తనకు రాఖీ కట్టిన చిన్నారిని ఆశీర్వదిస్తున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనపై చర్చ జరగటం ఆరోగ్యకర ప్రజాస్వామ్యానికి సంకేతమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ రాజకీయ భవిష్యత్తును మార్చిన మాజీ ప్రధాని వాజ్‌పేయికి మనమిచ్చే అసలైన నివాళి ఇదేనన్నారు. మాసాంతపు రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత్’ సందర్భంగా దేశాన్నుద్దేశించి ఆదివారం ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వం, విపక్షాలు ఈ అంశంపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఓ సానుకూల మార్పునకు నాంది. ప్రజాస్వామ్యానికి ఇది ఆరోగ్యకర పరిణామం. నిష్పక్షపాతంగా జరిగే చర్చలను ప్రోత్సహించడమే మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఇచ్చే ఘనమైన నివాళి’ అని మోదీ పేర్కొన్నారు.
కేరళకు దేశం అండ
ప్రకృతి ప్రకోపంతో విలవిల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి దేశ ప్రజలంతా మానవతా దృక్పథంతో సాయం చేయడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. జాతి, మత, ప్రాంత, లింగ భేదాల్లేకుండా, చిన్నారుల నుంచి వయోవృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా మనస్ఫూర్తిగా సాయానికి ముందుకురావడం గొప్ప పరిణామమన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటంలో ప్రాణాలకు తెగించి ప్రయత్నించిన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఆర్‌ఏఎఫ్ తదితర విభాగాలు చేసిన సాయం మరువలేనిదన్నారు.
‘వరదలబారి నుంచి కోలుకుంటున్న కేరళ సాధారణ స్థితికి చేరుకోవాలని, తిరిగి అభివృద్ధి బాట పట్టాలని ఓనం సందర్భంగా భగవంతుడిని కోరుకుందాం. విపత్కర సమయంలో కేరళ, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల విషయంలో భారతీయులందరూ మానవత్వంతో స్పందించి సహాయ సహకారాలు అందించారు. దేశంలో ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తినా ప్రజలంతా ఒకే విధంగా స్పందించడం గొప్ప విషయం’ అని మోదీ పేర్కొన్నారు. వరదల్లో మృతిచెందిన వారి లోటు తీర్చలేనిదని.. అయితే ఆ కుటుంబాలు కోలుకునేందుకు దేశం అండగా నిలబడుతుందన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అభిలషించారు. భయంకరమైన పరిస్థితుల్లో కేరళ ప్రజలు గొప్ప మనోధైర్యాన్ని ప్రదర్శించారని ప్రశంసించారు.
గొప్ప ప్రధాని వాజ్‌పేయి
ఓ మంచి ఎంపీగా, సున్నితాంశాలను స్పృశించే రచయితగా, గొప్ప వక్తగా, దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని మోదీ పేర్కొన్నారు. దేశంలో సానుకూల రాజకీయ భవిష్యత్తును, సుపరిపాలనను తీసుకొచ్చిన వ్యక్తిగా వాజ్‌పేయిని కీర్తించారు. వాజ్‌పేయి ప్రధాని అయ్యేంతవరకు సాయంత్రం ఐదుగంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారని.. ఆయన వచ్చాక ఉదయం 11 గంటలకే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జాతీయ పతాకాన్ని ఎగరేసే నిబంధనలను సరళీకరించడం ద్వారా సామాన్యుడికీ త్రివర్ణపతాకం దగ్గరయ్యిందన్నారు. 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాల కేబినెట్ మంత్రుల సంఖ్యను అసెంబ్లీ సీట్లలో 15% నియంత్రించడం ద్వారా ప్రజాధనం, అధికార దుర్వినియోగం తగ్గిందన్నారు. ఇలాం టి ఎన్నో మార్పులు తెచ్చినందుకే దేశం వాజ్‌పేయిని ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు.
ఆడబిడ్డలకు పతకాలు శుభపరిణామం
ఆసియా క్రీడల్లో భారత ఆడబిడ్డలు సాధిస్తున్న విజయాలు దేశ క్రీడారంగానికి ఓ శుభపరిణామమని మోదీ పేర్కొన్నారు. ఇండోనేసియాలో జరుగుతున్న ఈ ఈ క్రీడల్లో మనవాళ్లు సాధిస్తున్న విజయాలపై భారతీయులంతా ఆసక్తిగా రోజూ పేపర్లు, టీవీలు చూస్తున్నారన్నారు. ఆదివారం రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండగ సందర్భంగా 55 మంది మహిళలను మోదీ ట్వీటర్‌లో ఫాలో అయ్యారు. ఇందులో క్రీడా, కళా, మీడియారంగాల ప్రముఖులున్నారు. సానియా మీర్జా, పీటీ ఉష, కరణం మల్లీశ్వరి, మాజీ మిస్ ఇండియా స్వరూప్ తదితరులు ఉన్నారు.
రేప్‌లను సహించబోం
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలను సహించే ప్రసక్తే లేదని ప్రధాని స్పష్టం చేశారు. ఈ దిశగా పార్లమెంటులో చేసిన చట్టం ద్వారా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు కూడా రాజ్యసభలో త్వరలోనే ఆమోదముద్ర పడేలా చూస్తామన్నారు. ‘దేశంలోని ముస్లిం మహిళలకు యావద్భారతం అండగా ఉంటుంది. వారికి సామాజిక న్యాయం కల్పిస్తాం. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రభుత్వం, పౌర సమాజం సహించదు. మహిళలపై అత్యాచార కేసుల్లో దోషిగా తేలిన వారికి పదేళ్ల జైలు, 12ఏళ్ల లోపు చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడితే ఉరిశిక్ష తప్పదు’ అని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment