
రేపు బీజేపీ పదవిలోకి వస్తే ప్రజలమీద హిందీని రుద్దుతారేమోనన్న భయాన్ని రెచ్చగొట్టి బీజేపీ రాష్ట్రంలో స్థిరపడకుండా చేసే ఎత్తు ఇది– అని ఒక బీజేపీ నేత అభివర్ణించారు. ఇలాంటి సైంధవుల్ని మనం సులువుగా క్షమించవచ్చు.
ఒక జోక్ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఎవరైనా ఇద్దరు ఎక్కడయినా అర్థంకాని భాషలో మాట్లాడుకుంటుంటే మీకు అనుమానం అక్కరలేదు. వారి ద్దరూ తప్పనిసరిగా తమిళులై ఉంటారు. అలాగే తెలుగునాట ఇద్దరు ఇంగ్లిష్‌లో మాట్లాడుకుంటున్నారనుకోండి. మీకు అనుమానం అక్కరలేదు. వారు తప్పనిసరిగా తెలుగు వారే అయిఉంటారు. ఇది ఇంగ్లిష్ మనకు– ముఖ్యంగా తెలుగువారికి ఇచ్చిపోయిన జాడ్యం. ఒకే ఒక్క ఉదాహరణ. 125 సంవత్సరాల కిందట రాసిన ‘కన్యాశుల్కం’లో అగ్నిహోత్రావధాన్లు భార్య సుబ్బమ్మ గిరీశాన్ని అడుగుతుంది. ‘‘బాబూ,మీరూ మా అబ్బాయీ ఇంగ్లిష్‌లో మాట్లాడుకోండి’’ అని. ఇంగ్లిష్‌వాడు మనమీద రుద్దిన కోర్టుల్లో, కేసులు పెట్టుకుని ఆస్తులు గుల్ల చేసుకున్న ఎన్నో కుటుంబాలు– కనీసం ఇంగ్లిష్‌అయినా తెలిస్తే– కేసుల్లో నెగ్గుకు రావచ్చునన్న వ్యామోహం ఆనాడు అంకురించిన ఆసక్తికి ఊపిరి, అనాటి జీవనానికి ఉపాధికోసం, జీవికకోసం ఇంగ్లిష్‌వాడు మనమీద రుద్దిన అనర్ధానికి 125 ఏళ్లు నిండాయి. ఇంగ్లిష్ గొప్ప భాషే. కానీ మాతృభాషను మింగేసే స్థాయిలోనే ఉండకూడదు.
దీనికి పూర్తిగా భిన్నమైన కథ ఒకటి చెప్పాలి. నేను 45 ఏళ్లుగా తమిళనాడులో ఉంటున్నాను. తమిళం అర్థమయేటంత విం టాను. చెప్తాను. కాని చదవలేను. వారానికి పదిసార్లైనా తమిళ ప్రభుత్వాన్ని తిట్టుకుంటాను. కారణం– వారి భాషలో ఆయా వ్యాపారసంస్థలు, కంపెనీల పేర్లు ఉండాలని నిర్దేశించినా– వారి భాషతో బంధుత్వంలేని, రాష్ట్రంలో తప్పనిసరిగా పని ఉన్నమనిషి అవస్థని వారు సుతరామూ పట్టించుకోలేదు. పొరుగువాడి ఇబ్బందిని బొత్తిగా గుర్తించకపోవడం దూరదృష్టి లేకపోవడమేనని వాపోతాను.
ఇంకా దురన్యాయం ఏమిటంటే బయటి రాష్ట్రాలవారికి తమ వైభవాన్ని చెప్పడానికి ఏర్పరిచిన పర్యాటక స్థలాలలోనూ వారికి అర్థం కాని తమిళమే ఉంటుంది. ఉదాహరణకి– ఒకప్పుడు చోళ రాజుల కాలంలో వైభవోపేతంగా ఉన్న పూంపుహార్ సముద్ర తీరంలో ఉన్న మ్యూజియంలో ఏ బొమ్మముందైనా ఉన్నభాష ఏమీ మనకి అర్థం కాదు. ఈ ప్రదర్శనలు బయటి ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకులకు ఉద్దేశించినవి. కాని భాషాభిమానం ఆ వైభవాన్ని మరుగున పెడుతుంది. ఇది దూరదృష్టిలేని పాలకుల నిర్ణయాల పరిణామం.
దీనికి పూర్తిగా భిన్నం మన తెలుగు దేశంలో మన భాష గోడు. ఎక్కడా ఏ ప్రాంతంలోనూ తెలుగు కని పించదు. చదువుకునే బడుల్లోనూ తెలుగు కానరాదు. కాగా ఇంతవరకూ చెప్తున్న బడులలోనూ తెలుగు బోధన నిలిపివేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పూనుకుని– రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 12 తరగతి వరకూ తెలుగు భాషని నిర్బంధంగా బోధనా భాషని చేయడం ఎంతయినా అభినందనీయం. మళ్లీ ఇందులో మూడు సంస్కరణలున్నాయి. స్కూలు ప్రమేయం లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతీ పాఠశాలలోనూ తెలుగులో తప్పని సరిగా బోధన జరగడం ఒకటి. రాష్ట్రంలో అన్ని వ్యాపార సంస్థలూ– ఏ భాషవారయినా తప్పనిసరిగా సైన్ బోర్డుల మీద తెలుగు ఉంచాలి. ఇదిగో– ఈ సందర్భంలోనే నా మనవి– తప్పనిసరిగా భాషేతరులకి అర్థమయే మరొక భాష– అది ఇంగ్లిష్‌కానీ, మరేదయినా కానీ ఉంచడం అవసరం. భాషాభిమానం వెర్రితలలు వేయరాదు. ఇందుకు తమిళనాడే హెచ్చరిక.
మూడోది మరీ ముఖ్యమైనది. విద్యార్థులకు బోధించే తెలుగు ఏమిటి? ఎవరు నిర్ణయిస్తారు? ఈ విషయం మీదా సీఎం దృష్టిని ఉంచారు. రాష్ట్ర సాహిత్య అకాడమీకి సిలబస్ నిర్ణయించే పనిని అప్పగించారు. ‘‘అయ్యా– మన చిన్ననాటి బాలశిక్షల మీదా, సుమతీ శతకాల మీదా, వేమన శతకాల మీదా దయచేసి దృష్టిని పెట్టండి’’ అని అర్థం చేసుకోగల వీరికి మనవి చేసుకోవచ్చు.
ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామమని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ఆంధ్ర రాష్ట్రం కూడా త్వరలో ఈ నిర్ణయం తీసుకోవాలని వారు ఆశించారు. అయితే మన భాషని ఉద్ధరించుకోవడంలోనూ మధ్య వేలు పెట్టే రాజకీయ ఘనులుంటారు. తెలంగాణలోనూ లేకపోలేదు. ఒక బీజేపీ నాయకులు– రేపు బీజేపీ పదవిలోకి వస్తే ప్రజలమీద హిందీని రుద్దుతారేమోనన్న భయాన్ని రెచ్చగొట్టి బీజేపీ రాష్ట్రంలో స్థిరపడకుండా చేసే ఎత్తు ఇది– అని అభివర్ణించారు. ఇలాంటి సైంధవుల్ని మనం సులువుగా క్షమిం చవచ్చు. మరొక ముఖ్యమైన నిర్ణయాన్ని సీఎం ప్రకటిం చారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతీ ఉద్యోగీ తెలుగు పరీక్ష పాసై ఉండాలి. ఆప్పుడే అతనికి ప్రమోషన్ కానీ, ఉద్యోగం స్థిరపరుచుకునే అర్హత కానీ ఉంటుంది.
దశాబ్దాల తరబడి ఇంగ్లిష్ భాషా వ్యామోహంలో తలమునకలయిన తెలుగు కుటుంబాలవారిలో చైతన్యాన్ని కలిగించడానికి సిద్ధపడిన తొలిరోజుల్లో కొంత ఇబ్బందిగా కనిపించినా– తప్పనిసరిగా జరగాల్సిన పరి ణామమిది. తెలంగాణ ప్రభుత్వం ముందుగా పూనుకున్నదన్న ఒక్క కారణానికీ– బెట్టుతనానికీ పోకుండా– ఇప్పటికే ఆలశ్యమైన ఈ నిర్ణయాన్ని ఆంధ్ర ప్రభుత్వం కూడా తీసుకొంటుందని ఆశిద్దాం. కష్టపడి తెలుగు మాట్లాడుకోవడాన్ని ఇప్పటికయినా ప్రారంభిస్తే మన మనుమలు కనీసం తెలుగు పద్యాన్ని ఇష్టపడి గర్వంగా చదువుకుంటారు.
గొల్లపూడి మారుతీరావు