‘విజయానికి ఎలివేటర్లుండవు.. మెట్లు ఎక్కాల్సిందే..’, ‘శారీరక దారుఢ్యం బాగుంటేనే ఏ రంగం లోనైనా విజయం సాధిస్తాం.’ ‘శరీరం ధృఢంగా ఉంటేనే మన మనసూ దృఢంగా తయారవు తుంది’... ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలాంటి అమూల్యమైన కొటేషన్లు చాలానే చెప్పారు. అలాగే ‘ఫిట్ ఇండియా’ పేరుతో ఓ ఉద్యమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. వ్యాయామం చేయడం, శరీ రాన్ని ధృఢంగా ఉంచుకోవడం వల్ల వ్యాధులను దూరంగా ఉంచగలగడంతో పాటు మనం పనిచేస్తున్న రంగంలో అద్భుతంగా రాణించగలుగుతామని ప్రధానమంత్రి చేసిన గంభీర ఉప న్యాసంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలూ లేవు. ఉండాల్సిన అవసరమూ లేదు. అలాగే ఆట పాటలు వదిలేసి పిల్లలు సెల్‌ఫోన్లు పట్టుకుకూర్చుంటున్నారన్న వ్యాఖ్యలూ నిజమైనవే.
దీనికి కారకులు కేవలం తల్లిదండ్రులేనా..∙కనీసం ఆటస్థలం కూడా లేకుండా పాఠశాలలకు అనుమతులు ఎలా వస్తున్నాయి? పిల్లలను పూర్తిగా యంత్రాల మాదిరిగా మార్చిన విద్యావ్యవస్థలో మేలైన మార్పుల కోసం కసరత్తు ఎందుకు జరగడం లేదు? అలాంటి అనేక మౌలికమైన సమస్యలకు పరి ష్కారాలు ప్రకటించకుండా క్రీడా దినోత్సవం రోజున కేవలం తీర్మానాలతో సరిపెట్టడం మాత్రం ఎవరూ ఊహించని పరిణామమే. భారత క్రీడా రంగాన్ని మరో మెట్టు ఎక్కించడానికి ప్రధాన మంత్రి నిర్ధిష్టమైన కార్యాచరణను ప్రకటిస్తారని, క్రీడాకారులకు అదనంగా ఆర్థిక భరోసా కల్పిస్తా రని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ఫిట్ ఇండియా ఉద్యమానికి పైసా పెట్టుబడి అవసరం లేదని, ప్రయోజనం మాత్రం అనంతమని వ్యాఖ్యానించడం ప్రధాని ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పింది.
ఫిట్ ఇండియా ఉద్యమం కోసం ప్రభుత్వం ఏం చేయాలనేదానిపై సలహాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అనేకమంది నిపుణులను నియమించింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లు, ఫిట్‌నెస్ ప్రమోటర్లతో ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా వేసింది. కేంద్ర కీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నాయకత్వంలో క్రీడలు, ప్రాథమిక విద్య, ఆయుష్, యూత్ అఫైర్స్ ఇలా వివిధ విభాగాలకు చెందిన 12 మంది ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఈ కమిటీలో ఉన్నారు. గత ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్నే ప్రచారం చేసింది. ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ అంటూ కార్యక్రమాలు నిర్వహించారు. పది బస్కీలు తీయాలంటూ ట్విట్టర్‌లో ప్రముఖ క్రీడాకారుల చేత ప్రచారం చేయించారు.
హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినమైన ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవడం 2012 నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ప్రముఖులంతా ట్వీట్ల తోనూ, కామెంట్లతోనూ సామాజిక మాధ్యమాలను హోరెత్తించారు. 134 కోట్ల జనాభా ఉన్న భార తదేశం అంతర్జాతీయ క్రీడా యవనికపై అద్భుతాలు సృష్టించిన సందర్భాలు చాలా అరుదనే విషయం కొత్తదేమీ కాదు. టీమ్ ఈవెంట్లలో గానీ, వ్యక్తిగత ఈవెంట్లలో గానీ ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీలలో భారత్‌పేరు చివర్లో చూసుకోవలసిందే. ఒక్క పతకమొస్తే చాలు అదే పెద్ద విజయమన్నట్లు జాతీయపతాకాన్ని కప్పుకుని వీధుల్లో చిందులేస్తూ సంబరపడిపోతుంటాం. మూడేళ్ల క్రితం జరిగిన రియో ఒలింపిక్స్‌లో రెండంటే రెండు పతకాలతో 67వ స్థానంలో నిలిచాం. 2019 స్పోర్ట్స్ ప్రొవిజనల్ ర్యాంకింగ్స్‌లో భారత్ 54వ స్థానంలో ఉంది.
అనేక చిన్నచిన్న దేశాలు మనకన్నా ఎంతో ముందున్నాయి. కానీ క్రీడాభివృద్ధి కోసం చేపడుతున్న చర్యలు మాత్రం అంతం తమాత్రమే. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు క్రీడాకారు లను ప్రోత్సహిస్తూ పలు నిర్ణయాలు తీసుకోవడం ఆశించదగిన పరిణామం. దిగువస్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. క్రీడా దినోత్సవం రోజు నుంచి వారోత్సవాలు నిర్వహించాలని, ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు కొన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన, ప్రతిభ చూపిం చిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలను భారీగా పెంచడమే కాక ఈ ప్రోత్సాహకాల పెంపును గత ఐదేళ్ల క్రితం నుంచి వర్తింపజేయాలని నిర్ణయించడం క్రీడాకారులలో హర్షాతిరేకాలు నింపేదే. కేంద్ర స్థాయిలోనూ కనీసం క్రీడాదినోత్సవం సందర్భంగానైనా ఇలాంటి ప్రోత్సాహకాలకు సంబం ధించిన ప్రకటనలు వెలువడతాయని క్రీడాలోకం ఎదురుచూసింది.
క్రీడల్లోనే కాదు ఆరోగ్యం విషయంలోనూ మనం అదే చివరి వరుసలో ఉన్నాం. వ్యాయామం పైనా, ఆరోగ్యం పైనా భారతీయులలో స్పృహæ అంతంత మాత్రమేనన్న విమర్శలూ సహేతుకమై నవే. ఆరోగ్యం, వ్యాయామంపై చైతన్యపరచడమొక్కటే కాదు.. ప్రభుత్వాల నుంచి తగిన ప్రోత్సా హమూ ఉండాలి. జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా అనేక వ్యాధులు మహమ్మారులుగా మారుతున్నాయి. చిన్న వయసులోనే ప్రాణాలను కబళిస్తున్నాయి. భారత్‌లో జీవన శైలిలో మార్పుల కారణంగా వస్తున్న వ్యాధులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా 45 ఏళ్ల వయసులోపే 90శాతం మంది బీపీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
సరైన వ్యాయామం లేకపోవడం వల్ల మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి జబ్బులు చిన్న వయసు లోనే వచ్చేస్తున్నాయి. సాధారణంగా 50 నుంచి 60 ఏళ్లలో కనిపించే గుండెపోటు వంటివి ఇపుడు 35 నుంచి 40 ఏళ్ల వయసువారిలోనూ పెరుగుతున్నాయి. ఉపఖండంలో అత్యంత పేద దేశమైన బంగ్లాదేశ్ కన్నా ఆరోగ్యరంగంలో భారత్ వెనకబడిపోవడం విషాదకరం. హెల్త్‌కేర్ ఇండెక్స్‌లో శ్రీలంక 71, బంగ్లాదేశ్ 132, భూటాన్ 134 స్థానాల్లో ఉండగా భారత్ 145వ స్థానంలో ఉంది. పరిస్థితి ఇలానే ఉంటే చిట్టచివరిదైన 195కు చేరుకున్నా ఆశ్చర్యంలేదు.
Comments
Please login to add a commentAdd a comment