ఒకే నెలలో రెండుసార్లు ఐఏఎస్‌ల గురించి... ‘సేవ’ని అటకెక్కించిన అధికారులున్న నేపథ్యంలో తమిళనాడు తిరువణ్ణామలై కలెక్టరు కందసామి ఒక ఒయాసిస్సు. కలెక్టరుగా ఓ మామూలు కుటుంబానికి చేయూతనిచ్చి, స్వయంగా వంట చేసి, ఆర్డరు ఇచ్చి వచ్చారు.
సేవకీ, పరిపాలనా దక్షతకీ ప్రతీకగా నిలిచే ఈ సర్వీసు బ్రిటిష్‌వారి పాలనలో మిగుల్చుకున్నది. అయితే ఆనాటి ఐసీఎస్‌ల ఆర్భాటం, హంగులు నెహ్రూగారికి నచ్చేవి కావని నెహ్రూ రక్షణాధికారి రుస్తుంజీ ‘ఐయాం నెహ్రూ షాడో’ అనే పుస్తకంలో పేర్కొన్నారు.
నాకు గత 65 సంవత్సరాలుగా ఈ ఆఫీసర్లు తెలుసు. నా పన్నెండో ఏట విశాఖకు జేపీగిల్ గ్విన్ గారు కలెక్టరుగా ఉండేవారు. సాయంకాలం సభకి బంగళా నుంచి రోడ్డు పక్క చేతులు వెనక్కు కట్టుకుని నడిచి రావడం నేను స్వయంగా చూశాను. నెహ్రూకీ, రాజేంద్రప్రసాద్‌కీ సెక్రటరీగా పనిచేసిన హెచ్‌వీఆర్ అయ్యంగా ర్‌ని చూశాను. ‘సురభి’ సంపాదకుడిగా ఆంధ్రాలో ఆఖరి ఐసీఎస్ వీకే రావుగారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన వయసిప్పుడు 104 సంవత్సరాలు. ఆయన కొడుకు, మేనల్లుడు ఐఏఎస్‌లు. వారి ఫొటో కోసం ముగ్గురు ఐఏఎస్‌లు కనీసం నాలుగేసిసార్లు నాకు ఫోన్లు చేసి సమకూర్చారు. ఇవాళ కలెక్టర్లు డవాలా బంట్రోతుల వెనుక మాయమవుతారు. వారు సాధారణంగా ఆకాశం నుంచి దిగి వస్తారు. మానవమాత్రులలో కలవరు. They lost their human facelong back.
.
అలనాటి చిత్తూరు కలెక్టరు బీకే రావుగారు– నాకు రచయితగా చేయూతనిస్తూనే జీవితంలో మనిషిగా పెద్ద రికాన్ని నష్టపోని ఉదాత్తతని నేర్పారు. నరేంద్ర లూథర్ మా నాటకంలో (వందేమాతరం) భాగంలాగా హైదరాబాదులో మాకు తోడుగా నిలిచారు. ఇంకా సీఎస్ శాస్త్రిగారు, జొన్నలగడ్డ రాంబాబుగారు వంటి అరుదైన అధికారులు ఆ పదవులకు వన్నె తెచ్చారు. వీపీ రామారావుగారు ఏకంగా నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. దయాచారిగారు నా నాటిక ‘కళ్లు’ ప్రదర్శించిన విషయాన్ని ఆనందంగా పంచుకున్నారు.
కెవీ రమణాచారిగారు నా ‘దొంగగారొస్తున్నారు...’ నాటికలో ప్రధాన పాత్రని నటించారు. అభిరుచికి అగ్ర తాంబూలమిచ్చి, అధికారం అడ్డం పడకుండా పదవినీ, పరిచయాల్నీ నిలుపుకున్న పెద్దలు వీరు.
ఈ గొడవంతా ఇప్పుడెందుకు? నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి– ముగ్గురు చీఫ్ సెక్రటరీలను (అరుణాచల్‌ప్రదేశ్, గోవా, ఆంధ్రప్రదేశ్) మూడు కారణాలకి– ఒకే రోజు నిలదీశారు. ఎందుకు? సరైన దుస్తులు వేసుకొని కోర్టుకి రానందుకు! ఒకాయన పాంటు, షర్టు దాని మీద పసుపు జాకెట్ వేసుకున్నారు. మరొకాయన పరిస్థితీ అలాంటిదే.
ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌గారు వారి వాంగ్మూలాన్ని వినడానికి నిరాకరించారు. కారణం– వారి దుస్తులు! ‘మీరు పిక్నిక్‌కి రాలేదు. మీమీ రాష్ట్రాలకు ప్రాధాన్యం వహిస్తూ వాజ్యాలను జరపడానికి వచ్చారు’ అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగారి కథ. పదవిలో ఉన్న రాష్ట్ర న్యాయమూర్తుల స్థాయిలోనే రిటైరైన న్యాయమూర్తులకు వైద్య సదుపాయాలు ఇస్తున్నారా? అన్నది వాజ్యం. ‘మేం అప్పుడే చేసేశాం సార్!’ అన్నారు చీఫ్ సెక్రటరీగారు. ‘ఏమిటి చేసేశారు?’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్న. ఈయన నీళ్లు నమిలారట. ‘మా ఆర్డర్‌లో రాష్ట్ర ప్రధాన అధికారి విషయాన్ని కూలంకషంగా తెలుసుకోకుండానే కోర్టుకి వచ్చారని తెలియజేస్తాం’ అన్నారు న్యాయమూర్తి.
వీరు ఆయా రాష్ట్రాల ప్రతినిధులు, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో నిలిచిన ఆఫీసర్లు– కనీస మర్యాదల్ని పాటించకపోవడం, ఆ కారణంగా న్యాయమూర్తి విచారణ జరపడానికి తిరస్కరించడం ఈ తరం అధికారులు తెచ్చిపెట్టిన అపఖ్యాతి.
అలనాటి ఐపీఎస్‌లను పాలనా దక్షతకి సలహాదారులుగా– మార్గదర్శకులుగా ఆనాటి నాయకులు భావించేవారట. ఐసీఎస్ సాధికారికమైన పాలనకు గీటురాయి. ఇది వీకే రావు గారు స్వయంగా చెప్పిన వైనం. నీలం సంజీవరెడ్డిగారి వంటి నాయకులు ఈ అధికారుల్ని నెత్తిన పెట్టుకునేవారట. అంతెందుకు? ఫొటో కోసం కూర్చున్న ఆ కాలపు ఐసీఎస్ వీకే రావుగారు 104 సంవత్సరాల మనిషి– బహుశా 45 సంవత్సరాల కిందట ఉద్యోగ ధర్మంగా వేసుకునే దుస్తుల్ని వేసుకుని కెమెరా ముందు కూర్చోవడం గమనార్హం.
కొసమెరుపు: నాతో మాట్లాడిన ఒక ఐఏఎస్‌గారన్నారు: ‘మారుతీరావుగారూ! కోర్టులో వకాల్తాకి వచ్చిన అధికారులు ఫలానా దుస్తుల్లో ఉండాలన్న రూలు లేదు’ అని. అయితే ‘మర్యాద’కీ ‘రూలు’కీ చుక్కెదురు. కోర్టులో నిలవడం బాధ్యత. సాధికారికమైన దుస్తులు న్యాయస్థానం పట్ల అధికారులు చూపే మర్యాద. దీనికి రూలు పుస్తకం అనవసరం. వెరసి– నేటి ఐఏఎస్‌ల నిర్వాకమిది.
వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment