సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 224 స్థానాల్లో బుధవారం ఒకేదఫాలో ఎన్నికలు నిర్వహించారు. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ 10 గంటల తర్వాత పుంజుకుంది. మండుటెండలను సైతం లెక్కజేయకుండా ప్రజలంతా ఓట్లు వేసేందుకు బారులు తీరారు. మధ్యాహ్నం కల్లా 50 శాతం పోలింగ్ పూర్తయ్యింది.
రాత్రి 10 గంటలకల్లా అందిన సమాచారం ప్రకారం 71.77శాతం పోలింగ్ నమోదయ్యింది. పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. అత్యధికంగా రామనగర స్థానంలో 78.22 శాతం, బెంగళూరు నగరంలో భాగమైన బృహన్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) స్థానంలో అత్యల్పంగా 48.63 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 2,615 మంది అభ్యర్థులు నిలిచారు.
మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడియూరప్ప, డీవీ సదానంద గౌడ, సిద్ధరామయ్య, జగదీష్ షెట్టర్, కుమారస్వామి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి, సుధా నారాయణమూర్తి తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల13న ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 72.36 శాతం పోలింగ్ నమోదయ్యింది.
యాదగిరి జిల్లా శహపుర నియోజకవర్గం నగనూరు గ్రామంలో 105 ఏళ్ల వృద్ధురాలు దేవకమ్మ ఓటు వేశారు. మంగళూరులో ఆనంద ఆళ్వా (107), శివమొగ్గ జిల్లాలో బీబీ జాన్ (101) ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. బెళగావి జిల్లా శివపురలో పారవ్వ ఈశ్వర సిద్నాళ (68) అనే వృద్ధురాలు ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలి మరణించింది. హసన్ జిల్లాలో ఓ వ్యక్తి ఓటేసి బయటకు రాగానే హఠాత్తుగా గుండెపోటుకు గురై చనిపోయాడు.
మాదే విజయం: బొమ్మై
ఈసారి బీజేపీ పూర్తి మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని సీఎం బసవరాజ్ బొమ్మై ధీమా వెలిబుచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ కంటే తామే ఎక్కువ సీట్లు గెలుస్తామని, తమకు 120 వరకు వస్తాయని జేడీ(ఎస్) నేత కుమారస్వామి అన్నారు. కింగ్‌మేకర్ కాదు, కింగ్ అవుతామని చెప్పారు.
ఈవీఎంలు ధ్వంసం
విజయపుర జిల్లా మసాబినాల్ గ్రామంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. ఎన్నికల సంఘం అధికారిపై చెయ్యి చేసుకున్నా రు. ఈవీఎం కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లను గ్రామçస్తులు ధ్వంసం చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను మార్చేశారని పుకార్లు వ్యాపించడమే ఇందుకు కారణం. ఈసీ అధికారుల ఫిర్యాదు మేరకు 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పద్మనాభనగర్ నియోజకవర్గంలో కొందరు ప్రత్యర్థులపై భౌతిక దాడికి పాల్పడ్డారు. బళ్లారి జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment