law commision
-
ఎన్ఆర్ఐ పెళ్లిళ్ల నమోదు తప్పనిసరి
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు), భారత సంతతికి చెందిన విదేశీయులు(ఓసీఐ)–భారతీయ పౌరుల మధ్య మోసపూరిత వివాహాల పెరుగుతండటం ఆందోళనకరమని న్యాయ కమిషన్ పేర్కొంది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి సమగ్రమైన చట్టం తేవాలని కేంద్రానికి సూచించింది. భారతీయులు–ఎన్ఆర్ఐలు, భారతీయులు–ఓసీఐల మధ్య పెళ్లిళ్లను విధిగా రిజిస్టర్ చేసే విధానం ఉండాలని స్పష్టం చేసింది. జస్టిస్ రితూరాజ్ అవస్థీ నేతృత్వంలోని లా కమిషన్ ‘లా ఆన్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ రిలేటింగ్ టు ఎన్ఆర్ఐ, ఓసీఐ’ అంశంపై అధ్యయనం చేసింది. ఇటీవల కేంద్ర న్యాయ శాఖకు ఇటీవలే నివేదిక సమర్పించింది. దీనిపై కేంద్రం తేదలచిన చట్టం పెళ్లిళ్లకు వివాదాలన్నింటినీ పరిష్కరించేలా సమగ్రంగా ఉండాలని అభిప్రాయపడింది. మోసపూరిత ఎన్ఆర్ఐ వివాహాలతో భారత యువతులు అధికంగా నష్టపోతున్నారని గుర్తుచేసింది. విడాకులు, భాగస్వామికి భరణం, కస్టడీ, చిన్నారుల జీవన వ్యయాన్ని భరించడం వంటి అంశాలను చట్టంలో చేర్చాలని సిఫార్సు చేసింది. వైవాహిక స్థితిని కచి్చతంగా వెల్లడించేలా పాస్‌పోర్టు చట్టం–1967లో సవరణలు చేయాలని పేర్కొంది. పాస్‌పోర్టులో మ్యారేజీ రిజి్రస్టేషన్ నెంబర్ కూడా ఉండాలని తెలిపింది. ఇద్దరు జీవిత భాగస్వాముల పాస్‌పోర్టులను అనుసంధానించాలని, దీనివల్ల మోసాలను అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. -
‘ఉమ్మడి’పై న్యాయ కమిషన్ సంప్రదింపులు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)పై 22వ న్యాయ కమిషన్ బుధవారం భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించింది. ప్రజలతోపాటు గుర్తింపు పొందిన మత సంస్థల అభిప్రాయాలను సేకరిస్తోంది. 21వ న్యాయ కమిషన్ గతంలో సంప్రదింపులు జరిపింది. ఈ కమిషన్ కాలపరిమితి 2018 ఆగస్టులో ముగిసింది. ఉమ్మడి పౌర స్మృతి అనేది అత్యంత సున్నితమైన అంశం కావడంతో తాజాగా మరోసారి అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలన్ని నిర్ణయానికి 22వ న్యాయ కమిషన్ వచ్చింది. -
అమ్మాయి, అబ్బాయి ఇద్దరికీ 18 ఏళ్లు చాలు!!
సాక్షి, న్యూఢిల్లీ : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని పదే పదే చెబుతున్నా ఆ దురాచారం మాత్రం కనుమరుగవడం లేదు. పెళ్లి అంటే ఏమిటో కూడా తెలియని వయసులోనే బాల్యం ‘ముళ్ల’ బారిన పడుతోంది. ఈ నేపథ్యంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు, అసమానతలు తొలగించేందుకు లా కమిషన్ సరికొత్త ప్రతిపాదనలు రూపొందించింది. మతాలకతీతంగా యువతీ, యువకులిద్దరికీ కనీస వివాహ వయస్సును 18 సంవత్సరాలుగా నిర్ణయించాలని అభిప్రాయపడింది. ఈ మేరకు పర్సనల్ లాలో చేపట్టాల్సిన సంస్కరణల ఆవశ్యకతను వివరిస్తూ... కన్సల్టేషన్ పేపర్‌ను శుక్రవారం విడుదల చేసింది. ప్రజాప్రతినిధులను ఎన్నుకునే సామర్థ్యం ఉన్నపుడు... ‘ స్త్రీ పురుష భేదం లేకుండా.. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ పద్దెనిమిదేళ్లకే ఓటు హక్కు కల్పించింది. మరి ఆ వయసులో ప్రభుత్వాన్ని ఎన్నుకునే సామర్థ్యం ఉన్నపుడు జీవిత భాగస్వామిని ఎన్నుకునే సామర్థ్యం ఉన్నట్టేగా. లింగ భేదం లేకుండా అన్ని విషయాల్లో స్త్రీ పురుషులిద్దరికీ హక్కులు కల్పించినపుడే సమానత్వ హక్కు పరిపూర్ణం అవుతుందని’ లా కమిషన్ పేర్కొంది. ‘అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు వివాహ వయస్సుగా నిర్ణయించడం ద్వారా భర్తల కంటే భార్యలు ఎప్పుడూ చిన్న వయస్సులోనే ఉండాలనే భావన బలంగా నాటుకుపోయింది. తద్వారా స్త్రీ, పురుష సమానత్వానికి భంగం కలిగినట్లే కదా’ అని కమిషన్ నివేదించింది. బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నట్లే కదా... సమానత్వ భావన ఆవశ్యకతను వివరిస్తూ...‘ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్- 1954 ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు ఉండాలి. కానీ ఈ చట్టంలోని 11, 12 సెక్షన్ల ప్రకారం భార్యాభర్తల్లో ఒకరికి వివాహానికి కనీస వయస్సు లేకపోయినా ఆ వివాహం చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. అదే విధంగా గార్డియన్షిప్ చట్టాల ప్రకారం భార్యకు గార్డియన్‌గా భర్తే ఉండాలి. మరి అటువంటి సమయంలో భర్త మైనర్ అయితే పరిస్థితి ఏంటి?. అలాగే గర్భవిచ్ఛిత్తి చట్టం- 1972లోని సెక్షన్ 3లో.. తప్పని పరిస్థితుల్లో గర్భవిచ్ఛిత్తి చేయవలసి వచ్చినపుడు భార్య మైనర్ అయితే భర్త అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు’ ... ఈ చట్టాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నారా అనే భావన కలుగుతోంది. కాబట్టి వీటన్నింటిలో సవరణలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని లా కమిషన్ పేర్కొంది. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా ఉమ్మడి పౌర స్మృతిలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ గుర్తుచేసింది. -
జమిలి ఎన్నికలు వృధా ప్రయాసే..
సాక్షి, చెన్నై : జమిలి ఎన్నికల ప్రతిపాదనను డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తోసిపుచ్చారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ప్రతిపాదన పూర్తిగా దుస్సాహసమని ఆయన అభివర్ణించారు. గతంలో ఎన్డీఏ హయాంలోనే జమిలి ఎన్నికల ప్రతిపాదనను పక్కనపెట్టినందున మళ్లీ దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించడం వృధా ప్రయాస అన్నారు. ఏకకాల ఎన్నికలు పాత సూచనేనని, దీన్ని గతంలో పూర్తిగా తిరస్కరించారని చెప్పుకొచ్చారు. ఏకకాల ఎన్నికలతో సమయం, డబ్బు ఆదా అవుతాయని, ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకాలు ఎదురుకాబోవని నరేంద్ర మోదీ సర్కార్ ఈ ప్రతిపాదనపై విస్తృత చర్చ చేపడుతున్న విషయం తెలిసిందే. జమిలి ఎన్నికలు ఏమాత్రం మేలు చేయబోవని స్పష్టం చేస్తూ స్టాలిన్ తమ పార్టీ తరపున లా కమిషన్‌కు లేఖ రాశారు. జమిలి ఎన్నికలపై అభిప్రాయాలు కోరుతూ అన్ని రాజకీయ పార్టీలకు లా కమిషన్ లేఖ రాసింది. లా కమిషన్ ప్రచురించిన వర్కింగ్ పేపర్లో కొన్ని అంశాలు రాజ్యాంగం నిర్ధేశించిన సమాఖ్య స్ఫూర్తికి భంగకరంగా ఉన్నాయని ఈ సందర్భంగా స్టాలిన్ లా కమిషన్‌కు రాసిన లేఖలో నివేదించారు. ఈ క్రమంలో జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేపట్టడం సంక్లిష్టమవుతుందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. -
సంచలనం.. బెట్టింగ్‌లకు అనుమతించండి
క్రికెట్ వంటి జెంటిల్మెన్ గేమ్‌లో గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లను చట్టబద్ధం చేయాలంటూ లా కమిషన్(21వ) సంచలన సిఫార్సులు చేసింది. తద్వారా కేంద్ర ఖజానాకు పన్ను రూపంలో మరింత ఆదాయం వస్తుందని కమిషన్ పేర్కొంది. ఈ మేరకు తాజాగా చేసిన సిఫార్సుల్లో గ్యాంబ్లింగ్, క్రీడల్లో బెట్టింగ్ ను అనుమతించాలని పేర్కొంది. అయితే ఇందుకోసం ఓ నియంత్రణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని కమిషన్ పేర్కొంది. ఎలాగంటే... ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో పన్ను పరిధిలోకి వచ్చేలా ఈ బెట్టింగ్ లు ఉండాలి. దీనివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సైతం దేశానికి ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. ఎవరైనా బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ లో పాల్గొనాలంటే, అతని లావాదేవీలకు ఆధార్ కార్డు, పాన్ కార్డుల అనుసంధానం తప్పనిసరి చేయాలి. డబ్బుతో కాకుండా బ్యాంకు లావాదేవీల ద్వారా ఇది జరగాలి’ అని కమిషన్ సిఫార్సుల్లో పేర్కొంది. వీటితోపాటు క్యాసినో, ఆన్ లైన్ గేమింగ్ పరిశ్రమలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించాలని కూడా లా కమిషన్ తన రిపోర్టులో సిఫార్సు చేసింది. 'లీగల్ ఫ్రేమ్ వర్క్ గ్యాంబ్లింగ్ అండ్ స్పోర్ట్ బెట్టింగ్ ఇన్ క్లూడింగ్ క్రికెట్ ఇన్ ఇండియా' పేరిట తయారు చేసిన నివేదికను కమిషన్.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిందని సమాచారం. దీనిపై పార్లమెంట్ లో త్వరలో చర్చ జరగనుంది. అయితే ఈ సిఫార్సులు అమలులోకి రావాలంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 252 కింద రాష్ట్రాలన్నీ ఈ నిర్ణయాన్ని ఆమోదించాల్సి వుంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. -
ఏకకాలంలో ఓకేనా?
న్యూఢిల్లీ: దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్రం యోచనలో స్పష్టత వచ్చింది. వచ్చే ఏడాది లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను దేశమంతటా ఏకకాలంలో నిర్వహించే విషయంలో ఎన్నికల సంఘం(ఈసీ) అభిప్రాయం తెలపాల్సిందిగా కేంద్రం కోరనుంది. ఇందుకోసం లా కమిషన్ న్యాయ శాఖకు నివేదిక అందించనుంది. లా కమిషన్‌తోపాటు నీతి ఆయోగ్ దేశమంతా ఏకకాలంలో 2 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తే మేలని భావిస్తోంది. ఈ నివేదికలను కేంద్రం ఈసీకి పంపి, అభిప్రాయం తెలపాల్సిందిగా కోరనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘ఒకటే జాతి, ఒకటే ఎన్నిక’ అన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా లా కమిషన్ ముసాయిదా పత్రంలో దేశమంతా ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీలకు మొదటి దశ 2019లో, రెండో దశ 2024లో ఎన్నికలు జరపాలని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించటంతోపాటు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అసెంబ్లీల కాలపరిమితిని కుదించటం లేదా పొడిగించటం చేయాలని సూచించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ ఇటీవల మాట్లాడుతూ..‘ఏకకాలంలో ఎన్నికల విధానాన్ని ఆచరణలోకి తేవటానికి చట్టపరమైన ఏర్పాట్లు చేయాలి. ఇందుకు సమయం పడుతుంది. అన్నీ పూర్తయితే, ఎన్నికల సంఘం అమలు చేస్తుంది. రాజ్యాంగం చెప్పిందే ఎన్నికల కమిషన్ చేస్తుంది’ అని అన్నారు. -
బీసీసీఐ ప్రజా సంస్థే: లా కమిషన్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి మింగుడు పడని నిర్ణయాన్ని లా కమిషన్ తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఈ క్రికెట్ బోర్డు ప్రజా సంస్థ అని తేల్చింది. సమాచార హక్కు (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలని సిఫారసు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం లా కమిషన్ సిఫారసులను ఆమోదిస్తే, ఆర్టీఐ చట్టపరిధిలోకి బోర్డు వస్తే... కోర్టుల్లో ఇక ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) వెల్లువెత్తుతాయి. జట్ల సెలక్షన్, ఆటగాళ్లను ఏ ప్రాతిపదికన తీసుకున్నారని పిల్ దాఖలు చేసే అవకాశాలుంటాయి. జస్టిస్ బి.ఎస్.చౌహాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న లా కమిషన్... బోర్డు, ఆటగాళ్లకు అందుతున్న పురస్కారాలను ఈ సందర్భంగా విశ్లేషించింది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు తమ జెర్సీలపై త్రివర్ణాలను, హెల్మెట్లపై అశోక ధర్మచక్రాన్ని ప్రముఖంగా ధరిస్తున్నారని, వారు సాధించిన ఘనతలకు భారత ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారాలను, పన్ను మినహాయింపులను, ప్రోత్సాహకాలను అందిస్తోందని... కాబట్టి దీన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్‌గా చూడలేమని, ప్రభుత్వ సంస్థే అవుతుందని కమిషన్ తమ సిఫారసులో పేర్కొంది. -
ఒక్క చోటే పోటీకి అవకాశం!
న్యూఢిల్లీ: ఎన్నికల్లో అభ్యర్థులు కేవలం ఒక్క చోట మాత్రమే పోటీ చేసేందుకు అవకాశముండాలని న్యాయ కమిషన్ సిఫారసు చేసింది. అంతేగాకుండా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయకుండా నిబంధనలు ఉండాలని ప్రతిపాదించింది. దాంతోపాటు ‘పెయిడ్ న్యూస్’పైనా కఠినంగా వ్యవహరించాలని.. వార్తలకు చెల్లించడంతో పాటు తీసుకోవడాన్నీ నేరంగా పరిగణించాలని సూచించింది. ఎన్నికల సంస్కరణలపై తమ ప్రతిపాదనలతో కూడిన రెండో నివేదికను న్యాయ కమిషన్ గురువారం సమర్పించింది. కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ ఎ.పి. షా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. న్యాయ కమిషన్ సూచనలు.. చెల్లింపు వార్తల (పెయిడ్ న్యూస్)పై కఠినంగా వ్యవహరించాలి. వార్తల కోసం డబ్బు ఇవ్వడంతో పాటు తీసుకోవడాన్ని కూడా ప్రజాప్రాతినిధ్య చట్టం కింద చేర్చి.. కఠిన శిక్షలను విధించాలి. వార్తల కోసం సొమ్ము చెల్లించే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలి. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఒక కొలీజియం ఏర్పాటు చేసి, దాని ద్వారానే భర్తీ చేయాలి. లోక్‌సభ, శాసనసభల కాలపరిమితి ముగియడానికి ఆరు నెలల ముందు నుంచే ప్రభుత్వ ప్రకటనలపై కఠినమైన నియంత్రణ, నిషేధం విధించాలి. ఎన్నికల వ్యయం లెక్కలను సమర్పించని అభ్యర్థులపై విధిస్తున్న నిషేధాన్ని మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచాలి. తద్వారా తర్వాతి ఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు అవకాశం ఉండదు. రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యయం లెక్కలు సమర్పించకపోతే.. పన్ను ప్రయోజనాలను తొలగించడంతో పాటు జరిమానాలు కూడా విధించాలి. రోజుకు రూ. 25 వేల జరిమానాతో పాటు 90 రోజుల పాటు అలాగే ఉంటే పార్టీల గుర్తింపును రద్దుచేయాలి. ఎన్నికల వ్యయానికి సంబంధించి ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ వేసిన నాటి నుంచి ఫలితాల విడుదల తేదీ వరకు లెక్కిస్తున్నారు... ఈ వ్యయ లెక్కింపు గడువును ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఫలితాల వెల్లడి తేదీ వరకు పెంచాలి. వివిధ కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే నిర్ణయాన్ని... ఆయా కంపెనీల డెరైక్టర్ల బోర్డులో కాకుండా, ఏటా జరిగే సభ్యులందరి సాధారణ సమావేశంలో తీర్మానం ద్వారా తీసుకొనేలా కంపెనీల చట్టాన్ని సవరించాలి. దేశంలో ప్రస్తుతమున్న లోక్‌సభ సీట్ల సంఖ్యను మరింత పెంచాలి. హైకోర్టుల్లో ఎన్నికల పిటిషన్లపై విచారణను వేగంగా పూర్తి చేయాలి. ఇందుకోసం హైకోర్టుల్లో ప్రత్యేకంగా బెంచ్‌లను ఏర్పాటు చేయవచ్చు. వీటిలో ఒకరు లేదా ఎక్కువ సంఖ్యలో న్యాయమూర్తులను నియమించడంపై ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికల్లో ‘నోటా (పై అభ్యర్థులెవరూ కాదు)’ను మరింతగా విస్తృతం చేసి, దానికి ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నికను రద్దు చేయాలన్న యోచన వద్దని న్యాయకమిషన్ సూచించింది. ఇక గెలిచినవారిని తిరిగి రీకాల్ (రైట్ టు రీకాల్) చేసే అవకాశాన్ని కల్పించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. దాని వల్ల అస్థిరత, గందరగోళం నెలకొంటుందని పేర్కొంది. ఎన్నికల్లో అభ్యర్థులెవరైనా కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉండాలి. దీనివల్ల ఓటర్లకు ఇబ్బందులు, ప్రభుత్వానికి అనవసరపు వ్యయం, శ్రమ తగ్గుతాయి. ఈ మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33(7)కు సవరణలు చేయాలి. ఎన్నికల్లో పోటీచేస్తున్నవారిలో డమ్మీ అభ్యర్థులే ఎక్కువ. ప్రధాన అభ్యర్థుల పేర్ల పోలికతో ఉండి ఓటర్లను తికమకపెట్టేందుకు స్వతంత్రులను పోటీ చేయిస్తున్నారు. కాబట్టి స్వతంత్రులకు పోటీ అవకాశం ఇవ్వరాదు. ఎవరైనా సీరియస్ అభ్యర్థులు ఉంటే వారు ఈసీ వద్ద ఓ పార్టీని రిజిస్టర్ చేసుకుని పోటీ చేయవచ్చు. ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రపతి, గవర్నర్లకు అప్పగించాలి. వారు ఈసీ సలహా మేరకు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి వాస్తవాధికారం ఎన్నికల సంఘానికే ఉన్నట్లవుతుంది. ఇది సభల స్పీకర్ల, చైర్మన్ల నిష్పాక్షికత్వాన్ని పెంచుతుంది. నిర్బంధ ఓటింగ్ అమలు యోచన సరికాదు. ఇది అసాధ్యం, విపరీతమైన వ్యయం అవుతుంది. నిర్బంధ ఓటింగ్ అప్రజాస్వామికమనే విమర్శలు వస్తాయి. అంతేగాక ఈ విధానం వల్ల ప్రజల్లో అవగాహన, రాజకీయ చైతన్యం పెంపొందించడం అసాధ్యం.