
దండేసి వదిలేద్దామా?
నేడు జాతీయ క్రీడా దినోత్సవం
జాతీయ క్రీడా దినోత్సవం... ఏ దేశంలో అయినా క్రీడాకారులకు ఇదో పెద్ద పండగ. కానీ మన దగ్గర మాత్రం ఆ పరిస్థితి లేదు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఆగస్టు 29న మన దగ్గర జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రతిసారీ ఇది తూతూమంత్రంగానే జరుగుతోంది. ఆ రోజు ధ్యాన్‌చంద్ విగ్రహానికి దండలు వేసి అధికారులు, క్రీడాకారులు కూడా చేతులు దులుపుకుంటున్నారు. కనీసం ఈ ఒక్కరోజైనా పట్టించుకుంటే భారత్‌లో క్రీడలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుంది.
పండగ హాకీకేనా?
భారత్‌లో క్రీడాదినోత్సవం అంటే కేవలం హాకీ క్రీడాకారులకు సంబంధించిన ఉత్సవంలా భావిస్తున్నారు. మిగిలిన క్రీడలకు సంబంధించిన వారెవరూ ఎలాంటి వేడుక లేదా కార్యక్రమం జరపడం లేదు. అయితే ప్రతి ఏటా రాష్ట్రపతి మాత్రం క్రీడా అవార్డులను అందజేస్తున్నారు. ధ్యాన్‌చంద్ (లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్), అర్జున, ద్రోణాచార్య అవార్డులను అందించే వేడుక ఈసారి కూడా జరుగుతుంది. కానీ ఈసారి ఖేల్త్న్ర అవార్డుకు మాత్రం ఎవరిని ఎంపిక చేయలేదు.
భారతరత్న దక్కేనా?
క్రీడా దినోత్సవం సందర్భంగా హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ను స్మరించుకుంటున్నాం. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఈ సారైనా ధ్యాన్‌చంద్‌కు దక్కుతుందా అని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారతరత్నను క్రీడలకు వర్తింప చేయడంతో గత ఏడాది క్రికెట్ దిగ్గజం సచిన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అప్పుడు ధ్యాన్‌చంద్‌ను పరిగణలోకి తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. - సాక్షి క్రీడావిభాగం