one time elections
-
మండుటెండలను సైతం లెక్కజేయకుండా ఓట్లేసిన కన్నడిగులు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 224 స్థానాల్లో బుధవారం ఒకేదఫాలో ఎన్నికలు నిర్వహించారు. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ 10 గంటల తర్వాత పుంజుకుంది. మండుటెండలను సైతం లెక్కజేయకుండా ప్రజలంతా ఓట్లు వేసేందుకు బారులు తీరారు. మధ్యాహ్నం కల్లా 50 శాతం పోలింగ్ పూర్తయ్యింది. రాత్రి 10 గంటలకల్లా అందిన సమాచారం ప్రకారం 71.77శాతం పోలింగ్ నమోదయ్యింది. పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. అత్యధికంగా రామనగర స్థానంలో 78.22 శాతం, బెంగళూరు నగరంలో భాగమైన బృహన్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) స్థానంలో అత్యల్పంగా 48.63 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 2,615 మంది అభ్యర్థులు నిలిచారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడియూరప్ప, డీవీ సదానంద గౌడ, సిద్ధరామయ్య, జగదీష్ షెట్టర్, కుమారస్వామి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, సుధా నారాయణమూర్తి తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల13న ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 72.36 శాతం పోలింగ్ నమోదయ్యింది. యాదగిరి జిల్లా శహపుర నియోజకవర్గం నగనూరు గ్రామంలో 105 ఏళ్ల వృద్ధురాలు దేవకమ్మ ఓటు వేశారు. మంగళూరులో ఆనంద ఆళ్వా (107), శివమొగ్గ జిల్లాలో బీబీ జాన్ (101) ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. బెళగావి జిల్లా శివపురలో పారవ్వ ఈశ్వర సిద్నాళ (68) అనే వృద్ధురాలు ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలి మరణించింది. హసన్ జిల్లాలో ఓ వ్యక్తి ఓటేసి బయటకు రాగానే హఠాత్తుగా గుండెపోటుకు గురై చనిపోయాడు. మాదే విజయం: బొమ్మై ఈసారి బీజేపీ పూర్తి మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని సీఎం బసవరాజ్ బొమ్మై ధీమా వెలిబుచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ కంటే తామే ఎక్కువ సీట్లు గెలుస్తామని, తమకు 120 వరకు వస్తాయని జేడీ(ఎస్) నేత కుమారస్వామి అన్నారు. కింగ్‌మేకర్ కాదు, కింగ్ అవుతామని చెప్పారు. ఈవీఎంలు ధ్వంసం విజయపుర జిల్లా మసాబినాల్ గ్రామంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. ఎన్నికల సంఘం అధికారిపై చెయ్యి చేసుకున్నా రు. ఈవీఎం కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లను గ్రామçస్తులు ధ్వంసం చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను మార్చేశారని పుకార్లు వ్యాపించడమే ఇందుకు కారణం. ఈసీ అధికారుల ఫిర్యాదు మేరకు 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పద్మనాభనగర్ నియోజకవర్గంలో కొందరు ప్రత్యర్థులపై భౌతిక దాడికి పాల్పడ్డారు. బళ్లారి జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. -
జమిలిపై చర్చ ఊపందుకుంది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనపై చర్చ జరగటం ఆరోగ్యకర ప్రజాస్వామ్యానికి సంకేతమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ రాజకీయ భవిష్యత్తును మార్చిన మాజీ ప్రధాని వాజ్‌పేయికి మనమిచ్చే అసలైన నివాళి ఇదేనన్నారు. మాసాంతపు రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత్’ సందర్భంగా దేశాన్నుద్దేశించి ఆదివారం ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వం, విపక్షాలు ఈ అంశంపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఓ సానుకూల మార్పునకు నాంది. ప్రజాస్వామ్యానికి ఇది ఆరోగ్యకర పరిణామం. నిష్పక్షపాతంగా జరిగే చర్చలను ప్రోత్సహించడమే మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఇచ్చే ఘనమైన నివాళి’ అని మోదీ పేర్కొన్నారు. కేరళకు దేశం అండ ప్రకృతి ప్రకోపంతో విలవిల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి దేశ ప్రజలంతా మానవతా దృక్పథంతో సాయం చేయడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. జాతి, మత, ప్రాంత, లింగ భేదాల్లేకుండా, చిన్నారుల నుంచి వయోవృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా మనస్ఫూర్తిగా సాయానికి ముందుకురావడం గొప్ప పరిణామమన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటంలో ప్రాణాలకు తెగించి ప్రయత్నించిన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ తదితర విభాగాలు చేసిన సాయం మరువలేనిదన్నారు. ‘వరదలబారి నుంచి కోలుకుంటున్న కేరళ సాధారణ స్థితికి చేరుకోవాలని, తిరిగి అభివృద్ధి బాట పట్టాలని ఓనం సందర్భంగా భగవంతుడిని కోరుకుందాం. విపత్కర సమయంలో కేరళ, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల విషయంలో భారతీయులందరూ మానవత్వంతో స్పందించి సహాయ సహకారాలు అందించారు. దేశంలో ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తినా ప్రజలంతా ఒకే విధంగా స్పందించడం గొప్ప విషయం’ అని మోదీ పేర్కొన్నారు. వరదల్లో మృతిచెందిన వారి లోటు తీర్చలేనిదని.. అయితే ఆ కుటుంబాలు కోలుకునేందుకు దేశం అండగా నిలబడుతుందన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అభిలషించారు. భయంకరమైన పరిస్థితుల్లో కేరళ ప్రజలు గొప్ప మనోధైర్యాన్ని ప్రదర్శించారని ప్రశంసించారు. గొప్ప ప్రధాని వాజ్‌పేయి ఓ మంచి ఎంపీగా, సున్నితాంశాలను స్పృశించే రచయితగా, గొప్ప వక్తగా, దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని మోదీ పేర్కొన్నారు. దేశంలో సానుకూల రాజకీయ భవిష్యత్తును, సుపరిపాలనను తీసుకొచ్చిన వ్యక్తిగా వాజ్‌పేయిని కీర్తించారు. వాజ్‌పేయి ప్రధాని అయ్యేంతవరకు సాయంత్రం ఐదుగంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారని.. ఆయన వచ్చాక ఉదయం 11 గంటలకే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జాతీయ పతాకాన్ని ఎగరేసే నిబంధనలను సరళీకరించడం ద్వారా సామాన్యుడికీ త్రివర్ణపతాకం దగ్గరయ్యిందన్నారు. 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాల కేబినెట్ మంత్రుల సంఖ్యను అసెంబ్లీ సీట్లలో 15% నియంత్రించడం ద్వారా ప్రజాధనం, అధికార దుర్వినియోగం తగ్గిందన్నారు. ఇలాం టి ఎన్నో మార్పులు తెచ్చినందుకే దేశం వాజ్‌పేయిని ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. ఆడబిడ్డలకు పతకాలు శుభపరిణామం ఆసియా క్రీడల్లో భారత ఆడబిడ్డలు సాధిస్తున్న విజయాలు దేశ క్రీడారంగానికి ఓ శుభపరిణామమని మోదీ పేర్కొన్నారు. ఇండోనేసియాలో జరుగుతున్న ఈ ఈ క్రీడల్లో మనవాళ్లు సాధిస్తున్న విజయాలపై భారతీయులంతా ఆసక్తిగా రోజూ పేపర్లు, టీవీలు చూస్తున్నారన్నారు. ఆదివారం రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండగ సందర్భంగా 55 మంది మహిళలను మోదీ ట్వీటర్లో ఫాలో అయ్యారు. ఇందులో క్రీడా, కళా, మీడియారంగాల ప్రముఖులున్నారు. సానియా మీర్జా, పీటీ ఉష, కరణం మల్లీశ్వరి, మాజీ మిస్ ఇండియా స్వరూప్ తదితరులు ఉన్నారు. రేప్‌లను సహించబోం దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలను సహించే ప్రసక్తే లేదని ప్రధాని స్పష్టం చేశారు. ఈ దిశగా పార్లమెంటులో చేసిన చట్టం ద్వారా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు కూడా రాజ్యసభలో త్వరలోనే ఆమోదముద్ర పడేలా చూస్తామన్నారు. ‘దేశంలోని ముస్లిం మహిళలకు యావద్భారతం అండగా ఉంటుంది. వారికి సామాజిక న్యాయం కల్పిస్తాం. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రభుత్వం, పౌర సమాజం సహించదు. మహిళలపై అత్యాచార కేసుల్లో దోషిగా తేలిన వారికి పదేళ్ల జైలు, 12ఏళ్ల లోపు చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడితే ఉరిశిక్ష తప్పదు’ అని మోదీ పేర్కొన్నారు. -
‘జమిలి’కి చాన్సే లేదు: సీఈసీ రావత్
ఔరంగాబాద్: దేశంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశమే లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ముందుగా న్యాయపరమైన ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందన్నారు. అందుకే పార్లమెంటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఓటరు ధ్రువీకరణ పత్రాలు (వీవీపీఏటీ) యంత్రాలు 100% సిద్ధంగా ఉన్నాయన్నారు. 2019 ఎన్నికల కోసం 17.5 లక్షల వీవీపీఏటీలు ఆర్డర్ ఇవ్వగా.. ఇందులో 10 లక్షల యంత్రాలు వచ్చేశాయన్నారు. మిగిలినవి కూడా త్వరలోనే వస్తాయని ఆయన వెల్లడించారు. సహజంగానే సార్వత్రిక ఎన్నికలకు 14 నెలల ముందునుంచే ఎన్నికల సంఘం సిద్ధమవుతుందని ఈసారి కూడా 2018 ఫిబ్రవరి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. -
లోక్‌సభతోపాటు 11 రాష్ట్రాలకూ ఎన్నికలు!
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలతోపాటే 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పును అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. జమిలీ ఎన్నికలకు తాము సిద్ధమేనంటూ న్యాయ కమిషన్‌కు పార్టీ చీఫ్ అమిత్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ పరిణామాలకు ప్రాధాన్యత ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏడాదిన్నరలోపు ఎన్నికలు జరిగే (మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్) రాష్ట్రాలకు కూడా 2019లో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ చూస్తోంది. బిహార్ అసెంబ్లీకి 2020లో ఎన్నికలు జరగనున్నాయి. జేడీయూ బీజేపీ ఆలోచనకు మద్దతు తెలుపుతుండటంతో.. బిహార్‌ను ఈ జాబితాలో కలుపుతారని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మిజోరంలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చని భావిస్తున్నారు. అధిష్టానంతోపాటు పార్టీలోనూ ఒకేసారి ఎన్నికలు జరపడం ద్వారా మోదీ హవా.. రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ప్రతిబింబిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతను ఎదుర్కొనవచ్చని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటున్నాయి. బీజేపీ అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్య వ్యతిరేకమని విమర్శిస్తున్నాయి. ఏకకాల ఎన్నికలకు బీజేపీ మద్దతు దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అధికార బీజేపీ మద్దతు ప్రకటించింది. ఈ విధానం వల్ల ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందని, దేశమంతా ఏడాది పొడవునా ఎన్నికల వాతావరణం ఉండకుండా చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా న్యాయ కమిషన్‌కు లేఖ రాశారు. ఈ లేఖను సోమవారం పార్టీ నేతలు లా కమిషన్‌కు అందజేశారు. ఏకకాలంలో ఎన్నికలు ఆలోచన మాత్రమే కాదు. ఆచరించదగింది కూడా అని పేర్కొన్నారు. రెండు దఫాలుగా ఎన్నికలు జరపడం వల్ల దేశ సమాఖ్య విధానం మరింత బలోపేతం అవుతుందని లేఖలో షా తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధమే లేదన్నారు. తరచూ ఎన్నికలు పెడితే ఎన్నికల నియమావళి అమలవుతుందని, ఆ క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలకు, విధాన నిర్ణయాలకు అవరోధం కలుగుతుందని తెలిపారు. ఏకకాల ఎన్నికలపై ప్రతిపక్షాల వ్యతిరేకత రాజకీయపరమైనదిగా కనిపిస్తోందన్నారు. అధికార ఎన్డీఏ పక్షంతోపాటు అకాలీదళ్, ఏఐఏడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, టీఆర్ఎస్ ఏకకాల ఎన్నికలను సమర్ధించగా, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, టీడీపీ, జేడీఎస్, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. -
4 అనుకూలం.. 9 వ్యతిరేకం
న్యూఢిల్లీ: లోక్‌సభ, అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. నాలుగు పార్టీలు ఏకకాల ఎన్నికలకు తమ మద్దతు తెలపగా, 9 పార్టీలు వ్యతిరేకించాయి. ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఏ మాటా చెప్పకుండా తమకు మరికొంత సమయం కావాలన్నాయి. ఒకేసారి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా న్యాయ కమిషన్ గతంలో రాజకీయ పార్టీలను కోరింది. శని, ఆదివారాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు న్యాయకమిషన్ చైర్మన్‌ను కలసి అభిప్రాయాలను వెలిబుచ్చారు. శిరోమణి అకాలీ దళ్, టీఆర్ఎస్, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లు ఏకకాల ఎన్నికలకు తమ మద్దతు తెలిపాయి. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడే ఏకకాల ఎన్నికలను జరిపితేనే సమర్థిస్తామని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ చెప్పారు. 2019లో ఏకకాల ఎన్నికలు నిర్వహిస్తే యూపీలో 2017లో ఏర్పడిన ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రద్దయి మళ్లీ ఎన్నికలొస్తాయి. టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, జేడీఎస్, ఏఐఎఫ్బీ, గోవా ఫార్వర్డ్ పార్టీలు వ్యతిరేకించాయి. ఏకకాల ఎన్నికలకు తాము అనుకూలమేనంటూ జేడీయూ ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్‌లు జూలై 31లోపు తమ అభిప్రాయాలను చెప్పనున్నాయి. ఎన్నికలను ఆలస్యం చేసే కుట్ర: ఆప్ ఆప్ సీనియర్ నేత ఆశిశ్ ఖేతన్ న్యాయకమిషన్ చైర్మన్‌ను కలసి తమ పార్టీ అభిప్రాయాన్ని తెలియజెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో శాసనసభల పదవీకాలాన్ని పొడిగించి, ఎన్నికలను జాప్యం చేసేందుకు కుట్ర జరుగుతోందనీ, అందుకే ఏకకాల ఎన్నికలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. అన్నాడీఎంకే తరఫున తంబిదురై న్యాయ కమిషన్ చైర్మన్‌తో భేటీ అయ్యారు. ఏకకాల ఎన్నికలకు తాము అనుకూలమేననీ, అయితే దీన్ని ఆచరణలోకి తేవాలంటే ముందుగా ఈ ప్రక్రియకు ఉన్న అడ్డంకులను తొలగించాలని తంబిదురై చెప్పారు. ఏకకాల ఎన్నికలు జరిగితే జాతీయ పార్టీలు తమ ధనబలంతో ఎన్నికల్లో అవినీతికి పాల్పడతాయనీ, ఈ ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బంధోపాధ్యాయ్ స్పష్టం చేశారు. ఈ ఆలోచన మాదే: బీజేడీ ఏక కాల ఎన్నికలకు తాము పూర్తిగా మద్దతిస్తామనీ, అసలు ఆ ఆలోచన తమ పార్టీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌దేనని బిజూ జనతా దళ్ (బీజేడీ) తెలిపింది. ఏకకాల ఎన్నికల ప్రతిపాదనను తొలిసారిగా నవీన్ పట్నాయక్ 2004లోనే తీసుకొచ్చారంది. ఒడిశాలో 2005లో జరగాల్సిన శాసనసభ ఎన్నికలను నవీన్ పట్నాయక్ ఏడాది ముందుకు జరిపి, 2004లో లోక్‌సభ ఎన్నికలతోపాటే జరిగేలా చేశారని బీజేడీ ఎంపీ పినాకి మిశ్రా చెప్పారు. తమ అభిప్రాయాన్ని నివేదిక రూపంలో త్వరలోనే న్యాయకమిషన్‌కు అందజేస్తామని పినాకి మిశ్రా చెప్పారు. -
2019లోనే అసెంబ్లీ ఎన్నికలు పెడ్తారా?
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనల్లో ఒకటైన ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’కు తాము సిద్ధంగానే ఉన్నామని ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే, 2019లో ఉత్తరప్రదేశ్‌లో కూడా శాసనసభ, లోక్‌సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి మీరు సిద్ధమేనా అని బీజేపీకి ఆయన సవాలు విసిరారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆధార్ నంబరుతో ఓటర్లను అనుసంధానించడంలోగానీ, ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనపై గానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 2019లో ఒకేసారి ఎన్నికల్లో భాగంగా యూపీ శాసన సభకు కూడా ఎన్నికలు నిర్వహించమని బీజేపీని అడుగుతున్నాను’’అని అన్నారు. -
ఏకకాలంలో ఓకేనా?
న్యూఢిల్లీ: దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్రం యోచనలో స్పష్టత వచ్చింది. వచ్చే ఏడాది లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను దేశమంతటా ఏకకాలంలో నిర్వహించే విషయంలో ఎన్నికల సంఘం(ఈసీ) అభిప్రాయం తెలపాల్సిందిగా కేంద్రం కోరనుంది. ఇందుకోసం లా కమిషన్ న్యాయ శాఖకు నివేదిక అందించనుంది. లా కమిషన్‌తోపాటు నీతి ఆయోగ్ దేశమంతా ఏకకాలంలో 2 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తే మేలని భావిస్తోంది. ఈ నివేదికలను కేంద్రం ఈసీకి పంపి, అభిప్రాయం తెలపాల్సిందిగా కోరనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘ఒకటే జాతి, ఒకటే ఎన్నిక’ అన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా లా కమిషన్ ముసాయిదా పత్రంలో దేశమంతా ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీలకు మొదటి దశ 2019లో, రెండో దశ 2024లో ఎన్నికలు జరపాలని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించటంతోపాటు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అసెంబ్లీల కాలపరిమితిని కుదించటం లేదా పొడిగించటం చేయాలని సూచించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ ఇటీవల మాట్లాడుతూ..‘ఏకకాలంలో ఎన్నికల విధానాన్ని ఆచరణలోకి తేవటానికి చట్టపరమైన ఏర్పాట్లు చేయాలి. ఇందుకు సమయం పడుతుంది. అన్నీ పూర్తయితే, ఎన్నికల సంఘం అమలు చేస్తుంది. రాజ్యాంగం చెప్పిందే ఎన్నికల కమిషన్ చేస్తుంది’ అని అన్నారు. -
ఒకేసారి ఎన్నికలు రెండు దశల్లో!
న్యూఢిల్లీ: దేశమంతటా ఒకేసారి ఎన్నికలను రెండు దశలుగా విభజించి నిర్వహించాలని న్యాయ కమిషన్ సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను 2019 లోక్‌సభ ఎన్నికలతోపాటు, మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలను 2024 సాధారణ ఎన్నికల సమయంలో నిర్వహించాలని కమిషన్ సూచించనుంది. లా కమిషన్ అంతర్గతంగా రూపొందించిన ఓ ముసాయిదాలో ఈ విషయం ఉన్నట్లు సమాచారం. ఒకేసారి ఎన్నికల కోసం కొన్ని రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని కొంత కుదించడం, మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితిని పెంచడం చేయాలనీ, ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలని కమిషన్ సూచించనుంది. -
ముందస్తు ఎన్నికలకు వెళ్లం
న్యూఢిల్లీ: ఏకకాల ఎన్నికలకు కేంద్రం అనుకూలంగానే ఉందని, కానీ అందుకోసం లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరపబోమని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసి లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహించే అవకాశాలను కూడా కొట్టిపారేశారు. న్యూస్ 18 నెట్వర్క్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన శనివారం ఈ విషయాలు వెల్లడించారు. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ తదితరులు ఇటీవల ఏకకాల ఎన్నికలపై మాట్లాడటంతో..లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరుపుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాజ్యాంగాన్ని సవరించి, పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించే వరకు ఏకకాల ఎన్నికల నిర్వహణ అసాధ్యమని జైట్లీ వెల్లడించారు. ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో ఆసక్తి లేనట్లు వ్యవహరిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. -
ఏకకాల ఎన్నికలే మేలు
న్యూఢిల్లీ: ఖజానాపై భారాన్ని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. రోజూ ఏదోచోట ఎన్నికలు జరుగుతున్న కారణంగా దేశాభివృద్ధికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని.. అందువల్ల ఈ విషయంపై అన్ని పార్టీలూ కలిసి చర్చించాలని ఆయన సోమవారం సూచించారు. పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి తొలిసారి ప్రసంగించిన రాష్ట్రపతి.. ఖజానాపై భారాన్ని తగ్గించేందుకు ఏకకాల ఎన్నికల నిర్వహణ అంశాన్ని ప్రస్తావించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు వివిధ పథకాలను కేంద్రం అందుబాటులోకి తెచ్చిందన్నారు. అందరికీ ఇళ్లు, నిరంతర విద్యుత్, పేదలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు జరుగుతున్న మేలును కూడా రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు, బీజేపీ చీఫ్ అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్థిక భారం.. అభివృద్ధికి ఆటంకం తరచుగా దేశంలో ఎన్నికలు జరుగుతున్నందున ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని.. ఆర్థిక వ్యవస్థపై, దేశాభివృద్ధిపై దీని ప్రభావం ప్రతికూలంగా ఉంటోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ‘ఎప్పుడూ ఎన్నికలు జరగటం వల్ల ఆర్థికంగా, మానవ వనరులపై భారం పడుతోంది. దేశవ్యాప్తంగా ఎప్పుడూ ఒక చోట ఎన్నికల కారణంగా నియమావళి అమల్లో ఉండటంతో అభివృద్ధి ప్రక్రియకూ ఇది విఘాతం కలిగిస్తోంది. అందుకే జమిలి ఎన్నికల నిర్వహణపై సమగ్రమైన చర్చ జరగాలి. అన్ని రాజకీయ పక్షాలు దీనిపై ఏకాభిప్రాయానికి రావాలి. నవభారత నిర్మాణం ఒకపార్టీకో ఒక సంస్థకో సంబంధించిన అంశం కాదు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అన్ని పార్టీలు చిత్తశుద్ధితో కలిసి పనిచేయాలి’ అని రామ్‌నాథ్ కోవింద్ వెల్లడించారు. ముస్లిం చెల్లెళ్ల ఆత్మగౌరవ సమస్య ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిందని.. ఈ బిల్లు త్వరలోనే చట్టరూపం దాల్చుతుందని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. ‘దశాబ్దాలుగా రాజకీయ లబ్ధికోసం ముస్లిం మహిళల ఆత్మగౌరవం అంశం మరుగున పడింది. ఇలాంటి దుస్సంప్రదాయాన్ని పారద్రోలే గొప్ప అవకాశం ఇప్పుడు దేశానికి కలిగింది. ఒకవేళ ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. ముస్లిం సోదరీమణులు, కూతుళ్లకు జీవితాన్ని అందించిన వారవుతాం. గర్వంగా బతికే అవకాశాన్నిచ్చిన వాళ్లవుతాం’ అని రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ప్రభుత్వం మైనారిటీలను బుజ్జగించాలని అనుకోవటం లేదని వారికి ఆర్థిక, సామాజిక, విద్యా రంగాల్లో సాధికారత కల్పించాలనే పట్టుదలతో ఉందని తెలిపారు. సీఖో ఔర్ కమావో, ఉస్తాద్, గరీబ్ నవాజ్ కౌశల్ వికాస్ యోజన, నయీ రోష్నీ వంటి పథకాల ద్వారా ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు ఇలా అన్ని వర్గాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికోసం వెనుకబడిన వర్గాలు, పేదల అభ్యున్నతే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకూ న్యాయం జరిగేలా ముందుకెళ్తోందన్నారు. వ్యవసాయోత్పత్తులకు జరుగుతున్న నష్టాన్ని నివారించటం, సరైన నిల్వ, 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం, యూరియా ఉత్పాదన పెంచటం వంటి వివిధ ప్రభుత్వ పథకాలనూ రాష్ట్రపతి ప్రస్తావించారు. ఈ–నామ్ వంటి ఆన్లైన్ వ్యవసాయ మార్కెట్‌ను ప్రోత్సహించటం, పాడిఉత్పత్తిని పెంచేలా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. దేశంలోని అన్ని గ్రామాలను రోడ్లతో అనుసంధానించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉన్నప్పటికీ భారత్ మంచి వృద్ధిరేటుతోనే ముందుకెళ్తోందన్నారు. 2016–17 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు స్వల్పంగా తగ్గినా.. 2017–18 రెండో త్రైమాసికానికల్లా పురోగతి బాట పట్టిందన్నారు. దేశంలో ఆర్థిక సమగ్రతకోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రూపంలో అతిపెద్ద ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చిందన్నారు. రూ. 2లక్షల కోట్లను పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్‌లోకి ప్రవేశపెట్టడం ద్వారా వ్యవస్థ పునరుత్తేజం చేసిందన్నారు. అవినీతిపై పోరాటంలో భాగంగా 3.5 లక్షల అనుమానాస్పద కంపెనీలను రద్దుచేశామని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆర్మీ, పారామిలటరీ బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు సమన్వయం కారణంగా జమ్మూకశ్మీర్‌లో ఆందోళలను తగ్గాయన్నారు. విద్యావ్యవస్థ ఆధునికీకరణ దేశ భవిష్యత్తుకు పునాది వేసే ఉన్నత విద్యావ్యవస్థ, పాఠశాలలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం పరీక్షలను నిర్వహించేలా ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ పేరుతో ఓ స్వతంత్రవ్యవస్థను ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. మూడున్నరేళ్లలో 93 లక్షల ఇళ్లను కేంద్రం నిర్మించి ఇచ్చిందని ఆయన తెలిపారు. 2022కల్లా దేశంలో ప్రతి ఒక్కరికీ ఇళ్లుండాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దేశంలోని ప్రతి ఇంటికీ విద్యుత్, నీరు, మరుగుదొడ్డి వసతులుండాలనేదే కేంద్రం ఉద్దేశమన్నారు. ఉడాన్ పథకం ద్వారా తక్కువ ధరకే సామాన్యులకూ విమానయానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోందన్నారు. కొంతకాలంగా అంతర్జాతీయంగా భారత్‌కు గొప్ప గౌరవం దక్కుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. తొలి వరుసలో రాహుల్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలి వరుసలో ఆశీనులయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాహుల్‌కు ఆరో వరుసలో సీటును కేటాయించడంతో బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు చేయడం తెలిసిందే. ► సెంట్రల్ హాల్లో రాహుల్ తన తల్లి సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గేలతో ఎక్కువసేపు మాట్లాడుతూ కనిపించారు. సోనియా కూడా తొలివరుసలోనే, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ పక్కన కూర్చున్నారు. ఈ సందర్భంలో అడ్వాణీతో సోనియా మాట కలిపారు. ► విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే కూడా సోనియా గాంధీని పలకరించారు. ► సమాచార, ప్రసారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ కేవలం అడ్వాణీని మాత్రమే పలకరించి సోనియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ► ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తదితరులు కూడా తొలివరుసలో కూర్చున్నారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ రెండో వరసలో, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తదితరులు మూడో వరుసలో కూర్చున్నారు. ► ప్రసంగం అనంతరం తొలి వరుసలో కూర్చున్న పురుష ఎంపీలందరితోనూ కరచాలనం చేసిన రాష్ట్రపతి, మహిళా ఎంపీలకు రెండు చేతులతో నమస్కరించారు. రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో సభ్యులు -
మూణ్నెళ్లకొకసారి ఎన్నికలేంటి?
సీతాదేవి శీలాన్ని పరీక్షించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం స్వాగతిస్తానని, సీతాదేవి శీలాన్ని పరీక్షించిన మాదిరిగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అన్న ప్రధాన మంత్రి మోదీ ప్రతిపాదన గురించి ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఏదో చేయాలని తొందరపడి గతంలో ఎన్నికలప్పుడు పరుగెత్తడం వల్ల ఇబ్బంది వచ్చిందని, ఈసారి అలా కాకుండా సుస్థిరమైన పాలన కోసం ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళతానన్నారు. కియా సంస్థతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని ప్రతి పౌరుడికి కనీసం ద్విచక్రవాహనం, లేదా కారు ఉండాలని నాలుగు రోజుల క్రితం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో టీమిండియా నిర్ణయించినట్లు తెలిపారు. గ్లోబల్ ఆటోమొబైల్ జెయింట్గా కియా మోటార్స్ రాష్ట్రానికి రావడం ఎంతో శుభ సూచకమని సీఎం అన్నారు. అనంతపురం జిల్లాలోని ఎర్రమంచి గ్రామంలో ఈ సంస్థ రూ. 12,900 కోట్ల పెట్టుబడితో కార్ల తయారీ ప్లాంట్‌ను స్థాపించేందుకు ముందుకు వచ్చినట్లు వివరించారు.