సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహా సభల నాలుగో రోజున సాహితీ సుగంధాలు పరిమళించాయి. అన్ని వేదికలు భాషాభిమా నులతో కళకళలాడాయి. పలు వేదికల వద్ద పిల్లలు, పెద్దలు కుటుంబాలతో సహా సభలకు తరలిరావడం కనిపించింది. ఎల్‌బీ స్టేడియంలోని బమ్మెర పోతన వేదికపై సాహిత్య సభలో ‘తెలంగాణ పాట జీవితం’పై సదస్సు నిర్వ హించారు. ప్రముఖ కవి, గాయకుడు సుద్దాల అశోక్‌తేజ దీనికి అధ్యక్షత వహించగా.. మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రజా జీవితంతో ముడిపడిన పాటపై ఈ కార్యక్రమంలో ఆసక్తికర చర్చ జరిగింది. ఉద్యమాల్లో, ప్రజల దైనందిన జీవితంలో పాట పెనవేసుకున్న తీరును వక్తలు వివరించారు. శ్రమకు పాటకు ఉన్న సంబంధం, సమాజ పరిణామ క్రమంలో పరవళ్లు తొక్కిన పాటపైన అశోక్ తేజ మాట్లాడారు. ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, రసమయి బాల కిషన్, జయరాజ్, దేశపతి శ్రీనివాస్ తదితరు లు పాటకు, తెలంగాణ సంస్కృతి సాంప్రదా యాలకు, సాహిత్యానికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో మలేసియా తెలుగువారి సాంస్కృతిక కదంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ సినీ కళాకారులు, సినీ మ్యూజీషియన్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సినీ సంగీత విభావరి’ ప్రేక్షకులను అలరించింది.
విమర్శ–పరిశోధనపై సదస్సు
తెలుగు వర్సిటీలో ‘తెలంగాణ విమర్శ– పరిశోధన’ అన్న అంశంపై జరిగిన సదస్సులో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహించగా.. రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి కీలకోపన్యాసం చేశారు. రాష్ట్రంలో 200 ఏళ్ల క్రితమే తెలుగు సాహిత్యంలో విమర్శ వచ్చిందని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. ఆచార్య కోవెల సంపత్‌కుమారా చార్య, సురవరం ప్రతాపరెడ్డి, సి.నారాయణ రెడ్డి, పింగళి వంటి ఎంతోమంది కవులు విమర్శ, పరిశోధనలను సాహిత్య ప్రక్రియ లుగా అభివృద్ధి చేశారని వివరించారు. తాను త్వరలో కాకతీయుల చరిత్రపై గ్రంథం రాయనున్నట్లు మధుసూదనాచారి చెప్పారు. లక్ష్మణ చక్రవర్తి, బాలశ్రీనివాసమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కార్యక్రమాలు
తెలుగు వర్సిటీలోనే.. శతక, సంకీర్తనా, గేయ సాహిత్యంపై సదస్సు జరిగింది. ఇందులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుద్దాల అశోక్‌తేజ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో ఆశావాది ప్రకాశ్‌రావు, జె.బాపురెడ్డి, వెలిచాల కొండలరావు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు కవి సమ్మేళనం నిర్వహించారు. మంత్రి మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో.. దేవరాజు మహారాజు, పాపినేని శివశంకర్, తిరుమ ల శ్రీనివాసాచార్యతోపాటు పలువురు కవులు, కవయిత్రులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ సారస్వత పరిషత్తులో శతా వధానం ఆసక్తికరంగా సాగింది. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహిం చిన బృహత్ కవి సమ్మేళనంలో పలువురు కవులు కవితాగానం చేశారు.
నేడు ముగింపు.. హాజరుకానున్న రాష్ట్రపతి
కన్నుల పండుగగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు మంగళవారంతో ముగియనున్నాయి. ఎల్‌బీ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆయన మంగళవారం మధ్యాహ్నం 2.55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం ఐదు గంటల సమ యంలో ఎల్‌బీ స్టేడియానికి చేరుకుంటారు. 6.10 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు వెళతారు. అనంతరం పలువు రితో సమావేశమవుతారు. రాత్రికి రాజ్‌భవన్‌లోనే బస చేస్తారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహాన్ని సందర్శించిన అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
వాడుక భాషను ప్రామాణికం చేయాలి
రవీంద్ర భారతి మినీ ఆడిటోరియంలో పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగు అంశంపై సదస్సు జరిగింది. ఇందులో ఎంపీ కేశవరావు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వర్‌రావు, జీఎస్ వరదాచారి, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల వాడుక భాషను ప్రామాణికం చేసేందుకు పత్రికలు, ప్రెస్ అకాడమీ కృషి చేయాల్సి ఉందని వక్తలు సూచించారు.
- అనంతరం న్యాయం, పరిపాలన రంగాల్లో తెలుగు అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిథిగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్, విశ్రాంత న్యాయమూర్తులు చంద్రయ్య, మంగారి రాజేందర్, సీనియర్ అధికారులు పార్థసారథి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. న్యాయస్థానాలు, పరిపాలన, శాసన రంగాల్లో తెలుగు భాషను వినియోగించాల్సి ఉందని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు.
- రవీంద్ర భారతి ప్రధాన హాల్‌లో ‘తెలంగాణ మహిళా సాహిత్యం’పై సదస్సు జరిగింది. ఆచార్య సూర్య ధనుంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముదిగంటి సుజాతారెడ్డి, కొండపల్లి నిహారిక, జూపాక సుభద్ర తదితరులు ప్రసంగించారు. అనంతరం మహిళా కవయిత్రుల సమ్మేళనం జరిగింది.
నేటి తీర్మానాలివీ..
- ఒకటి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగు భాష అమలు.
- ప్రభుత్వం విడుదల చేసే జీవోలు, ఉత్తర్వులను తెలుగులో వెలువరించడం.
- అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయా లు, సంస్థల్లో నేమ్ బోర్డులు (నామ ఫలకాలు) తెలుగులో రాయాలనే నిబంధన
- వీటితో పాటు మరికొన్ని అంశాలపైన తీర్మానాలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment