
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక అర్జున అవార్డు తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు తెలుగు తేజం సాయిప్రణీత్. గురువారం ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్నాడు. అనంతరం సాయి ప్రణీత్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదానం చేయడం ద్వారా క్రీడాకారులు మరింత స్ఫూర్తి పొందుతారని తెలిపారు. కేవలం బ్యాడ్మింటన్ మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో అన్ని క్రీడల్లోనూ భారత్ మెరుగైన ప్రతిభ చూపిస్తోందన్నారు. హైదరాబాద్ క్రీడాకారులు బ్యాడ్మింటన్‌లో పతకాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పతకం సాధించిన అనంతరం మరిన్ని చాంపియన్ షిప్‌లపై దృష్టి సారిస్తున్నానని ప్రణీత్ చెప్పారు. గతంలో అనేక మందికి సాధ్యం కానిది తాను సాధించాను కాబట్టి వారికంటే గొప్పగా భావించడం లేదని, రానున్న ఒలంపిక్స్‌లో పతకం నెగ్గడమే లక్ష్యంగా కృషిచేస్తున్నాని సాయి ప్రణీత్ పేర్కొన్నారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ రోజు (ఆగష్టు 29)న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ క్రీడా పురస్కారాలు అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్నఅవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ అవార్డులను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment