KV Ramanaa Chari
-
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ది డీల్’
రంగస్థలం నటుడు హనుకోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది డీల్’. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం పోస్టర్ని రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కేవి రమణాచారి విడుదల చేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. నటన, దర్శకత్వంపై మంచి అవగాహన ఉన్న హను కోట్ల ది డీల్ సినిమాతో మన ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెలుగు సినీ రంగంలో అడుగు పెడుతున్న దర్శకుడు హను కోట్లకు అభినందనలు తెలిపారు. ‘ఒక డిఫరంట్ స్టోరీతో వస్తున్న నన్న ప్రేక్షకులు ఆశ్వీరదించాలని కోరుతున్నాను’ అని హనుకోట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌పీసీ అధ్యక్షుడు కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ ఐఏఎస్‌లు...!!
ఒకే నెలలో రెండుసార్లు ఐఏఎస్‌ల గురించి... ‘సేవ’ని అటకెక్కించిన అధికారులున్న నేపథ్యంలో తమిళనాడు తిరువణ్ణామలై కలెక్టరు కందసామి ఒక ఒయాసిస్సు. కలెక్టరుగా ఓ మామూలు కుటుంబానికి చేయూతనిచ్చి, స్వయంగా వంట చేసి, ఆర్డరు ఇచ్చి వచ్చారు. సేవకీ, పరిపాలనా దక్షతకీ ప్రతీకగా నిలిచే ఈ సర్వీసు బ్రిటిష్‌వారి పాలనలో మిగుల్చుకున్నది. అయితే ఆనాటి ఐసీఎస్‌ల ఆర్భాటం, హంగులు నెహ్రూగారికి నచ్చేవి కావని నెహ్రూ రక్షణాధికారి రుస్తుంజీ ‘ఐయాం నెహ్రూ షాడో’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. నాకు గత 65 సంవత్సరాలుగా ఈ ఆఫీసర్లు తెలుసు. నా పన్నెండో ఏట విశాఖకు జేపీగిల్ గ్విన్ గారు కలెక్టరుగా ఉండేవారు. సాయంకాలం సభకి బంగళా నుంచి రోడ్డు పక్క చేతులు వెనక్కు కట్టుకుని నడిచి రావడం నేను స్వయంగా చూశాను. నెహ్రూకీ, రాజేంద్రప్రసాద్‌కీ సెక్రటరీగా పనిచేసిన హెచ్‌వీఆర్ అయ్యంగా ర్ని చూశాను. ‘సురభి’ సంపాదకుడిగా ఆంధ్రాలో ఆఖరి ఐసీఎస్ వీకే రావుగారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన వయసిప్పుడు 104 సంవత్సరాలు. ఆయన కొడుకు, మేనల్లుడు ఐఏఎస్‌లు. వారి ఫొటో కోసం ముగ్గురు ఐఏఎస్‌లు కనీసం నాలుగేసిసార్లు నాకు ఫోన్లు చేసి సమకూర్చారు. ఇవాళ కలెక్టర్లు డవాలా బంట్రోతుల వెనుక మాయమవుతారు. వారు సాధారణంగా ఆకాశం నుంచి దిగి వస్తారు. మానవమాత్రులలో కలవరు. They lost their human facelong back. . అలనాటి చిత్తూరు కలెక్టరు బీకే రావుగారు– నాకు రచయితగా చేయూతనిస్తూనే జీవితంలో మనిషిగా పెద్ద రికాన్ని నష్టపోని ఉదాత్తతని నేర్పారు. నరేంద్ర లూథర్ మా నాటకంలో (వందేమాతరం) భాగంలాగా హైదరాబాదులో మాకు తోడుగా నిలిచారు. ఇంకా సీఎస్ శాస్త్రిగారు, జొన్నలగడ్డ రాంబాబుగారు వంటి అరుదైన అధికారులు ఆ పదవులకు వన్నె తెచ్చారు. వీపీ రామారావుగారు ఏకంగా నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. దయాచారిగారు నా నాటిక ‘కళ్లు’ ప్రదర్శించిన విషయాన్ని ఆనందంగా పంచుకున్నారు. కెవీ రమణాచారిగారు నా ‘దొంగగారొస్తున్నారు...’ నాటికలో ప్రధాన పాత్రని నటించారు. అభిరుచికి అగ్ర తాంబూలమిచ్చి, అధికారం అడ్డం పడకుండా పదవినీ, పరిచయాల్నీ నిలుపుకున్న పెద్దలు వీరు. ఈ గొడవంతా ఇప్పుడెందుకు? నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి– ముగ్గురు చీఫ్ సెక్రటరీలను (అరుణాచల్‌ప్రదేశ్, గోవా, ఆంధ్రప్రదేశ్) మూడు కారణాలకి– ఒకే రోజు నిలదీశారు. ఎందుకు? సరైన దుస్తులు వేసుకొని కోర్టుకి రానందుకు! ఒకాయన పాంటు, షర్టు దాని మీద పసుపు జాకెట్ వేసుకున్నారు. మరొకాయన పరిస్థితీ అలాంటిదే. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్గారు వారి వాంగ్మూలాన్ని వినడానికి నిరాకరించారు. కారణం– వారి దుస్తులు! ‘మీరు పిక్నిక్కి రాలేదు. మీమీ రాష్ట్రాలకు ప్రాధాన్యం వహిస్తూ వాజ్యాలను జరపడానికి వచ్చారు’ అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగారి కథ. పదవిలో ఉన్న రాష్ట్ర న్యాయమూర్తుల స్థాయిలోనే రిటైరైన న్యాయమూర్తులకు వైద్య సదుపాయాలు ఇస్తున్నారా? అన్నది వాజ్యం. ‘మేం అప్పుడే చేసేశాం సార్!’ అన్నారు చీఫ్ సెక్రటరీగారు. ‘ఏమిటి చేసేశారు?’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్న. ఈయన నీళ్లు నమిలారట. ‘మా ఆర్డర్లో రాష్ట్ర ప్రధాన అధికారి విషయాన్ని కూలంకషంగా తెలుసుకోకుండానే కోర్టుకి వచ్చారని తెలియజేస్తాం’ అన్నారు న్యాయమూర్తి. వీరు ఆయా రాష్ట్రాల ప్రతినిధులు, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో నిలిచిన ఆఫీసర్లు– కనీస మర్యాదల్ని పాటించకపోవడం, ఆ కారణంగా న్యాయమూర్తి విచారణ జరపడానికి తిరస్కరించడం ఈ తరం అధికారులు తెచ్చిపెట్టిన అపఖ్యాతి. అలనాటి ఐపీఎస్‌లను పాలనా దక్షతకి సలహాదారులుగా– మార్గదర్శకులుగా ఆనాటి నాయకులు భావించేవారట. ఐసీఎస్ సాధికారికమైన పాలనకు గీటురాయి. ఇది వీకే రావు గారు స్వయంగా చెప్పిన వైనం. నీలం సంజీవరెడ్డిగారి వంటి నాయకులు ఈ అధికారుల్ని నెత్తిన పెట్టుకునేవారట. అంతెందుకు? ఫొటో కోసం కూర్చున్న ఆ కాలపు ఐసీఎస్ వీకే రావుగారు 104 సంవత్సరాల మనిషి– బహుశా 45 సంవత్సరాల కిందట ఉద్యోగ ధర్మంగా వేసుకునే దుస్తుల్ని వేసుకుని కెమెరా ముందు కూర్చోవడం గమనార్హం. కొసమెరుపు: నాతో మాట్లాడిన ఒక ఐఏఎస్గారన్నారు: ‘మారుతీరావుగారూ! కోర్టులో వకాల్తాకి వచ్చిన అధికారులు ఫలానా దుస్తుల్లో ఉండాలన్న రూలు లేదు’ అని. అయితే ‘మర్యాద’కీ ‘రూలు’కీ చుక్కెదురు. కోర్టులో నిలవడం బాధ్యత. సాధికారికమైన దుస్తులు న్యాయస్థానం పట్ల అధికారులు చూపే మర్యాద. దీనికి రూలు పుస్తకం అనవసరం. వెరసి– నేటి ఐఏఎస్‌ల నిర్వాకమిది. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి జరుగుతున్న గోదావరి పుష్కరాలలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పుష్కరాల్లో నిర్వహించాల్సిన సాంస్కృతిక కార్యక్రమాలపై గురువారం రవీంద్రభారతి ప్రాంగణంలోని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, రామన్నగూడెం, భద్రాచలం, కందకుర్తి తదితర కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. 14 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో పుష్కరోత్సవాన్ని పూర్తిగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించడానికి సూచనలు చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. ప్రచారానికి సంబంధించి సీడీల తయారీ, మీడియాలో ప్రచారాలపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సమాచార, పౌరసంబంధాల శాఖ సంచాలకులు సుభాష్, దూరదర్శన్, ఆకాశవాణి ప్రతినిధులు, భద్రాచలం, ధర్మపురి ఈవోలు, సాంస్కృతిక సారథి ప్రతినిధులు, జిల్లాల డీపీఆర్వోలు, ఆలయాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
శిఖరమెక్కిన ‘తెలంగాణ’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని శిఖరమెక్కించారు మన వాళ్లు. జమ్మూకశ్మీర్‌లోని లడక్ ప్రాంతంలో ఉన్న 6,140 మీటర్ల ఎత్తుగల స్టాక్ కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన కె.రంగారావు, భజరంగ్ కల్పేష్ షా, కిరణ్ కుమార్, రాజేంద్ర కుమార్, రాఘవేంద్ర, అలీ అహ్మద్, శివకుమార్ లాల్ హైదరాబాద్ నుంచి మే 17న బయలు దేరి వివిధ శిక్షణలు తీసుకుంటూ మే 30వ తేదీన లడక్ చేరుకున్నారు. అనంతరం జూన్ 2వ తేదీన శిఖరంపై తెలంగాణ భౌగోళిక పటాన్ని, జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ (ఏసీటీఎస్) అధ్యక్షుడు కె.రంగారావు నాయకత్వంలో వెళ్లిన వీరు.. పర్వతం ఎక్కేందుకు జూన్ 2వ తేదీ ఉదయం 3 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:45 గంటలకు చేరుకున్నారు. పర్వతారోహణ యాత్రను దిగ్విజయంగా ముగించుకుని సోమవారం (జూన్15వ తేదీ) నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో ఏ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ విధంగా జరుపుకోలేదని, ఇది ప్రపంచ రికార్డుగా గుర్తింపు పొందుతుందని అన్నారు. తమకు సహకరించి ప్రోత్సహించిన రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు శాఖ మంత్రి పద్మారావుకు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.