తు. ఆ ప్రశ్నకు సమాధానంగా , ‘నేను అడ్డమయిన వారి మీదా నా అభిప్రాయం చెప్పను. చెప్తే వారు పాపులర్ అవుతారు’ అన్నారు. ఇప్పుడు మరో అరుదయిన కథ. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు, సాపేక్ష సిద్ధాంతానికి ఆద్యుడు అల్బర్ట్ ఐన్‌స్టీన్ 1922లో జపాన్ వెళ్లారు, ఉపన్యాసాలు ఇవ్వడానికి. అంతకు కొద్దికాలం ముందే భౌతికశాస్త్రానికి ఆయనకి నోబెల్ బహుమతిని ప్రకటించారు. అప్పట్లో ఆయన పరపతి ప్రపంచమంతా మార్మోగుతోంది. టోక్యోలో ఆయన ఉన్న ఇంపీరియల్ హోటల్‌కి ఒక సందేశాన్ని ఆయనకు అందజేయడానికి ఒక వార్తాహరుడు వచ్చాడు. అప్పటి సంప్రదాయం ప్రకారం ఈ వార్తాహరుడు చిన్న పారితోషికాన్ని పుచ్చుకోవడానికి తిరస్కరించాడు. లేక చిన్న పారితోషికానికి ఐన్‌స్టీన్ దగ్గర చిల్ల రలేదో! ఆయన్ని ఉత్త చేతుల్తో పంపడం ఐన్‌స్టీన్‌కి ఇష్టం లేదు. అప్పుడు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఏం చేయాలి? హోటల్ కాగితం మీద ఓ సందేశం రాసి ఇచ్చారు. టోక్యో ఇంపీరియల్ హోటల్ కాగితం మీద ఆయన రాసిన సందేశం, ‘విజయాన్ని వేటాడే గందరగోళం కన్నా, సరళమయిన జీవితం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది’ అని. అనుకోకుండా, అసంకల్పితంగా చేసిన కొన్ని పనులు కళాఖండాలయిపోతాయి. చరిత్రలుగా నిలుస్తాయి. ఇప్పుడీ కాగితం విలువ కొన్ని లక్షల డాలర్లు. 95 సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ సందేశం ఉన్న కాగితాన్ని వేలం వేయనున్నారు. ఐన్‌స్టీన్ యూదులు. జెరూసలేం హిబ్రూ విశ్వవిద్యాలయంలో ఆయన జ్ఞాపికలు చాలా ఉన్నాయి. ఎన్నో శాస్త్రానికి సంబంధించిన విలువైన దస్త్రాల మధ్య – అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించిన ఒక మహానుభావుడి వ్యక్తిగత ‘ఆలోచన’లకు అద్దం పట్టే ఈ సందేశం చాలా విలువైనది. ఇలాగే మరో విలువైన చరిత్రను సృష్టించే చిత్రం కథ. ప్రముఖ చిత్రకారులు, ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కుమారుడు బుజ్జాయిగారు 1946లో ఎలియట్స్ రోడ్డులో శాస్త్రిగారి అభిమాని తిరుపతిగారితో నడుస్తున్నారట. రోడ్డు మీద కారులో వెళ్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తిరుపతిగారిని చూసి కారు ఆపారట. తిరుపతిగారు రాధాకృష్ణన్ గారి శిష్యుల్లో ఒకరు. ఇద్దర్నీ కారెక్కించుకుని ఇంటికి తీసుకెళ్లారు. తిరుపతిగారు బుజ్జాయిని పరిచయం చేసి, ‘‘మీరలా కూర్చుంటే ఈయన మీ పెన్సిల్ స్కెచ్ వేస్తారు’’ అన్నారట. బుజ్జాయి వేశారు. ఆ బొమ్మ మీద ‘రాధాకృష్ణయ్య’ అని సంతకం చేశారు. దేశానికి ఆయన ‘రాధాకృష్ణన్’ గానే తెలుసు. బహుశా అదొక్కటే తెలుగు ‘రాధాకృష్ణయ్య’ గారికి అభిజ్ఞగా మిగిలిన అరుదైన బొమ్మ. విచిత్రం ఏమిటంటే తరువాతి కాలంలో ఆయన దేశ ఉపా«ధ్యక్షులయ్యారు. మరో17 సంవత్సరాల తర్వాత బుజ్జాయిగారికి కొడుకు పుట్టాడు. మరో యాభై సంవత్సరాల తర్వాత రాధాకృష్ణన్ గారి మనుమరాలు ఆయన కోడలయింది. మరో ప్రపంచ ప్రఖ్యాత మహా నటుడు చార్లీ చాప్లిన్ అమెరికాలో అఖండమయిన కీర్తిని ఆర్జించాక స్వదేశానికి వచ్చాడు. అతను ఊహించనంత కీర్తి అతనికి దక్కిందని తెలి యదు. వందలాది మంది అతను వస్తున్న రైలు దగ్గర హాహాకారాలు చేస్తూ ఎదురు చూస్తున్నారు. చాప్లిన్ అంటాడు, ‘బయట లక్షలాది మంది అభిమానులు. కానీ రైలు పెట్టెలో నేను నిస్సహాయమైన ఒంటరిని’ అని. మహానుభావులు– తమ జీవితంలో ఎల్లలు లేని ప్రాముఖ్యాన్ని సాధించిన మహానుభావులు– జీవి తంలో నష్టపోయే విలువైన ఆస్తి పేరు ప్రశాంతత. ఇది వారు తమ తమ ‘జీనియస్’కి చెల్లించే మూల్యం. వారితో పోలిస్తే నాది చిన్న జీవితం– ఇటు బళ్లారి, అటు బరంపురం దాటని పాపులారిటీ. నా పాపులారిటీ రెక్కలు విచ్చుకుంటున్న తొలిరోజుల్లో చిలకలూరిపేటలో షూటింగ్ చేసి తెల్లవారితే పూడిపల్లిలో (పోలవరానికి లాంచిలో 30 నిమిషాల ప్రయాణం) ‘త్రిశూలం’ ముహూర్తానికి చేరాలి. రైలు తప్పిపోయింది. ఏం చెయ్యాలో తెలీక– నిస్సహా యంగా– సాహసించి– బస్సు ఎక్కాను. రాజమండ్రిలో దిగి ఉదయం మిత్రుడు శ్రీపాద పట్టాభి ఇంటికి చేరాను. ‘ఎలా వెళ్లారయ్యా?’’ అనడిగారు మిత్రులు రావు గోపాలరావు. ‘‘రిక్షాలో’’ అన్నాను. ఆయన నవ్వి, ‘‘మీ జీవితంలో ఇదే ఆఖరి ప్రయాణమయ్యా. ఇంక రిక్షా ఎక్కే అదృష్టం లేదు’’ అన్నారు. చరిత్ర రచన ఆనాటికి తెలియదు. కాలం వాటి విలువల్ని నిర్ణయిస్తుంది. - గొల్లపూడి మారుతీరావు -
బెల్లం చుట్టూ ఈగలు
జీవన కాలమ్ నన్ను ఉద్ధరించాలంటే – ముందు ఉద్దరించే నాయకుని ‘పెద్దరికం’ నన్ను ఆకట్టుకోవాలి. ప్రపంచానికి సత్యాగ్రహం స్ఫూర్తిని ఇచ్చేవాడు మహాత్ముడే కావాలి. ఒకేరోజు.. ఒకే పేపరులో కథనమిది. – పోలవరం మండల తహసీల్దార్ ఆఫీసులో నిస్సహాయంగా నిర్వాసితులను చేసిన వారికి చేరాల్సిన 80 లక్షల రూపాయల గల్లంతు. ఇది కేవలం నిర్వాసితులను కొత్త వసతులకు చేర్చడానికి కేటాయించిన సొమ్ము. ఇందులో తహసీల్దారు మెరుగు ముక్కంటి అనే మహానుభావుడి పేరుంది. వీళ్లని బస్సుల్లో తరలించడానికి ఈ ఖర్చు అయిందన్నారు. తీరా ఆ బస్సుల యజమానులను పలకరిస్తే– మాకేం సంబంధం లేదన్నారు. అప్పుడు చెప్పిన విషయం – వీళ్లని మినీ లారీల్లో, ట్రాక్టర్లల్లో తరలించామని. మరి అలా రాశారేం? కలెక్టర్ సంతకాలు ఎలా చేశారు?! – బొమ్మరిల్లు చిట్ ఫండ్స్వారు 1.46 లక్షల మంది కట్టిన 95.11 కోట్లను తినేశారు. భక్త రామదాసు మాటల్లో: ‘ఎవడబ్బ సొమ్ము?’ – విజయవాడ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ రఘు, మున్సిపల్ కార్పొరేషన్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ శివప్రసాద్, వారి సతీమణి గాయత్రి కలసి కేవలం వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టారు. 500 కోట్ల బినామీ కంపెనీలను సృష్టించారు. రోడ్లు, బిల్డింగ్‌ల చీఫ్ ఇంజనీర్ మాలే గంగాధరం కేవలం 100 కోట్లు అక్రమ సంపాదనను చేశారట. సరే, జూన్‌లో ప్రజారోగ్యం, మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చీఫ్ పాము పాండురంగారావుకి హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో కేవలం 100 కోట్ల సామ్రాజ్యం ఉన్నదట. మొన్ననే ‘గణేశ్’అనే ప్రబుద్ధుడి నిర్వాకాన్ని చదువుకున్నాం. పోలవరం జాతీయ సంపదగా ముఖ్యమంత్రి గర్వపడుతూంటే మరొక పక్క తమ నివాసాలు, ఉపాధులు పోగొట్టుకున్న చిన్నచిన్న గ్రామీణులను కనీసం కేటాయించిన స్థలాలకు చేర్చాల్సిన ధనాన్ని గల్లంతు చేసే అధికారుల ‘నీచమయిన’అవినీతి సాగిపోతోంది. పెద్దలు రాజధానుల్లో నిజమైన సంస్కరణలకు, ఉపకారాలకు శ్రీకారం చుడుతున్నారు. మన రఘు, శివప్రసాద్, ముక్కంటి, గణేశ్ మొదలైన ప్రబుద్ధులు వ్యక్తిగత సామ్రాజ్యాలను సృష్టించుకుని రాజ్యాలు ఏలుతున్నారు. తర్వాత ఏమవుతుంది? ఏమీ కాదు. వెయ్యి కోట్లు దోచుకున్న అధికారి ఎక్కడ ఉంటాడు? ఆనందంగా తన బంగళాలోనే ఉంటాడు. అవినీతి చేసేదీ, చూసేదీ ‘మనుషులే’నని గుర్తుంచుకుంటే – బెల్లం రుచి అందరికీ వర్తిస్తుంది. ఈగలకి విచక్షణ ఉండదు. మనదేశంలో నిర్భయ సంఘటనకి దేశం అట్టుడికిపోయింది. గట్టి ‘నిర్భయ’చట్టం రూపుదాల్చింది. అయినా నిర్భయంగా మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. చట్టానికీ అమలుకీ మధ్య– బెల్లానికీ ఈగలకీ ఉన్న బంధుత్వం ఉంది. ఈ మధ్య నాకెవరో ఒక వీడియో పంపించారు. ఏదో అరబ్ దేశంలో ఓ వ్యక్తి ఓ చిన్న పిల్లని మానభంగం చేశాడు. అంతే. అతని చేతులు వెనక్కి కట్టి వీధిలోకి తీసుకొచ్చారు. ప్రజలు నోళ్లు కొట్టుకుంటూ చూస్తున్నారు. నేలమీద బోర్లాపడిన ఆ వ్యక్తి తలమీద ఒక జవాను తుపాకీని పెట్టి నాలుగు సార్లు కాల్చాడు. అక్కడితో అయిపోలేదు. తర్వాత ఆ శవాన్ని అందరూ చూసేలాగా రోడ్డు మీద వేలాడదీశారు. మరి మన మానవ హక్కుల సంస్థవారు ఏమంటారు? ఓ అమ్మాయి హక్కు గొప్పదా? ఆమెని చెరిచిన ఈ చండాలుడి హక్కు గొప్పదా? ఒకాయన ఒక కులం వారిని దుయ్యబడుతూ పుస్తకం రాశాడు. ఈ దిక్కుమాలిన దేశంలో ‘అభిప్రాయ స్వేచ్ఛ’ వారికి హక్కు. ఆ కులాల వారు వ్యతిరేకించారు. ఈ ఫలానా వ్యక్తికి ఏమయినా జరిగితే రెండు తెలుగు దేశాల్లో మంటలు లేస్తాయని ఒకానొక పార్టీ నాయకులు వాక్రుచ్చారు. మరి వీరి ‘కుల పిచ్చి’ గురించి ముందుగా మాట్లాడలేదేం? అది వీరి పరిధిలోకి రాదా?. యంత్రాంగంలో అవినీతిని గుర్తుపట్టడం ఒక దశ. ఆ గుర్తుని చెరిపేసే అవినీతి చాపకింద నీరు. గత ఏడెనిమిది సంవత్సరాలలో ఇలా పట్టుబడిన ఒక్క అధికారి జైలుకి వెళ్లిన దాఖలాలు మనకి తెలీదు. కానీ అవినీతి చేసేవారికి తెలుసు. తర్వాత ఏం చేయాలో వారికి తెలుసు. ఏం జరుగుతుందో పట్టుకునేవారికీ తెలుసు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. ఇంకా తొందరపడితే మొహం పగులుతుంది. నన్ను ఉద్ధరించాలంటే– ముందు ఉద్దరించే నాయకుని ‘పెద్దరికం’ నన్ను ఆకట్టుకోవాలి. ప్రపంచానికి సత్యాగ్రహం స్ఫూర్తిని ఇచ్చేవాడు మహాత్ముడే కావాలి. వ్యవస్థ నీతి వ్యక్తి శీలానికి మార్గదర్శకం. అరబ్ దేశంలో చట్టాన్ని ఎదిరించినప్పటి శిక్ష భయపెడుతుంది. మన దేశంలో శిక్ష మనల్ని కితకితలు పెడుతుంది. 2013లో తన సహచరి మీద అత్యాచారం చెయ్యాలనుకున్న తరుణ్ తేజ్‌పాల్ మీద 2017లో చార్జిషీటు దాఖలయింది! – ఇదీ మన దేశంలో న్యాయవ్యవస్థ నిర్వాకం. మన రఘు, శివప్రసాద్, ముక్కంటి, మొన్నటి గణేశ్ ఇలాంటి దిక్కుమాలిన కాలమ్స్ చదివి నవ్వుకుంటారు. వారి నవ్వులకి పెట్టుబడి ఈ వ్యవస్థ చేతికి గాజులు. గొల్లపూడి మారుతీరావు -
తెలంగాణా లెస్స
రేపు బీజేపీ పదవిలోకి వస్తే ప్రజలమీద హిందీని రుద్దుతారేమోనన్న భయాన్ని రెచ్చగొట్టి బీజేపీ రాష్ట్రంలో స్థిరపడకుండా చేసే ఎత్తు ఇది– అని ఒక బీజేపీ నేత అభివర్ణించారు. ఇలాంటి సైంధవుల్ని మనం సులువుగా క్షమించవచ్చు. ఒక జోక్ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఎవరైనా ఇద్దరు ఎక్కడయినా అర్థంకాని భాషలో మాట్లాడుకుంటుంటే మీకు అనుమానం అక్కరలేదు. వారి ద్దరూ తప్పనిసరిగా తమిళులై ఉంటారు. అలాగే తెలుగునాట ఇద్దరు ఇంగ్లిష్‌లో మాట్లాడుకుంటున్నారనుకోండి. మీకు అనుమానం అక్కరలేదు. వారు తప్పనిసరిగా తెలుగు వారే అయిఉంటారు. ఇది ఇంగ్లిష్ మనకు– ముఖ్యంగా తెలుగువారికి ఇచ్చిపోయిన జాడ్యం. ఒకే ఒక్క ఉదాహరణ. 125 సంవత్సరాల కిందట రాసిన ‘కన్యాశుల్కం’లో అగ్నిహోత్రావధాన్లు భార్య సుబ్బమ్మ గిరీశాన్ని అడుగుతుంది. ‘‘బాబూ,మీరూ మా అబ్బాయీ ఇంగ్లిష్‌లో మాట్లాడుకోండి’’ అని. ఇంగ్లిష్‌వాడు మనమీద రుద్దిన కోర్టుల్లో, కేసులు పెట్టుకుని ఆస్తులు గుల్ల చేసుకున్న ఎన్నో కుటుంబాలు– కనీసం ఇంగ్లిష్అయినా తెలిస్తే– కేసుల్లో నెగ్గుకు రావచ్చునన్న వ్యామోహం ఆనాడు అంకురించిన ఆసక్తికి ఊపిరి, అనాటి జీవనానికి ఉపాధికోసం, జీవికకోసం ఇంగ్లిష్‌వాడు మనమీద రుద్దిన అనర్ధానికి 125 ఏళ్లు నిండాయి. ఇంగ్లిష్ గొప్ప భాషే. కానీ మాతృభాషను మింగేసే స్థాయిలోనే ఉండకూడదు. దీనికి పూర్తిగా భిన్నమైన కథ ఒకటి చెప్పాలి. నేను 45 ఏళ్లుగా తమిళనాడులో ఉంటున్నాను. తమిళం అర్థమయేటంత విం టాను. చెప్తాను. కాని చదవలేను. వారానికి పదిసార్లైనా తమిళ ప్రభుత్వాన్ని తిట్టుకుంటాను. కారణం– వారి భాషలో ఆయా వ్యాపారసంస్థలు, కంపెనీల పేర్లు ఉండాలని నిర్దేశించినా– వారి భాషతో బంధుత్వంలేని, రాష్ట్రంలో తప్పనిసరిగా పని ఉన్నమనిషి అవస్థని వారు సుతరామూ పట్టించుకోలేదు. పొరుగువాడి ఇబ్బందిని బొత్తిగా గుర్తించకపోవడం దూరదృష్టి లేకపోవడమేనని వాపోతాను. ఇంకా దురన్యాయం ఏమిటంటే బయటి రాష్ట్రాలవారికి తమ వైభవాన్ని చెప్పడానికి ఏర్పరిచిన పర్యాటక స్థలాలలోనూ వారికి అర్థం కాని తమిళమే ఉంటుంది. ఉదాహరణకి– ఒకప్పుడు చోళ రాజుల కాలంలో వైభవోపేతంగా ఉన్న పూంపుహార్ సముద్ర తీరంలో ఉన్న మ్యూజియంలో ఏ బొమ్మముందైనా ఉన్నభాష ఏమీ మనకి అర్థం కాదు. ఈ ప్రదర్శనలు బయటి ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకులకు ఉద్దేశించినవి. కాని భాషాభిమానం ఆ వైభవాన్ని మరుగున పెడుతుంది. ఇది దూరదృష్టిలేని పాలకుల నిర్ణయాల పరిణామం. దీనికి పూర్తిగా భిన్నం మన తెలుగు దేశంలో మన భాష గోడు. ఎక్కడా ఏ ప్రాంతంలోనూ తెలుగు కని పించదు. చదువుకునే బడుల్లోనూ తెలుగు కానరాదు. కాగా ఇంతవరకూ చెప్తున్న బడులలోనూ తెలుగు బోధన నిలిపివేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పూనుకుని– రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 12 తరగతి వరకూ తెలుగు భాషని నిర్బంధంగా బోధనా భాషని చేయడం ఎంతయినా అభినందనీయం. మళ్లీ ఇందులో మూడు సంస్కరణలున్నాయి. స్కూలు ప్రమేయం లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతీ పాఠశాలలోనూ తెలుగులో తప్పని సరిగా బోధన జరగడం ఒకటి. రాష్ట్రంలో అన్ని వ్యాపార సంస్థలూ– ఏ భాషవారయినా తప్పనిసరిగా సైన్ బోర్డుల మీద తెలుగు ఉంచాలి. ఇదిగో– ఈ సందర్భంలోనే నా మనవి– తప్పనిసరిగా భాషేతరులకి అర్థమయే మరొక భాష– అది ఇంగ్లిష్కానీ, మరేదయినా కానీ ఉంచడం అవసరం. భాషాభిమానం వెర్రితలలు వేయరాదు. ఇందుకు తమిళనాడే హెచ్చరిక. మూడోది మరీ ముఖ్యమైనది. విద్యార్థులకు బోధించే తెలుగు ఏమిటి? ఎవరు నిర్ణయిస్తారు? ఈ విషయం మీదా సీఎం దృష్టిని ఉంచారు. రాష్ట్ర సాహిత్య అకాడమీకి సిలబస్ నిర్ణయించే పనిని అప్పగించారు. ‘‘అయ్యా– మన చిన్ననాటి బాలశిక్షల మీదా, సుమతీ శతకాల మీదా, వేమన శతకాల మీదా దయచేసి దృష్టిని పెట్టండి’’ అని అర్థం చేసుకోగల వీరికి మనవి చేసుకోవచ్చు. ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామమని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ఆంధ్ర రాష్ట్రం కూడా త్వరలో ఈ నిర్ణయం తీసుకోవాలని వారు ఆశించారు. అయితే మన భాషని ఉద్ధరించుకోవడంలోనూ మధ్య వేలు పెట్టే రాజకీయ ఘనులుంటారు. తెలంగాణలోనూ లేకపోలేదు. ఒక బీజేపీ నాయకులు– రేపు బీజేపీ పదవిలోకి వస్తే ప్రజలమీద హిందీని రుద్దుతారేమోనన్న భయాన్ని రెచ్చగొట్టి బీజేపీ రాష్ట్రంలో స్థిరపడకుండా చేసే ఎత్తు ఇది– అని అభివర్ణించారు. ఇలాంటి సైంధవుల్ని మనం సులువుగా క్షమిం చవచ్చు. మరొక ముఖ్యమైన నిర్ణయాన్ని సీఎం ప్రకటిం చారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతీ ఉద్యోగీ తెలుగు పరీక్ష పాసై ఉండాలి. ఆప్పుడే అతనికి ప్రమోషన్ కానీ, ఉద్యోగం స్థిరపరుచుకునే అర్హత కానీ ఉంటుంది. దశాబ్దాల తరబడి ఇంగ్లిష్ భాషా వ్యామోహంలో తలమునకలయిన తెలుగు కుటుంబాలవారిలో చైతన్యాన్ని కలిగించడానికి సిద్ధపడిన తొలిరోజుల్లో కొంత ఇబ్బందిగా కనిపించినా– తప్పనిసరిగా జరగాల్సిన పరి ణామమిది. తెలంగాణ ప్రభుత్వం ముందుగా పూనుకున్నదన్న ఒక్క కారణానికీ– బెట్టుతనానికీ పోకుండా– ఇప్పటికే ఆలశ్యమైన ఈ నిర్ణయాన్ని ఆంధ్ర ప్రభుత్వం కూడా తీసుకొంటుందని ఆశిద్దాం. కష్టపడి తెలుగు మాట్లాడుకోవడాన్ని ఇప్పటికయినా ప్రారంభిస్తే మన మనుమలు కనీసం తెలుగు పద్యాన్ని ఇష్టపడి గర్వంగా చదువుకుంటారు. గొల్లపూడి మారుతీరావు -
'చీకటిలో నీడలు' పుస్తకావిష్కరణ
బ్రాడ్ఫోర్డ్: బ్రిటన్‌లో స్థిరపడిన ప్రముఖ తెలుగు వైద్యులు, ఔత్సాహిక రచయిత డాక్టర్ అచ్యుత రామారావు రచించిన 'చీకటిలో నీడలు' నవలను ఇటీవల ఇంగ్లాండ్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ అచ్యుత రామారావుకు ఇది తొలి నవల అయినప్పటికీ కథనంలో కొన్ని ప్రత్యేకతలు కనబరిచారన్నారు. నాలుగు దశకాల కాలం, ముగ్గురు మిత్రుల విభిన్న జీవన శైలి, నాటి సామాజిక అంశాలను తన దృష్టి కోణంలో చూపేందుకు రచయిత చేసిన ప్రయత్నం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ 'చీకటిలో నీడలు' ప్రతిని స్వీకరించి రచయితను అభినందించారు. ఈ సందర్భంగా రచయిత అచ్యుత రామారావు ప్రసంగిస్తూ.. తన తొలి ప్రయత్నానికి గొల్లపూడి, యార్లగడ్డ లక్ష్మీప్రాసాద్లు అందించిన సహకారం మరువలేనిదన్నారు. -
గొల్లపూడికి ‘జీవన సాఫల్యం’
ఈ నెల 12 నుంచి జాతీయ స్థాయి తెలుగు నాటకోత్సవాలు సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి తెలుగు నాటకోత్సవాలు పాలకొల్లులో ఈ నెల 12 నుంచి ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రతి నిధులు మేడికొండ శ్రీనివాస్ చౌదరి, మానాపురం సత్యనారాయణలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాటకోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావును జీవన సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించనున్నట్లు చెప్పారు. ఈ సభలో ముఖ్య అతిథులుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు, గజల్ శ్రీనివాస్,ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వీసీ ముర్రు ముత్యాల నాయుడు, సినీ పరిశ్రమ నుంచి కోడి రామకృష్ణ, ఆర్పీ పట్నాయక్, హీరో నిఖిల్, భాస్కరభట్ల, అనితా చౌదరి పాల్గొననున్నారని పేర్కొన్నారు. -
ఆప్యాయతకు నిలయం గొల్లపూడి కుటుంబం
తమిళసినిమా: ఆప్యాయత, అనుబంధాలకు నిలయం గొల్లపూడి కుటుంబం అని ప్రఖ్యాత నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మూడో కుమారుడు శ్రీనివాస్ అకాల మరణంతో ఆయన పేరుతో జాతీయ అవార్డును నెలకొల్పారు. 17 ఏళ్లుగా దేశానికి చెందిన ప్రతిభావంతులైన తొలి చిత్ర దర్శకుడిని ఎంపిక చేసి నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందిస్తూ వస్తున్నారు. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు జ్యూరీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2014 ఏడాదికి హిందీ చిత్రం క్యూ దర్శకుడు సంజీవ్ గుప్తాను అవార్డుకు ఎం పిక చేశారు. 18వ గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. ప్రఖ్యాత నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్యక్రమానికి స్థానిక రాయపేటలోని గల మ్యూజిక్ అకాడమీ వేదికైంది. చిరంజీవి చేతుల మీదుగా క్యూ చిత్ర దర్శకుడు సంజీవ్ గుప్తాను ఘనంగా సత్కరించి లక్షన్నర నగదు బహుమతిని అందజేశారు. చిరంజీవి మాట్లాడుతూ కార్యక్రమం చూస్తుంటే కొంచెం బాధగా, కొంచెం సంతోషంగా ఉందన్నారు. గొల్లపూడి మారుతీరావుతో తనకు మొదటి నుంచి సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. ఆయన మంచి నటుడే కాకుండా గొప్ప రచయిత అని కొనియాడారు. తను, నటి సుహాసిని నటించిన కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగా శ్రీనివాస్ పని చేశారని గుర్తు చేశారు. తన కొడుకు పేరుతో మారుతీరావు అవార్డును నెలకొల్పి నూతన దర్శకులను ప్రోత్సహించడం ఆనందంగా ఉందన్నారు. నటి సుహాసిని, దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్, బాలీవుడ్ ప్రముఖ నృత్య దర్శకురాలు ఫరేఖాన్, అనుష్క, లిజి నిర్మాతలు కందేపి సత్యనారాయణ, ఘంట సాల రత్నకుమార్ పాల్గొన్నారు.