
ముంబైలో మరణించిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేయాలని కేంద్రాన్ని కోరుతూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర మంత్రివర్గం గురువారం తీర్మానాన్ని ఆమోదించింది. వ్యాపార, సేవా రంగాల్లో అతని సేవలు అనితరమైనవవి అని పేర్కొంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పద్మవిభూషణ్ రతన్ టాటాకు నివాళులు అర్పించారు. రతన్ టాటా మృతిపై సంతాప ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించింది.
కాగా పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా.. 86 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనకు ప్రపంచ దేశాల ప్రముఖుల నుంచి నివాళులు వెల్లువెత్తుతున్నాయి. రతన్ టాటా మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
రతన్ టాటా మృతికి గౌరవ సూచికంగా మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. నేడు జరగాల్సిన అన్ని వినోదాత్మక కార్యక్రమాలను రద్దు చేశారు.
ముంబైలోని ఎన్‌సిపిఎలో రతన్ టాటా భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. పార్టీలకు అతీతంగా నాయకులు ఆయనకు నివాళులు అర్పించడానికి తరలివస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వర్లీలో జరగబోయే ఆయన అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవ్వనున్నారు.