రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారం అందుకుంటున్న పారా అథ్లెట్ దీపా మాలిక్, భమిడిపాటి సాయిప్రణీత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారుల ప్రదర్శన పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న ఆటగాళ్లను జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయన అభినందించారు. ‘త్రివర్ణ పతాకాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళుతున్న అథ్లెట్లను ఈ రోజు అభినందిస్తున్నాను. అది బాక్సింగ్‌లో కానివ్వండి లేదా బ్యాడ్మింటన్, టెన్నిస్, లేదంటే మరే క్రీడాంశంలోనైనా సరే... మన ఆశలకు ఆటగాళ్లు కొత్త రెక్కలు తొడుగుతున్నారు.
మన దేశం మరింత విశ్వాసంతో ముందుకు వెళుతోందన్న విషయాన్ని క్రీడల్లో సాధిస్తున్న ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ 114వ జయంతి సందర్భంగా ఆయనను మోదీ స్మరించుకొన్నారు. ‘ధ్యాన్‌చంద్‌లాంటి గొప్ప వ్యక్తి జన్మించిన రోజు, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అందరికీ నా అభినందనలు. హాకీ స్టిక్‌తో ఆయన ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేశారు. ఆయనకు తలవంచి నమస్కరిస్తున్నాను’ అని ప్రధాని అన్నారు. గురువారం ‘జాతీయ క్రీడా పురస్కారాలు’ అందుకున్న ఆటగాళ్లకు కూడా మోదీ తన అభినందనలు తెలిపారు.
కన్నుల పండువగా...
క్రీడా పురస్కారాల ప్రదానం రాష్ట్రపతి భవన్‌లో కన్నులపండువగా జరిగింది. రాజీవ్ ఖేల్‌రత్నతో పాటు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డులను విజేతలు అందుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులు అందజేశారు. ‘ఖేల్‌రత్న’కు ఎంపికైన వారిలో మహిళా పారా అథ్లెట్ దీపా మాలిక్ వీల్‌చైర్‌లో తన అవార్డును స్వీకరించింది. ట్రోఫీ, ప్రశంసాపత్రంతో పాటు రూ.7.5 లక్షల నగదు ప్రోత్సాహకం కూడా ఆమె అందుకుంది. ఈ ఏడాది మొత్తం 19 మంది ‘అర్జున’కు ఎంపికయ్యారు.
తెలుగు కుర్రాడు, ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్ తన ‘అర్జున’ను స్వీకరించాడు. ఈ కార్యక్రమానికి అతని తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. అర్జున విజేతకు రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకం లభిస్తుంది. హైదరాబాద్‌కే చెందిన షూటర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్‌కు చెందిన ‘స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్’కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ దక్కింది. దీనిని నారంగ్, తన అకాడమీ కోచ్, సహ భాగస్వామి పవన్ సింగ్‌తో కలిసి అందుకున్నాడు. ఇదే విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన ‘రాయలసీమ డెవలప్‌మెంట్ ట్రస్ట్’ తరఫున మాంచో ఫెర్రర్ పురస్కారాన్ని స్వీకరించారు.
బజరంగ్ గైర్హాజరు...
‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఎంపికైన భారత మేటి రెజ్లర్ బజరంగ్ పూనియా తన అవార్డును అందుకోలేకపోయాడు. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సన్నాహాల్లో భాగంగా అతను రష్యాలో ఉన్నాడు. వెస్టిండీస్‌లో ఉన్న క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. అథ్లెట్లు తజీందర్‌పాల్ సింగ్, మొహమ్మద్ అనస్, షూటర్ అంజుమ్ మౌద్గిల్ కూడా గైర్హాజరయ్యారు. వీరందరికి మరో రోజు క్రీడా మంత్రి కిరణ్ రిజిజు చేతుల మీదుగా అవార్డులను అందజేస్తారు.
అవార్డు విజేతల జాబితా
రాజీవ్ ఖేల్‌రత్న: బజరంగ్ పూనియా (రెజ్లింగ్), దీపా మాలిక్ (పారా అథ్లెటిక్స్)
అర్జున: భమిడిపాటి సాయిప్రణీత్ (బ్యాడ్మింటన్), రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ (క్రికెట్), మొహమ్మద్ అనస్, తజీందర్‌పాల్ సింగ్, స్వప్న బర్మన్ (అథ్లెటిక్స్), గుర్‌ప్రీత్ సింగ్ సంధు (ఫుట్‌బాల్), సోనియా లాథర్ (బాక్సింగ్), చింగ్లెన్‌సానా సింగ్ (హాకీ), ఎస్.భాస్కరన్ (బాడీ బిల్డింగ్), అజయ్ ఠాకూర్ (కబడ్డీ), అంజుమ్ మౌద్గిల్ (షూటింగ్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), హర్మీత్ దేశాయ్ (టేబుల్ టెన్నిస్), పూజా ధాండా (రెజ్లింగ్), ఫౌద్ మీర్జా (ఈక్వెస్ట్రియన్), సిమ్రన్ సింగ్ షెర్గిల్ (పోలో), సుందర్ సింగ్ గుర్జర్ (పారా అథ్లెటిక్స్), గౌరవ్ సింగ్ గిల్ (మోటార్ స్పోర్ట్స్).
ద్రోణాచార్య (రెగ్యులర్): మొహిందర్ సింగ్ ధిల్లాన్ (అథ్లెటిక్స్), సందీప్ గుప్తా (టేబుల్ టెన్నిస్), విమల్ కుమార్ (బ్యాడ్మింటన్).
ద్రోణాచార్య (లైఫ్‌టైమ్): సంజయ్ భరద్వాజ్ (క్రికెట్), రామ్‌బీర్ సింగ్ ఖోఖర్ (కబడ్డీ), మెజ్‌బాన్ పటేల్ (హాకీ).
ధ్యాన్‌చంద్ (లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్): మనోజ్ కుమార్ (రెజ్లింగ్), లాల్‌రెమ్‌సంగా (ఆర్చరీ), అరూప్ బసక్ (టేబుల్ టెన్నిస్), నితిన్ కీర్తనే (టెన్నిస్), మాన్యుయెల్ ఫ్రెడ్రిక్స్ (హాకీ).
రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ (షూటింగ్), రాయలసీమ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (మాంచో ఫెర్రర్, అనంతపురం), గో స్పోర్ట్స్ ఫౌండేషన్.
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ (క్రీడా ప్రదర్శనలో ఉత్తమ విశ్వవిద్యాలయం): పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్).
రెజ్లర్ పూజా ధాండ, క్రికెటర్ పూనమ్ యాదవ్, కబడ్డీ ప్లేయర్ అజయ్ ఠాకూర్
ఆర్‌డీటీ డైరెక్టర్ మాంచో ఫెర్రర్, షూటర్ గగన్ నారంగ్, పవన్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment