National Sports Day
-
జాతీయ క్రీడా దినోత్సవం.. దిగ్గజ హాకీ ప్లేయర్ జయంతిని పురస్కరించుకుని..!
హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఆగస్ట్ 29న జరిగే జాతీయ క్రీడా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా సంఘాలు ఘనంగా జరుపుకున్నాయి. ఆసియా కప్‌లో టీమిండియా పాక్‌ను మట్టికరింపించిన మరుసటి రోజే జాతీయ క్రీడా దినోత్సవం ఉండటంతో ఈ వేడుకలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. Greetings on National Sports Day and tributes to Major Dhyan Chand Ji on his birth anniversary. The recent years have been great for sports. May this trend continue. May sports keep gaining popularity across India. pic.twitter.com/g04aqModJT — Narendra Modi (@narendramodi) August 29, 2022 దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్, క్రికెటేతర క్రీడా సంఘాలు పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి వేడులకు ఘనంగా నిర్వహించాయి. ధ్యాన్‌చంద్ 117వ జయంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాకీ పితామహుడికి ప్రత్యేకంగా నివాళులర్పించారు. ఇటీవలి కాలంలో భారత్ క్రీడల్లో విశేషంగా రాణిస్తుందని, భారత్ మున్ముందు ఇదే జోరును కొనసాగించాలని ప్రధాని ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు. ప్రధాని తన ట్వీట్లో ధ్యాన్‌చంద్‌తో పాటు ఇతర క్రీడలకు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. కాగా, వివిధ క్రీడాంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రజల రోజువారీ జీవితంలో ఆటలను భాగం చేయాలనే ఉద్దేశంతో 2012లో హాకీ పితామహుడు మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టిన రోజును నాటి కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది. నాటి నుంచి ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ క్రీడా సంఘాలు స్పోర్ట్స్ డేను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది. చదవండి: Asia Cup 2022: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఉత్కంఠ పోరులో విజయం -
Bhavinaben Patel: రజత సంబరం
జాతీయ క్రీడా దినోత్సవాన టోక్యో పారాలింపిక్స్ క్రీడల్లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఒకేరోజు ఏకంగా మూడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) క్లాస్–4 సింగిల్స్ విభాగంలో భవీనాబెన్ పటేల్ రజత పతకం సొంతం చేసుకోగా... పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ టి–47 విభాగంలో నిశాద్ కుమార్ కూడా రజత పతకం కైవసం చేసుకున్నాడు. పురుషుల అథ్లెటిక్స్ డిస్కస్ త్రో ఎఫ్–52 విభాగంలో భారత ప్లేయర్ వినోద్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. అయితే వినోద్‌తో పోటీపడిన ప్రత్యర్థులు అతడి వైకల్యం స్థాయిపై సందేహం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. దాంతో డిస్కస్ త్రో ఫలితాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. పతకాల ప్రదానోత్సవాన్ని నేటికి వాయిదా వేశారు. నేడు ఫిర్యాదుపై విచారించి వినోద్‌కు పతకం ఇవ్వాలా వద్దా అనేది నిర్వాహకులు తేలుస్తారు. టోక్యో: ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ భవీనాబెన్ పటేల్‌కు నిరాశ ఎదురైంది. టోక్యో పారాలింపిక్స్‌లో భాగంగా ఆదివారం జరిగిన టీటీ మహిళల సింగిల్స్ క్లాస్–4 విభాగం ఫైనల్లో భవీనాబెన్ పటేల్ 7–11, 5–11, 6–11తో ప్రపంచ నంబర్‌వన్ యింగ్ జౌ (చైనా) చేతిలో ఓడిపోయింది. 19 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో యింగ్ జౌ నిలకడగా పాయింట్లు స్కోరు చేసింది. లీగ్ దశలోనూ యింగ్ జౌతో జరిగిన మ్యాచ్‌లో భవీనా పరాజయం చవిచూసింది. ఓవరాల్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా తొలిసారి పారాలింపిక్స్‌లో పోటీపడిన గుజరాత్‌కు చెందిన 34 ఏళ్ల భవీనా అబ్బురపరిచే ఆటతీరుతో ఎవరూ ఊహించని విధంగా రజత పతకాన్ని సాధించింది. రజత పతకం గెలిచినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. అయితే పతకం స్వర్ణమై ఉంటే ఇంకా సంతోషం కలిగేది. తమ సామర్థ్యంపై నమ్మకం ఉంటే మహిళలు ఎన్నో అద్భుతాలు చేయగలరు. రియో పారాలింపిక్స్‌కు అర్హత సాధించినా సాంకేతిక కారణాలతో నేను ఆ క్రీడలకు దూరమయ్యాను. ‘రియో’లో చేజారిన అవకాశం నాలో కసిని పెంచింది. పతకం గెలిచేందుకు దోహదపడింది. వైకల్యం కారణంగా నేను జీవితంలో పడిన ఇబ్బందులు తర్వాతి తరంవారు ఎదుర్కోకూడదని కోరుకుంటున్నాను. దైనందిన జీవితంలో దివ్యాంగులకు ప్రతి చోటా క్లిష్ట పరిస్థితులే ఎదురవుతాయి. ఉద్యోగాలతోపాటు ఇతర రంగాల్లోనూ వారికి సముచిత స్థానం ఇవ్వాలి. నా పతకం ద్వారా దివ్యాంగులకు ఏదైనా మేలు జరిగితే అంతకంటే సంతోషం మరోటి ఉండదు. –భవీనాబెన్ పటేల్ విశేష ప్రదర్శనతో భవీనా చరిత్ర లిఖించింది. దేశానికి రజతం అందించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం మరెంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. యువతను క్రీడలవైపు ఆకర్షించేలా చేస్తుంది. –ప్రధాని మోదీ -
క్రీడలను అలవాటుగా మార్చుకోండి.. సచిన్ సందేశం
ముంబై: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యువతకు సందేశం ఇచ్చాడు. క్రీడలను ఓ అలవాటుగా మార్చుకోవాలని, అత్యంత కఠిన పరిస్థితుల్లో అవి నమ్మకాన్ని, సంతోషాన్ని ఇస్తాయని, నిత్యం ఏదో ఒక క్రీడను ఆడుతూ మీతో పాటు మీ చట్టుపక్కల వాళ్లను కూడా ఆనందంగా ఉంచండి అంటూ మాస్టర్ ట్వీట్ చేశాడు. ప్రతి ఏడాది ఆగస్ట్ 29న హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సచిన్ తన ట్వీట్‌తోపాటు పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతున్న వీడియోను షేర్ చేశాడు. చదవండి: Eng vs Ind: టీమిండియా ఓటమి.. ఆసుపత్రిలో చేరిన జడేజా Sport brings hope and joy even in the most challenging circumstances. This #NationalSportsDay, make playing a habit. Keep ourselves and those around us happy. pic.twitter.com/LUMF2N4wUx— Sachin Tendulkar (@sachin_rt) August 29, 2021 -
ధ్యాన్‌చంద్ జయంతి.. ఆసక్తికర విషయాలు
-
ధర్మాన కృష్ణదాస్ అంటే జిల్లాల్లో క్రీడాకారుడిగానే తెలుసు
సాక్షి, శ్రీకాకుళం: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి పురస్కరించుకొని జిల్లాలోని ఎన్టీఆర్ఎంహెచ్ స్కూల్ మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజయరయ్యారు. ఈ సందర్భంగా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ షూటింగ్ అకాడమీ , విక్రాంత్ బాడ్మింటన్ అకాడమీలను ప్రారంభించారు. అనంతరం కృష్ణదాస్ మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రిగా క్రీడలంటే నాకు చాలా ఇష్టం. ఏపీలోని అన్ని జిల్లాలకు క్రీడాకారుడిగానే కృష్ణదాస్ అంటే తెలుసు.క్రీడలతోనే నాకు గుర్తింపు వచ్చింది. స్కూల్లో పాస్ మార్కులు వస్తే చాలనుకునేవాడిని ఆటల కోసమే విశాఖ వెళ్లి డిగ్రీలో చేరాను.గతంలో క్రీడలు ఎంతో దయనీయస్థితిలో ఉండేవి.. ప్రస్తుతం క్రీడలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.. ఆన్ స్పోర్ట్స్ క్రీడలు నేటికీ నిరాదరణకు గురవుతున్నాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం . ఈ విషయం పై ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైద్యం కోసం వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. క్రీడల కోసం కొంత ఖర్చు చేస్తే ... వైద్యానికి పెట్టే ఖర్చు కొంత తగ్గుతుందనేది నా భావన క్రీడలకు ఖర్చు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే క్రీడాకారులను ప్రోత్సహించాలి. సమాజం పట్ల గౌరవం , క్రమశిక్షణ ఒక్క క్రీడాకారుడికే ఉంటాయి.' అని మంత్రి చెప్పుకొచ్చారు. -
పిల్లలు బంక మట్టిలాంటివాళ్లు
‘‘పసి పిల్లల మనసు, శరీరం రెండూ బంక మట్టిలాంటివి. మనం ఎలా మలిస్తే అలా తయారవుతారు. అందుకే చిన్నప్పుడే మంచి అలవాట్లు, మంచి ఆటలు నేర్పిద్దాం’’ అంటున్నారు శిల్పా శెట్టి. శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవం. ఈ సందర్భంగా విలు విద్య ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు శిల్పా. గతంలో ఓ ట్రిప్‌లో భాగంగా ఈ విద్య నేర్చుకున్నారట. అప్పుడు తీసిన వీడియో ఇది అని, నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని పేర్కొన్నారు. క్రీడల ప్రాముఖ్యత గురించి శిల్పా శెట్టి మాట్లాడుతూ– ‘‘క్రీడలు పిల్లలకు వ్యాయామంలా ఉపయోగపడతాయి. ఆరోగ్యకరమైన పోటీ అలవాటు చేస్తాయి. ఏదో నేర్చుకోవాలనే తపనను రేకెత్తిస్తాయి. ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంచుతాయి. మనం ఆడండి అని పిల్లలకు చెప్పడం కంటే మనం ఆడుతుంటే చూసి ఇంకా చురుకుగా నేర్చుకోవడం కూడా జరుగుతుంది. శుక్రవారంతో ఫిట్ ఇండియా ఉద్యమానికి ఏడాది పూర్తవుతుంది. తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే... మీ పిల్లలకు ఏదో ఒక ఆట నేర్పిస్తూ ఉండండి. మీరు కూడా నేర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి.. ఆనందంగా ఉండండి’’ అన్నారు. -
కరోనా..160 నాటౌట్..
కరోనా మహమ్మారి ఒంటరి ఇన్నింగ్స్ ఆడుతోంది. క్రీడాకారులను స్టేడియంలోకి రానీయకుండా ఏకధాటిగా బ్యాటింగ్ చేస్తోంది. 160 రోజులుగా పాజిటివ్ కేసులను నమోదు చేస్తూ హడలెత్తిస్తుండటంతో ఆటల పోటీలకు బ్రేక్ పడింది. ముందుగా నిర్ణయించిన క్రీడా పోటీలు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది మార్చినెలాఖరులో మూతపడిన స్టేడియాలు, మైదానాలు ఇంత వరకు తెరుచుకోలేదు. లాక్డౌన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా అంతటా ఇదే పరిస్థితి. ఉదయం లేస్తే.. గ్రౌండ్‌కు పరుగెత్తే క్రీడాకారులు ప్రాక్టీసు లేక, ఆన్లైన్ గేమ్‌లు, జూమ్ యాప్‌ల ద్వారా ఆయా క్రీడల్లో శిక్షణ తీసుకుంటున్నారు. కరోనా త్వరగా అవుట్ కావాలని క్రీడాకారులు ఆకాంక్షిస్తున్నారు. నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడారంగం పరిస్థితిపై ప్రత్యేక కథనం. కర్నూలు (టౌన్): క్రీడా మైదానాలు వెలవెలబోతున్నాయి. ఆటల పోటీలు సాగడం లేదు. క్రీడాభిమానుల చప్పట్లు మారుమోగడం లేదు. పతకాలు మెరవడం లేదు.. ప్రశంసాపత్రాల్లో క్రీడాకారుల పేర్లు కనిపించడం లేదు. మాయదారి కరోనా మహమ్మారి స్టేడియాలకు తాళం వేసేలా దాపురించింది. కర్నూలు నగరంలోని స్పోర్ట్సు అథారిటీ స్టేడియం, ఇండోర్ స్టేడియం, స్టేడియానికి చెందిన స్విమ్మింగ్ పూల్తో పాటు ఎస్టీబీసీ కళాశాల క్రీడా మైదానం, బీక్యాంపు క్రీడా మైదానాలు క్రీడాకారులతో కళకళలాడుతూ ఉండేవి. ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, క్రికెట్, వాలీబాల్, స్కేటింగ్, బాస్కెట్‌బాల్ క్రీడాకారులు నిత్యం శిక్షణ తీసుకుంటూ కనిపించే వారు. ప్రస్తుతం ఈ స్టేడియాలు క్రీడాకారులు లేక వెలవెల బోతున్నాయి. ఐదు నెలలుగా పోటీలు కూడా నిలిచిపోయాయి. ప్రతి ఏడాది క్రీడా క్యాలెండర్ ప్రకారం నిర్ణయించిన వేళల్లో క్రీడా పోటీలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే మార్చి నెల 23వ తేదీ నుంచి కరోనా మహమ్మారితో జిల్లా వ్యాప్తంగా క్రీడాపోటీలు నిలిచిపోయాయి. ముందే నిర్ణయించిన తేదీల మేరకు మార్చి నెల 25 నుంచి 30వ తేదీ వరకు యోగా జాతీయ పోటీలు, స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి రగ్బీ అండర్ 14, అండర్ 17, అండర్ 19 పోటీలు, వాటర్ పోలో గేమ్స్ జాతీయ పోటీలు నిర్వహించాల్సి ఉంది. ఈ పోటీలన్నీ కరోనా దెబ్బకు వాయిదా పడ్డాయి. జూన్ నెలలో జరగాల్సిన ఫుట్‌బాల్ టోర్నమెంట్ కూడా వాయిదా పడింది. ఎస్జీఎఫ్ లోని 34 క్రీడాంశాల్లో పోటీలు నిలిచిపోయాయి. స్పోర్ట్సు క్యాలెండర్ ప్రకారం జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి జాతీయ పోటీలను మార్చి 31వ లోపు ముగించాల్సి ఉంటుంది. అయితే కరోనా ప్రభావంతో ఈ క్రీడలన్నీ నిలిచిపోయాయి. వేలాది మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రాక్టీసు చేసినా... కరోనా వల్ల అందరూ నిరుత్సాహ పడ్డారు. మంజూరైనా... అందని వైఎస్ఆర్ క్రీడా నగదు పురస్కారాలు జిల్లా క్రీడాభివృద్ధి అధికారుల నిర్లక్ష్యంగా క్రీడాకారులకు ప్రోత్సాహం కరువైంది. వైఎస్ఆర్ క్రీడా నగదు పురస్కారాల పేరుతో జిల్లాలోని క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన ప్రోత్సాహక నగదు అందజేస్తారు. దీంతో జిల్లావ్యాప్తంగా 109 మంది క్రీడాకారులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడాకారులను ఆదుకోవాలని వారికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఇందుకు సంబంధించి రూ. 28 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. గత ఏడాది క్రీడా దినోత్సవం రోజు కొందరికి రూ. 4 లక్షలు అందించారు. ఇతర మొత్తం క్రీడాకారులకు ఇవ్వాల్సి ఉన్న సకాలంలో జిల్లా క్రీడా శాఖ అధికారులు స్పందించకపోవడంతో నిధులు వెనక్కు వెళ్లిపోయాయి. క్రీడా సంబరాలు లేవు.. 1928, 1932, 1936లో ఒలింపిక్స్ పతకాలు సా«ధించిన ధ్యాన్‌చంద్ పుట్టిన రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా క్రీడాశాఖ నిర్వహిస్తుంది. ఏటా ఆరోజు జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను సన్మానించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడతారు. వారం రోజుల నుంచే స్కూల్‌గేమ్స్ క్రీడలు, జూనియర్ స్థాయి క్రీడలు, అథ్లెటిక్స్ వంటి క్రీడలు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ లెవల్లో జరిగేవి. మండల, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా కేంద్రంలో ఫైనల్ గేమ్స్ నిర్వహించే వారు. విజేతలకు జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని పతకాలు, సీనియర్ క్రీడాకారులకు సన్మానం వంటి కార్యక్రమాలు, అదే రోజు నగరంలో 2కే రన్, 5కే రన్ తదితర కార్యక్రమాలు నిర్వహించే వారు. అయితే ఈ ఏడాది కరోనా వల్ల జాతీయ క్రీడా దినోత్సవంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. కేవలం నగరంలోని స్పోర్ట్స్ అధారిటీ స్టేడియంలోని యోగా హాల్లో ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ముఖ్యకార్య నిర్వహణాధికారి నాగరాజు నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులకు శిక్షణ అవసరం క్రీడాకారులకు శిక్షణ అవసరం. లాక్డౌన్ కారణంగా అవుట్ డోర్ శిక్షణకు దూరంగా ఉండాల్సి వస్తోంది. నేను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహక నగదు పురస్కారాలు ప్రకటించింది. ఇందులో నేను ఎంపికయ్యాను. నగదు పురస్కారాల అందజేతలో జాప్యం జరుగుతోంది. అధికారులు వెంటనే స్పందించాలి. – జాఫ్రీన్, డెఫ్ ఇండియన్ టెన్నిస్ క్రీడాకారిణి, కర్నూలు లాక్‌డౌన్‌తో అవకాశాలు కోల్పోయారు కరోనా వ్యాధిని అరికట్టడానికి విధించిన లాక్డౌన్ కారణంగా క్రీడాకారులు ఎన్నో అవకాశాలు కోల్పోయారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అరుదైన అవకాశం వచ్చినా పోటీలు వాయిదా పడ్డాయి. శిక్షణ లేకపోవడంతో ప్రతిభకు మెరుగలద్దడం కష్టం. ప్రైవేటు క్రీడా కోచ్‌లు కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. – రామాంజనేయులు, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి, కర్నూలు ధ్యాన్ చంద్ విగ్రహం ఏర్పాటు చేయాలి కర్నూలు జిల్లా హాకీ క్రీడకు పుట్టినిల్లు వంటిది. జిల్లాకు చెందిన ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా హాకీ క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. హకీ క్రీడకు ఉన్న గుర్తింపునకు న్యాయం చేస్తూ నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయ ఆవరణలో ధ్యాన్‌చంద్ విగ్రహం ఏర్పాటు చేయాలి. – దాసరి సుధీర్, జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి, కర్నూలు -
ఫ్యాషన్.. స్పోర్ట్స్
-
సచిన్ గల్లీ క్రికెట్; షాకైన అభిషేక్, వరుణ్
ముంబై : మైదానంలోనే కాదు బయట కూడా స్ఫూర్తిమంతంగా వ్యవహరించడం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నైజం. జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ కార్యక్రమానికి సచిన్ మద్దతు పలికాడు. ఈ క్రమంలో గురువారం గల్లీలో క్రికెట్ ఆడాడు. అయితే, తనతో పాటు క్రికెట్ ఆడతారా అని బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, అభిషేక్ బచ్చన్లను ఆహ్వానించడంతో వారు ఆశ్చర్యంలో మునిగిపోయారు. మెహబూబా స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సచిన్ వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడాడు. తొలుత సచిన్ బ్యాటింగ్ చేయగా.. వరుణ్, అభిషేక్ బంతులేశారు. అనంతరం వారిద్దరికీ బౌలింగ్ చేసిన లిటిల్ మాస్టర్ అక్కడే ఉన్న జియా అనే మహిళా యువ క్రికెటర్‌ను ఎంకరేజ్ చేశాడు. ఆమెతో వరుణ్, అభిషేక్‌కి బౌలింగ్ చేయించాడు. ‘స్పోర్ట్స్ ప్లేయింగ్ నేషన్’, ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ హాష్‌టాగ్‌లను జత చేస్తూ.. సచిన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. గల్లీలో క్రికెట్ ఆడటం ఆనందం ఉందని సచిన్ ట్విటర్లో పేర్కొన్నాడు. చేసే పనిలో ఆటల్ని భాగం చేసుకోవాలని సూచించాడు. కాగా, ఈ ట్వీట్‌పై వరుణ్ స్పందించాడు. క్రీడా దినోత్సవం సందర్భంగా గొప్ప చొరవ చూపారు సర్ అంటూ ప్రశంసించాడు. మీతో క్రికెట్ ఆటడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. -
ఆశలకు ఆటగాళ్లు రెక్కలు తొడుగుతున్నారు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారుల ప్రదర్శన పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న ఆటగాళ్లను జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయన అభినందించారు. ‘త్రివర్ణ పతాకాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళుతున్న అథ్లెట్లను ఈ రోజు అభినందిస్తున్నాను. అది బాక్సింగ్‌లో కానివ్వండి లేదా బ్యాడ్మింటన్, టెన్నిస్, లేదంటే మరే క్రీడాంశంలోనైనా సరే... మన ఆశలకు ఆటగాళ్లు కొత్త రెక్కలు తొడుగుతున్నారు. మన దేశం మరింత విశ్వాసంతో ముందుకు వెళుతోందన్న విషయాన్ని క్రీడల్లో సాధిస్తున్న ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ 114వ జయంతి సందర్భంగా ఆయనను మోదీ స్మరించుకొన్నారు. ‘ధ్యాన్చంద్లాంటి గొప్ప వ్యక్తి జన్మించిన రోజు, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అందరికీ నా అభినందనలు. హాకీ స్టిక్‌తో ఆయన ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేశారు. ఆయనకు తలవంచి నమస్కరిస్తున్నాను’ అని ప్రధాని అన్నారు. గురువారం ‘జాతీయ క్రీడా పురస్కారాలు’ అందుకున్న ఆటగాళ్లకు కూడా మోదీ తన అభినందనలు తెలిపారు. కన్నుల పండువగా... క్రీడా పురస్కారాల ప్రదానం రాష్ట్రపతి భవన్లో కన్నులపండువగా జరిగింది. రాజీవ్ ఖేల్‌రత్నతో పాటు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డులను విజేతలు అందుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులు అందజేశారు. ‘ఖేల్‌రత్న’కు ఎంపికైన వారిలో మహిళా పారా అథ్లెట్ దీపా మాలిక్ వీల్‌చైర్‌లో తన అవార్డును స్వీకరించింది. ట్రోఫీ, ప్రశంసాపత్రంతో పాటు రూ.7.5 లక్షల నగదు ప్రోత్సాహకం కూడా ఆమె అందుకుంది. ఈ ఏడాది మొత్తం 19 మంది ‘అర్జున’కు ఎంపికయ్యారు. తెలుగు కుర్రాడు, ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్ తన ‘అర్జున’ను స్వీకరించాడు. ఈ కార్యక్రమానికి అతని తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. అర్జున విజేతకు రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకం లభిస్తుంది. హైదరాబాద్‌కే చెందిన షూటర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్‌కు చెందిన ‘స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్’కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ దక్కింది. దీనిని నారంగ్, తన అకాడమీ కోచ్, సహ భాగస్వామి పవన్ సింగ్‌తో కలిసి అందుకున్నాడు. ఇదే విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన ‘రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్’ తరఫున మాంచో ఫెర్రర్ పురస్కారాన్ని స్వీకరించారు. బజరంగ్ గైర్హాజరు... ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఎంపికైన భారత మేటి రెజ్లర్ బజరంగ్ పూనియా తన అవార్డును అందుకోలేకపోయాడు. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సన్నాహాల్లో భాగంగా అతను రష్యాలో ఉన్నాడు. వెస్టిండీస్‌లో ఉన్న క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. అథ్లెట్లు తజీందర్‌పాల్ సింగ్, మొహమ్మద్ అనస్, షూటర్ అంజుమ్ మౌద్గిల్ కూడా గైర్హాజరయ్యారు. వీరందరికి మరో రోజు క్రీడా మంత్రి కిరణ్ రిజిజు చేతుల మీదుగా అవార్డులను అందజేస్తారు. అవార్డు విజేతల జాబితా రాజీవ్ ఖేల్‌రత్న: బజరంగ్ పూనియా (రెజ్లింగ్), దీపా మాలిక్ (పారా అథ్లెటిక్స్) అర్జున: భమిడిపాటి సాయిప్రణీత్ (బ్యాడ్మింటన్), రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ (క్రికెట్), మొహమ్మద్ అనస్, తజీందర్‌పాల్ సింగ్, స్వప్న బర్మన్ (అథ్లెటిక్స్), గుర్ప్రీత్ సింగ్ సంధు (ఫుట్‌బాల్), సోనియా లాథర్ (బాక్సింగ్), చింగ్లెన్సానా సింగ్ (హాకీ), ఎస్.భాస్కరన్ (బాడీ బిల్డింగ్), అజయ్ ఠాకూర్ (కబడ్డీ), అంజుమ్ మౌద్గిల్ (షూటింగ్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), హర్మీత్ దేశాయ్ (టేబుల్ టెన్నిస్), పూజా ధాండా (రెజ్లింగ్), ఫౌద్ మీర్జా (ఈక్వెస్ట్రియన్), సిమ్రన్ సింగ్ షెర్గిల్ (పోలో), సుందర్ సింగ్ గుర్జర్ (పారా అథ్లెటిక్స్), గౌరవ్ సింగ్ గిల్ (మోటార్ స్పోర్ట్స్). ద్రోణాచార్య (రెగ్యులర్): మొహిందర్ సింగ్ ధిల్లాన్ (అథ్లెటిక్స్), సందీప్ గుప్తా (టేబుల్ టెన్నిస్), విమల్ కుమార్ (బ్యాడ్మింటన్). ద్రోణాచార్య (లైఫ్‌టైమ్): సంజయ్ భరద్వాజ్ (క్రికెట్), రామ్‌బీర్ సింగ్ ఖోఖర్ (కబడ్డీ), మెజ్బాన్ పటేల్ (హాకీ). ధ్యాన్‌చంద్ (లైఫ్‌టైమ్ అచీవ్మెంట్): మనోజ్ కుమార్ (రెజ్లింగ్), లాల్రెమ్సంగా (ఆర్చరీ), అరూప్ బసక్ (టేబుల్ టెన్నిస్), నితిన్ కీర్తనే (టెన్నిస్), మాన్యుయెల్ ఫ్రెడ్రిక్స్ (హాకీ). రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ (షూటింగ్), రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ (మాంచో ఫెర్రర్, అనంతపురం), గో స్పోర్ట్స్ ఫౌండేషన్. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ (క్రీడా ప్రదర్శనలో ఉత్తమ విశ్వవిద్యాలయం): పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్). రెజ్లర్ పూజా ధాండ, క్రికెటర్ పూనమ్ యాదవ్, కబడ్డీ ప్లేయర్ అజయ్ ఠాకూర్ ఆర్డీటీ డైరెక్టర్ మాంచో ఫెర్రర్, షూటర్ గగన్ నారంగ్, పవన్ సింగ్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెట్టుబడి 0%.. ఫలితాలు 100%
న్యూఢిల్లీ: దేశంలో ప్రతీ ఒక్కరు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ సూచించారు. ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచడంలో భాగంగా ప్రభుత్వం ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ను మొదలు పెట్టింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గురువారం దీనిని ప్రారంభించాక మోదీ మాట్లాడారు. ‘ఫిట్నెస్ అనేది సున్నా శాతం పెట్టుబడి పెడితే వంద శాతం ఫలితాలు ఇచ్చేది. కొన్ని దశాబ్దాల క్రితం ఒక సాధారణ వ్యక్తి కూడా కనీసం 8–10 కిలోమీటర్లు నడవటమో, పరుగెత్తడమో చేసేవాడు. టెక్నాలజీ పెరిగాక ఇది తగ్గిపోయింది. ఫిట్నెస్ అనేది కేవలం ఒక మాటగా మిగిలిపోకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించేందుకు విప్లవంలా సాగాలి’అని మోదీ వ్యాఖ్యానించారు. ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ను నిరంతరాయంగా కొనసాగించేందుకు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో 28 మంది సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 86వేల కోట్ల ఏడీబీ రుణం భారత్‌కు సుమారు రూ.86 వేల కోట్ల రుణం అందించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) అంగీకారం తెలిపింది. వచ్చే మూడేళ్లలో పైపుల ద్వారా అందరికీ నీటి సరఫరా, రహదారి భద్రతకు సంబంధించి చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ఈ నిధులను ప్రభుత్వం వినియోగించనుంది. ఏడీబీ ప్రెసిడెంట్ టకెహికో నకావో గురువారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా మార్పు చెందేందుకు తమ సాయం దోహదపడుతుందని నకావో అన్నారు. -
‘ఫిట్ ఇండియా’ ఛాలెంజ్!
‘విజయానికి ఎలివేటర్లుండవు.. మెట్లు ఎక్కాల్సిందే..’, ‘శారీరక దారుఢ్యం బాగుంటేనే ఏ రంగం లోనైనా విజయం సాధిస్తాం.’ ‘శరీరం ధృఢంగా ఉంటేనే మన మనసూ దృఢంగా తయారవు తుంది’... ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలాంటి అమూల్యమైన కొటేషన్లు చాలానే చెప్పారు. అలాగే ‘ఫిట్ ఇండియా’ పేరుతో ఓ ఉద్యమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. వ్యాయామం చేయడం, శరీ రాన్ని ధృఢంగా ఉంచుకోవడం వల్ల వ్యాధులను దూరంగా ఉంచగలగడంతో పాటు మనం పనిచేస్తున్న రంగంలో అద్భుతంగా రాణించగలుగుతామని ప్రధానమంత్రి చేసిన గంభీర ఉప న్యాసంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలూ లేవు. ఉండాల్సిన అవసరమూ లేదు. అలాగే ఆట పాటలు వదిలేసి పిల్లలు సెల్ఫోన్లు పట్టుకుకూర్చుంటున్నారన్న వ్యాఖ్యలూ నిజమైనవే. దీనికి కారకులు కేవలం తల్లిదండ్రులేనా..∙కనీసం ఆటస్థలం కూడా లేకుండా పాఠశాలలకు అనుమతులు ఎలా వస్తున్నాయి? పిల్లలను పూర్తిగా యంత్రాల మాదిరిగా మార్చిన విద్యావ్యవస్థలో మేలైన మార్పుల కోసం కసరత్తు ఎందుకు జరగడం లేదు? అలాంటి అనేక మౌలికమైన సమస్యలకు పరి ష్కారాలు ప్రకటించకుండా క్రీడా దినోత్సవం రోజున కేవలం తీర్మానాలతో సరిపెట్టడం మాత్రం ఎవరూ ఊహించని పరిణామమే. భారత క్రీడా రంగాన్ని మరో మెట్టు ఎక్కించడానికి ప్రధాన మంత్రి నిర్ధిష్టమైన కార్యాచరణను ప్రకటిస్తారని, క్రీడాకారులకు అదనంగా ఆర్థిక భరోసా కల్పిస్తా రని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ఫిట్ ఇండియా ఉద్యమానికి పైసా పెట్టుబడి అవసరం లేదని, ప్రయోజనం మాత్రం అనంతమని వ్యాఖ్యానించడం ప్రధాని ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పింది. ఫిట్ ఇండియా ఉద్యమం కోసం ప్రభుత్వం ఏం చేయాలనేదానిపై సలహాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అనేకమంది నిపుణులను నియమించింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లు, ఫిట్నెస్ ప్రమోటర్లతో ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా వేసింది. కేంద్ర కీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నాయకత్వంలో క్రీడలు, ప్రాథమిక విద్య, ఆయుష్, యూత్ అఫైర్స్ ఇలా వివిధ విభాగాలకు చెందిన 12 మంది ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఈ కమిటీలో ఉన్నారు. గత ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్నే ప్రచారం చేసింది. ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ అంటూ కార్యక్రమాలు నిర్వహించారు. పది బస్కీలు తీయాలంటూ ట్విట్టర్లో ప్రముఖ క్రీడాకారుల చేత ప్రచారం చేయించారు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినమైన ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవడం 2012 నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ప్రముఖులంతా ట్వీట్ల తోనూ, కామెంట్లతోనూ సామాజిక మాధ్యమాలను హోరెత్తించారు. 134 కోట్ల జనాభా ఉన్న భార తదేశం అంతర్జాతీయ క్రీడా యవనికపై అద్భుతాలు సృష్టించిన సందర్భాలు చాలా అరుదనే విషయం కొత్తదేమీ కాదు. టీమ్ ఈవెంట్లలో గానీ, వ్యక్తిగత ఈవెంట్లలో గానీ ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీలలో భారత్‌పేరు చివర్లో చూసుకోవలసిందే. ఒక్క పతకమొస్తే చాలు అదే పెద్ద విజయమన్నట్లు జాతీయపతాకాన్ని కప్పుకుని వీధుల్లో చిందులేస్తూ సంబరపడిపోతుంటాం. మూడేళ్ల క్రితం జరిగిన రియో ఒలింపిక్స్‌లో రెండంటే రెండు పతకాలతో 67వ స్థానంలో నిలిచాం. 2019 స్పోర్ట్స్ ప్రొవిజనల్ ర్యాంకింగ్స్‌లో భారత్ 54వ స్థానంలో ఉంది. అనేక చిన్నచిన్న దేశాలు మనకన్నా ఎంతో ముందున్నాయి. కానీ క్రీడాభివృద్ధి కోసం చేపడుతున్న చర్యలు మాత్రం అంతం తమాత్రమే. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు క్రీడాకారు లను ప్రోత్సహిస్తూ పలు నిర్ణయాలు తీసుకోవడం ఆశించదగిన పరిణామం. దిగువస్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. క్రీడా దినోత్సవం రోజు నుంచి వారోత్సవాలు నిర్వహించాలని, ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు కొన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన, ప్రతిభ చూపిం చిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలను భారీగా పెంచడమే కాక ఈ ప్రోత్సాహకాల పెంపును గత ఐదేళ్ల క్రితం నుంచి వర్తింపజేయాలని నిర్ణయించడం క్రీడాకారులలో హర్షాతిరేకాలు నింపేదే. కేంద్ర స్థాయిలోనూ కనీసం క్రీడాదినోత్సవం సందర్భంగానైనా ఇలాంటి ప్రోత్సాహకాలకు సంబం ధించిన ప్రకటనలు వెలువడతాయని క్రీడాలోకం ఎదురుచూసింది. క్రీడల్లోనే కాదు ఆరోగ్యం విషయంలోనూ మనం అదే చివరి వరుసలో ఉన్నాం. వ్యాయామం పైనా, ఆరోగ్యం పైనా భారతీయులలో స్పృహæ అంతంత మాత్రమేనన్న విమర్శలూ సహేతుకమై నవే. ఆరోగ్యం, వ్యాయామంపై చైతన్యపరచడమొక్కటే కాదు.. ప్రభుత్వాల నుంచి తగిన ప్రోత్సా హమూ ఉండాలి. జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా అనేక వ్యాధులు మహమ్మారులుగా మారుతున్నాయి. చిన్న వయసులోనే ప్రాణాలను కబళిస్తున్నాయి. భారత్‌లో జీవన శైలిలో మార్పుల కారణంగా వస్తున్న వ్యాధులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా 45 ఏళ్ల వయసులోపే 90శాతం మంది బీపీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. సరైన వ్యాయామం లేకపోవడం వల్ల మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి జబ్బులు చిన్న వయసు లోనే వచ్చేస్తున్నాయి. సాధారణంగా 50 నుంచి 60 ఏళ్లలో కనిపించే గుండెపోటు వంటివి ఇపుడు 35 నుంచి 40 ఏళ్ల వయసువారిలోనూ పెరుగుతున్నాయి. ఉపఖండంలో అత్యంత పేద దేశమైన బంగ్లాదేశ్ కన్నా ఆరోగ్యరంగంలో భారత్ వెనకబడిపోవడం విషాదకరం. హెల్త్‌కేర్ ఇండెక్స్‌లో శ్రీలంక 71, బంగ్లాదేశ్ 132, భూటాన్ 134 స్థానాల్లో ఉండగా భారత్ 145వ స్థానంలో ఉంది. పరిస్థితి ఇలానే ఉంటే చిట్టచివరిదైన 195కు చేరుకున్నా ఆశ్చర్యంలేదు. -
‘ఒలంపిక్స్‌లో పతకం గెలవడమే నా లక్ష్యం’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక అర్జున అవార్డు తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు తెలుగు తేజం సాయిప్రణీత్. గురువారం ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్నాడు. అనంతరం సాయి ప్రణీత్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదానం చేయడం ద్వారా క్రీడాకారులు మరింత స్ఫూర్తి పొందుతారని తెలిపారు. కేవలం బ్యాడ్మింటన్ మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో అన్ని క్రీడల్లోనూ భారత్ మెరుగైన ప్రతిభ చూపిస్తోందన్నారు. హైదరాబాద్ క్రీడాకారులు బ్యాడ్మింటన్‌లో పతకాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పతకం సాధించిన అనంతరం మరిన్ని చాంపియన్ షిప్‌లపై దృష్టి సారిస్తున్నానని ప్రణీత్ చెప్పారు. గతంలో అనేక మందికి సాధ్యం కానిది తాను సాధించాను కాబట్టి వారికంటే గొప్పగా భావించడం లేదని, రానున్న ఒలంపిక్స్‌లో పతకం నెగ్గడమే లక్ష్యంగా కృషిచేస్తున్నాని సాయి ప్రణీత్ పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ రోజు (ఆగష్టు 29)న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ క్రీడా పురస్కారాలు అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్నఅవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ అవార్డులను అందజేశారు. -
అర్జున అవార్డు అందుకున్న సాయిప్రణీత్
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ రోజు (ఆగష్టు 29)న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ క్రీడా పురస్కారాలు అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్నఅవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ అవార్డులను అందజేశారు. (చదవండి : సాయి ప్రణీత్‌కు ‘అర్జున’) భారత హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి యేటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా పురస్కారాల విజేతలకు రాష్ట్రపతి భవన్లో అవార్డులు అందజేస్తారు. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2018 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలు గెల్చుకున్న ఆటగాళ్లు అవార్డులు స్వీకరించారు. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా, మహిళా పారాథ్లెట్ దీపా మలిక్లు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ అందుకున్నారు. తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున అవార్డు’ను పొందాడు. -
హిట్లర్ మెచ్చిన భారత క్రీడాకారుడు ఎవరో తెలుసా?
క్రికెట్‌ను ఓ మతంలా అభిమానించే మనదేశంలో ఒకప్పుడు ఆ క్రీడాకారుడి కోసం ఆటపై మక్కువ పెంచుకున్నారు. అతి సామాన్యుల నుంచి హిట్లర్ వంటి నియంత కూడా అతని ఆటకు ఫిదా అయ్యారంటే అతని స్పెషాలిటీ ఏంటో వేరే చెప్పక్కర్లేదు. ఇంతకీ ఆ క్రీడాకారుడు ఎవరు? ఆయన సృష్టించిన అద్భుతాలు ఏంటి? తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి. -
హిట్లర్ మెచ్చిన భారత క్రీడాకారుడు!
-
‘సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం’
సాక్షి, విజయవాడ : జాతీయ క్రీడా దినోత్సవం రోజున సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి రెడ్డి క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ప్రకటించడం అభినదనీయమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఫిట్ ఇండియా మూవ్మెంట్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవిలత, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నవెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. దివంగత నేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి పేరుతో ప్రోత్సకాలు అందించడం వల్ల రాష్ట్రంలో మెరికల్ లాంటి క్రీడాకారులు తయారవుతారన్నారు. అందరు ఫిట్‌గా ఉంటేనే విజయవాడ ఫిట్‌గా ఉంటుందని, అందరూ ఫిట్‌గా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచించారు. కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తరపున వైయస్ఆర్ ప్రోత్సాహకాల కింద 12 మంది క్రీడాకారులకు 7లక్షల 45 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని క్రీడాకారులకు ఈ వైయస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు ఎంతగానో దోహద పడతాయని, జిల్లాలోని ముగ్గురు క్రీడాకారులకు ప్రోత్సకాలు అందజేసినట్లు వెల్లడించారు. వ్యాయామం జీవితంలో ఒక భాగం కావాలని, అప్పుడే ఫిట్ ఇండియా సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు. -
నేడు జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం
భారత హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి యేటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా పురస్కారాల విజేతలకు రాష్ట్రపతి భవన్లో అవార్డులు అందజేస్తారు. నేడు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2018 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలు గెల్చుకున్న ఆటగాళ్లు అవార్డులు స్వీకరించనున్నారు. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా, మహిళా పారాథ్లెట్ దీపా మలిక్లు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ అందుకోనున్నారు. తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున అవార్డు’ను పొందనున్నాడు. సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ జాతీయ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
రాష్ట్ర క్రీడాకారులకు పురస్కారాలు
సాక్షి, అమరావతి: ఈనెల 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా... 2014 నుంచి జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాకారులను నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. క్రీడా రంగానికి కొత్త శోభను తెస్తామని, ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘క్రీడా రంగానికి కొత్త శోభను తీసుకువస్తాం. ప్రతిభ ఎక్కడ ఉన్నా ప్రోత్సహించే బాధ్యత ఇకపై ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ నెల 29న క్రీడాదినోత్సవం సందర్భంగా 2014 నుంచి జాతీయస్థాయిలో పతకాలు సాధించిన వారిని నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరిస్తాం. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం’ అని ముఖ్యమంత్రి తన ట్వీట్లో పేర్కొన్నారు. -
జాగో భారత్..భాగో!
తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా అనుకుంటే ఎలా? పొద్దున లేస్తూనే కాస్త ఒళ్లు వంచాలి. శరీరానికి చెమట పట్టేలా నడవాలి. చల్లటి గాలి పీల్చాలి. ప్రకృతిని ఆస్వాదించాలి.. అప్పుడే మనకు ఆరోగ్యమైనా, ఆనందమైనా.. ఆ రెండూ ఉంటేనే మనం ఫిట్‌గా ఉంటాం. భారత్ ఫిట్‌గా ఉంటుంది. ఇప్పుడు దీన్నే కేంద్ర ప్రభుత్వం మహోద్యమంలా చేపట్టేందుకు సిద్ధమైంది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆగస్టు 29న ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇంతకీ మనం ఎంత ఫిట్‌గా ఉన్నాం? ప్రపంచ దేశాల ప్రమాణాలతో పోటీ పడుతున్నామా? ప్రపంచ దేశాల ఆరోగ్య ప్రమాణాలు, సంతోష సూచీలు చూస్తే మనం ఎన్నో దేశాల కంటే వెనుకబడే ఉన్నామని చెబుతున్నాయి. మనం ఎక్కడ ఉన్నాం? ఆరోగ్యం, వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడంలో భారత్ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. 32 ప్రాణాంతక వ్యాధులపై వివిధ దేశాలు చేస్తున్న పోరాటం ఆధారంగా ఇచ్చే గ్లోబల్ హెల్త్‌కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీ (హెచ్ఏక్యూ) ర్యాంకింగ్స్‌లో మొత్తం 195 దేశాలకు.. భారత్ 145వ స్థానంలో ఉంది. 1990లో 153వ స్థానంలో ఉన్న భారత్.. 2016 వచ్చేసరికి 145వ స్థానానికి వచ్చింది. అయితే హెచ్ఏక్యూ సూచీలో శ్రీలంక, బంగ్లాదేశ్, బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా ప్రపంచ సగటు ప్రమాణాల కంటే మనం వెనుకబడే ఉన్నాం. 2016లో హెచ్ఏక్యూ ప్రపంచ సగటు 54.4గా ఉన్నప్పుడు భారత్‌కు 41.2 స్కోర్ వచ్చింది. 1990లో 24.7 మాత్రమే. అందరికీ ఆరోగ్యం కోసం కేంద్రం ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 19,567 ఆరోగ్య కేంద్రాలను 2020 నాటికి 40 వేలకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఫిట్ ఇండియా ఎలా ముందుకు? శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసమే ప్రధాన ధ్యేయంగా ఫిట్ ఇండియా ఉద్యమాన్ని యువజన. క్రీడా శాఖ ముందుకు తీసుకెళ్లనుంది. విద్యాసంస్థలు ఫిట్నెస్ రన్స్, మారథాన్ రన్స్, సైకిల్ ర్యాలీలు చేపట్టడం, పిల్లలు సంప్రదాయ క్రీడలు ఆడేలా చర్యలు తీసుకోవడం.. పల్లెపల్లెల్లో.. నగరాల్లోని అన్ని ప్రాంతాల్లో వాకింగ్ పార్క్‌లు ఏర్పాటు చేయాలని క్రీడా శాఖ ప్రతిపాదించింది. శారీరక శ్రమతో పాటు పౌష్టిక ఆహారం తీసుకునేలా అవగాహన పెంచనుంది. ఇందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో సలహా మండలి ఏర్పడింది. యోగా భామ, బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి ఫిట్ ఇండియా సలహా మండలిలో చోటు దక్కింది. విద్యార్థులు రోజూ కనీసం 10 వేల అడుగులు వేసేలా చర్యలు చేపట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్ని విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే శారీరక శ్రమ చేయకపోతే గుండె సంబంధిత వ్యాధులు, టైప్–2 డయాబెటిస్, ఊబకాయం, హైపర్ టెన్షన్, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు అధికం. వ్యాయామంతో పాటు కంటి నిండా నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కూడా చాలా అవసరం. రోజూ జిమ్‌లకు వెళ్లి ఎక్సర్సైజ్లు, వెయిట్‌లిఫ్టింగ్ చేయనక్కర్లేదు. రోజుకు 30 నిమిషాల వాకింగ్, మెట్లు ఎక్కడం, దిగడం వంటివి చేసినా శరీరానికి సరిపోతుంది. మనం సంతోషంగా ఉన్నామా? సంతోషం సగం బలం అంటారు. ఇవాళ రేపు సంతోషమే పూర్తి బలంగా మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవితాలు, పెరిగిపోతున్న ఒత్తిడితో సంతోష సూచీలో మన దేశం చాలా వెనుకబడి ఉంది. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన సంతోష సూచీలో మొత్తం 156 దేశాలకు గాను భారత్ 140వ స్థానంలో ఉంది. గత మూడేళ్ల ర్యాంకింగ్‌లు చూస్తే వరుసగా 118, 122, 132గా ఉంది. మన పొరుగుదేశాలైన పాకిస్తాన్, చైనా, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో ప్రజలు మనకంటే సంతోషంగా ఉన్నారని ఆ నివేదిక వెల్లడించింది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ధ్యాన్‌చంద్‌ను క్యూలో నిలబెట్టారు
కోల్‌కతా: భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్. తన అసాధారణ ఆటతీరుతో జర్మనీ నియంత హిట్లర్నే మెప్పించిన ఈ అలనాటి స్టార్ ఒలింపిక్స్‌లో స్వర్ణ చరిత్ర లిఖించారు. ఇప్పుడైతే వేనోళ్ల స్తుతిస్తున్నారు... ఆయన జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. కానీ... ఆయన కెరీర్ ముగియగానే దిక్కుమాలిన రాజకీయాలతో ఘోరంగా అవమానించారని భారత హాకీ మాజీ కెప్టెన్ గుర్‌బక్ష సింగ్ తన ఆత్మకథ ‘మై గోల్డెన్ డేస్’లో పేర్కొన్నారు. ధ్యాన్‌చంద్ ఆట చూసేందుకు క్యూ కట్టిన రోజులున్నాయి. అయితే 1962లో ఆయన్నే క్యూలో నిలబెట్టిన ఘనత మన కుటిల రాజకీయాలది అని గుర్బర్ సింగ్ తన బాధని వెళ్లగక్కారు. 1960 నుంచి 1970 వరకు క్రీడల వ్యవహారాలు నీచ రాజకీయాలతో మసకబారాయి. పాటియాలాలోని జాతీయ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఐఎస్), భారత హాకీ సమాఖ్యకు అప్పట్లో అసలు పొసిగేదే కాదు. ఆ సమయంలో ధ్యాన్‌చంద్ ఎన్ఐఎస్ చీఫ్ కోచ్‌గా పని చేశారు. తన వద్ద శిక్షణ పొందిన ఆటగాళ్లు తదనంతరం అహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు ఆడుతుండగా... అక్కడికి వెళ్లిన ధ్యాన్‌చంద్‌ను స్టేడియంలోకి అనుమతించలేదు. అయితే ధ్యాన్‌చంద్ మాత్రం తన కుర్రాళ్ల ప్రదర్శన చూడాలన్న తాపత్రయంతో ప్రతీ మ్యాచ్ కోసం క్యూలో నిలబడి టికెట్ కొనుక్కొని మరీ చూశారు. ఇది అత్యంత శోచనీయమని గుర్‌బక్ష తన ఆత్మకథలో చెప్పుకొచ్చారు. -
నేడు జాతీయ క్రీడా దినోత్సవం
-
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
కడప స్పోర్ట్స్ : క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు మీ సొంతమవుతుందని జిల్లా కలెక్టర్ కె.వి.సత్యనారాయణ అన్నారు. ఆదివారం కడప నగరంలోని డీఎస్ఏ క్రీడామైదానంలో జాతీయ క్రీడాదినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్రీడాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. క్రీడాకారులు అంకితభావం, పట్టుదలతో ఇష్టమైన క్రీడలో రాణించాలని సూచించారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి సుభాన్‌బాషా మాట్లాడుతూ క్రీడల పట్ట ఆసక్తి కలిగిన కలెక్టర్ జిల్లాకు రావడం శుభపరిణామమన్నారు. అనంతరం గత మూడురోజులుగా నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు జ్ఞాపికలు అందజేశారు. అనంతరం జాతీయస్థాయిలో రాణించిన జిల్లా క్రీడాకారులు బి. సుహాసిని (బీచ్ కబడ్డీ), ఎ. అపర్ణ (కబడ్డీ), డి. చిన్ని (హాకీ), ఉదయ్దీపు (హాకీ), పి. భరద్వాజ్‌లను కలెక్టర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్డీఓ లక్ష్మినారాయణశర్మ, కోచ్‌లు గౌస్‌బాషా, షఫీ, సిబ్బంది అక్బర్, రవి, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా జాతీయ క్రీడాదినోత్సవ రన్
శ్రీకాకుళం న్యూకాలనీ: మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో సోమవారం నిర్వహించిన జాతీయ క్రీడా రన్ ఆద్యాంతం కోలాహలంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కలెక్టర్ లక్ష్మీనరసింహంలు అంతర్జాతీయ క్రీడాకారిణిలు శాంతి(అథ్లెటిక్స్), లిఖిత(బాక్సింగ్)తో కలిసి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పాతబస్టాండ్ వద్ద ఉన్న పొట్టిశ్రీరాములు జంక్షన్ నుంచి కళింగారోడ్, వైఎస్సాఆర్ సర్కిల్, పాలకొండ రోడ్ మీదుగా అంబేడ్కర్ జంక్షన్‌వరకు ర్యాలీ సాగింది. అనంతరం పశుసంవర్ధకశాఖ కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్, డీఎస్డీఓ, పీఈటీలు, తదితరులు మొక్కలునాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఉదయం 6.30 గంటలకు పొట్టిశ్రీరాములు జంక్షన్ వద్ద రోడ్డుపై వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బాక్సింగ్, తైక్వాండో, బాస్కెట్‌బాల్, హాకీ, బ్యాడ్మింటన్ క్రీడాకారులు విన్యాసానాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో శాప్ మానటరింగ్ అధికారి సూర్యారావు, డీఎస్డీవో బి.శ్రీనివాస్‌కుమార్, డీఎస్ఏ కోచ్‌లు సాయిప్రసాద్, అప్పలనాయుడు, జిల్లా ఒలింపిక్ సంఘ ప్రధాన కార్యదర్శి పి.సుందరరావు, ఉపాధ్యాక్షులు ఎండి కాసీంఖాన్, జి.ఇందిరాప్రసాద్, పాపయ్య మాస్టారు, జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షులు ఎం.వి.రమణ, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా జిల్లాకు చెందిన క్రీడల మంత్రి అచ్చెన్నాయుడు స్థానికంగా ఉన్నప్పటికీ జాతీయ క్రీడోత్సవ రన్‌కు మొహం చాటేయడాన్ని పలువురు తప్పుబట్టారు. -
హాకీ పరిస్థితి ఆశాజనకంగా లేదు
– జాతీయ క్రీడా దినోత్సవంలో ఒలింపియన్ రజనీ విజయవాడ స్పోర్ట్స్ : ప్రస్తుతం రాష్ట్రంలో హాకీ పరిస్థితి ఆశాజనకంగా లేదని రియో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన చిత్తూరుకు చెందిన ఇ.రజనీ అన్నారు. హాకీ మాంత్రికుడు, ట్రిపుల్ ఒలింపియన్ మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రజనీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఉదయం 7గంటలకు ఐజీఎంసీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు జరిగిన ర్యాలీలో వందలాది మంది అథ్లెట్లు, స్కేటర్లు, హాకీ క్రీడాకారులు, కోచ్‌లతో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రజనీ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధి చెందాలంటే అకాడమీలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. తల్లిదండ్రులు, పెద్దలపై గౌరవం, క్రమశిక్షణ, ఆటలో రాణించాలనే తపన ఉంటే ఏ స్థాయికైనా దూసుకుపోవచ్చని తెలిపారు. చిన్న పల్లెటూరుకు చెందిన తాను ఒలింపిక్స్ స్థాయికి వెళ్తానని అనుకోలేదని చెప్పారు. ఒలింపిక్స్‌లో 36 ఏళ్ల తర్వాత పాల్గొన్న భారత మహిళా హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు తన తల్లిదండ్రులు, కోచ్‌లు, పీఈటీల ప్రోత్సాహమే కారణమన్నారు. రియో ఒలింపిక్స్‌లో ఓడిపోయినా... ప్రభుత్వం నగదు ప్రోత్సాహంతోపాటు గ్రూపు–2 పోస్టు ఆఫర్ చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో స్పోర్ట్స్ అకాడమీలు లేకపోవడంతో చాలామంది క్రీడాకారులు వెలుగులోకి రావడంలేదని ఆమె పేర్కొన్నారు. రెండేళ్లుగా క్రీడాకారులు అడుక్కుతింటున్నారు : వినాయకప్రసాద్ రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం టీఏ, డీఏలు ఇవ్వకపోవడంతో టోర్నీలకు వెళ్లడానికి క్రీడాకారులు అడుక్కుంటున్నారని శాయ్ అథ్లెటిక్స్ కోచ్ వినాయకప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రీడాకారులకు ఇన్సెంటివ్‌లు, టీఏ, డీఏలు చెల్లించాలని కోరారు. అనంతరం రజనీని సన్మానించారు. శాప్ చైర్మన్ పీఆర్ మోహన్, శాప్ వోఎస్డీ పి.రామకృష్ణ, మాజీ డీఎస్డీవోలు బి.సుధాకర్, కాటంరాజు, రజనీ తల్లి తులసి, సోరదరుడు, స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి మురళి, శాప్ కోచ్‌లు పాల్గొన్నారు. -
జాతీయ క్రీడాదినోత్సవ ర్యాలీ
శామీర్‌పేట్/ మేడ్చల్: జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా శామీర్‌పేట్, మేడ్చల్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆయా గ్రామాల్లోని పురువీధుల్లో సోమవారం ర్యాలీలు తీశారు. ఈ సందర్భంగా క్రీడాదినోత్సవ ఆవశ్యకతను వివరించారురు. శామీర్‌పేటలో ఫిజికల్ డైరెక్టర్ (పీ.డీ) మురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్ల కార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చెన్నయ్య, నాగిరెడ్డి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
జీవితమే ఒక ఆట
క్రీడారంగంలో రాణించడమే వారి లక్ష్యం. అదే వారి స్వప్నం. అహర్నిశలు శ్రమించి క్రీడా మెళకువలు నేర్చుకొని.. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా జిల్లా క్రీడాకారులకు గుర్తింపు దక్కడం లేదు. పతకాల పంట పండించినా.. ప్రశంసా పత్రాలు కైవసం చేసుకున్నా వారికి కించిత్తు ప్రోత్సాహం కూడా సర్కారు వైపు నుంచి లభించడం లేదు. దీంతో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు స్వయం ఉపాధి బాటలో పయనిస్తున్నారు. ఇంకొంతమంది వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. వారి క్రీడా ప్రస్థానంపై ‘జాతీయ క్రీడా దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువు స్వయం ఉపాధి బాటలో కొందరు, కూలీ పనులకు ఇంకొందరు.. నేడు జాతీయ క్రీడా దినోత్సవం పాన్‌షాప్ నడుపుకుంటూ.. మహబూబాబాద్ : మానుకోటకు చెందిన ఆ క్రీడాకారుడి పేరు అక్తర్ పాషా. ఖోఖో మైదానంలో చిరుతలా రయ్‌మని దూసుకుపోయే వేగం ఆయనకు సొంతం. అనన్య సామాన్యమైన క్రీడా నైపుణ్యాలున్నా సర్కారు చేదోడు మాత్రం అందలేదు. దీంతో పాన్‌షాప్ నడుపుతూ స్వయం ఉపాధిని పొందుతున్నారాయన. జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో 12 సార్లు పాల్గొని ప్రతిభ కనబరిచారాయన. 1989 సంవత్సరంలో జరిగిన జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో బంగారు పతకాన్ని సాధించారు. 1993లో మధ్యప్రదేశ్‌లో జరిగిన 38వ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1996లో తమిళనాడులో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో, అదే ఏడాది అక్కడే జరిగిన సీనియర్ సౌత్‌జోన్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొన్ని కాంస్య పతకాన్ని చేజిక్కించుకున్నారాయన. 1995, 1996, 1997 సంవత్సరాల్లో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో కాకతీయ యూనివర్సిటీ జట్టు తరఫున పాల్గొన్నారు. నడక పోటీలు, లాంగ్‌జంప్‌లోనూ.. కడపలో జరిగిన 5 కిలోమీటర్ల నడక పోటీల్లో తృతీయ బహుమతిని సాధించారు అక్తర్‌పాషా. వరంగల్‌లో నిర్వహించిన 200 మీటర్ల పరుగు పందెంలో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతిని సాధించారు. వరంగల్‌లో నిర్వహించిన లాంగ్‌జంప్ పోటీల్లో ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు. డిగ్రీ (బీఏ) పూర్తి చేసిన ఆయనకు అనంతర కాలంలో క్రీడారంగంలోని ప్రతిభ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు లభించలేదు. దీంతో తొర్రూరు బస్టాండ్‌లో పాన్‌షాప్ ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. ఆయన కుమారుడు అఫ్రోజ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, కుమార్తె సమ్రీన్ 9వతరగతి చదువుతోంది. తనకు మెుండిచెయ్యి చూపిన క్రీడలపై తన పిల్లలు దృష్టిసారించకుండా ఆయన చూస్తున్నారు. చదువులపై ఎక్కువ శ్రద్ధపెట్టాలని తమ పిల్లలకు ఆయన సూచిస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా.. కేసముద్రం : ‘క్రీడలు వద్దు.. చదువులే ముద్దు’ అని తల్లిదండ్రులు, తోటివారు స్వర్ణలతకు చెప్పారు. ఆమె ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్న సమయమది. ఎవరు ఎన్ని చెప్పినా.. ఆమె తనకు ఇష్టమైన క్రీడ తైక్వాండోపై ఆసక్తిని మాత్రం తగ్గించుకోలేదు. అందులో క్రీడా నైపుణ్యాలను పెంచుకుంటూ జాతీయస్థాయిలో పోటీల్లో ప్రతిభ కనబరిచేలా ఎదిగింది. అనంతర కాలంలో ఆమె ఉత్సాహాన్ని చూసి తల్లిదండ్రులు సైతం తమ ఆలోచనా ధోరణిని మార్చుకున్నారు. అప్పు చేసి మరీ డబ్బులు తెచ్చి తన కుమార్తె క్రీడా పోటీలకు వెళ్లేందుకు డబ్బులు ఇచ్చేవారు. స్వర్ణలతలోని క్రీడా స్ఫూర్తి ఓ వైపు.. కన్నబిడ్డకు చేదోడునిచ్చేందుకు అప్పులు చేసేందుకు సిద్ధమైన తల్లిదండ్రులు రాజబోయిన వెంకన్న, అరుణల ప్రోత్సాహం మరోవైపు. ఇవన్నీ వెరసి రాష్ట్ర, జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో స్వర్ణలత ఓ మెరుపై మెరిసింది. ఆమెలోని ప్రతిభను గుర్తించి కేసముద్రం విలేజ్‌లోని శ్రీవివేకవర్ధిని స్కూల్ కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ స్వర్ణలతను ప్రోత్సాహించారు. తన పాఠశాలలో 9,10 తరగతులను చదివించారు. ఇదే సమయంలో కేసముద్రం స్టేషన్లో తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి శిక్షణా శిబిరం, ప్రతి ఆదివారం నిర్వహించే శిబిరాలకు ఆమె హాజరయ్యేది. ఈ శిక్షణతో పలు పతకాలను సాధించింది. ప్రస్తుతం ఆమె వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటూనే, స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. తండ్రికి ఇటీవలæనడుము నొప్పితో ఆపరేషన్ జరగడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. దీంతో కుటుంబ బాధ్యతను స్వర్ణలత పంచుకుంటోంది. అంతేకాకుండా ప్రతి ఆదివారం కేసముద్రం స్టేషన్ పరిధిలోని జెడ్పీఎస్‌ఎస్‌లో నిర్వహించే క్రీడా శిబిరానికి హాజరై విద్యార్థులకు తైక్వాండోపై అవగాహన కల్పిస్తోంది. ప్రైవేట్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా.. డోర్నకల్ : డోర్నకల్‌కు చెందిన మండలోజు సుధాకర్ దశాబ్ద కాలంగా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ క్రీడల్లో విశేషంగా రాణిం చాడు. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో గార్లలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అతి తక్కువ వేతనంతో వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఆయన పనిచేస్తున్నారు. డోర్నకల్‌లో వ్యాయామశాల నిర్వహిస్తూ ఉత్సాహవంతులైన యు వతీ యువకులకు వెయిట్ లిఫ్టిం గ్లో శిక్షణ ఇస్తున్నారు. కూలీ పనులే దిక్కాయె.. నర్సింహులపేట : 12 సార్లు జాతీయ స్థాయి, 50 సార్లు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు మండలంలోని కొమ్ములవంచకు చెందిన తాళ్ల శ్రీలత. ఆయా టోర్నమెంట్లలో ప్రతిభ కనబర్చి పలు మెడల్స్, ప్రశంసా పత్రాలను ఆమె కైవసం చేసుకున్నారు. అయినా సర్కారు చేదోడు మాత్రం అందలేదు. హైదరాబాద్ నగరంలోని దోమలగూడలో ఉన్న ఓ కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయ కోర్సు(బీపీడీ) పూర్తి చేశారు శ్రీలత. ఆ పట్టా ఆధారంగా ఆమెకు నర్సంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా కొంతకాలం పనిచేశారు. అయితే అతి తక్కువ వేతనం లభిస్తుండటంతో ఆ పనికి వెళ్లడం లేదు. ప్రస్తుతం కూలీ పనులకు వెళ్తూ ఉపాధి పొందుతోంది శ్రీలత. తమ కుమార్తెకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని ఆమె తల్లిదండ్రులు యాకయ్య, లక్ష్మి కోరుతున్నారు. కబడ్డీ రంగన్నకు కరువైన ప్రోత్సాహం కురవి : అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించినా ఆ క్రీడాకారుడికి ప్రభుత్వ ప్రోత్సాహం మాత్రం అందనే లేదు. మైదానంలోకి దిగగానే పాయింట్ల పట్టిక పరుగులు తీయించే క్రీడా నైపుణ్యం ఉన్నా.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. సర్కారు పట్టించుకోనితనం ఓ వైపు.. చిమ్మచీకటిలా చుట్టుముట్టిన పేదరికం మరోవైపు ఆవరించినా చెక్కుచెదరని ఆత్మసై్థర్యంతో వ్యవసాయ పనులు చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు జెర్రిపోతుల రంగన్నగౌడ్. ఆయన కురవి మండలంలోని చింతపల్లివాసి. పాఠశాల స్థాయి నుంచే క్రీడాపోటీల్లో ప్రతిభ కనబరిచారాయన. ఉపాధ్యాయుల ప్రోత్సాహం తోడవడంతో అనంతర కాలంలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా దూసుకుపోయారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయ క్రీడా పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. ఈక్రమంలో ఎన్నో బహుమతులను కైవసం చేసుకున్నారు. సీనియర్ క్రీడాకారుడు అజీజ్‌ఖాన్ శిష్యరికంలో రంగన్న కబడ్డీలో రాటుదేలారు. ఆ క్రీడలో ఆల్‌రౌండర్‌గా పేరు గడించారు. తాను ఎంతో ఇష్టపడిన క్రీడా రంగంలో అవకాశాలు దరిచేరకున్నా.. సొంతూరు మాత్రం రంగన్నకు రాజకీయ రంగంలో ఓ అవకాశాన్ని కల్పించింది. దీంతో చింతపల్లికి సర్పంచ్‌గా ఐదేళ్లపాటు అంకితభావంతో సేవలు అందించారు. జీవిత పయనంలో అందరికీ ఆదర్శంగా ఉండేలా ఓ గిరిజన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. కొబ్బరి బోండాలు అమ్ముతూ.. మడికొండ : నాడు కుంగ్‌ఫూ జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన నల్ల రామకృష్ణ, నేడు కుటుంబ పోషణ కోసం కొబ్బరిబోండాలు అమ్ముతున్నారు. స్వయం ఉపాధిని నమ్ముకొని స్ఫూర్తిదాయకంగా ముందుకుసాగుతున్నారు. 1986లో కుంగ్‌ఫూలో మెళకువలు నేర్చుకున్న ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటారు. 1987లో హైదరాబాద్ హెచ్‌సీఎల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే, కుంగ్‌ఫూ పోటీల్లో రెండో స్థానంలో నిలిచాడు. 1988లో వైజాగ్‌లోని గాజువాకలో జరిగిన కుంగ్‌ఫూ పోటీలో మొదటిస్థానంలో నిలిచారు. 1990లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బ్రౌన్‌బెల్ట్ విభాగంలో మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. 1996లో బ్లాక్ బెల్ట్‌లో మూడో డిగ్రీని పూర్తి చేశారు రామకృష్ణ. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం దక్కకపోవడంతో ఉన్నత స్థాయి పోటీల్లో ఆయన పాల్గొనలేకపోయారు. బాధ్యత మరిచిన క్రీడా సంఘాలు వరంగల్ స్పోర్ట్స్ : దశాబ్దాల క్రితమే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల్లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ఘనుడాయన. భారత జాతీయ క్రీడ హాకీ వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన క్రీడాకెరటం ఆయన. అంతర్జాతీయ క్రీడా వేదికల్లో మన దేశానికి ఎన్నెన్నో పతకాలు, అపురూప విజయాలను సాధించిపెట్టిన ధ్యాన్‌చంద్‌ను భారత జాతి మరిచిపోలేదు. నేడు(సోమవారం) ఆయన జయంతిని ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత క్రీడా సంఘాలలో విబేధాలు ఏర్పాడ్డాయి. ఎక్కువ సంఖ్యలో క్రీడాసంఘాలు రెండుగా చీలిపోయి కొనసాగుతున్నాయి. ఒలింపిక్ సంఘంలోనూ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. దీంతో అసలు సంఘం మాదేనంటే మాదే అంటూ ఆయా వర్గాలు ప్రకటించుకుంటున్నాయి. అంతే కానీ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని తమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడంపై వారు దృష్టిసారించడం లేదు. పాఠశాలల వార్షికోత్సవాలు, పండుగలకు సైతం ఆటల పోటీలు నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలాంటిది ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా కనీసం రెండు రోజులైనా జిల్లా స్థాయి క్రీడాపోటీలు నిర్వహిస్తే బాగుండు అనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. ధ్యాన్‌చంద్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ప్రపంచ స్థాయిలో భారత్ పేరు ప్రఖ్యాతులను నిలబెట్టిన క్రీడా దిగ్గజం ధ్యాన్‌చంద్ విగ్రహాన్ని హన్మకొండలోని జేఎన్ఎస్లో ఏర్పాటు చేయాలి. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సీనియర్ క్రీడాకారులను సన్మానించాలి. ఇందుకోసం జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ కృషిచేయాలి. ఈవిషయంలో కలెక్టర్ చొరవ చూపాలి. – రాజనాల శ్రీహరి, శాప్ మాజీ డైరెక్టర్ నేడు జేఎన్ఎస్లో క్రీడాపోటీలు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు(సోమవారం) హన్మకొండలోని జేఎన్ఎస్లో హాకీ, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నాం. ఉదయం క్రీడాకారులు, క్రీడాభిమానులు, క్రీడా సంఘాలతో ర్యాలీ నిర్వహిస్తున్నాం. అందరూ హాజరుకావాలి. – ఇందిర, డీఎస్డీఓ క్రీడాకారులను సన్మానించాలి గతంలో స్పోర్ట్స్ డే సందర్భంగా ఆర్డీడీ సారయ్య హయాంలో జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన జిల్లా క్రీడాకారులను సన్మానించేవాళ్లం. అంతేకాకుండా సన్మాన వేదిక నుంచే క్రీడాకారులకు స్పోర్ట్స్ స్కాలర్షిప్ను ఇచ్చేవారు. ఈ ఆనవాయితీ తర్వాత కాలంలో కొనసాగకపోవడం బాధాకరం. – మంచిక అభినయ్ వినయ్‌కుమార్, సాఫ్ట్‌బాల్ జాతీయ క్రీడాకారుడు -
జాతీయ క్రీడోత్సవాలు ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ క్రీడోత్సవ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో ఈనెల 29న జాతీయ క్రీడల దినాన్ని పురస్కరించుకుని శాప్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న క్రీడాపోటీలు శనివారం ఉత్సాహభరితంగా సాగాయి. తొలిరోజు అథ్లెటిక్స్ విభాగంలో పోటీలను నిర్వహించారు. జూనియర్ బాలబాలికలకు, ఓపెన్ విభాగంలో సీనియర్ క్రీడాకారులకు (పురుషులు, మహిళలకు) ఈ పోటీలను వేరువేరుగా నిర్వహించారు. 100, 800 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్ అథ్లెటిక్ ఈవెంట్స్‌లో పోటీలు జరిగాయి. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారుల వివరాలను జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సిబ్బంది నమోదు చేసుకున్నారు. పోటీలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 500 మంది వరకు క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను నిరూపించుకున్నారు. -
క్రీడా పోరుకు సై
జాతీయ క్రీడోత్సవ పోటీలకు రంగం సిద్ధం నేటి నుంచి మూడు రోజులపాటు క్రీడా పోటీలు వేదిక... కోడిరామ్మూర్తి స్టేడియం అరకొర నిధులిచ్చి చేతులు దులుపుకున్న శాప్ శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ క్రీడోత్సవ పోటీలకు రంగం సిద్ధమైంది. ఈనెల 29న హాకీ మాంత్రికుడు, మేజర్ థ్యాన్‌చంద్ జయంతిని పురష్కరించుకుని శనివారం నుంచి మూడు రోజుల పాటు కోడిరామ్మూర్తి స్టేడియంలో జరగనున్న జాతీయ క్రీడా దినోత్సవ పోటీలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా ఒలింపిక్, పీఈటీ సంఘ సహకారంతో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో పోటీలు సాగుతాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే అథ్లెటిక్స్ పోటీలతో క్రీడలు ప్రారంభంకానున్నాయి. పోటీల్లో పాఠశాలస్థాయి బాలబాలికలకు, ఓపెన్‌లో విభాగంలో అన్ని వయస్కులవారికి పోటీలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అథ్లెటిక్స్‌లో 100, 800 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌ఫుట్, 400 మీటర్ల రిలే పరుగు పందాల్లో పోటీలు నిర్వహిస్తారు. 28న హాకీ పోటీలు నిర్వహిస్తారు. జూనియర్ విభాగంలో బాల బాలికలకు మాత్రమే నిర్వహించనున్నారు. 29న శ్రీకాకుళంలో జాతీయ క్రీడా రన్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ రన్‌ను శ్రీకాకుళం పాతబస్టాండ్ వద్ద గల పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి కోడిరామ్మూర్తి స్టేడియం వరకు కొనసాగుతుందని క్రీడాధికారులు తెలిపారు. క్రీడోత్సవ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు 29న సాయంత్రం బహుమతులు అందజేయనున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు కలెక్టర్ చేతుల మీదుగా సత్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిధులు అరకొరే.. క్రీడాపోటీల నిర్వహణ, సామియానా, బహుమతులు, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు సత్కారాలు, వగైరా ఖర్చులకు భారీగానే నిధులు అవసరమవుతాయి. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్)మాత్రం కేవలం రూ.20 వేలు నిధులు కేటాయించి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిధులతో ఘనంగా పోటీలు నిర్వహించి, క్రీడాకారులను సత్కరించిన వీడియోలు, ఫొటోలు కూడా పంపించాలని శాప్ సూచించడంపై క్రీడాధికారులు మండిపడుతున్నారు. అనవసర ఆర్భాటాలకు కోట్లాది రూపాయలు ఖర్చుచేసే సర్కారు క్రీడాపోటీలకు మాత్రం కనీస నిధులు కేటాయించకపోవడాన్ని క్రీడా విశ్లేషకులు తప్పుబడుతున్నారు. -
దండేసి వదిలేద్దామా?
నేడు జాతీయ క్రీడా దినోత్సవం జాతీయ క్రీడా దినోత్సవం... ఏ దేశంలో అయినా క్రీడాకారులకు ఇదో పెద్ద పండగ. కానీ మన దగ్గర మాత్రం ఆ పరిస్థితి లేదు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఆగస్టు 29న మన దగ్గర జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రతిసారీ ఇది తూతూమంత్రంగానే జరుగుతోంది. ఆ రోజు ధ్యాన్‌చంద్ విగ్రహానికి దండలు వేసి అధికారులు, క్రీడాకారులు కూడా చేతులు దులుపుకుంటున్నారు. కనీసం ఈ ఒక్కరోజైనా పట్టించుకుంటే భారత్‌లో క్రీడలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుంది. పండగ హాకీకేనా? భారత్‌లో క్రీడాదినోత్సవం అంటే కేవలం హాకీ క్రీడాకారులకు సంబంధించిన ఉత్సవంలా భావిస్తున్నారు. మిగిలిన క్రీడలకు సంబంధించిన వారెవరూ ఎలాంటి వేడుక లేదా కార్యక్రమం జరపడం లేదు. అయితే ప్రతి ఏటా రాష్ట్రపతి మాత్రం క్రీడా అవార్డులను అందజేస్తున్నారు. ధ్యాన్‌చంద్ (లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్), అర్జున, ద్రోణాచార్య అవార్డులను అందించే వేడుక ఈసారి కూడా జరుగుతుంది. కానీ ఈసారి ఖేల్త్న్ర అవార్డుకు మాత్రం ఎవరిని ఎంపిక చేయలేదు. భారతరత్న దక్కేనా? క్రీడా దినోత్సవం సందర్భంగా హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ను స్మరించుకుంటున్నాం. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఈ సారైనా ధ్యాన్‌చంద్‌కు దక్కుతుందా అని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారతరత్నను క్రీడలకు వర్తింప చేయడంతో గత ఏడాది క్రికెట్ దిగ్గజం సచిన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అప్పుడు ధ్యాన్‌చంద్‌ను పరిగణలోకి తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. - సాక్షి క్రీడావిభాగం -
నేడు జాతీయ క్రీడా దినోత్సవం
దేశంలో నేడు ఆటలకు పండుగ రోజు. ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశంలో క్రమంగా క్రీడా సంస్కృతి పెరుగుతోంది. కెరీర్‌గా ఎంచుకుంటేనే క్రీడల వైపు చూసే పరిస్థితి నుంచి... ‘ఆట ఆరోగ్యం కోసం’ అనే భావన క్రమంగా పెరుగుతోంది. ఒక్క క్రికెట్లోనే కాకుండా అంతర్జాతీయ యవనికపై భారత్‌కు అన్ని క్రీడల్లోనూ విజయాలు పెరుగుతున్నాయి. క్రీడా దినోత్సవం, ఆటల ప్రాధాన్యత, మార్గదర్శనం, భవిష్యత్... ఇలా అనేక అంశాలపై ముగ్గురు ఆంధ్రప్రదేశ్ క్రీడా దిగ్గజాలు ‘సాక్షి’కి ప్రత్యేకంగా రాసిన వ్యాసాలు...