వెనకటికి వేళకాని వేళ ఒకాయన తాటిచెట్టు మీదకి ఎగబాకుతున్నాడట. పక్కనే రోడ్డుమీద నడిచి వెళ్తున్న మరొకాయన పలకరించాడట. ‘ఈ వేళప్పుడు తాటిచెట్టుమీదకి ఎందుకు ఎగబాకుతున్నావు బాబూ’ అని. వెంటనే ఆ ఆసామీ టక్కున సమాధానమిచ్చాడట– దూడగడ్డి కోసం అని. ఇది మనకి పాతబడిన సామెతే. సామెతకి పెట్టుబడి తాటిచెట్టుమీద దూడగడ్డి. బెంగాలులో ఎన్నికల కమిషన్ తరఫున నియమితులైన అజయ్ నాయక్ అనే ప్రత్యేక పర్యవేక్షకులు నిన్న ఒక మాట అన్నారు: ఇవాళ్టి బెంగాల్‌లో దాదాపు 15 ఏళ్ల కిందట బిహార్‌లో ఉన్న అరాచకత్వం, దౌర్జన్య తత్వం ప్రబలి ఉంది– అని. ఆయన లాకాయి లూకాయి మనిషి కాదు. ఆ రోజుల్లో బిహార్‌లో ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి. వెంటనే మమతా బెనర్జీ స్పందించింది. ఈయన ఆర్.ఎస్.ఎస్.– బీజేపీ మనిషి అనీ. ఆయన్ని వెంటనే రాష్ట్రం నుంచి బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ని డిమాండ్ చేసింది.
గత ఎన్నికల తర్వాత చిత్తుగా ఓడిపోయిన సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు మాయావతిని ఎవరో అడిగారు. ‘ఏం? ఓడిపోయారేం?’ సమాధానానికి అలనాడు ఆవిడ తడువుకోలేదు. ‘నా శత్రువులందరూ ఏకమై నన్ను ఓడించారు’– అన్నారు. మరి ఎన్ని లక్షల మంది మిత్రులు ఏకమయి అంతకుముందు ఆమెని గెలిపించడంవల్ల లక్నో నిండా ఏనుగులు, ఆమె విగ్రహాలతో ఎన్ని పార్కులు వచ్చాయో మనకు తెలియదు. లోగడ– మనకు స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో ఉదాత్తమయిన నాయకులుండేవారు. అంతే ఉదాత్తమయిన ప్రతినాయకులూ ఉండేవారు. ఎన్నోసార్లు పండిట్‌జీ పార్లమెంటులో నిలబడి– కృపలానీ, జయప్రకాశ్ నారాయణ్ వంటివారు నిలదీయగా తన పొరపాట్లు ఒప్పుకున్న రోజులు నాకు తెలుసు. ప్రతినాయకులు వారి విచక్షణను గౌరవించి ఆ పొరపాటు సవరణకు ప్రభుత్వం తలపెట్టే చర్యను సమర్థించడమో, సలహా ఇవ్వడమో చేసేవారు. ఇది రాజకీయ పక్షాల మధ్య అమోఘమయిన సయోధ్య. మెజారిటీ జీవలక్షణం.
కొన్ని కోట్లమంది ఈ ప్రభుత్వాన్ని ఎంపిక చేసి పదవిలో నిలిపారు. ఆ మెజారిటీని అందరూ గౌరవించాలి. నాయకుల తప్పటడుగునీ గమనించాలి. అర్థం చేసుకోవాలి. ప్రజాసేవలో పార్లమెంటులో కుర్చీ మారినంత మాత్రాన ఎవరూ దేవుళ్లు కాదు. కానీ ఇదేమిటి? ఈనాడు ప్రతిపక్షాలు పదవిలో ఉన్న నాయకుడిలో దేవుడిని ఆశిస్తాయి. అంతేకాదు. ఒక్క లోపాన్ని ఒప్పుకుంటే గద్దె దిగాలని డిమాండ్ చేస్తాయి. వారినక్కడ కూర్చోపెట్టింది ప్రజ. కొంతమంది సేవాతత్పరుల, మేధావుల, అనుభవజ్ఞుల సమష్టి కృషి దేశ పాలన. నిన్ను నేను తిట్టడం, నన్ను నువ్వు తిట్టడం. తీరా ఆ వ్యక్తిలో లోపం బయటపడితే– ఇక పాలనని అటకెక్కించి ఆ పార్టీని దించడానికి తైతక్కలు– ఇదీ ప్రస్తుత రాజకీయం. ఇక్కడ నిజాయితీ ఎవరికీ అందని తాయిలం. ఏ నాయకుడూ– పొరపాటున కూడా ఇంట్లో పెళ్లాంతో కూడా పంచుకోడేమో. పంచుకుంటే ఏమ వుతుంది. దాన్ని వదిలేసి, పాలనని అటకెక్కించి– ఆ నాయకుడిని గద్దెదింపే అతి భయంకరమైన ఘట్టం ప్రారంభమవుతుంది. అందుకనే ఈ దేశంలో ప్రతీ నాయకునికీ– తనదైన దూడగడ్డి ఉంటుంది. అవసరమైనప్పుడు దానిని వాడుతూంటారు. వారికి తెలుసు. పాలనలో నిజమైన నిజంకన్నా ‘రకరకాల దూడగడ్డి’ తమ కుర్చీని కాపాడుతుందని.
మనలో మనమాట– బెంగాల్‌లో అరాచకత్వం – బిహార్‌లో లోగడ స్థాయిలో ఉందని గ్రహించడానికి ఓ ఐఏఎస్ ఆఫీసర్ నోరిప్పనవసరం లేదు. అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మమతా బెనర్జీ నోరిప్పి అవునంటే (అలాంటి బూతు మాటలు విని ఈ దేశంలో కనీసం 60 ఏళ్లు దాటింది) దూడగడ్డి అందరికీ ఆహారమవుతుంది. నిజం మాట దేవుడెరుగు, ఆమెని గద్దె దించే ఓ బృహత్తర కర్మకాండ ప్రారంభమవుతుంది. ఈ దేశంలో ‘రాజకీయ’మనే ముచ్చటకి నాంది పలుకుతుంది. మనలో మనమాట– మన దేశంలో అలనాటి సంప్రదాయం కొనసాగగలిగితే– మోదీగారు ఎన్ని సార్లు నోరిప్పాలి. ఎందుకు విప్పరు? విప్పరని రాజకీయ రంగంలో ఎవరికి తెలియదు. The function of democracy is not to create Utopia. But an attempt to strive towards it with objective realities.
నిజాయితీని అటకెక్కించిన ఈనాటి నేపథ్యంలో– ఇటు పాత్రికేయులకీ, అటు నాయకులకీ కొన్ని మర్యాదలు కావాలి. ఆ ఎల్లల మధ్యే బంతి పరిగెత్తాలి. మధ్య మధ్య మమతా బెనర్జీ, మాయా వతి, అలనాటి జయలలిత, అప్పుడప్పుడు చంద్ర బాబు, ఎల్లకాలం– లాలూ ప్రసాద్ విసురుతూ ఉంటారు. మమత పళ్లు బిగించి ఐఏఎస్ ఆరెస్సెస్ మనిషి అన్నప్పుడు మనకి కితకితలు పెట్టినట్టుంటుంది. అసలు నిజమేమిటో అన్న మనిషికీ, ఎదిరించిన మనిషికీ తెలుసు, దీన్ని కాలమ్‌గా మలచిన నాకూ తెలుసు, నాకు తెలుసని మీకూ తెలుసు. మీకు తెలుసునని మా అందరికీ తెలుసు.
గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment