శిఖరమెక్కిన ‘తెలంగాణ’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని శిఖరమెక్కించారు మన వాళ్లు. జమ్మూకశ్మీర్‌లోని లడక్ ప్రాంతంలో ఉన్న 6,140 మీటర్ల ఎత్తుగల స్టాక్ కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన కె.రంగారావు, భజరంగ్ కల్పేష్ షా, కిరణ్ కుమార్, రాజేంద్ర కుమార్, రాఘవేంద్ర, అలీ అహ్మద్, శివకుమార్ లాల్ హైదరాబాద్ నుంచి మే 17న బయలు దేరి వివిధ శిక్షణలు తీసుకుంటూ మే 30వ తేదీన లడక్ చేరుకున్నారు. అనంతరం జూన్ 2వ తేదీన శిఖరంపై తెలంగాణ భౌగోళిక పటాన్ని, జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు.
అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ (ఏసీటీఎస్) అధ్యక్షుడు కె.రంగారావు నాయకత్వంలో వెళ్లిన వీరు.. పర్వతం ఎక్కేందుకు జూన్ 2వ తేదీ ఉదయం 3 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:45 గంటలకు చేరుకున్నారు. పర్వతారోహణ యాత్రను దిగ్విజయంగా ముగించుకుని సోమవారం (జూన్15వ తేదీ) నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో ఏ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ విధంగా జరుపుకోలేదని, ఇది ప్రపంచ రికార్డుగా గుర్తింపు పొందుతుందని అన్నారు. తమకు సహకరించి ప్రోత్సహించిన రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు శాఖ మంత్రి పద్మారావుకు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.