
ఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఈ ఘటనపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. ఈ సందర్బంగా హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారామె.
ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. ఈ దారుణ ఘటనపై 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయ తల్లి ఆశాదేవి స్పందిస్తూ.. అఘాయిత్యాలను నిలువరించడంలో సీఎం మమతా బెనర్జీ విఫలమైనట్లు విమర్శించారు. నిందితులను శిక్షించడానికి బదులుగా.. నిరసన ప్రదర్శనలతో డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనలో ప్రజలను ఆమె తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆమె కూడా మహిళే అని, రాష్ట్ర సీఎంగా ఉన్న ఆమె నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదే సమయంలో అత్యాచారాలకు పాల్పడుతున్న వారి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన శిక్షను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు. కోల్‌కతా మెడికల్ కాలేజీలో అమ్మాయిలకు రక్షణ లేకుంటే, అప్పుడు దేశంలోని మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆమె ప్రశ్నించారు.
మరోవైపు.. ఆగస్టు 9వ తేదీన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ రేప్, హత్యకు గురైంది. ఈ ఘటనకు నిరసనగా వైద్యులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. వైద్యసేవలను నిలిపివేశారు. ఇక, కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.