క్రికెట్ వంటి జెంటిల్మెన్ గేమ్‌లో గ్యాంబ్లింగ్, బెట్టింగ్లను చట్టబద్ధం చేయాలంటూ లా కమిషన్(21వ) సంచలన సిఫార్సులు చేసింది. తద్వారా కేంద్ర ఖజానాకు పన్ను రూపంలో మరింత ఆదాయం వస్తుందని కమిషన్ పేర్కొంది. ఈ మేరకు తాజాగా చేసిన సిఫార్సుల్లో గ్యాంబ్లింగ్, క్రీడల్లో బెట్టింగ్ ను అనుమతించాలని పేర్కొంది. అయితే ఇందుకోసం ఓ నియంత్రణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని కమిషన్ పేర్కొంది.
ఎలాగంటే... ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో పన్ను పరిధిలోకి వచ్చేలా ఈ బెట్టింగ్ లు ఉండాలి. దీనివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సైతం దేశానికి ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. ఎవరైనా బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ లో పాల్గొనాలంటే, అతని లావాదేవీలకు ఆధార్ కార్డు, పాన్ కార్డుల అనుసంధానం తప్పనిసరి చేయాలి. డబ్బుతో కాకుండా బ్యాంకు లావాదేవీల ద్వారా ఇది జరగాలి’ అని కమిషన్ సిఫార్సుల్లో పేర్కొంది. వీటితోపాటు క్యాసినో, ఆన్ లైన్ గేమింగ్ పరిశ్రమలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించాలని కూడా లా కమిషన్ తన రిపోర్టులో సిఫార్సు చేసింది.
'లీగల్ ఫ్రేమ్ వర్క్ గ్యాంబ్లింగ్ అండ్ స్పోర్ట్ బెట్టింగ్ ఇన్ క్లూడింగ్ క్రికెట్ ఇన్ ఇండియా' పేరిట తయారు చేసిన నివేదికను కమిషన్.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిందని సమాచారం. దీనిపై పార్లమెంట్ లో త్వరలో చర్చ జరగనుంది. అయితే ఈ సిఫార్సులు అమలులోకి రావాలంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 252 కింద రాష్ట్రాలన్నీ ఈ నిర్ణయాన్ని ఆమోదించాల్సి వుంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment