ఆ రోజుల్లో ఈ లా కమిషన్‌ ఉండి ఉంటే... | Gollapudi Maruthi Rao Writes On Law Commission Suggestions | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 12 2018 3:17 AM | Last Updated on Thu, Jul 12 2018 8:46 AM

Gollapudi Maruthi Rao Writes On Law Commission Suggestions - Sakshi

ప్రతికాత్మక చిత్రం

ఈ దేశంలో జూదాన్ని సాధికారికం చెయ్యడానికి లా కమిషన్‌ కావలసినన్ని సరదా అయిన సూచనలి చ్చింది. ఓ ఆంగ్ల దిన పత్రిక ఆ వ్యవహారాన్ని పతాక శీర్షికగా ప్రకటించింది. లా కమిషన్‌ అధ్యక్షులు– మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీఎస్‌ చౌహాన్, మిగతా సభ్యులు జూదాన్ని దేశంలో అందరికీ అందుబా టులో ఉండేలాగ పురాణాలు, న్యాయ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, నీతి శాస్త్రం, మౌలిక రచన అన్నిటినీ కలిపి– లకోటా కొట్టేసి–ఒక గొప్ప కషాయాన్ని సిద్ధం చేశారు. ఆ రోజుల్లో ఈ లా కమిషన్‌ ఉండి ఉంటే– కురుక్షేత్ర సంగ్రామానికి సరికొత్త ప్రయోజనం ఉండేది.

ఈ విషయమై ఈ పత్రికే ఎడిటోరియల్‌ కూడా రాసింది. ధర్మరాజు అసలు తమ్ముళ్లను తాకట్టు పెట్టడమేమిటి? మహారాణిని జూదంలో ఫణంగా పెట్టడమేమిటి? దీనికి సమాధానం ఓ చదువుకున్న పాఠకుడు ఉత్తరం ద్వారా ఈ పత్రికలోనే తెలియజే శాడు. జూదానికీ డబ్బున్నవారి సరదాలకీ దగ్గర తోవ ఉన్నదని ఈ ఉత్తరం సారాంశం. చక్రవర్తులు కనుక– బాగా హోదా, ఐశ్వర్యం ఉన్నది కనుక– ఓ హద్దు దాటారు. మహారాణిని జూదంలో తాకట్టు పెట్టిన కారణంగానే వ్యాసుడు ‘మహాభారతాన్ని’ రచించి ఉంటాడు. ఆ స్థానంలో పనిచేసే గేట్‌ కీపర్‌ తన మర దలిని ఈ పని చేస్తే– ‘మహాభారతం’ మాట దేవు డెరుగు– దండనకి గురి అయ్యేవాడేమో?

కనుక 2018లో ఈ కమిషన్‌ ఓ గొప్ప సూచన చేసింది. వారి సూచనల సారాంశం. మనకి మహారా ణుల్ని జూదంలో ఫణంగా పెట్టే సంప్రదాయం ఉన్న కథలున్నాయి. పురాణాలున్నాయి. కనుక జూదాన్ని చిన్నచూపు చూడటం మంచిది కాదు. ఏ ఎండకా గొడుగులాగ, ఏ స్థాయి వాడికి ఆ స్థాయిలో అందు బాటులో ఉన్న జూదాన్ని సాధికారికం చెయ్యాలి. ముఖ్యంగా జూదం ఆడే వ్యక్తి పాన్‌కార్డు, ఆధార్‌ కార్డు నంబర్లు గ్రహించండి. అది క్రికెట్‌ అయినా (ముఖ్యంగా క్రికెట్‌ కారణంగా నల్ల జేబుల్లోకి మాయమవుతున్న కోట్ల ఆదాయాన్ని ఖజానా మార్గం పట్టించాలని), గుర్రాలైనా, కోడి పందాలైనా, మరే జూదమైనా– వారి స్థాయికి తగ్గట్టు వారు ఆడు కోవచ్చును.

ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ‘లాట రీ’లు నడిపిన సందర్భాలు మరిచిపోకూడదు. కొన్ని నేరాల్ని బొత్తిగా రూపుమాప లేనప్పుడు– వాటిని అదుపులో ఉంచే ప్రత్యామ్నాయం ఆలోచించాలి. మనకి యుధిష్టిరులు, ద్రౌపదులు ఉండే రోజులు పోయాయి. విజయ్‌ మాల్యాలు, నీరవ్‌ మోదీలు నిల దొక్కుకునే రోజులు వచ్చాయి. సజావైన మార్గ నిర్దేశం జరిగినప్పుడు– అవి నీతి– మన చెప్పు చేతల్లో ఉండగల ‘నీతి’గా మారు తుంది. ఇంతకూ జూదానికి మనకి మార్గదర్శకం ఎవరు? ధర్మరాజు. మహాభారతం.

మహాభారతం రకరకాల కారణాలకి గొప్పదని మన పండితులు చెప్పగా మనం విన్నాం. చదువుకు న్నాం. కానీ 2018లో మహా భారతంలో ‘జూదం’ చట్టానికి కొంగు బంగారం అవుతుందని మనం ఏనాడూ ఊహించలేదు. మహాభారత కథలపై ఎన్నో సినీమాలు వచ్చాయి, నవలలు వచ్చాయి, నాటకాలు వచ్చాయి– కానీ ఆనాటి ప్రభుత్వం ‘జూదా’న్ని చట్ట పరం చేయడం కారణంగా ఓ మహత్తరమైన రచనకు మూలకారణం అయిందని మనం ఏనాడూ ఆలోచిం చలేకపోయాం.

నాదొక పిచ్చి ఆలోచన. శ్రీకృష్ణుడికి ఇలాంటి జూదం పిచ్చి లేదా? ఉంటే ఆయనకి 8 మంది భార్యలు. 8 రకాలైన మహాభారతాలు వచ్చేవి. లేదా తమ రాజ్యంలో జూదం చట్టబద్ధం కాదేమో? ఎంత సేపూ– సుఖంగా పెళ్లాలతో గడుపుతూ ఓడిపోయిన వారికి చీరెలు ఇచ్చే పనితో సరిపెట్టుకున్నారు. నేను లా కమిషన్‌ ధోరణిలో ఆలోచిస్తున్నానని తమరు గ్రహించాలి. మహాభారతానికి కథా నాయకత్వం వహించలేని శ్రీకృష్ణుడి కథని మనం హెచ్చరికగా గ్రహించాలి.

తప్పించడానికి వీలులేని జూదానికి సరసమైన ఉదాహరణగా ‘మహాభారతాన్ని’ ఉదహరించగల లా కమిషన్‌ని, దాని అధ్యక్షులు చౌహాన్‌ గారిని నేను మనసారా అభినందిస్తున్నాను. అయితే మహా భారతానికి ‘జూదా’న్ని ప్రోత్సహించే ప్రయోజనం ఉన్నదని ఇన్ని వేల సంవత్సరాలు గుర్తించని పండి తులకు శిక్ష వెయ్యాలని నేను లా కమిషన్‌ను అర్థిస్తున్నాను. ముందు పండిత సభల్ని ఏర్పాటు చేసి– జూదం మీద శతకాలు రాయించండి. ప్రబం ధాలు పలికించండి. సాహిత్యానికి సాహిత్యమే విరుగుడు. శతాబ్దాలపాటు ఈ జాతిని ప్రభావితం చేసిన మహా భారతం ఇన్నాళ్లకి జూదానికి మార్గదర్శకం కావడం మన న్యాయమూర్తులు మనకి పెట్టిన భిక్ష.


గొల్లపూడి మారుతీరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement