
న్యూఢిల్లీ: లోక్‌సభ, అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. నాలుగు పార్టీలు ఏకకాల ఎన్నికలకు తమ మద్దతు తెలపగా, 9 పార్టీలు వ్యతిరేకించాయి. ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఏ మాటా చెప్పకుండా తమకు మరికొంత సమయం కావాలన్నాయి. ఒకేసారి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా న్యాయ కమిషన్ గతంలో రాజకీయ పార్టీలను కోరింది. శని, ఆదివారాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు న్యాయకమిషన్ చైర్మన్‌ను కలసి అభిప్రాయాలను వెలిబుచ్చారు.
శిరోమణి అకాలీ దళ్, టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లు ఏకకాల ఎన్నికలకు తమ మద్దతు తెలిపాయి. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడే ఏకకాల ఎన్నికలను జరిపితేనే సమర్థిస్తామని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ చెప్పారు. 2019లో ఏకకాల ఎన్నికలు నిర్వహిస్తే యూపీలో 2017లో ఏర్పడిన ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రద్దయి మళ్లీ ఎన్నికలొస్తాయి. టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, జేడీఎస్, ఏఐఎఫ్‌బీ, గోవా ఫార్వర్డ్ పార్టీలు వ్యతిరేకించాయి. ఏకకాల ఎన్నికలకు తాము అనుకూలమేనంటూ జేడీయూ ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్‌లు జూలై 31లోపు తమ అభిప్రాయాలను చెప్పనున్నాయి.
ఎన్నికలను ఆలస్యం చేసే కుట్ర: ఆప్
ఆప్ సీనియర్ నేత ఆశిశ్ ఖేతన్ న్యాయకమిషన్ చైర్మన్‌ను కలసి తమ పార్టీ అభిప్రాయాన్ని తెలియజెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో శాసనసభల పదవీకాలాన్ని పొడిగించి, ఎన్నికలను జాప్యం చేసేందుకు కుట్ర జరుగుతోందనీ, అందుకే ఏకకాల ఎన్నికలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. అన్నాడీఎంకే తరఫున తంబిదురై న్యాయ కమిషన్ చైర్మన్‌తో భేటీ అయ్యారు. ఏకకాల ఎన్నికలకు తాము అనుకూలమేననీ, అయితే దీన్ని ఆచరణలోకి తేవాలంటే ముందుగా ఈ ప్రక్రియకు ఉన్న అడ్డంకులను తొలగించాలని తంబిదురై చెప్పారు. ఏకకాల ఎన్నికలు జరిగితే జాతీయ పార్టీలు తమ ధనబలంతో ఎన్నికల్లో అవినీతికి పాల్పడతాయనీ, ఈ ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బంధోపాధ్యాయ్ స్పష్టం చేశారు.
ఈ ఆలోచన మాదే: బీజేడీ
ఏక కాల ఎన్నికలకు తాము పూర్తిగా మద్దతిస్తామనీ, అసలు ఆ ఆలోచన తమ పార్టీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌దేనని బిజూ జనతా దళ్ (బీజేడీ) తెలిపింది. ఏకకాల ఎన్నికల ప్రతిపాదనను తొలిసారిగా నవీన్ పట్నాయక్ 2004లోనే తీసుకొచ్చారంది. ఒడిశాలో 2005లో జరగాల్సిన శాసనసభ ఎన్నికలను నవీన్ పట్నాయక్ ఏడాది ముందుకు జరిపి, 2004లో లోక్‌సభ ఎన్నికలతోపాటే జరిగేలా చేశారని బీజేడీ ఎంపీ పినాకి మిశ్రా చెప్పారు. తమ అభిప్రాయాన్ని నివేదిక రూపంలో త్వరలోనే న్యాయకమిషన్‌కు అందజేస్తామని పినాకి మిశ్రా చెప్పారు.