
హాకీ పరిస్థితి ఆశాజనకంగా లేదు
– జాతీయ క్రీడా దినోత్సవంలో ఒలింపియన్ రజనీ
విజయవాడ స్పోర్ట్స్ : ప్రస్తుతం రాష్ట్రంలో హాకీ పరిస్థితి ఆశాజనకంగా లేదని రియో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన చిత్తూరుకు చెందిన ఇ.రజనీ అన్నారు. హాకీ మాంత్రికుడు, ట్రిపుల్ ఒలింపియన్ మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రజనీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఉదయం 7గంటలకు ఐజీఎంసీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు జరిగిన ర్యాలీలో వందలాది మంది అథ్లెట్లు, స్కేటర్లు, హాకీ క్రీడాకారులు, కోచ్‌లతో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రజనీ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధి చెందాలంటే అకాడమీలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. తల్లిదండ్రులు, పెద్దలపై గౌరవం, క్రమశిక్షణ, ఆటలో రాణించాలనే తపన ఉంటే ఏ స్థాయికైనా దూసుకుపోవచ్చని తెలిపారు. చిన్న పల్లెటూరుకు చెందిన తాను ఒలింపిక్స్ స్థాయికి వెళ్తానని అనుకోలేదని చెప్పారు. ఒలింపిక్స్‌లో 36 ఏళ్ల తర్వాత పాల్గొన్న భారత మహిళా హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు తన తల్లిదండ్రులు, కోచ్‌లు, పీఈటీల ప్రోత్సాహమే కారణమన్నారు. రియో ఒలింపిక్స్‌లో ఓడిపోయినా... ప్రభుత్వం నగదు ప్రోత్సాహంతోపాటు గ్రూపు–2 పోస్టు ఆఫర్ చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో స్పోర్ట్స్ అకాడమీలు లేకపోవడంతో చాలామంది క్రీడాకారులు వెలుగులోకి రావడంలేదని ఆమె పేర్కొన్నారు.
రెండేళ్లుగా క్రీడాకారులు అడుక్కుతింటున్నారు : వినాయకప్రసాద్
రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం టీఏ, డీఏలు ఇవ్వకపోవడంతో టోర్నీలకు వెళ్లడానికి క్రీడాకారులు అడుక్కుంటున్నారని శాయ్ అథ్లెటిక్స్ కోచ్ వినాయకప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రీడాకారులకు ఇన్సెంటివ్‌లు, టీఏ, డీఏలు చెల్లించాలని కోరారు. అనంతరం రజనీని సన్మానించారు. శాప్ చైర్మన్ పీఆర్ మోహన్, శాప్ వోఎస్‌డీ పి.రామకృష్ణ, మాజీ డీఎస్‌డీవోలు బి.సుధాకర్, కాటంరాజు, రజనీ తల్లి తులసి, సోరదరుడు, స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి మురళి, శాప్ కోచ్‌లు పాల్గొన్నారు.