పెరంబూరు: గొల్లపూడి మారుతీరావు భౌతికాకాయానికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంతిమయాత్రలో బంధువులతో పాటు పలువురు అభిమానులు పాల్గొన్నారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక టీ.నగర్‌లోని కన్మమ్మపేటలోని శ్మశానవాటికలో శస్త్ర బద్ధంగా గొల్లపూడికి అంత్యక్రియలు జరిగాయి. ఆయన పెద్ద కొడుకు రామకృష్ణ కర్మకాండలను నిర్వహించారు. అంతకుముందు ఇంటి వద్ద పలువురు సినీప్రముఖులు, బంధువులు గొల్లపూడి మారుతీరావు భౌతిక కాయానికి నివాళ్లులర్పించారు.
లబ్ద ప్రతిష్టుడు గొల్లపూడి
గొల్లపూడి మారుతీరావు లబ్దప్రతిష్టుడని ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గొల్లపూడికి అంజలి ఘటించిన బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గొల్లపూడి సతీమణి తనను చూసి మీరు ఆయనకు ఆత్మబంధువు అని అన్నారన్నారు. అది తన భాగ్యంగా పేర్కొన్నారు. గొల్లపూడి తాను నిర్మించిన శుభసంకల్పం చిత్రానికి మాటలు అందించడంతో పాటు ప్రముఖ పాత్రను పోషించారని గుర్తు చేశారు. ఆ చిత్రం ద్వారా ఆయనతో తన పయనం ఆరు నెలలు అద్భుతంగా సాగిందని తెలిపారు. ఆయన భాషా సాంస్కృతికవేత్తతో పాటు మంచి విశ్లేషకుడని కీర్తించారు. అలా ఆయన నుంచి సాంస్కృతిక పరమైన విషయాలను చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఇంట్లో కంటే బయట జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పాల్గొనడాన్ని తాను ఇష్టపడేవాడినని చెప్పారు. ఆయన ఎన్నో జాతీయ, అంతర్జాతీయ విషయాలను చాలా గొప్పగా విశ్లేషించేవారని చెప్పారు. తెలుగు భాష ఏమైపోతుందోనని చాలా మంది బాధ పడుతుంటారన్నారు. నిజానికి భాష ఎక్కడికీ పోదన్నారు. గొల్లపూడి లాంటి వారు ఉన్నంత వరకూ భాషకు కలిగే ముప్పేమీ లేదన్నారు. గొల్లపూడి మహా ప్రతిభామూర్తి అని పేర్కొన్నారు. గొప్ప చేతన, శ్రేయస్సుకారుడని అన్నారు. గొప్పవారు లేని లోటు తీర్చలేనిదంటారని, అయితే నిజంగా ఒక శూన్యం ఉంటుందని, దాన్ని ఎవరూ భర్తీ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అలాంటి వారి లక్ష్యాలను మనం ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. మారుతీరావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుటూ, ఆయన కటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి
నిర్మాత దగ్గుబాటి సురేశ్ గొల్లపూడితో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గొల్లపూడి చాలా మంచి వ్యక్తి అని అన్నారు. తాము ఈ పక్క వీధిలోనే ఉండేవాళ్లం అని, ప్రారంభ దశ నుంచే నాన్నతో గొల్లపూడికి మంచి అనుబంధం ఉండేదని అన్నారు. వెంకటేశ్ నటించిన పలు చిత్రాల్లో ఆయన నటించారని, లీడర్ చిత్రంలోనూ గొల్లపూడి మంచి పాత్రను పోషించారని చెప్పారు. దురదృష్టవశాత్తు ఆయన చిన్న కొడుకు మరణించడంతో ఆయన పేరుతో ఒక జాతీయ అవార్డును నెలకొల్పి నూతన ప్రతిభావంతులకు ప్రదానం చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నానన్నారు.
గొల్లపూడి హీరో కూడా
గొల్లపూడి మారుతీరావు హీరో అని సీనియర్ నిర్మాత, దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ పేర్కొన్నారు. గొల్లపూడితో తనకు 1974 నుంచే పరిచయం ఉందన్నారు. ఆయన నాటకాల నుంచి వచ్చిన తరువాత లక్ష్మీ ప్రొడక్షన్‌లో గోస్ట్ రైటర్‌గా పని చేశారని గుర్తు చేశారు. ఆ తరువాత తాను నిర్మించిన మూడు చిత్రాల్లో నటించినట్లు తెలిపారు. గొల్లపూడి మారుతీరావు నటుడు, రచయిత, సాహితీవేత్తనే కాకుండా హీరోగా నటించారన్నారు. సంసారం ఒక చదరంగం చిత్రంలో ఆయనే హీరో అని పేర్కొన్నారు. ఆయన పత్రికల్లో రాసిన శీర్షికలు ఎంతో ప్రాచుర్యం పొందినట్లు తెలిపారు. ఏ రోజు ఏ టాపిక్‌పై రాస్తారోనని ఆసక్తిగా ఎదురు చూసేవారని అన్నారు.
అదే విధంగా సీనియర్ నిర్మాత ఏకాంబరేశ్వరరావు గొల్లపూడి భౌతక కాయానికి నివాళులర్పించి తను అనుభవాలను పంచుకున్నారు. గొల్లపూడిని దర్శకుడు కోడిరామకృష్ణకు పరిచయం చేసింది తానేనని చెప్పారు. తన మిత్రుడు, భాగస్వామి అయిన కే.రాఘవకి సిఫార్సు చేసి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రానికి మాటలు రాయించడంతో పాటు అందులో నటింపజేసినట్లు తెలిపారు. కాగా జేకే రెడ్డి, టీటీడీ స్థానిక సలహామండలి మాజీ అధ్యక్షుడు శ్రీకృష్ణ గొల్లపూడి భౌతిక కాయానికి నివాళులర్పించారు. కాగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు తొలి గ్రహీత ఆంగ్లోఇండియన్ లెస్లీ కార్వోలో గొల్లపూడికి నివాళులర్పించారు. కాగా ప్రఖ్యాత నటుడు, రచయితగా పేరు గాంచిన గొల్లపూడి మారుతీరావుకు నివాళులర్పించడానికి మా అసోషియేషన్ నుంచి ఏ ఒక్కరూ కూడా వచ్చి నివాళులర్పించకపోవడం ఖండించదగ్గ విషయం.
Comments
Please login to add a commentAdd a comment