ఏకకాల ఎన్నికలే మేలు | President Kovind pitches for simultaneous elections | Sakshi
Sakshi News home page

ఏకకాల ఎన్నికలే మేలు

Published Tue, Jan 30 2018 1:42 AM | Last Updated on Tue, Jan 30 2018 3:58 AM

President Kovind pitches for simultaneous elections - Sakshi

పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌కు వెళ్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్, ఉప రాష్ట్రపతి వెంకయ్య, లోక్‌సభ స్పీకర్‌ మహాజన్, ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఖజానాపై భారాన్ని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అభిప్రాయపడ్డారు. రోజూ ఏదోచోట ఎన్నికలు జరుగుతున్న కారణంగా దేశాభివృద్ధికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని.. అందువల్ల ఈ విషయంపై అన్ని పార్టీలూ కలిసి చర్చించాలని ఆయన సోమవారం సూచించారు. పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి తొలిసారి ప్రసంగించిన రాష్ట్రపతి.. ఖజానాపై భారాన్ని తగ్గించేందుకు ఏకకాల ఎన్నికల నిర్వహణ అంశాన్ని ప్రస్తావించారు.

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు వివిధ పథకాలను కేంద్రం అందుబాటులోకి తెచ్చిందన్నారు. అందరికీ ఇళ్లు, నిరంతర విద్యుత్, పేదలకు ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్ల వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు జరుగుతున్న మేలును కూడా రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆర్థిక భారం.. అభివృద్ధికి ఆటంకం
తరచుగా దేశంలో ఎన్నికలు జరుగుతున్నందున ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని.. ఆర్థిక వ్యవస్థపై, దేశాభివృద్ధిపై దీని ప్రభావం ప్రతికూలంగా ఉంటోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ‘ఎప్పుడూ ఎన్నికలు జరగటం వల్ల ఆర్థికంగా, మానవ వనరులపై భారం పడుతోంది. దేశవ్యాప్తంగా ఎప్పుడూ ఒక చోట ఎన్నికల కారణంగా నియమావళి అమల్లో ఉండటంతో అభివృద్ధి ప్రక్రియకూ ఇది విఘాతం కలిగిస్తోంది. అందుకే జమిలి ఎన్నికల నిర్వహణపై సమగ్రమైన చర్చ జరగాలి. అన్ని రాజకీయ పక్షాలు దీనిపై ఏకాభిప్రాయానికి రావాలి. నవభారత నిర్మాణం ఒకపార్టీకో ఒక సంస్థకో సంబంధించిన అంశం కాదు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అన్ని పార్టీలు చిత్తశుద్ధితో కలిసి పనిచేయాలి’ అని రామ్‌నాథ్‌ కోవింద్‌ వెల్లడించారు.  

ముస్లిం చెల్లెళ్ల ఆత్మగౌరవ సమస్య
ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిందని.. ఈ బిల్లు త్వరలోనే చట్టరూపం దాల్చుతుందని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. ‘దశాబ్దాలుగా రాజకీయ లబ్ధికోసం ముస్లిం మహిళల ఆత్మగౌరవం అంశం మరుగున పడింది. ఇలాంటి దుస్సంప్రదాయాన్ని పారద్రోలే గొప్ప అవకాశం ఇప్పుడు దేశానికి కలిగింది. ఒకవేళ ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. ముస్లిం సోదరీమణులు, కూతుళ్లకు జీవితాన్ని అందించిన వారవుతాం. గర్వంగా బతికే అవకాశాన్నిచ్చిన వాళ్లవుతాం’ అని రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం మైనారిటీలను బుజ్జగించాలని అనుకోవటం లేదని వారికి ఆర్థిక, సామాజిక, విద్యా రంగాల్లో సాధికారత కల్పించాలనే పట్టుదలతో ఉందని తెలిపారు. సీఖో ఔర్‌ కమావో, ఉస్తాద్, గరీబ్‌ నవాజ్‌ కౌశల్‌ వికాస్‌ యోజన, నయీ రోష్నీ వంటి పథకాల ద్వారా ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు ఇలా అన్ని వర్గాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు.  

అట్టడుగు వర్గాల అభ్యున్నతికోసం
వెనుకబడిన వర్గాలు, పేదల అభ్యున్నతే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకూ న్యాయం జరిగేలా ముందుకెళ్తోందన్నారు. వ్యవసాయోత్పత్తులకు జరుగుతున్న నష్టాన్ని నివారించటం, సరైన నిల్వ, 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం, యూరియా ఉత్పాదన పెంచటం వంటి వివిధ ప్రభుత్వ పథకాలనూ రాష్ట్రపతి ప్రస్తావించారు. ఈ–నామ్‌ వంటి ఆన్‌లైన్‌ వ్యవసాయ మార్కెట్‌ను ప్రోత్సహించటం, పాడిఉత్పత్తిని పెంచేలా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. దేశంలోని అన్ని గ్రామాలను రోడ్లతో అనుసంధానించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందన్నారు. 

ప్రపంచ ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉన్నప్పటికీ భారత్‌ మంచి వృద్ధిరేటుతోనే ముందుకెళ్తోందన్నారు. 2016–17 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు స్వల్పంగా తగ్గినా.. 2017–18 రెండో త్రైమాసికానికల్లా పురోగతి బాట పట్టిందన్నారు.  దేశంలో ఆర్థిక సమగ్రతకోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రూపంలో అతిపెద్ద ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చిందన్నారు. రూ. 2లక్షల కోట్లను పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకింగ్‌లోకి ప్రవేశపెట్టడం ద్వారా వ్యవస్థ పునరుత్తేజం చేసిందన్నారు. అవినీతిపై పోరాటంలో భాగంగా 3.5 లక్షల అనుమానాస్పద కంపెనీలను రద్దుచేశామని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆర్మీ, పారామిలటరీ బలగాలు, జమ్మూకశ్మీర్‌ పోలీసులు సమన్వయం కారణంగా జమ్మూకశ్మీర్‌లో ఆందోళలను తగ్గాయన్నారు.

విద్యావ్యవస్థ ఆధునికీకరణ
దేశ భవిష్యత్తుకు పునాది వేసే ఉన్నత విద్యావ్యవస్థ, పాఠశాలలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం పరీక్షలను నిర్వహించేలా ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ’ పేరుతో ఓ స్వతంత్రవ్యవస్థను ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. మూడున్నరేళ్లలో 93 లక్షల ఇళ్లను కేంద్రం నిర్మించి ఇచ్చిందని ఆయన తెలిపారు. 2022కల్లా దేశంలో ప్రతి ఒక్కరికీ ఇళ్లుండాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దేశంలోని ప్రతి ఇంటికీ విద్యుత్, నీరు, మరుగుదొడ్డి వసతులుండాలనేదే కేంద్రం ఉద్దేశమన్నారు. ఉడాన్‌ పథకం ద్వారా తక్కువ ధరకే సామాన్యులకూ విమానయానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోందన్నారు. కొంతకాలంగా అంతర్జాతీయంగా భారత్‌కు గొప్ప గౌరవం దక్కుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.

తొలి వరుసలో రాహుల్‌  
పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తొలి వరుసలో ఆశీనులయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాహుల్‌కు ఆరో వరుసలో సీటును కేటాయించడంతో బీజేపీపై కాంగ్రెస్‌ విమర్శలు చేయడం తెలిసిందే.
► సెంట్రల్‌ హాల్‌లో రాహుల్‌ తన తల్లి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ ఎంపీ మల్లికార్జున్‌ ఖర్గేలతో ఎక్కువసేపు మాట్లాడుతూ కనిపించారు. సోనియా కూడా తొలివరుసలోనే, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అడ్వాణీ పక్కన కూర్చున్నారు. ఈ సందర్భంలో అడ్వాణీతో సోనియా మాట కలిపారు.  
► విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్‌ అథవాలే కూడా సోనియా గాంధీని పలకరించారు.
► సమాచార, ప్రసారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ కేవలం అడ్వాణీని మాత్రమే పలకరించి సోనియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.
► ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ తదితరులు కూడా తొలివరుసలో కూర్చున్నారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ రెండో వరసలో, బీజేపీ సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి తదితరులు మూడో వరుసలో కూర్చున్నారు.
► ప్రసంగం అనంతరం తొలి వరుసలో కూర్చున్న పురుష ఎంపీలందరితోనూ కరచాలనం చేసిన రాష్ట్రపతి, మహిళా ఎంపీలకు రెండు చేతులతో నమస్కరించారు.


                 రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement