ప్రతీకాత్మక చిత్రం
దేశానికి మేలు చేసేలా న్యాయ సంస్కరణలను ప్రతిపాదించాల్సిన భారత న్యాయ కమిషన్ జూదాన్ని చట్టబద్ధం చెయ్యాలని సిఫార్సు చెయ్య డం హాస్యాస్పదం. పైగా అక్రమ జూదం అరికట్టడం సాధ్యం కాదు కనుక, చట్టబద్ధం చేసేస్తే ఖజానాకు లాభం అంటూ లెక్కలు వెయ్యడం పలాయన వాదం. ఇదే లాజిక్ అన్వయిస్తే ప్రభుత్వం నిషేధం అమలు చెయ్యలేని చీకటి వ్యాపారాల్ని.. మాదక ద్రవ్యాలు, దోపిడీ, దొంగతనంలాంటివన్నీ.. చట్ట బద్ధం చేయాల్సి వస్తుంది. ఖజానాకు కాసులు దొరుకుతాయి కానీ సామాజిక ఆరోగ్యం మాటేమిటో లా కమిషన్ సెలవివ్వాలి. కమిషన్, తన ప్రతిపాదనకి పురాణాల్ని కూడా ప్రాతిపదికగా చేసుకుంది.
మహాభారత కాలంలో జూదం చట్టబద్ధమే అయ్యుంటే, ధర్మరాజు తమ్ముల్ని, భార్యనీ ఒడ్డి ఉండేవాడు కాదనీ, తద్వారా యుద్ధం జరిగేది కాదని చెప్పుకొచ్చారు. నిజమే మరి. వారి ఉద్దేశంలో చక్కగా కౌరవులు దేశాన్ని పాలించి, ఆదర్శంగా నిలిచే వారేమో. వ్యాసుడికి, మన కవిత్రయానికి, ఇంకా వందలాది రచయితలకు ముడిసరుకు కష్టమయ్యేది.జూదం, పేకాట లాంటివి సమాజానికి కీడు చేస్తాయి. వ్యసనంగా తయారై వ్యక్తిని అప్పుల పాలు చేసి, కుటుంబాల్ని ఆర్థిక అరాచకంలోకి నెట్టివేస్తాయి. క్రమశిక్షణ లేని జీవితాన్ని, అది పేద, ధనిక స్థాయీ భేదంతో సంబంధం లేకుండా అలవాటు చేసి దిగజారుస్తాయి.
వాటిని అరికట్టడం లేకపోతే పోయె, కనీసం వాటికి ఆమోద ముద్ర వేసి సామాజిక గౌరవం కల్పిం చడం ఆత్మహత్యా సదృశం. కమిషన్‌లోనే ఒక సభ్యుడు వ్యతిరేకిస్తూ చెప్పినట్టు భారత్ ఈ తరహా సంస్కరణకు సిద్ధంగా లేదు. పేదలున్న దేశంలో మరింత మంది పేదల్ని సృష్టించే కార్యక్రమం అవుతుంది ఇది. ఒక్కమాటలో స్పష్టంగా చెప్పాలంటే.. ప్రభుత్వ జూదశాలలు, జాతీయ పేకాట పోటీలు ఈ దేశానికి అవసరం లేదు.
– డా.డి.వి.జి.శంకరరావు,మాజీ ఎంపీ, పార్వతీపురం
Comments
Please login to add a commentAdd a comment