ramnathkovind
-
బడ్జెట్ సమావేశాల లైవ్ అప్డేట్స్: ఉభయ సభలు మంగళవారానికి వాయిదా
అప్డేట్స్ 04:00 PM ► కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మధ్యాహ్నం 2021-22 ఆర్థిక సర్వేను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం రాజ్యసభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా ఇంతకు ముందు ఆర్థిక సర్వేను మంత్రి నిర్మలా లోక్‌సభలో సమర్పించారు. 12: 55 PM ► కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఎకానామిక్ సర్వే 2021-22 ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. 11: 55 AM ► పార్లమెంట్ సెంట్రల్ హల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 75 సంవత్సరాల ఆజాదీకా అమృత్.. ఒక పవిత్ర మహోత్సవమని వచ్చే 25 ఏళ్లు అదే స్ఫూర్తితో మనమంతా పనిచేయాలన్నారు. అదే విధంగా, వ్యాక్సిన్‌తో కరోనాను కట్టడి చేయబోతున్నామని తెలిపారు. ఫ్రంట్‌లైన్ వర్కర్ల సేవలు ప్రశంసనీయమన్నారు. దేశంలో పేదలకు ఉచితంగా రేషన్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ► భారత్ గ్లోబల్ మ్యాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారుతోందన్నారు. దేశంలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయని పేర్కొన్నారు. భారీగా వస్తున్న ఎఫ్‌డీఐలు దేశ అభివృద్ధిని సూచిస్తున్నాయని తెలిపారు. మేకిన్ ఇండియాతో మొబైల్ పరిశ్రమ వృద్ధి చెందుతోందన్నారు. ► ఫసల్ బీమాతో సన్నకారు రైతులకు ప్రయోజం లభిస్తోందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల చేయూత కోసం 3 లక్షల కోట్ల రుణాలు కేటాయించినట్లు తెలిపారు. ► 7 మెగా టెక్స్టైల్ పార్క్‌లతో యువతకు భారీగా ఉద్యోగాల కల్పన చేసినట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ తెలిపారు. ఈ ఏడాది 10 రాష్ట్రాల్లో 19 బీటెక్ కాలేజీల్లో 6 స్థానిక భాషలలో బోధన జరుగుందని రామ్‌నాథ్ పేర్కొన్నారు. ► పీఎమ్‌గ్రామీణ సడక్ యోజనలతో రోజుకు 100 కి.మీ రహదారుల నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ తెలిపారు. ► ప్రస్తుతం భారతదేశం మూడో దశ కొవిడ్‌ను ఎదుర్కొంటుందన్నారు. భారత్‌లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని రాష్టపతి తెలిపారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఏడాది కాలంలో 160 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం భారతదేశం మూడో దశ కోవిడ్‌ను ఎదుర్కొంటుందన్నారు. ► భారత్‌లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని రాష్ట్రపతి తెలిపారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. కోవిడ్ ఎదుర్కోవడానికి దేశ ఫార్మారంగం ఎంతో కృషి చేసిందన్నారు. ఫార్మా పరిశ్రమను విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ► పేదల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఆయుష్మాన్ భారత్ పథకం ఎంతో ఉపయోగపడిందన్నారు. డబ్ల్యూహెచ్‌వో తొలి ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ భారత్‌లో ఏర్పాటు కాబోతుందని పేర్కొన్నారు. అదే విధంగా పద్మపురస్కారాలను సామాన్యుల వరకు తీసుకెళ్లినట్లు వివరించారు. ► ప్రధాని గరీబ్‌యోజన పథకం ద్వారా 19 నెలల పాటు పేదలకు ఉచితంగా రేషన్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద ఆహార సరఫరా సంస్థ అని రాష్ట్రపతి తమ ప్రసంగంలో పేర్కొన్నారు. 11: 04 AM ► పార్లమెంట్లో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయులకు స్వాతంత్ర్య, అమృతోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనాపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. 10: 54 AM ► పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ భవనంకు చేరుకున్నారు. 10.: 45 AM పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి ఇది కీలక సమయమని, బడ్జెట్ సమావేశాలకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా పెగాసస్, రైతు ఆందోళనలు, చైనా దురాక్రమణలు సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని విపక్షాలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై దృష్టి సారించింది. సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషీ, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వేర్వేరుగా విపక్ష నేతలతో సమావేశమవుతారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలోనే బడ్జెట్ సమావేశాలు జరగడం ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ సమావేశాలు ఆయా రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఆర్థిక, రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతిగా కోవింద్ చివరి ప్రసంగం సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను సంయుక్తంగా ఉద్దేశించి ప్రసంగిస్తారు. వచ్చే జూలైలో రాష్ట్రపతిగా కోవింద్ పదవీ కాలం పూర్తికానుంది. దీంతో ఈ సమావేశాలే ఆయన రాష్ట్రపతి హోదాలో చివరిగా ప్రసంగించే పార్లమెంట్ సమావేశాలు. రాష్ట్రపతి ప్రసంగానంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే 2021–22ను, మంగళవారం(ఫిబ్రవరి 1) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బుధవారం నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే అంశంపై చర్చ ఆరంభమవుతుంది. ఈ చర్చ సుమారు 4 రోజులు జరగవచ్చు. ఫిబ్రవరి 7న ఈ చర్చకు ప్రధాని బదులిస్తారు. తొలి దశ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరుగుతాయి. రెండో దశ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. -
ఉపాధ్యాయుల చేతుల్లో భావితరం భవిష్యత్తు భద్రం : రాష్ట్రపతి
-
బ్యాంకులు, కేంద్ర సంస్థలకు రఘురామ ఎగనామం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను మోసగించి 3 ఎఫ్ఐఆర్లు దాఖలైన కేసులో ఆ కంపెనీల డైరెక్టర్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన పార్టీ ఎంపీల సంతకాలతో కూడిన లేఖలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు పంపారు. తీవ్రమైన ఆర్థిక మోసాలకు పాల్పడిన ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ, అనుబంధ కంపెనీలు, డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని, పారిపోకుండా ప్రయాణాలపై నిషేధ ఉత్తర్వులివ్వాలని కోరారు. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఇండ్ భారత్ కంపెనీపై సీబీఐ మూడు కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఆ కంపెనీలు దురుద్దేశపూరితంగా బ్యాంకులను, ప్రభుత్వ రంగ సంస్థలను మోసగించిన తీరుకు ఈ మూడు ఎఫ్ఐఆర్లు రుజువని లేఖలో వివరించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు సక్రమంగా లేదని, దీనివల్ల ప్రజలకు దర్యాప్తు సంస్థలపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దురుద్దేశాలను ఒప్పుకుంది.. ఇండ్–భారత్ లిమిటెడ్ 660 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును తమిళనాడులోని ట్యూటికొరిన్‌లో అభివృద్ధి చేసే ప్రతిపాదనతో ప్రభుత్వ సంస్థలు నిధులు సమకూర్చేలా ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అగ్రిమెంట్(టీఆర్ఏ) కుదుర్చుకుందని లేఖలో తెలిపారు. ఇండ్–భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, సంబంధిత కంపెనీలు ప్రభుత్వ ఫైనాన్స్ సంస్థల నుంచి పెట్టుబడి రూపంలో తెచ్చిన మొత్తాన్ని చూపి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.569.43 కోట్ల మేర రుణాన్ని తీసుకున్నాయని 2016లో పీఎఫ్సీకి సమాచారం అందిందన్నారు. 2016 మే 4న ఇండ్–భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ తన దురుద్దేశపూరిత చర్యలను అంగీకరించిందని, అప్పుగా తెచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్లను తాకట్టు పెట్టి స్వల్పకాలిక రుణాలు తెచ్చినట్టు ఒప్పుకుందని వివరించారు. ఈ మోసాలపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసిందని, ఎస్బీఐ కూడా ఫిర్యాదు చేసిందని వివరించారు. బ్యాంకు కన్సార్షియాన్ని ఇండ్–భారత్ మోసగించిందని ఫిర్యాదులో పేర్కొందన్నారు. విజయ్ మాల్యా తరహాలో విదేశాలకు పారిపోకుండా డైరెక్టర్లపై ప్రయాణ నిషేధ ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేశారు. మోసగించిన సొమ్మును రికవరీ చేసి డైరెక్టర్లను, కంపెనీలను బాధ్యులను చేయాలన్నారు. కంపెనీల డైరెక్టర్లపై కస్టోడియల్ విచారణ జరపాలని కోరారు. రూ.941.71 కోట్ల ప్రజాధనం స్వాహా.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ సంస, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌ల నుంచి ఇండ్–భారత్ పవర్(మద్రాస్), దాని మాతృసంస్థ ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఆర్కే ఎనర్జీ (రామేశ్వరం) లిమిటెడ్, ఆ సంస్థ డైరెక్టర్లు కె.రఘురామకృష్ణరాజు, మధుసూదన్‌రెడ్డి, వారి గ్రూప్ కంపెనీలు రూ.941.71 కోట్ల మేర ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు లేఖలో తెలిపారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు ఢిల్లీ పోలీస్ శాఖ పరిధిలోని ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదు చేసినా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఆ కంపెనీల డైరెక్టర్లు ప్రజాధనంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తెచ్చారు. -
సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ ఎన్వీ రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ రమణ ఆంగ్లంలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు జడ్జీలు, కేంద్రమంత్రులు, న్యాయ శాఖ ఉన్నతాధికారులు, జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ 2022 ఆగస్ట్ 26వ తేదీ వరకు కొనసాగనున్నారు. దేశ అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్టించిన రెండవ తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ కావడం విశేషం. గతంలో జస్టిస్ కోకా సుబ్బారావు 1966– 67 మధ్య భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 54 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక తెలుగు వ్యక్తి సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. సీజేఐగా శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణం చేశాక చీఫ్ జస్టిస్ రమణ నివాసంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు ఆశీర్వచనం చేశారు. 2014లో సుప్రీంకోర్టుకు... సీజేఐ నూతలపాటి వెంకటరమణ 1957 ఆగస్టు 27 న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో జన్మించారు. 1983 ఫిబ్రవరి 10న ఆయన తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2000 సంవత్సరం జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. 2013 మార్చి 10వ తేదీ నుంచి 2013 మే 20 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. అనంతరం 2013 సెప్టెంబర్ 2వ తేదీన జస్టిస్ రమణకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. 2014 ఫిబ్రవరి 17న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసులను విచారించిన ధర్మాసనాలకు నేతృత్వం వహించగా, కొన్నింటిలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. 2020 జనవరి 10వ తేదీన కశ్మీర్లో ఇంటర్నెట్ నిలిపివేయడాన్ని వెంటనే సమీక్షించాలని జస్టిస్ రమణ తీర్పు ఇచ్చారు. 2019 నవంబర్ 13న సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించిన చారిత్రక ధర్మాసనంలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. గృహిణులు ఇంట్లో చేసే పని, కార్యాలయాల్లో వారి భర్తలు చేసే పనికి ఏమాత్రం తక్కువేం కాదని జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. -
సీజేఐగా నేడు జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 11 గంటలకు జస్టిస్ ఎన్వీ రమణతో రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ ఎన్వీ రమణ ఫిబ్రవరి 17, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నాటి నుంచి సుప్రీంకోర్టులో పలు కీలక తీర్పుల్లో భాగస్వామ్యం అయిన జస్టిస్ఎన్వీ రమణను ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బాబ్డే తదుపరి సీజేఐగా సిఫార్సు చేయగా ఈ నెల 5న రాష్ట్రపతి కోవింద్ ఆమోదముద్ర వేసిన విషయం విదితమే. సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ ఆగస్టు 26, 2022 వరకూ కొనసాగనున్నారు. మూడేళ్లపాటు ఉండాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం మూడేళ్లపాటు ఉండాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. సీజేఐ పదవీ విరమణ కార్యక్రమం ఎప్పుడూ విచారకరమేనన్నారు. కరోనా నేపథ్యంలో వర్చువల్ విచారణల ద్వారా సుప్రీంకోర్టులో సుమారు 50వేల కేసులు విచారణ ముగించడం గొప్ప అచీవ్‌మెంట్‌గా కేకే వేణుగోపాల్ అభివర్ణించారు. సంతృప్తిగా ఉంది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన వంతు కృషి చేశానన్న సంతృప్తితో ఉన్నానని జస్టిస్ ఎస్ఏ బాబ్డే అన్నారు. శుక్రవారం కోర్టు హాలులో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో చాలా క్లుప్తంగా మాట్లాడారు. బాధ్యతలను జస్టిస్ ఎన్వీ రమణకు అప్పగిస్తున్నానని, సమర్థంగా కోర్టును నడిపిస్తారన్న విశ్వాసం ఉందని జస్టిస్ ఎస్ఏ బాబ్డే అన్నారు. క్రమశిక్షణతోనే కరోనాను జయించగలం:జస్టిస్ ఎన్వీ రమణ కరోనాను క్రమశిక్షణతోనే జయించగలమని మరికొద్ది గంటల్లో సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్న జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. మాస్కు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, అవసరం ఉంటేనే బయటకు రావడం వంటి క్రమశిక్షణ చర్యలు పాటించాలన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కష్టకాలం బలమైన వారిని సృష్టిస్తుందని, సుప్రీంకోర్టు సిబ్బంది, న్యాయమూర్తులు, న్యాయవాదుల్లో కూడా కరోనా బాధితులున్నారని తెలిపారు. -
కేంద్రమంత్రి పాశ్వాన్ కన్నుమూత
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ దళిత నేత రామ్ విలాస్ పాశ్వాన్(74) గురువారం కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా పాశ్వాన్ ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగింది. పాశ్వాన్ మరణవార్తను ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. ‘నాన్నా.. ఈ ప్రపంచంలో మీరు లేరు. కానీ మీరెప్పుడూ నాతోనే ఉంటారని నాకు తెలుసు. మిస్ యూ నాన్నా’ అని చిరాగ్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పాశ్వాన్.. కేంద్ర మంత్రివర్గంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల బాధ్యతలు చూస్తున్నారు. పాశ్వాన్ మృతిపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘యవ్వనంలో పాశ్వాన్ ఒక ఫైర్‌బ్రాండ్ సోషలిస్ట్. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జయప్రకాశ్ నారాయణ్ వంటి నేతల సాంగత్యంలో నాయకుడిగా ఎదిగారు’ అని కోవింద్ ట్వీట్‌చేశారు. పాశ్వాన్ మరణం తనను మాటలకందని బాధకు గురి చేసిందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కృషి, పట్టుదలతో పాశ్వాన్ రాజకీయాల్లో ఎదిగారు. యువకుడిగా ఎమర్జెన్సీ దురాగతాలను ఎదుర్కొన్నారు. ఆయన అద్భుతమైన మంత్రి, పార్లమెంటేరియన్. చాలా విధాన విషయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. కేబినెట్ సమావేశాల్లో ఆయన లోతైన సూచనలు ఇచ్చేవారు. రాజకీయ జ్ఞానం, దార్శనికత, పాలనాదక్షతల్లో ఆయనకు సాటిలేరు’ అని మోదీ పేర్కొన్నారు. కేంద్రమంత్రి పాశ్వాన్ మృతికి సంతాప సూచకంగా నేడు దేశ రాజధాని ఢిల్లీలో, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల్లో జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేయనున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తారు. ఏపీ గవర్నర్, సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: పాశ్వాస్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాశ్వాన్ తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో అణగారిన వర్గాల వాణిని ఎలుగెత్తి చాటారని వైఎస్ జగన్ నివాళులర్పించారు. పాశ్వాన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పాశ్వాన్ మృతి పట్ల వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వేణుంబాక విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నర్, సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: పాశ్వాన్ మృతిపట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ అండగా నిలిచారని కేసీఆర్ గుర్తు చేశారు. 1969లోనే ఎమ్మెల్యే 1946 జులై 5న బిహార్‌లోని ఖగారియాలో పాశ్వాన్ జన్మించారు. పీజీ, న్యాయవిద్య అభ్యసించారు. విద్యాభ్యాసం అనంతరం డీఎస్పీగా పోలీసు ఉద్యోగం వచ్చినా రాజకీయాలపై ఆసక్తితో ఆ ఉద్యోగంలో చేరలేదు. 1969లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ టికెట్‌పై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 8 సార్లు గెల్చారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ రికార్డు చాలా రోజుల పాటు ఆయన పేరు పైనే ఉన్నది. పాశ్వాన్ 1975 నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జైలుకెళ్లారు. 2000 సంవత్సరంలో ఆయన మరికొందరు నాయకులతో కలిసి లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ)ని స్థాపించారు. పేదలు, అణగారిన వర్గాల సమస్యలపై అవకాశం లభించిన ప్రతీసారి గళమెత్తే నేతగా పాశ్వాన్ పేరు గాంచారు. మండల్ కమిషన్ నివేదిక అమలుకు ఆయన గట్టిగా ప్రయత్నించారు. పార్టీలకు అతీతంగా అందరు నాయకులతో ఆయన సత్సంబంధాలు కలిగి ఉండేవారు. సైద్ధాంతిక వైరుధ్యాలున్న పార్టీల నేతృత్వంలో సాగిన కేంద్ర ప్రభుత్వాల్లో ఆయన భాగస్వామిగా, మంత్రిగా విజయవంతంగా కొనసాగడం విశేషం. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలోనూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారులోనూ కీలకంగా వ్యవహరించడం ఆయనకే చెల్లింది. దాదాపు ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో దళితులు, అణగారిన వర్గాల కోసం పోరాడే నేతగా ఆయన దేశవ్యాప్తంగా పేరుగాంచారు. ఉత్తర భారత దేశంలో దళితులను ఏకం చేయడంలో పాశ్వాన్ కీలక పాత్ర పోషించారని ఆయన దీర్ఘకాల సహచరుడు, జేడీయూ నేత కేసీ త్యాగి గుర్తు చేసుకున్నారు. 1989లో వీపీ సింగ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పాశ్వాన్.. మండల్ కమిషన్ సిఫారసుల అమలుకు కృషి చేశారన్నారు. బీజేపీతో విబేధాల కారణంగా వాజ్‌పేయి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన సమయంలో నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించిన పాశ్వాన్.. అదే మోదీ నాయకత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. సిద్ధాంతాలకు అతీతంగా అధికారంలో ఉన్న పార్టీలకు దగ్గరయ్యే ఆయన తీరును ప్రత్యర్థులు ‘వాతావరణ నిపుణుడు’ అంటూ విమర్శిస్తారు. -
ప్రధానికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి గురువారం ప్రపంచం నలుమూలల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 1950 సెప్టెంబర్ 17న మోదీ జన్మించారు. రాష్ట్రపతి కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యసహా పలువురు ప్రముఖులు ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ బర్త్‌డే సందర్భంగా బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా పలు సేవాకార్యక్రమాలు చేపట్టాయి. మోదీ ప్రభుత్వం సాధించిన 243 అత్యుత్తమ విజయాలను వివరించే ‘లార్డ్ ఆఫ్ రికార్డ్స్’ పుస్తకాన్ని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆవిష్కరించారు. మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల అధినేతల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్, జర్మనీ చాన్సలర్ అంజెలా మెర్కెల్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్.. తదితరులున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తదితరులు ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సహా పలువురు ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ వ్యాసాలు, వార్తాకథనాలున్న ‘నరేంద్ర70.ఇన్’ వెబ్‌సైట్‌ను కేంద్ర మంత్రి జావదేకర్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మోదీకి రాష్ట్ర సీఎం చంద్రశేఖర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి మరింత కాలం సేవ చేసేలా భగవంతుడి ఆశీస్సులు ప్రధానిపై ఉండాలని ప్రార్థించారు. -
రఘువంశ్ ప్రసాద్ కన్నుమూత
పట్నా/న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, రఘువంశ్ ప్రసాద్ సింగ్(74) కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రఘువంశ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రఘువంశ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. భార్య కొంతకాలం క్రితమే మరణించారు. గత శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఎయిమ్స్ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. జూన్‌లో రఘువంశ్‌కు కోవిడ్–19 నిర్ధారణ కావడంతో పట్నా ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. ఇటీవల మళ్లీ కోవిడ్ లక్షణాలు బయటప డటంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. ఆయన మృతదేహాన్ని ఆదివారం రాత్రి పట్నాకు తరలించారు. వైశాలి జిల్లాలోని స్వగ్రామం షాపూర్ గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. సోషలిస్టు నేత అయిన రఘువంశ్ ప్రసాద్ బిహార్‌లోని వైశాలి లోక్‌సభ స్థానం నుంచి ఐదు పర్యాయాలు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో కేంద్రగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు విశ్వాసపాత్రునిగా ఉంటూ రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారు. 4 రోజుల క్రితం ఆస్పత్రిలో ఉండగానే ఆర్జేడీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ చీఫ్ లాలూప్రసాద్కు లేఖ రాశారు. కానీ, ఆయన రాజీనామాను రాంచీ జైలులో ఉన్న లాలూ అంగీకరించలేదు. ఆరోగ్యం కుదుటపడ్డాక మాట్లాడుకుందామంటూ జవాబిచ్చారు. -
ప్రణబ్‌కు ప్రముఖుల నివాళి
‘‘ప్రణబ్ ముఖర్జీ ఒక దిగ్గజం. మాతృదేశానికి యోగిలాగా సేవ చేశారు. భరతమాత ప్రియతమ పుత్రుడి మరణానికి దేశమంతా దుఃఖిస్తోంది. ఆధునికతను, సాంప్రదాయంతో మేళవించిన మనీషి భారత రత్న ప్రణబ్. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.’’ – రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ ‘‘దేశం ఒక పెద్దమనిషిని కోల్పోయింది. కష్టించే గుణం, క్రమశిక్షణ, అంకితభావంతో ఆయన కిందిస్థాయి నుంచి దేశంలో రాజ్యాంగబద్ధమైన అత్యున్నత స్ధాయికి ఎదిగారు. సుదీర్ఘ ప్రజాసేవలో ఆయన నిర్వహించిన ప్రతిపనికీ గౌరవం తెచ్చారు. ఓం శాంతి.’’ – ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘‘2014లో ఢిల్లీకి నేను వచ్చినప్పటినుంచి ప్రణబ్ దార్శనికత, ఆయన ఆశీస్సులు నాకు మద్దతుగా నిలిచాయి. ఆయనతో అనుబంధం ఎప్పటికీ గుర్తుంటుంది. రాష్ట్రపతి భవన్‌ను వైజ్ఞానిక, శాస్త్రీయ, సాంస్కృతిక కేంద్రంగా ఆయన మార్చారు. కీలక విధాన నిర్ణయాల్లో ఆయన సలహాలను ఎన్నటికీ మరువలేను. దేశ అభివృద్ధి పథంలో ఆయన ముద్ర స్పష్టంగా ఉంటుంది. ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయన్ని అన్ని రాజకీయ పక్షాలు గౌరవించేవి. సమాజంలో అన్ని వర్గాల అభిమానం చూరగొన్న వ్యక్తి భారతరత్న ప్రణబ్’’ – ప్రధాని నరేంద్ర మోదీ ‘‘ప్రణబ్ చేపట్టిన అన్ని పదవులకు వన్నె తెచ్చారు. అన్ని రాజకీయ పక్షాలనేతలతో సుహృద్భావనతో మెలిగేవారు. అంకితభావంతో దేశానికి సేవ చేశారు. ఐదుదశాబ్దాలుగా అటు దేశం, ఇటు కాంగ్రెస్ పార్టీ పయనంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన లేని లోటు తీర్చలేదని, ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలు ఎంతో అమూల్యమైనవి.’’ – కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ‘‘ప్రణబ్ లేరన్న వార్త తీవ్ర విచారం కలిగించింది. ఆయన మరణంతో స్వతంత్ర భారతావనికి చెందిన ఒక గొప్పనాయకుడిని దేశం కోల్పోయింది. ఆయనతో కలిసి ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. ఆ సమయంలో ఆయన మేధస్సు, విజ్ఞానం, వివిధ ప్రజా విషయాలపై ఆయన అనుభవం నుంచి ఎంతో నేర్చుకున్నాను.’’ – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ‘‘ప్రణబ్ ముఖర్జీ మృతి తీవ్ర వేదన కలిగిస్తోంది. అంకిత భావంతో దేశానికి సేవ చేసిన అనుభవజ్ఞుడు. ఆయన సుదీర్ఘ ప్రజా జీవిత ప్రయాణం దేశానికే గర్వకారణం. దేశ రాజకీయ యవనికపై ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఓం శాంతి.’’ – హోం మంత్రి అమిత్‌షా ‘‘ భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం బాధాకరం. దేశానికి ఆయన అనేక రూపాల్లో అంకితభావంతో సేవలనందించారు. అన్నిపార్టీలు ఆయన మేధస్సును గౌరవించేవి.’’ – బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘‘ ప్రణబ్ ముఖర్జీ లేరన్న వార్తతో దేశం తీవ్రవేదన చెందింది. దేశప్రజలతో పాటు ఆయనకు నా నివాళి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’’ – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ‘‘ దేశప్రయోజనాలకే ప్రణబ్ పెద్దపీట వేసేవారు. రాజకీయ అస్పృశ్యతను ఆయన దరిచేరనీయలేదు. ఆర్ఎస్ఎస్కు ఆయన ఒక మార్గదర్శి. సంఘ్‌కు ఆయన లేని లోటు పూడ్చలేనిది.’’ – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘‘ ప్రణబ్ ముఖర్జీ ఒక పరిపూర్ణ పెద్దమనిషి. ఆయనతో ఎంతో అనుబంధం ఉండేది. ఆయన మృతికి నా నివాళి.’’ – లతా మంగేష్కర్ ‘‘ భారత్ ఒక దిగ్గజ రాజకీయవేత్తను, గౌరవనీయుడైన నాయకుడిని కోల్పోయింది.’’ – అజయ్‌దేవగన్ ‘‘దశాబ్దాలుగా ప్రణబ్ దేశానికి సేవలనందించారు.ఆయన మృతి తీవ్ర విచారకరం.’’ – సచిన్ టెండూల్కర్ ‘‘ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఆయన కుటుంబానికి నా సానుభూతి.’’ – విరాట్‌కోహ్లీ -
‘మాతృభూమి’ వీరేంద్రకుమార్ మృతి
కోజికోడ్/వయనాడ్: రాజ్యసభ సభ్యుడు, మలయాళ దిన పత్రిక ‘మాతృభూమి’మేనేజింగ్ డైరెక్టర్ ఎం.పి. వీరేంద్ర కుమార్(83) గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనకు భార్య ఉష, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వయనాడ్ జిల్లా కల్పెట్టలో శుక్రవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ)కు మూడు పర్యాయాలు చైర్మన్‌గా పనిచేసిన వీరేంద్రకుమార్ ప్రస్తుతం పీటీఐ బోర్డు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2003–2004 కాలంలో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి ప్రెసిడెంట్‌గా కూడా ఆయన వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన ‘హైమవతభువిల్’వంటి 15కు పైగా పుస్తకాలను వీరేంద్ర రచించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఆయన 1987లో ఈకే నయనార్ మంత్రి వర్గంలో విద్యుత్ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోని అడవుల్లో చెట్ల నరికివేతపై నిషేధం విధిస్తూ తొలి ఉత్తర్వులు జారీ చేశారు. అవి వివాదమవడంతో రాజీనామా చేశారు. కోజికోడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఐకే గుజ్రాల్, హెచ్డీ దేవెగౌడ కేబినెట్లలో బాధ్యతలు నిర్వహించారు. -
రాష్ర్టపతి భవన్లో మరోసారి కరోనా కల్లోలం
న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్లో సీనియర్ పోలీస్ అధికారికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే ఆయనను ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో భవన్లో పనిచేస్తున్న అనేక మంది పోలీసులు, ఇతర సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్లో ఉంచినట్లు అధికారిక వర్గాల సమాచారం. గత నెలలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావడంతో దాదాపు 115 కుటుంబాలను ఐసోలేషన్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో ఏప్రిల్ 13న ఢిల్లీలోని బిఎల్ కపూర్ ఆసుపత్రిలో కన్నుమూసినట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆయన కుటుంబసభ్యుల్లో ఒకరికి పాజిటివ్ రాగా, మిగిలిన ఆరుగురికి నెగిటివ్ అని తేలింది. (కరోనా పోరు: మాస్కులు కుట్టిన రాష్ట్రపతి సతీమణి ) ఇక కరోనాపై పోరుకు తనవంతు సాయంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇప్పటికే తన నెల జీతాన్ని విరాళంగా అందజేయగా, తాజాగా తన జీతంలో 30 శాతం డబ్బును ఏడాదిపాటు పీఎం కేర్స్ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కరోనా సంక్షోభంలో రాష్ట్రపతి భవన్లో ఖర్చులను తగ్గించడానికి అధికారులకు పలు సూచనలు చేశారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి వినియోగం కోసం పది కోట్ల విలువైన విలాసవంతమైన లిమోసిస్ కారు కొనుగోలును వాయిదా వేశారు. అలాగే విందులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయరాదని, పరిమిత సంఖ్యలో ఆహారపదార్థాలను ఉంచాలని నిర్ణయించారు. రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో పెద్ద ఎత్తున జరిగే పూల అలంకరణలు లాంటి డెకరేషన్ వస్తువులను పరిమితం చేయాలని ఓ ప్రకటన విడుదల చేశారు. (ఖర్చు ఆదా చేసే పనిలో రాష్ట్రపతి భవన్ ) -
తక్షణ న్యాయం ఉండదు!
జోధ్‌పూర్: న్యాయమన్నది ఎప్పుడూ తక్షణం అందేదిగా ఉండరాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే స్పష్టం చేశారు. న్యాయం ఎప్పుడూ ప్రతీకారంగా మారకూడదని, అలా మారినప్పుడు న్యాయానికి ఉన్న లక్షణాలేవీ మిగలవని ఆయన తెలిపారు. రాజస్తాన్ హైకోర్టులో శనివారం ఒక కొత్త భవనాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు దిశ హత్య కేసు నిందితులు ఎన్కౌంటర్లో మరణించిన నేపథ్యంలో ప్రాధాన్యమేర్పడింది. ఇటీవలి పరిణామాలు చాలా పురాతనమైన చర్చను సరికొత్త ఉత్సాహంతో మొదలుపెట్టాయన్న జస్టిస్ బాబ్డే న్యాయవ్యవస్థ కేసుల విచారణలో జరుగుతున్న జాప్యం విషయంలో తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ప్రజలందరికీ న్యాయం అందుబాటులో ఉండేందుకు న్యాయవ్యవస్థ కట్టుబడి ఉండాలని, ఇందుకోసం కొత్త మార్గాలను అన్వేషించడంతోపాటు ఉన్నవాటిని దృఢతరం చేసుకోవాల్సిన అవసరమూ ఉందని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. వివాదాలను వేగంగా సంతృప్తికరంగా పరిష్కరించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అదే సమయంలో న్యాయవ్యవస్థ పట్ల మారుతున్న దృక్పథంపై కూడా అవగాహన ఉండాలని అన్నారు. న్యాయవ్యవస్థలో జరిగిన తప్పిదాలను స్వయంగా దిద్దుకునే ఏర్పాటు అవసరముందని, అయితే ఈ ఏర్పాట్లను ప్రచారం చేయాలా? వద్దా? అన్నది చర్చనీయాంశమని అన్నారు. గత ఏడాది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నలుగురు బహిరంగంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. చేసిన వ్యాఖ్యలు, జరిగిన తప్పిదాలను స్వయంగా సరిచేసుకునేందుకు జరిగిన ఒక ప్రయత్నమేనని అన్నారు. ‘లిటిగేషన్లను వేగంగా పరిష్కరించే పద్ధతులను ఏర్పాటు చేయడమే కాదు. లిటిగేషన్లను ముందస్తుగా నివారించాల్సి ఉంది’అని చెప్పారు. కేసు దాఖలయ్యే ముందే మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి ఇప్పటికే కొన్ని చట్టాలున్నాయని, వాటిని అన్ని కేసులకూ తప్పనిసరి చేసే విషయాన్ని ఆలోచించాలని చెప్పారు. అంతకుముందు కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ మానభంగ కేసుల విచారణ సత్వరం జరిగేలా ప్రధాన న్యాయమూర్తి, ఇతర సీనియర్ న్యాయమూర్తులు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు తగిన నిధులు అందిస్తుందని హామీ ఇచ్చారు. విచారణ జాప్యం దేశంలోని మహిళలను తీవ్రమైన బాధకు, ఒత్తిడికి గురిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో హేయమైన నేరాల విచారణకు 704 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఉన్నాయని, పోక్సో, మానభంగ నేరాల విచారణకు మరో 1,123 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ తరువాత మానభంగ కేసుల నిందితులకు సత్వర శిక్ష పడేలా చూడాలన్న డిమాండ్లు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్కౌంటర్లో దిశ నిందితులు మరణించడంపై కొన్ని వర్గాల వారు సంతోషం వ్యక్తం చేయడం, సంబరాలు చేసుకోవడం కొందరి ఆందోళనకు కారణమవుతోంది. పేదలకు అందని స్థాయిలో న్యాయ ప్రక్రియ: రాష్ట్రపతి దేశంలో న్యాయ ప్రక్రియ పేదలకు అందని స్థాయిలో ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. జోధ్‌పూర్‌లో శనివారం హైకోర్టు కొత్త భవనం ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ ‘‘న్యాయ ప్రక్రియ బాగా ఖరీదైపోయింది. పలు కారణాల వల్ల సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టులు సాధారణ కక్షిదారులకు అందడం అసాధ్యంగా మారింది’’అని వ్యాఖ్యానించారు. ‘‘ఈ రోజుల్లో పేదవారెవరైనా ఇక్కడకు ఫిర్యాదు తీసుకుని రాగలరా? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైంది. ఎందుకంటే రాజ్యాంగం పీఠికలో అందరికీ న్యాయం అందించడం బాధ్యతని మనమందరం అంగీకరించాం కాబట్టి’ అని అన్నారు. న్యాయం కోసం పెడుతున్న ఖర్చుపై గాంధీజీ ఆందోళన వ్యక్తం చేశారని, దరిద్ర నారాయణుల సేవే ఆయనకు అన్నింటికంటే ముఖ్యమైన అంశమని అన్నారు. గాంధీజీ ప్రాథమ్యాలను గుర్తు చేసుకుంటే, కటిక పేదవాడు, అతి బలహీనుడి ముఖాలను మనం మననం చేసుకుంటే ఈ అంశాల్లో మనకు తగిన మార్గం కనిపిస్తుందని అన్న రాష్ట్రపతి న్యాయ ప్రక్రియను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఉచిత న్యాయసేవలు ఒక మార్గం కావచ్చునని సూచించారు. -
వారికి క్షమాభిక్ష కోరే అర్హత లేదు
మౌంట్ అబూ: మహిళలపై జరుగుతున్న వరుస పైశాచిక దాడులు దేశాన్ని వణికిస్తున్నాయని, నైతికంగా దెబ్బ తీస్తున్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. రాజస్తాన్‌లోని అబూరోడ్‌లో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై శుక్రవారం జరిగిన జాతీయ సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించారు. లైంగిక వేధింపులు, దాడుల నుంచి చిన్నారుల్ని రక్షించడానికి తీసుకువచ్చిన ది ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద ఉరిశిక్ష పడిన వారికి క్షమాభిక్ష కోరే హక్కు లేకుండా పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్‌లో దిశ హత్యాచారం, ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిని తగులబెట్టడం వంటి ఘటనల నేపథ్యంలో రాష్ట్రపతి మహిళల భద్రత గురించి మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘అత్యాచార నేరాల్లో ఉరి శిక్ష పడిన వారందరూ క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తారు. వారికి రాజ్యాంగం ఆ హక్కుని కల్పించింది. అయితే పోక్సో చట్టం కింద శిక్ష పడిన వారికి ఆ హక్కు ఉండకూడదు. ఆ దిశగా కేంద్రం అడుగులు వెయ్యాలి. చట్టాలను పునఃసమీక్షించాలి’అని సూచించారు. నిర్భయ గ్యాంగ్ రేప్ దోషి క్షమాభిక్ష పెట్టుకున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘దిశ’ ఘటన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చడాన్ని అభినందిస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో రూపొందించిన సైకత శిల్పం -
సీజేఐగా జస్టిస్ బాబ్డే
న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరవింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆంగ్లంలో దేవుడి పేరున ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన.. వీల్‌చైర్‌లో ఆ కార్యక్రమానికి వచ్చిన తన తల్లికి పాదాభివందనం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య, కొందరు సీనియర్ మంత్రులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఆర్.ఎం.లోధా, టీఎస్.ఠాకూర్, జేఎస్.కెహార్ హాజరయ్యారు. మహారాష్ట్రకు చెందిన జస్టిస్ బాబ్డే సీనియర్ న్యాయవాది అరవింద్ శ్రీనివాస్ బాబ్డే కుమారుడు. 2021 ఏప్రిల్ 23 వరకు మొత్తం 17 నెలల పాటు జస్టిస్ బాబ్డే ఈ పదవిలో కొనసాగుతారు. నూతన సీజేఐకి నెటిజన్ల ప్రశంసలు ప్రమాణ స్వీకారం అనంతరం జస్టిస్ బాబ్డే వీల్‌చైర్‌లో వచ్చిన తన మాతృమూర్తి(92)కి పాదాభివందనం చేయడం పలువురి ప్రశంసలు అందుకుంది. తల్లికి జస్టిస్ బోబ్డే పాదాభివందనం చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పలువురు నెటిజన్లు ఆయన్ను మెచ్చుకున్నారు. -
దాడి చేస్తే ప్రతి దాడి ఉంటుంది
న్యూఢిల్లీ: భారత్‌ను ఎంత రెచ్చగొడుతున్నా భరిస్తూనే ఉందని, కానీ దాడి చేస్తే మాత్రం ప్రతి దాడి తప్పదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. ఆ ప్రతి దాడి.. ఎన్నటికీ మర్చిపోలేనంత భారీ స్థాయిలో ఉంటుందంటూ పాకిస్తాన్‌ను ఆయన పరోక్షంగా హెచ్చరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన రెండో సంవత్సర పాలనలో చేసిన 95 ప్రసంగాలతో కూడిన ‘రిపబ్లికన్ ఎథిక్–2’, ‘లోక్తంత్ర కే స్వర్’ ఖండ్–2 పుస్తకాలను ఆవిష్కరించిన సందర్భంగా వెంకయ్యనాయుడు శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పుస్తకాలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురించింది. దేశ చరిత్రను పరిశీలిస్తే ఎక్కడా దూకుడు ప్రదర్శించినట్లు కనిపించదని, ‘విశ్వగురువు’గా ప్రసిద్ధి చెందిన భారత్ ఎవరిపైనా దాడి చేయలేదని ఆయన గుర్తు చేశారు. అయినా దాడి చేయలేదు చాలా మంది భారత్‌పై దండెత్తినా, పాలించినా, నాశనం చేసినా, మోసం చేసినా తామెవరిపైనా దాడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పుస్తకం లోని ఓ మాటను ప్రస్తావిస్తూ... భారత్ తన సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడానికి శాంతిమార్గా న్నే ఎన్నుకుందన్నారు. రాష్ట్రపతి రాసిన పుస్తకంలో ఆయన జ్ఞానం ప్రతిబింబిస్తోందన్నారు. ఈ పుస్తకాలు కిండిల్ వంటి ఆన్లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగాల్లో జాతినుద్దేశించినవి, ప్రపంచాన్ని ఉద్దేశించినవి, మహాత్మాగాంధీ గురించి మాట్లాడినవి ఉన్నాయని వెల్లడించారు. -
ఆశలకు ఆటగాళ్లు రెక్కలు తొడుగుతున్నారు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారుల ప్రదర్శన పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న ఆటగాళ్లను జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయన అభినందించారు. ‘త్రివర్ణ పతాకాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళుతున్న అథ్లెట్లను ఈ రోజు అభినందిస్తున్నాను. అది బాక్సింగ్‌లో కానివ్వండి లేదా బ్యాడ్మింటన్, టెన్నిస్, లేదంటే మరే క్రీడాంశంలోనైనా సరే... మన ఆశలకు ఆటగాళ్లు కొత్త రెక్కలు తొడుగుతున్నారు. మన దేశం మరింత విశ్వాసంతో ముందుకు వెళుతోందన్న విషయాన్ని క్రీడల్లో సాధిస్తున్న ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ 114వ జయంతి సందర్భంగా ఆయనను మోదీ స్మరించుకొన్నారు. ‘ధ్యాన్చంద్లాంటి గొప్ప వ్యక్తి జన్మించిన రోజు, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అందరికీ నా అభినందనలు. హాకీ స్టిక్‌తో ఆయన ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేశారు. ఆయనకు తలవంచి నమస్కరిస్తున్నాను’ అని ప్రధాని అన్నారు. గురువారం ‘జాతీయ క్రీడా పురస్కారాలు’ అందుకున్న ఆటగాళ్లకు కూడా మోదీ తన అభినందనలు తెలిపారు. కన్నుల పండువగా... క్రీడా పురస్కారాల ప్రదానం రాష్ట్రపతి భవన్లో కన్నులపండువగా జరిగింది. రాజీవ్ ఖేల్‌రత్నతో పాటు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డులను విజేతలు అందుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులు అందజేశారు. ‘ఖేల్‌రత్న’కు ఎంపికైన వారిలో మహిళా పారా అథ్లెట్ దీపా మాలిక్ వీల్‌చైర్‌లో తన అవార్డును స్వీకరించింది. ట్రోఫీ, ప్రశంసాపత్రంతో పాటు రూ.7.5 లక్షల నగదు ప్రోత్సాహకం కూడా ఆమె అందుకుంది. ఈ ఏడాది మొత్తం 19 మంది ‘అర్జున’కు ఎంపికయ్యారు. తెలుగు కుర్రాడు, ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్ తన ‘అర్జున’ను స్వీకరించాడు. ఈ కార్యక్రమానికి అతని తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. అర్జున విజేతకు రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకం లభిస్తుంది. హైదరాబాద్‌కే చెందిన షూటర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్‌కు చెందిన ‘స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్’కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ దక్కింది. దీనిని నారంగ్, తన అకాడమీ కోచ్, సహ భాగస్వామి పవన్ సింగ్‌తో కలిసి అందుకున్నాడు. ఇదే విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన ‘రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్’ తరఫున మాంచో ఫెర్రర్ పురస్కారాన్ని స్వీకరించారు. బజరంగ్ గైర్హాజరు... ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఎంపికైన భారత మేటి రెజ్లర్ బజరంగ్ పూనియా తన అవార్డును అందుకోలేకపోయాడు. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సన్నాహాల్లో భాగంగా అతను రష్యాలో ఉన్నాడు. వెస్టిండీస్‌లో ఉన్న క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. అథ్లెట్లు తజీందర్‌పాల్ సింగ్, మొహమ్మద్ అనస్, షూటర్ అంజుమ్ మౌద్గిల్ కూడా గైర్హాజరయ్యారు. వీరందరికి మరో రోజు క్రీడా మంత్రి కిరణ్ రిజిజు చేతుల మీదుగా అవార్డులను అందజేస్తారు. అవార్డు విజేతల జాబితా రాజీవ్ ఖేల్‌రత్న: బజరంగ్ పూనియా (రెజ్లింగ్), దీపా మాలిక్ (పారా అథ్లెటిక్స్) అర్జున: భమిడిపాటి సాయిప్రణీత్ (బ్యాడ్మింటన్), రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ (క్రికెట్), మొహమ్మద్ అనస్, తజీందర్‌పాల్ సింగ్, స్వప్న బర్మన్ (అథ్లెటిక్స్), గుర్ప్రీత్ సింగ్ సంధు (ఫుట్‌బాల్), సోనియా లాథర్ (బాక్సింగ్), చింగ్లెన్సానా సింగ్ (హాకీ), ఎస్.భాస్కరన్ (బాడీ బిల్డింగ్), అజయ్ ఠాకూర్ (కబడ్డీ), అంజుమ్ మౌద్గిల్ (షూటింగ్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), హర్మీత్ దేశాయ్ (టేబుల్ టెన్నిస్), పూజా ధాండా (రెజ్లింగ్), ఫౌద్ మీర్జా (ఈక్వెస్ట్రియన్), సిమ్రన్ సింగ్ షెర్గిల్ (పోలో), సుందర్ సింగ్ గుర్జర్ (పారా అథ్లెటిక్స్), గౌరవ్ సింగ్ గిల్ (మోటార్ స్పోర్ట్స్). ద్రోణాచార్య (రెగ్యులర్): మొహిందర్ సింగ్ ధిల్లాన్ (అథ్లెటిక్స్), సందీప్ గుప్తా (టేబుల్ టెన్నిస్), విమల్ కుమార్ (బ్యాడ్మింటన్). ద్రోణాచార్య (లైఫ్‌టైమ్): సంజయ్ భరద్వాజ్ (క్రికెట్), రామ్‌బీర్ సింగ్ ఖోఖర్ (కబడ్డీ), మెజ్బాన్ పటేల్ (హాకీ). ధ్యాన్‌చంద్ (లైఫ్‌టైమ్ అచీవ్మెంట్): మనోజ్ కుమార్ (రెజ్లింగ్), లాల్రెమ్సంగా (ఆర్చరీ), అరూప్ బసక్ (టేబుల్ టెన్నిస్), నితిన్ కీర్తనే (టెన్నిస్), మాన్యుయెల్ ఫ్రెడ్రిక్స్ (హాకీ). రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ (షూటింగ్), రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ (మాంచో ఫెర్రర్, అనంతపురం), గో స్పోర్ట్స్ ఫౌండేషన్. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ (క్రీడా ప్రదర్శనలో ఉత్తమ విశ్వవిద్యాలయం): పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్). రెజ్లర్ పూజా ధాండ, క్రికెటర్ పూనమ్ యాదవ్, కబడ్డీ ప్లేయర్ అజయ్ ఠాకూర్ ఆర్డీటీ డైరెక్టర్ మాంచో ఫెర్రర్, షూటర్ గగన్ నారంగ్, పవన్ సింగ్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సంస్కరణల సారథి
దివాలా చట్టంతో బ్యాంకులకు ఊరట ఒకపక్క స్కాముల కంపు కొడుతున్న వ్యవస్థ, మరోపక్క దిగజారిన విదేశీ నిధులు!!. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఎకనమిస్టుకైనా సంస్కరణల అమలు కత్తిమీద సామే. కానీ ఈ రాజకీయ లాయర్‌కు మాత్రం అది ఒక సంక్లిష్టమైన కేసులాగే కనిపించింది. దాన్ని గెలిచేవరకు వదలకూడదన్న పట్టుదలతో రోజుకు 16 గంటలు పనిచేస్తూ చివరకు కేసు గెలిపించారు. ఈ క్రమంలో తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టారు. అరుణ్‌జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎకానమీలో రెండు అతిపెద్ద కుదుపులు సంభవించాయి. 2016లో ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు ఎకానమీని స్తంభింపజేసింది. దీంతో దాదాపు రెండు త్రైమాసికాల పాటు జీడీపీ ఒక్కసారిగా కుంచించుకుపోయింది. షాక్ తిన్న ఎకానమీని పట్టాలెక్కించి తిరిగి జీడీపీని గాడిన పెట్టడంలో జైట్లీది కీలక పాత్ర. ఒకపక్క ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మరోపక్క నిర్ణయ పర్యవసానాలను ఎదుర్కొంటూ ఆయన అత్యంత సమర్ధవంతంగా ఎకానమీని నడిపించారని ఎకనమిస్టులు ప్రశంసిస్తారు. నోట్ల రద్దు తర్వాత ఏడాది జీఎస్టీ అమలు చేయడం ద్వారా అప్పటివరకు ఉన్న పన్ను వ్యవస్థ మొత్తాన్ని కదలించారు. నోట్ల రద్దుతో సతమతమై కుదుటపడుతున్న ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ మరో షాక్‌లాగా తగిలింది. దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా ఆలోచనల్లోనే ఉంటూ వచ్చిన ఒకే దేశం, ఒకే పన్ను వ్యవస్థను జైట్లీ సాకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ‘‘పాత భారతం ఆర్థికంగా ముక్కలుగా కనిపిస్తోంది, కొత్త భారతం ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్‌గా మారుతుంది’’ అన్నారు. ఇండియా ఎకానమీలో అతిపెద్ద సంస్కరణగా జీఎస్టీని ఆర్థికవేత్తలు కొనియాడుతున్నారు. కేవలం సంస్కరణను ప్రవేశపెట్టడం కాకుండా, ఎప్పటికప్పుడు దాని అమలును సమీక్షిస్తూ, అవసరమైన మార్పులు చేస్తూ జైట్లీ జీఎస్టీని సానుకూలంగా మార్చారు. రాజకీయంగా కూడా జీఎస్టీ పట్ల దాదాపు ఏకాభిప్రాయాన్ని సాధించడం ఆయన విజయంగా నిపుణులు అభివర్ణిస్తారు. ఎగవేతదారులకు చెక్ ఈ రెండు సంస్కరణలతో పాటు జైట్లీ హయాంలో తీసుకువచ్చిన మరో ముఖ్యమైన సంస్కరణ దివాలా చట్టం ఏర్పాటు చేయడం. ఈ చట్టంతో క్రెడిట్ కల్చర్‌లో మంచి మార్పులు వచ్చాయి. రుణదాతలకు మరిన్ని అధికారాలు లభించాయి. ఎగవేతలంటే భయపడే స్థితి ఏర్పడింది. ముఖ్యంగా క్రోనీ క్యాపిటలిజం నిర్మూలనకు ఇది సమర్ధవంతంగా పనిచేసిందని ప్రముఖ ఎకనమిస్టులు కొనియాడారు. ఆర్బీఐ, ద్రవ్యపరపతి సమీక్ష అంశాలపై జైట్లీకి స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. కేంద్రబ్యాంకుకు మరింత స్వయం ప్రతిపత్తి ఉండాలని, ద్రవ్యోల్బణం కట్టడే సమీక్షా సమావేశ ప్రధాన అజెండా కావాలని ఆయన అభిప్రాయపడేవారు. ఆయన మరణం పట్ల అటు రాజకీయనాయకులతో పాటు ఇటు కార్పొరేట్ వర్గాలు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. ఆర్థిక సంస్కరణలు సమర్ధవంతంగా ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా కార్పొరేట్ ప్రపంచం జైట్లీని కొనియాడుతోంది. దేశాభివృద్ధికి విశేష కృషి: కోవింద్ జైట్లీ మరణం తీవ్రవిచారకరం. ఆయనో న్యాయవాది, గొప్ప పార్లమెంటేరియన్, సమర్థుడైన మంత్రి. ఈ దేశ పురోగతి కోసం ఆయన ఎంతో కృషిచేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. విలువైన మిత్రుడు: వెంకయ్య జైట్లీ లేని లోటు పూడ్చలేనిది. ఆయన నాకు అత్యంత సన్నిహితుడు. ఆయన్ను కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు నష్టమే. పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో జైట్లీ సిద్ధహస్తుడు. జీఎస్టీ లాంటి సంస్కరణలు విజయవంతంగా అమలు చేయడంలో ఆయన కృషి మరువలేనిది. నీతి నిజాయితీ, విలువలకు కట్టుబడి రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. స్నేహితుడిని కోల్పోయా: మోదీ జైట్లీ మృతితో ఒక విలువైన స్నేహితుడిని కోల్పోయానంటూ ప్రధాని మోదీ ఉద్వేగానికి గురయ్యారు. బహ్రెయిన్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి భారత సంతతి ప్రజలతో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. ‘దేశం కోసం నిరంతరం సేవ చేసిన అత్యున్నత మేధో సంపత్తి కలిగిన దిగ్గజ రాజకీయ నేత అరుణ్ జైట్లీ. నాకు విలువైన మిత్రుడు. ఆయన లేడనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకున్నా. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అరుణ్ జైట్లీ ఎన్నో మంత్రిత్వ శాఖల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. కొద్ది రోజుల క్రితమే నా సొదరి, మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మనల్ని విడిచి పోయారు. ఆ బాధ మరవకముందే.. నా ప్రియ మిత్రుడు జైట్లీ కూడా లేరనే వార్త రావడం విచారకరం’ అంటూ మోదీ సంతాపం వ్యక్తం చేశారు. జైట్లీ సేవలు చిరస్మరణీయం: కేసీఆర్ జైట్లీ మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘జైట్లీ మరణం తీరని లోటు. దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’ అంటూ కేసీఆర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మేధావి, స్నేహశీలి: జగన్ అరుణ్ జైట్లీ ఇకలేరనే వార్తతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జైట్లీ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘జైట్లీ మరణవార్తపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. ఆయన ఓ మంచి మేధావి, స్నేహశీలి, చాలా అంశాలపై స్పష్టత కలిగిన వ్యక్తి. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేం’అని జగన్ ట్వీట్ చేశారు. కార్పొరేట్ ప్రపంచం నివాళి న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల దేశ వ్యాపార వర్గాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. ఆయన్ను నిజమైన సంస్కరణవాదిగా కార్పొరేట్ వర్గాలు కొనియాడాయి. జైట్లీ ఒక డైనమిక్ పార్లమెంటేరియన్ అని, వివిధ వర్గాలను సమన్వయం చేసుకోవడంలో ఆయన నేర్పరి అని, న్యూ ఇండియా అవతరణలో ఆయన ఆలోచనలు అత్యంత కీలకపాత్ర పోషించాయని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిత్తల్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కొనియాడారు. జైట్లీ మరణం దేశం పూడ్చుకోలేని లోటని వేదంతా చైర్మన్ అనిల్ అగర్వాల్, సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్, బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ షా, ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్సోమానీ, జేఎస్‌డబ్లు్య గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ తదితరులు జైట్లీ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. –సాక్షి, బిజినెస్ వెబ్ విభాగం -
రాష్ట్రపతిని కలిసిన ఏపీ గవర్నర్ బిశ్వభూషన్
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తన తొలి రోజు పర్యటనలో భాగంగా గురువారం భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం డిల్లీ చేరుకున్న గవర్నర్.. గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్‌ను సందర్శించారు. గవర్నర్ హోదాలో దేశాధ్యక్షుడిని తొలిసారి కలుసుకున్న హరిచందన్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్ధితులను వివరించారు. శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయిడు, హోం మంత్రి అమిత్ షా లను గవర్నర్ కలవనున్నారు. గవర్నర్ బిశ్వభూషన్తోపాటు కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎడిసి మాధవ రెడ్డి, ఆంధ్రా భవన్ అధికారులు ఉన్నారు. -
కార్గిల్ విజయానికి 20 ఏళ్లు
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో భారత్ గెలిచి శుక్రవారానికి 20 ఏళ్లయిన సందర్భంగా రణభూమిలో అమరులైన భారత సైనికులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా పలువురు ఘనంగా నివాళుర్పించారు. 1999 మే 3 నుంచి జూలై 26 వరకు పాక్‌తో జరిగిన యుద్ధంలో చివరకు భారత్ విజయం సాధించింది. దాదాపు 500 మంది భారత సైనికులు ఈ యుద్ధంలో అమరులయ్యారు. ఆర్మీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘జూలై 26 కార్గిల్ విజయదినోత్సవంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ద్రాస్, కక్సర్, బతాలిక్, టుర్టోక్ సెక్టార్లలో మన సైనికులు గొప్పగా పోరాడారు’ అని తెలిపింది. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల చీఫ్‌లు వరుసగా జనరల్ బిపిన్ రావత్, అడ్మిరల్ కరమ్‌వీర్ సింగ్, బీఎస్ ధనోవా ద్రాస్‌లో ఉన్న కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. నాడు యుద్ధంలో 17 స్క్వాడ్రన్‌కు కమాండింగ్ అధికారిగా పనిచేసిన ధనోవానే నేడు వాయుసేన చీఫ్‌గా ఉన్నారు. ద్రాస్‌కు వెళ్లలేక పోయిన కోవింద్ ద్రాస్‌లోని యుద్ధ స్మారకం వద్ద జరిగే కార్యక్రమానికి త్రివిధ దళాధిపతులతోపాటు వారికి అధిపతి అయిన రాష్ట్రపతి కోవింద్ కూడా హాజరై నివాళి అర్పించాలన్నది ప్రణాళిక. అయితే వాతావరణం బాగాలేకపోవడంతో కోవింద్ వెళ్లలేకపోయారు. దీంతో ఆయన కశ్మీర్‌లోని బదామీ బాగ్ కంటోన్మెంట్లో ఆర్మీ 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. యుద్ధక్షేత్రంలో తన ఫొటోలను పోస్ట్ చేసిన మోదీ అమరవీరులకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ‘భారత సైనికుల కోసం నేను విజయదినోత్సవం రోజున ప్రార్థిస్తున్నాను. మన సైనికులు ధైర్యం, సాహసం, అంకిత భావాన్ని ఈ రోజు గుర్తు చేస్తుంది. మాతృభూమిని కాపాడేందుకు సర్వస్వాన్ని అర్పించిన శక్తిమంతమైన యుద్ధ వీరులకు నివాళి’ అని పేర్కొన్నారు. యుద్ధం సమయంలోఅక్కడికి వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలను కూడా మోదీ పోస్ట్ చేశారు. పోరుకు దిగే సామర్థ్యం పాక్‌కు లేదు: రాజ్‌నాథ్ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో మాట్లాడుతూ సైనికుల చెక్కుచెదరని ధైర్యం, గొప్ప త్యాగం కారణంగానే నేడు మన దేశం సరిహద్దులు భద్రంగా, పవిత్రంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం భారత్‌తో పూర్తిస్థాయి లేదా పరిమిత కాలపు యుద్ధం చేసే సామర్థ్యం పాకిస్తాన్‌కు లేదని ఆయన పేర్కొన్నారు. ‘మన పొరుగుదేశం (పాకిస్తాన్) ఇప్పుడు మనతో నేరుగా యుద్ధం చేయలేక పరోక్ష యుద్ధానికి దిగుతోంది’ అని రాజ్‌నాథ్ చెప్పారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్గిల్ అమరవీరులకు నివాళి అర్పించారు. కార్గిల్ యుద్ధంపై చర్చ జరగాలని సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి డిమాండ్ చేశారు. అటు రాజ్యసభలో చైర్మన్ వెంకయ్య నాయుడు సైనికులు ధైర్య సాహసాలను పొగిడారు. వారి త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదన్నారు. సభ్యులు లేచి నిల్చొని మౌనం పాటించి అమర సైనికులకు నివాళి అర్పించారు. -
జాతీయ ఆశయాలు.. ప్రాంతీయ ఆశలు
న్యూఢిల్లీ: నవ భారత నిర్మాణానికి నూతన శక్తితో తమ ప్రభుత్వం నూతన ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కుల, విశ్వాసపరమైన మరే ఇతర వివక్షకు తావులేకుండా పనిచేయాల్సిందిగా కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఆయన కోరారు. ‘జాతీయ ఆశయాలు .. ప్రాంతీయ ఆశలు (నేషనల్ యాంబిషన్స్, రీజనల్ ఆస్పిరేషన్స్– నారా)’ ఎన్డీయే కూటమికి తానిచ్చే నినాదంగా మోదీ చెప్పారు. ఎన్డీయే ఈ రెండు మార్గాల్లో ముందుకు వెళుతోందని, అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఈ రెండిటి కలయిక అవసరమని పేర్కొన్నారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశమైన ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు మోదీని తమ నేతగా ఎన్నుకున్నారు. ప్రకాశ్‌సింగ్ బాదల్ (అకాలీదళ్) మోదీ పేరును ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా..నితీశ్ కుమార్ (జేడీయూ), ఉద్ధవ్ థాకరే (శివసేన) తదితర నేతలు బలపరిచారు. మోదీ 353 మంది ఎంపీల పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎంపికైనట్లు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎంపీల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అంతకుముందు బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఆ పార్టీ ఎంపీలు ఎన్నుకున్నారు. మోదీ పేరును షా ప్రతిపాదించగా పార్టీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీలు మద్దతు పలికారు. బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వాణి, మురళీ మనోహర్ జోషి తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. ఎన్డీయే నేతగా ఎన్నికైన తర్వాత శనివారం రాత్రి మోదీ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతో మోదీని ప్రధానిగా కోవింద్ నియమించారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. అంతకుముందు ఎన్డీయే నేతలు రాష్ట్రపతిని కలిసి తమ ఎంపీల జాబితాను అందజేశారు. కేబినెట్ కూర్పుపై మీడియా కథనాలు నమ్మొద్దు ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికైన సందర్భంగా మోదీ 75 నిమిషాలకు పైగా ప్రసంగించారు. ఎన్నికల్లో మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారంటూ పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు. వారు ఎప్పుడూ భయంతో బతికేలా చేశారన్నారు. వారి విశ్వాసాన్ని కూడా పొందాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 1857 నాటి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఆయన గుర్తుచేశారు. ఆనాడు స్వాతంత్య్రం కోసం అన్ని మతాలూ చేతులు కలిపాయన్నారు. సుపరిపాలన కోసం ఇప్పుడు మళ్లీ అలాంటి ఉద్యమం ప్రారంభించాల్సి ఉందని మోదీ చెప్పారు. తమపై విశ్వాసం ఉంచిన వారితో పాటు, ఎవరి విశ్వాసం చూరగొనాల్సి ఉందో వారితో కూడా తాము ఉంటామన్నారు. ఈ సందర్భంగా మోదీ కొత్త ఎంపీలకు పలు సూచనలు కూడా చేశారు. వీఐపీ సంస్కృతిని విడనాడటంతో పాటు ప్రచారం కోసం మీడియాకు ప్రకటనలివ్వద్దని చెప్పారు. కొత్త మంత్రివర్గ కూర్పుపై మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దన్నారు. అవన్నీ గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా,, కొన్ని సందర్భాల్లో దురుద్దేశపూరితంగా ఉంటాయని అన్నారు. ఎన్డీయే ఎంపీలందరి వివరాలను తానింకా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. నియమ, నిబంధనలను అనుసరించి బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని అన్నారు. ప్రజలను ఏకం చేసిన ఎన్నికలు ఎన్నికలు ఎప్పుడూ విభజించడంతో పాటు అంతరాన్ని సృష్టిస్తాయని, కానీ 2019 ఎన్నికలు ప్రజలను, సమాజాన్ని ఏకం చేశాయని చెప్పారు. ఈసారి ప్రభుత్వ అనుకూల వాతావరణం ఉండటం గమనార్హమని, దాని ఫలితంగానే సానుకూల తీర్పు వెలువడిందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సేవ చేయడానికి మించిన మంచి మార్గం మరొకటి లేదన్నారు. 2014–19 మధ్య పేదల కోసం ప్రభుత్వాన్ని నడిపామని, ఆ పేదలే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తాను చెప్పగలనని మోదీ అన్నారు. ఇప్పుడు లభించిన భారీ విజయం అంతే పెద్ద బాధ్యతను మనపై ఉంచిందని చెప్పారు. దేశాభివృద్ధికి ఎన్డీయే ఎంపీలందరూ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పాల్గొన్న తెలంగాణ బీజేపీ ఎంపీలు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు తెలంగాణ బీజేపీ ఎంపీలు శనివారం ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ, ఎన్డీయే పక్ష సమావేశంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లు హాజరయ్యారు. ఎన్డీయే భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తన తల్లి హీరాబా మోదీ ఆశీస్సులు తీసుకునేందుకు ప్రధాని ఆదివారం గుజరాత్ వెళ్లనున్నారు. వీఐపీ సంస్కృతిని దేశం అసహ్యించుకుంటుంది. విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ కోసం మీరెందుకు క్యూలో నిలబడలేరు? అందులో తప్పేం లేదు. ‘రెడ్ లైట్’ (ఎర్ర బుగ్గ) సంస్కృతికి మోదీ స్వస్తి చెప్పారని ప్రజలు చెప్పుకుంటారు. మనోహర్ పరీకర్ ఏం చేసేవారో మీరు చూశారు. ఆయన్ను అనుసరించండి. ఎలాంటి వలలోనూ పడకండి. ప్రభుత్వ వ్యతిరేకత హానిచేస్తుంది. కానీ మనం చేసిన పని ప్రభుత్వ అనుకూల గాలి సృష్టించింది. ఫలితంగా సానుకూల ఓటును మనం చూడగలిగాం. 16వ లోక్‌సభ రద్దు కేంద్ర మంత్రివర్గం సిఫారసు నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 16వ లోక్ససభను రద్దు చేసినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి శుక్రవారం ఆమోదించిన విషయం విదితమే. మోదీ మే 30న నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాగా ప్రమాణ స్వీకార తేదీ, సమయాన్ని, కొత్త మంత్రులుగా నియమించే వారి పేర్లను అందజేయాల్సిందిగా ప్రధానిని రాష్ట్రపతి కోవింద్ కోరినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. మోదీ 30న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని బీజేపీ శ్రేణులు తెలిపాయి. రాష్ట్రపతిభవన్‌లో మోదీకి ప్రధానిగా నియామక పత్రం ఇస్తున్న రాష్ట్రపతి కోవింద్ శనివారం ఢిల్లీలో పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి హాజరైన ఎన్డీఏ ఎంపీలు, కూటమి నేతలు పార్లమెంటు ప్రాంగణంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి, సోయం బాపూరావు పార్లమెంటు లోపలికి వస్తూ ఎంపీ సన్నీడియోల్ విజయసంకేతం, పార్లమెంటు ద్వారం వద్ద మోకరిల్లాక నమస్కరిస్తున్న ఎంపీ హన్స్‌రాజ్ హన్స్ -
రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ంపీల జాబితాను ఎన్నికల కమిషన్ (ఈసీ) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేసింది. 17వ లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ ఆరోరా, ఇద్దరు కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రలు.. శనివారం కోవింద్‌ను రాష్ట్రపతి భవన్లో కలిశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్‌సభ ఏర్పాటుకు ఫలితాల్లో వెల్లడైన ఎంపీల పేర్లను రాష్ట్రపతికి అందజేశారు. ఇది లోక్‌సభ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించడానికి రాష్ట్రపతికి ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల ప్రధానాధికారి, ఇతర కమిషనర్లను రాష్ట్రపతి కోవింద్ అభినందించారు. -
మంత్రివర్గంలోకి అమిత్ షా..!
న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా రంగం సిద్ధమయ్యింది. శుక్రవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ 16వ లోక్‌సభ రద్దుకు సిఫారసు చేసింది. సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ, మిగతా కేంద్రమంత్రులు రా6ష్టపతిని కలసి రాజీనామాలు సమర్పించారు. కేంద్ర మంత్రివర్గం రాజీనామాలు సమర్పించే సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి వారిని విందుకు ఆహ్వానించారు. వారి రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే వరకు కొనసాగాల్సిందిగా ప్రధానిని కోరినట్లు రాష్ట్రపతిభవన్ తెలిపింది. అంతకుముందు ప్రధాని గైర్హాజరీలో మోదీ నాయకత్వాన్ని, గత ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన కృషిని ప్రశంసిస్తూ కేంద్ర మంత్రులు ఒక తీర్మానం ఆమోదించారు. కాగా కొత్త మంత్రివర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 30న జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. జూన్ 3వ తేదీలోగా 17వ లోక్‌సభ కొలువుదీరాల్సి ఉంది. ఒకటీరెండు రోజుల్లో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు రాష్ట్రపతిని కలసి కొత్తగా ఎన్నికైన సభ్యుల జాబితాను అందజేయడంతో కొత్త సభ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. నేడు ఎన్డీయే సమావేశం మోదీని తమ నేతగా ఎన్నుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలు శనివారం సమావేశం కానున్నారు. కూటమి ప్రధాని అభ్యర్థిగా మోదీ ముందే ఖరారైన నేపథ్యంలో లాంఛనపూర్వకంగా ఈ భేటీ జరగనుంది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అంతకుముందు పార్లమెంట్ హౌస్‌లో బీజేపీ ఎంపీలు సమావేశమవుతారు. ఎంపీలు తనను నేతగా ఎన్నుకున్న తర్వాత మోదీ వారినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. ఇలావుండగా ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు మే 28న మోదీ తన నియోజకవర్గం వారణాసిని సందర్శించే అవకాశం ఉందని పార్టీవర్గాలు వెల్లడించాయి. శుక్రవారం వారణాసి నుంచి వచ్చిన బీజేపీ కార్యకర్తలు మోదీని కలసి ఆయన ఎన్నికకు సంబంధించిన అధికారిక సర్టిఫికెట్‌ను అందజేశారు. సౌత్ బ్లాక్‌లో పీఎంఓ అధికారులతో ప్రధాని సమావేశమయ్యారు. ఈసారి మంత్రివర్గంలో అమిత్ షా లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండోసారి అధికార పీఠాన్ని అధిరోహించేందుకు బీజేపీ సిద్ధమైన నేపథ్యంలో అందరి దృష్టీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై పడింది. ఈసారి మోదీ మంత్రివర్గంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమా పలు కొత్త ముఖాలు కనబడే అవకాశం ఉందని తెలుస్తోంది. అమిత్ షాను మంత్రివర్గంలోకి తీసుకునే పక్షంలో ఆయనకు హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ.. ఈ నాలుగు కీలక శాఖల్లో ఏదో ఒకటి అప్పగించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌లు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో వీరు కొత్త మంత్రివర్గం లో ఉంటారా? లేదా? అన్న అనుమానాలు న్నాయి. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక శాఖతో కేబినెట్లో కొనసాగే అవకాశం కన్పిస్తోంది. అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌పై సంచలన విజయం సాధించిన స్మృతీ ఇరానీకి పార్టీ ముఖ్యమైన బాధ్యతనే అప్పగించవచ్చు. వీరితో పాటు సీనియర్ మంత్రులు రాజ్‌నాథ్æ, నితిన్ గడ్కారీ, రవిశంకర్, గోయెల్, ప్రకాశ్ జవదేకర్లు కూడా కొనసాగవచ్చని తెలుస్తోంది. మిత్రపక్షాల్లో శివసేన (18), జేడీ(యూ) (16)లు మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో వారికి కూడా చోటు దొరకవచ్చు. ఇక పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణల నుంచి కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చే సూచనలున్నాయని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సూర్యాస్తమయం అయినా వెలుగు కొనసాగుతుంది ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలంపై సూర్యాస్తమయం అయినా ప్రజల జీవితాలను కాంతివంతం చేసేందుకు దాని వెలుగు ఇంకా కొనసాగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘ఓ కొత్త ఉదయం ఎదురుచూస్తోంది...’ అంటూ శుక్రవారం ఒక ట్వీట్లో మోదీ పేర్కొన్నారు. మనమందరం కలలుగన్న నవ భారత సృష్టికి, 130 కోట్ల మంది ప్రజల కలలు నెరవేర్చేందుకు తన ప్రభుత్వం మరింత కృత నిశ్చయంతో ఉందని ఆయన తెలిపారు. అడ్వాణీ, జోషీలతో మోదీ–షా భేటీ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా శుక్రవారం ఆ పార్టీ సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీమనోహర్ జోషీలను కలుసుకున్నారు. అమిత్ షాతో కలిసి తొలుత అడ్వాణీ ఇంటికెళ్లిన మోదీ, ఆయనకు పాదాభివందనం చేశారు. అనంతరం సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిపై కొద్దిసేపు చర్చించారు. సమావేశం అనంతరం మోదీ స్పందిస్తూ..‘ఈరోజు బీజేపీ విజయం సాధించిందంటే అడ్వాణీలాంటి గొప్ప వ్యక్తులు దశాబ్దాలపాటు కష్టపడి పార్టీని నిర్మించడమే కారణం. వీరంతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి సరికొత్తగా తీసుకెళ్లారు’ అని ట్వీట్ చేశారు. అనంతరం మోదీ, షా ద్వయం మురళీ మనోహర్ జోషి ఇంటికెళ్లారు. వీరిద్దరికి సాదరస్వాగతం పలికిన జోషి, మోదీకి శాలువాను బహూకరించారు. ఈ సందర్భంగా జోషికి పాదాభివందనం చేసిన మోదీ, తనవెంట తెచ్చిన స్వీట్స్‌ను అందించారు. దీంతో జోషి ధన్యవాదాలు తెలిపారు. ‘డా.మురళీమనోహర్ జోషి గొప్ప విద్యావేత్త. భారత విద్యావ్యవస్థను మెరుగుపర్చడంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది. నాతో పాటు చాలామంది కార్యకర్తలకు మార్గదర్శిగా వ్యవహరించిన జోషి, బీజేపీని బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేశారు’ అని మోదీ ప్రశంసించారు. ఈ సమావేశం అనంతరం జోషి మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, అమిత్ షాలు బీజేపీకి బ్రహ్మాండమైన విజయాన్ని అందించారని కితాబిచ్చారు. ఎన్నికల్లో విజయం అనంతరం తనకు శుభాకాంక్షలు చెప్పిన అమెరికా ఉపాధ్యక్షుడు పాంపియో, రష్యా అధ్యక్షుడు పుతిన్, కెనడా ప్రధాని ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, సౌదీ రాజు బిన్సల్మాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. బాలీవుడ్ నటీనటులు శిల్పాశెట్టి, మాధవన్, సంగీత దర్శకుడు రెహమాన్, సరోద్ విద్వాంసుడు అమ్జాద్ ఆలీఖాన్, బాక్సర్ మేరీకోమ్లకు ధన్యవాదాలు చెప్పారు. సీనియర్ నేత ఎల్కే అద్వానీ పాదాలకు నమస్కరిస్తున్న ప్రధాని మోదీ -
ఆరులో 63.48%
న్యూఢిల్లీ: ఆరో విడత సార్వత్రిక ఎన్నికలు ఆదివారం ముగిశాయి. ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 63.48 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగిందని వెల్లడించింది. పోలింగ్‌లో పశ్చిమబెంగాల్ మరోసారి అగ్రస్థానంలో నిలవగా, హరియాణా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, బిహార్, యూపీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. తాజా పోలింగ్‌తో మొత్తం 543 స్థానాలకు గానూ 484 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయనీ, మిగతా 59 సీట్లకు మే 19న చివరి దశ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఢిల్లీలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. 2014లో ఢిల్లీలో 65 శాతం పోలింగ్ నమోదుకాగా, ఈసారి అది 60 శాతానికి పడిపోయింది. బీజేపీ నేత భారతిపై దాడి.. పశ్చిమబెంగాల్లోని 8 లోక్ సభ సీట్లకు పోలింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఘటాల్ నియోజకవర్గంలోని కేశ్పూర్ ప్రాంతంలో పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లిన బీజేపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారిణి భారతీ ఘోష్‌పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)కి చెందిన మహిళా కార్యకర్తలు దాడిచేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన భారతి రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో దొగాచియా పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ టీఎంసీ మద్దతుదారులు ఆమె కాన్వాయ్‌పై రాళ్లతో పాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలో భారతి భద్రతా సిబ్బంది ఒకరు గాయపడగా, కారు ధ్వంసమైంది. ఈ సందర్భంగా మనస్తాపానికి లోనైన ఆమె కన్నీరు పెట్టుకున్నారు. కాగా, ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని పశ్చిమ మిడ్నాపూర్ మెజిస్ట్రేట్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. యూపీలో బీజేపీ ఎమ్మెల్యే దౌర్జన్యం.. ఉత్తరప్రదేశ్‌లోని బదోహీ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా ప్రిసైడింగ్ ఆఫీసర్‌పై బీజేపీ నేతలు దాడిచేశారు. ఔరాయ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ప్రక్రియను నెమ్మదించేలా చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే దీననాథ్ భాస్కర్, ఆయన అనుచరులు ప్రిసైడింగ్ అధికారిని చితక్కొట్టారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీ, మొత్తం వ్యవహారంపై నివేదిక సమర్పించాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది. మరోవైపు బిహార్‌లోని షియోహర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓ హోంగార్డ్ పోలింగ్‌కు ముందు కాల్పులు జరపడంతో ఎన్నికల అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బిహార్‌లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సందర్భంగా ఈవీఎంలు మొరాయించగా, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మరోవైపు హరియాణాలోని రోహతక్‌లో బీజేపీ నేత మనీశ్ గ్రోవర్ పోలింగ్ కేంద్రాల్లోకి బలవంతంగా ప్రవేశించి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని కాంగ్రెస్ రోహతక్ అభ్యర్థి దీపేందర్ సింగ్ హుడా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను మనీశ్ ఖండించారు. హరియాణాలో ఎలాంటి హింసాత్మక ఘటనలు నమోదు కాలేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఈసీకి ఫిర్యాదు చేస్తాం: బీజేపీ ఓడిపోతున్నామన్న ఆగ్రహంతోనే టీఎంసీ నేతలు భారతీ ఘోష్‌పై దాడిచేశారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు తమ నేత కదలికలపై నిషేధాజ్ఞలు విధించారని మండిపడ్డారు. ఓటేసిన ప్రముఖులు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రముఖులు ఢిల్లీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన భార్యతో కలిసి నిర్మాణ్ భవన్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఇక్కడే ఓటు వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఔరంగజేబురోడ్డులోని పోలింగ్‌బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాతో కలసి న్యూఢిల్లీ స్థానంలో ఓటేయగా, మాజీ సీఎం షీలా దీక్షిత్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించగా, ఓట్లు గల్లంతయ్యాయని మరికొన్ని చోట్ల ఓటర్లు ఆందోళనకు దిగారు. ఢిల్లీలో ఆదివారం ఓటేసిన అనంతరం వేలిపై సిరా గుర్తు చూపిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రియాంక గాంధీ వాద్రా దంపతులు, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మాజీ సీఎం షీలా దీక్షిత్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ -
చిక్కుల్లో గవర్నర్ కల్యాణ్ సింగ్
న్యూఢిల్లీ: రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్(87) మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సమర్పించిన నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం కేంద్ర హోంశాఖకు పంపారు. ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గత నెల 25న యూపీలోని అలీగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కల్యాణ్ సింగ్ మాట్లాడుతూ.. ‘మనమంతా బీజేపీ కార్యకర్తలం. కాబట్టి మళ్లీ బీజేపీనే అధికారంలోకి రావాలని కోరుకుంటాం. దేశ ప్రయోజనాల దృష్ట్యా మోదీ మళ్లీ ప్రధాని కావాల్సిన అవసరముంది. మే 23న మోదీ మళ్లీ ప్రధాని కావాలని మేమంతా కోరుకుంటున్నాం. దేశంలోని ప్రతీ బీజేపీ కార్యకర్త పార్టీ విజయానికి కృషి చేయాలి’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో విచారణ జరిపిన ఈసీ.. కల్యాణ్ సింగ్ ఎన్నికల నియమావళితో పాటు గవర్నర్ పదవికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారని తేల్చింది. ఈ నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించింది. విదేశీ పర్యటన నుంచి బుధవారం భారత్‌కు చేరుకున్న కోవింద్, సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ నివేదికను హోంశాఖకు పంపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు చర్యలు ఎదుర్కొన్న తొలి గవర్నర్‌గా కల్యాణ్ సింగ్ నిలిచే అవకాశముందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. సింగ్‌కు ముందు 1990ల్లో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించిన గుల్షర్ అహ్మద్ తన కుమారుడి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో అహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు. 1992, డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కల్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీ అగ్రనేతలతో పొసగకపోవడంతో 1999లో పార్టీకి రాజీనామా చేసిన కల్యాణ్ సింగ్, తిరిగి 2004లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో మోదీ ప్రధానిగా ఎన్నికయ్యాక కేంద్ర ప్రభుత్వం కల్యాణ్ సింగ్ ను రాజస్తాన్ గవర్నర్‌గా నియమించింది. -
నేలమ్మ
ఆమె ఒక విత్తన గని. భారతదేశ ధాన్య సంపదను పరిరక్షించిన దేశభక్తురాలు. నేలను నమ్మిన భూమాత. మట్టిని గౌరవించిన దేశమాత. సస్యాన్ని కాపాడిన ప్రకృతి తల్లి. అందుకే... ఆమెను గౌరవించడం ద్వారా మనందరి గౌరవాన్ని పెంచింది మన భారతదేశం. మార్చి 16వ తేదీన రాష్ట్రపతి భవన్ పద్మ పురస్కారాలకు వేదికైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలను అందచేస్తున్నారు. మహామహులు అందుకునే పురస్కారాల్లో ఈ ఏడాది పద్మాలు ఎవరో చూడాలని టీవీల ముందు కూర్చుంది ఇండియా. ఒక్కొక్కరి పేరు చదువుతున్నారు. రాష్ట్రపతి భవన్ ప్రొటోకాల్ గౌరవాలందుకుంటూ అవార్డు గ్రహీతలు రాష్ట్రపతి ముందుకు వస్తున్నారు. ‘కమలా పూజారి, వ్యవసాయరంగం’ అని వినిపించింది. ఒక బక్క పలుచటి మహిళ, డెబ్బై ఏళ్లు నిండిన మహిళ, ఒడిషా రాష్ట్రానికి చెందిన భూమియా ఆదివాసీ మహిళ... రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వస్తోంది. ఒడిషా ముతక చేనేత చీరను మడమల పైకి కట్టుకుంది. పాదాలకు స్లిప్పర్స్. భుజాల మీద శాలువా ఉంది. శాలువా ఆమెకు అలవాటున్న వస్త్రధారణలా లేదు. జారిపోతున్న శాలువాను సర్దుకుంటూ రాష్ట్రపతి ఎదురుగా మెరిసే కళ్లతో నిలబడిందామె. దేహం బలహీనంగా ఉంది, ఆమె కళ్లలో ధైర్యం బలంగా ఉంది. పద్మశ్రీ పురస్కారాన్ని మనసారా స్వీకరించడానికి సిద్ధంగా ఉందామె. భావి తరాలకు అన్నానికి భరోసా కల్పించిన ఆ తల్లికి పద్మశ్రీ పురస్కారాన్ని తన చేతుల మీదుగా ప్రదానం చేస్తున్నందుకు రాష్ట్రపతి కూడా సంతోషిస్తున్నారు. విత్తనానికి భవిష్యత్తు కమలా పూజారిది ఒడిషా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా, పత్రాపుట్ గ్రామం. ఆమె ఏమీ చదువుకోలేదు. స్కూలు అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియని బాల్యం ఆమెది. ఆమెకు మాత్రమే కాదు ఆ గ్రామంలో అందరిదీ ఒకటే జీవనశైలి. రోజుకింత వండుకోవడం, పొలానికి వెళ్లి సేద్యం చేసుకోవడమే ఆమెకి తెలిసింది. అది కాకుండా ఆమెకి తెలిసిన మరో సంగతి.. మన నేల మనకిచ్చిన వంగడాలను కాపాడుకోవాలని మాత్రమే. అందుకే పండించిన ప్రతి పంట నుంచి కొంత తీసి విత్తనాలను భద్రంగా దాచేది. అలా ఇప్పటి వరకు వందకు పైగా విత్తనాల రకాలున్నాయి ఆమె దగ్గర. అవి మన నేలలో ఉద్భవించిన మొలకలు కాబట్టి ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటాయి. తెగుళ్ల నుంచి వాటిని అవే కాపాడుకుంటాయి. రసాయన పురుగు మందులు చల్లాల్సిన అవసరమే ఉండదు. ‘మా విత్తనాలు కొనండి, అధిక దిగుబడిని సాధించండి’ అని ఊదరగొట్టే విత్తనాల కంపెనీల ఆటలేవీ సాగవు ఆమె దగ్గర. తెగుళ్ల నివారణకు మా క్రిమి సంహారక మందులనే వాడండి అనే ప్రకటనలకూ మార్కెట్ లేదక్కడ. దేశీయతను పరిరక్షించడం ద్వారా బహుళ జాతి కంపెనీలకు ఎంట్రీ లేకుండా చేయగలగడమే ఆమె సాధించిన విజయం. జన్యుమార్పిడి పంటలు, డీ జనరేషన్ విత్తనాలు రాజ్యమేలుతూ, ఎరువుల కంపెనీలు, పెస్టిసైడ్ కంపెనీలు రైతుని నిలువునా దోచేస్తున్న ఈ రోజుల్లో... భారత భవిష్యత్తు తరానికి ఆరోగ్యకరమైన విత్తనాలను దాచి పెట్టింది కమలా పూజారి. అందుకే దేశం ఆమెకు పద్మశ్రీ ప్రదానం చేసి ప్రణమిల్లింది. స్వామినాథన్ వదిలిన బాణం దాదాపు పాతికేళ్ల కిందట... ఒడిషాలోని జేపూర్ పట్టణంలో ఉన్న ఎమ్.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించింది. ఆ సదస్సుకు హాజరైన రైతు మహిళల్లో కమలాపూజారి కూడా ఉన్నారు. ఆమె శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలను తదేకంగా గ్రహించడంతోపాటు ఆచరణలోనూ పెట్టింది. పంటను గింజ కట్టడం ఆమె ఎప్పటి నుంచో చేస్తున్న పనే. అయితే ఆ సదస్సులో ఆమె కొత్తగా రసాయన ఎరువుల అవసరం లేని పంటలనే పండించాలని తెలుసుకున్నారు. మంచి విత్తనాన్ని దాచడం అనేది తాను ఎప్పటి నుంచో ఆచరిస్తున్నదే. కొత్తగా చేయాల్సింది ప్రతి విత్తనాన్నీ దాచి ఉంచడం, సేంద్రియ వ్యవసాయం చేయమని పదిమందికి తెలియ చెప్పడం. వాడ వాడలా జనాన్ని సమీకరించి దేశీయ విత్తనాలను కాపాడాల్సిన అవసరాన్ని తెలియ చెప్పడంతోపాటు రసాయన ఎరువులను బహిష్కరించడానికి కూడా పిలుపునిచ్చారు కమల. పత్రాపూట్లో తన ఊళ్లో ఇంటింటికీ తిరిగి చెప్పారు. పరిసర గ్రామాలకు కూడా వెళ్లి సేంద్రియ చైతన్యం తెచ్చారు. కోరాపూట్ పక్కనే ఉన్న నబరంగపూర్ జిల్లాలోని అనేక గ్రామాలు ఆమె బాట పట్టాయి. గ్రామస్థులను సమీకృతం చేసి, స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో విత్తనాల బ్యాంక్ (సీడ్ బ్యాంక్) నెలకొల్పారు కమల. రసాయన ఎరువుల పంజా తమ ఆదివాసీ ప్రాంతాల మీద పడనివ్వకుండా ఆపిన ధీర ఆమె. బీజంలో జీవం ఉంటుంది. గింజలో ఉన్న పునరుత్పత్తి చేసే గుణాన్ని కాపాడుకోవాలి. డీ జర్మినేషన్ గింజల వెంట పరుగెత్తకుండా జర్మినేషన్ సీడ్‌ను రక్షించుకోవాలనేది స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశం, అవార్డుల పంట సేంద్రియ పంటతోపాటు కమలాపూజారికి అవార్డుల పంట కూడా వరించింది. స్వామినాథన్ ఫౌండేషన్ 2002లో సౌత్ ఆఫ్రికా, జోహాన్నెస్ బర్గ్‌లో సేంద్రియ వ్యవసాయం మీద నిర్వహించిన సదస్సుకు ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఆమె తన అనుభవాలను ఆ సదస్సులో ప్రపంచ దేశాల ప్రతినిధులతో పంచుకున్నారు. విశేషమైన ప్రశంసలందాయామెకి. ‘ఈక్వేటర్ ఇనిషియేటివ్ అవార్డు’తో గౌరవించిందా సదస్సు. ఆ తర్వాత ఏడాది మన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో జరిగిన వ్యవసాయ సదస్సులో కమలా పూజారిని ‘కృషి విశారద’ బిరుదును ప్రదానం చేసింది. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న ‘ఒడిషా యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ’ 2004లో కమలాపూజారిని ‘ఉత్తమ మహిళా రైతు’ పురస్కారంతో గౌరవించింది. కమలా పూజారి గౌరవార్థం ఆ యూనివర్శిటీలో గాళ్స్ హాస్టల్‌కు ఆమె పేరు పెట్టింది. అంతే కాదు... ఆ హాస్టల్ ప్రారంభోత్సవం కూడా ఆమె చేతుల మీదుగా చేయించింది ప్రభుత్వం. అలాగే జేపూర్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు ఉచితంగా ఆహారం పెట్టే ‘రాత్రి ఆహార్ కేంద్ర’ ప్రారంభోత్సవం కూడా ఆమె చేతుల మీదుగానే జరిగింది. గౌరవాలున్నాయి.. గూడే లేదు ఒడిషాలో ప్రభుత్వం రైతు సదస్సు నిర్వహిస్తే, ఆ సదస్సులో పాల్గొనవలసిందిగా కమలా పూజారికి ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది. సన్మానమూ ఉంటుంది. మహిళాదినోత్సవం రోజున కూడా పురస్కరించుకోవడానికి స్థానిక అధికారులకు మొదటగా గుర్తు వచ్చే వ్యక్తి కమలా పూజారి. అయితే ఆమెకు నిలవ నీడ కల్పిద్దామనే ఆలోచన మాత్రం ఏ అధికారికీ రాలేదు. ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు అందుకోవడానికి అవసరమైన ప్రధాన అర్హత పేదరికం. ఆమెను చూస్తే పేదరికంలో మగ్గుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విఆర్వో ధృవీకరించాల్సిన అవసరం కూడా లేదు. పేదరికం ఆమె ఒంటి మీద తాండవిస్తోంది. ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వమని ఎన్నోసార్లు అప్లికేషన్లు ఇచ్చారామె. ఇవ్వగా ఇవ్వగా ఆఖరుకి ఆమెకి గవర్నమెంట్ కట్టించి ఇచ్చిన ఇంటికి కరెంటు లేదు, కనీసం కిటికీ కూడా లేదు. ఏ మాత్రం ఆవాసయోగ్యంగా లేని ఇంట్లో ఉంటోందామె. గవర్నర్ ఆహ్వానం గత ఏడాది ఒడిషా ప్రభుత్వం కమలాపూజారిని స్టేట్ ప్లానింగ్ బోర్డు మెంబరుగా నియమించింది. ఈ బోర్డులో ఒక ఆదివాసీ మహిళకు స్థానం లభించడం మొదటిసారి. ప్లానింగ్ బోర్డు మెంబరు హోదాలో వచ్చిందా, ఆదర్శ రైతు మహిళగా ఆహ్వానం వచ్చిందో ఆమెకు తెలియదు... కానీ, స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి గత ఏడాది ఆమెకు ఆహ్వానం వచ్చింది. అది నిజానికి అత్యంత గౌరవపూర్వకమైన ఆహ్వానం. విశిష్ఠ వ్యక్తులకు మాత్రమే అందే ఆహ్వానం. అయితే తన ఊరి నుంచి రాజధానికి వెళ్లడానికి ఖర్చులకు డబ్బు లేకపోవడంతో హాజరుకాలేకపోయారు కమల. అప్పుడు కూడా ప్లానింగ్ బోర్డు ఆమె ఆర్థిక స్థితిగతుల గురించి పరిశీలన చేయనేలేదు. పత్రాపుట్ వాసులైతే ‘ఆమెను ప్లానింగ్ బోర్డులో నియమించడం అంటే ఆమెను గౌరవించడం కాదు, ఆమె పేదరికాన్ని పరిహసించడమే’ అని ప్రభుత్వ తీరును నిరసించారు. ఆమె మాత్రం ‘ప్లానింగ్ బోర్డు మీటింగ్ ఎప్పుడు జరిగినా వెళ్లి మా ఊరికి తాగు నీటి సౌకర్యం కోసం మాట్లాడతాను’ అని చెప్పారు తప్ప తనకోసం ఏదైనా అడుగుతానని అనలేదు. పరమానందం కమలా పూజారిలో గొప్పదనం ఏమిటంటే... ఆమె పేదరికం గురించి ఊరంతా ఆవేదన చెందుతున్నప్పటికీ ఆమె మాత్రం తన పేదరికాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. దేశం తనను ఇంత పెద్ద పురస్కారానికి ఎంపిక చేసినందుకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేశారామె. ఊరి వాళ్లు మాత్రం... ‘‘అత్యంత పేదరికాన్ని అనుభవిస్తోంది. అత్యంత ఉన్నతమైన వేదికల మీద పురస్కారాలను అందుకుంటోంది. పురస్కారం అందుకుని వచ్చిన మరుసటి రోజు నుంచి తిరిగి పొలం పనులకు పోతుంది ఎప్పటిలా’’... అని ఆమెను సగౌరవంగా తలుచుకున్నారు. ఆమె సేవలను ప్రభుత్వం సగర్వంగా చాటుకుంటోంది. అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించుకుంటోంది. అంతటి విలువైన సేవలందించిన కమలాపూజారికి పద్మశ్రీ ప్రదానం చేయడం వల్ల పెరిగింది ఆమె గౌరవం కాదు... దేశ గౌరవమే. – వాకా మంజులారెడ్డి రీసెర్చ్ బ్యాంక్ భవిష్యత్తు వ్యవసాయరంగానికి మార్గదర్శనం చేస్తున్న మహిళ కమలా పూజారి. సుస్థిరమైన, నిరంతరాయమైన అభివృద్ధి కోసం ఆమె చేసిన సేవ వ్యవసాయ రంగానికే మార్గదర్శనం. మనదేశీయ పంటల నిధిని భావితరాల కోసం భద్రపరిచిన ముందు చూపున్న తల్లి కమలా పూజారి అని దేశం ఆమెను ప్రశంసలతో ముంచెత్తింది. వరిలో రకాలు, పసుపు, నువ్వులు, నల్ల జీలకర్ర, రకరకాల చిరుధాన్యాలు, మహాకంత, ఫూలా వంటి ఆరతడి పంటల విత్తనాలు, నీటి పంటలు గింజలు ఆమె సేకరణలో ఉన్నాయి. ఆమె సేకరించిన సీడ్ బ్యాంకులో అంతరించిపోతున్న అనేక రకాల ధాన్యం గింజలున్నాయి. ఆ గింజలను మొలక కట్టి, నారు పోసి ఆ మొక్కలు, పంటల దిగుబడి మీద పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. మనుమడి ఆవేదన కమలా పూజారికి చాలా కాలం కిందటే భర్త పోయాడు, ఇద్దరు కొడుకులు, కోడళ్లు, మనుమలతో జీవిస్తోంది. ఆమెకు ఒక్కో పురస్కారం రావడం, మీడియా ప్రతినిధులు వచ్చి కామెంట్ తీసుకోవడం ఆ ఇంటికి పరిపాటి అయిపోయింది. ప్లానింగ్ బోర్డు మెంబరు అయినప్పుడు ‘ఈ పదవి కంటే ఆమెకు గట్టి ఇల్లు ఇవ్వవచ్చు కదా’ అని వాపోయాడు 12వ తరగతి చదువుతున్న ఆమె మనుమడు సుదామ్ పూజారి. పోయినేడాది వరకు కూడా నాలుగు మట్టి గోడలు, తాటాకు పైకప్పు ఆమె ఇల్లు. ‘‘మా నానమ్మను పెద్ద పెద్ద బిల్డింగులను ప్రారంభించడానికి పిలుస్తారు. ఆమెకు చిన్న ఇల్లు కూడా ఇవ్వాలనుకోవడం లేదు ప్రభుత్వం. ఆమె ఇందిరా ఆవాస యోజన కింద పక్కా ఇంటి కోసం ఎన్నోసార్లు అధికారులకు అప్లికేషన్లు ఇచ్చింది. అయినా ఇల్లు శాంక్షన్ కాలేదు. ఎండాకాలంలో నేల మీద నీళ్లు చల్లుకుని పడుకుంటోంది’’ అని గత ఏడాది మీడియా ముందు ఆవేదన చెందాడతడు. ప్రభుత్వం ఆమెకు కిటికీ కూడా లేని గూడునైనా ఇచ్చింది మనుమడి మాట మీడియాలో వచ్చిన తరవాతనే. -
లోక్‌పాల్‌గా జస్టిస్ ఘోష్ ప్రమాణం
న్యూఢిల్లీ: దేశంలో తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ శనివారం రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ప్రజాప్రతినిధుల అవినీతికి సంబంధించిన కేసులను విచారించే లోక్‌పాల్, లోకాయుక్తా చట్ట్టం 2013లో ఆమోదం పొందింది. లోక్‌పాల్‌లో జ్యుడీషియల్ సభ్యులుగా జస్టిస్ దిలీప్ బీ భోసాలే, జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతి, జస్టిస్ అభిలాష కుమారి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్‌కుమార్ త్రిపాఠిలు నియమితులయ్యారు. నాన్–జ్యుడీషియల్ సభ్యులుగా పారా మిలటరీ దళమైన సశస్త్ర సీమాబల్ (ఎస్సీబీ) మాజీ చీఫ్ అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్ జైన్, మాజీ ఐఆర్ఎస్ అధికారి మహేంద్ర సింగ్, గుజరాత్ కేడర్ మాజీ ఐఏఎస్ ఇంద్రజిత్ ప్రసాద్ గౌతమ్‌లు వ్యవహరించనున్నారు. నిబంధనల ప్రకారం లోక్‌పాల్ కమిటీలో చైర్పర్సన్, గరిష్టంగా ఎనిమిది మంది సభ్యులు ఉండాలి. అందులో నలుగురు జ్యుడీషియల్ సభ్యులతోపాటు 50 శాతానికి తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు, మహిళలు ఉండాలని నిబంధనల్లో ఉంది. కమిటీలోని చైర్పర్సన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. భారత ప్రధాన న్యాయమూర్తికి ఉండే జీతాభత్యాలే చైర్‌పర్సన్‌కు, సుప్రీంకోర్టు జడ్జీలకు ఉండే జీతాభత్యాలే సభ్యులకు ఉంటాయి. -
తొలి లోక్‌పాల్‌గా పీసీ ఘోష్
న్యూఢిల్లీ: భారతదేశపు తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పినాకి చంద్ర ఘోష్ (పీసీ ఘోష్) మంగళవారం నియమితులయ్యారు. సశస్త్ర సీమా బల్ మాజీ చీఫ్ అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ జైన్, మహేంద్ర సింగ్, ఇంద్రజిత్ ప్రసాద్ గౌతమ్‌లు లోక్‌పాల్ కమిటీలో న్యాయేతర సభ్యులుగా ఉండనున్నారు. లోక్‌పాల్‌లో నియామకం కోసం వీరందరి పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సిఫారసు చేయగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. అవినీతిపై పోరు కోసం కేంద్రం లోక్‌పాల్‌ను తీసుకొస్తుండటం తెలిసిందే. -
తొలి విడత నోటిఫికేషన్ జారీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మొదటి విడత జరిగే లోక్‌సభ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్రతో కూడిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న 535 లోక్‌సభ స్థానాలకు మొత్తం ఏడు విడతలుగా జరిపేందుకు ఎన్నికల సంఘం గత వారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి విడతలో ఏప్రిల్ 11వ తేదీన 20 రాష్ట్రాల్లోని 91 పార్లమెంటరీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అత్యంత ఉత్కంఠగా జరగబోయే ఈ ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, కాషాయ దళాన్ని నిలువరించేందుకు ప్రతిపక్షాలు ఐక్యంగా ఎన్నికల క్షేత్రంలోకి దిగుతున్నాయి. మొదటి విడత ఎన్నికలు జరిగేదిక్కడే ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం (25), తెలంగాణ(17), ఉత్తరాఖండ్(5)ల్లోని మొత్తం స్థానాలకు, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో రెండు సీట్ల చొప్పున, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షదీవుల్లోని ఒక్కో సీటుకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా, ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు గాను 9 చోట్ల, బిహార్‌లోని 40 సీట్లకు గాను 4, పశ్చిమబెంగాల్లోని 42 స్థానాల్లో 2, మహారాష్ట్రలో 7, అసోంలో 5, ఒడిశాలో 4, జమ్మూకశ్మీర్ 6 సీట్లలో 2 చోట్ల కూడా మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు 25వ తేదీ ఆఖరు నోటిఫికేషన్ జారీ అయిన 18వ తేదీ నుంచి మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియ 25వ తేదీ వరకు కొనసాగుతుంది. నామినేషన్ పత్రాల పరిశీలన 26వ తేదీతో, నామినేషన్ల ఉపసంహరణకు 28వ తేదీతో గడువు ముగియనుంది. మొదటి విడత ఎన్నికలు జరిగే 91 నియోజకవర్గాల్లో బరిలో మిగిలే అభ్యర్థులు ఎవరనే విషయంలో మార్చి 28వ తేదీన స్పష్టతరానుంది. అన్ని చోట్లా ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా అంటే, సాయంత్రం 4, 5, 6 గంటలకు ముగియనుంది. -
‘పద్మ’ పురస్కారాల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: 2019 ఏడాదికిగానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో ఘనంగా జరిగింది. మొత్తం 112 మందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలు ప్రకటించగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తాజాగా 47 మందికి ప్రదానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగిలిన వారికి ఈ నెల 16న అందజేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ‘రైతు నేస్తం’ వ్యవస్థాపక అధ్యక్షుడు యడ్లపల్లి వెంకటేశ్వరావు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.ప్రముఖ నటుడు మోహన్‌లాల్, అకాలీదళ్ నాయకుడు సుఖ్‌దేవ్ సింగ్ దిండ్సా, బిహార్ నాయకుడు హుకుందేవ్ నారాయణ్ యాదవ్, ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ తరఫున ఆయన సతీమణి భారతి నయ్యర్ పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. గాయకుడు శంకర్ మహదేవన్, నటుడు ప్రభుదేవా, టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్‌కమల్ తదితరులు పద్మశ్రీ పురస్కారాలు స్వీకరించారు. రైతాంగానికి నా పురస్కారం అంకితం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న తనకు లభించిన పద్మశ్రీ పురస్కారాన్ని తెలుగు రాష్ట్రాల రైతాంగానికి అంకితమిస్తున్నట్లు యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. అవార్డు అందుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు మరింత అవగాహన కల్పించేందుకు జిల్లాలు, మండలాల స్థాయిలో మోడల్ ఫాంలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ‘రైతు నేస్తం’ కృషి చేస్తుందని, సేంద్రియ వ్యసాయంలో రైతులకు శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేలా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ వసతి కూడా కల్పిస్తుందన్నారు. యువత కూడా వ్యవసాయం వైపు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పద్మ పురస్కారాల గ్రహీతలు ప్రభుదేవా, సామాజిక కార్యకర్త బంగారు అడిగలార్, శంకర్ మహదేవన్, శివమణి, మోహన్‌లాల్ -
సార్వభౌమత్వ రక్షణకు సత్తా చాటుతాం
సాక్షి ప్రతినిధి, చెన్నై: సార్వభౌమత్వ రక్షణకు భారత్ అన్ని శక్తులు ఉపయోగిం చుకుంటుందని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా సులుర్లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో సోమవారం అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని జవాన్లనుద్దేశించి ప్రసంగించారు. ‘భారత్ మిమ్మల్ని చూసి గర్వపడుతోంది. భారత వైమానిక దళాన్ని మరింత ఆధునీకరిస్తున్నాం. 1975 నుంచి హెలికాఫ్టర్‌లో మహిళా పైలట్లు తమ దక్షతను చాటుకుంటున్నారు. 2016 నుంచి యుద్ధ విమానాల్లో సైతం మహిళలకు శిక్షణ ఇస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్నపుడు వైమానిక దళాల సేవలు వెలకట్టలేనివి’ అని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. -
అనిశ్చితి దాటి కొత్త ఆశల దిశగా..
న్యూఢిల్లీ: తీవ్ర అనిశ్చిత పరిస్థితులు రాజ్యమేలుతున్న సమయంలో 2014లో అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. ఆనాటి నుంచి నవభారత నిర్మాణానికి కృషిచేస్తూనే ఉందని తెలిపారు. రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్ని ప్రారంభిస్తూ కోవింద్ గురువారం ఉభయసభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. రఫేల్ ఒప్పందం, వెనకబడిన వర్గాలకు 10 శాతం కోటా, ట్రిపుల్ తలాక్ బిల్లు, పౌరసత్వ బిల్లు, నోట్లరద్దు తదితరాలను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ సాగిన ఆయన ఉపన్యాసం సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. శుక్రవారం ప్రవేశపెట్టబోయే తాత్కాలిక బడ్జెట్లో రైతులకు పలు ఉపశమన చర్యలు ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యవసాయ సంక్షోభాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదులన్న కోవింద్..2022 నాటికి వారి ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకున్న నిర్ణయం చారిత్రకమని ప్రశంసించారు. 2016 నాటి సర్జికల్ దాడులను ప్రస్తావించగానే అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో విజయాల్ని ప్రశంసించిన కోవింద్..తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పలు అంశాలపై సుమారు గంటసేపు కొనసాగిన కోవింద్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. నవభారత నిర్మాణంపై... 2014 ఎన్నికలకు ముందు దేశంలో అస్థిరత నెలకొంది. ఎన్నికల తరువాత ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నవభారత నిర్మాణానికి పూనుకుంది. అవినీతి, జడత్వ, లోపరహిత వ్యవస్థలతో కూడిన దేశ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం. నాలుగున్నరేళ్లుగా ప్రజల్లో కొత్త ఆశలు, విశ్వాసాన్ని పాదుకొల్పింది. దేశ ముఖచిత్రాన్నే మార్చివేసి సామాజిక, ఆర్థిక మార్పును తీసుకొచ్చింది. రైతు సమస్యలపై.. పవిత్ర పార్లమెంట్ తరఫున నేను మన అన్నదాతల్ని అభినందిస్తున్నా. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం రేయింబవళ్లు కష్టపడుతోంది. రైతుల సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. పౌరసత్వ బిల్లుపై.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో వేధింపులకు గురై భారత్‌కు వలసొచ్చే ముస్లిమేతరులకు ఈ బిల్లు న్యాయం చేస్తుంది. పౌరులకు సామాజిక, ఆర్థిక న్యాయం కల్పించడమే లక్ష్యంగా న్యాయ వ్యవస్థను సంస్కరించేందుకు పాటుపడుతోంది. ఆర్థిక వ్యవస్థపై.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 2014లో 2.6 శాతం ఉండగా, 2017 నాటికి 3.3 శాతానికి ఎగబాకింది. నాలుగున్నరేళ్లుగా నమోదవుతున్న వృద్ధిరేటే దీనికి కారణం. సగటున వార్షిక వృద్ధిరేటు 7.3 శాతంగా నమోదైంది. దీంతో భారత్..ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. నోట్లరద్దుపై.. అవినీతి, నల్లధన వ్యతిరేక పోరులో నోట్లరద్దు కీలక ఘట్టంగా నిలిచిపోయింది. ఈ నిర్ణయంతో సమాంతర ఆర్థిక వ్యవస్థ మూలాలు దెబ్బతిన్నాయి. సంక్షేమ పథకాలపై.. పీఎం జీవిత బీమా పథకంతో సుమారు 21 కోట్ల మంది, సౌభాగ్య పథకంతో 2 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయి. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా 9 కోట్ల టాయిలెట్లు నిర్మించాం. -
ఆ డాక్యుమెంట్లు బయటపెట్టండి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) డైరెక్టర్‌గా ఆలోక్‌వర్మను తొలగించడానికి కీలకంగా మారిన అన్ని పత్రాలు, నివేదికలను బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు కోరారు. సీబీఐతో పాటు కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) నియామకాల్లో పారదర్శకత పాటించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ‘సీఐసీ నియామకాల నుంచే పారదర్శకత అన్నది ప్రారంభం కావాలి. సీఐసీ, సీబీఐతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు, ఆలోక్ వర్మను తొలగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటైన హైలెవల్ కమిటీ, సమాచార కమిషనర్ల నియామకం సహా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత ఉండేలా చూడాలి’ అని శ్రీధర్ కోరారు. గతేడాది కేంద్ర సమాచార కమిషన్ వార్షిక సమావేశంలో కోవింద్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అధిక సమాచారం అంటూ ఏదీ ఉండదని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం సీవీసీతో పాటు సీబీఐలో జరుగుతున్న నియామకాలకు సంబంధించి తీవ్రమైన సమాచార లోటు ఉందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రజలు తమ సమస్యలను సీఐసీ దృష్టికి నమ్మకంగా, ధైర్యంతో తీసుకెళ్లలేరని స్పష్టం చేశారు. ఆలోక్ వర్మ తొలగింపుపై సీవీసీ నివేదికను, కీలక పత్రాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రజలకు సమాచారాన్ని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)లోని సెక్షన్ 4 కింద అన్ని నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. న్యాయవ్యవస్థ కన్నెర్ర చేసినప్పుడే కేంద్రం సీవీసీ వంటి సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తోందనీ, అయినా ప్రజలకు సమాచారమివ్వడం లేదన్నారు. ప్రధాని, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సిక్రీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలు సభ్యులుగా ఉన్న హైలెవల్ కమిటీ వర్మను సీబీఐ డైరెక్టర్‌గా 2–1 మెజారిటీతో తొలగించడం తెల్సిందే. -
31 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 2019, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకూ జరగనున్నాయి. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం నాడిక్కడ సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు సహా పలు కీలక అంశాలను కేబినెట్ కమిటీ చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ మంళవారం ఆమోదించిన పౌరసత్వ బిల్లు–2019ను బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభ ముందుకు తీసుకొచ్చే అవకాశముందని వెల్లడించాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 31న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యంతర బడ్జెట్‌పై 2–3 రోజుల పాటు పార్లమెంటులో చర్చ సాగనుంది. అయితే కొన్ని కారణాల రీత్యా ఈసారి ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం లేదు. కాగా, ఆర్డినెన్సుల జారీకి అనుకూలంగా రాష్ట్రపతి పార్లమెంటును స్వల్పకాలం మాత్రమే ప్రోరోగ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందని ట్రిపుల్ తలాక్, మెడికల్ కౌన్సిల్, కంపెనీ వ్యవహారాల ఆర్డినెన్సులను మరోసారి జారీచేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఫలితాలొచ్చాయని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో అనేక అక్రమాలు జరిగాయని, అధికార పార్టీకి అనుకూలంగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరి గిందన్నారు. దీనిపై విచారణకు ఆదేశించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. గురువారం తన నివాసంలో పొన్నాల విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి నప్పుడు ఫిర్యాదు చేయాలనుకున్నా సమయం కుదరలేదని, అందుకే లేఖ రాస్తున్నానని వెల్లడించారు. లేఖ లో పేర్కొన్న విషయాలను ఆయన వివరించారు. పోలిం గ్ రోజున చాలా చోట్ల ఈవీ ఎంలు పనిచేయలేదని, వాటి స్థానంలో తప్పుడు ఈవీఎంలు పెట్టి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. ఎన్నికలు జరిగిన 36 గంటల తర్వాత కూడా ఎంత శాతం పోలింగ్ నమోదైందనే విషయాన్ని ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రకటించలేదని పేర్కొన్నారు. తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన 3 గంటల్లో పోలింగ్ శాతం వెల్లడైందని, ఆ రాష్ట్రాల కంటే తక్కు వ అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో మాత్రం 36 గంటలు పట్టిందని తెలిపారు. పోలింగ్ సమయంలో, ఆ తర్వాత అక్రమాలు చేసినందుకే ఇంత సమయం తీసుకున్నారని ఆరోపించారు. ఆయన చెప్పినట్లుగానే ఫలితాలు.. ఎన్నికల ముందే టీఆర్ఎస్ అధినేత చెప్పినట్లుగానే ఫలితాలొచ్చాయని, పేర్లతో సహా ఆయన చెప్పిన వారే గెలిచారని, ఇది కూడా ఎన్నికల్లో అక్రమాలకు నిదర్శనమని పొన్నాల పేర్కొన్నారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని, పోలైన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు కౌం టింగ్ ఎందుకు జరిగిందో ఈసీ ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదన్నారు. కొన్నిచోట్ల చనిపోయిన వ్యక్తు లు కూడా ఓట్లు వేసినట్టు నమోదైందని ఎన్నికల తర్వాత మీడియా పరిశోధనల్లో తేలిందన్నారు. -
‘సదైవ్ అటల్’ను ప్రారంభించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. వాజ్‌పేయి 94వ జయంతి సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం వాజ్‌పేయి స్మారకార్థం రాష్ట్రీయ స్మృతి స్థల్ సమీపంలో నిర్మించిన ‘సదైవ్ అటల్ మెమోరియల్’ను రాష్ట్రపతి ప్రారంభించారు. దీనిని దేశానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. వాజ్‌పేయికి నివాళులర్పిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వాజ్‌పేయి కలలుగన్న భారత్‌ను నిర్మించి తీరతామని ఆయన ఉద్ఘాటించారు. వాజ్‌పేయికి నివాళులర్పించిన వారిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తదితరులు ఉన్నారు. సదైవ్ అటల్ మెమోరియల్‌ను 1.5 ఎకరాల విస్తీర్ణంలో రూ. 10.51 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ నిర్మాణానికి కావాల్సిన నిధులను అటల్ స్మృతి న్యాస్ సొసైటీ అందించింది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బిహార్ గవర్నర్ లాల్జీ తాండన్, గుజరాత్ గవర్నర్ ఓపీ కొహ్లీ, కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా సహా పలువురు బీజేపీ నేతలు ఈ సొసైటీకి వ్యవస్థాపకులుగా ఉన్నారు. -
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి కోవింద్
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరిన కోవింద్ నగరంలోని హకీంపేట్ విమానశ్రయానికి చేరుకున్నారు. కోవింద్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డీలు స్వాగతం పలికారు. శీతాకాల విడిదిలో భాగంగా ఆయన హైదరాబాద్‌లో నాలుగు రోజులపాటు ఉండనున్నారు. -
కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ కన్నుమూత
సాక్షి, బెంగళూరు/శివాజీనగర: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పెట్రోలియం, రసాయనాల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మం త్రి అనంత్ కుమార్(59) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం అర్ధరాత్రి దాటా క 2 గంటలకు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. దక్షిణ భారతంలోని కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావటానికి కృషి చేసిన ముఖ్య నేతల్లో అనంత్ కుమార్ ఒకరు. దక్షిణ బెంగళూరు నుంచి ఆయన వరుసగా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అనంత్ కుమార్‌కు భార్య డాక్టర్ తేజస్వి, కుమార్తెలు ఐశ్వర్య, విజేత ఉన్నారు. సాయంత్రం ప్రధాని మోదీ బెంగళూరుకు వచ్చి అనంత్ కుమార్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంత్ కుమార్ కుటుంబసభ్యులను ఓదార్చారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు.. బెంగళూరుకు చెందిన హెచ్.ఎన్.నారాయణ్ శాస్త్రి, గిరిజ దంపతులకు అనంత్ కుమార్ 1959లో జన్మించారు. విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ సభ్యుడయ్యారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి నేతగా అరెస్టై జైలుకు వెళ్లారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 1987లో బీజేపీలో చేరారు. 1996లో మొదటిసారిగా దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి ఎంపీ అయ్యారు. 1998లో వాజపేయి కేబినెట్లో 38 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ సారథులు వాజ్‌పేయి, అడ్వాణీతోపాటు ప్రధాని మోదీకి సన్నిహితుడిగా అనంత్ కుమార్‌కు పేరుంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కన్నడలో ప్రసంగించిన మొదటి నేత అనంత్‌కుమారే. నేడు అంత్యక్రియలు బ్రిటన్, అమెరికాల్లో కేన్సర్ వ్యాధికి చికిత్స పొందిన అనంత్‌కుమార్ అక్టోబర్‌లో స్వదేశానికి తిరిగి వచ్చారు. బెంగళూరులోని శ్రీశంకర కేన్సర్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంగళవారం మధ్యాహ్నం చామరాజపేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. ప్రముఖుల సంతాపం.. అనంత్‌కుమార్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎల్కే అడ్వాణీ సంతాపం తెలిపారు. ‘అనంతకుమార్ మంచి పరిపాలనాదక్షుడు. యువకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి అంకితభావంతో పనిచేశారు. కర్ణాటక, ముఖ్యంగా బెంగళూరులో పార్టీ బలోపేతం అయ్యేందుకు కృషి చేశారు. ఆయన భార్య తేజస్వినితో మాట్లాడాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. గవర్నర్, తెలంగాణ సీఎం సంతాపం సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి అనంత కుమార్ మృతికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంత కుమార్ మృతి దేశానికి తీరని లోటని గవర్నర్ పేర్కొన్నారు. అనంత్ కుమార్ దేశానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అలాగే, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అనంత్‌కుమార్ మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతకుమార్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కుటుం బ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. -
‘మీ టూ’కు తొలి వికెట్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు వేర్వేరు మీడియా సంస్థల్లో ఎడిటర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయన లైంగికంగా వేధించారని పలువురు మహిళా జర్నలిస్టులు ఆరోపించడం తెల్సిందే. అక్బర్ రాజీనామాను ప్రధాని మోదీ, ఆ తర్వాత రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. అక్బర్ రాజీనామా ‘మీటూ’ ఉద్యమ విజయమని మహిళా కార్యకర్తలు అభివర్ణించారు. తాజా పరిణామంలో సత్యం గెలిచిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. 20 ఏళ్ల కిత్రం తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించిన మహిళా జర్నలిస్టు ప్రియా రమణిపై అక్బర్ దాఖలుచేసిన పరువు నష్టం దావాపై ఢిల్లీలోని పాటియాలా కోర్టులో గురువారం విచారణ ప్రారంభంకానుంది. వ్యక్తిగతంగానే పోరాడుతా.. వ్యక్తిగతంగానే కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని అక్బర్ అన్నారు. ‘పదవికి రాజీనామా చేసి నాపై వచ్చిన ఆరోపణల్ని వ్యక్తిగతంగానే కోర్టులో సవాలుచేయడం సరైనదని భావించి రాజీనామా చేశా’ అని అన్నారు. దోవల్‌ను కలిశాకే నిర్ణయం.. ప్రధానికి సన్నిహితుడిగా పేరొందిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యాకే అక్బర్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అక్బర్‌పై ఆరోపణలు చేస్తున్న మహిళల సంఖ్య ఇప్పటికే 20దాటిందని, మరింత మంది ప్రియా రమణికి మద్దతుగా నిలబడే అవకాశాలున్నాయని నిఘా నివేదికలొచ్చాయని అక్బర్‌కు దోవల్ తెలిపారు. అక్బర్ వేధింపులకు పాల్పడిన వీడియోలూ బయటికొచ్చే చాన్సుందని తెలుస్తోంది. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్బర్‌పై∙ఆరోపణలు పార్టీకి నష్టంతెస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రధాని సూచనతో అక్బర్ రాజీనామా చేసినట్లు సమాచారం. -
కేంద్రానికి వీహెచ్‌పీ డెడ్‌లైన్
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అయోధ్యలో రామమందిరం నిర్మాణం అంశంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) గళం పెంచింది. కేంద్ర ప్రభుత్వానికి గడువు విధించింది. ఈ ఏడాది చివరిలోగా రామమందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తేకుంటే తమకు వేరే ప్రత్యామ్నాయాలున్నాయంటూ హెచ్చరికలు చేసింది. శుక్రవారం ఇక్కడ భేటీ అయిన వీహెచ్‌పీ ఉన్నత స్థాయి కమిటీ రామ్ జన్మభూమి న్యాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆధ్వర్యంలో చర్చలు జరిపింది. అనంతరం వీహెచ్‌పీ ప్రముఖులంతా రాష్ట్రపతి కోవింద్‌కు∙తీర్మాన ప్రతిని ఇచ్చారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ మాట్లాడారు. ‘ప్రభుత్వం స్పందించకుంటే వేరే ప్రత్యామ్నాయాలున్నాయి. వచ్చే ఏడాది మహాకుంభమేళా సందర్భంగా సాధువులతో జరిగే ధరమ్ సన్సద్ సమావేశంలో నిర్ణయిస్తాం’ అని తెలిపారు. ‘ఈ మధ్య జంధ్యం ధరించిన కొందరు నేతలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. వారూ మాకు మద్దతివ్వాలని రాహుల్‌గాంధీనుద్దేశించి అన్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ..‘ఇప్పటికే చాలా ఏళ్లపాటు ఎదురు చూశాం. ఇప్పుడిక వేచి చూడలేం’ అని‡ అన్నారు. ఢిల్లీలో సమావేశంలో పాల్గొన్న వీహెచ్‌పీ నేతలు -
సీజేఐగా రంజన్ గొగోయ్
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ రంజన్ గొగోయ్(63) నియమితులైనట్లు న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడిం చింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి నియమితులైన మొట్టమొదటి సీజేఐ ఈయనే కావడం గమనార్హం. ప్రస్తుత సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గొగోయ్ పేరును సీజేఐగా లా కమిషన్‌కు ప్రతిపాదించారు. కమిషన్ ఆ ప్రతిపాదనను ప్రధాని మోదీకి పంపగా ఆయన దానిని రాష్ట్రపతి ఆమోదానికి సిఫారసు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడంతో న్యాయమంత్రిత్వ శాఖ గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వివిధ అంశాలకు సంబంధించి సీజేఐకు వ్యతిరేకంగా గొంతెత్తిన నలుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్ గొగోయ్ కూడా ఉండటంతో సీజేఐగా ఆయన నియామకంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అక్టోబర్ 2వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఎన్నార్సీ, లోక్‌పాల్ కేసుల విచారణలో కీలక తీర్పులు వెలువరించారు. -
న్యాయవ్యవస్థలో మౌలిక కొరత: సీజేఐ
న్యూఢిల్లీ: న్యాయ పరిపాలనపై మచ్చ రావడానికి ముందుగానే న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కొరతను అధిగమించాల్సి ఉందని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. మౌలిక సౌకర్యాల లేమికి ఆర్థికపరమైన అవరోధాలను సాకుగా చూపకూడదన్నారు. సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ నిర్వహించిన సింపోజియంలో రాష్ట్రపతి కోవింద్‌తోపాటు సీజేఐ పాల్గొన్నారు. ‘మౌలిక వనరుల కొరత తీవ్రమై, న్యాయ పరిపాలనకు హాని కలిగించక ముందే చర్యలు తీసుకోవాల్సి ఉంది. నాణ్యమైన, జవాబుదారీ తనంతో కూడిన సత్వర న్యాయం అందించడానికి, న్యాయ ఉద్దేశం నెరవేరేందుకు న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది’ అని సీజేఐ అన్నారు. సామాన్యుడికి న్యాయం అందించటానికి, కక్షిదారులకు వసతులు, న్యాయవాదులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలంటే న్యాయస్థానాల పరిధి పెరగాలన్నారు. కాగా, చాలా కేసుల్లో కక్షిదారులు వాయిదాలు కోరడం సర్వసాధారణంగా మారిందని, కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులకు ఇది కూడా ఒక కారణమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. -
తల్లి చీరలో జాన్వీ కపూర్
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నవారిలో దివంగత నటి శ్రీదేవి కుటుంబం ఉంది. ‘మామ్’ చిత్రానికి ఉత్తమ నటిగా శ్రీదేవిని జాతీయ అవార్డుకి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డును అందుకోవడానికి శ్రీదేవి భర్త బోనీకపూర్, ఆమె కూమార్తెలు జాన్వీ అండ్ ఖుషీ ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ‘‘ఇది మేం గర్వపడాల్సిన సమయం. ఈ మంచి క్షణాల్లో శ్రీదేవి బతికి ఉంటే చాలా సంతోషపడేవారు. సినిమాలో ఆమె పడిన కష్టానికి ఫలితం దక్కింది’’ అన్నారు బోనీ కపూర్. జాన్వీ పట్టు చీర కట్టుకుని వెళ్లారు. తాను కట్టుకున్న చీర తల్లిదేనని ఆమె పేర్కొన్నారు. -
సురేశ్ ప్రభుకు విమానయాన శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు అదనంగా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ బాధ్యతలను శనివారం ప్రభుత్వం అప్పగించింది. విమానయాన శాఖా మంత్రిగా పనిచేస్తున్న టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించిన మరుసటి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ సలహా మేరకు రాష్ట్రపతి కోవింద్ పౌరవిమానయాన శాఖ అదనపు బాధ్యతలను సురేశ్ ప్రభుకు అప్పగించారని రాష్ట్రపతిభవన్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. -
ఐటీ వరల్డ్ కాంగ్రెస్ సదస్సుకు రండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఈ నెల 19 నుంచి 21 వరకు జరగనున్న ఐటీ వరల్డ్ కాంగ్రెస్ సదస్సుకు రావాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఐటీ మంత్రి కె. తారకరామారావు కోరారు. శుక్రవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రామ్‌నాథ్ కోవింద్‌ను కలసి ఈ మేరకు ఆహ్వానించారు. -
రాజ్యసభ ఎన్నికల్లో నెగ్గేందుకు ప్రలోభాలు
సాక్షి, న్యూఢిల్లీ: అధికార టీడీపీ డబ్బులు వెదజల్లి రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యేలకు రూ. 25 కోట్లు వంతున ఆఫర్ చేస్తూ అవినీతి చర్యలకు పాల్పడుతోందని రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. సీఎం చంద్రబాబు రూ.కోట్లు ఇస్తామంటూ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మభ్యపెట్టి లాక్కుంటున్న తీరును రాష్ట్రపతికి వివరించారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదు వైఎస్సార్ సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను అధికార టీడీపీ ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపులకు ప్రోత్సహించిందని, ఇప్పుడు మళ్లీ రాజ్యసభ ఎన్నికల్లో నెగ్గేందుకు మరో నలుగురిని లాక్కొనేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఆఫర్ చేస్తోందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కొద్ది రోజుల క్రితం తమ పార్టీ ఎమ్మెల్యేలను కలసి టీడీపీలో చేరాలంటూ రూ. 25 కోట్లు ఆఫర్ చేసి ప్రలోభపెడుతున్నారని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఫిర్యాదు చేసినా ఆయన చర్యలు తీసుకోకుండా టీడీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఆ నిరసనలు రాజ్యాంగ విరుద్ధం కేంద్ర క్యాబినెట్లో కొనసాగుతున్న టీడీపీ ఎంపీలు అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి వారు ఆమోదించిన రాష్ట్రపతి ప్రసంగాన్ని పార్లమెంటులో వ్యతిరేకిస్తూ నిరసన తెలపటం ఆర్టికల్ 74, 75కు వ్యతిరేకమని రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయలేదని రాష్ట్రపతికి విజయసాయిరెడ్డి వివరించారు. గత ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ, విశాఖకు రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, విశాఖ–చెన్నై కారిడార్, పోలవరం మొత్తం ఖర్చును భరించడం లాంటి అంశాలను కేంద్ర బడ్జెట్లో పొందుపరచలేదన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ సీపీ తరఫున రాష్ట్రపతికి నివేదించినట్లు అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు. సీఎం చంద్రబాబు అవినీతి చర్యల గురించి కూడా రాష్ట్రపతికి వివరించామన్నారు. చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రలోభపెట్టి కొనుగోలు చేస్తున్న తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు విజయసాయిరెడ్డి తెలిపారు.బాబు తనపై చేసిన విమర్శలను ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి తిప్పికొట్టారు. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను ఎవరినైనా కలుస్తానన్నారు. బాబులా తాను అవినీతికి పాల్పడడం లేదని, లంచాలు తీసుకోవడం లేదని, చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నానన్నారు.ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ నేతల వివరాలను త్వరలో బయట పెడతామని ప్రకటించారు. జగన్ పాదయాత్రపై రాష్ట్రపతి వాకబు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర గురించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వాకబు చేశారు. జగన్ యోగక్షేమాల గురించి, పాదయాత్రపై రాష్ట్రపతితో భేటీ సందర్భంగా అడిగినట్లు విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు. ప్రతిపక్ష నేత పాదయాత్ర జరుగుతున్న తీరు గురించి రాష్ట్రపతికి వివరించినట్టు తెలిపారు. -
ఏకకాల ఎన్నికలే మేలు
న్యూఢిల్లీ: ఖజానాపై భారాన్ని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. రోజూ ఏదోచోట ఎన్నికలు జరుగుతున్న కారణంగా దేశాభివృద్ధికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని.. అందువల్ల ఈ విషయంపై అన్ని పార్టీలూ కలిసి చర్చించాలని ఆయన సోమవారం సూచించారు. పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి తొలిసారి ప్రసంగించిన రాష్ట్రపతి.. ఖజానాపై భారాన్ని తగ్గించేందుకు ఏకకాల ఎన్నికల నిర్వహణ అంశాన్ని ప్రస్తావించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు వివిధ పథకాలను కేంద్రం అందుబాటులోకి తెచ్చిందన్నారు. అందరికీ ఇళ్లు, నిరంతర విద్యుత్, పేదలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు జరుగుతున్న మేలును కూడా రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు, బీజేపీ చీఫ్ అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్థిక భారం.. అభివృద్ధికి ఆటంకం తరచుగా దేశంలో ఎన్నికలు జరుగుతున్నందున ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని.. ఆర్థిక వ్యవస్థపై, దేశాభివృద్ధిపై దీని ప్రభావం ప్రతికూలంగా ఉంటోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ‘ఎప్పుడూ ఎన్నికలు జరగటం వల్ల ఆర్థికంగా, మానవ వనరులపై భారం పడుతోంది. దేశవ్యాప్తంగా ఎప్పుడూ ఒక చోట ఎన్నికల కారణంగా నియమావళి అమల్లో ఉండటంతో అభివృద్ధి ప్రక్రియకూ ఇది విఘాతం కలిగిస్తోంది. అందుకే జమిలి ఎన్నికల నిర్వహణపై సమగ్రమైన చర్చ జరగాలి. అన్ని రాజకీయ పక్షాలు దీనిపై ఏకాభిప్రాయానికి రావాలి. నవభారత నిర్మాణం ఒకపార్టీకో ఒక సంస్థకో సంబంధించిన అంశం కాదు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అన్ని పార్టీలు చిత్తశుద్ధితో కలిసి పనిచేయాలి’ అని రామ్‌నాథ్ కోవింద్ వెల్లడించారు. ముస్లిం చెల్లెళ్ల ఆత్మగౌరవ సమస్య ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిందని.. ఈ బిల్లు త్వరలోనే చట్టరూపం దాల్చుతుందని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. ‘దశాబ్దాలుగా రాజకీయ లబ్ధికోసం ముస్లిం మహిళల ఆత్మగౌరవం అంశం మరుగున పడింది. ఇలాంటి దుస్సంప్రదాయాన్ని పారద్రోలే గొప్ప అవకాశం ఇప్పుడు దేశానికి కలిగింది. ఒకవేళ ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. ముస్లిం సోదరీమణులు, కూతుళ్లకు జీవితాన్ని అందించిన వారవుతాం. గర్వంగా బతికే అవకాశాన్నిచ్చిన వాళ్లవుతాం’ అని రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ప్రభుత్వం మైనారిటీలను బుజ్జగించాలని అనుకోవటం లేదని వారికి ఆర్థిక, సామాజిక, విద్యా రంగాల్లో సాధికారత కల్పించాలనే పట్టుదలతో ఉందని తెలిపారు. సీఖో ఔర్ కమావో, ఉస్తాద్, గరీబ్ నవాజ్ కౌశల్ వికాస్ యోజన, నయీ రోష్నీ వంటి పథకాల ద్వారా ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు ఇలా అన్ని వర్గాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికోసం వెనుకబడిన వర్గాలు, పేదల అభ్యున్నతే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకూ న్యాయం జరిగేలా ముందుకెళ్తోందన్నారు. వ్యవసాయోత్పత్తులకు జరుగుతున్న నష్టాన్ని నివారించటం, సరైన నిల్వ, 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం, యూరియా ఉత్పాదన పెంచటం వంటి వివిధ ప్రభుత్వ పథకాలనూ రాష్ట్రపతి ప్రస్తావించారు. ఈ–నామ్ వంటి ఆన్లైన్ వ్యవసాయ మార్కెట్‌ను ప్రోత్సహించటం, పాడిఉత్పత్తిని పెంచేలా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. దేశంలోని అన్ని గ్రామాలను రోడ్లతో అనుసంధానించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉన్నప్పటికీ భారత్ మంచి వృద్ధిరేటుతోనే ముందుకెళ్తోందన్నారు. 2016–17 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు స్వల్పంగా తగ్గినా.. 2017–18 రెండో త్రైమాసికానికల్లా పురోగతి బాట పట్టిందన్నారు. దేశంలో ఆర్థిక సమగ్రతకోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రూపంలో అతిపెద్ద ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చిందన్నారు. రూ. 2లక్షల కోట్లను పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్‌లోకి ప్రవేశపెట్టడం ద్వారా వ్యవస్థ పునరుత్తేజం చేసిందన్నారు. అవినీతిపై పోరాటంలో భాగంగా 3.5 లక్షల అనుమానాస్పద కంపెనీలను రద్దుచేశామని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆర్మీ, పారామిలటరీ బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు సమన్వయం కారణంగా జమ్మూకశ్మీర్‌లో ఆందోళలను తగ్గాయన్నారు. విద్యావ్యవస్థ ఆధునికీకరణ దేశ భవిష్యత్తుకు పునాది వేసే ఉన్నత విద్యావ్యవస్థ, పాఠశాలలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం పరీక్షలను నిర్వహించేలా ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ పేరుతో ఓ స్వతంత్రవ్యవస్థను ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. మూడున్నరేళ్లలో 93 లక్షల ఇళ్లను కేంద్రం నిర్మించి ఇచ్చిందని ఆయన తెలిపారు. 2022కల్లా దేశంలో ప్రతి ఒక్కరికీ ఇళ్లుండాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దేశంలోని ప్రతి ఇంటికీ విద్యుత్, నీరు, మరుగుదొడ్డి వసతులుండాలనేదే కేంద్రం ఉద్దేశమన్నారు. ఉడాన్ పథకం ద్వారా తక్కువ ధరకే సామాన్యులకూ విమానయానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోందన్నారు. కొంతకాలంగా అంతర్జాతీయంగా భారత్‌కు గొప్ప గౌరవం దక్కుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. తొలి వరుసలో రాహుల్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలి వరుసలో ఆశీనులయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాహుల్‌కు ఆరో వరుసలో సీటును కేటాయించడంతో బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు చేయడం తెలిసిందే. ► సెంట్రల్ హాల్లో రాహుల్ తన తల్లి సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గేలతో ఎక్కువసేపు మాట్లాడుతూ కనిపించారు. సోనియా కూడా తొలివరుసలోనే, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ పక్కన కూర్చున్నారు. ఈ సందర్భంలో అడ్వాణీతో సోనియా మాట కలిపారు. ► విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే కూడా సోనియా గాంధీని పలకరించారు. ► సమాచార, ప్రసారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ కేవలం అడ్వాణీని మాత్రమే పలకరించి సోనియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ► ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తదితరులు కూడా తొలివరుసలో కూర్చున్నారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ రెండో వరసలో, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తదితరులు మూడో వరుసలో కూర్చున్నారు. ► ప్రసంగం అనంతరం తొలి వరుసలో కూర్చున్న పురుష ఎంపీలందరితోనూ కరచాలనం చేసిన రాష్ట్రపతి, మహిళా ఎంపీలకు రెండు చేతులతో నమస్కరించారు. రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో సభ్యులు -
రాష్ట్రపతిని కలిసిన రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరు భేటీ అయ్యారు. ‘రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో రాష్ట్రపతి భవన్లో సమావేశం అయ్యాను. చాలా ఆనందంగా ఉంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. గతేడాది డిసెంబర్లో సోనియా నుంచి అధ్యక్ష బాధ్యతలు అందుకున్న అనంతరం గౌరవసూచకంగానే రాష్ట్రపతిని రాహుల్ కలిశారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. -
జయహో జెండా పండుగ
-
జయహో జెండా పండుగ
న్యూఢిల్లీ: భారత దేశభక్తిని, అస్త్ర శక్తిని ప్రతిబింబించేలా 69వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన ఆసియాన్ దేశాధినేతల సమక్షంలో భారత సంప్రదాయాలు, సైనిక పాటవ ప్రదర్శనల నడుమ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. రాజ్‌పథ్ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమానికి వేలమంది ప్రజలు, ప్రముఖులు హాజరయ్యారు. త్రివర్ణపతాక ఆవిష్కరణ అనంతరం భారత త్రివిధ దళాల అధిపతి, రాష్ట్రపతి రామ్‌నాథ్ పరేడ్‌లో సైనిక వందనం స్వీకరించారు. రాష్ట్రపతిగా కోవింద్‌కు ఇదే తొలి గణతంత్ర దినోత్సవ వేడుక. చీఫ్ గెస్ట్లుగా.. ఆసియాన్ దేశాల వ్యూహాత్మక సంబంధాలతో బలమైన కూటమిగా ఎదిగే క్రమంలో భారత్‌లో జరుగుతున్న జాతీయ వేడుకలకు ఈ 10 దేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరవటం ఇదే తొలిసారి. మయన్మార్ కౌన్సెలర్ ఆంగ్‌సాన్ సూచీ, వియత్నాం ప్రధాని ఎన్‌గెయెన్ జువాన్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్టె, థాయలాండ్ ప్రధాని ప్రయుత్ చానోచా, సింగపూర్ చీఫ్ సీన్ లూంగ్, బ్రూనై సుల్తాన్ హాజీ బోల్‌కయా, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్, లావోస్ పీఎం థాంగ్లౌన్ సిసౌలిత్, కంబోడియన్ అధ్యక్షుడు హున్సేన్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల ప్రారంభానికి ముందు ప్రధాని.. రక్షణ మంత్రి, త్రివిధ దళాల చీఫ్‌లతో కలిసి ఇండియా గేట్ వద్ద అమర జవాన్ జ్యోతి వద్ద నివాళులర్పించారు. గణతంత్ర వేడుకల్లో.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, జైట్లీ, జేపీ నడ్డా, రవిశంకర్ ప్రసాద్ సహా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 61 మంది గిరిజన ప్రముఖులు ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. కళ్లన్నీ ఆకాశంలోనే.. పరేడ్ చివర్లో ఎమ్ఐ–17 యుద్ధ విమానాలు, రుద్ర హెలికాప్టర్లు, ఐఏఎఫ్ విమానాలతో వైమానికదళం చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. ఎల్‌హెచ్, ఎంకే–4, డబ్ల్యూఎస్ఐ హెలికాప్టర్లు, సీ–130జే సూపర్ హెర్క్యులస్ యుద్ధ విమానం చేసిన విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. 21 గన్ సెల్యూట్ సంప్రదాయం ప్రకారం త్రివర్ణ పతాకావిష్కరణ తర్వాత జాతీయగీతం ఆలాపనతోపాటు 52 సెకన్లపాటు 21 గన్ సెల్యూట్ నిర్వహించారు. 2281 రెజిమెంట్‌కు చెందిన ఏడు ఫిరంగుల ద్వారా ఈ గన్ సెల్యూట్ నిర్వహించారు. గణతంత్ర దినోత్సవంతోపాటు, ఆగస్టు 15, ఆర్మీడే (జనవరి 15), అమరవీరుల దినం (జనవరి 30)న ఈ రకమైన గన్‌సెల్యూట్ చేస్తారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా 13 రాష్ట్రాలు, పలు మంత్రిత్వ శాఖలు తమ శకటాలను ప్రదర్శించాయి. డీఆర్డీవో సంస్థ.. నిర్భయ్ క్షిపణిని, అశ్విని రాడార్ వ్యవస్థతో కూడిన శకటంతో పరేడ్‌లో పాల్గొంది. ‘జగమంత’ వేడుకలు ఢిల్లీతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. ప్రజలు ప్రాథమిక హక్కులను పొందటంతోపాటు తమ బాధ్యతలు గుర్తెరిగి మసలుకోవాలని ప్రజలకు సూచించారు. రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో ఓ భారతీయుడు, ఇద్దరు సౌదీ జాతీయులు శాటిలైట్ ఫోన్లతో సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైనా, రష్యా, యూకే, ఈజిప్ట్, ఇండోనేసియా, సింగపూర్, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల్లోని దౌత్యకార్యాలయాల్లోనూ పతాకావిష్కరణ ఘనంగా జరిగింది. భద్రతను పక్కనపెట్టి.. గణతంత్ర దినోత్సవ సంబరాల అనంతరం ప్రధాని మోదీ భద్రతను పక్కనపెట్టి వేడుకలను చూసేందుకు రాజ్‌పథ్‌కు వచ్చిన ప్రేక్షకులకు బారికేడ్ల వద్దకెళ్లి అభివాదం చేశారు. తలపై కాషాయం, ఎరుపు, ఆకుపచ్చని సంప్రదాయ తలపాగాతో ప్రత్యేకంగా కనిపించిన మోదీ.. తమ వద్దకు వస్తుండటంతో ప్రేక్షకుల్లో హర్షం వ్యక్తమైంది. మోదీ, మోదీ నినాదాలతో వాతావరణాన్ని వారంతా మరింత హుషారుగా మార్చారు. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం అనంతరం కూడా ప్రజల వద్దకెళ్లి వారితో కరచాలనం చేశారు. ఆసియాన్ దేశాల అధినేతలు పాల్గొన్న ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 60వేల మంది ఢిల్లీ పోలీసు, ఆర్మీ బలగాలు, షార్ప్ షూటర్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆకట్టుకున్న పరేడ్ మార్చ్‌పాస్ట్‌లో ఆసియాన్ జెండాతోపాటుగా 10 దేశాల జాతీయజెండాలనూ ప్రదర్శించారు.బీఎస్ఎఫ్ మహిళా సైనికుల ‘సీమా భవానీ’ బృందం చేసిన మోటార్ సైకిల్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత ఆర్మీ యుద్ధ ట్యాంకు టీ–90 (భీష్మ), బ్రహ్మోస్ మిసైల్ వ్యవస్థ, శత్రువుల ఆయుధాలను పసిగట్టే రాడార్, బ్రిడ్జ్ లేయింగ్ ట్యాంక్ టీ–72, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ సహా తదితర భారత మిలటరీ సామర్థ్యాలను పరేడ్‌లో ప్రదర్శించారు. ఆర్మీ అశ్వికదళం, పంజాబ్ రెజిమెంట్, మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ, డోగ్రా రెజిమెంట్, నౌక, వైమానిక దళాలూ మార్చ్ఫాస్ట్ నిర్వహించాయి. ఢిల్లీ, నాగ్‌పూర్‌లోని పాఠశాలల విద్యార్థుల నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. రాష్ట్రపతి ఉద్వేగం ఈ వేడుకల్లో భారత అత్యుత్తమ మిలటరీ సేవా పురస్కారం (శాంతి సమయాల్లో ఇచ్చే) అశోకచక్రను ఐఏఎఫ్ గరుడ్ కమాండో కార్పొరల్ జ్యోతి ప్రకాశ్ నిరాలా (మరణానంతరం)కు అందజేశారు. ఈ అవార్డు ఇస్తున్న సమయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్వేగానికి గురయ్యారు. గతేడాది నవంబర్‌లో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడైన ఎయిర్‌ఫోర్స్ గరుడ్ కమాండో, కార్పొరల్ జ్యోతి ప్రకాశ్ నిరాలా ఈ ఏడాది అశోకచక్ర అవార్డుకు ఎంపికయ్యారు. నిరాలా భార్య సుష్మానంద్, ఆయన తల్లి మాలతీ దేవీ ఈ అవార్డును అందుకున్నారు. అశోక చక్ర అందిస్తున్న సందర్భంగా రాష్ట్రపతి ఉద్వేగానికి గురయ్యారు. తన సీట్లో తిరిగి కూర్చోగానే చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ కనిపించారు. పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆసియాన్ దేశాల శకటం రాజ్‌పథ్ పరేడ్‌లో పాల్గొన్న సైనిక వాహనాలు నిరాలా కుటుంబానికి అశోకచక్రను ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి కోవింద్ -
ఆ ఆప్ ఎమ్మెల్యేలు అనర్హులే
న్యూఢిల్లీ: లాభదాయక పదవుల్లో కొనసాగినందుకు ఢిల్లీ అసెంబ్లీలోని 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్న ఎన్నికల సంఘం సిఫారసులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఆదివారం కేంద్ర న్యాయశాఖ విడుదల చేసిన ఓ నోటిఫికేషన్లో రాష్ట్రపతి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ‘20 మంది ఆప్ ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్లో కొనసాగారంటూ ఎన్నికల సంఘం చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటూ.. 20 మంది సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తున్నాను’ అని అందులో పేర్కొన్నారు. రాష్ట్రపతి నిర్ణయంపై ఆప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం రాజ్యాంగవిరుద్ధమని ఆప్ నేత అశుతోష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి నిర్ణయం బాధ కలిగించిందని.. తుది నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రపతి తమను సంప్రదించి ఉండాల్సిందని వేటుపడిన ఎమ్మెల్యే అల్కాలాంబా తెలిపారు. అందుకే దేవుడు 67 సీట్లిచ్చాడు ‘మూడేళ్ల తర్వాత 20 మంది అనర్హులవుతారని దేవుడికి ముందే తెలుసు అందుకే 67 సీట్ల భారీ మెజారిటీ కట్టబెట్టాడు’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కేంద్రం కుట్ర పన్నిందని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని అన్నారు. -
మానసిక రోగులు పెరుగుతున్నారు: రాష్ట్రపతి
సాక్షి, బెంగళూరు: దేశంలో మానసిక వ్యాధుల సమస్య రోజురోజుకూ పెరుగుతూ ఉధృతమయ్యేలా కనిపిస్తోందనీ, 2022కల్లా మానసిక రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన కేంద్రాలను పూర్తిస్థాయిలో నెలకొల్పాల్సి ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించడానికి ప్రభుత్వ ఆరోగ్య సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు కృషి చేయాలనికోరారు. మధుమేహం బాధితుల కంటే మానసిక రుగ్మతలకు చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. మరో కార్యక్రమంలో కోవింద్ మాట్లాడుతూ ఉద్యోగాలు సంపాదించేందుకు మాత్రమే చదువు అనుకోవడం మంచిది కాదని అన్నారు. -
పరిమళించిన సాహితీ సుగంధం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహా సభల నాలుగో రోజున సాహితీ సుగంధాలు పరిమళించాయి. అన్ని వేదికలు భాషాభిమా నులతో కళకళలాడాయి. పలు వేదికల వద్ద పిల్లలు, పెద్దలు కుటుంబాలతో సహా సభలకు తరలిరావడం కనిపించింది. ఎల్బీ స్టేడియంలోని బమ్మెర పోతన వేదికపై సాహిత్య సభలో ‘తెలంగాణ పాట జీవితం’పై సదస్సు నిర్వ హించారు. ప్రముఖ కవి, గాయకుడు సుద్దాల అశోక్‌తేజ దీనికి అధ్యక్షత వహించగా.. మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రజా జీవితంతో ముడిపడిన పాటపై ఈ కార్యక్రమంలో ఆసక్తికర చర్చ జరిగింది. ఉద్యమాల్లో, ప్రజల దైనందిన జీవితంలో పాట పెనవేసుకున్న తీరును వక్తలు వివరించారు. శ్రమకు పాటకు ఉన్న సంబంధం, సమాజ పరిణామ క్రమంలో పరవళ్లు తొక్కిన పాటపైన అశోక్ తేజ మాట్లాడారు. ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, రసమయి బాల కిషన్, జయరాజ్, దేశపతి శ్రీనివాస్ తదితరు లు పాటకు, తెలంగాణ సంస్కృతి సాంప్రదా యాలకు, సాహిత్యానికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో మలేసియా తెలుగువారి సాంస్కృతిక కదంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ సినీ కళాకారులు, సినీ మ్యూజీషియన్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సినీ సంగీత విభావరి’ ప్రేక్షకులను అలరించింది. విమర్శ–పరిశోధనపై సదస్సు తెలుగు వర్సిటీలో ‘తెలంగాణ విమర్శ– పరిశోధన’ అన్న అంశంపై జరిగిన సదస్సులో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహించగా.. రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి కీలకోపన్యాసం చేశారు. రాష్ట్రంలో 200 ఏళ్ల క్రితమే తెలుగు సాహిత్యంలో విమర్శ వచ్చిందని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. ఆచార్య కోవెల సంపత్కుమారా చార్య, సురవరం ప్రతాపరెడ్డి, సి.నారాయణ రెడ్డి, పింగళి వంటి ఎంతోమంది కవులు విమర్శ, పరిశోధనలను సాహిత్య ప్రక్రియ లుగా అభివృద్ధి చేశారని వివరించారు. తాను త్వరలో కాకతీయుల చరిత్రపై గ్రంథం రాయనున్నట్లు మధుసూదనాచారి చెప్పారు. లక్ష్మణ చక్రవర్తి, బాలశ్రీనివాసమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకట్టుకున్న కార్యక్రమాలు తెలుగు వర్సిటీలోనే.. శతక, సంకీర్తనా, గేయ సాహిత్యంపై సదస్సు జరిగింది. ఇందులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుద్దాల అశోక్‌తేజ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో ఆశావాది ప్రకాశ్‌రావు, జె.బాపురెడ్డి, వెలిచాల కొండలరావు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు కవి సమ్మేళనం నిర్వహించారు. మంత్రి మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో.. దేవరాజు మహారాజు, పాపినేని శివశంకర్, తిరుమ ల శ్రీనివాసాచార్యతోపాటు పలువురు కవులు, కవయిత్రులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ సారస్వత పరిషత్తులో శతా వధానం ఆసక్తికరంగా సాగింది. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహిం చిన బృహత్ కవి సమ్మేళనంలో పలువురు కవులు కవితాగానం చేశారు. నేడు ముగింపు.. హాజరుకానున్న రాష్ట్రపతి కన్నుల పండుగగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు మంగళవారంతో ముగియనున్నాయి. ఎల్బీ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆయన మంగళవారం మధ్యాహ్నం 2.55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం ఐదు గంటల సమ యంలో ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. 6.10 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు వెళతారు. అనంతరం పలువు రితో సమావేశమవుతారు. రాత్రికి రాజ్‌భవన్‌లోనే బస చేస్తారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహాన్ని సందర్శించిన అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళతారు. వాడుక భాషను ప్రామాణికం చేయాలి రవీంద్ర భారతి మినీ ఆడిటోరియంలో పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగు అంశంపై సదస్సు జరిగింది. ఇందులో ఎంపీ కేశవరావు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వర్రావు, జీఎస్ వరదాచారి, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల వాడుక భాషను ప్రామాణికం చేసేందుకు పత్రికలు, ప్రెస్ అకాడమీ కృషి చేయాల్సి ఉందని వక్తలు సూచించారు. - అనంతరం న్యాయం, పరిపాలన రంగాల్లో తెలుగు అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిథిగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్, విశ్రాంత న్యాయమూర్తులు చంద్రయ్య, మంగారి రాజేందర్, సీనియర్ అధికారులు పార్థసారథి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. న్యాయస్థానాలు, పరిపాలన, శాసన రంగాల్లో తెలుగు భాషను వినియోగించాల్సి ఉందని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. - రవీంద్ర భారతి ప్రధాన హాల్లో ‘తెలంగాణ మహిళా సాహిత్యం’పై సదస్సు జరిగింది. ఆచార్య సూర్య ధనుంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముదిగంటి సుజాతారెడ్డి, కొండపల్లి నిహారిక, జూపాక సుభద్ర తదితరులు ప్రసంగించారు. అనంతరం మహిళా కవయిత్రుల సమ్మేళనం జరిగింది. నేటి తీర్మానాలివీ.. - ఒకటి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగు భాష అమలు. - ప్రభుత్వం విడుదల చేసే జీవోలు, ఉత్తర్వులను తెలుగులో వెలువరించడం. - అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయా లు, సంస్థల్లో నేమ్ బోర్డులు (నామ ఫలకాలు) తెలుగులో రాయాలనే నిబంధన - వీటితో పాటు మరికొన్ని అంశాలపైన తీర్మానాలు చేయనున్నారు. -
సమాజానికి తిరిగివ్వండి: కోవింద్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని పేద విద్యార్థులకు బోధించడం, స్కాలర్షిప్లను అందజేయడం ద్వారా సమాజానికి కొంత తిరిగి ఇవ్వాలని ఐఐటీ ఢిల్లీ పుర్వ విద్యార్థులకు రాష్ట్రపతి కోవింద్ సూచించారు. ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌లో 48వ స్నాతకోత్సవంలో కోవింద్ పాల్గొన్నారు. ప్రపంచంలోని గొప్ప వర్సిటీలు అన్నింటిలోనూ పూర్వ విద్యార్థులకు.. విద్యా సంస్థలకు మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. పూర్వ విద్యార్థులను ఆర్థిక సాయం కోణంలోనే కాకుండా.. విజ్ఞానాన్ని పంచుకోవడానికి వినియోగించుకోవాలని సూచించారు. -
కక్షిదారులకు అర్థమయ్యేలా తీర్పులు
కొచి: హైకోర్టులు ఇచ్చే తీర్పులు కక్షిదారులకు అర్థమయ్యేలా వారికి తెలిసిన భాషలో ఉండాలని రాష్ట్రపతి కోవింద్ సూచించారు. తీర్పులకు సంబంధించిన అనువాద ప్రతులను అధికారికంగా జారీ చేసేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కేసులను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని, తీర్పుల ఆలస్యం వల్ల ఎక్కువగా బాధ పడేది పేదలు, అణగారిన వర్గాలేనని పేర్కొన్నారు. కేరళ హైకోర్టు వజ్రోత్సవాల్లో శనివారం ఆయన పాల్గొని ప్రసంగించారు. తీర్పు వెలువరించడం మాత్రమే ముఖ్యం కాదని, ఆ తీర్పును కక్షిదారులకు అర్థమయ్యే భాషలో ఇవ్వాలని సూచించారు. ‘హైకోర్టులు తమ తీర్పులను ఇంగ్లిష్‌లో వెలువరిస్తాయి. అయితే మన దేశం విభిన్న భాషలు గలది. తీర్పు ఇంగ్లిష్‌లో ఇవ్వడం వల్ల అందులో తమకు ఉపయోగపడే ముఖ్యమైన అంశాలు కక్షిదారులకు అర్థం కాకపోవచ్చు. దీంతో తీర్పును అర్థం చేసుకునేందుకు కక్షిదారులు న్యాయవాదులు లేదా ఇతర వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తుంది. దీని వల్ల మరింత సమయం, వ్యయం వృథా అవుతుంది’ అని తెలిపారు. ‘తీర్పుల అనువాద ప్రతులను స్థానిక లేదా ప్రాంతీయ భాషల్లో అందించే యంత్రాంగముండాలి. తీర్పువెలువడ్డ 36 గంటల్లోగా అనువాద ప్రతులను కక్షిదారులకు అందేలా చూడాలి. ఉదాహరణకు కేరళ హైకోర్టు తీర్పు కాపీలు మలయాళంలో, పట్నా హైకోర్టు తీర్పు కాపీలు హిందీలో ఉండేలా చూడాలి’ అని అన్నారు. కేసుల పరిష్కారంలో జాప్యం వల్ల ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పోయే ప్రమాదం ఉందని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. -
కలాం.. స్ఫూర్తి మంత్రం!
న్యూఢిల్లీ/రామేశ్వరం: మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 86వ జయంతి సందర్భంగా.. దేశానికి ఆయన చేసిన సేవలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు గుర్తుచేసుకున్నారు. దేశ యువతను సృజనాత్మకతవైపు పురికొల్పిన మహానుభావుడు కలాం అని రాష్ట్రపతి కొనియాడారు. రామేశ్వరం నుంచి వచ్చిన కొందరు విద్యార్థులతో రాష్ట్రపతి భవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఓ శాస్త్రవేత్తగా, మేధావిగా, భారత రాష్ట్రపతిగా అన్ని పదవులకు కలాం న్యాయం చేశారని ప్రశంసించారు. కలాం జీవితం కోట్ల మందికి స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ తెలిపారు. కలాం బతికున్నప్పుడు ఆయన ఇచ్చిన సందేశాల వీడియోను ట్వీటర్ ద్వారా షేర్ చేశారు. అటు కలాం సొంతరాష్ట్రం తమిళనాడులోనూ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కలాంకు పుష్పాంజలి ఘటించారు. రామేశ్వరం సమీపంలోని కలాం స్మారకం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు భారీ సంఖ్యలో కలాంకు నివాళులర్పించారు. చాలాచోట్ల విద్యార్థులు, ప్రజలు మొక్కలు నాటి పుష్పాంజలి ఘటించారు. పలువురు సినీ కళాకారులు కూడా అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటారు. 1931 అక్టోబర్ 15న రామేశ్వరంలో జన్మించిన కలాం 2002 నుంచి 2007 వరకు రాష్ట్రపతిగా ఉన్న విషయం తెలిసిందే. జూలై 27, 2015న కలాం గుండెపోటుతో కన్నుమూశారు. -
పాలనా వైఫల్యంతోనే వెనుకబాటు
న్యూఢిల్లీ: పాలనపరమైన లోపాల వల్లే కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు వెనుకబడ్డాయని.. ఆలోచనలు, వనరులు, సామర్థ్యం లేకపోవడం వల్ల కాదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్లో 48వ గవర్నర్ల సదస్సు ముగింపు సమావేశంలో శుక్రవారం ఆయన ప్రసంగిస్తూ.. ఉత్తమ పాలన అమలవుతున్న రాష్ట్రాల్లో పేదల సంక్షేమ పథకాలు సమర్థంగా అమలవుతున్నాయని చెప్పారు. మిషన్ ఇంద్రధనుష్, ఇతర ప్రభుత్వ పథకాల వివరాల్ని ప్రధాని ఉదహరిస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా గవర్నర్లు సహకరించాలని కోరారు. దేశ ఐక్యత, సమగ్రత బలోపేతం చేసేందుకు ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, ఐక్యతా పరుగు వంటి వాటిలో గవర్నర్లు పాలుపంచుకోవాలని ప్రధాని కోరారు. రాజ్యాంగ పవిత్రతను పరిరక్షిస్తూనే గవర్నర్లు సమాజంలో మార్పు కోసం ఉత్ప్రేరకాలుగా పనిచేయాలని గురువారం సదస్సు ప్రారంభోత్సవంలో మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. యువతరానికి మార్గదర్శకులుగా వ్యవహరించాలి: రాష్ట్రపతి రాష్ట్రాలు సాధించిన విజయాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై సదస్సులో చేసిన సమాలోచనలు.. రాష్ట్రాల సమాఖ్య మధ్య సహకారానికి దిక్సూచిలా ఉపయోగపడతాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. గవర్నర్లు యువతరానికి మార్గదర్శకులుగా ఉండడంతో పాటు, దేశ భవిష్యత్తు రూపకల్పనలో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. దేశంలోని ప్రతి రాష్ట్రం పురోగమించినప్పుడే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవిస్తుందని రాష్ట్రపతి పునరుద్ఘాటించారు. వివాదాలకు గవర్నర్లు దూరంగా ఉండాలి: వెంకయ్య రాజ్యాంగ నియమావళికి కట్టుబడి గవర్నర్లు వివాదాలకు దూరంగా ఉండాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సూచించారు. గవర్నర్ల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. భారత రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్లది కీలక పాత్రని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించడంతో పాటు ప్రజా సేవ, సంక్షేమానికి అంకితమవ్వాలని కోరారు. సమాంతర అధికార కేంద్రాలుగా కాకుండా... కేంద్ర ప్రభుత్వం, రాజ్యాంగానికి గవర్నర్లు ప్రతినిధులుగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలే అంతిమమని వెంకయ్య పేర్కొన్నారు. పరిపాలనలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని, ఫలితాలతో కూడిన పనితనమనే కొత్త ఒరవడికి నాంది పలకాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల ఆలోచనా ధోరణిని సానుకూల దృక్పథం వైపు మళ్లించేందుకు మార్గదర్శకులు, సలహాదారులుగా గవర్నర్లు వ్యవహరించాలని ఆయన కోరారు. స్థానిక సంస్థల బలోపేతం, మొక్కల పెంపకం, స్వచ్ఛ భారత్, జల వనరులకు పునరుజ్జీవం, సాంఘిక దురాచారాల నిర్మూలన, యోగాకు ప్రాచుర్యం, ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, బేటీ పడావో– బేటీ బచావో వంటి కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని ఉప రాష్ట్రపతి సూచించారు. ఖాదీ, చేనేతకు ప్రాచుర్యం కల్పించాలని, మాతృ భాష, భారతీయ భాషల్ని ప్రోత్సహించాలని గవర్నర్లను ఆయన కోరారు. -
గాంధీ, శాస్త్రిలకు నేతల నివాళి