న్యూఢిల్లీ: దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్రం యోచనలో స్పష్టత వచ్చింది. వచ్చే ఏడాది లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను దేశమంతటా ఏకకాలంలో నిర్వహించే విషయంలో ఎన్నికల సంఘం(ఈసీ) అభిప్రాయం తెలపాల్సిందిగా కేంద్రం కోరనుంది. ఇందుకోసం లా కమిషన్ న్యాయ శాఖకు నివేదిక అందించనుంది. లా కమిషన్‌తోపాటు నీతి ఆయోగ్ దేశమంతా ఏకకాలంలో 2 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తే మేలని భావిస్తోంది. ఈ నివేదికలను కేంద్రం ఈసీకి పంపి, అభిప్రాయం తెలపాల్సిందిగా కోరనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
‘ఒకటే జాతి, ఒకటే ఎన్నిక’ అన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా లా కమిషన్ ముసాయిదా పత్రంలో దేశమంతా ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీలకు మొదటి దశ 2019లో, రెండో దశ 2024లో ఎన్నికలు జరపాలని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించటంతోపాటు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అసెంబ్లీల కాలపరిమితిని కుదించటం లేదా పొడిగించటం చేయాలని సూచించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ ఇటీవల మాట్లాడుతూ..‘ఏకకాలంలో ఎన్నికల విధానాన్ని ఆచరణలోకి తేవటానికి చట్టపరమైన ఏర్పాట్లు చేయాలి. ఇందుకు సమయం పడుతుంది. అన్నీ పూర్తయితే, ఎన్నికల సంఘం అమలు చేస్తుంది. రాజ్యాంగం చెప్పిందే ఎన్నికల కమిషన్ చేస్తుంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment